Friday, November 2, 2018

అజ్ఞాత కులశీలస్య-7,8,9, 10, 11, 12, 13, 14, 15, 16.

Posted by Mantha Bhanumathi on Friday, November 02, 2018 with 1 comment
    
"అజ్ఞాత కులశీలస్య"
7 వ భాగము


          కం.   నిలిచియు నుండెడి దేదీ
                  యిలను కనబడదు గనెపుడు, యేది మనదనే
                  తలపులు మనమున వలదని
                  పలికెదరు గురువులెపుడును బాగుగ విననున్.


  సాధారణంగా గురువులు చెప్పేది వినడానికి మాత్రమే అనుకుంటారు... 
ఆచరణ కొచ్చే సరికి మాయ కమ్మేస్తుంది.
  అందరు మత ప్రవక్తల బోధలూ అవే. తాత్కాలికమైన ఈ సుఖాల కోసం 
తాపత్రయాలెదుకు? కావలసినంత తిన గలగడం, నచ్చిన ఆహార్యం 
ధరించ గల్గడం, పెద్ద భవంతిలో నివాసం.. ఇవే సుఖాలనుకుంటే 
ఎంత బాగుండును! అవే సరిపోవు. ఇంకా ఇంకా.. ఏదో కావాలి.
  కొద్ది విచారంగా, మతాల సారాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, 
పంచలో కూర్చుని కూరగాయల తీగెలకి పందిరి కోసం, తాళ్లు 
పేనుతూ ఆలోచిస్తున్నాడు నందుడు.
  తాము ఇక్కడ, తల్లీ, తమ్ముడూ బాలేశ్వర్ లో, ఉండవలసిన 
పరిస్థితుల గురించి.. తన తాతగారు చెప్పిన విషయాలు, తను చూస్తున్న
సంఘటనలు తలుచుకుంటే విరక్తి కలుగుతుంది.. జీవితం మీద.
  పోరు.. పోరు.. పోరు.
  కళింగ సామ్రాజ్యం తూర్పు గాంగేయుల అధీనంలోకి వచ్చి నాలుగు 
శతాబ్దాలు గడుస్తోంది. కళింగపురం రాజధానిగా (ఇప్పటి శ్రీకాకుళం దగ్గరున్న 
శ్రీముఖలింగం) అనంతవర్మ చోడగంగుడు స్థాపించాడు. దక్షిణ భారత 
దేశం నుంచి వచ్చిన వారు కనుక అక్కడి సంస్కృతి, భాషలు కళింగంలో 
బాగా ప్రాచుర్యం పొందాయి.
  పండితులకి కనీసం నాలుగు భాషలు వచ్చి ఉండేవి. అష్టభాషా కోవిదులు 
అడుగడుగునా కానవచ్చే వారు.
  సామ్రాజ్యాన్ని స్థాపించిన అనంతవర్మ చోడగంగుడు, ఉత్తరాన 
గంగా నది నుంచీ దక్షిణాన గోదావరి వరకూ పాలించాడు. ఉత్కళ, 
కోసల కళింగ రాజ్యాలన్నీ కలిపి, త్రికళింగాధిపతిగా రాజ్యాన్నేలాడు. 
ఆహార ఆహార్య వ్యవహారాలన్నింటిలో సామీప్యము సామాన్యమే. 
వివాహాది శుభకార్యాలకీ రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి, సంపన్నుల 
గృహలలో.
  అనంతవర్మ రాజ్యాన్ని విస్తరించడం ఒక పక్క, కళింగలో ఆలయాల 
నిర్మాణం ఒక పక్క చేపట్టాడు. జగత్ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాధుని 
ఆలయం అతడి కాలం లోనే నిర్మించారు.
  తరువాతి రాజులు, ముసల్మానుల దండయాత్రలని ఎదిరించ లేక లొంగిపోయి, 
సామంతులైనా,ఒకటవ నరసింహ దేవుడు పుంజుకుని, దక్షిణ వంగ రాజధానిని 
చేజిక్కించుకుని అక్కడి సుల్తానుని ఓడించాడు.
  ఇతడి తండ్రి, మూడవ అనంగ భీమదేవుడు, తన కాలంలో రాజధానిని 
కటకం పట్టణానికి మార్చాడు. ఆ మార్పుకి, దక్షిణ వంగదేశం దగ్గరగా ఉండటం, 
కటకం నైసర్గికంగా రాజధానిగా ఉండటానికి, కోట నిర్మాణానికి అనుకూలమవడం 
కారణమై ఉండవచ్చు. వెనువెంటనే కోట నిర్మాణం కూడా మొదలు పెట్టారు. 
అదే.. ప్రపంచ ప్రసిద్ధమైన “బారాబతీ కోట.”
  ఒకటవ నరసింహ దేవుడే కొణార్క్ లో సూర్య దేవాలయాన్ని కట్టించాడు.   
  కానీ.. ఆ నరసింహదేవుడి తరువాత గాంగేయుల పతనం ఆరంభమయింది. 
ఉత్తరాన ఢిల్లీ సుల్తాను, ఆ తరువాత దక్షిణమున విజయనగర రాజులతో పోరులు 
జరుగుతూనే ఉండేవి.. వంగదేశంలోని అంతర్గత కలహాల వల్ల ప్రస్తుతానికి కటకం 
ప్రశాంతంగా ఉన్నట్లే ఉంది.
  మాధవుడు కటకం చేరిన సమయంలో నాల్గవ నరసింహదేవుడి కొడుకు 
భాను దేవుడు కళింగనేలుతున్నాడు.
  గాంగేయ రాజులందరిలోనూ అసమర్ధుడుగా పేరు తెచ్చుకున్నవాడు ఈ నాల్గవ 
భానుదేవుడు. తండ్రి పాలనలోనే అస్తవ్యస్తంగా తయారైన రాజ్య పరిస్థితి మరింత 
అధ్వాన్నంగా దిగజారింది. ఇతడు చంచల మనస్కుడిగా పేరు పొందాడు. 
అంతే కాదు.. ప్రజల చేత పిచ్చి రాజుగా పిలవ బడేవాడు.
  నందుడి తండ్రి, నాల్గవ నరసింహదేవుని వంటశాలలో ప్రధాన పాక 
నిపుణుడుగా ఉండే వాడు. అతడిని యుద్ధ భూమిలో వంటలు 
చేయించడానికి తీసుకెళ్లాడు రాజు. అది అతని చివరి యుద్ధం.. 
అదీ వంగ దేశంతో.
  ఆ సమయంలో పోరు మాని, సంధి చేసుకుని వచ్చే టప్పుడు.. 
కొందరు ప్రతిభ ఉన్న పని వారిని వదిలేయ వలసి వచ్చింది. అప్పుడే 
మహా పాత్రుడిని వంగ రాజుకి ఇచ్చేశాడు నరసింహ దేవుడు.
  పనివారు కూడా మనుషులే.. వారికీ భార్యా పిల్లలుంటారు, అనే మానవత్వం 
మృగ్యం రాజులకి.. అదీ, యుద్ధ నీతికొచ్చే సరికి. అశ్వాలనీ, గజాలనీ 
మార్చుకున్నట్లే మనుషుల్ని కూడా!
  బాలవ్వ కటకం నుండి, సరిహద్దు ప్రాంతమైన బాలేశ్వర్ చేరుకుని, 
అక్కడ పూటకూళ్ల ఇల్లు నడప సాగింది. ఎప్పటికైనా భర్త రాకపోతాడా అని. 
అది అత్యాశే అని తెలిసినా కూడా..
  నంద మహాపాత్రుడి వంశంలో భాష, వేదం మొదలైనవి మొదట్లో.. మూడు తరాల 
ముందు వరకూ ఉండేవి.. కానీ, కాలక్రమేణా, ఉదర పోషణార్ధం వంటవారి 
కింద మారక తప్పలేదు. కాలగమనంలో మార్పు సహజమే కదా!
  గాంగేయ రాజులు ఆలయ నిర్మాణాల మీద, రాజ్య విస్తరణ మీద పెట్టిన శ్రద్ధ 
సాహిత్యం మీద పెట్టినట్లు లేదు.  
  ఎంతటి వారికైననూ సమయమునకు పొట్ట నింపుకొన వలసినదే.. రాజ్యంలో 
ఎన్నెన్ని యుద్దాలైనా, ఎంత అల్ల కల్లోలం వచ్చినా కడుపు నింపే వారి 
జోలికి పోరు.
  “క్షుద్బాధ.. సృష్టి కర్త జీవుల కొసగిన వరమూ శాపమూ కూడా!” అనుకున్నాడు 
నందుడు.  
                                        ……………….


  “అదే విధముగా నాన్నగారూ?” మాధవుడు మరునాడు అడిగాడు నందుడిని.
  తమ వంశం గురించి చెప్తూ.. నందుడు ఆకలి ప్రాణికోటికి కొంత చెడూ, 
కొంత మంచీ కలిగించిందని చెప్పగానే.
                   
  “ఉ. ఆకలి గొన్నయా మెకము నల్పుల నేమరచిన్ వధించునే
        ఆకడ వేటగాడెపుడు నామెకమున్ కని చంపుగా నదే
        తేకువ యున్నవారి కడ తేర్చుకదా బలిమిన్ బుభుక్షకై
        పోకడ నేకదా సతము భూమము నుండెడి దీ కతమ్మునన్.”


                           


  జన్మతహా మాంసాహారి..  వేట ఒక క్రీడ ఆయిన రాజవంశంలో పుట్టిన 
మాధవుడు అర్ధం కానట్లు చూశాడు.
  “అవును మాధవా! ఆకలి లేకున్న ఒకరినొకరు చంపుకోవడం ఉండదు కదా 
ఈ భూమ్మీద.”
  “ఏమో నాన్నగారూ! అది కూడా ప్రాణుల సమ తుల్యానికి కావలసిందే 
అనే వారు మా గురువుగారు. అలా పెంచుకుంటూ పోతే, నిలబడ్డానికి కూడా చోటు 
సరిపోదేమో!” మాధవుడు సంకోచంగా అన్నాడు.
  పుత్రుని మాటల్లో కొంత నిజం కూడా కనిపించింది నందుడికి.
  “నిజమే.. కానీ ప్రాణం ఉన్న జీవిని చంపడం అమానుషం కాదా?”
  విరక్తిగా నవ్వాడు మాధవుడు.
  “ఆకలి వేస్తే కడుపు నింపుకుందుకు, ప్రాణాలు నిలుపుకోవడానికి చంపడం 
పాపం కాదు తండ్రీ. రాజ్యాల కోసం, మతం మార్చుకోమనీ, భోగాల కోసం చంపడం 
అమానుషం. ఏ జంతువైనా కడుపు నిండితే ఇంకొక జంతువు జోలికి వెళ్లదు. కానీ.. 
మనిషి? అన్నీ ఉండి కూడా మారణహోమం చేస్తాడు. ఎందుకు?” మాధవుని 
ప్రశ్నకు తక్షణం జవాబివ్వలేకపోయాడు నందుడు. కొంచెం ఆలోచించి చెప్పాడు.
  “పాలకుడనే వాడు ఏ ప్రాంతానికైనా అవసరమే. ఒక క్రమశిక్షణలో జీవనం 
నడపాలంటే అతడికి అధికారం.. తప్పుచేస్తే దండన ఉంటుందన్న భయం 
ప్రజలకి ఉండాలి. లేదంటే ఆటవిక న్యాయం అయిపోతుంది. అది మానవులకి 
క్షేమం కాదు. కానీ.. సుభిక్షంగా ఉన్న దేశాలని ఆక్రమించుకోవడం, యుద్దాలు.. 
వేల ప్రాణాలు తియ్యడం.. అదంతా అన్యాయమే. మనం అంత పెద్ద విషయాలు 
చర్చించడం అనవసరమేమో..” నవ్వుతూ వాతావరణం తేలిక చేశాడు 
నందుడు.
  “మరి.. భగవంతుడు ఆకలి వల్ల మంచి కూడా చేశాడన్నారు కదా? 
అదే విధంగా?” 
మాధవుడు అడిగాడు.
  “ఏ జీవికైనా జీవించడానికి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం.. ప్రప్రధమంగా 
ఆకలి. అది తీర్చుకోవడానికి ఏం దొరుకుతుందా అని వెతుకులాట మొదలు పెట్టడం, 
ఆ తరువాత అది పంచుకోవడానికి ఎవరైనా దొరుకుతారా అని చూడ్డం.. సమూహం 
ఏర్పడడానికి దోహదం అయింది. అదే.. ఆకలి లేదనుకో! ఏం పనుంటుంది? 
ఏమీ తినకుండా 
జీవులు పెరిగి పెద్దయి సమయం వచ్చినప్పుడు రాలిపోయి.. యాంత్రికం అయిపోదా?”
  మాధవుడు నిజమే అన్నట్లు తలూపాడు.
  “అదే విధంగా.. కాల్చో, ఉడికించో తినడం.. రకరకాల రుచులు, వానికోసం ఇంకా 
శ్రమించడం. ధ్యేయం వరకూ బాగనే ఉంది .. అలాగే సమూహాలు ఏర్పడ్డం, 
ఒకరి కోసం 
ఇంకొకరు తాపత్రయపడ్డం, బంధాలు, అనుబంధాలు.. అక్కడితో ఆగిపోతే 
బాగుండేది. 
ఆడంబరమైన ఆహార్యం, అలంకరణ.. సుఖాలు, అత్యాశ.. ఇవన్నీ జీవనాన్ని 
ప్రభావితం చేస్తున్నాయి. మీ తాతగారు ఆ విధంగానే మాకు దూరమైపోయారు.”
  కుతూహలంగా చూస్తున్న మాధవునికి తన తండ్రిగారి గురించి చెప్పాడు నందుడు.
  “ఒక విధంగా మనం వంటల వాళ్లుగా ఉండడం వల్లే ప్రాణాలు నిలుపుకో గలుగు
తున్నాము. 
నువ్వు మాత్రం వేరే విద్యలు కూడా నేర్చుకోవాలని నా అభిలాష. 
మీ పూర్వీకుల వృత్తి ఏమిటో నాకు తెలియదు.. నీకు బలవంతంగా ఏ విద్యనీ 
అభ్యసింప చెయ్యటం నా అభిలాష కాదు. నీకు ఎందులో అభిరుచి ఉందో చెప్పు.”
  “నాకు పాక శాస్త్రం మీద కూడా ఆసక్తి ఉంది నాన్నగారూ. మా జనకులు కోటలో 
సలహాదారుగా ఉండేవారు. రాజుగారికి ఆప్తులు. నాకు రాజకుమారులతో కత్తియుద్దం, 
గుర్రపు స్వారీ, ధనుర్విద్య ఆ విధంగానే పట్టుబడ్డాయి. వాటిమీద ఆసక్తి కూడా మెండు. 
అది కాక.. భాష కూడా. ఆంధ్ర, వంగ, సంస్కృతాలు చిన్న చిన్న గ్రంధాలు చదవడం 
వరకూ వచ్చింది.”
  బాలుని బహుముఖ ప్రజ్ఞాపాటవాలకి ఒకరకంగా ఆనందం, మరొక విధంగా 
విచారం 
కలిగాయి నందుడికి.
  ఇటువంటి పుత్రుడు తమకి లభించినందుకు ఆనందం.. ప్రజ్ఞాశీలుడే కాదు, 
మాధవుడు వినయ సంపన్నుడు కూడా.
  అతడి కత్తి, గుర్రపు స్వారీల ప్రతిభ చూస్తే కోటలోని వారు ఊరుకుంటారా? 
నిస్సందేహంగా 
ఊరుకోరు.
  తప్పని సరిగా సైన్యంలోకి తీసుకుంటారు. పుత్రోత్సాహం మూడునాళ్ల ముచ్చటే 
అవుతుందా? గురువుల వద్దకు పంపి విద్యలు నేర్పించడం ఎంత వరకూ సబబు? 
మాధవుని తల్లి ఏం కోరుకుంది?
  ఆలోచనలో పడ్డాడు నందుడు.
  తండ్రి తటపటాయించడం చూసి అన్నాడు మాధవుడు..
 
“ఆ. వె.  బుడుతడి నను నీకు పుయిలోటము వలదు
           వడివడిగ పరుగిడి వాటముగను
           డంబరమున నేను డంకతనముతోను
           సాయ పడెద తండ్రి శౌర్యమునను.”


  ఆనందంతో దగ్గరకు తీసుకుని మనసారా హత్తుకున్నాడు, స్వయందత్తుడైన  
పుత్రుడిని నందుడు.
  ఏది ఏవిధంగా జరగాలో.. ఎవరి చేత నుంది? విధి వ్రాత ననుసరించే కదా సాగేది 
జీవన యానం.

                                        ……………..
8వ భాగం.


  మాధవుడు విద్యలన్నింటిలోనూ బాగా రాణిస్తున్నాడు.
  ఒక రోజు అడవిలోకి వెళ్లి, ఒళ్లంతా రక్త సిక్తమై వచ్చాడు. అప్పటికే అతడు వెళ్లి 
చాలా సేపు అవడం వల్ల, ఇంటిలోని వారందరూ ఆందోళనగా ఉన్నారు.
  మాధవుడిని చూసి సీతమ్మ వాకిలి నుండే గట్టిగా అరిచింది. గౌతమి, నందులు 
పరుగెత్తుకుని వచ్చారు.
  “అయ్యో! ఏమయింది కన్నయ్యా? అడవిలోకి వెళ్లద్దంటే వినవు కదా.” గాభరాగా 
అంటూ బట్టలు విప్పి, ఒడలంతా పరీక్ష చేశాడు నందుడు. కాళ్లూ చేతులూ 
వణుకుతుండగా స్తంభాన్ని ఆనుకుని కూల బడింది గౌతమి.
  సీతమ్మ లోనికి పరుగెత్తి, వేడి నీళ్లు కాచ సాగింది.
  “ఫరవాలేదమ్మా! పైపైనే గీరుకు పోయింది. గాయాలు లోతుగా లేవు. నాలుగైదు 
దినాల్లో తగ్గిపోతుంది.”
  “ఈ విధంగా రక్తాలు కారుతూ ఎలా వచ్చావు కన్నయ్యా?”
  “కళ్యాణి తీసుకొచ్చిందమ్మా. నా పక్కనే నడుస్తూ.. జాగ్రత్తగా! గుర్రం మీదికి 
ఎక్కలేదు.” మాధవుని మాట స్పష్టంగానే ఉంది. మెడ పై భాగానికి దెబ్బలేం లేవు. 
అది కాస్త నయమే అనుకున్నాడు నందుడు.
  సీతమ్మ తెచ్చి వేడి నీటిలో బట్ట ముంచి, కొద్దిగా చల్లారాక ఒడలు తుడవడం 
మొదలు పెట్టింది. అప్పటికి గౌతమి కూడా తేరుకుని ఇంకొక బట్ట తీసుకుంది.
  మాధవుని మాట నిజమే.. పైపైనే ఉన్నాయి గాయాలు.
  వాటిని తుడుస్తుంటే కిక్కురు మనలేదు మాధవుడు. గౌతమి, నందుడు ఒకరి 
వంక ఒకరు చూసుకున్నారు… కర్ణుడి కథ జ్ఞప్తికి వచ్చి. ఇతడు బ్రాహ్మణ 
బాలుడేనా?
  కానీ, వెంటనే వారి సందేహం నివృత్తి అయింది. సీతమ్మ పసుపు తెచ్చి 
అద్దుతున్నప్పుడు దిక్కులు పిక్కటిల్లేట్లు అరిచాడు మాధవుడు.
  సగం.. నిజంగానే మండటం వల్ల. సగం, గౌతమీ, నందుల ముఖ కవళికలు 
గమనించడం వల్ల. బాలునికి తెలిసి పోయింది.. బాధను తట్టుకునే శక్తి 
బ్రాహ్మణులకి తక్కువుంటుందని.
  పరిచర్య పూర్తయి, పల్చని అంగవస్త్రం వక్షం మీద ఆచ్ఛాదనగా వేశాక 
వినిపించాయి..
  వెనుక వాకిలి నుంచి గుర్రం సకిలింపు, దాంతో పాటుగా.. మే.. మే అనే కేకలు.
  “అయ్యో కళ్యాణి మాట మరచాం. దానికేం దెబ్బలు తగల్లేదు కదా!” 
ఆందోళనగా అన్నాడు నందుడు.
  “లేదు.. లేదు. అశ్వం బాగానే ఉంది. నేనే ఎగిరి ముళ్ల కంప లో పడ్డాను. 
ఆకలికి అరుస్తోంది.” లేవబోయాడు మాధవుడు.
  “లేవకు. నేను వెళ్లి గుగ్గిళ్లు వేసొస్తా.” సీతమ్మ లేచింది.
  “ఫరవాలేదు. అమ్మమ్మా! మీకు తెలియదు. నే వెళ్లి చూస్తా. ఈ గాయాలు గాలికి 
ఆరితే తగ్గిపోతాయి త్వరగా.”
  మాధవుడు సునాయాసంగా లేచి పెరటి వాకిలి దాటి బైటికి వెళ్లాడు.
  గుర్రం మాధవుడిని చూసి నిలువుగా తలూపింది. తన యజమాని ఎలా ఉన్నాడో 
అని ఆ ప్రాణికి ఆదుర్దా కలిగినట్లుంది.
  వెనుకగా వచ్చిన నందునికి కన్నుల నీరు తిరిగింది. ఈ మూగజీవుల కున్న 
విశ్వాసం మానవులకుంటే ఎంత బాగుండునో అనుకున్నాడు.
  మాధవుడు తన అశ్వం దగ్గరగా వెళ్లి, వీపు మెడ నిమురుతూ ఆహారం 
తినిపించాడు. అంతలో ఒక పక్క నుంచి మే..మే.. అంటూ అరుపులు 
వినిపించాయి. నందునితో పాటుగా వచ్చిన గౌతమి మొదటగా గమనించింది..
  ప్రాకారం పక్కగా.. కిందకి వంగి ఉన్న జామ ఆకులు నముల్తూ ఉన్న రెండు 
మేక పిల్లలు. ఒకటి తెల్ల మేక. మూతి నల్లగా.. ఒంటి మీద అక్కడక్కడ చిన్న 
నల్లని మచ్చలు. ఇంకొకటి నల్ల మేక. అక్కడక్కడ చిన్నగా తెల్లని మచ్చలు.
  గౌతమి మేకల వంక చూస్తుండడం గమనించి మాధవుడు కళ్యాణి వెనక్కి వెళ్లి 
దాక్కున్నాడు.. దొంగ చూపులు చూస్తూ. వెన్న దొంగిలించి గోడ వెనుక 
దాక్కున్న కృష్ణుడిలాగా అనిపించాడు సీతమ్మకి.
  “ఇవేమిటయ్యా?” అడగనే అడిగింది గౌతమి.
  “కోట పక్కన ముళ్ల పొదల దగ్గర దిక్కులేకుండా తిరుగుతున్నాయమ్మా. 
అక్కడి నుంచి వాటిని తప్పించ బోయే, పొదల్లోకి పడిపోయాను. అప్పుడే ముళ్లు 
గీరుకు పోయాయి. వాటిని పట్టుకుని నడిచి వచ్చాను. అందుకే ఆలస్యమయింది.”
  ఎలాగా తెలిసి పోయింది కదా.. మాధవుడు మేకల దగ్గరికి వెళ్లి వాటిని 
సవరించ సాగాడు. గుర్రంకూడా ఆనందంగా తలూపుతోంది.
  “బాగుంది నీ పరివారం. ఇప్పుడు ఆ మేకల యజమానులొస్తే.. మన మీద 
దొంగతనం నేరం మోపరా?” నందుడు అడిగాడు.
  “లేదనుకుంటా నాన్నగారూ.. వీటిని చూడలేక వదిలి పెట్టినట్లున్నారు. 
అక్కడక్కడా మేస్తూ అనాధల్లా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తే అప్పుడే 
ఇచ్చేద్దాం. మన దగ్గర పెట్టుకుందామా? వాటికి ఖర్చు ఏమంత అవదు. 
నేను వెళ్లి మేపుకొస్తాను.” గోముగా అడిగాడు.
  “వాటివల్ల మనకి ఏం ఉపయోగం?” సీతమ్మ సందేహం..
  “ఉపయోగం అంటే.. ఏం లేదు. ఆ.. మేక పాలు చాలా శ్రేష్టం. అమ్మమ్మా! 
మీ కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇంక సంవత్సరం లోగా ఆ మేకకి 
పాపాయి పుడుతుంది.” 
మేకల గురించి తెలిసిన వాడిలాగ చెప్పాడు మాధవుడు.
  “ఛా.. మేక పాలా?” సీతమ్మ మొహం చిట్లించింది.
  “మేకపాలకీ, ఆవు పాలకీ తేడా ఏముందమ్మమ్మా? రెండూ తినేవి ఆకులే కదా.. 
రెంటికీ ఒక దగ్గర్నుంచే కదా పాలు వచ్చేది..”
  “ఉండు.. నీ పని చెప్తాను. అంతా అపసవ్యం మాటలూ నువ్వూనూ..” సీతమ్మ 
ఒక కర్ర పట్టుకునొచ్చింది.
  మాధవుడు ఆవిడకి దొరక్కుండా అటూ ఇటూ పరుగెత్త సాగాడు.
  నంద, గౌతమిలు నవ్వుతూ చూస్తున్నారు.
  అంతలో తెల్ల మేక వచ్చి, మూతి పైకెత్తి గౌతమి చేతికి రాయడం మొదలు 
పెట్టింది. కిందికి వంగి చూస్తే దాని కాలి నుంచి రక్తం కారుతోంది. 
మొహం మీద, తోక 
దగ్గర.. అన్నీ గాయాలే. కళ్లు పెద్దవి చేసి చూసిన గౌతమికి నల్ల మేక పరిస్థితి 
అంత కంటే ఘోరంగా కనిపించింది. దానికైతే, ఒళ్లంతా రక్తం మరకలే.
  “ఇదేమిటి మాధవా?” వణుకుతున్న కంఠంతో అడిగింది.
  “అదే తెలీదమ్మా. ఏదైనా పెద్ద జంతువు తరుముతూ వస్తే పొదల్లో 
పడిపోయాయేమో.. వాటి యజమాని వెదకి వేసారి వెళ్లి పోయుండవచ్చు. 
అక్కడే ఏటి గట్టున శుభ్రం చేద్దామనుకున్నా కానీ, మీరు ఆందోళన 
పడుతుంటారని తీసుకొచ్చేశాను. నా శరీరం మీదున్న సగం రక్తం వాటిదే. 
ఇప్పుడు శుభ్రం చేద్దామా? అమ్మమ్మని అడిగి ఔషధంకూడా రాద్దాం.” 
మాధవుడు ఆదుర్దాగా చూస్తూ 
అడిగాడు.
  “వీటిని మన దగ్గర ఉంచుకుందామా లేదా అనేది తరువాతి సంగతి.. ముందుగా, 
వాటి దెబ్బల సంగతి చూద్దాం. వదిలేస్తే అదొక పాపం చుట్టుకుంటుంది.” నందుడు 
మేకలని బావి వద్దకి తీసుకెళ్లాడు.
  నందుడు గాయాలని కడుగుతుంటే సన్నగా మూలుగుతున్నాయి మేక పిల్లలు.
  మధ్య మధ్యలో కళ్యాణి సకిలిస్తోంది.
  సీతమ్మ, ఇంటి వెనుక నున్న తోటలోకి వెళ్లి ఏవో ఆకులు తెచ్చి నూరి 
ముద్ద చేసింది.
  సీతమ్మకి మూలికల వైద్యం తెలుసు. ఆవిడ తండ్రి తాతలు వైద్యులు. కొన్ని 
అత్యవసర మైన చిట్కాలు నేర్పించారు. ప్రాధమిక చికిత్స చెయ్య గలుగుతుంది.
  “మాధవుడి గాయాలు పైపైనే ఉన్నాయి. అందుకే పసుపు రాస్తే సరి పోతుంది. 
కానీ, ఈ మేక పిల్లల దెబ్బలు, బాగా లోతుగా ఉన్నాయి. మూలికల చూర్ణం 
పట్టీ వేస్తే కానీ తగ్గవు.” అలా అంటూనే గట్టిగా పేనిన చాంతాడు చివర అంటించి, 
నిప్పు చేసి తీసుకొచ్చింది సీతమ్మ.
  “అదెందుకమ్మమ్మా?” భయం భయంగా అడిగాడు మాధవుడు.
  గాయాల్ని శుభ్రం చేసిన నందుడికి అర్ధమయింది. గౌతమి, కళ్యాణి దగ్గరగా 
వెళ్లి మెడ కింద, గంగడోలు నిమర సాగింది.
  “వీటి వయసెంతుంటుందో?” నిప్పు ఎర్రగా మండేలాగ ఊదుతూ అడిగింది 
సీతమ్మ.
  “నాలుగైదు నెలలు ఉండచ్చు. చిన్న పాపాయిలు.. పాపం. ఎక్కడ్నుంచి 
వచ్చాయో!” నిప్పు చివరని ఎర్రగా అయేలా ఊదుతున్న సీతమ్మని కళ్లు పెద్దవి 
చేసి చూస్తూ అన్నాడు మాధవుడు.
  “నందా! తయారేనా? ఒక్కొక్క చోట్లో జాగ్రత్తగా పట్టుకో. ఇంకొక చెయ్యి 
జీవి కదలకుండా..” సీతమ్మ నిప్పుని మేక దగ్గరగా తీసుకు రాబోయింది.
  కెవ్వున కేక పెట్టాడు మాధవుడు.
  “ఏం చేస్తున్నారు అమ్మమ్మా?”
  అప్పుడనిపించింది పెద్ద వాళ్లకి, పిల్లవాడికి అంతా చెప్పి చేస్తుంటేనే నయం 
అని. నందుడు దగ్గరగా రమ్మని పిలిచాడు.
  మేక పిల్ల కాళ్లని చూపించాడు. నాలుగు కాళ్లకీ, వేళ్ల పైనా కిందా.. తొడల దగ్గర 
చిన్న చిన్న జలగలు అతుక్కుని ఉన్నాయి.
  “వీటిని చూశావా? జలగలు. శరీరానికి అతుక్కుని వదలవు. రక్తం అంతా 
పీల్చేస్తాయి. ఇవి పట్టాయంటే, ఏ జంతువైనా, మనుషులైనా నిర్వీర్యం 
అయిపోవలసిందే. చూడకుండా వదిలేస్తే ప్రాణాలు కూడా పోతాయి.”
  “నిజమే.. కానీ కాలుస్తే మేక కూడా కాలుతుంది కదా? అంతకంటే గోటితో 
గిల్లేస్తే పోదా?” భయంగా అడిగాడు బాలుడు.
  “అది ఇంకా బాధ. కాళ్లు సన్నంగా ఉంటాయి కదా. పట్టు ఉండదు. జాగ్రత్తగా 
కాలుస్తారు సీతమ్మగారు. మరి నైపుణ్యం అంటే అదే. ఏటికి మంచి నీటికి 
వెళ్లినప్పుడు అమ్మనీ, అమ్మమ్మనీ కూడా పడ్తుంటాయి. నిప్పు తగలగానే 
పట్టు వదిలేస్తాయి. ఆ తరువాత కడిగేసి పసుపు అద్దేస్తే తగ్గి పోతుంది. 
మనం తినంకానీ, ఉల్లిపాయ నూరి పట్టీ వేస్తే కూడా తగ్గుతుంది. కోమటి 
కొట్టుకెళ్లి తీసు కొద్దాం. ముందు ఈ జలగలన్నీ 
రాలి పోనీ.” నందుడు మేక కాలు పట్టుకున్నాడు.
  విచిత్రంగా మేక కదలకుండా పడుక్కుంది.
  జంతువులకి కొన్ని లక్షణాలు అమర్చాడు ఆ దేవుడు. ఎవరైనా తమకు 
మేలు చేస్తున్నారని నమ్మాయంటే చాలు పూర్తిగా తమ భారాన్ని వారి మీదికి వ
దిలేస్తాయి. అందులో మేత కోసం ఏటి ఒడ్డున తిరిగే ఏ ప్రాణినైనా జలగలు 
పట్టకుండా వదలవు. 
వాటి ఆహారం రక్తం మరి. పైగా.. మేకలు రెంటికీ అంతకు ముందు అలవాటు 
ఉన్నట్లే 
ఉంది జలగల్ని పీకించుకోవడం.
                                     ……………….


                       


  మాధవుని ఆనందానికి హద్దుల్లేవు. మేకలు రెండూ సీతమ్మ వైద్యం పని చేసి, 
ఆరోగ్యంగా తయారయ్యాయి. శ్వేత, శార్వరి అని పేర్లు పెట్టాడు మాధవుడు వాటికి. 
చెంగు చెంగున గెంతుతూ తోటంతా తిరుగుతుంటాయి.. అంది నంత మేర 
ఆకుల్ని నములుతూ.
  సమయం దొరికినప్పుడు బుజ్జి మేకలతో ఆడుకుంటుంటాడు. కళ్యాణి కూడా తల 
పైకీ కిందికీ ఊపుతూ హర్షాన్ని తెలుపుతుంటుంది.
  అదే సమయంలో.. నందుడు ఒక ఆవుని, దూడని కూడా తీసుకొచ్చాడు. మూగ 
జీవుల పనులన్నీ మాధవుడు సంతోషంగా చేస్తున్నాడు, అమ్మమ్మ సహాయంతో.
  ‘కళింగం’ పూటకూళ్ల గృహం వెనుక భాగం అంతా రాజుగారి కోట కిందికి వస్తుంది. 
అటుపక్క సరిహద్దు గోడలుకానీ, కంచెలు కానీ ఏమీ లేవు. ఒక క్రోసు దాటాక కందకం 
వస్తుంది. అప్పటి వరకూ ఎవరూ అటు ప్రక్కకే రాలేదు. అసలు ఆ స్థలం అంతా 
భానుదేవుని తండ్రి, మహాపాత్రుడికి అరణంగా ఇచ్చిందే.
  ఎవరైనా వచ్చి అడిగినప్పుడు చూసుకోవచ్చులే అనుకుని, కొంత మేర పశువులకి 
కంచె వేసి, గ్రాసం పెంచడం మొదలు పెట్టాడు నందుడు.
  అక్కడే పశువుల కొట్టం కూడా దించాడు.


సీ.     తెలతెల వారగ తెల్లావు తువ్వాయి
            ఇటునటు తిరుగుతూ ఎగురగాను
       దానికి దీటుగా తైయని గెంతేటి
            మచ్చల మేకల మైమరపులు
       నేనేమి తక్కువ నే యశ్వమది గోను
             తలతిప్పి కాలెత్తి తకిట యనగ
        గోమాత నెమరేస్తు కొండాటముం జెంద
             సూరీడు వేవేగ చొచ్చి వచ్చు


       వింత కాంతు లన్ని వెలుగొందె వెనుకింట
       చేరిచేరి యన్ని చెంత నిలువ
       మున్ను కనని కళలు మురిపాన పొడచూపె
       నందునింటి లోన నాణ్యముగను.


  సూర్యోదయానికి ముందే లేచి, అంతా శుభ్రం చేసి, కుడితి తయారుచేసి, గ్రాసం 
వేసి.. అప్పుడు తన పనులు చేసుకుంటాడు మాధవుడు. అప్పుడే సీతమ్మ, 
గౌతమి లేచి, వాకిలి ఊడవడం, కళ్లాపు జల్లి ముగ్గులు వేయడం చేస్తారు.
  అంతలో నందుడు లేచి, మాధవుడిని తీసుకుని ఏటి వద్దకు వెళ్లి, స్నానం, 
సంధ్యావందనం కార్యక్రమాలు ముగించుకుని, కావడి మీద మంచినీళ్లు తీసుకొస్తారు. 
ఆ పిదప, మడికట్టుకుని, పూజ ముగించుకున్న గౌతమి పొయ్యి అంటించి పాలు 
కాచి అందరికీ క్షీరం అందిస్తుంది.
  సీతమ్మ కూడా స్నానాదులు ముగించుకుని, శాకాలు తరగడం మొదలు 
పెడుతుంది.
సాధారణంగా రోజుకు పదిమందికి తక్కువ కాకుండా వస్తుంటారు బాటసారులు. 
కొందరు ముందురోజే వచ్చి, రాత్రి వసారాలో విశ్రమిస్తారు.
  మాధవుడు వచ్చినప్పటి నుంచీ రద్దీ బాగా పెరిగింది. ముఖ్యంగా సైనికుల 
తాకిడి ఎక్కువయింది, మామూలుగా కంటే బాగా..

                                   …………………..


9వ భాగం.
                                               3
                                     కోట
  
        సీ. నిట్ట నిలువుగనే నిల్చిన కోటంత
                      పట్టి నడచునట్టి భయము భీతి
               ఏదొ యేదొ వెదక నేమియు కనరాదు
                      కలతయె నన్నిట కలిగి యుండ
               ఎంత నసహజత్వ మెందెందుఁజూసినా
                       కాకమీ దున్నదా కాల్చు నెండ
               కదలక మెదలక గాలియు స్థంభించ
                        క్రమశిక్షణన్ కూడె ఖగమనములు


    ఆ.వె.   అటునిటు నడయాడు నాయుధము ధరించి
               యోధు లంత కూడి యూసులాడ
               పెద్దలు సమ కూడి పేర్మిని యోచింప
               పట్టణమును గట్టి పర్చగాను.


                         
  
  మాధవుడు కళింగం వచ్చి సంవత్సరం అవుతోంది. అక్కడి పరిసరాలకి 
బాగా అలవాటు పడిపోయాడు.
  ఆ రోజు. ఉదయపు కార్యాలను ముగించుకుని, కళ్యాణిని తీసుకుని కోట వంకే 
చూస్తూ బయలు దేరాడు. రోజూ ఆరాధనగా చూసే కోటే.. ఏదో మార్పు..
  కోట బైట సైనికులు అక్కడా అక్కడా పొదల మాటున మాటు వేస్తూ 
అప్రమత్తంగా, ఆందోళనగా కాపలా కాస్తున్నారు.
  చుట్టూ స్వారీ చేస్తున్న మాధవుని కంట పడింది .. కోట వెనుకగా, పెద్ద 
పెద్ద చెట్లు, గుబుర్ల వెనుక కొత్తగా ఏర్పడిన ద్వారం. పరీక్షగా చూస్తే కానీ 
తెలియట్లేదు. ఆ ద్వారం సన్నని బాట చివర ఉంది. ఆ బాట ఊరి బయటికి 
దక్షిణం వేపుగా సాగి పోతుంది. అది పట్టుకుంటే శ్రీముఖలింగం, రాజమహేంద్రం 
చేరుతామని తండ్రిగారు చెప్పారు.
  అప్పుడప్పుడు సైనికులు తిరగడం, స్వారీలు చెయ్యడం, జరుగుతున్నదే 
అయినా ఆ రోజు ప్రత్యేకంగా అనిపించింది.
  అఘ మేఘాలమీద.. కళ్యాణిని కళ్లెంతో వేగిర పరచి ఇంటికొచ్చేశాడు.
  ఇంటి బయట సైనికులు గుంపులుగా మాట్లాడుకోవడం చూసి, ఇంటి వెనుకకి 
వెళ్లి గుర్రాన్ని కట్టేసి.. చుట్టూ తిరిగి వాకిలి ముందుకి వచ్చాడు.
  నెమ్మదిగా నడుస్తూ లోనికి వెళుతుండగా అతడి చెవిని పడ్డాయి 
సంభాషణలు, వంగ భాషలో. ఏమీ ఎరగనట్లు, అతి నెమ్మదిగా ఆగి 
ఆగి కదులుతున్నాడు మాధవుడు.
  వారు చర్చిస్తున్న సమస్య తీవ్రమయింది..
  ఒక పక్కగా ఒదిగి ఒదిగి నడుస్తున్న మాధవుడిని చూసి తలెగరేశాడొక 
సైనికుడు, ఎవరన్నట్లు.
  “ఈ పూటకూటింటి వాని కొడుకు.” ఇంకొకడు సమాధానం ఇచ్చాడు.
  “హేయ్.. చేపలు పులుసు చేయిస్తావా? నాలుక పీకేస్తోంది?” వంగ భాషలో 
అడిగాడు మరొక సైనికుడు.
  అందరినీ కలియ చూశాడు మాధవుడు. మొత్తం పాతిక మంది పైగా ఉన్నారు. 
అంత మందికి వండడం అలవాటే. కానీ చేపలంటే.. అయోమయంగా, 
అమాయకంగా చూశాడు. అది శాఖాహార పూటకూళ్ల ఇల్లు. వారికి తెలిసే 
అడుగుతున్నారు.
  కత్తి చూపించి, చేసి తీర వలసిందే అంటే?
  అమ్మకి ఎంత కష్టం?
  వీరి ఆగ్రహానికి గురి అవకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు మాధవుడు.
  “వీడికి భాష రాదనుకుంటా. ఐనా ఏదో కడుపు నింపుకోవాలి కానీ.. 
రుచులంటే ఎక్కడ?” సైన్యాధికారి లాంటి వాడు మందలించాడు.
  “సర్సరే.. లోనికి పరుగెత్తి త్వరిత గతిని ఆ శాకాలేవో తయారయే విధం చూడు.” 
కసిరాడు మరొకడు.
  “సైనికులు కఠినంగా మాట్లాడినా ఏమనుకోకూడదు మనం. మనం 
మనడానికి ఆధారం ఈ గృహం. వచ్చిన వారికి ఆకలి తీర్చడం మన 
బాధ్యత. పైగా ఆ సైనికులు, భార్యా పిల్లలని, తల్లిదండ్రులనీ వదిలి 
మాసాల తరబడి, ఎండనక, వాననక, తినీ తినక తిరుగుతుంటారు. నీడ పట్టున 
ఉన్న మన వంటివారికీ, వారికీ మనో భావాల్లో చాలా భేదం ఉంటుంది.” 
మాధవుడు వచ్చిన కొత్తలో నందుడు చెప్పిన మాటలు చెవిలో 
ప్రతిధ్వనిస్తుండగా లోపలికి నడిచాడు మాధవుడు.
  అంతా యుద్ధ వాతావరణం.
  ప్రతీ యుద్ధంలోనూ వందల మంది ప్రాణాలు కోల్పోతారు. గెలిచినది పరాయి 
రాజులైతే, ఊరి మీద పడి బీభత్సం చేస్తారు. దోపిడీలు, అత్యాచారాలు 
లెక్కే ఉండదు. కొందరి కళ్లల్లో భీతి, మరి కొందరి కళ్లల్లో క్రౌర్యం.
  ఎవరికీ నచ్చని ఈ యుద్ధాలు ఎందుకు?
  పాలకుల రాజ్య కాంక్ష తీర్చడానికే..
  మాధవుని వంటి చిన్న పిల్లలకి కూడా మనసంతా విరక్తి భావం 
ఏర్పడుతుంది.
  ఇంటిలో కూడా ఎక్కడ చూసినా సైనికులే.. సరిపోయేటన్ని సంభారాలు ఉ
న్నాయో లేదో! మాధవుడు లోనికి పరుగెత్తాడు. తన కళ్యాణి ఎలా ఉందో!
  సైనికులు గుర్రాల మీద పడ్తారు. మేకలు కూడా.. ఏముంది? రెండు ముక్కలు 
చేస్తే ఒక పూట ఆహారం.
  అదృష్టం.. అంతకు ముందే, వెనుక ఆవరణ లేనట్లుగా గోడ మూసేశాడు 
నందుడు.. గడ్డి మేటు అడ్డంగా వేసి. ఆవు, దూడ మాత్రం గడ్డి మేస్తూ 
కనిపించాయి. మిగిలిన జీవులు గోడ వెనుక.. వాటికి కూడా తెలిసిపోయింది, వాతావరణంలో మార్పు. నిశ్శబ్దంగా ఉండిపోయాయి.
  
                                        …………………
  పాతికమంది పైగా ఉన్నారు  సైనికులు.
  వెనుక, పెరట్లో తవ్విన గాడి పొయ్యి వెలిగించింది సీతమ్మ. పెద్ద గంగాళం 
నిండా నీళ్లు పోసింది, మరిగించడానికి.
  అర బస్తా బియ్యం కడిగి ఆరపోశాడు నందుడు. దానికి సరిపోయే కూరలు 
తరుగుతోంది గౌతమి. అప్పటికే శేరు పైగా పప్పు నాన పోసింది సీతమ్మ. 
బాగా కారంగా పచ్చడి కూడా చెయ్యాలి.. ఏం చేద్దామా అని ఆలోచిస్తోంది..
  “మిరపకాయ పచ్చడి చేస్తున్నావా అమ్మమ్మా? బావుంటుంది..”  అప్పుడే 
అక్కడి కొచ్చిన మాధవుడు అన్నాడు.
  “నీకు భలే ఆలోచనల్రా.. ఇంతున్నావు కానీ..” నవ్వుతూ చూసింది సీతమ్మ.
  “ఇంతంత చేస్తున్నావే అమ్మమ్మా? మిగిలి పోతుందేమో కదా..”
  “అక్కడున్నారే.. వాళ్లు, ఒక్కొక్కళ్లు శేరు బియ్యం అన్నం తినగలరు. పైగా.. 
ఆ సమయానికి ఇంకా ఇంత మంది వస్తారు చూడు.” సీతమ్మ గంగాళంలో సగం 
నీళ్లు తీసి వేరే డేయిసా లో పోసి అది కూడా గాడిపొయ్యికెక్కించింది. 
మరిగాక అందులో పప్పు పోసింది.
  సరిగ్గా రెండి ఘడియల్లో వంటయిపోయింది.
  వసారా బయట, తాటి చాపలు పరచి, సైనికులందరినీ పిలిచి కూర్చోమని.. 
అరిటాకుల మీద వేడిగా పొగలు గక్కుతున్న సన్న బియ్యం అన్నం వడ్డించారు, 
నందుడూ, గౌతమీ.
  కమ్మ్టటి నెయ్యి వేసుకుని ఎన్ని రోజులయిందో పాపం.. ఒక్కొక్కళ్లు పురిషెడేసి 
వేసుకుని పప్పు కలిపి అందులో పచ్చిమిరప కాయ పచ్చడి నంచుకుని 
మాట్లాడకుండా తినేస్తున్నారు. మాట్లాడితే ఆ క్షణం వృధా అవుతుందని.
  సీతమ్మ అన్నట్లుగానే, మరో పదిహేను మంది వచ్చేశారు సమయానికి. 
వాళ్లంతా అంత ఆబగా తింటుంటే ఆవిడకి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంత 
మందికి వండి వార్చిన అలసట అంతా మాయమైపోయి, హృదయం కదిలి 
పోయింది.
  “మరికొంచెం.. మరికొంచెం” అంటూ కొసరి కొసరి వడ్డించింది.
  మాధవుడు పిడతల్లో మంచినీళ్లు నింపుతూ, నెయ్యి మారు వడ్డిస్తూ తిరిగాడు.
  అందరూ కడుపు నిండుగా తిని, లేచాక చూస్తే.. సరిగ్గా నందుడి కుటుంబానికి 
సరిపోయేటన్ని మాత్రం మిగిలాయి ఆధరవులు. అమ్మమ్మ అనుభవంతో చెప్పిన 
మాటలు.. మాధవునికి ఆశ్చర్యం వేసింది.
  భోజనాలయ్యాక సైనికులందరూ లేచి చేతులు కడుక్కుని వెళ్లి పోయారు.. 
కోటలోనుంచి కొమ్ము బూరా పిలుపులు వినిపించగానే!
  ఏమీ మాట్లాడకుండా.. మొహల్లో కొంచెమైనా అసహనం చూపించకుండా 
నిశ్శబ్దంగా ఆకులు తీసి అంతా శుభ్రం చేశారు నంద గౌతమిలు.
  “అదేమి అమ్మమ్మా? అంత మంది తిని ఏమీ ఇవ్వకుండా వెళ్లి పోయారు? 
మనకి ఒక వారాని సరిపోయే సంభారాలు అయిపోయాయి” మాధవుడు అడిగాడు 
చిరాకుగా.
  “తొందరపడి ఏ వ్యాఖ్యానాలు చెయ్యకూడదు నాయనా.. వేచి చూడు. వాళ్లకి 
కోట నుంచి ఎప్పుడు పిలుపందుతే అప్పుడు వెళ్ళాలని ఆజ్ఞ. ఏమీ చెయ్యలేరు. 
నిత్యం కత్తి మీద సామే వారి పని. నా ఊహ సరైతే, వాళ్లంతా ఇప్పుడో.. 
ఇంకాసేపట్లోనో బయల్దేరుతారు.”
  అంతలో వాకిలి బైట గంటలు వినిపించాయి. మాధవుడు పరుగెత్తుకుంటూ 
బైటికెళ్లి చూశాడు. వరుసగా ఎడ్లబళ్లు కోట దిశగా వెళ్తున్నాయి.
  మళ్లీ ఇంట్లోకి పరుగెత్తాడు మాధవుడు.
  


               


  “సైనికులు బైటికెళ్లట్లే.. బళ్లు లోపలికెళ్తున్నాయి. తెరలు కట్టించి అంతఃపుర 
స్త్రీలని ఎక్కడికైనా పంపుతారేమో.. కోట ఖాళీ చేసేస్తారేమో! అప్పుడు నేను 
లోపలికెళ్లి చూడచ్చా?”
  “వేచి చూద్దాం కన్నయ్యా ఏం జరుగుతుందో! ఈ లోగా మనం భోజనాలు చేద్దాం. 
ఆకలి దహించేస్తోంది.” నందుడు బాలుడు ఉత్సాహానికి అడ్డు కట్ట వేశాడు.
  మాధవునికి కూడా పేగులు గోల పెడుతున్నాయి.
  ఆకలికి మాత్రమే కాదు..
  ఏదో తెలియని భయం.. ఏం జరగ బోతోంది?
  వాళ్లు భోంచేస్తుండగానే కోటలో కలకలం.. గబగబా తినేసి, వాకిలి దగ్గరకు 
వెళ్లి చూశారు.
  సైనికులు.. ముందుగా పదాతి దళం, తరువాత అశ్వదళం వెళ్తున్నారు.. 
దక్షణ దిశగా. ఆ వెనుక గజ దళం. మధ్యలో ఒక ఏనుగు మీద అంబారీ.. 
అందులో పూర్తి కవచ రక్షణలో ఉన్నాడు, కళింగ రాజు నాల్గవ భాను దేవుడు.
  నందుడు, మాధవునికి చూపించాడు మహా రాజుని. గౌతమి, సీతమ్మలు 
కూడా కనుచూపు మేర చూసి లోపలికి వెళ్లారు నిట్టూరుస్తూ.
  “అమ్మ, అమ్మమ్మ విచారంగా ఉన్నారు నాన్నగారూ.. ఇక్కడ కూడా 
ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయా?” మాధవుని శరీరం వణికింది. వంగ దేశం 
నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ కూడా..
  “అదే కదా.. గత కొద్ది వారాలుగా అట్టుడికి పోతోంది. నగరం అంతా. మనం 
కూడా కావలసిన బియ్యం, పప్పులు.. అన్నీ నాణాలున్నంత వరకూ తెప్పించి 
పెట్టుకున్నాము. అయినా.. యుద్ధం ఆరంభం అయితే ఏ విధంగా పరిస్థితులు 
మారుతాయో చెప్పలేం.”
  “వంగ దేశం నుంచి.. ఏమైనా భయం ఉందా? అక్కడి సుల్తాను..” మాధవుడు 
ఆందోళనగా అడిగాడు.
  “అవును. జానుపూర్ సుల్తాన్ ఉత్తారాన చాలా సార్లు దండెత్తాడు. కానీ 
మాల్వా సుల్తాన్ పశ్చిమం నుంచి వంగ దేశాధీశుడిని చికాకు పెడ్తుండడంతో 
వెనక్కి 
వెళ్లిపోయాడు. పది సంవత్సరాల నుంచీ ఈ రాజు, నాల్గవ భానుదేవుడు 
ఏలుతున్నాడు.. కానీ ప్రజలేమంత సంతోషంగా లేరు. ఇప్పుడు చూడు.. 
దేశంలో 
ఎన్నో సమస్యలున్నాయి. చెరువులు ఎండి పోతున్నాయి. రహదారులు 
నిర్మించ వలసి ఉంది. పన్నులు పెంచేస్తున్నారు. ప్రజలు విలవిల్లాడి 
పోతున్నారు. 
దక్షిణాన రెడ్డిరాజులు కలహించుకుంటున్నారని అక్కడ గెలిచి, రాజ్యం 
పెంచుకోవచ్చని బయల్దేరాడు. ‘ఉట్టికెగరలేని వాళ్లు స్వర్గానికి ఎగరడం’ 
అంటే ఇదే..”
  “చిన్న పిల్లవాడు. వానికి ఈ రాజకీయాలు నేర్పించ తగునా నందా?” సీతమ్మ 
కోప్పడింది.
  “ఫరవాలేదండీ సీతమ్మగారూ! అర్ధం చేసుకున్నంతే.. ఈ సమయంలో ఏదీ 
దాచ కూడదు. పరిస్థితులు ఏ విధంగా మారుతాయో ఎవరు చెప్పగలరు?”
  గౌతమి మ్లాన వదనంతో ఇంట్లోకి వెళ్ల బోయింది.
  అంతలో.. రెండు ఎడ్ల బళ్లు వచ్చి ఇంటి ముందు ఆగాయి. వాటి నిండుగా 
బియ్యం, పప్పులు వంటి దినుసులు.. నందుడు సైనికుల భోజనాలకి వాడిన 
వాటికి నాలుగింతలు వచ్చాయి.
  “మీ సేవకి సంతుష్టులైన కపిలేంద్ర దేవుల వారు పంపించారండీ. ఎప్పుడైనా 
ఎవరైనా సైనికులు వచ్చిన యెడల వారికి వండి పెట్టమని చెప్పమన్నారు. 
ఇంకా కొంత ధనము కూడా ఇచ్చారు.” మామూలు దుస్తులు వేసుకున్న ఒక 
యువకుడు, ఆశ్చర్యంతో చూస్తున్న నందుడి వద్దకు వచ్చి చెప్పాడు.
  “కపిలేంద్రుల వారికి కృతజ్ఞతలు అంద చేయండి.” నందుడు వచ్చిన వారి 
సహాయంతో సంభారాలన్నీ లోపలికి తరలించాడు.
  “అందుకే తొందర పడవద్దన్నాను. చూశావా మాధవా?” సీతమ్మ అంది.
  మాధవుడు అర్ధమయిందన్నట్లు తలూపాడు.
  పెద్దవారు అనుభవంతో చెప్పేది ఎన్నటికీ తప్పు కాదని తెలుసుకున్నాడు.
  పరిస్థితులలో మార్పులు కూడా తప్పవని అర్ధమయింది.

                                      ……………….



                                         10 వ భాగము.


                   సీ. నిలువ గలదనేది నే కాలమందైన
                                       యుండనే యుండదు యుర్వి లోన
                                చెట్లు చేమలు పొదలు, చేరియున్న క్రిములు
                                        చెదరక మానవు, సెంక వలదు
                                కళ్లు జిగేల్మనే కనకపు కాంతులు
                                        కదిలి పోవునెపుడో కనుల ముందె
                                సడలని కోటలే శత్రు భేద్యము లయిన
                                         కూలక మానవు గుంజ కదల
             
                       ఆ.వె. నేలనంతయు కూడ నేలేటి వారైన
                                    కూల బడ వలయుగ నేల కింద
                                    కాల మహిమ నెవరు కాదన గలరుగా
                                    వేల వేల యేళ్లు వేడు కొనిన.


  క్రీ.శ. 1435-- ఫాల్గుణ మాసం.
            
  కోట చుట్టూ తిరిగి, ముఖ ద్వారం చూస్తూ మాధవుడు వెను తిరిగాడు. 
మాధవుడు తిరిగిన బాటకీ, కోటకీ మధ్య అగడ్త ఉంది. అందులో నీళ్లు 
అడుక్కి ఉన్నాయి.
  అదే సమయంలో కోట సింహ ద్వారం వైపుగా ఒక మేనా వెళ్తోంది. 
మేనాకి తెరలు కట్టి ఉన్నాయి. గాలి వాలుకి తెర తొలగింది. 
ఒక మెరుపు మెరిసినట్లయింది మాధవుని కనుల ముందు.
  జరీ చీనాంబరాలు కట్టుకుని, నగలతో అలంకరించుకున్న బాలిక 
మోము.. చిరునవ్వు, నగలని మించిన మెరుపు నిచ్చింది. సోగ 
కన్నులతో.. అందిన అవకాశం జార కూడదన్నట్లు, బాలిక కన్నులు 
విప్పార్చి అంతా పరికిస్తోంది.
  తీర్చి దిద్దినట్లున్న కను ముక్కు తీరు.. ప్రతీ కదలికలో కనిపిస్తున్న 
రాచ ఠీవి..
  కళ్యాణిని అటు పరుగెత్తించి, గుట్టమీద చేతికందిన చెంగల్వ పూవును 
కోసి బాలిక చేతి కందించి, వేగంగా మాయ మయ్యాడు మాధవుడు.
  బిత్తర పోయిన బాలిక, ఎదురుగా కూర్చుని ఉన్న తల్లిని చూసింది 
గాభరాగా..
  ఆదృష్టం.. ఆవిడ అటు పక్కనున్న తెర కొద్దిగా తొలగించి ప్రకృతిని 
పరిశీలిస్తోంది.
  చెంగల్వ పూవు చేత పెట్టినప్పుడు, ఆ బాలుని కళ్లలో కనిపించిన 
ఆరాధన.. అతడి మోమున విరిసిన వెలుగు.. బాలిక మనసులో 
నిలిచి పోయాయి.
  ఆ బాలిక కపిలేంద్ర దేవుని కూతురు. కాదంబరీ దేవి. కాబోవు రాకుమారి..
  కపిలేంద్రునికి బహు భార్యలు.. పలు సంతానం. పద్ధెనిమిది మంది 
కుమారులని కళింగంలో ప్రచారంలో ఉన్న వార్తలు. కుమార్తెలెందరో 
ఊహ లేదు ప్రజలకి.
                                          …………..


  చడీ చప్పుడు లేకుండా కళ్యాణిని కట్టేసి ఇంట్లోకి వచ్చాడు.
  “ఇంత వేగిరం వచ్చేశావేం కన్నయ్యా?” వెన్న చిలుకుతున్న గౌతమి 
అడిగింది.
  సాధారణంగా గుర్రం మీద స్వారీకి వెళ్తే మాధవుడు ఐదారు 
ఘడియల్లోపుగా రాడు. ఆ రోజు గురువు గారి వద్ద పాఠాలు కూడా లేవు.
  మౌనంగా తండ్రి పక్కకి వెళ్లి కూర్చున్నాడు.
  ఆ రోజు వంటకి వలసిన సరుకులని సరుదుతున్న నందుడు 
తలతిప్పి చూశాడు. మాధవుడి మొహంలో ఏదో ఆరాటం, ఆందోళన.
  “ఏమయింది?” నందుని కంఠంలో ఆదుర్దా..
  “కోటలో ఏదో జరుగుతోంది తండ్రీ! అంతఃపురంలోని వారందరినీ కోట 
వెనుక ప్రాకారం లో కొత్తగా ఏర్పరచిన ద్వారం గుండా 
తరలించేస్తున్నారు. మేనాలు, అశ్వాలు దక్షిణ దిక్కుగా వెళ్తున్నాయి. 
నేను విన్న దేమంటే..”
  మాట్లాడ వద్దన్నట్లు సైగ చేశాడు నందుడు. అదే సమయంలో రాజ 
భటులు కొందరు ఇంటిలోనికి ప్రవేశించారు.
  “మూడుపదుల మందికి రెండు ఘడియల్లోగా వంట సెయ్యాలి 
పూటకూళ్లయ్యా! రాజుగారు చెప్పమన్నారు.” వారిలో అధికారిలా 
ఉన్నవాడు చెప్పాడు. అది ఆజ్ఞే..
  “రాజుగారు యుద్ధం నుంచి..”
  “ఆ రాజుగారు రారు ఇంక. ఇప్పుడు కళింగాన్నేలే మహారాజు కపిలేంద్ర 
దేవులవారు.ఇక నుండీ వారి ఆజ్ఞలే పాటించాలి అందరూ.”
  ఊహించినదే ఆయినా.. అదే వాస్తవానికొచ్చినప్పుడు తట్టుకోవడం 
అంత సులభం కాదు. ఒక ఒరవడికి అలవాటు పడినవారు.. మరలా 
కొత్త పాలన, కొత్త పరిధులు..
  ఒక్కసారిగా లేచి నిలుచున్నాడు నందుడు.
  అసంకల్పితంగా గౌతమి కూడా లేచింది.
  అదేం పట్టించుకోకుండా, వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు భటులు.
  “ఇదే నేను విన్నది నాన్నగారూ! అంతఃపుర స్రీలని పంపించేస్తున్నారు 
కోటలోనుంచి. దక్షిణానున్న శ్రీముఖలింగం వద్ద ఉంచుతారట. 
కొత్త రాజుగారు వారి బాగోగులన్నీ చూస్తారుట.” మాధవుడి మాటలకి 
తలూపాడు నందుడు.
  కొత్త రాజుగారి పరివారం కోటలోకి ప్రవేశిస్తున్నారు.
  “అవును.. గత కొద్దినెలలుగా పురంలో అట్టుడుకిపోతోంది. పుకార్లని 
తోసి పడేశారు. నాకు అనుమానంగానే ఉంది. మనకి సైనికుల తాకిడి 
కూడా బాగా ఎక్కువయింది.”
  “ఇక్కడ రాజ్యం, హిందూ రాజే ఆక్రమించుకున్నాడు కనుక ఆడవారికి 
ఏ అవమానం జరుగ లేదు. అదే వంగ దేశంలో.. సుల్తానులు మగవారిని 
నరికేసి, ఆడవారిని వారి బీబీలుగా చేసేసుకుంటారు. అందుకే నేను, 
జానూపూర్ సుల్తాన్ గురించి అడుగుతున్నాను. పాపం.. ఆ భానుదేవుడు 
రాజుగారేమైపోయారో..” మాధవుడు విచారంగా అన్నాడు.
  “ఏమీ చెప్పలేం. ప్రజల యోగక్షేమాలు పట్టించుకోకుండా, సుంకాలు 
వసూలు చేస్తారని వారి పాలన మీద అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. 
కపిలేంద్రుల వారికి రహస్యంగా ప్రజలు చేసిన విన్నపాలే ఈ ఫలితాలకి 
కారణం. ఏది ఏమైనా.. జన నష్టం లేకుండా గాంగేయుల యుగం 
అంతరించి పోయినందుకు ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పవలసిందే.” 
నందుడు, చకచకా శాకములు తరుగుతూ అన్నాడు.
  మాధవుడు కూడా సీతమ్మకి కావలసిన సహాయం చేస్తున్నాడు. 
కళింగం వచ్చి కొద్ది నెలలే అయినా, ప్రేమ, ఆప్యాయతలు.. నిశ్చింతగా 
సాగుతున్న జీవితం మాధవుని ఎదుగుదలకి దోహదం చేశాయి. 
కండ పట్టి పొడుగు కూడా అయ్యాడు.
  “కపిలేంద్ర దేవుల కుమారుడు పురుషోత్తమదేవుడు నా సహాధ్యాయి 
గురువుగారి వద్ద. నాకన్నా రెండు వత్సరములు పెద్దయి ఉంటారు. 
నేనంటే చాలా ఇష్టం వారికి.” మాధవుడు, అమ్మమ్మకి సహాయంగా 
మిరియం నూరుతూ అన్నాడు.
  చేస్తున్న పనాపి ఆందోళనగా మాధవుని వద్దకు వచ్చింది గౌతమి.
  “నీకు రాకుమారులతో స్నేహమెందుకు కన్నయ్యా? వారికి అనుగ్రహం 
వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేము.”
  “తప్పదమ్మా! మరి గురువుల వద్దకు వెళ్లి విద్యలు నేర్వాలంటే 
సహాధ్యాయులతో మెలగాలి కదా! ఆది రాజకుమారుడైనా, బికారైనా..”
  “నిజమే..” నిట్టూరుస్తూ వెళ్లి పోయింది గౌతమి.
  “కొత్త పాలన ఏ విధంగా ఉంటుందో.. మళ్లీ కొత్త సుంకాలు, కొత్త యుద్ధాలు.” 
నందుడు గుసగుసగా అన్నాడు.
  “యుద్ధాలు తప్పవు తండ్రీ”
  ఉలిక్కి పడ్డాడు నందుడు. ఈ బాలుడికి ఇంతింత రాజకీయాలే విధంగా 
తెలుసునో!
  “రాజులు మారినప్పుడు ప్రజలకీ, సామంతులకీ ఒప్పుకోవడానికి 
సమయం పడుతుంది. అందరినీ అధీనంలోకి తీసుకొని రావలె కదా.” 
మాధవుడు వెనుక వాకిలి లోకి వెళ్లాడు.. పశువులకి మేత వెయ్యడానికి.
  వెంటనే రకరకాల అరుపులు.. మాధవుడిని చూడగానే ఆనందంతో 
గెంతులేసుకుంటూ వస్తాయి.. శ్వేత, శార్వరి. ఆవు మాత్రం చిద్విలాసంగా 
నెమరేస్తోంది.
                                     …………….


  జ్యేష్ఠ మాసం-
  మూడు మాసాలు కటక ప్రజలకీ, సామంత రాజులకీ సమయం ఇచ్చి, 
వారందరి సహాయ సహకారాలతో.. ఒక రకంగా సమ్మతితో, కపిలేంద్ర 
దేవుడు సింహాసనం అధిష్టించాడు.
  రాజ్యం చేజిక్కించుకున్నాడే కానీ క్షణ క్షణం అప్రమత్తతతో ఉండాల్సిందే.. 
ఏమరుపాటు ఏ మాత్రం పనికి రాదు.
  మొదటగా తన సామంతుల విప్లవాన్ని అణచాలి. వారిలో ముఖ్యులు, 
నందపురం శీలవంశీయులు, ఒడ్డాది మత్స్య రాజులు,  పంచధారల 
విష్ణు వర్ధనులు. గాంగేయుల రాజ్యం అంతరించిందని వార్త వినగానే 
సామంత రాజులు పన్నులు కట్టడం మానేశారు. సుశిక్షతులైన తన 
సైనికులతో వారినందరినీ ఒక త్రాటి మీదికి తీసుకొచ్చాడు. 
రాజులందరికీ పరాక్రమ వంతుడైన కపిలేంద్రుని ఎదిరించడానికి 
సాధ్యం అవలేదు.
   కళింగలో సూర్య వంశీయులైన ‘గజపతు’ల పాలన మొదలయింది.
   మాధవుడు చెప్పినట్లే అవుతోంది.
  మహాపాత్రులు వండి వారుస్తున్న వారు వారుస్తున్నట్లే ఉన్నారు. కోటలో 
వంటశాల వచ్చే పోయే సైనికుల అవసరాలు తీర్చలేక పోతోంది.
  ఆ రోజు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు..
  “ఏమయింది బాబూ?” సీతమ్మ ఆయాస పడుతూ అడిగింది ఒక సైనికుడిని.
  నంద, గౌతమిలు కూరగయలు తరిగేస్తున్నారు చకచకా.. అరటి 
వంటి వాటికి తప్ప, కొన్నింటికి తొక్కలు తియ్యడానికి సమయం 
సరి పోక, రుద్ది రుద్ది కడిగి అలాగే వండేస్తున్నారు.
  కొందరు సైనికులు వీరి కష్టం గమనించి వారికి తోచిన సహాయం వారు 
చేస్తున్నారు. అయినా.. రాత్రి ఎప్పుడో ఏడెనిమిది ఘడియలు తప్ప 
విశ్రాంతి దొరకడం లేదు.
  “ఉత్తరాన జానుపురం, వంగ దేశాల నుంచి ఎప్పటి కప్పుడు 
బెదిరింపులు.. అవి చాలనట్లు ఢిల్లీ సుల్తాను కూడా ఓఢ్రం మీద 
కన్నేశాడని చారుల వార్త. అందువలనే సైన్యాన్ని పటిష్ఠం చేసుకోవలసిన 
అవసరం వచ్చింది మహా రాజుగారికి.” పెద్ద గుండిగ నిండుగా ఎసరు 
పెట్టి గాడి పొయ్యి మీరికి ఎక్కించడానికి సహాయ పడుతున్న 
ఒక సైనికుడు చెప్తున్నాడు.
  “ఈ విధంగా ఎంత కాలం?” నీరసంగా అడిగింది గౌతమి.
  “రెండు మూడు సంవత్సరాలుండ వచ్చమ్మా. కొత్త వారిని తీసు
కుంటున్నారు సైన్యం లోకి. సామ్రాజ్యాన్ని విస్తరింప జేశాక దాన్ని 
కాపాడుకోవాలి కదా! గాంగేయుల వలే గంగ నుండి గోదావరి వరకూ 
జయించాలని మహారాజుగారి కోరిక.”
  నందుడు ఇద్దరిని సహాయకులుగా పెట్టుకున్నాడు. అయినా.. అంతా 
చూసుకుంటూ పర్యవేక్షించాలంటే గౌతమి, సీతమ్మలే కావాలి. అందుకే 
బాగా అలిసి పోతున్నారు. ధనం మాటెలా ఉన్నా.. రాజాజ్ఞ పాటించి 
తీరాలి. తప్పదు.
  పప్పులు, ఉప్పులు పెట్టుకోవడానికి ఒక గది, ధాన్యం నిలవకి ఒక 
గాదె, కాయగూరలు కుళ్లి పోకుండా ఆర బెట్టి ఉంచడానికొక కటకటాల 
పంచ.. ఇవన్నీ కాకుండా, పాతిక మందికి ఒకే సారి వడ్డించడానికి 
అనువయిన పొడుగాటి వసారా.. ఇంటికి కలిపారు.
  రాజుగారి ఆంతరంగికులలో ఒకరైన గోపీనాధ మహాపాత్రులు నందుడికి 
పినతండ్రి వరుస అవుతారు.. వారి దాయాదులు. వారి సహాయంతో 
ఇంటికి కావలసిన మార్పులు చేయించగలిగారు. కోటలో ధనాగారం 
నుంచి ధన సహాయం లభించింది.
  బాటసారులు రాత్రి ఉండి పోయి విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా 
నాలుగు గదులు కూడా వేశారు.
  పాడి కూడా పెరిగింది.. మరో రెండు గోవులు తువ్వాయిలతో సహా 
కలవడంతో.
  చిన్న పూటకూళ్ల ఇంటి స్థాయి నుంచి ఓ మాదిరి వసతిగృహం గా 
మారింది మహాపాత్రుల ‘కళింగం’.
  “మన కన్నయ్య వచ్చినప్పట్నుంచే మన ఇంట సిరులు 
విరిసాయమ్మాయ్..” సీతమ్మ రోజుకొక సారైనా అనక మానదు.
  మాధవుడు అల్లారు ముద్దుగా పెరుగు తున్నాడు. ఇంట నుంటే వద్దన్నా 
పనులలో జోక్యం చేసుకుంటాడు. అందువలననే, కళ్యాణితో సహా 
అతడిని గురుకులానికి పంపారు నందుడూ, గౌతమీ.. బాగా ఆలోచించుకుని.
  కపిలేంద్ర గజపతి అంతర్గత విప్లవాలని అణచి వేసి సామ్రాజ్యాన్ని 
సుస్థిరం చేశారు.
  విస్తరించడానికి ప్రణాలికలు వేయసాగారు.
                                       ……………..


  కీ.శ. 1439:  
  మాధవునికి పదహారు సంవత్సరాలు నిండాయి. గురుకులంలో 
విద్యలన్నింటిలో రాణిస్తున్నాడు. స్వతసిద్ధంగా కత్తి యుద్దంలో, 
గుర్రపు స్వారీ లో అతనికున్న ఆసక్తితో ఆ విద్యలలో నైపుణ్యం 
సంపాదిస్తున్నాడు.
  గురువుగారి సమ్మతి తీసుకుని, రోజూ ఇంటి వద్దనుండే వెళ్లి 
వస్తున్నాడు. కళ్యాణిని గుర్రపు స్వారీకి అనుకూలంగా తయారు చేసి, 
మాధవుడు కొత్తగా చేరిన వారికి తనే నేర్పిస్తున్నాడు. గురువుగారు 
సదానందులవారు మాధవుని ఆసక్తికి ప్రసన్ను లయ్యారు.
  స్వభావ సిద్ధంగా మాధవునికి సాహిత్యం మీద అభిరుచి మెండు. 
సంస్కృతాంధ్ర, వంగ, ఓఢ్ర బాషల్లో మంచి పట్టు వచ్చింది.
  ఆంధ్ర దేశం నుంచి పండితులెందరో కాశీ యాత్రకి తరచుగా వెళ్తుంటారు. 
దారిలోనే ఉన్న నందుని పూటఇంటిలో బస చేసే వెళ్తారు. ఒక్కొక్క సారి 
మధ్యదారిలో ఉన్నందు వల్ల రెండు మూడు రోజులు ఆగి, అలసట 
తగ్గాక వెళ్లటం కూడా కద్దు. ఆ సమయంలో మాధవుడు, ఇంటి 
వద్ద ఉంటే..  వారి వద్ద కవితా గానాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.
  మాధవుని నాణాలు కొన్ని మాత్రమే ఖర్చు పెట్టాడు నందుడు. 
మిగిలినవి భద్రంగా ఇనుప పెట్టిలో దాచాడు.


  కవిత్రయం రాసిన ఆంధ్ర మహాబారతం మాధవునికి అత్యంత ప్రియమైనది. 
కొండవీడు నుండి, రాజమహేంద్రవరం నుండి వచ్చిన కవుల వద్దనుండి 
కొన్ని కొన్ని పద్యాలను రాసుకుని తన వద్ద భద్ర పరచుతుంటాడు.
  కోట వద్ద రద్దీ పెరిగింది.  
  ప్రకృతి ఆరాధన మాధవునికి ప్రియమైన విషయాల్లో ఒకటి.
  సూర్యోదయాత్పూర్వమే మహానది ఒడ్డుకు వెళ్లి అర్ఘ్యపాదాదులు 
అర్పిస్తూ ఉంటాడు. అతని, యుద్ధవిద్యల  ఆసక్తిని గమనించిన నందుడు, 
మాధవుని కేశములను కూడా పూర్తిగా తియ్యకుండా, మధ్యలో పిలక 
ఉంచుకునేట్లు అనుమతి ఇచ్చాడు.
  చల్లని ప్రాతః కాలమున మాధవుడు కదలి వెళ్తుంటే పశుపక్ష్యాదులు 
వెనువెంటే గుంపులుగా ఉంటాయి.


 చం.  తెలతెల వారకుండగనె తేకువతో వెడలేటి మాధవున్
         కలకలల ధ్వనిన్ కనగ, కామిత మానసుడైన శ్రీహరే
      నిల కరుదెంచె నేమొయని నివ్వెర పోయిన గువ్వలన్నియున్
      మెలకువఁ దెచ్చు కొమ్మనుచు మేల్కొలుపుల్ పలికేను మోదమున్.  


  ఇంటివద్దనున్నపుడు, గురుకులంలోనూ కూడా మాధవుని నిత్య 
కృత్యమదే.


       
  
  ఒకరోజు.. మాధవుడు, ఉషః కాల సంధ్యావందనం పూర్తి అయాక, 
నది ఒడ్డునే ఉండిపోయాడు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని 
తిలకిస్తూ.
   రస హృదయులకి, పిట్ట ఎగిరినా, తువ్వాయి గెంతినా హృదయం 
స్పందిస్తుంది కదా!    
  కపిలేంద్ర దేవుడు రాజ్యానికి వచ్చినప్పట్నుండీ పాడి పంటల 
మీద దృష్టి కేంద్రీకరించాడు. తిరుగుబాట్లని అణచడంలో ఎంతటి 
సమర్ధత చూపించాడో.. రాజ్యంలో చెరువులు పునరుద్ధరించడంలో, 
చెట్లు నాటించడంలో అంతే చూపించాడు.
  రాజ్యం సుభిక్షంగా ఉంది.
  తడి వస్త్రములు మార్చుకుని, మంచి చోటు చూసుకుని, పద్మాసనం వేసి 
కూర్చున్నాడు. ప్రాణాయామం చేస్తూ.
  పులుగులన్నీ ఆహార సేకరణకై వెడలినట్లున్నాయి.. వాతావరణం 
నిశ్శబ్దంగా ఉంది.
  ప్రాణాయామం అయ్యాక నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్లాడు.
  ఒక ఘడియ గడిచిందేమో..
  “మాధవా.. మాధవా..” గట్టిగా పిలుస్తున్నారు ఎవరో..
  కన్నులు తెరిచి చూశాడు.
  గురుకులంలో సహ విద్యార్ధి.. రొప్పుతున్నాడు ఆయాసంతో.
  “గురువుగారు నిన్ను త్వరితగతిని పిలుచుకు రమ్మన్నారు. గురుకులం 
లోనికి ఏనుగుల మంద వచ్చింది. పంటంతా నాశనం చేస్తున్నాయి. 
ఇంక ఇళ్ల మీద కూడా పడ బోతున్నాయి. వాటిని వెళ్లగొట్టాలి. నీకు 
కొన్ని మెళకువలు తెలుసునట కదా?
  మాధవుడు వెంటనే స్పందించాడు.
  ఇంటికి వెళ్లి అమ్మతో చెప్పి, వెను వెంటనే సహాధ్యాయిని తీసుకుని, 
కళ్యాణి మీద బయలుదేరాడు, గురుకులానికి.
   యజమాని స్థితిని అర్దం చేసుకున్న హయం వేగంగా పయనం 
సాగించింది.

                                      ………………….
11వ భాగము


  మాధవుడు రయమున కళ్యాణిని కళ్లెంతో వేగిర పరుస్తూ వెళ్లే సరికే 
పరిస్థితి 
భీభత్సంగా ఉంది.
  గౌతమికి కాస్త సుస్తీ చేస్తే గురువుగారి అనుమతితో నాలుగు రోజులు 
సెలవు 
తీసుకున్నాడు. ఇంకా ఒక రోజు గడువుంది.
  గురుకులం ఒక పల్లెనానుకుని ఉంది.
  పల్లెవాసులంతా భీతావహులై అటూ ఇటూ పరుగెడుతున్నారు.
  ఏనుగులు పంట పొలాలన్నింటినీ నాశనం చేశాయి. పెద్దా చిన్నా కలిపి 
పదిహేను ఏనుగులుంటాయి. గున్న ఏనుగులు కూడా చిన్న తొండాలని 
ఊపుకుంటూ చేలలో మొక్కలని భక్షిస్తున్నాయి.
  మాధవునికి చూడగానే అర్ధమైపోయింది. చాలా పెద్ద సమస్యే..
  మాధవుడు ఇట్టువంటి విపత్తుని ఇదివరకు చూశాడు. వంగ దేశంలో 
అడవులెక్కువే.. ఏనుగులూ, పులులూ కూడా ఎక్కువే. ఒక సారి 
ఇటువంటి 
పరిస్థితే పులులతో వచ్చింది అక్కడ.
  వెంటనే తమ కోటలోని సైనికులు వెళ్లి పులులని తరిమేశారు. ఒక పులి, 
నలుగురు మనుషులు చనిపోతే కానీ అదుపు లోకి రాలేదు పరిస్థితి. 
అప్పుడు అక్కడి రాకుమారుడితో వెళ్లి దూరం నుంచే చూశాడు.
  మాధవునికి గజం మీదికి ఎక్కడం వాటిని మచ్చిక చెయ్యడం కూడా 
వచ్చును. ఒక రకంగా పసి వయసులోనే అన్నీ నేర్పిస్తారు వంగదేశపు 
కోటలలో రాకుమారులకి. నిరంతరం అప్రమత్తులై ఉండాలిసిందే. ఏ క్షణం 
ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
  అది మనుషులవచ్చు, జంతువులవచ్చు. అందుకే పసి తనం నుండే 
మాధవునికి చాలా అనుభవాలు కలిగాయి.
  “మనవాళ్లేమైనా చేశారా ఏనుగులని?”
  తల వంచుకున్నాడు సహ విద్యార్ధి.
  “ఏమయింది?”
  “మొన్న ఒక మదపుటేనుగు వచ్చి పొలాలన్నీ నాశనం చేస్తే చుర కత్తి 
పట్టుకుని ఒక సైనికుడు..”
  మాధవుని హృదయం ఒక క్షణం లయ తప్పింది.
  “ఏనుగు మరణించిందా?”
  “తెలియదు. బాగా రక్త స్రావం అవుతుంటే అడవిలోకి పారిపోయింది, 
కుంటుకుంటూ.”
  “ఇక్కెడెక్కడా గాయపడిన ఏనుగు కనిపించడం లేదు. మరణించే ఉం
టుంది. అందుకే మొత్తం మందంతా వచ్చింది. ఊరుకున్నామంటే మిగిలిన 
మందలని కూడా పిలుస్తాయి.”
  “ఇప్పుడేం చెయ్యాలి మాధవా?” వణికి పోతూ అడిగాడు మిత్రుడు.
  “ఏనుగులు ఏమీ ఎరగనట్లుంటాయి కానీ, గ్రహణ శక్తి ఎక్కువే. అసలు 
అడవి లోనుంచి జనావాసంలోకి ఎందుకు వచ్చిందో ఆ మదపుటేనుగు?”
  “ఈ సంవత్సరం కరవు వచ్చింది కదా.. అడవిలో వృక్షాలన్నీ 
ఎండిపోయుంటాయి. ఆహారం దొరక్క వచ్చుంటుంది.”
  ఆలోచనగా తలూపాడు మాధవుడు.. నిదానంగా పచ్చని పొలాల్లోని, 
తోటల్లోని చెట్ల ఆకుల్ని భక్షిస్తున్న ఏనుగులని చూస్తూ.
  అప్పుడే గురువుగారు మిగిలిన శిష్యులని తీసుకుని వచ్చారు, చింతా 
క్రాంతులై.
  “మాధవా! ఎందుకో.. నీకు ఈ పరిస్థితిని తప్పించగల నేర్పుందని 
అనిపిస్తోంది. ఇప్పటికే నలుగురి ప్రాణాలు హరించుకు పోయాయి. 
గజాలన్నీ మహోగ్రంగా ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్ధం అవడం లేదు.. 
ఈ పరిసరాలని విడిచి పెట్టి పోవడం తప్ప.” గద్గద స్వరంతో అన్నారు.
  “ఆ మదపుటేనుగుని గాయపరచకుండా ఉండాలిసింది. ఇప్పుడు 
ఆ జంతువులన్నీ అభద్రతా భావంతో రెచ్చిపోతున్నాయి.” మాధవుడు 
కొద్ది దూరంలో కనిపిస్తున్న మందని చూస్తూ అన్నాడు.
  నిజమే..
  ఒక సైనికుడు అటుపక్కకి నాలుగడుగులు వేశాడో లేదో.. 
భయంకరంగా ఘీంకరిస్తున్నాయి.
  మందకి ముందుగా ఒక ఆడ ఏనుగు అందరినీ పర్యవేక్షిస్తోంది. 
కొన్ని గున్నలని తొండంతో సవరిస్తూ.
  ఆ ఏనుగుని కనుక స్వాధీన పరచుకుంటే..
  “అది చాలా ప్రమాదం మాధవా!” మాధవుని మనసు గ్రహించిన గురువుగారు 
వారించారు.
        


  నిజమే.. ఏనుగులు ఒకదానికొకటి రక్షగా నిలిచినట్లు ఉన్నాయి.
  “నీకేం ఫరవాలేదు. మేమున్నాము..” అన్నట్లుగా తుండములతో సవర 
దీసుకుంటున్నాయి.
  తమ వారంటే.. తమ జాతంటే ఎంత ప్రేమ?
  ఆ ప్రేమే.. సమస్త విశ్వాన్నీ ఇంకా కాపాడుతోంది. 
చూస్తున్న వారి మనసులు ఆర్ద్ర మయ్యాయి. ఒక్క క్షణం అవి 
చేసిన విధ్వంసాన్ని మరచేట్లు చేశాయి.
  
ఉ.   పేర్మిని విశ్వ రక్షణము పెంపున నెప్పుడు సేయనుండగా
      కూర్మిని సంతసంబు నను కోరి సమస్త ప్రపంచ మందునా
      ధార్మిని జంతుజాలముల తార్క్ష్యము లన్నిటినందు కూడనూ
      వార్మణి వోలెనే కనగ బాగుగ విశ్వము ప్రేమ మంతయున్.


   (వార్మణి= కౌస్తుభము)
  
  ఒక కాకికి ఏమైనా ఐతే కాకులన్నీ వాలిపోయి నానా గోలా చేస్తాయి.
  మానవులే చాలా నేర్చుకోవాలేమో అనుకున్నాడు మాధవుడు.
  “అవును మాధవా! సకల విశ్వమునూ లయ తప్పకుండా నడిపించేది 
ఆ ప్రేమ తత్వమే. ఆ అనుబంధమే లేక పోతే.. ఎవరికి వారనుకుని 
బ్రతుకుతుంటే నిస్సారమే. ఇపుడీ సమస్య తీరే విధం కనిపించడం లేదు.” 
విచారంగా అన్నారు గురువుగారు.
  అంతలో పల్లెవాసులు పరుగు పరుగున వచ్చారు.
  “స్వామీ! మీరే కాపాడాలి మమ్మల్ని. వేరే దిక్కు లేదు.” కాళ్ల మీద 
పడిపోయాడు పల్లె పెద్ద.
  అదృష్టమే.. ఇంకా పల్లె లోని ఇళ్ల మీద పడలేదు. ముందుగా కడుపు 
నింపు కోవాలనుకున్నాయేమో!
  ఒక విధంగా జాలి వేసింది మాధవునికి. అడవిలో ఆహారం లేక 
జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి జీవాలు. వర్షాధారమైన వనాలు 
కరవు వస్తే ఎండి పోతాయి.
  “లేవండి.. ఏదో ఉపాయం ఆలోచిద్దాము. ప్రస్తుతానికి ఇళ్ల మీది
కి రావు లెండి. జంతువుల జోలికి మాత్రం వెళ్లకండి.”
                                       ……………….
  “గురువుగారూ! ఏనుగుల మందని అడవిలోకి పంపించ వచ్చును, 
కానీ.. అక్కడ ఆహారం లేక పోతే మళ్లీ వచ్చేస్తాయి. మహారాజుగారు 
ఏదైనా ఏర్పాటు చేస్తే కానీ సమస్య పోదు.” మాధవుడు అంటుండగానే 
పురుషోత్తమ దేవుడు వచ్చాడు.
  “రాకుమారా! చూస్తున్నావు కదా.. ఏమిటి కర్తవ్యం?” గురువుగారు 
అడిగారు.
  పురుషోత్తమ దేవుడు చాలా చురుకైనవాడు. తండ్రి వద్ద చాలా 
చనువు కూడా ఉన్నవాడు. కపిలేంద్రదేవుని ప్రియ భార్య కొడుకు.
  “ఏదో ఒకటి తప్పకుండా చేద్దాం ఆచార్యా! నేను వెంటనే కోటకి వెళ్లి 
తండ్రిగారికి వివరించి వస్తాను. రేపు ఆపరాహ్ణానికి ఒక ప్రణాలిక రచిద్దాము. 
అంతవరకూ మాధవుని సహాయం తీసుకోండి. అతడికి అడవి 
జంతువులతో మెలగుట, వాటిని అదుపులోనికి తెచ్చుట 
కరతలామలకము.” వెనువెంటనే పురుషోత్తముడు వెడలిపోయాడు.
  ఏనుగుల మంద తినడం కొంత తగ్గినట్లుంది. ఒక దాన్నొకటి 
రాసుకుంటూ, తొండాలతో పలుకరించుకుంటూ తిరుగుతున్నాయి 
నెమ్మదిగా. అన్నీ ఒక చెట్టుకిందికి వెళ్తున్నాయి.
  మాధవుడు పెద్ద పెద్ద డప్పులు తెప్పించి చెవులు హోరెత్తేటట్లుగా, 
కర్రలతో వాయించమన్నాడు కొందరిని.
  కొందరిని పొడవైన కాగడాలు తీసుకురమ్మని, నూనెలో ముంచి 
వెలిగించి, అర్ధ చంద్రాకారంగా, అడవి దిక్కుకి వ్యతిరేకంగా, 
మందవైపుకి అతి నెమ్మదిగా కదలమన్నాడు.
  ఏనుగులన్నీ ఒక్క సారిగా కదిలి అడవిలోకి పయనమయ్యాయి.
  ఘీంకారాల్లేకుండా, నెమ్మదిగా.. ఒక ఊరేగింపులాగ.
  నాశనమయిన పంటలని చూస్తూ, రోదిస్తూ, పల్లె జనం తమతమ 
ఇళ్లకు బయల్దేరారు. గురువుగారు, శిష్యులు కూడా గురుకులంలోకి 
పయనమయి, పాఠ్యాంశాల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించారు.
  బాలురందరూ, గట్టిగా ఆదిశంకరులవారి సౌందర్యలహరి శ్లోకాలని 
వల్లిస్తూ సాగుతున్నారు.
  “ఇంక రావేమో కదా మాధవా గజాలు.. అడవిలోకి వెళ్లి పోయాయి 
కదా?” ఒక సహాధ్యాయి అడిగాడు. గురువుగారు మాత్రం తల 
అడ్డంగా తిప్పుతూ సాలోచనగా చూశారు.
  ”అవును ఆచార్యా! మీ ఊహ నిజమే. తిరిగి రావడానికే అవకాశాలు 
ఎక్కువ. రాకుమారులు ఏ వార్త తీసుకుని వస్తారో వేచి చూద్దాము.” 
మాధవుడు కళ్యాణి వద్దకు వెళ్లాడు, దాణా పెట్టడానికి.
                                           ……………


       నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
       నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ము తతేనమః
  గురువుగారు, నమకం అభ్యాసం చేయిస్తున్నారు శిష్యుల చేత.
  పరమశివుడు మేరు పర్వతాన్నిబంగరు ధనుస్సుగా చేసుకుని, 
తూణీరాలను ఇరు ప్రక్కలా పట్టుకుని పాపం చేసిన వారిని 
దండించడానికి సిద్ధంగా ఉన్నాడు.. రౌద్ర రూపంలో. అతడు 
తూణీరాలను వదుల్తే జగమంతా అశ్రుధారలే.
  అందువలననే ఆ రుద్ర మూర్తిని శాంతింప జేయాలి, స్తుతించి. 
యజుర్వేదంలోని ఆ స్తోత్రములే నమకంగా ప్రసిద్దమయినవి.


 “ నా మీద కోపగించకు. నేను పాపాలే చేసి యుండవచ్చు. 
నన్ను వ్యాకుల పరిస్తే  తట్టుకోలేను. నాకు దుఃఖం వస్తే నిన్ను 
తలవలేను. నా యీ జీవితంలో నీ పాదాలకు దూరమై పోతాను. 
నీ పాదాలను తలచలేని, ఆరాధించలేని పరిస్థితి వస్తుంది. 
అది నేను భరించలేను. ఈశ్వరా నీ రౌద్రానికొక నమస్కారం. 
నీ ధనుస్సునకో నమస్కారం. నీ తూణీరాలకూ ఒక నమస్కారం.”


  గురువుగారు ప్రధమ శ్లోకాన్ని వివరించాక మరింత 
భక్తితో స్తుతిస్తున్నారు శిష్యులు.
  మాధవుడు వల్లిస్తున్నాడు కానీ కొంత దృష్టి అడవికేసి 
సారించాడు. ఏక సంథగ్రాహి అవడంతో శ్లోకం కంఠస్తా వచ్చేసింది. 
యాంత్రికంగా పెదవులు కదుపుతున్నాడు.
  మనసంతా నిండిన ఆందోళన ఏకాగ్రతని అసాధ్యం చేస్తోంది.
  అనుకున్నంతా అయింది. ముందు సవ్వడి వినిపించింది. 
ఆ తరువాత పైకిలేపుతూ, పక్కలకి ఆడిస్తున్న తొండాలు 
కనిపించాయి.
  ఆ పిదప  ఒక దాని వెనుక ఒకటి.. తల్లి పక్కగా ఆనుకుని 
నడుస్తూ గున్నలు, చివరిగా మగ ఏనుగులు.. వస్తూనే ఉన్నాయి.
  ఒక క్రమశిక్షణతో.. ఊరేగింపు వస్తోంది.
  “ఆచార్యా!” మాధవుడు సన్నగా పిలిచాడు. అది పిలుపు కాదు.. ఆక్రోశం.
  వేదఘోష ఆగింది.
  అందరూ ఒకేసారి లేచి నిలుచున్నారు.
  “నిన్నటికంటే మూడు రెట్లున్నాయి ఏనుగులు. ఏం విధ్వంసం 
జరగబోతోందో.. ఇంకా మందల్ని కలుపుకుని వస్తున్నాయి” 
మాధవుని మాటలకు ఆందోళనగా తలూపారు గురువుగారు.
  “కిం కర్తవ్యం?”
  “గురువుగారూ! రాకుమారుడు..” శిష్యులు అరిచారు.
  తలవెనుకకు తిప్పారు ఆచార్యులు, మాధవుడు. 
ఇద్దరి మోములూ వికసించాయి..
పురుషోత్తమ దేవుని అశ్వం కాన వచ్చింది.
  వెనుకగా ఎడ్ల బళ్లు..
  “బళ్ల నిండుగా.. ఏమది మాధవా? రాజుగారు ఏం 
చెయ్యబోతున్నారు?”
  మాధవుడు నమ్మలేనట్లు చూశాడు బళ్లని, బళ్ల లోనివారిని, 
అందున్నవాటిని!

                                          ……………..



                                            12వ భాగం.


                   సీ.   రాజనగ నెవరదీ జగమున జన
                                 సామాన్యమందరి సాధకముల
                          చూచి కాచెడి వాడు, చోరుల దండించ
                                 యప్రమత్తుడై నుండి యరయు వాడు
                          తగురీతి రాజ్యమున్ ధరలదుపుంబెట్టి
                                సుఖజీవనమునంత చొనుపు వాడు
                          వెవసాయమునకునూ బేహారమునకునూ
                                సమ ప్రధానత్వ మొసగెడి వాడు.


                  ఆ.వె. ప్రజను కన్న తండ్రి వలె చూచుగ నతడు
                            కష్ట సుఖములందు కమ్ము కొనగ
                            యట్టి రాజెపుడును యక్షయముగ నిల
                            మనగలడుగ నెంతొ మహిమ తోను.


  రాకుమారుడు పురుషోత్తమదేవుని రాక చూసి గురుకులంలోనే 
కాదు పల్లె పల్లంతా సంతోషం వెల్లి విరిసింది.
  పురుషోత్తమదేవుని వెనుక బళ్లల్లో, నిండుగా ఏనుగులకి ఆహారం.. 
పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు, ఆకులూ.. చాలా బళ్లున్నాయి. 
పాతిక పైగా. ప్రతీ బండిలోనూ ఇద్దరిద్దరు యువకులు.. బండి 
తోలే వాళ్లు కాకుండా.
  రాకుమారుడు వచ్చి, గుర్రం దిగి ఆచార్యులవారికి వందనం చేశాడు.
  “ఏమిది రాకుమారా?”
  “ఏనుగులన్నిటినీ కోటకి తరలిద్దాము ఆచార్యా! తండ్రిగారు గజబలం 
పెంపొదించే ఆలోచనలో ఉన్నారు. సరైన శిక్షణ నిస్తే మన గజబలానికి 
ఎదురే ఉండదు. కోట వెనుక ఏనుగుల నిమిత్తం పెద్ద వనం కూడా 
పెంచాము.. ఇంకా ఆ వన వైశాల్యము పెంచుతున్నాము. కరవుతో 
అడవిలో ఆహారం లేనే లేదు కదా!” పురుషోత్తముడు వినయంగా అన్నాడు.
  “మీ వంశానికి గజపతులనే పేరు సార్ధక నామధేయం అవగలదు 
నాయనా! మహరాజుగారి ఆలోచన దివ్యంగా ఉండి అటు పశువులకీ, 
ఇటు రాజ్యానికీ.. ఇరు పక్కలా.. ఉభయతారకం.” ఆచార్యులు 
ఆశీర్వదించారు, నమస్కరిస్తున్న రాకుమారుడిని.
  “మాధవా! ప్రారంభిద్దామా?” పురుషోత్తముడు పిలిచాడు, కొద్ది 
దూరంలో నిలుచుని వీక్షిస్తున్న మాధవుడిని. అతడి నైపుణ్యం 
మీద అంతులేని నమ్మకం రాకుమారునికి.
  “ముందుగా కొంత ఆహారం.. ఒక బండి మీదున్నది.. పల్లెవైపు 
వస్తున్న మంద ముందు వేస్తే ఏనుగులు ఆగిపోతాయి. ఆ బళ్ల 
మీదున్న వారు మావటీ వారనుకుంటాను.. ఆహారం తింటున్నపుడు 
ఏనుగులని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. మనం ప్రణాలిక 
రచిద్దాము.” మాధవుడు జవాబిస్తూనే, రాకుమారుని వద్దకు వచ్చాడు.
  పురుషోత్తముడు  మావటి వారికి సైగ చేశాడు.
                                          ……………….


  అడవి లోనికి వెళ్లే దారిలో చితుకులనీ, ఎండు కట్టెలనీ పేర్చారు. 
అదే విధంగా.. కోట వైపుకి ఉన్న దారిలో తప్ప మిగిలిన రెండు 
దిక్కులా చేశారు. కోటకి వెళ్లే దారిలో ఆకుపచ్చని ఆకులతో ఉన్న 
కొమ్మలు పేర్చారు. ఏనుగుల గుంపు నడుస్తుంటే.. ఆ కొమ్మలని బళ్లతో 
లాగే ఏర్పాటు చేశారు.
  మొత్తం అనుకున్న విధంగా తయారయే సరికి అపరాహ్ణం దాటింది.
  ఆ సమయంలో మావటివారు ఏనుగులని మచ్చిక చేసుకో గలిగారు.
  మాధవుడు అన్ని పనులనూ పర్యవేక్షించి, ఏనుగుల వద్దకు వెళ్లి.. 
నాయకునిలా ముందు ఆజమాయిషీ చేస్తున్న గజరాజు వద్దకు వెళ్లాడు.
  తమ కోసం ఆహారం సమకూర్చాడనో ఏమో.. ఆ ఏనుగు అభివాదం 
చేస్తున్నట్లు తొండం ఎత్తింది.
  మాధవుని కంట నీరు తిరిగింది. ఎన్ని రోజులుగా ఆహారం లేకుండా 
ఉన్నాయో! తప్పని సరైతే కానీ జనావాసాలకి రావు.
  ఏదో.. చెప్పాలని ఉంది ఆ గజానికి..
  మాధవుని తొండంతో ఎత్తి తన మీదికి ఎక్కించుకుంది ఆ గజరాజు. 
ఒక మావటి వానిని కూడా ఎక్కించుకుని ఏనుగు ఎక్కడికి తీసుకు వెళ్తుందో గమనిస్తున్నాడు మాధవుడు.
  పల్లెకి అడవికీ మద్యనున్న ఒక పుంతలోకి దారి తీసింది. కొద్ది దూరం 
వెళ్లగానే కనిపించింది.. పొదల మధ్య. పడుకున్న నల్లని కొండలాగుంది..
  దూరం నుండే ఆ ఆకారాన్ని పోల్చుకున్నారు.
  సైనికుడు కత్తి విసిరిన గజం.
  తమ నేస్తం అలా పడుందని ఏనుగులన్నీ ఒక దగ్గర చేరి నట్లున్నాయి.
  ఏనుగు మరణించి ఉండదు. మరణిస్తే ఇంకా విజృంభించేవి. ఎప్పడో 
పల్లె మొత్తం నాశనమయ్యేది.
  చాలా పెద్ద ఏనుగు.. బాధతో తల వాల్చేసి ఉంది.
  నెమ్మదిగా అక్కడికి నడిచింది, మాధవుడెక్కిన గజం.
                          
  
  
  ఆ ఏనుగు వద్దకు వెళ్లి నేలమీదికి కూర్చుని, తొండాన్ని మాధవునికి 
ఆనించింది,
  ముందుగా మాధవుడు, తరువాత మావటీడు దిగారు.
  గాయపడిన గజం.
  సైనికుని చురకత్తి ఒక కాలిలో లోతుగా దిగింది. ఆ కత్తి ఇంకా అక్కడే 
ఉంది.. స్తంభంలా ఉన్న కాలి పైభాగంలో.. తొడ వద్ద. కాలంతా రక్తం 
గడ్డకట్టి ఉంది.
  ముందు గాయాన్ని కడగాలి.. ఏనుగు చేత నీరు తాగించాలి. శరీరంలో 
ద్రవాలు లేక నిస్త్రాణ అయిపోయింది. అటూ ఇటూ చూశారిద్దరూ.. 
రక్షణ బృందం.
  జంతువులకున్న గ్రహింపు శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు.
  వారిని తీసుకొచ్చిన ఏనుగు తొండంతో ఇద్దరినీ తడిమింది. వంగి 
ఉన్న కాలి మీద ఎక్కి మాధవుడు పైకి లంఘించాడు. త్వరత్వరగా 
నడుస్తూ గురువుగారు, రాకుమారుడు ఉన్న స్థలానికి తీసుకెళ్లింది.
  వెంటనే జరగ వలసిన ఏర్పాట్లు జరిగి పోయాయి.
  కుండలలో నీళ్లు, అవసరమైన ఔషధాలు, లేపనాలు, పల్చని వస్త్రములు 
తీసుకుని, ఒక బండి తరలింది. మాధవ, మావటీలు తమని తీసుకు 
వచ్చిన ఏనుగు మీద కూర్చుని దారి చూపుతూ ముందుగా వెళ్లారు.
  రక్త సిక్తమై ఉన్న కాలంతా కడిగి, జాగ్రత్తగా కత్తిని బైటికి లాగి, గట్టిగా 
మెత్తని వస్త్రాన్ని కాలి చుట్టూ కట్టారు.. రక్త స్రావం అరికట్టడానికి.
  మావటి, వీలు చూసుకుని, తల పక్క కూర్చుని ఏనుగు నోరు తెరచి, 
నీళ్లు పోశాడు గొంతులో.. కుండలతో. కాస్త త్రాణ రాగానే కళ్లు తెరిచి 
తల అటూ ఇటూ తిప్పిందా గజం. వెంటనే.. ఆహారం తినిపిస్తూ, ఔషధాలు 
కూడా పోశారు గొంతులో.
  కాలికున్న బట్ట విప్పి, అవసరమైన లేపనాలు పూశారు.
  ఈ వైద్యం జరుగుతున్నంత సేపూ అక్కడే కూర్చుని చూస్తోంది 
మాధవుని తీసుకు వచ్చిన ఏనుగు. వైద్యం తీసుకుంటున్న గజం 
కూడా కిమ్మనలేదు.
  కొంచెం తల ఎత్తి, కూర్చోగానే.. బాగా ఆకులున్న కొమ్మలు 
దగ్గరగా పెట్టారు. నెమ్మదిగా నములుతూ తల అటూ ఇటూ తిప్ప 
సాగింది గజం.
  అందరూ సంతోషంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
                     
  
                         
  సంధ్యా సమయానికే దెబ్బతిన్న గజరాజు లేచి నిలబడ్డాడు.
  నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు మిగిలిన పరివారం 
వద్దకి. ఆ గజాన్ని చూడగానే అన్ని ఏనుగులూ తొండాలూ, 
తలలూ ఊపుకుంటూ వచ్చేశాయి తమ నేస్తం దగ్గరగా!
  కొన్ని తొండాలు ఊపుకుంటూ, కొన్ని తలలూపుతూ.. గున్నలు 
తల్లుల కింద నిలబడి తొండాలతో సవరదీస్తూ.. సన్నగా 
ఘీంకరిస్తూ చుట్టూ చేరాయి.
వాటి ఆనందం చూసి తీర వలసిందే.
  చుట్టూ ఉన్న జనుల మీద కోపం పోయింది.
  మాధవుడు, మావటీడు తమ వాహన గజం మీది నుంచి కిందికి 
దిగగానే.. వారి వద్దకు రావడానికి ప్రయత్నించాయి. ఇద్దరూ 
ఏనుగుల వద్ద మెలగడం అనుభవంఉన్నవారే..
  అన్నిటినీ స్వయంగా.. తడుముతూ, పలుకరిస్తూ ఓదార్చారు.
  ఆ ఓదార్పు ప్రక్రియ చూసిన వారు జంతువుల కృతజ్ఞతా భావాలను 
చూసి కదలి పోయారు.
           ఆ.వె.      తమకు హాని కలుగ దాడిచేయను వచ్చు
                         ప్రేమ చూప గాను పేర్మి యొసగు
                         మాట రాదు గాని మౌన భాషణ సేయు
                         వారి చేష్టలన్ని బాగు బాగు.


  మూగజీవులే కాని భావ ప్రకటనలో సిద్ధహస్తులే.
  గురువుగారు పురుషోత్తమదేవుని చూసి చిరునవ్వు నవ్వారు.
  “ఈ రోజు ఇంక కదలలేము రాకుమారా! రేపు ప్రభాత సమయంలో 
బయలు దేరుదాము.” మాధవుని సలహాకి తల పంకించాడు రాకుమారుడు.


                     


  “మన నేస్తాలని కూడా విశ్రాంతి తీసుకోమందాము. పాపం.. అవి 
కూడా గత రెండు దినముల నుండీ బాగా అలిసి పోయాయి. ఇప్పుడు 
సంధి కుదిరింది కనుక నిశ్చింతగా ఉంటాయి. మన మాట వింటాయనే 
ఆశిస్తున్నాను.”
  “అవును మాధవా! కడుపు నిండుగా ఆహారం కూడా దొరికింది. ఇంక 
కావలసినదేముంది? అటు చూడు మిత్రమా?” పురుషోత్తముడు చూపిన 
వైపు చూసి చిరునవ్వు నవ్వాడు మాధవుడు.
  అన్ని ఏనుగులూ తలొక చెట్టు కిందా, స్థిర పడిపోయాయి. గున్నలు 
తల్లుల పక్కగా తలలు పక్కకి తిప్పి రాస్తూ ఉన్నాయి. ఒక అలౌకిక 
స్థితిలోకి చేరుకున్నాయి ప్రశాంతంగా.
  పురుషోత్తమదేవుడు సంతృప్తిగా తల పంకించి, గురుకులం వైపుకి 
దారి తీశాడు.
  పల్లె వాసులంతా తమ పల్లెకేసి తిరిగారు.
  “ఒక్క క్షణం ఆగండి..” వెను తిరిగిన రాకుమారుడు పిలిచాడు.
  పల్లె పెద్ద దగ్గరగా వచ్చాడు. కోటలో ఉండే రాకుమారుడు.. తమ 
వద్దకు వచ్చి.. తమని పిలిచి మాటలాడడమా! పల్లె వాసులకి నోట 
మాట రాలేదు.
  “మీ పంట నష్టం గురించి తండ్రిగారికి విన్నవించాను. మిమ్మల్ని 
తప్పక ఆదుకుంటారు. బెంగ పడకండి.”
  వంగి వంగి దణ్ణాలు పెట్టుకుంటూ వెళ్లి పోయారు అందరూ.
  మావటీలకీ, బళ్లు తోలే వారికీ.. వచ్చిన వారందరికీ ఆహారం తయారు 
చేశారు.శిష్యులు గురు పత్ని పర్యవేక్షణలో.
  రాకుమారు ఒక బండిలో ఆహార పదార్ధాలు తీసుకుని వచ్చాడు. 
శిష్యులు తమ గృహాల నుంచి తెచ్చివి కూడా ఉంటాయెలాగూ. 
గురుకులంలోనే కూరగాయలు పండిస్తారు.
  కడుపు నిండుగా భోజనాలు చేసి ఒళ్లు తెలియకుండా నిద్ర 
పోయారందరూ.
                                       ………………


             కం.   ప్రేమను మించిన భావము
                     ప్రేమ వలెను నూరడింప వేరేముందీ
                     ప్రేమయె కద నిలనంతయు
                     ప్రేమ మయము చేయ వచ్చె పెన్నిధి వలెనే.   


  మరునాడు లేవగానే అందరినీ అలరించిందొక సుందర దృశ్యం.
  ఏనుగుల మంద.. అక్కడున్న చెరువులో జలకాలాడుతోంది. 
గురుకులంలో మాధవుడు, రాకుమారుడు చూపిన ప్రేమతో వాటికి 
అంతులేని విశ్వాస మొచ్చింది, అక్కడి వారి మీద.
  మాధవుని చూడగానే తొండాల నెత్తి, ఘీంకరిస్తూ తమ సంతోషాన్ని 
వ్యక్తం చేశాయి.
  కాలకృత్యాలు తీర్చుకోవడానికీ, స్నాన మాచరించి, అర్ఘ్యం 
విడవడానికీ కొలనుకి వెళ్తే.. అతని మీద తొండాలతో నీళ్లు కుమ్మరించి 
అభిషేకం చేశాయి.


  చూస్తున్న వారి కన్నులు ఆశ్చర్యంతో విప్పారాయి.
  సదానందాచార్యులవారు ప్రసన్న వదనంతో వీక్షించారు.


 


  వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది.
  పరివారం అంతా లేచి, త్వరిత గతిన తయారయి కోటకి 
పయనమయ్యారు.
  మొదటగా అనుకున్నట్లు మూడు పక్కలా మంటపెట్టడం, కోట 
దారంతా కొమ్మలు లాగడం వంటి ప్రణాలిక అవసరం లేక పోయింది.
  మాధవుడు, మావటి తమకు మచ్చికైన గజం మీద కూర్చుని త్రోవ 
చూపుతుండగా..  ఏనుగులన్నీ బారాబతి కోటకి పయనం సాగించాయి. 
ప్రయాణం ఆరంభం అవగానే మరి మూడు మందలు వచ్చి చేరాయి.  
బళ్ల మీదున్న ఆహారం వాటికి తినిపించి, పరివారమంతా కూడా 
పాలు, పళ్లు ఫలహారం చేసి బయలు దేరారు.
  అనూహ్యంగా నూరు ఏనుగులు.. అంతకన్నా సైన్యానికి బలం 
ఏముంటుంది?
  కపిలేంద్ర దేవుని రాజ్య విస్తరణకి తిరుగు లేని విధంగా గజబలం 
సేకరణ అయింది దైవికంగా.  

                                           ……………..


                                                        13వ భాగం.
కోటలో..
ఉ. జీవన యానమున్ కలుగు చేర్పులు తర్కము కందవే మరీ
ఏ విధి రాసెనో నుదుట యెవ్వరి కైనను నేర్వవచ్చునా
కావగ దైవమే యిలను కైనొసగేనుగ మోదమందగా
చేవగ కోటలో నడుగు చిక్కగ వేసెను మాధవుండదే.
కళింగ దేశం వచ్చినప్పటునుంచీ కోటలోపలికి వెళ్లాలనుకున్న 
మాధవుడు, అనుకోని విధంగా, రాకుమారుని వెంట కోటలో ప్రవేశించాడు.
వంగదేశంలోని తమ కోట కంటే ఎంతో విశాలంగా ఉంది. తీరైన దారులు.. 
దారుల పక్కన పూల మొక్కలు.. స్వాగతిస్తున్నట్లు తలలూగిస్తున్న వృక్షాలు..
ఎంతో శుభ్రంగా కన్నుల కింపుగా ఉంది.
పురుషోత్తమ దేవుడు, గజాలని గజశాలలకి తరలించాడు.
గజశాలలని చూసిన మాధవుడు అనుకున్నాడు.. కపిలేంద్ర దేవుని విజయాలకి 
ఆటంకం ఉండదని, వారి వంశానికి గజపతులనే పేరు నిలిచి పోతుందనీ, కనీసం 
మూడు తరాలు పాలన చేసి తీరుతారని!
కోట వెనుక భాగాన ఎత్తైన ప్రాకారాలతో ఉంది గజశాల. అచటికి వెళ్లాలంటే 
కోటను దాటే వెళ్లాలి. ఏ చారులూ సులభంగా చేరలేరు.
అదాటుగా చూసి ఏనుగులను లెక్కించడం అసాధ్యం.
మొత్తం అంతా చూపించి, కొత్త గజాలన్నింటినీ, ఒక్క రోజులో నిర్మించిన 
విశాలమైన శాలల్లో ప్రవేశ పెట్టారు. ప్రతీ ఏనుగు వద్దా గుట్టల్లా పోసిన కొమ్మలు.
మాధవుడు, పురుషోత్తమ దేవుడు.. శాలలన్నీ నడిచి చూస్తున్నారు.
గజశాలలన్నీ పెద్ద అడవిలో ఉన్నట్లే ఉన్నాయి.
రాజ్యాన్ని చేజిక్కించుకునే ముందే ఏనుగుల సంరక్షణ కేర్పాట్లు చేశాడు 
కపిలేంద్ర దేవుడు.
ఒకటి రెండు రోజుల్లో జరిగిన ఆక్రమణ కాదది. దాదాపు ఐదారు సంవత్సరాల 
నుంచీ ప్రణాలిక వేసిందే.
ప్రధాన సామంతుడిగా, సైనికాధికారిగా, కపిలేంద్రుడు అభివృద్ధి పనులని బాగా 
చేపట్టాడు.. తనే చేస్తున్నట్లు చల్లగా ప్రచార మిచ్చుకుంటూనే.
ఏదేమైనా.. కళింగదేశం కళకళ్లాడుతోంది. ఆలయాల నిర్మాణం, పూరీ 
జగన్నాధుని 
ఆలయానికి అలంకరణలూ.. పాడి పంటల అభివృద్ధి బాగా సాగుతోంది. ప్రజలు 
మార్పుని మనస్ఫూర్తిగానే ఆహ్వానించారు.
అయితే.. సైన్య సమీకరణ, అశ్వ, గజ శాలల అభివృద్ధి కూడా వేగంగా 
జరుగుతున్నాయి. అంతర్గత విప్లవాలని అణచి వేసినా, బలహీన పొరుగు 
దేశాలపై యుద్ధానికి సన్నిద్ధమౌతున్నాడు రాజు.
గజ శాలలని చూసి అదే అనుకున్నాడు మాధవుడు.
అతి త్వరలో యుద్ధానికి సమాయత్తమవ వలసి ఉంటుందని.
“మాధవా!” రాకుమారుని పిలుపు విని తల తిప్పి చూశాడు
“రోజూ కోటకి రాగలవా? అంటే.. కొద్ది సమయం ఇక్కడ గడపగలవా?”
మాధవుని నోట మాట రాలేదు. రాకుమారుడు అడుగు తున్నాడంటే 
ఆజ్ఞాపిస్తున్నాడనే అర్దం. కాదనగలడా?
“ఇది ఆజ్ఞ కాదు సుమా.. అభ్యర్ధన మాత్రమే.” మనసులో మాట 
తెలుసుకున్నట్లుగా అన్నాడు.
“తల్లిదండ్రులకో మారు చెప్పి..” మాధవుని మాట పూర్తి అవకుండానే 
పురుషోత్తముడు చిరునవ్వు నవ్వాడు.
“అవశ్యం మిత్రమా! వారి అనుమతి తీసుకునే! నంద మహాపాత్రులకి అభ్యంతరం 
ఉంటుందనుకోను. మీ అమ్మగారే భయ పడవచ్చును. కానీ సర్ది చెప్పగలవని 
నాకు నమ్మకమే.. అది నీకు ఇష్టమైతేనే సుమా..”
రాకుమారుడు, మిత్రమా అని సంబోధించడమా? అదీ ఒక పూటకూళ్లఇల్లు 
నడిపే బ్రాహ్మణుల బాలుడిని.
మాధవుడు సంశయాత్మకంగా చూశాడు.
“మనం ఒకే గురువు వద్ద విద్యనభ్యసిస్తున్నాం. మరి మనం మిత్రులమేకదా 
మిత్రమా?” మాధవుని భుజం మీద చెయ్యివేసి అన్నాడు పురుషోత్తముడు.
ఆ క్షణం నుంచీ మాధవ, పురుషోత్తములిరువురూ ప్రాణ స్నేహితులై పోయారు. 
జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచారు.
ఇంటికి తేరుకుని, ఏవిధంగా కోట సంగతి చెప్పాలా అని మధన పడుతున్న 
మాధవునికి ఊరట కలిగింది, నందుని ఉత్సాహాన్ని చూసి.
“కోటలో పాగా వెయ్యడమంటే ఇదే కుమారా? అవశ్యం వెళ్లు. మన రాజుగారికి 
సేవ చెయ్యడం కన్న కావలసినది ఏముంటుంది?”
గౌతమికి మాత్రం ఆవేశం వచ్చింది.
“ఇదేనా మీరు చెప్పవలసింది. కోటలోకి అడుగు పెడితే ఇంక కన్నయ్య 
మనకి దూరమైపోడా? వద్దని చెప్పక, ఇంకా ప్రోత్సహిస్తారా?”
అప్పటికి నందుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లి పోయాడు.
“అమ్మా! మీరు వలదన్నచో నేను ఇల్లు కదలనే కదలను.” మాధవుడు 
మాత్రం అభయం ఇచ్చేశాడు.. తల్లిని మరపించిన తల్లికి.
అంతా వింటున్న సీతమ్మ మౌనంగా ఉండి పోయింది. ఆవిడకి తెలుసు.. 
ఆ సమయం వస్తే ఎవ్వరూ ఏదీ ఆపలేరని.
“ఐనా.. రోజూ కొద్ది సేపే కదమ్మా రాకుమారుడు నన్ను రమ్మని అడిగింది. 
అంతలో నన్ను సైన్యంలో చేర్చుకున్నట్లు కాదు కదా!” మాధవుడు 
ఊరడించ బోయాడు.
గౌతమి కళ్ల నీళ్లు పెట్టుకుంది.
“ఇప్పుడలాగే అంటారు కన్నయ్యా! ఒక సారి అందులోకి వెళ్తే ఇంక 
వదలరు. అందులో ఇప్పుడు యువకులని యుద్ధాలకి తీసుకు పోతున్నారు. 
వాడ వాడంతా హడలి పోతున్నారు.”
“నన్ను యుద్ధానికి తీసుకెళ్లరమ్మా! రాకుమారుని వెంటే ఉంటాను. ఐనా 
మీరు వద్దంటే వెళ్లనని చెప్పా కదా?” మాధవుడు తల్లి చీర కొంగుతోనే 
ఆమె కన్నులు తుడుచాడు.
………………..
“రాకుమారుడు మాట వరుసకి అడిగారు కానీ, అది ఆజ్ఞే గౌతమీ. తప్పక 
వెళ్ల వలసిందే. మనం సంతోషంగా అనుమతి ఇవ్వాలి, ఆశీర్వదిస్తూ.” 
నందుడు ఏకాంతంలో గౌతమికి సర్ది చెప్పాడు.
“ఒక సారి కోటలోకి వెళ్లే.. మనకి తెలియనిదేముంది?” కళ్లనిండా 
నీళ్లతో అంది గౌతమి.
“అంతలాగ మాయా మోహంలో చిక్కుకో కూడదు గౌతమీ! అయినా 
ఐదారు సంవత్సరాల క్రితం మాధవుడెవరో మనమెవరో.. ఇప్పుడు 
ఈ అనుబంధం వచ్చింది కానీ.. నిమిత్త మాత్రంగానే ఉండాలి సుమా.”
మరునాడు.. గౌతమి, ఆందోళన లోలోపలే దాచుకుని మాధవునికి 
అనుమతి ఇచ్చింది.
కానీ ఆవిడ భయపడినట్లే అయింది.
మాధవుడు గురుకులం నుండి కోటకే వెళ్తున్నాడు. వారానికి ఒక పరి 
మాత్రమే ఇంటికి వస్తున్నాడు.
వచ్చినప్పుడు మాత్రం ఎప్పటి లాగానే అందరితో కలసి మెలసి, 
ఛలోక్తులు విసురుతూ అలరిస్తుంటాడు.
కోటలో..
గజశాల పర్యవేక్షణ మాధవుని ప్రధాన బాధ్యత. ప్రతీ ఏనుగుకీ ఒక మావటి 
ఉన్నాడు. వారు పనిని బాగుగా చేస్తున్నారా, గజాలకి బాగా శిక్షణ 
ఇస్తున్నారా.. నమూనా యుద్ధరంగాలనేర్పరచి, అందులో 
ఏనుగులకి బాధ్యతగా ప్రవర్తించే విధానాలు నేర్పుతున్నారా..
ఆహారం బాగా అందుతోందా..
పశువుల ఆరోగ్యాలెలా ఉన్నాయి.. ఇటువంటి ముఖ్యమైన పనులన్నీ 
మాధవుని బాధ్యతలే. అవన్నీ అతడు ఇష్టంగా చేస్తున్నాడు.
మధ్య మధ్యలో పురుషోత్తమ దేవునితో కలిసి సాహిత్య చర్చలు 
తప్పని సరి. అప్పటికి నాలుగు శతాబ్దాలుగా, సంస్కృతం నుంచి పురాణ 
గాధలని ప్రాంతీయ భాషల్లో, జన సామాన్యానికి అందుబాటులో 
ఉండేలాగా రచించడం వచ్చింది, రాజమహేంద్రవరం నుండి ప్రారంభమై.
కవిత్రయం ఆంద్ర మహా భారతం రచించడం, దేశంలోని అన్ని బాషల 
వారికీ మార్గ దర్శకం అయింది.
కవులు కనీసం నాలుగు భాషల్లో ఆరితేరిన వారై ఉండే వారు.
మాధవునికీ, పురుషోత్తమునికీ కూడా తెలుగు సాహిత్యం మీద 
అంతులేని మక్కువ.
కపిలేంద్రదేవుడు, రాజమండ్రీ, కొండవీడు, తెలంగాణ, పాకనాడు 
మొదలైన రాజ్యాలని స్వాధీన పరచుకునే ప్రయత్నంలో.. తెలుగు వారితో 
రాక పోకలు అధిక మయ్యాయి.
ప్రతీ రోజూ కనీసం నాలుగు ఘడియలైనా సాహిత్య చర్చ జరుగుతుంది.
కపిలేంద్ర గజపతి కళింగని స్వాధీన పరచుకున్నప్పుడు, రాజమండ్రీ 
రాజధాని గా రాజ్యాన్నిఅల్లాడ వేమారెడ్డి తమ్ముడు వీరభద్రా రెడ్డి 
పాలిస్తుండే వాడు. కొండవీడు నేలిన పెదకోమటి వేమారెడ్డి రాజ్య పతనం 
అయ్యాక మహాకవి శ్రీనాధుడు రాజాస్థానంలో ప్రాపునకై రాజమండ్రీ 
వచ్చాడు.
దాదాపుగా కపిలేంద్రుడు సిహాసనాన్ని చేజిక్కించుకున్న కాలం లోనే, 
శ్రీనాధుడు భీమఖండం అనే కావ్యాన్ని రచించాడు. కాశీ యాత్రకు వెళ్తున్న 
పండితులు కొందరు, మహాపాత్రుల కళింగంలో బస చేసినప్పుడు, 
మాధవుని ఆసక్తిని గమనించి ఆ ప్రతిని కానుకగా ఇచ్చారు.
“మేము తిరుగు ప్రయాణంలో వచ్చే సరికి మీరు మరొక ప్రతిని చేసుకుని 
మాకు ఈ కావ్యాన్ని తిరిగి ఇచ్చెయ్యాలి సుమా!” పండితుడు 
హెచ్చరించాడు.
“అంత గొప్ప గ్రంధమా స్వామీ?”
“అవునయ్యా. కవిత్రయం వారి మహా భారతం సరసన నిలువగల 
రచనలు చేశారు, శ్రీనాధ కవి సార్వభౌములు. సులభంగా అర్ధమయే 
చాటువులు.. అందరి నోట తిరిగే పద్యాలు.. ఆసక్తిగా సాగే కథనం. 
చదివి చూడండి. మీకే తెలుస్తుంది కదా! మీ రాకుమారుడు కూడా 
సాహిత్య పిపాసి అని విన్నాం. వారికి కూడా చూపించండి అనుకూల 
మైనప్పుడు.”
మాధవుడు భీమఖండం పఠనం ముగించగానే, శ్రీనాధ కవికి అభిమాని 
అయి పోయాడు.
రాకుమారునికి చూపించాడు ఒక రోజు..
“దేవా! ఈ కావ్యం చదివి తీరాలి మనం. అద్భుతంగా ఉంది.”
“అవశ్యం మాధవా! నాకూ చాలా ఉత్సుకతగా ఉంది. చదువుతాను. 
చదివాక ఇద్దరం కలిసి చర్చిద్దాము.”
మాధవునికి ఎనలేని సంతోషం కలిగింది. రాకుమారుని సాంగత్యం 
తన పూర్వజన్మ పుణ్యం అనుకున్నాడు.
“ప్రస్తుతానికి, మహానదీ తీరానికి విహారం వెళ్దాము. చాలా రోజులయింది. 
అందులో సంధ్యా సమయంలో నది అందాలు చూసి తీర వలసిందే కదా..” 
పురుషోత్తమదేవుడు అశ్వశాల కేసి దారి తీశాడు.
ఇద్దరూ బయల్దేరారు, రెండు అశ్వాల మీద. నది ఒడ్డునే వెళ్తూ, కావ్య 
ఠనం సంగతి ప్రక్కన పెట్టి ప్రకృతి అందాలు చూస్తూ.. పరవశిస్తూ, 
నెమ్మదిగా వెడల సాగారు.
చల్లని గాలి హాయిగా తనువు తాకుతుంటే, మనసు తేలిపోసాగింది. 
సంధ్య వెలుగులు పరిసరాలన్నింటినీ ఆక్రమించుకుని, అందుబాటైన 
చోటంతా పరావర్తనం చెందుతున్నాయి.
మాధవుని నోట అసంకల్పితంగా వెలువడిందొక పద్యం. అప్పటికి 
తెలుగు భాష మీద మక్కువ మిక్కుటంగా ఏర్పడిందతడికి.
కం. “కెంజాయల మెరుపు నదిన
సంజాతము కలిగె గాద సంపూర్ణముగా
కంజజుడు గీసినటులనె
రంజనముగ మనసులే పరవశింపగనే.”
పక్కనే ఉన్న రాకుమారుని చూసి మాధవుని మోము కెంజాయ 
దాల్చింది.. అచ్చు అక్కడున్న నింగీ, నదుల వలెనే.
“మాధవా! ఇదంతా కవి సార్వభౌముని కావ్య సాంగత్యమే?” 
రాకుమారుడు ప్రశంసగా చూశాడు.
“దేవా మీకు..” సంకోచంతో ఆపేశాడు మాధవుడు.
“అవును మాధవా! సమకాలీన సాహిత్యంలో శ్రీనాధ మహాకవి 
ప్రతిభ తెలియని వారుండరు. పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. 
నీకు తెనుగు సౌరభం ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్లుంది. 
శ్రీనాధులవారే తెనుగు భాష గురించి ఈవిధంగా అన్నారు..
ఆ.వె. "జనని సంస్కృతంబు సకల భాషలకును
దేషభాషలందు దెనుగు లెస్స
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె?"

ఇద్దరూ గుర్రాలు దిగి, అక్కడున్న చెట్టుకు కట్టేసి, కాసిని 
గుగ్గిళ్లని వాటి ముందు పెట్టి, మహానది ఒడ్డునే నడవ సాగారు.
అప్పడే పక్షులన్నీ గూళ్లకి చేరుకుంటున్నాయి, తమ పిల్లల 
ఆకలి తీర్చడానికి. తల్లుల్ని చూడగానే నోళ్లని తెరిచి, రకరకాల 
అరుపులతో తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నాయి.. ఇరవైరెండు శృతుల్లోనూ.
నది ఒడ్డునే ఉన్న ఒక తిన్నె మీద కూర్చున్నారు స్నేహితులిరువురూ.
“అవును మిత్రమా! ఒక రకమైన పారవశ్యంలోఉండి పోయాను. 
కవిత్రయానికి దీటైన కవి ఎవరంటే శ్రీనాధులవారే అంటాను.”
“ముమ్మాటికీ నిజమే మాధవా! జీవితాన్ని కాచి వడపోసిన 
మహానుభావులు. ఎక్కడున్నారో ఇప్పుడు?” కొద్ది విచారంగా 
అన్నాడు పురుషోత్తమ దేవుడు.
“అదేమిటి దేవా? రాజమహేంద్రవరంలో ఉంటారు కదా? ఈ యుద్ధ వాతావరణం 
తగ్గాక వెళ్లి దర్శించుకుందామను కుంటున్నానుకూడా..” మాధవుడు ఆశ్చర్యపోయాడు.
“వేగుల వార్తలను బట్టి..” ఆపేశాడు రాకుమారుడు.. బహిరంగంగా 
మాట్లాడవలసిన విషయాలు కావవి.
“మరొకసారి చెప్పుకుందాం. నదిలో సూర్య భగవానుడికి అర్ఘ్యం 
సమర్పించి బయలుదేరుదాము. తండ్రిగారు ఎదురు చూస్తుంటారు.” 
పురుషోత్తమదేవుడు లేచాడు.
                                              ……………..

14 వ భాగం.


  పురుషోత్తమదేవునికి వరదలా వచ్చి పడ్డాయి సమస్యలు. 
వయసుకి మించిన బాధ్యతలు.
  కపిలేంద్ర దేవునికి అత్యంత ప్రియమైన భార్య కుమారుడతడు. 
దశరధుడు కైకేయికి వరమిచ్చినట్లు గానే కపిలేంద్రుడు కూడా 
తన తరువాత పురుషోత్తముడే రాజని ఆవిడకి మాట ఇచ్చాడు. 
కానీ అది బహిర్గతం చేయడానికది సమయం కాదు.
  ఆ సంగతినే ఆ భార్యకి చెప్పి కొన్ని రోజులు ఊరకుండుమన్నాడు.
  “పురుషోత్తముడు ఇంకా చిన్నవాడు. నాకున్న పద్ధెనిమిది 
మంది పుత్రులలోనూ నాకు ప్రీతి పాత్రుడే. కానీ, రాజ్యాన్ని 
సుస్థిర పరచుకోవాలి.. అదే ప్రధమ కర్తవ్యం.”
  జ్యేష్ఠ కుమారులలో బలమైన వాడు, ప్రముఖుడు హంవీరదేవుడు. 
తండ్రి రాజ్యానికి రక్షగా ఉన్నవాడు. నందాపురం రాజులనూ, 
ఒడ్డాది మత్స్యవంశపు రాజులనూ, యలమంచిలి చాళుక్యులనూ 
లొంగ దీసుకోవడంలో తన పరాక్రమాన్ని చూపించిన వాడు.
  సహజంగానే.. తండ్రికి ప్రీతి పాత్రుడని, అన్నదమ్ములందరికీ 
పురుషోత్తమ దేవుడనిన అసూయ, కోపం. అందరూ అతడిని 
వెలివేసినట్లుగా చూస్తుంటే బాల ప్రాయమునించీ ఒంటరి గా 
గడపడం అలవాటు చేసుకున్నాడు.
  ఒక రకంగా ఆ ఒంటరి తనం అతన్ని సాహిత్యానికి దగ్గర చేసింది.
  విద్యలన్నిటి యందూ అధిక సమయం వెచ్చించడానికి దోహద 
పరచింది. ఆటపాటల బాల్యాన్ని గురుకులంలో తోటి విద్యార్ధుల 
మధ్య గడిపాడు.
  మాధవుని సాంగత్యం ఎడారిలో ఒయాసిస్సులా ఊరట పరచింది 
పురుషోత్తముడిని. తెలివిలో, ఠీవిలో, అభిరుచులలో, ఆసక్తిలో 
అన్నిటా సమ ఉజ్జీ. దాయాదుల మత్సరంలేకుండా, స్వచ్ఛమైన 
స్నేహం లభించింది.
  
  మహానదీ తీరం నుండి కోటకి వచ్చిన వెంటనే, పురుషోత్తమ 
దేవునికి పిలుపు వచ్చింది, తండ్రిగారి నుండి.
  మాధవుడు గజ శాలలకి వెళ్లిపోయాడు. శాలలలో యుద్ధ 
శిక్షణ ఇస్తున్న గజాలని పర్యవేక్షించడానికి. వన్య మృగాలకి 
యుద్ధ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది.. సైనిక శిక్షణ లాగానే. 
అవి మగ ఏనుగులే అయుంటాయి.
  మొదట్లో వాటికి ఆహారం ఇవ్వకుండా.. మాడుస్తారు. నెమ్మదిగా, 
వాటిని మావటి వానిచే మచ్చిక చేయిస్తారు. వాని మీదికి, బాణాలు 
విసరడం, కత్తులు ఝుళిపించడం.. గాయాలు చెయ్యడం వంటివన్నీ 
చేస్తారు. యుద్ధభూమిని తయారుచేసి అందులో ఏ విధంగా రెచ్చి
పోవాలో నేర్పిస్తారు.
  రణ రంగంలో ఉండేవి చాలా పెద్ద ఏనుగులు. ముందుగా వాటి 
ఆకారాలని చూసే భయపడి పోతారు, పదాతి దళం.. తొండంతో 
ఇరవై అడుగులు పైకి ఎగరేసి విసిరెయ్యడ, నేల మీదకి పడేసి 
తొక్కడం, దంతాలని మనుషుల్లోకి గుచ్చడం వంటి వన్నీ, 
బొమ్మలతో శిక్షణ ఇస్తారు.
  అంత భయంకరంగా పోరాడే జీవులూ, తమ యజమాని గానీ, 
మావటి గానీ దగ్గరగా వస్తే.. చెప్పినట్లు వింటాయి వెంటనే.
  ఆ శిక్షణలో తగలే దెబ్బలకి వైద్యం చెయ్యడానికీ, ఔషధాలు 
తయారు చెయ్యడానికీ ఒక విభాగం ఉంటుంది. యుద్ధ సమయంలో 
డేరాలలో, వైద్యులతో, పశు వైద్యులు కూడా ఉంటారు.
  మాధవుడు, ప్రతీ పనినీ స్వయంగా చూసుకుంటాడు. శిక్షణ కఠినంగా 
ఉందనిపించినా మాట్లాడడు. భీకర యుద్ధాలనెదురుకోవాలంటే 
ఆ విధంగా ఉండాలిసిందే!
  ఆ శిక్షణలో ఒక్కొక్క సారి అతడికి కూడా దెబ్బలు తగులు
తుంటాయి. ఆ సమయంలో గౌతమి పదే పదే చెప్తుంటుంది.. కోట
లోకి వెళ్ల వద్దని. మాధవుడు ఊరడిస్తే ఊరుకుంటుంది.


         ఉ.    పోరు నెదుర్కునే బలిమి పూటుగ రావలె నన్నచో సదా
                 భారము కల్గియే మెలగి బాగుగ శిక్షణ చేయగా వలే
                 నోరిమి యెంతయో కలిగి నొట్టిగ భీతిని చెందియుండకే
                 ఘోరముగా నదే రణము గొప్పగ సల్పను శక్తి కల్గుగా!
  
  ఆ రోజుకి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిన మాధవునికి 
దుఃఖముతో ఎదురొచ్చారు గౌతమీ, నందులు.
  “ఏమయిందమ్మా?”
  “అమ్మ మనల్ని వదిలి వెళ్లిపోయింది మాధవా!” నందుడు 
వెక్కుతూ అన్నాడు.
  మాధవుని నోటి వెంట మాట రాలేదు. అరుగు మీద కూర్చుండి 
పోయాడు.
  “ఆఖరు చూపు దక్కలేదు. మొన్నటి రేయి, నిద్దురలోనే విడిచిందట 
ఆఖరు శ్వాశ. రేపు ప్రాతఃకాలమందే బయలు దేరి వెళ్తున్నాము 
ఇద్దరమూ.. కర్మ కాండలు నిర్వర్తించవలెను కదా! నువ్వు 
రాకుమారుని అనుమతి తీసుకుని మా వెనుకే బయలుదేరి వచ్చెయ్యి.”
  “ఇప్పుడే వెళ్లి అడుగుతాను. అందరం కలిసే వెళ్దాము.” 
మాధవుడు కళ్యాణి పైకి ఎక్కి కళ్లెం లాగాడు.
                                           ………………


  గౌతమి మేనాలో, నందుడు, మాధవుడు చెరొక అశ్వం మీద 
బయలు దేరారు. త్వరిత గతిన వెళ్లడానికి కుదురుతుందని.
  మరునాడు సాయంత్రానికి కానీ వెళ్ల లేకపోయారు.. అతి తక్కువ 
విశ్రాంతి సమయాలు తీసుకుంటూ. దారంతా, మాధవునికి 
బాలవ్వ జ్ఞాపకాలే. ఆరోజు సైనికుల నుంచి తనని కాపాడక 
పోయి ఉంటే..
  ఆవిడ చూపించిన ప్రేమ, తన పుత్రునికే అప్పజెప్పడం.. 
ఏ నాటి అనుబంధమో. ఈనాటి తన స్థితికి ఆవిడే మూలం. 
కళ్లు చెమరుస్తూనే ఉన్నాయి. తన తల్లిని విపత్కర పరిస్థితులలో 
అడవిలో వదిలేసి వచ్చిన దృశ్యం కనిపించింది.
  ఆవిడ భద్రకాళి అవతారం ఎత్తి శతృవులని ఎదుర్కొన్న వైనం..
  అడవి నుండి నిస్సహాయ స్థితిలో, భయ భ్రాంతులతో వచ్చిన 
తనని ఆదుకున్న బాలవ్వ..
  ఈ స్త్రీ మూర్తుల ఋణం తీర్చుకోగలగడం ఎవరికైనా తరమా!
  మాధవుడు బృందం వెళ్లేసరికే దహన సంస్కారాలైపోయాయి.
  “ఐపోయింది అన్నగారూ! ఇంక ఆపద్దని సెలవిచ్చారు పెద్దలు. 
మీరు ఎప్పటికి రాగలరో తెలియదు కదా..” జగన్నాధుడు 
అన్నగారిని పట్టుకుని రోదించాడు.
 “ఆవిడ ఓర్పు, ప్రేమ.. అమ్మని ఆదర్శంగా తీసుకోవాలి మనం. 
చాలా నేర్చుకోవాలి ఆవిడ జీవన శైలి నుండి.. జాతస్య మరణం 
ధృవమ్. ఆ సమయం వస్తే ఎంతటి వారైనా వెళ్లి పోవలసిందే కదా!” 
నందుడు ఓదార్చాడు తమ్ముడిని.
  పన్నెండు రోజులు ఉండి, శాస్త్రోక్తంగా కర్మ కాండలు ముగించుకుని, 
కటకం వచ్చేశారు ముగ్గురూ.
  ఆ పన్నెండు రోజులూ పూటకూళ్ల ఇల్లు మూసి వేశారు.
  
  మాధవుడు తిరిగి వచ్చే సరికి అనేక మార్పులు వచ్చాయి 
కోటలో.
  కపిలేంద్రుడు వంగదేశ దండయాత్రకి వెళ్లాడు. అతడితో కొందరు 
కుమారులు వెళ్లారు. అదే అదనుగా, చారుల సమాచారంతో.. 
దక్షిణం నుంచి రెడ్డిరాజులు దండెత్తారు.
  కోటకీ, రాజ్యానికీ రక్షగా ఉంచిన హంవీరదేవుడు వారికి 
గుణపాఠం చెప్పటానికి బయల్దేర వలసి వచ్చింది.. సగం గజబలం, 
అశ్వబలం ఉంచే వెళ్లాడు రాజు.
  తప్పని పరిస్థితులలో, చిన్నవాడైనా, పురుషోత్తమ దేవుడిమీద 
రాజ్య భారం పడింది. విశ్వాస పాత్రులయిన దండనాయకులు 
ఇద్దరున్నారు.
  మాధవుని చూడగానే పురుషోత్తమునికి కొండంత బలం 
వచ్చినట్లయింది. అక్కడ వదిలి వెళ్లిన గజబలం అంతా 
మాధవుడు తరలించినదే. అతడి చే సైగకి పరుగులు 
పెడతాయి ఆ గజాలు.
  రోజూ గజ, అశ్వ దళాల చేత కవాతులు చేయించడం, 
శిక్షణ పర్యవేక్షించడం.. అంతే కాదు, వంటశాలలో కూడా 
అజమాయిషీ, మాధవునికి బాధ్యతలు చాలా అప్పగించాడు 
రాకుమారుడు.
  “అందుకే పెద్ద వారితో స్నేహం వద్దన్నాను కన్నయ్యా! 
పట్టుమని పదహారేళ్లు నిండాయో లేదో.. ఇప్పటినుంచీ కోటలో 
పనులా?”గౌతమి నిష్ఠూరంగా అంది.
  “అమ్మా! నీ భయం నాకర్ధమయింది. కానీ.. యువకులకి 
తప్పని పనులమ్మా ఇవి. నా వయసు వాళ్లు యుద్ధానికే వెళ్లారు. 
నేనింకా రాకుమారుని స్నేహితుడుని కనుక, అతని భారాన్ని 
పంచుకుంటూ ఉండగలుగు తున్నాను. రోజూ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడ గలుగుతున్నాను.” ఓదార్చాడు తల్లిని.
  “కోటని ఎవరైనా ముట్టడిస్తే..”
  “ఏమవుతుందమ్మా? రాకుమారునితో యుద్దంలో పాల్గొంటాను. 
అభి మన్యుడు, బాల చంద్రుడు నా వయసులోనే యుద్ధం చేశారు.”
  చటుక్కున వచ్చి మాధవుని నోటి మీద చేతులుంచింది గౌతమి.
  “అశుభం పలుకకు నాయనా!”
  “అటులనే అమ్మా! అయినా నన్ను రెండు కారణాల వలన 
రణానికి పంపరు. మీకు చింత వలదు. ఒకటి.. బ్రాహ్మణ బాలురు 
పిరికి వారని కోటలో వారి అభి ప్రాయం. మరొకటి.. మన వృత్తి. 
పదుగురికీ ఆహారం సమ కూర్చుతాము కదా! అది లేకున్న 
జీవనమే ఉండదు.. ముందు భుక్తి.. పిదపనే రాజ్యం.” 
నవ్వుతూ అన్నాడు మాధవుడు.
  “చిన్న వాడవైనా ఎంత అవగాహనరా నీకు..” సీతమ్మ 
మెచ్చుకుంది.
  “అమ్మమ్మా! ఆకలి.. ముందుగా నా బొజ్జని మెచ్చుకో.. 
ఆ తరువాత నన్ను మెచ్చుదువు..” మాధవుడు గోముగా అడిగాడు.
  “రా నాయనా! ఎప్పుడు తిన్నావో ఏమో. నీ కిష్టమైన 
శాకమే ఇవేళ.. వంకాయ అల్లం వేసి చేశాను.” సీతమ్మ 
వెనుకింటికి దారి తీసింది.
                                      ………………


  ఎవరి కెన్ని సమస్యలున్నా, సంతోషంతో తేలి పోతున్నా, 
దుఃఖ భారంతో కుంగి పోతున్నా.. కాలం సాగి పోతూనే ఉంటుంది.
  నాలుగు సంవత్సరాలు.. పొరుగు దేశాలతో పోరులు, తన 
సామంతరాజుల సర్దుబాట్ల మధ్య కపిలేంద్ర దేవుడు ప్రజానుకూలంగానే 
పరిపాలిస్తున్నాడు. ముఖ్యంగా పాడి పంటల అభివృద్ధిలో ప్రజల మన్ననలందుకుంటున్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది.


  క్రీ.శ. 1443- ఉత్తరాన గంగా తీరం నుండి, దక్షిణాన విశాఖ పట్టణం.. 
కోరుకొండ వరకూ రాజ్య విస్తరణ సాగింది.
  గురుకులం లో విద్య పూర్తి అయిందని గురువుగారు చెప్పారు.
  మాధవునికి కోటలో కొలువు ఖాయమయింది.
  రాకుమారునికి ఇష్ట సఖుడతడు..  ఇరువురూ కలిసి చేసే 
సాహిత్య చర్చ ఎంతో ప్రియమైనది మాధవునికి.
  ఒక సాయంకాలం.. మిత్రులిరువురూ, మహానది ఒడ్డున, వనంలో 
మర్రిచెట్టు కింద ఊడల ఆసనాలపై కూర్చున్నారు.
  ఇరువురూ సంధ్యా సమయంలో ఏ రాజకీయాల గురించీ 
ఆలోచించకుండా సాహిత్యం గురించే మాట్లాడుకుంటారు.
  “మిత్రమా ఎంత ఆహ్లాదంగా ఉందీ ప్రకృతి? ఏ ఆందోళనలూ 
లేకుండా హాయిగా..
ఎటువంటి ఒత్తిడులూ లేకుండా, ఉండిపోతే.. అంత కంటే 
జీవితానికింకేం కావాలి?


         సీ.    నిశ్చలమౌ నదీ నీరములన్నియు
                       నిటలాక్షుడే యోగ నిద్రను యుండ
                పక్షికూనల కూహు పాటలాగినవిగా
                       చెట్టుమీదను తల్లి చేర రాగ
                ఊడలన్నియు వంగి నీడ నందుకొనగా
                       మర్రి మురిసెగ తాను మాకు నవగ
                దూరమున నిలిచి తొణకక నగమదె
                       దృష్టి సారించెనే దీక్ష గాను


         ఆ.వె. ఈ ప్రశాంత సంధ్య నీ తటి నిర్మల
                  మానసమున ధ్యాన మాచరించ
                  నేమి పుణ్యమోను, నీ జన్మ మంతయు
                  ధన్య మయ్యె గాద తధ్యముగను.
   
  కాసేపు, చింత నంతా వదిలి ధ్యానం చేసుకోవాలనిపిస్తోంది, 
గుండె నిండుగా ఊపిరి పీల్చి.” రాకుమారుడు అర్ధ నిమీలత నేత్రాలతో 
అన్నాడు.
    
  రాకుమారునిలో ఒక దివ్య తేజస్సు ప్రవేశించినట్లు అనిపించింది 
మాధవునికి.


                    
  
         
   
   “అవశ్యం రాకుమారా! మీరు ధ్యానం చేసుకోండి. నేను కావ్య 
పఠనం చేసుకుంటాను.” మాధవుడు కొద్ది దూరంలో కూర్చుని, 
తాళ పత్రాలు విప్పాడు. రాకుమారుని మీద దృష్టి నిలుపుతూ. 
పురుషోత్తమ దేవుని రక్షణ అతడికి అప్పగించాడు మహారాజు, 
నిరంతరం కలిసే ఉంటారు కనుక. అందులో మాధవుని ప్రతిభ 
అవగతమే కపిలేంద్రునికి.
  శ్రీనాధుని కావ్యాలంటే మక్కువ మాధవునికి. ఆ మహాకవి 
ఇప్పుడెక్కడున్నారో, రాకుమారుని అడగాలి. జీవితంలో ఒక్క 
సారైనా వారిని కలవాలి అనుకుంటూ హరవిలాసం తీశాడు. 
పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రను పోలి ఉంటుంది.
  హరవిలాసం అంతా శివ భక్తుల కథలు.
  శృంగారనైషధం అనువాద కావ్యమంటారు, కానీ.. హర విలాసం, 
అందులోని కథలు శ్రీనాధుల వారి సృజననే అంటారు. 
అద్భుతమైన వర్ణనలుంటాయి, శ్రీనాధుని కావ్యాలలో.
  పఠనంలో మునిగి పోయి ఒక ఘడియ మాత్రం రాకుమారుని 
గమనించ మరచి నట్లునట్లున్నాడు.. తల ఎత్తి చూసే సరికి 
కనిపించిన దృశ్యం ఒక్క సారి మాధవుడిని అప్రమత్తుడిని చేసింది.
  ఒక్క ఉదుట్న లేచాడు.
  ఇంత మంది జనం.. రాకుమారుని చుట్టూ.. వారినే చూస్తూ..
  ఏమయింది? తాము భయపడుతున్నట్లే, సవతి సోదరులు 
కుట్ర పన్నారా? మహారాజుగారికి పురుషోత్తమదేవుడంటే 
అవ్యాజమైన ప్రేమ, వాత్సల్యమూ అని అందరికీ తెలిసిన విషయమే. 
అందువలన ఇతడి మీద వారికి మత్సరం అని విన్నాడు.
  కానీ.. అక్కడున్న జనం హాని కనిగించే వారి లాగా, సైనికుల 
లాగా లేరు.
  అడవుల్లో, పొలాల్లో పనులు చేసుకుని ఇళ్లకి తిరిగి వెళ్లే పల్లె జనం. 
తలపాగాలు చుట్టుకుని అమాయకంగా ఉన్నారు.
  తమతమ చేతుల్లో ఉన్న పనిముట్లన్నీ నేల మీద పెట్టి, 
రాకుమారుని చుట్టుముట్టి, నేల మీద కూర్చున్నారు.
  మాధవునికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
  చటుక్కున వెళ్లి రాకుమారుడి పక్కన నిలుచున్నాడు. 
అది అతని బాధ్యత. ఒరలో కత్తిని సవరించుకుని కళ్లని 
చురుకుగా తిప్పుతూ అక్కడున్న ప్రతీ ఒక్కరినీ పరిశీలిస్తున్నాడు.
  అంతా నిశ్సబ్దంగా కూర్చున్నారు. అలసిన వారి మొహాల్లో కూడా 
ప్రశాంతత..
  రాకుమారుడు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తున్నాడు. 
ఒక ఘడియ గడిచిందేమో.. నెమ్మదిగా కన్నులు తెరిచాడు. 
ఒక్క నిమేషం.. కళ్లలో ఆశ్చర్యం కదలాడింది. చిరునవ్వు 
నవ్వాడు.. గుండ్రంగా తల తిప్పి అందరినీ పరికించాడు. 
అతడి మోము ఆ సంధ్య వెలుగులో వింత కాంతిని వెదజల్లుతోంది.
  ఆ కన్నులలో ప్రశాంతత, మోములోని పవిత్రత ఎవరినైనా 
కట్టి పడేస్తాయి.
  ప్రజలలో కొద్ది కలకలం.. ఒక పెద్దాయన లేచి, తలపాగా తీసి 
చేతిలో పట్టుకున్నాడు.. “సామీ.. మీరు రాకుమారులే కదా?” తల పంకించాడు పురుషోత్తముడు.
  వెంటనే అందరూ లేచారు.. మాధవుడు కత్తి పిడి మీద చెయ్యి వేశాడు..

                                    ………………..


                                       15వ భాగం

   హయ ప్రచార రగడ      “నల్ల సామి వచ్చి యుండు
                                      అల్ల కోట నందు యుండు
                                      మల్ల సామి మంచి గుండు
                                      కొల్ల జేసె కోతి దండు”

  ముందుగా లేచిన పెద్దాయన గట్టిగా పాడుతూ నాట్యం చెయ్యడం 
మొదలు పెట్టాడు. మిగిలిన వాళ్లు గుండ్రంగా అతని చుట్టూ తిరుగుతూ 
చప్పట్లు కొడుతూ, పాడుతూ, ఆడుతూ సందడి చేస్తున్నారు.
  పురుషోత్తమ దేవుడు, మాధవుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
  ఎక్కడ్నుంచి తెచ్చారో డప్పులు.. ఇద్దరు మోగిస్తున్నారు.
  పల్లె పదాలు.. స్వచ్ఛమైన భావాలు.
  నిష్కళ్మషమైన మందహాసాలు..
  ఒకరినొకరు కవ్వించుకుంటూ ఆడుతున్నారు.
  పెద్దాయన అన్నది, మిగిలిన వాళ్లు తిరిగి తిరిగి పలుకుతున్నారు.

              


              తురగవల్గన రగడ-

                “మడిసి బ్రోవ నిలకు వచ్చి మనుపు నొసగు సామి నీకు
                 ఒడిసి పట్టి గట్టి గాను నొదలు సేయు దేవ నీకు
 
                 వెన్న తిన్న మన్ను తిన్న వేడి వేడి బువ్వ నీకు
                 అన్ను మిన్న కంట పడ్డ యయ్యవంట కన్న నీకు

                  కుంతి మాత మధ్య సుతుని కోరి రధము నడుపు నీకు
                  ఇంతి కృష్ణ మాన మెంతొ కృపను నిజము నిల్ప నీకు

                  కఱకు కంసు దునిమి నట్టి కడిమి దొరకు వందనాలు
                  పెఱిమ గల్గు దేవ నీకు వేల వేల వందనాలు.”

  పాటలు, ఆటలు అయ్యాక సాష్టాంగ దణ్ణం పెట్టి అందరూ నిశ్శబ్దంగా 
కూర్చున్నారు.
  రాకుమారుడు మాధవుని వంక చూశాడు. తనకి కూడా ఏమీ 
తెలియట్లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు మాధవుడు.
  ముందుగా పాట మొదలు పెట్టిన పెద్దాయన్ని లేపాడు పురుషోత్తముడు.
  “ఏమిటి పెద్దాయనా ఈ హడావుడి? పూరీ జగన్నాధుడి సంబరాలేమైనా 
ఉన్నాయా? అందుకోసం నాట్యం తయారయి చూపిస్తున్నారా? పూరీ 
వెళ్తున్నారా? ధనము కావలెనా?”
  “అదేంది దొరా! ఆ జగన్నాధుడే ఇక్కడుండగా ఇంక పూరీ వెళ్లే 
పనే ముంది.”
  “జగన్నాధుడు ఇక్కడున్నాడా?” ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు.
  “వీరు పురుషోత్తమ రాకుమారుడే కదా?”
  “అవును.”
  “పురుషోత్తమ దేవుడు పూరీ జగన్నాధుని అంశ. ఆ సంగతి 
ఓఢ్ర ప్రజలందరికీ తెలుసు. వారి చిత్ర పటాలు మా అందరిళ్లకీ వచ్చాయి.”
  “ఎవరు చెప్పారు? చిత్రపటాలు ఎవరిచ్చారు?” మాధవుడికి నమ్మ 
శక్యం కావట్లేదు.
  “పూరీ సాములోరయ్యా! ఊరూరా తిరిగి చెప్తున్నారు. అప్పుడు 
అడవిలో ఏనుగులన్నీ తోకలూపుకుంటూ ఆరి వెంట వచ్చినయ్యంట కదా! 
అన్నట్లు, మీరు మాధవుల వారు కదా? కృష్ణులవారి హితుడైనోరే.. 
అర్జనుడే మీరని కూడా మాకు తెల్సు దొరా!”
  ఈ సారి మరీ సంభ్రమానికి లోనయ్యారు మిత్రులిరువురూ.
  ఏమీ చెప్పడానికి లేదు. చెప్పినా వినేట్లు లేరు.సాక్షాత్తూ పూరీ 
జగన్నాధునే చూసినంత ఆనందం లో ఉన్నారందరూ.
  చీకట్లు దట్టంగా ముసురుకుంటున్నాయి.
  పురుషోత్తముడు లేచి నిలుచున్నాడు. మాధవుని తో కలిసి 
అడుగులు వేశాడు..
  “దణ్ణాలయ్యా! మమ్ముల్ని చల్లగా చూడాల తమరు.” పెద్దాయన తో 
సహా అందరూ వంగి వంగి దండాలు పెడుతుండగా ముందుకి నడిచి 
వారి గుర్రాలని అధిరోహించారు మిత్రులిద్దరూ.
  మౌనంగా రాకుమారుడితో కోటలోపల, అంతఃపురంలో వారి అమ్మగారి 
భవనం వరకూ వెళ్లి, అక్కడ సేవకుడు గుర్రాన్ని తీసుకుని వెళ్లే వరకూ 
ఆగి,  రాకుమారుడు లోపలికి వెళ్లాక వెను తిరిగాడు మాధవుడు.
  మహానది ఒడ్డున జరిగిందంతా కలలో అయినట్లు అనిపిస్తోంది.
  ఈ రకంగా ప్రజల మధ్యకు వార్తలెలా వెళ్లాయో! ఎందుకు వెళ్లాయో.. 
ఏమీ బోధ పడలేదు.

  “ఏమయింది కన్నయ్యా?” మౌనంగా భోజనం చేస్తున్న మాధవుడిని 
అడిగింది గౌతమి.
  మాధవుడు ఇంటికి వచ్చి, స్నానం చేసి, భోజనానికి కూర్చున్నప్పుడు.. 
ఆ రోజు జరిగిన విశేషాలన్నింటినీ వివరిస్తాడు. నందుడు, గౌతమి ఎదురుగా 
మరునాటికి కావలసిన వస్తువులని ఒక దగ్గర పేరుస్తూ, ఆసక్తిగా 
వింటుంటారు.
  ఆకుకూరలు బాగు చేసుకుంటూనో, పచ్చి మిరపకాయల తొడిమలు 
తీస్తూనో, విస్తళ్లు కుడుతూనో.. ఏదో ఒక పని. వారిరువురూ ఖాళీగా ఉండటం 
గడచిన పది సంవత్సరాలలోనూ మాధవుడు చూడ లేదు.
  సీతమ్మ ఎదురుగా పీట వేసుకుని కూర్చుని కావలసినవి వడ్డిస్తుంది, 
కొసరి కొసరి.
  “ఈ రోజు ఒక వింత జరిగిందమ్మా! ఆ విషయమే ఆలోచిస్తున్నాను.” 
నది ఒడ్డున జరిగిందంతా వివరించాడు మాధవుడు.
  “ఇందులో వింతే ముంది మాధవా? ఈ సంగతి రెండు మూడు 
సంవత్సరాలుగా నడుస్తున్నదే. రాజు గారి ప్రోద్బలం తోనే ఇదంతా 
నడుస్తోందేమో నని కొందరు అనుకుంటున్నారు కూడా.” సీతమ్మ 
తేలిగ్గా అంది.
  ఏటి ఒడ్డున వార్తలు సేకరించడంలో దిట్ట సీతమ్మ.
  “కాకపోతే.. నువ్వు అర్జునుడి అవతారం అన్నది మాత్రం కొత్త వార్తే.” 
చిరునవ్వు నవ్వింది సీతమ్మ.
  “మరి ఈ సంగతి ఎవరూ చెప్పలేదేమ్మా ఇన్ని రోజులూ? రాకుమారునికి 
కూడా ఇది ఆశ్చర్యం కలిగించిన సమాచారమే!”
  “ఏ వార్తైనా అసలు వాళ్లకి ఆఖరున తెలుస్తుందన్న సామెత ఉందిగా.. 
చాలా మంది ప్రజలకి రాకుమారుడు పురుషోత్తముడంటే ఆరాధన. అదంతా 
నెమ్మదిగా, ఒక ప్రణాలికలో జరిగినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా, 
రాకుమారులందరిలోకీ పురుషోత్తముడే సౌమ్యుడు, సమర్ధుడు అంటారు.” 
నందుడు నెమ్మదిగా అన్నాడు.
 “రాకుమారుడు ఏ విధంగా స్పందిస్తున్నాడో..” సాలోచనగా 
అన్నాడు మాధవుడు.

  అదే సమయానికి పురుషోత్తమ దేవుడు తల్లిదండ్రుల ఎదురుగా 
కూర్చుని, తండ్రి చెపుతున్న విషయాలను వింటున్నాడు. బుగ్గలు 
కందగడ్డల్లా ఉన్నాయి. చాలా అసౌకర్యంగా ఉంది.
  వ్యాహ్యాళి నుంచి రాగానే, స్నానం, భోజనం చేసి, తల్లి మందిరానికి 
వచ్చాడు. కానీ.. ఏమీ చెప్ప లేకపోయాడు. తల్లిని చూస్తే యేమీ మాట్లాడ 
లేడతను.
  వాతావరణం ఆహ్లాదంగా ఉంది. గవాక్షాల తలుపులన్నీ తీసి ఉంచారు. 
మలయ మారుతం మందంగా వీస్తోంది. వెన్నెల కాంతి ప్రాసాదమంతా 
పరచుకొని ఉంది.
  రాకుమారుడు అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు.
  మహారాజుగారు వస్తున్నారనే వార్త పట్టుకుని వచ్చింది పరిచారిక.
  పురుషోత్తముని తల్లి ఆనందంగా లేచి ఎదురు వెళ్లింది. రాజుగారు అంతే 
ఆనందంగా లోనికి వచ్చి ఆసనం మీద కూర్చున్నారు.
  “కుమారులు కూడా ఇచ్చటనే ఉన్నారే? సంతోషం.” దగ్గరగా పిలిచి 
మనసారా ఆలింగనం చేసుకున్నారు కపిలేంద్రుడు.
  “కుమారుడు ఎందుకో చింతా క్రాంతుడై ఉన్నాడు.” రాణి అంది, రాజుగారి 
పక్కన కూర్చుని.
  పురుషోత్తముని ప్రశ్నార్ధకంగా చూశారు రాజుగారు.
  జరిగింది చెప్పాడు రాకుమారుడు.
  ఏకాంత మందిరంలోకి దారితీశాడు రాజు, భార్యతో.. పురుషోత్తముని 
రమ్మని సైగ చేస్తూ. ఆ మందిరంలో ఇతరులెవరికీ ప్రవేశం లేదు. పురుషోత్తముడే 
రెండు మూడు సార్ల కంటే వెళ్లలేదు.
  రాజుగారు చెప్పిందంతా విన్నాడు పురుషోత్తముడు.
  “ఇదీ సంగతి కుమారా! మీ సహోదరులందరూ యుద్ధాలలో పోల్గొని రాజ్య 
విస్తరణకు పాటు పడ్డారు.. నిజమే. కానీ వారిలో ఎవరికీ పరిపాలనా ద
క్షత లేదు. రణం వేరు, రాజ్య పాలన వేరు. చిన్ననాటి నుంచీ నిన్నే 
నాకు వారసునిగా అనుకుని నీకు ఈ విధంగా శిక్షణ నిప్పించాను. 
మిగిలిన పుత్రులని వేర్వేరు రాజ్యాలకు ‘పరీక్ష’ (ప్రతినిధి) లుగా 
నియమించడానికి నిశ్చయించాను.”
  రాణి మోము వికసించి వేవేల కాంతులతో వెలిగి పోతోంది. 
ఆవిడ పట్టుదలే పురుషోత్తముని వారసునిగా ఎన్నుకొనడానికి కారణం. 
రాజుని తన ప్రేమతో తెలివితో ఆకట్టుకున్న రాణి ఆవిడ.
  “కానీ అన్నల ఆగ్రహానికి బలైపోతానేమో తండ్రీ!”
  “సందేహం లేదు కుమారా! తప్పక వారు ఆగ్రహిస్తారు. ముఖ్యంగా 
హంవీర కుమారుడు. దక్షిణాన అతనికి మంచి పట్టు ఉంది. నాకు 
కుడి భుజంలాగే ఉండి పోరు సలిపాడు. ఇంకా సలుపుతున్నాడు. 
కృష్ణా తీరం, హంపీ విజయనగరం స్వాధీనం చేసుకోవాలి. తెలంగాణా 
కూడా మన రాజ్యంలో కలుపుకోవాలి. త్వరలో జైత్రయాత్రకి వెళ్తున్నాము. 
వంగదేశ సుల్తానులని ఓడించడ మయింది. కానీ అనుక్షణం అప్రమత్తతతో 
నుండాలి. మేమంతా దండయాత్రలు చేస్తుంటే నువ్వు రాజ్యాన్ని 
ప్రజల బాగోగుల్నీ చూడాలి.”
  “దానికేమీ అభ్యంతరం లేదు తండ్రీ.. కానీ, ప్రజలు నన్నేదో జగన్నాధుడి 
అవతారం అనుకుంటుంటే.. అంటుంటే ఇబ్బందిగా ఉంది. వారితో 
ఏ విధంగా మాట్లాడాలో అర్ధమవుట లేదు.” పురుషోత్తముడు సన్నగా 
అన్నాడు. అతని బుగ్గల ఎరుపు ఇంకా తగ్గలేదు. అసలే పచ్చని పసిమి 
ఛాయేమో.. దీపాల కాంతిలో ఎరుపు రంగు ప్రతిబింబిస్తూ.. అక్కడక్కడ కెంపులు 
పొదిగిన బంగారంలా మెరిసి పోతున్నాయి.
  “అవును.. నేనే ఆ విధంగా ప్రచారం చేయించాను. మున్ముందు ప్రజల 
అండ నీకుంటుందని. కళింగ దేశంలో జగన్నాధుడే కదా ఆరాధ్య దైవం.”
  “మీరా!” ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తముడు.
  “నేనే.. ఒక పధకం ప్రకారం కొన్ని ఏళ్లుగా చేస్తున్నాను. ఇప్పుడు 
అందరూ నమ్ముతున్నారని నువ్వు చెప్తుంటే తెలిసింది. చాలా ఆనందంగా 
ఉంది.” గర్వంగా అన్నాడు కపిలేంద్ర వర్మ.
  “ఇదంతా రాజకీయంలో ఒక భాగం కుమారా! నాకు నీ మీద 
నమ్మకం ఉంది. ఇంత శ్రమ పడి నేను విస్తరించిన ఈ సామ్రాజ్యాన్ని 
కాపాడుతావని. అందుకే.. కొందరు నమ్మకస్తులైన ఆంతరంగికుల 
సహాయంతో, నెమ్మదిగా.. ఎవరికీ అనుమానం రాకుండా చేయించాను.”
  ఇంకా పురుషోత్తముడు ఒప్పుకోనట్లు కనిపించాడు.. స్తబ్దుగా.
  ఇదే సమయం.. కుమారుని సందేహాలు తీర్చవలసిందే. భౌతికంగా, 
మానసికంగా పురుషోత్తమ కుమారుని తయారుచెయ్య వలసిన సమయం 
ఆసన్న మయింది.
  “నువ్వీ శ్లోకం ఎప్పుడూ వినలేదా? ఇది ప్రసిద్ధి చెందిన సామెత లాంటి సూక్తి..

                  “నానృషిః కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్
                   నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణుః పృధివీ పతి”
     
  ఋషి కానివాడు కావ్యం రాయలేడు. గంధర్వాంశ లేనివాడు అందంగా 
ఉండడు. దేవతాంశ లేనివాడు అన్నదానం చేయలేడు. విష్ణ్వంశ లేనివాడు 
రాజు కాలేడు. నీలో ఆ జగన్నాధుని అంశ ఉంది నాయనా! అందుకే 
నా కుమారులందరిలోనూ నిన్నే ఎన్నుకున్నాను నా వారసునిగా.” 
మహారాజు నచ్చ చెప్పారు కుమారునికి.
                                      ………………

  ఒక మాసం తిరగ కుండానే, పురుషోత్తముడు జగన్నాధుని అంశ అని 
ప్రజలు నమ్మే సంఘటన జరిగింది.
  గంగా తీరం నుంచీ కోరుకొండ వరకూ రాజ్యాన్ని విస్తరించిన కపిలేంద్ర 
దేవుడు రాజమండ్రీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 
ఆ తరువాత, కృష్ణా తీరం.. దైవం అనుకూలిస్తే కావేరి వరకూ గజపతుల
తళ్లు(దండయాత్రలు) సాగాలనేది అతని కోరిక.. ఆశయం.
  పురుషోత్తముడు తక్క మిగిలిన కుమారులందరూ, నాలుగు దిక్కులా 
సామంత రాజుల వద్ద నుంచి కప్పాలు వసూలుకై వెళ్లారు. అధికారులకి 
ఏమైనా సమస్యలెదురైతే పరిష్కరించడానికి.
  హం వీర కుమారుడు, తన భార్యా పిల్లలతో దక్షిణాన, కోరుకొండ 
దగ్గరే ఉంటున్నాడు.. రెడ్డి రాజుల నుంచి దాడి రాకుండా చూస్తూ.. వీలైతే 
వారిని ఓడించి, రాజ్యాన్ని కబళించడానికి యత్నాలు చేస్తూ..
  ఒక రోజు.. తూరుపు తీరం నుంచి విపరీతమైన గాలులు వీచ సాగాయి. 
కటకం లో ప్రజలంతా తలుపులు వేసుకుని ఇళ్లల్లో కూర్చున్నారు. పశువులు 
భీకరంగా అరవ సాగాయి. కొట్టాల్లో కప్పిన ఆకులన్నీ ఎగిరి విష్ణు చక్రాల్లా 
ఎగర సాగాయి గాల్లో.
  పొలాల్లో, అడవుల్లో పనిచేసే వారు అఘ మేఘాల మీద తమ నెలవులకి 
వెళ్లిపోయారు. బేహారీలు తమ కొట్లు కట్టేసి పరుగు పరుగున తమ భవనాలు 
చేరుకున్నారు.
  బట్టలు, సామాన్లు..  సరుకులన్నీ తడిసి ముద్దవడం ఖాయం.. తగిన 
రక్షణ కల్పించక పోతే.
  ఆకాశం అంతా నల్లని కారు మబ్బుతో కమ్ముకు పోయింది.
  పట్టపగలే చీకటి ప్రవేశించింది.
  పశువులకి తగిన ఆహారం సమకూర్చి, కొట్టాలలో కట్టేశారు. అన్నీ 
అస్థిమితంగా రకరకాలుగా అరుస్తున్నాయి. పక్షులన్నీ.. ఎక్కడికెళ్లి పోయాయా.. 
మాయం ఆయిపోయాయి.
  ప్రకృతి విలయ తాండవానికి సమస్త ప్రాణులూ తయారయినట్లుంది.

                   
                
  పూరి గుడిసెల్లో ఉండే పాటక జనం.. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, 
ఇంట్లో ఉండాలో, బైటికెళ్లాలో తెలియక అల్లాడి పోతున్నారు.
  అనుకున్నట్లుగానే.. కొద్ది ఘడియల్లో తుఫాను, ప్రారంభం అయింది. 
గాలులతో పాటుగా కుండపోత వర్షం..
  కన్ను మూసి తెరిచే లోగా, వేళ్లతో సహా చెట్లు లేచి వాలి పోయాయి.
  
  మూడు రోజులు ఆగకుండా కురుస్తూనే ఉంది. గాలుల వడి తగ్గినా, ఆ జడి 
వానకి కటకం చుట్టూ ఐదారు కోసుల దూరం వరకూ.. అన్ని పల్లెలూ ఊడ్చి 
పెట్టుకు పోయాయి.
  పంటలన్నీ కోతలై పోయి, కుప్పలు పోశారు. అన్నీ .. ధాన్యాలు, కందులు,
పెసలు.. అన్నీ కొట్టుకు పోయాయి. ఇంకా కంకులు కోసిన చెట్లు అలాగే ఉన్నాయి.
  తుఫాను తగ్గాక ప్రజలు ఇళ్లలోంచి బైటికొచ్చి చూస్తే ఏముంది? విధ్వంసం..
  పొయ్యిలు వెలిగిన వాళ్ల ఇళ్లల్లో వెలిగాయి.. లేని వాళ్లు గంజి కూడా 
తాగలేని స్థితి.
  పశువులు కొట్టుకుపోయాయి, కొట్టాలతో సహా! నది ఒడ్డున ఉన్న పూరి 
గుడిసెలన్నీ తేలి పోయాయి. అందులో ఉన్న మనుషుల సంగతి 
అనుకునేదేముంది? సర్వ నాశనం.
  పోయిన వారు పోగా ఉన్న వారి సంగతేమిటి?
  తుఫాను సమయంలో పిట్ట కూడా బైటి కొచ్చే అవకాశం లేదు.
  ఆ తరువాత పరిస్థితేమిటి? ఆ జగన్నాధుడే ఆదుకోవాలి..
                                       ……………….

16వ భాగం


  ఎప్పుడెప్పుడు ప్రకృతి కరుణిస్తుందా అని ఎదురు చూస్తున్న 
మాధవుడు, పురుషోత్తమ దేవుడు కోటలోనుంచి బయటికి 
వచ్చారు.
  అంతా భీభత్సం..
  తుఫాను వచ్చే ముందు, కోటలో ఉండిపోయిన మాధవునికి, 
తన ఇంటికి వెళ్లే అవకాశమే లేకపోయింది.
  ఆందోళనగా  ఇంటి దారి పట్టబోయాడు. రాకుమారుడు అచ్చటే 
నిలబడి చూస్తున్నాడు.
  
                   


   ఎక్కడుంది దారి? బాటంతా నేలకొరిగిన చెట్లతో, కొమ్మలతో 
నిండి పోయింది.
   భయానకంగా ఉంది.. అడుగు వేసేట్లు లేదు.
   వెనుతిరిగి, పశువుల శాలల్లో ఉండిపోయిన పనివారిని, సైనికులను 
కత్తులతో, గొడ్డళ్లతో, గడ్డపారల్తో రమ్మని పిల్చుకొచ్చారిద్దరూ.
  కోటలో చెట్లన్నీ బాటలకి చాలా దూరంలో ఉన్నాయి. అలాగే.. 
గజ శాలలు, అశ్వ శాలలు, పాడి పశువుల కొట్టాలు.. అన్నీ దిట్టంగా 
గట్టిగా కట్టినవే. చెక్కు చెదరలేదు. లోపల ఉన్న సేవకుల ఇళ్లు 
కూడా బాగానే ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసినా కూడా.
  అందరూ చకచకా బాట మీదున్న చెట్లని తొలగించారు. 
రాకుమారుడు దగ్గరుండి పనులు చేయిస్తున్నాడు. వాన తగ్గగానే, 
ప్రజలంతా బయటికి వచ్చేసి, బాటలనీ, ఇంటి కప్పులనీ బాగు 
చేసుకునే పనిలో పడ్డారు.
  దారులన్నీ నీటి మయం. ఆనీటిలోనే తేలుతూ పోతున్నాయి, 
రకరకాల పాములు, తేళ్లు, ఇతర క్రిమి కీటకాలు.
  మాధవుని ఇంటివరకూ నడిచే త్రోవ తయారయింది. పరుగు 
పరుగున మాధవుడు ఇంటికి చేరాడు.
  కొంతకో కొంత నయం.. ‘కళింగం’ వసతి గృహం తుఫాను 
ధాటికి తట్టుకుని నిలబడింది. సంభారాలన్నీ గట్టిగా కట్టిన 
కొట్ల గదుల్లో దాస్తారు కనుక అవి కూడా బానే ఉన్నాయి.
  మాధవుని చూడగానే నందుడు, గౌతమీ విప్పారిన మొహాల్తో 
ఎదురొచ్చారు.
సీతమ్మ.. ఎక్కడుందో, ఆరబెట్టుకుంటున్న జుట్టు ముడి వేసుకుంటూ 
పరుగున వచ్చింది.
  “అమ్మయ్య. ఎక్కడ చిక్కుపడి పోయావా నని హడిలి 
పోయాము కన్నయ్యా! ఇప్పుడే నందుడిని కోటకి వెళ్లమని 
అడుగుదామనుకుంటున్నాను.” సీతమ్మ మాట నోటిలోనే 
ఉంది.. వీధిలో కలకలం వినిపించింది.
  అందరూ ప్రహరీ దాటి బైటికెళ్లారు. దాదాపు యాభై మంది 
ఉంటారు.  పెద్దలు, పిన్నలు, పసి వారు.. అందరికీ కళ్లల్లో 
ఉన్నాయి ప్రాణాలు. చింపిరి జుట్లు. తడీ పొడి వస్త్రాలు.. 
చిన్న పిల్లలు కొందరు నోట్లో వేళ్లు పెట్టుకుని చీకుతున్నారు.
  కొందరు చేతుల్లో మట్టి చిప్పలు పట్టుకుని నిలుచున్నారు.
  “సామీ! మీరే రచ్చించాలి. తిండి తిని మూడు రోజులయింది. 
చూరులోంచి పడిన వాన నీళ్లు తప్ప లోనికేం పోలేదు. 
ఇంత ముద్దెట్టి బతికించండయ్యా!” నందుడి, మాధవుడి 
కాళ్ల మీద పడిపోయారు అందరూ.
  పూటకూళ్ల ఇంట్లో తిండి దొరుకుతుందని తెలుసు. 
వారున్న పల్లె రెండు కోసులుంటుంది.  అడ్డదిడ్డంగా పడిన చెట్లనీ, 
అడ్డంకులనీ తొలగించుకుని ఏ విధంగా రాగలిగారో.. ఆశ్చర్యమే.
  ఆకలి.. ఆహారం దొరుకుతుందనే ఆరాటం ఎక్కడలేని శక్తినీ 
ఇస్తుంది.
  నందుడి ఇంటి వారందరికీ కడుపు ద్రవించుకు పోయింది.
  ఇంటిలోని వస్తువులు ఎన్ని నాళ్లు వస్తాయో.. ఆ జగన్నాధునికే 
ఎరుక. ముందు ఎదురుగా ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చడం 
మానవ ధర్మం.
  అందరినీ, లోనికి రమ్మని పిలిచారు.
  ముందున్న సావడిలో కూర్చోపెట్టి,  దాహం తీరడానికి 
వారు తెచ్చుకున్న చిప్పల్లో కాసిని నీళ్లు పోశారు.
  వసతి గృహం కనుక అన్ని రకాల ఆటుపోట్లకీ తట్టుకునేట్లుగా 
నిర్మించాడు నందుడు. సంభారాలన్నీ ఎప్పటికప్పుడు 
సరుదుతూ, పురుగు పుట్ర లేకుండా చూసుకుంటూ ఉంటారు.
  వంట చెరకు కూడా జల్లు కురవకుండా కట్టిన సావళ్లలో 
పేర్చి ఉంచుతారు.
  బైటంతా ఆకాశం.. ఒక్క మేఘం కూడా లేకుండా తేటగా 
స్వచ్ఛంగా ఉంది. వెనుక వైపు పెరడంతా బాగుచేశారు, 
ఇంట్లోనే ఉండే పనివారు.

  మూడు రాళ్ల పొయ్యిలు మూడు వెలిగించాడు నందుడు. 
రెండు గుండిగల్లో ఎసరు పెట్టాడు మాధవుడు. వీశ చింతకాయలు 
కడిగి, మరుగు నీళ్లలో నానబెట్టింది సీతమ్మ. కిందికొరిగిన 
కరివేపాకు చెట్టునుంచి ఆకులన్నీ దూసి కడిగి ఆరబెట్టింది గౌతమి.
  వీధి వసారాలో ఉన్న జనాలని కదిలించ దల్చుకోలేదు 
ఎవరూ. వాళ్లందరూ శోషొచ్చినట్టు పడిపోయున్నారు.
  సరిగ్గా రెండు ఘడియల్లో వేడివేడి అన్నం వార్చి, గంజిని దాచింది 
సీతమ్మ. చింతకాయ చారు కాచింది గౌతమి గుండిగ నిండా. 
కరివేపాకు, చింతకాయ పిప్పి, ఉప్పు, బెల్లం, మిరపకాయలు 
రోట్లో నూరాడు మాధవుడు. అందులో ఘుమఘుమలాడే 
పోపు వేయించాడు నందుడు.
  నలుగురూ తలా చెయ్యీ వేసి, వంటచేసేశారు. పాలేళ్లిద్దరూ, 
వసారా తుడిచి, రాలి పడిన అరిటాకుల్లోంచి మంచివేరి పరిచారు.
  కమ్మని పోపు వాసనకి, నోరూరిపోతూ లేచి సందు చివరినుంచి 
తొంగి చూస్తున్నారు అభ్యాగతులు.
  బావి దగ్గరికి వెళ్లి, చేతులు కాళ్లు, నోరు శుభ్రంగా కడుగుకొమ్మని 
చెప్పారు పాలేళ్లు. ఒకరి తరువాత ఒకరు, శక్తి తెచ్చుకుని 
ఒడలు శుభ్ర పరచుకుని తమ స్థానాల్లో కూర్చున్నారు.
  మాధవుడు, నందుడు వడ్డన మొదలు పెట్టారు. మట్టి పిడతల్లో 
గౌతమి మంచి నీరు పోసింది.
  వడ్డించే వాళ్లు వడ్డిస్తూనేన్నారు.. అలా తింటూనే ఉన్నారు 
తినే వాళ్లు. చివరికి వేళ్లకి అంటుకున్న మెతుకులని నాక్కుంటూ 
లేచారు ఒక్కొక్కరూ.
  గౌతమికి కన్నీరాగలేదు వారిని చూస్తుంటే. ఇప్పుడు సరే.. 
మహా ఐతే మరో నాలుగైదు రోజులు తాము పెట్టగలరు. ఆ తరువాత?
  తుఫాను దాడి నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు, 
మాసాలు పడుతుంది? మళ్లీ పైరు లేవాలి, పుయ్యాలి, 
కాయాలి. ఎప్పటికి..
  రాజుగారే తలుచుకోవాలి..
                                      ………………


  రాజుగారు తలుచుకున్నారు..
  తుఫాను తగ్గిన రోజే.. కటకం ప్రజంతా కోట ముందుకి 
వచ్చేశారు.. ధనవంతులు, వ్యాపారస్థులు తప్ప..
  కాపలా దారులంతా కోటలోనికి వెళ్లి రాజుగారి చెవిని వేశారు. 
కపిలేంద్రదేవుడు, పురుషోత్తమునికి అప్పగించాడు కార్యాన్ని.
  రాకుమారుడు గజం మీద కోట బైటికి వచ్చి, అందరికీ 
అభయ మిచ్చాడు.
  
                సీ.     పెనుతుఫానున చిక్కి వీటిపట్టు ప్రజలు
                              భయముతో నటునిటూ పరుగు లిడగ
                        చెట్లుచేమలు నేల చేరి యొరిగి యుండ
                              బాటలన్నియు మూత పడెను గాద
                        నిలువ నీడ కనక నీరు కారు కొనుచు
                              దిక్కు తోచక నెంతొ దీను లైరి
                         అచట నిలిచె నతడచ్యుతుడే యన
                              సకల జనులకును శరణు నొసగ


                ఆ.వె. నృపుని యనుమతి గొని నీరసించిన ప్రజన్
                          ఆర్తి నంత బాపి యాదు కొనగ
                          వంట శాలలందు పంచలందునకూడ
                          ఆశ్రయంబొసగెను యాజ మిచ్చె.


  అంతే కాదు, బెహారీలందరినీ సమావేశ పరచాడు. కోటలోని 
ధనాగారంలోనుంచి వెచ్చాలకి ధనం యిస్తానని వాగ్దానం చేశాడు.
  అందరికీ దినవెచ్చాలిప్పించడమే కాదు.. వారి ఇళ్లు బాగు 
అయే వరకూ కోటలోనే ఉండమన్నాడు.
  కోటలో ఒక పట్టణం పట్టేంత జాగా ఉంది.
  యుద్ధ ప్రాతిపదికలో ఇళ్లన్నీ బాగుచేయించాడు పురుషోత్తముడు. 
అతనికి తోడు మాధవుడు.
  మూడు నెలలలో నాము పంట వచ్చేసింది నవనవలాడుతూ.
  రెట్టింపు ఉత్సాహంతో పనుల్లో పడ్డారు ప్రజలంతా! తుఫాను 
వలన నష్టం ఎంతయినా.. వందల్లో మనుషులు, వేలల్లో పశువులు 
పోయినా.. కోలుకోవడమనేది చాలా ముఖ్యమైనది, 
బ్రతికున్న వారికి. పోయిన వారినెవరూ తీసుకు రాలేరు కదా!
  ఆ సమయంలో రాకుమారుడు, మాధవుడు చేసిన సహాయాలు 
ఎనలేనివి.
  అదిగో.. అప్పటి నుంచీ, పురుషోత్తముడు, జగన్నాధుని 
అవతారమని ఇంకా.. ఇంకా ప్రచారమయిపోయింది.
                                         ………………


  ఆరుమాసాలయింది..
  సంధ్యా సమయంలో మహానదీ తీరాన విహరిస్తూ, తాము 
ఎప్పుడూ కూర్చునే చెట్టు ఊడల్లో కూర్చుని, పురుషోత్తమ దేవ, 
మాధవులు హర్షుని నైషధానికీ, శ్రీనాధుని శృంగార నైషధానికీ గల 
సామ్యాలని చర్చిస్తున్నారు.
  “గాఢ పాకంబైన హర్ష నైషధ కావ్యాన్ని ఆంధ్ర భాషలో 
కల్పించానని శ్రీనాధుడు గర్వంగా చెప్పుకుంటాడు. శృంగార నైషధం 
శ్రీనాధుల వారి కావ్యాలలో కెల్లా గొప్పదని నా ఉద్దేశం మిత్రమా!” 
మాధవుడు అన్నాడు.. నైషధంలో నుండి తెచ్చిన కొన్ని 
తాళ పత్రాలను తీసి చూస్తూ.
  “నిజమే. కానీ, కొన్ని ఆయువు పట్టు శ్లోకాలను చివర్లో 
డు,ము,వు,లు కలిపి, యథాతథంగా తెలుగులోకి దించారని 
సంస్కృత పండితులన్నారుట. పైగా నీ డుమువులు 
నువ్వు తీసుకుని మా నైషధాన్ని మాకిచ్చేయ మన్నారని 
కూడా అంటారు.” పురుషోత్తముడు చెప్పాడు.
  “సంస్కృత పదాలను అధికంగా వాడిన మాట నిజమే. అయితే.. 
‘నీకంటికి పేలగింజయుం పెద్దయ్యెనే’, ‘చేదు తిన్న విధము’, 
‘ఐదు పది చేయు’ వంటి తెలుగు పలుకు బడులు కూడా 
బాగా చూపించారు శ్రీనాధుల వారు” మాధవుడు చెప్తుంటే 
తల ఊపాడు పురుషోత్తముడు.. అవునన్నట్లుగా.
  “కవిత్రయం తరువాత అంతటి పేరునూ శ్రీనాధునికే అంద
జేశారు సాహితీ ప్రియులు.వారి చాటువులు ముఖ్యంగా..” 
రాకుమారుడు ఆపేశాడు సగంలోనే.. గుర్రం వస్తున్న చప్పుడు విని.
  “మిత్రమా! శ్రీనాధ కవిని చూడాలని ఉంది నాకు. ఇది వరకు 
ఒకసారి అడుగుతే వారు ఎచ్చట ఉన్నారో తెలియదన్నారు 
మీరు. ఈ రాచ కార్యాల నుండి కొద్ది విరామం తీసుకుని దేశాటనం 
చేసి రావాలని ఉంది.” మాధవుడు తల పక్కకి తిప్పి వ
స్తున్నదెవరా అని చూస్తూ అన్నాడు.
  కోటలోనుండి వార్తా హరుడు..
  “ప్రభూ! మహారాజుగారు తమరిని వీలయినంత త్వరగా 
కలవాలని మీతో చెప్పమన్నారు. మాధవుల వారిని కూడా 
తీసుకుని రమ్మన్నారు.”
  వెంటనే మిత్రులిరువురూ తమతమ అశ్వాలని అధిరోహించి 
కోటలోనికి బయలుదేరారు.
  అశ్వశాలలో అశ్వాలని అప్పజెప్పి ప్రాసాదం లోనికి నడుస్తుండగా 
ఎదురు పడింది.. ఒక అందాల రాశి.
  మాధవుడు కళ్లార్పడం మరచి పోయాడు.
  ఉద్యానవనంలో.. పొదరిళ్ల మధ్య నుండి వడివడిగా 
నడిచి వస్తూ తడబడుతూ ఒక మెరుపు తీగ.. మాధవుడు కొద్ది 
సంవత్సరాల క్రితం మేనాలో చూసి, చెంగల్వ పువ్వందించిన 
బాలిక. నిండు యవ్వనంలో! నిగనిగని మోములో మాత్రం 
అదే పసి తనం. బెదురు చూపులు చూస్తూ పొద వెనక 
నక్క బోయి, మిత్రులిరువురినీ చూసి ఆగి పోయింది.
   వెనుకగా నలుగురు చెలియలు..
  “ఆ.. దొరికి పోయారుగా చెలీ..” అంటూ.
  అందరూ కదలకుండా నిలుచుండిపోయారు, ఆగంతకులను చూసి.
  భయం లేదన్నట్లుగా చిరునవ్వుతో అచటి నుండి కదిలాడు 
పురుషోత్తముడు.
  వెనుకనే మాధవుడు, వెను తిరిగి చూసుకుంటూ!
  
  “మా సోదరి కాదంబరీ దేవి మిత్రమా! అంటే మేము ఏక గర్భ 
సహోదరులం కాదు.. తండ్రిగారి మూడవ భార్య పుత్రిక. మా తల్లిగారు 
రెండవ భార్య. ఐతే.. మాతో చాలా ఆప్యాయంగా ఉంటుంది 
రాకుమారి. నాలుగు భాషల్లో నిష్ణాతురాలు.” రాకుమారుడు, 
మాధవుడికి చెప్పాడు.
  రాకుమారి? ఇంకేముంది.. ఆశ వదులు కోవలసిందే. 
పలుకరించడానికి కూడా లేదు. కొంచెం నిరాశగా, నిశ్సబ్దంగా 
పురుషోత్తముడి వెనక నడిచాడు మాధవుడు.
  కానీ మనసు మాత్రం ఆ జవ్వని తో వెళ్లిపోయింది.
  “తండ్రిగారు వరునికోసం వెతుకుతున్నారు. మా సోదరికి 
సాటి అయిన వీరుడు, విద్యావంతుడు దొరకడం కష్టమే. 
పొరుగు దేశాల రాకుమారులలో వారికి నచ్చిన వారు 
ఇప్పటి వరకూ దొరక లేదు. ఎక్కడున్నాడో గజపతుల 
అల్లుడు..” రాకుమారుడు కించిత్తు గర్వంగా అన్నాడు.
  నిజమే.. గజపతుల సామర్ధ్యం అప్పటికే నలుదిశలా 
వ్యాపించింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ స్వచ్ఛందంగా 
సామ్రాజ్యం లో కలిసి పోయాయి.
  కనుల ముందొక్క సారి కాదంబరి నిలిచింది మాధవునికి..


             తే.గీ.   చదువు లందున గీర్వాణి సత్యముగను
                       సిరుల యందున నెలతియే సిరియె కాద
                       పొందికనె తాను సీతయై పొసగు చూడ
                       కాంతి వలె మెరసె నిలను కలయు కాదు.


  కానీ, రాకుమారెక్కడ.. తానెక్కడ? పూటకూళ్ల ఇంటికి 
రాకుమారిని పంపుతారా కోడలిగా? పైగా తాము బ్రాహ్మణులు, 
వారు క్షత్రియులు.. నిట్టూర్చాడు మాధవుడు. ఐతే చంచల 
చిత్తం చెప్పిన మాట వినదే!
  ఆలోచనల మధ్య రాకుమారుని వెంట వెళ్తూ, మహారాజుగారి 
ప్రాసాదంలోకి వచ్చినట్లు చూసుకోలేదు మాధవుడు. 
పురుషోత్తమ దేవునికి కొద్దిగా వెనుక నిలుచుని, రాకుమారునితో 
పాటుగా అభివాదం చేశాడు.
  కపిలేంద్ర దేవుడు మహారాజయ్యాక, అంత దగ్గరగా చూడటం 
అదే ప్రధమం.
  చిన్నతనంలో.. కోటలోనికి, సైనికులతో వెళ్తుండగా, 
‘వీరేనా మహారాజుగారు.’ అని నందుడిని అడగడం గుర్తుకొచ్చింది.
  కొద్దిగా వయసు ప్రభావం కనిపిస్తున్నా.. అదే పొంకం 
మహరాజులో..
  “ఇతడే కదా నీ అనుంగు మిత్రుడు మాధవుడు, పురుషోత్తమా?”
  “అవును తండ్రిగారూ..”
  “మీరిరువురూ కాంచీ పురం వెళ్లి రావాలి. అక్కడి ప్రభువును కలిసి, 
సంధి సందేశాన్నివ్వాలి.” మహారాజు, ఆదేశ మిచ్చారు.
  “మరి జగన్నాధుని ఉత్సవాలు?” సన్నగా అన్నాడు మాధవుడు.
  ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే పూరీ జగన్నాధుని రధ యాత్రకి 
రాజ వంశస్థులు ఉండి తీరాలి. పురుషోత్తముడు యువకుడయ్యాక 
అతడి చేత కూడా జగన్నాధునికి సేవ చేయిస్తున్నాడు రాజు.
  ప్రజలు కూడా వేల సంఖ్యలో వచ్చి, జగన్నాధుని అంశ 
అయిన రాకుమారుని చూడ డానికి వస్తారు.
  “ఉత్సవాలు ఇంకా రెండు మాసాల తరువాత. అప్పటికి 
వచ్చెయ్యవచ్చు.. వెంటనే బయలు దేరండి.” రాజుగారు లేచి 
లోనికి వెళ్లి పోయారు.

                                       ………………....







1 వ్యాఖ్యలు:

gopi pinnali said...

నిజంగా ఆసక్తి కరముగా సాగుతున్నది. అభివందనాలు. మధ్య మధ్య పద్యాలు కూడా జొప్పించడం వలన నా వంటి పద్యాసక్తులుకు చక్కని విందే కదా తల్లీ.