చాలా రోజులయింది.. బ్లాగ్ అప్డేట్ చేసి. మిత్రులందరూ క్షమించాలి.
దసరా శుభాకాంక్షలు.
“మీకు ఇష్టమైన గాయకులెవరు? వారి పాటల్లో మీకు నచ్చినవి చెప్తూ, విశ్లేషించండి..”
ఇది ఫేస్ బుక్ లోని సాహిత్యం గుంపులో మైథిలి అబ్బరాజు సంధించిన సాహిత్య బాణం.
“ఒక్కొళ్లగురించే రాయమంటే ఎలా? పెద్ద లిస్ట్ ఉంది”
“ఫరవాలేదండీ.. అందరి గురించీ రాయండి.”
ఇంక రెచ్చిపోయి నేను రాసేసిన నా అనుఅవాలు.. ఇష్టమైన గాయకులు.. ఇదిగో..
అబ్బబ్బ.. మైథిలీ!
నా మనసులో మాటలని మీరే రాసేస్తే ఎలాగా? ఇప్పుడే నేను రాద్దామనుకుంటున్నా ఇంకా..
అయినా సరే, రాస్తున్నా!
చిన్నప్పుడు
ఎప్పుడో, విన్న పాట.. “గోపాల కృష్ణుడు నల్లన, గోకులములో పాలు తెల్లనా..’” అంటూ ఒక రకమైన జీరతో పాడే బాల సరస్వతి గారి గొంతే మొట్టమొదటిసారిగా నేను విన్నది. ఏదో తెలిగ్గా సెలయేరులా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది కానీ బహు కష్టం మనం పాడబోవడం.
తరువాత
కర్నాటక సంగీతం ఇష్టమైన మా నాన్నగారు ఎప్పుడూ రేడియోలో వినిపించే మధురమణిఅయ్యరు, ”సరస స్సామదానా..” ఇంకా నా చెవులో మ్రోగుతుంటుంది. ఆయన కంఠం తిరిగిన మెలికలు జహంగీరు (తినేది) తుట్టల్లో కూడా ఉండవు.
డి.కె పట్టమ్మాళ్ గౌళ గాత్రం మంద్రంగా వినిపిస్తే, యమ్మెల్ వసంత కుమారి కదం తొక్కేవారు. యమ్మెస్. మాధుర్యం అంతా ఇంతా కాదు.
ఇంక
ఘంటసాలగారి, “బహుదూరపు బాటసారీ”, పుష్పవిలాపం, అత్త వంటి కోడలుత్తమురాలు” లలిత గీతాల కార్యక్రమంలో వచ్చేవి. సరోజినీ నాయుడుగారి గురించి ఆయన పాడిన పాట ఇంకా వినిపిస్తుంటుంది..”భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి తీయగా పాడిన కోయిలమ్మా..”.
అప్పట్నుంచీ
మృదు మధుర, గంభీర కంఠంతో ఆయన పాడిన ఎన్నో గీతాలు మనసును అలరింపజేశాయి.
భానుమతిగారి
మల్లీశ్వరి పాటలు మరచిపోగలమా? ప్రతీ సినిమాలోనూ ఒక త్యాగరాజ కీర్తన ఉండాల్సిందే.. నగుమోము ఎంత అద్భుతంగా ఉండేదో! “తప్పకా ఇచ్చురా తాతయ్యా లక్షా!” ఎంత చక్కగా అన్నారో!
యస్వరలక్ష్మి
సరేసరి.. ముద్దుముద్దుగా ఉంటాయి ఆవిడ పదాలు.
అమ్మో!
లీల గారు.. “ఏడనున్నాడో ఎక్కడున్నాడో..”, “తుషార శీతల సరోవరాన....”, .. త్యాగరాజస్వామి శోభిల్లు సప్తస్వర కీర్తనలో చెప్పినట్లు.. నాభీ హృత్క్ంఠ రస నాసాదుల లోంచీ కంఠాన్ని సాగదీసి పాడేవారు.
ఇంక
సుశీలమ్మ సంగతి చెప్పేదేముంది.. ఆవిడ గొంతులో పలకని సంగతి, ధ్వని ఉన్నాయా? స్వఛ్ఛంగా, తియ్యగా పలకడం ఆవిడ సొంతం.
తరువాత
బాల గంధర్వుడు..
(సశేషం..)
రెండవ
భాగం –
నేను
గుంటూర్ లో విమెన్స్ కాలేజ్ లో చదువుతున్న రోజులు..
మేం
సెకండ్ ఇయర్ బి.యస్సీలో ఉండగా అనుకుంటాను(1963).. పెద్ద పెద్ద కళ్లతో ఒకబ్బాయి, మొహంలో పసితనం ఇంకాపోలేదు.. పదిహేడు పద్ధెనిమిదేళ్లుంటాయేమో.. కానీ పధ్నాలుగేళ్ల కుఱాడిలా ఉన్నాడు.. మా కాలేజ్ లో గంటన్నర పైగా పాడాడు. “కులదైవం” సినిమాలో.. పద పదవె వయ్యారిగాలి పటమా.. పాట.. ఇంకా ఆ లేత గొంతుది వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు మేం కొందరం సంగీతం నేర్చుకుంటూ ఉండే వాళ్లం.. కొమాండూరి తిరుమలాచార్యుల గారి (బహుభాషా ప్రవీణుడు, సంగీత కళాశాల ప్రధానోపాధ్యాయుడు.. ప్రముఖ వయొలిన్, గాత్ర విద్వాంసులు శేషాద్రి గారి చిన్నాన్న) దగ్గర. మాకు తారస్థాయిలో పంచమం మించి వెళ్లేది కాదు.. అప్పుడు కాలేజ్ లో పాడిన ఆ అబ్బాయి.. కంఠానికి ఎల్లలు లేవు. అలా అలా సాగిపోయింది. సాగిపోతూనే ఉంది. ఈ పాటికి గ్రహించే ఉంటారు.. అతనే “బాలసుభ్రమణ్యం”. ఎంత చెప్పినా తక్కువే అటువంటి సరస్వతీ పుత్రుల గురించి.
జానకి
గారిని మర్చిపోలేదు సుమండీ.. మా మాష్టారు చెప్తుండేవారు.. (ఆవిడా మా గుంటూరావిడే..) వాయులీన స్వరం ఆవిడ గాత్రం అని.. గమకాలు అవలీలగా పలికించేస్తారు. మూడు స్థాయిల్లోనూ స్వరాలు కంఠంలో నాట్య మాడుతూ ఉంటాయి. “నీ లీల పాడెద దేవా..” ఒక సంచలనం అప్పట్లో.
మేం
ఫస్ట్ ఇయర్ లో ఉండగా బాలవసంత నాలుగురోజులు కాలేజ్ కి రాలేదు.. మెడ్రాస్ వెళ్లిందన్నారు. అప్పుడే “బంగారు బండిలో” రికార్డింగ్ కి అన్నమాట. “వసంత” అసలు పేరు బాలవసంత. మాకు ఒక ఏడాది సీనియర్. ఇళ్లు దగ్గర. రోజూ కాలేజ్ కి కలిసి, నడుస్తూ వెళ్లే వాళ్లం. రెండు జడలు అల్లల్లాడిస్తూ దారి పొడుగునా మాట్లాడుతూనే ఉండేది. అప్పుడే సుశీలగారు రికార్డింగ్ లో కనిపించారనీ, “అప్పుడు రికార్డ్ అయిన పాట.. “ఈ వసంత యామినిలో..” (దీని పల్లవి చెప్పగలరా ఎవరైనా..) లో మీ పేరు ఉంది అని అన్నారని చెప్పింది. అందరం ఆశ్చర్యంగా చూశాం. ఆ రోజుల్లో ఏ పాటల పోటీలు పెట్టినా వసంతకే ప్రైజ్. మాలాంటి వాళ్లం కొంచెం కుళ్లుకునే వాళ్లం కూడా.. సిరివెన్నెలలో “చందమామ రావే..” పాట లో ఆలాపన ఎంత బాగా తీసిందో.. ఈ సారి ప్రత్యేకంగా వినండి.
నేను
హైస్కూల్లో ఉండగా “రోజులుమారాయి” అని ఒక సినిమా వచ్చింది. ఇప్పటి భాషలో చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్. నామటుకు నేను పది సార్లు చూసుంటాను. అందులో “ఏరువాకాసాగారో..” అనే పాట.. ప్రతీ ఇంట్లో వినిపించేది. మేవందరం వహీదాని మించిపోయి డాన్స్ చేసేసే వాళ్లం. అది పాడింది జిక్కీ క్రిష్ణ వేణి గారు. శతదినోత్సవానికి జడగంటలు పెట్టుకుని వచ్చారు. జిక్కీగారి గొంతు జలపాతం. “హాయి హాయిగా ఆమని పాడే..” సువర్ణసుందరి.. ప్చ్.. మానవమాత్రు లెవరూ అలా పాడలేరు అనుకునే వాళ్లం. ఆవిడవి ఎన్ని పాటలు అందరి నోళ్లల్లో నానుతుండేవో!
“బుంగమూతి చందం..” జమునారాణీ గారు.. ఆవిడని అనుకరించడానికి ప్రయత్నం చేసి.. భంగపడే వాళ్లం. కంచు కంఠం అంటే అదే. “మావ మావా మావా..” పాటలో ఆవిడ అన్న “మా..హా..వా, మాఆఅ..హాఆఆ.. వా.. మావా..” సంగతి పలురకాలుగా పలికేసే వాళ్లం.
ఇంక
క్లబ్బు డాన్సులకి, ఫోక్ సాంగ్స్ కీ యల్లారీశ్వరిగారు పెట్టింది పేరు. “మాఘమాసం వచ్చేదాకా.. మంచి రోజే లేదన్నాడే.. ఆగే దెట్టాగా అందాకా ఏగే దెట్టాగా..” ఆ విరహం అంతబాగా ఎవరు పలికించగలరు? “లే లే లే.. లెలేలే.. నా రాజా..” అందులో “నా ర్రా..జాఆఆ..” అన్నప్పుడున్న జీర.. మత్తు.. ఓహ్!
(సశేషం..)
మూడవ
భాగం-
నేను
హైస్కూల్లో చేరిన కొత్తల్లో.. ఒక రోజు ఇంట్లో అందరూ తయారవుతున్నారు. కాకపోతే నేనే సమస్యైపోయాను. ఏంటో అని చాటుగా వింటే తెలిసింది..
పాండవోద్యోగ
విజయాలు నాటకం వేస్తున్నారు.. ఆలశ్యమవుతుందేమో.. భానమ్మ సంగతెలాగా అని. మా ఇంట్లో నేనే చిన్న దాన్ని. నాకర్ధం కాలే.. ఇంత గోలెందుకు.. సెకండ్ షో కి వెళ్లడం అలవాటే కదా! కళ్లార్పకుండా న్యూస్ రీల్ దగ్గర్నుంచీ (అప్పట్లో అదొకటి ఉండేది.. మా లాంటి వారికి విసుగొచ్చేట్లు) చూసేస్తానయ్యె. ఇంకేంటి.. నాటకం గురించి ఎప్పుడూ వినడమే కానీ అంతవరకూ జీవితంలో చూడలేదు.
“వచ్చేప్పుడు నడవలేవు. నిద్ద్రోతావు.. “ “నడుస్తాగా నీ మీదొట్టు..”
మొత్తానికి
అందర్నీ ఒప్పించి బయలు దేరాను.
ఎనిమిదింటికి
మొదలైన నాటకం.. ఇంచుమించు తెల్లార్లూ సాగుతూనే ఉంది. మధ్య మధ్యలో గుఱు పెట్టానుట.. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు.. అలా నలుగురు వేశారు. ఇంతకీ ఇందులో గాయకులెవరనుకుంటున్నారా?
మొత్తం
అందరూ! వారికి గురు ముఖతా శిక్షణ ఉండేది కాదు. ఎక్కడా ఒక్క అపశృతి పలకడం, కానీ రాగం అటూ ఇటూ అవడం కానీ ఉండదు.
అన్ని
రకాల గమకాలూ.. స్ఫురితము, జారు, వజ్రం.. మొదలైనవి అవలీలగా పలికేసేవారు. కర్ణాటక సంగీత గాయకుల రాగాలాపనకీ వీరికీ తేడా ఉంటుంది. కింది షడ్జంలో మొదలయి. అలా పయనించి పై షడ్జమంలో ఎంత సేపుండే వారంటే.. ఆ ఊపిరితిత్తుల బలానికి జోహార్లివ్వాల్సిందే. బావా.. అని కిందినుంచి ఎత్తుకుంటే పైన ఆగి.. మళ్లీ బా..ఆఆ.. వా
అంటూ
పైనుంచి ఎత్తుకునే వాళ్లు. ఇంక హార్మోనీ కళాకారులు..
వారి
వేళ్ల కదలిక చూస్తుంటే.. లోపల యంత్రాలున్నాయేమో అనిపించేది. ఇప్పుడు కూడా కేసియో అవీ అలాగే వాయిస్తున్నారు కానీ.. అప్పుడు ఒక చేత్తో గాలి కొట్టుకోవాలి.. ఒక చేత్తోనే వాయించడం.
నాకు
నటుల పేర్లు గుర్తు లేవు. అబ్బూరి వరప్రసాదరావుగారు ఒక కృష్ణుడనుకుంటా.. కర్ణుడు పులిపాక గారయుంటారు. పద్యం ఎత్తుకున్నారంటే ఐదు నిముషాలు ఆపకుండా ఆలాపన ఉంటుంది. “కర్ణా………… “ అంటే స్వర్గంలో ఉన్న కర్ణుడు దిగి రావలసిందే. మనం అయిపోయిందనుకుంటామా.. కిందికి వచ్చినట్లే వచ్చి మళ్లీ ఎత్తుకునేవారు.
మల్లాది
సూరిబాబు గారయితే.. గర్జించే మేఘంలా ఉండేది ఆయన గొంతు. వేమూరి గగ్గయ్య, ఆయన కొడుకు జగ్గయ్య అనుకుంటా.. ఇలా ఎందరో..
రఘురామయ్యగారి
(ఈలపాట..) నాటకాలు కూడా చూశాను. ఆయన.. పెదవిని తమాషాగా వణికించేవారు. పద్యం పావుగంట పాడాక.. ప్రేక్షకుల్లో ఎవరో వన్స్ మోర్ అంటారు. మళ్లీ మొదలు. మరి తెల్లారిపోదా నాటకం అయేసరికి..
మేం
మాత్రం పద్యం అటెంప్ట్ చెయ్యలేదెప్పుడూ.. అంత ధైర్యమే!
అయినా
సరే. కిటకిటలాడుతూ ఉండేది హాలు. అప్పుడూ సినిమాలున్నాయి. కానీ ప్రజల అభిరుచులు మారలేదు.
నాటక
కళని జనం మర్చిపోకుండా చేద్దామని గుమ్మడి గోపాల కృష్ణగారు, అక్కిరాజు సుందర రామకృష్ణగారు వంటి మహానుభావులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నంది అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. కానీ ప్రేక్షకులే.. ఇంకా పెరగాలి. అక్కడికీ ఆలాపనలు కాలానుగుణంగా కుదించేశారు. పైన పేర్కొన్న మహానుభావులు పద్యాలు ఎంతబాగా పాడతారో.. అయ్యదేవర వారు.. ఈ ఆధునిక కాలంలో తాతా బాల కామేశ్వర్రావు. ఘంటసాల
వారు సరే సరి. బాలుగారు ఏకవీరలో పాడిన పద్యం(ఏమిటో ఎవరు ముందు చెప్తారూ..).. చెప్పుకుంటూ పోతే ఎన్నో!
ఒకసారి
ఆ మధ్యన సురభి వారి డ్రామాకి వెళ్లాం.. మాతో కలిపి పది మంది ఉన్నారు. అయినా సరే.. అసంఖ్యాక ప్రేక్షకులు వచ్చినట్లు నటులు వీడని ఉత్సహంతో నటించేశారు. నా పరిశీలన ఏమిటంటే.. మైకులున్నప్పుడు గొంతు తగ్గించచ్చేమోనని.. కానీ, ఆమాత్రం లేకపోతే ఆ పద్యాలు ఆవిధంగా పాడలేరేమో..
మా
స్నేహితులు రేణుకా దేవిగారు, నిర్మలా దేవి గారు, రాజలలితగారు.. అందరూ స్త్రీలే ద్వారక సీను చాలా చోట్ల ప్రదర్శించారు. బహుమతులు కూడా గెలుచుకున్నారు. రాజలలితది అబ్బూరి వారిలా సన్నని కంఠమైతే, రేణుకది గంభీరమైన గొంతు.
అదండీ
సంగతి.. వెంటనే ఒక పద్యం వినెయ్యండి.. చెవుల తుప్పు వదిలేలా.. (ఎవరినా నిష్ణాతులు షేర్ చెయ్య కూడదూ?)
(సశేషం…)
పాటల విశ్లేషణలో
నాల్గవ భాగం—
మరీ విసిగించేశానేమో
అన్పించి కొంత విరామం తరువాత నా కిష్టమైన గాయకుల విశేషాలు మళ్లీ మొదలెట్టేశా..
2002 వ సంవత్సరంలో
ఆదిశంకరుల జయంతి సందర్భంగా “కాలడి” వెళ్లాం, మా స్నేహితురాలు రాణీకుమార్ తో కలిసి.
పూజలు, అభిషేకాలు అయ్యాక, ఊరు చూద్దామని బయలు దేరాం.
కీర్తి మండపం
అంతా చూసి, తిరిగి వెళ్తుండగా.. అక్కడ హాల్లో అందరూ కూర్చుని వేచి చూస్తున్నారు. కంచి
ఆచార్యులు వస్తున్నారనీ, ప్రవచనం చేస్తారనీ అంటే, మేం కూడా కూర్చున్నాం.
అప్పుడు వినిపించింది..
మంద్రంగా ‘నాట” రాగాలాపన.. ఆ తరువాత “మహాగణపతిం” కీర్తన. గంభీరమైన కంఠస్వరం.. స్పష్టమైన
ఉఛ్ఛారణ.. తల తిప్పి చూస్తే, పట్టుపంచ కట్టుకుని ఉత్తరీయంతో వక్షస్థలాన్ని కప్పుకుని
ఒకాయన పాడుతున్నారు. మంత్ర ముగ్ధులమై వింటున్నాము. పాట అయిపోయాక, ఆయన పక్కనున్నాయనతో
ఏదో మాట్లాడుతున్నారు.
అబ్బా.. కమ్మని
తెలుగులో.. నెమ్మదిగా జరుగుతూ ఆయన వెనుక వరుసలోకి
చేరాం రాణీ, నేనూ.
“తెలుగు వారా..
చాలా సంతోషమండీ.” మా వివరాలు చెప్పుకుని, ఆయన గురించి అడిగాం.. మొహమాటంగా. ఎందుకంటే
ఆయన పాట వింటే ఎవరో చాలా గొప్ప వ్యక్తి అనిపించింది.
“నా పేరు ధూళిపాళ
శివరామ క్రిష్ణ తల్లీ! హరికథలు చెప్తుంటాను.”
చిన్నగా పాడితేనే
ఇలా ఉంది ఇంక హరికథ అంటే.. తలచుకుంటేనే ఆనందమనిపించింది.
ఇంటికి వెళ్లాక,
మా అసోసిఏషన్ లో అందరినీ అడిగి, ఆయన హరికథా కాలక్షేపం ఏర్పాటు చెయ్యడానికి సంవత్సరం
పైన పట్టింది. అయితేనేం..
“భక్త మార్కండేయ”
హరికథ..
ఎంత అద్భుతంగా
చెప్పారో.. మధ్య మధ్య పిట్టకథలు, ఆధునిక జీవనానికి అన్వయిస్తూ పురాణ కథలు.. దీటుగా
వారి అబ్బాయి వాయులీనం..
ఎప్పుడో చిన్నప్పుడు
గుంటూర్లో ఓంకార క్షేత్రంలో విన్న హరికథలు గుర్తుకొచ్చాయి.
హరికథలకి ఆదిపురుషుడైన
ఆదిభట్ల నారాయణదాసుగారికి మన తెలుగు వారందరం ఋణపడి ఉంటాం.
అసలు హరికథా
ప్రక్రియలో గానం, నాట్యం, వివరణ, విశ్లేషణ, కథ.. సాహిత్యంలో ఉండవలసినవన్నీ ఉంటాయి.
“శ్రీమద్రమారమణ
గోవిందో హరి.”
0 వ్యాఖ్యలు:
Post a Comment