Monday, August 21, 2017

తలపులు- నాతో నేను..2

Posted by Mantha Bhanumathi on Monday, August 21, 2017 with No comments


24-1-17. నాతో నేను.

దోశల కని నానబెట్టిన పప్పు, బియ్యంలో అటుకులు వేస్తుంటే గుర్తుకొచ్చింది.
"ఏంటో.. అటుకులెలా చేస్తారనా?"
అబ్బే.. చిన్నప్పుడు పెరటి సావిట్లో ధాన్యం పోటేసి అటుకులు దంచి, చాటల్తో చెరిగి పొట్టు తియ్యడం చూశా. అది కాదు..
సెలవుల్లో అమలాపురం వెళ్లినప్పుడు.. మండుటెండలో అవతలి పెరట్లో చేరి, పిల్లలందరం ఆడిన ఆటలు.. చెట్ల నీడ. ఎండ అక్కడక్కడ చుర్రుమన్నా తెలియని ఆనందం.
పెద్దవాళ్లు కునుకు తీసే వేళ.. మేం పెరట్లో చేరి, కొత్త కొత్త ఆటలు కనిపెట్టి, ఒకళ్లనొకళ్లు ఏడిపించుకుంటూ.. రకరకాలుగా జట్లు కడుతూ, విడి పోతూ.. ఒహ్..
ఇంతకీ అటుకులేంటని కదూ?
అన్నం తిన్న గంట నుంచే చిరుతిళ్లకు వంటిల్లు తిరగేసే వాళ్లం. చాలా డబ్బాలు మడిగా ఉండేవి. ఉదాహరణకి, వేయించిన కందిపప్పు.. మడి. ఎంత రుచిగా ఉండేదో.. ఏం చేస్తాం? దొంగతనంగా ముట్టుకుని తీసుకుందామన్నా భయం. దేవుడు చూస్తాడనీ మా పిన్నికి చెప్తాడనీ.. మా పిన్ని ఒక గిన్నెలో నాలుగ్గుప్పెళ్లు పోసి ఇవతలగా పెట్టేది.. మా బకాసుర ఆకలి తెలిసి.
అలాగే మడి కాని డబ్బాలో అటుకులు.
ఎవరి అరిటాకుముక్క వారే కోసుకుని తెచ్చుకోవాలి. మణిగాడు నావళీకంగా కోసేవాడు. వాడికి మా వాటాలోంచి కాసిని అటుగ్గింజలు పెట్టేవాళ్లం, ఎగస్ట్రాగా.
ఆ అటుకులన్నింటికీ ఆవుపిండి రాసి, పప్పునూనె వేసి ఎర్రగా కలిపి, అరిటాకు ముక్కల్లో పెట్టుకుని, కొద్ది కొద్దిగా నోట్లో వేసుకుని నవుల్తుంటే.. ఉండేదీ? అడగద్దు.. ఇప్పుడు ఇది రాస్తుంటేనే ఆ రుచికి నోరూరుతోంది.
అప్పుడప్పుడు పిన్ని పర్మిషన్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి అందులో కలుపుకునే వాళ్లం. కానీ అది లగ్జరీ.
ఒక సారి ఆవకాయ బదులు, పచ్చి మిరపకాయలు ఉప్పు వేసి నూరి కలిపింది మా ప్రభ. అది కూడా ఎంత రుచో. పెరట్లోంచి నిమ్మకాయ కోసుకొచ్చి రెండు చుక్కలందులో పిండుకుని నోట్లో వేసుకుంటే.. సావి రంగా..
ఇంతకీ ఆ మధ్యని ఇక్కడటుకులతో చూశా.. దంపుడటుకులనే తెచ్చాం. కానీ ఆ రుచి రాలేదు. ఫరవా లేదనుకోండి..
దోశలపిండి రుబ్బి, కలెక్టర్ కాయతో వేసిన మెంతి పచ్చడి ముక్కలేసుకుని పెరుగన్నంలో నంచుకుని భోంచేశాం. కూరలు, పప్పుచారు.. ఎన్నున్నా.. మెంతి పచ్చడి ముక్కలకే ఫస్ట్ ప్రిఫరెన్సు.
ఉంటా.. ఒక జెలుసిల్ బుగ్గలో పెట్టుకుని పడుక్కోవాలి.. ఓ రాత్రివేళ మంట రాకుండా.. మరి అరవయ్యేళ్లు గడిచి పోలా!

3-11-18.
శుభ సాయంత్రం..
మొన్న మా కనకదుర్గ (మా పెద్దమామయ్య మనుమరాలు) కాకినాడ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించిన ఫొటో పెడితే.. ఒక్క సారిగా కాకినాడలో నేను గడిపిన చిన్నతనం గుర్తుకొచ్చింది. అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. అందుకే కొంచెం కొంచెం గుర్తుంది.
సూర్యారావుపేటలో దయాల్బాగ్ స్టోర్ ఎదురుకుండా ఇంట్లో ఉండేవాళ్లం. కాశీభట్ల వారిల్లనుకుంటా. నాళ్లమ్మాయి పేరు ఇందిర.. పేరుకూడా ఎందుకు గుర్తుందంటే.. ఆవిడ నాతో బాల్ ఆడేది.. నేలకేసి పురిటీలు కొట్టడం.. దొర్లిపోకుండా ఎన్ని కొడ్తే అంత గొప్ప. నా కంటే చాలా పెద్దది ఇందిరక్క. చీర కట్టుకునేది. తనేమో పడక్కుర్చీలో కూర్చుని ఆడితే, మనం ఆపసోపాలు పడుతూ బాల్ అటూ ఇటూ వెళ్లకుండా గెంతులేస్తూ కొట్టేవాళ్లం.
వారానికో సారేనా బాలా త్రిపుర సుందరి గుడికి తీసుకెళ్లేది అమ్మ.
అప్పుడప్పుడు మా బాలొదిన (దొడ్డమ్మ కోడలు) వాళ్ల అబ్బాయిని తీసుకునొచ్చేది. వాడికి ఎనిమిదో పదో నెలలు.. చాలా బరువుండే వాడు. ఒక సారి ఎత్తుకుని కింద పడేశా.. ఠంగుమని మోగింది గుండు.. కాసేపు వాడికేం జరిగిందో అర్ధం కాలా.. అవగానే.. కెవ్వుమని ఏడుపు. అమ్మ తిడుతుందేవో అని నేను ఇందిరక్క కుర్చీ వెనకాల దాక్కున్నా. పాపం.. మా బాలొదిన.. ఏమనుకుందో కానీ.. నన్నేమీ అనలా.. "భాన్తల్లి నేమీ అనకండత్తయ్యా" అంటూ రికమెండ్ కూడా చేసింది. (వాడే.. రామచంద్రన్ ఐసోల).

అక్కడ ఒకేడాది చదవగానే.. బడికి పంపడం మానేశారు.. నేనేమో వెళ్తానని ఏడుపు.. ఇంతకీ పిల్లల్నెత్తుకు పోయే వాళ్లు తిరుగుతున్నారని పుకారుట. మా అమ్మ ఛాన్స్ తీసకోనని ఇంట్లో కూర్చోపెట్టింది. ప్రైవేటు మాష్టారు ఇంటికే వచ్చేవారు.. ఓ సారి స్కూలు పక్కనుంచి వెళ్తుంటే.. మా ఇంటికి కొంచెం దూరంలో మైన్ రోడ్ మీద ఉండేది, క్లాసు గది వీధిలోకే కనిపిస్తూ.. ఎంచక్కా పిల్లలందరూ పాఠాలు వింటున్నారు. ఇఅక్కడే రోడ్డు మీద కూలబడి.. ఇంటికి రానని ఏడుపు. మొతాతనికి ఈడ్చుకెళ్లి, బంగాళాదుంపల వేపడం చేసి అన్నం పోచ్చి, పడుక్కో బెట్టింది అమ్మ.
Categories:

0 వ్యాఖ్యలు: