నాతో నేను: 1-1-2017
“పొద్దున్నే పెందరాళే లేచేసి, 500 అడుగులు వాకింగ్ చేసి, కాఫీ తయారుచేసి.. తాగేశా. అస్సలు కోపం తెచ్చుకోకూడదు ఇవేళ్టినుంచీ అని నిర్ణయం తీసుకుంటుండగానే.. ఇద్దరం కాసేపు వాదులాడుకున్నాం. మరేం చెయ్యాలి? అందుకేగా పెళ్లి చేసుకుంది.
మా రవి ఇంట్లోనే.. రాత్రి ఉండిపోయాం. వడలు తెప్పించుకుని తినాలని అనుకున్నానా (అక్కడ మాదాపూర్ లోభలే వేస్తారు వేడి వేడిగా..).. కుమార్ (వియ్యంకుడు) ఉప్మా చెయ్యమనిన్నీ, నిన్ననే వడలు తిన్నామనిన్నీ.. విజయ (వియ్యపురాలు) తో అంటున్నారు. సరే మరి.. నేను కూడా తలూపక తప్పలేదు.
ఆ విధంగా పొద్దున్నే నేననుకున్నవి రెండూ జరగలేదు. ఇంక నో న్యూ ఇయర్ వాగ్దానాలూ.”
అయ్యో.. అలా అయిందా? fb చూడకపోయావా? అన్నీ మర్చి పోవచ్చు..
“ఆ పనే చేశా. అచ్చంగా తెలుగు బృందంతో కాసేపు అల్లరి చేసి, తయారయి, భార్గవి పెట్టిన కొత్త చీర కట్టుకుని తయారయా. మధ్యాన్నం భోయనానికి బైయికెళ్దామంది కోడలు. కాసేపు.. పన్నెండు నుంచీ ఒంటిగంటన్నర వరకూ.. ఎక్కడికెళ్లాలో చర్చలూ, ఫోన్లూ నడిచాయి. ఇట్టాంటప్పుడు మేవేం మాట్టాడం. అంతా వాళ్లదే.. ఇంటి దగ్గరే grand trunk road (చెన్నై నుంచి కలకత్తా వరకూ ఉన్న రోడ్ కాదు.. ఒక రెస్టా రెంట్..) కి వెళ్లాం. అరగంట వెయిటింగంట.. అప్పటికే రెండవుతోంది. పొద్దున్న తిన్న ఉప్మా ఎప్పుడో అరిగి పోయింది. అక్కడ లోపల చూస్తుంటే, హరిణి (మన సుజల వాళ్లమ్మాయి) లాగ ఒకమ్మాయి కనిపించింది. పెద్ద టేబిల్ చుట్టూ ఉన్నారు తన బృందం. అటేపు రెండడుగులు వేశా.. పలకరిద్దామని. కానీ ఆ అమ్మాయి నన్ను చూసింది కానీ గుర్తుపట్టినట్లని పించలే. నేను దీర్ఘంగా చూసా కూడా.. ఈవిడకేం పిచ్చో అనుకునుంటుంది. మనుషుల్ని పోలిన మనుషులుమటారు మరి.
సరే.. అక్కడి నుంచి పంజాబీ రెస్టారెంట్ కి వెళ్లి.. కావలసినవి తిని ఇంటికొచ్చాం. అక్కడ లస్సీ చాలా బాగుంది.
కునుకు తీసి, ఐదున్నరకి బయల్దేరి ఇంటికొచ్చేశాం.
టివీ చూద్దామా అని బుద్ధి పుట్టింది. ఈ టివీలో.. పిల్లలు ఒళ్లంతా తిప్పుకుంటూ, కాబరే డాన్సు చేస్తుంటే పెద్దలు పగలబడి నవ్వుతున్నారు. ఒళ్లుమండి తిప్పేశా.. మా లో కబాలీ.. వామ్మో.. అదే సినిమానే తల్లీ. బుద్ధిగా దిబ్బరొట్టె వేసుకుని తిని లోపలి కొచ్చేశా. ఈయనగారింకా చూస్తున్నారు పాపం..
ఈ విధంగా కొత్త సంవత్సరం మొదలయింది.
0 వ్యాఖ్యలు:
Post a Comment