Saturday, December 31, 2016

Posted by Mantha Bhanumathi on Saturday, December 31, 2016 with No comments

చాలా రోజుల తరువాత..
ఈ నవంబర్ లో లక్షద్వీపాలు, కేరళ టూర్ వెళ్లాం. ఆ విశేషాలు..

మా సముద్రా విహార యాత్ర--
  1. మొదటి రోజు.
మొత్తం ఆరు జంటలు. అందరూ స్వీట్ సెవెన్టీస్ వాళ్లే.
భాను- రావ్, విజయా-కుమార్(మా సమ్మందీలు), షానజ్-షరీఫ్, లలిత-ఉన్ని, గిరా-శానీ, దీప-షాబ్రియా. మేము తప్ప అందరూ ఎయిర్ ఫోర్స్/నావీ యోధులు.
రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరేప్పటికి ఒంటిగంటయింది. వెళ్తూనే తెచ్చుకున్న లంచ్ తినేశాం. మా అందరిలోకీ ఎక్కువ అల్లరి చేసే షానజ్ రాలేదు ఇంకా. అందరం ఆందోళన.. చివరికి తలుపు మూసే సమయంలో వచ్చారు. ఏంటయ్యా అంటే వాళ్లబ్బాయి దింపుతానన్నాడుట, ఎప్పటికీ ఫోన్లోంచి బైటికి రాడు. మొత్తానికి దిగేప్పుడు కలిశాం.
Airport కి మేము కుదుర్చుకున్న వాన్ వచ్చింది. చక్కని ప్రకృతిని పరికిస్తూ హోటల్ కొచ్చి పడ్డాం. ఇక్కడ భాషా సమస్య. ఎవరికి వాళ్లు వాళ్ల మాతృభాష తప్ప వేరే భాషలో మాట్లాడుతో మళయాళంలా  గొప్ప ఫీలైపోతున్నారు. ఉ|| కుమార్ తెలుగులో, రావ్ హిందీలో, గిరా అరవంలో.. అసలు మళయాళీ మాతృభాషైన ఉన్ని మాత్రం చిదానంద పురుషుడిలా కూర్చున్నాడు. మొత్తానికి హోటలు వాణ్ణి, వీలైనంత గాభరా పరచి, డిన్నర్ చెప్పి, కాఫీలు తాగి గదిలోకి వచ్చాం.
ఇంక భోజనం.. చపాతీ, కూరగాయల కలగూర కారం.. తినేసి, గదిలోకొచ్చి పడుకున్నాం.

2. పొద్దున్నే స్నాన పానాదులు ముగించి బ్రేక్ ఫాస్ట్ (ఇడ్లి, అప్పం, ఇదియప్పం.. చట్నీ & పొటేటో కూర).. ఫరవాలే, అంత ఖారం లేదు.. కానిచ్చి, తొమ్మిదికల్లా బస్ లో కూచున్నాం. బస్ మెట్టు చాలా ఎత్తు, కష్టపడి ఎక్కాము. నేనే కాదు మా లేడీస్ అందరూ.. కాళ్ల ప్రాబ్లంస్.
తమాషాగా ఉందిలే.. ఒకరి కొకరు చేయందించుకుంటూ, చిన్న పిల్లల్లా ఫీలైపోతూ. పదేళ్ల క్రితం వస్తే బాగుండేదేమో, కానీ ఈ మజా రాదు కదా!  
కొన్ని వీధులు తిరిగి, వేరే పీర్ దగ్గరికి వెళ్లి, మొత్తానికి మా సముద్రా టూర్ ఆఫీసుకి వచ్చాం. సామానంతా చెకింగి, బోర్డింగ్ పాస్ టేకింగ్.. మళ్లీ వింకో బస్ ఎక్కి మా షిప్ దగ్గికి వచ్చాం. అక్కడ తాడు నిచ్చెన.. ఎక్కుతే కదిలి పోతూ ఉంటుంది, అలాగే కష్టపడి ఎక్కి, షిప్ మీదికి చేరాం.
బంక్ బెడ్లున్న గది.. గది బాగుంది. కానీ పై బెడ్ ఎక్కడమే.. ఒక నిచ్చెనుంది. ఇదో అనుభవం.. పాపం ఏమండీనే ఎక్కాలి.. ఒక సారి ఎక్కి కాసేపు పడుక్కుని..
కష్టపడి దిగారు.
లంచ్.. బిరియానీ,పెరుగు పచ్చడి, ఊరగాయ, అప్పడాలు, పుచ్చకాయ ముక్కలు. అంతే. రుచిగానే ఉంది.
కాసేపు కునుకు తీద్దామనుకున్నాము. కష్టపడి బంకర్ యెక్కారు కూడా. అంతలో విజయ పిలుపు.. కార్డ్స్ ఆడుతున్నాం. వస్తారా అని.
సరే.. కునుకు ఇంటికెళ్లాక తియ్యచ్చు, ఇక్కడ అందరితో ఆనందించడానికే వచ్చాం అనుకుని లటక్కిన లేచి బైటికెళ్లాం. ఇక్కడ రిక్రియేషన్ హాలుంది. అందులో రెండు టివీలు, సినిమాహాల్లో ఉన్నట్లు కుర్చీలు కాకుండా రెండు పక్కలా గుండ్రటి బల్లలు వాటి చుట్టూ కుర్చీలు ఉన్నాయి. కుమార్ వాళ్లు బ్రిడ్జ్ మొదలెట్టారు. మేం రమ్మీ.. 21 ముక్కలతో ఆడటం ఇదే మొదటిసారి.. ఏంటో తికమకగా ఉంది. ముందర అన్ని ముక్కలు పట్టుకోడం రాలా.. ఎలాగో రెండాటలు ముగించే సరిగి టూర్ గురించి వివరించడానికి క్రూ సభ్యులు వచ్చి మా నాల్గో డెక్ లో ఉన్నవాళ్లని ఎసెంబుల్ అవమన్నారు, ఏమేం చేస్తామో చక్కగా చెప్పారు. అదంతా రేపట్నుంచీ నేను చెప్తా.
తరువాత డెక్ మీదికెళ్లి అస్తమించే సూర్యుడి మారే రంగులు చూస్తూ కూర్చున్నాం. ఇక్కడ 10 రూపాయలకి చక్కని కాఫీ ఇచ్చే కుట్టీ కొట్టు మా గది పక్కనే ఉంది. అది తెచ్చుకుని తాగి, రాస్తున్నా..
రాత్రి భోజనం చాలా బాగుంది.
గుడ్ నైట్.
3. మూడవరోజు..
ఆరుగంటలకి కాఫీ, ఏడు గంటలకి బ్రేక్ ఫాస్ట్.. 8 కల్లా ఓడలోంచి బైట పడాలి. ఓడ 10 కిలోమీటర్లు దూరంలో డాక్ చేశారు. అక్కడి నుంచి బోట్లలో దీవికెళ్లాలి. ఈ రోజు “మినికాయ్” అనే దీవికి తీసుకెళ్లారు. 40 ని|| పట్టింది. బోట్ అంటూ ఎక్కుతే ఫ్లోట్స్ తగిలించుకుని వెళ్లాలిసిందే.
ఓడలోంచి బోట్ లోకి ఎక్కడం పెద్ద సాహస క్రియే నా వంటి వాళ్లకి. అందరం ఇంచుమించు ఒకలాగే ఉన్నామన్నాను కదా.. కొంచెం ఎక్కువ తక్కువ గ్రేడ్స్ అంతే. తేలుతున్న నావతోకి ఎక్కాలి. మా చిన్నప్పుడు, రాజమండ్రీ గోదావరి దగ్గర, బొబ్బర్లంక దగ్గర, సఖినేటి పల్లి దగ్గర, బల్లలు వేసేవారు, నావకీ ఒడ్డుకీ.. అది కూడా లేదు.  బల్లకట్టు వేసేవారు స్టీమరులోకి.
ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో ఆ సదుపాయం కూడా లేదు. అదే ఆశ్చర్యం వేసింది. రెండింటికీ అనుసంధానం చేస్తూ ఒ క కొల్లాప్సబుల్ బ్రిడ్జ్ తయారుచెయ్యడం అంత కష్టమా? నావలోంచి ఒడ్డుకి కూడా అంతే.. ఓడలో పనిచేసే కుర్రాళ్లు చాలా సహాయం చేస్తారు. ఎలా ఎక్కిస్తారో దింపుతారో.. చేతులు వాళ్లకిచ్చెయ్యడవే.. అంతే జంపింగులు చేసేస్తాం.
మినికాయ్ కెళ్లాక, వెళ్తూనే, కొబ్బరి బొండాలతో స్వాగతం. 100 ఏళ్ల ముందు బ్రిటిష్ వాళ్లు కట్టించిన లైట్ హౌస్ కి తీసుకెళ్లారు. కాసేపు అక్కడ తిరిగి, రిసార్ట్ కెళ్లాం. చాలా పెద్దది. 30 గదులున్నాయి. గవర్న్ మెంట్ ది. ఈ టూర్ పాకేజ్ లో రాకపోతే, ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఆ విధంగా చాలా తక్కువమంది వస్తారుట. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినప్పుడు ఉపయోగిస్తారనుకుంటా.
అక్కడ వాటర్ స్పోర్ట్స్. కయాకీ మా టూర్ లో ఉంది. ఇద్దరిద్దరు కూర్చుని చిన్న బోట్ లో రాఫ్టింగ్ చేస్తారు. ఎంత సేపైనా చెయ్యచ్చు మన ఓపిక. మొదట్లో నేను భయపడ్డా.. చాలా సేపు ఒడ్డునే కూర్చుండి పోయాను.
కానీ మా వియ్యపురాలు విజయ ఊరుకోదు కదా.. లేపింది కుర్చీలోంచి.. సేఫ్టీ ఫ్లోట్స్ తగిలించుకుని నీళ్లలోకి వెళ్లాం. మొత్తానికి బోట్లో కూలబడ్డా, అక్కడున్న కుర్రాడి సాయంతో. విజయ వెనకాల కూర్చుని.. లెఫ్ట్, రైట్. బోత్ అనుకుంటూ గైడ్ చేసింది. మొత్తానికి తిరిగాం.. నాగలక్ష్మి కధలో మామ్మగారిలాగ రాఫ్టింగ్ చేశేసా.. ఇంక తల పైకెత్తుకుని తిరిగా కాసేపు. చాలా బాగా అనిపించింది.
కొందరు స్విమ్మింగ్, కొంతమంది బనానా బోట్ రైడ్.. అలా చేసి భోజనాల టైముకి, వచ్చారు. ఒంటిగంటకి భోజనం. చాలా ఐటమ్స్ చేశారు. కారాలు కూడా తక్కువగా అందరూ తినేట్లున్నాయి.
లంచ్ అయాక బీచి ఒడ్డున కూర్చుని, కబుర్లు.. అంత్యాక్షరి, కొత్తవాళ్లతో పరిచయం.
తర్వాత విలేజ్ హౌస్ కెళ్లాం. కమ్యూనిటీ హాల్లాంటిది. అక్కడ పెద్ద హాలు, వెనుక వరండా.. షెట్. అందులో నే కుర్చీలు వేశారు. టీ, సొమోసా, ఆకులో(ఏమాకో తెలీలేదు) వినాయకచవితికి చేసే జిల్లేడు కాయలాంటి (మోదకాలు లేదా మోమోలు) స్వీటు, టీ ఇచ్చారు. రిజార్ట్ కొచ్చి, అలా గడిపేసి ఐదింటికి బయలుదేరి నావలో ఓడ దగ్గరకొచ్చాం.
భోజనానికి ముందు ఒక గంట సేపు పప్పులు (21 ముక్కల రమ్మీ) ఆడి, భోంచేసి బబ్బున్నాం.
4. నాల్గో రోజు..
ఓడని దీవికి కొంచెం దగ్గరగా లంగరేశారు. ఐదు నిముషాల్లో కల్పెనీ అనే దీవిలో ఉన్నాం. చిన్న దీవి.. ముచ్చటగా ఉంది. ఏ దీవిలోనూ ఆకాశ హర్మ్యామ్యాలు లేవు. ఒడ్డుకి చేరుతుంటే కొబ్బరి చెట్ల అడవి కనిపిస్తుంది.. అన్ని దీవులూ అంతే. ఈ దీవున్నో పుట్టిన వాళ్లు తప్ప ఇక్కడ ఎవరూ నివసించడానికీ, భూములూ అవీ కొనడానికీ లేదు. అందుకే ప్రశాంతంగా ఉంది. జనాభా చాలా తక్కువ. ఈ కల్పనీలో నాలుగు వేలు. చిన్న చిన్న ఇళ్లు, పెద్ద పెద్ద తోటలు. అనుకోని సంపద వచ్చి పడడం, ఉన్న సంపద పోవడం వంటివి ఉండవు. బియస్సెన్నెల్ తప్ప ఏ చిప్పూ పని చెయ్యదు.
మామూలుగా కొబ్బరి బొండాం నీళ్లు తాగాక, నీటి ఆటలకి ఎదురుగా ఉన్న ఇంకొక దీవికి తీసుకెళ్లారు. నేను, లలిత, గిరా, షరీఫ్, ఉన్ని, రాకేష్ సానీ వెళ్లలేదు. మేం హాయిగా సముద్రాన్ని చూస్తూ, అప్పుడప్పుడు టీ తాగుతూ (చిన్న కొట్టుంది.. పక్కనే), రమ్మీ ఆడుకున్నాం. అలా ఆడుతుండగానే.. ఆటలు ముగించుకుని వచ్చేశారు. నేను కూడా ఆడదామనే, స్విమ్మింగ్ డ్రస్ అదీ తెచ్చుకున్నా.. కానీ ఎగుడు దిగుడు ఇసకలో, రాళ్లలో నడవలేక వెళ్లలేదు. స్నార్కలింగ్ (అండర్ వాటర్ వెళ్లి, అక్కడ నడుస్తూ, కోరల్స్, చేపలు.. మొ|| చూడచ్చు). ఇది మాటూర్ పాకేజ్ లో ఉంది. అలాగే ఈత కూడా కొట్టచ్చు. సముద్రంలో ఈత వేరుగా ఉంటుంది.. అలలు లేపేస్తుంటాయి. సింగపూర్ లో చేశాను. అప్పుడు కాలికి దెబ్బలేదు. ఇప్పుడు అసలు లోతెంతో తెలీని ఇసకలోంచి నడుస్తూ నీటిలోకి వెళ్లడమే కష్టం.. ఎలాగో నిన్న వెళ్లాకదా.
అందరూ వచ్చాక భోజనాలు.. తక్కువ కారంలో చక్కగా చేస్తున్నారు. తింటుంటే, తిన్నాక హాయిగా ఉంటోంది.
మధ్యాహ్నం, కొబ్బిరినూనె తయారుచేసే ఫాక్టరీ అని తీసుకెళ్లారు.. ఫాక్టరీ అంటే.. ఏదో అనుకున్నా, కానీ అమలాపురంలో మా ఇంటి పక్కనుండే గానుగంత కూడా లేదు. ఒకే ఒక్క క్రషర్ ఉంది.
తరువాత గార్మెంట్ ఫాక్టరీ.. అదీ అంతే.. చాలా చిన్నది. లోపలికి వెళ్తుంటే ఇళ్లలో చేసిన కొబ్బరుండలు జంతికలు చిన్న బల్ల మీద పెట్టుకుని అమ్మారు ఆడవాళ్లు. బానే ఉన్నాయి. కొబ్బరుండలు మాత్రం కొబ్బరి తెలకపిండిలో చేసినట్లున్నాయి.
హాల్లో, టీషర్ట్ లు, రకరకాల సైజుల్లో పెట్టారు. మీ అందరికీ తెద్దామనుకున్నా కానీ.. పెట్టెలో చోటులేదు.. హృదయంలో ఉన్నా!
అక్కడి నుంచి, దీవిలో ఉత్తరాన ఉన్న బీచ్ కి తీసుకెళ్లారు. నార్త్ పాయింట్.. మున లాగుంది. మూడు పక్కలా సంద్రం. ఏం చేస్తాం అక్కడ.. రెండు కుర్చీలు లాక్కుని, హాయిగా సముద్రపు గాలి పీలుస్తూ కునుకు తీసా. మహా శవనగా అనిపించింది సుమా..
5. ఐదవరోజు..
లక్షదీవుల అడ్మినిస్ట్రే టివ్ ఆఫీసులుండే దీవి, కారెట్టీ.. ఇక్కడికి వెళ్తుంటే..(పైన చెప్పిన విధంగానే..) రెండు మూడు మూడంతస్థుల భవనాలు కనిపించాయి. జెట్టీ దగ్గర్నుంచి అర కి.మీ, నడవాలి. అందరూ నడిచే వెళ్లారుయ నేను, లలిత, గిరా.. ఆ ఇసకని చూస్తూనే అమ్మో అనుకన్నాం. ఇసకలో అంత దూరం..
నేను నా కర్ర తెచ్చుకుని, కర్రసాయంతో నడుస్తున్నా.. లేపోతే ఆ జంపింగులవీ నావల్ల కాదు.. చదును నేల మీద ఎంతైనా ఫర్లేదు.. నా లాంటి వాళ్లే గిరా, లలిత. మా కోసం.. (నా కర్ర ఇక్కడ కూడా సాయం చేసింది..), ఒక వాన్ తెప్పించి దింపారు. ఇంక్ అక్కడే సాయంత్రం వరకూ. మా కాలక్షేపం మాకుండనే ఉంది. టాబూ అనే ఆట తెచ్చింది విజయ. చిన్న అట్ట ముక్క మీద, ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏమిటో టీమ్ లో వాళ్లు చెప్పాలి. దానికి సంబంధించిన మాటలు కొన్ని కింద రాసుంటాయి. అవి వాడకూడదు.. నిషిద్ధాక్షరి లాగా. సైగలు కూడా చెయ్యకూడదు. టైమర్ ఉంటుంది. రెండు నిముషాల్లో ఎన్ని చెప్పగలుగుతే అన్ని పాయింట్లు వస్తాయి. ఒకటి తెలుగులో తయారు చెయ్యచ్చు.. బానే ఉంటుంది. వల్లభనేని శ్రీనివాస్ కి చెప్పాలి.. ఈ ఐడియా.
టూనా ఫిష్ ఊరగాయ అమ్మారు. బాగుందిట.
మ్యూజియం, అక్వారియమ్ లకి.. చిన్నవే తీసుకెళ్లారు. సాయంత్రం బయలుదేరి వచ్చేశాం..
పాకింగ్ పూర్తి చేసి.. నిన్నటిలాగే కాలక్షేపం చేసి.. నిద్ర పోయాం. ఉయ్యాలలూపుతున్నట్లుందేమో బాగా నిద్ర పట్టేసింది.
5. పొద్దున్నే తయారయిపోయాం. తొమ్మిదింటికి కొచ్చిన్ వచ్చాము. నెమ్మదిగా లోకల్ ప్రయాణీకులు దిగిపోయాక, మమ్మల్ని దిగమన్నారు. డాక్ దగ్గరికి మా మిని బస్ వచ్చింది. ఎక్కి చలో..
తరువాత కేరళ టూర్ తీసుకున్నాము.




0 వ్యాఖ్యలు: