Saturday, November 11, 2017

అంతా ప్రేమమయం- 14

Posted by Mantha Bhanumathi on Saturday, November 11, 2017 with No comments
                                                అంతా ప్రేమమయం- 14.

 
అదే సమయానికి, “ఫాదర్’ ఉన్న ఊరికి వెళ్లే బస్‍లో ఉన్నారు సంతోష్, సరస్వతి. సరస్వతి కళ్లూ, మొహం బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. కిటికీకి తల ఆనించి వెక్కుతూనే ఉంది. పదిమందిలో ఏడవకూడదని ఆపుకోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోయి, మొహ ఎర్రగా కందగడ్డలా అయిపోయింది. సంతోష్ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు.
  సంతోష్ శిరిడీ బస్ దిగి ఇంటికెళ్లగానే స్నానం చేసి, బయటికెళ్లి ఇద్దరికీ టిఫిన్ తెచ్చాడు. సరస్వతి కుడా పూజ ముగించుకుని వంట ప్రయత్నం చెయ్యబోయింది.
  “సరూ! టిఫిన్ తిందాం రా.. వంట తరువాత చెయ్యచ్చు.”
  సరస్వతికి కూడా నీరసంగా అనిపించి కూర్చుంది. రాత్రి ఎక్కడా ఏం తినలేదు. బస్సాగిన దాబాల దగ్గర ఏం తినబుద్ధి కాలేదు. సంతోష్ అంటే అందుకే చాలా ఇష్టం సరస్వతికి. అడగకుండానే మనసెరిగి అన్నీ అమరుస్తాడు.
  టిఫిన్ తిన్నాక చెప్పాడు జరిగినదంతా.
  కాసేపు మెదడు మొద్దుబారిపోయినట్లుగా, శూన్యంలోకి చూస్తున్నట్లుగా చూస్తూ కూర్చుంది సరస్వతి.
  “సరూ!” సంతోష్‍కి భయం వేసింది. దగ్గరగా వెళ్ళి కుదిపాడు. అప్పుడు బద్దలయ్యింది అగ్ని పర్వతం. ఏం చేసి ఆపగలడు? ఉబికి వస్తున్న లావాలో మాడిపోతున్నట్లుగా అనిపించింది. వెక్కి్లళ్ల మధ్యనే పదిహేనేళ్ల ముద్దు మురిపాలు, మొండితనాలు.. అలుకలు.. నిష్ఠూరాలు.
  మౌనంగా అన్నీ భరించాడు.
  “టైమవుతోంది పద సరూ!” బట్టలు తనకి తోచినట్లు బాగ్ లో పడేసి చెయ్యి పట్టుకుని లేవదీశాడు.
  “ఎందుకు? ఎవరికోసం వెళ్లాలి మనం? అక్కడందరూ మనల్ని నేరస్తుల్ని చూస్తున్నట్లు చూస్తుంటే.. ఇలాంటి కూతుర్ని కన్నావేంటని కళ్లతో గుచ్చి గుచ్చి అడుగుతుంటే తలెక్కడ పెట్టుకోవాలి”
  “ఏం కాదు సరూ! ఉజ్జీ వచ్చేస్తుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలి కదా!” అన్నాడు సంతోష్.
  “ఏ స్థితి లో నస్తుందో.. అలా వచ్చేకంటే రాకపోవడమే మంచిది.” సరస్వతికి ఒళ్లంతా జలదరించింది.
  వణికిపోతున్న సరస్వతిని అలాగే పొదివి పట్టుకుని తీసుకెళ్లాడు. పదమూడు గంటలపాటు షిరిడీ నుంచి బస్ ప్రయాణం చేసొచ్చి.. వెంటనే ఇలాంటి వార్త విని బయల్దేరడం, అందులో మనసంతా ఆందోళనగా! ఇద్దరికీ తలంతా దిమ్ముగా అయిపోయింది.
  “మమ్మీ! నా ఫేస్ లో ఏమైనా తేడా కనిపిస్తోందా?” ఉజ్వల సరస్వతి మొహంలోకి చూసి అడుగుతోంది.. సరస్వతి అయోమయంగా చూస్తుంటే.. మొదటి సారి కనుబొమ్మల్ని దిద్దించుకుని.
  అసలు ఉజ్వల కనుబొమ్మలు సహజంగానే తీర్చి దిద్దినట్లుంటాయి. ఫ్రెండ్సందరూ వెళ్తుంటే తనుకూడా వెళ్లింది.
  “నాకేం కనిపించడం లేదు.. తగలేసిన డబ్బు తప్ప.”
   “అబ్బ.. మమ్మీ! ఎప్పుడూ డబ్బేనా? కాస్త ఎంజాయ్ మెంట్ కూడా ఉండాలి కదా!”
  “దానికేం తక్కువలేదులే.”
  “నీతో మాట్లాడి వేస్ట్. తినడానికేమైనా ఉందా? ఆకలేస్తోంది.” కాళ్లు రెండూ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, కుర్చీలో రిలాక్స్ అవుతూ వెనక్కి వాలింది ఉజ్వల.
  “ముందు సరిగ్గా కూర్చో, తినే బల్ల మీద కాళ్లు పెడ్తావా. బుద్ధుందా?”
  “ఏం? నా కాళ్లకేమయింది? ఎప్పుడూ ఇంతే నువ్వు. నన్ను తినడం కోసమే కన్నావా?” పెడిక్యూర్ చేయించుకుని అద్దంలా మెరిసి పోతున్న పాదాలని రివ్వున కిందికి దింపి, ధన ధనా అడుగులు వేస్తూ వెళ్లిపోయింది.
  “ఆగు. ఇవిగో పకోడీలు..” బస్సు కుదుపుకి తెలివొచ్చిన సరస్వతి కుమిలి పోయింది.
  అదే సమయానికి..
  “ప్రేమతో నీ ఉజ్జీ..” అంటూ అందంగా తాళంచెవి నగిషీచెక్కిన పెద్ద చెక్క స్పూన్ ఉన్న గిఫ్ట్ పాకెట్ ని ఆదిత్యకి ఇస్తోంది ఉజ్జీ.. అందరి చప్పట్ల మధ్య.

  “సర్!” స్క్రిప్ట్ లో సవరణలు చేస్తున్న భాస్కర్ తలెత్తి చూశాడు. మంజుల.. కొద్దిగా అలసిన గొంతుతో పిలుస్తోంది. ఎంత అలసటగా ఉన్నా ఆ అమ్మాయి మొహంలో ఏదో వింత కాంతి. ఆకలి మీదున్న పసి పాపకి పాలసీసాని చూసినప్పుడు వచ్చే కాంతి.
  “మన డ్రామాకి బడ్జెట్ ఎంత ఉంది సార్?”
  “మేకప్ లకీ, రిఫ్రెష్ మెంట్ల కీ పదివేలు అడిగానమ్మా.”
  “ఇంకో పదివేలు ఇవ్వగలుగుతారా?”
  ఆ కాలేజ్ ఆదాయ వ్యయాల్లో పదివేలు పెద్ద మొత్తం కాదు. కానీ ఒప్పించగలగాలి.
  “దేనికమ్మా?” మంజుల పేపర్ పెన్ పట్టుకొచ్చి అంతా వివరించింది. భాస్కర్ కళ్లు మెరిసాయి.
  “తప్పకుండా ప్రయత్నిస్తానమ్మా.”
  “అయితే మనం రేపు నారాయణని రమ్మని అంతా వివరిద్దాం, పదమూడున వచ్చి సెట్ చేస్తాడు.” మంజుల ఉత్సాహంగా అంది.
  “ష్యూర్. ఒక గంట టైమియ్యి. చెప్దాం.” భాస్కర్ లేచి ప్రిన్సిపాల్ గది కేసి చకచకా నడిచాడు.
  ఆ రోజు పొద్దున్న అయిన ప్రాక్టీస్ లో మంజుల అందరికీ డైరెక్షన్లిచ్చింది. కొద్దిగా తడబడుతున్న వాళ్లు పూర్తిగా, క్షుణ్ణంగా నేర్చేసుకున్నారు. ఆ డ్రామాలో ముగ్గురికి తప్ప మిగిలిన వాళ్లందరికీ ఎక్కువగా యాక్షన్ సీన్ లే.
  స్లో, స్పీడ్ ఎమోషన్స్.. ముఖ కవళికలు, మోడ్యులేషన్.. డ్రామాల్లో చేతి కదలికలు చాలా ముఖ్యం. చేతుల్ని ఏం చెయ్యాలో చాలా మంది యాక్టర్లకి తెలియదు. అవీ.. ఇంకా చాలా చిన్నచిన్న విషయాల గురించీ మంజుల, అందరికీ చాలా శ్రద్ధగా నేర్పించింది.
  సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ లో ఊహించలేనంత మార్పు కనిపించింది. మళ్లీ ఒక సారి ప్రవీణ్ చేత తనకున్న భారీ డయలాగ్ చెప్పిస్తుండగా వచ్చారు భాస్కర్, వెంకట్.
  వెంకట్ సెల్ ఫోన్ మంజులకిచ్చి, “చెయ్యమ్మా! నో ప్రాబ్లమ్" అన్నాడు.మంజుల మూడు కాల్స్ చేసి తనకి కావలసినవేమిటో స్పష్టంగా చెప్పింది.
  
  బంటీకి జరుగుతున్నది నెమ్మదిగా అర్ధం అవుతోంది. ఎంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నాడో తెలుస్తోంది.
  డాక్టర్ బంటీ టెస్ట్ రిపోర్ట్లన్నీ తీసుకురమ్మన్నారు. ఒక మనిషికి ఎన్ని పరీక్షలు చెయ్యగలరో, అన్నీ చేశారు.
  మూర్తి మళ్లీ ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టాడు.
  డాక్టర్ దగ్గర, లాబ్ లోనూ కూర్చుని కూర్చుని బంటీకి విసుగొచ్చేసింది. ఎంత టైమ్ వేస్టవుతోందో! తనెక్కడికీ కదలడానికి లేకుండా కాపలా కూర్చుంటున్నారు తల్లీ తండ్రీ.
  లాభం లేదు. ఏదో చెయ్యాలి, తల విదిల్చి ఒక నిర్ణయానికి వచ్చాడు బంటీ. ఆ రోజు ముందు అందరికంటే ముందు లేచి తయారైపోయి, పాలు తాగేసి, టిఫిన్ తినేసి చదువుకుంటూ కూర్చున్నాడు. ట్యూషన్ కి వెళ్తున్న చంటి తో కాసేపు గొడవ పెట్టుకున్నాడు.
  “నీ జెల్ రీఫిల్ ఉన్న పెన్ నాకిచ్చి ఇది తీసుకో! టెంత్ క్లాస్ కి ఇది చాల్లే.” మామూలుగా ఐతే చంటి బాగా ఇచ్చుకునేవాడే. కానీ ఈ టైమ్లో అమ్మ వాడినేమీ అననీయదు కదా! అయినా ఊరుకోలేక..
  “చదువుతున్నావులే బోడి ఇంటర్. నేనూ నెక్స్ ఇయర్ వస్తాగా. ఇంకా నీ చదువుకి పెన్నొక్కటే తక్కువ.” అనాలనుకుని, అమ్మనిచూసి మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఇదంతా చూసి మూర్తి నిట్టూర్చాడు.
  బంటీ మామూలుగా అవుతున్నాడు.
  రిపోర్ట్స్ అన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లాడు.
  డా. సుధీర్ బాగా పేరున్న ఫిజిషియన్. ఎక్కువ మాట్లాడడు కానీ, జబ్బు కనుక్కున్నాడంటే .. ఆ డయాగ్నోసిస్ కి తిరుగుండదు. రిపోర్ట్స్ చూసి మూర్తినీ శారదనీ బైట కూర్చోమన్నాడు. బంటీ చాలా హుషారుగా ఉన్నాడు. ముందురోజున్న డల్ నెస్ అంతా పోయింది. పావుగంట మాట్లాడగానే బంటీ కేసు అర్ధమైపోయింది సుధీర్ కి.
  “మూర్తిగారూ! బంటీని ఇంటర్ అయ్యాక హాస్టల్లోంచి తీసేసి బి.యే లో చేర్పిస్తే మార్పుంటుందని నా అభిప్రాయం. వీక్ నెస్ కి టానిక్ రాసిస్తాను. మంచి ఆహారం ఇచ్చి, అతనికి కావలసిన ఏర్పాట్లు చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. హిజ్ రిపోర్ట్స్ ఆర్ వెరీ నార్మల్" అన్నాడు సుధీర్.

  కాలేజ్ లో జరుగుతున్న హడావుడేం పట్టించుకోకుండా, పుస్తకం ముందేసుకుని, ఫిజిక్స్ ప్రాబ్లంస్ సాల్వ్ చేస్తోంది గౌరి. ‘అన్నం తిన్నావే బిడ్డా?’ కళ్ల ముందుకు యాదమ్మ వచ్చింది. ‘నీకిష్టమని అరిసెలు వండినా.. జర్ర ఒక్కటి తిను బిడ్డా..’ గౌరికి ఏడుపాగలేదు.
  అప్పుడే గదిలోకి వస్తున్న సుష్మ ఆగి పోయింది. నెమ్మదిగా తలుపు దగ్గరగా వేసి బైటికెళ్లిపోయింది. కాసేపు ఏడవనిస్తేనే మంచిదని.
  డైనింగ్ హాల్ కి వెళ్లి గ్లాస్ నిండా వేడి పాలు తీసుకుని తమ గదికి వెళ్లింది సుష్మ. ‘ఫాదర్' లో పిల్లలకి పాలకీ, ఫుడ్ కీ ఏ విధమైన ఆంక్షలూ ఉండవు. ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది.
  “హయ్ గౌరీ! బుర్ర షార్ప్ గా పని చేస్తుందని నేను తాగి వస్తూ వస్తూ నీక్కూడా తెచ్చాను. త్వరగా తాగేసి నాకీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లైన్ చెయ్యి.” వద్దు అనడానికి అవకాశం ఇవ్వకుండా హడావుడి చేసేసింది సుష్మ.
  కళ్లనిండా నీళ్లతో తలెత్తి సుష్మని చూసింది గౌరి.
  ఏకసంథగ్రాహి. స్నేహితురాలి ఆంతర్యం ఆమాత్రం కనిపెట్టలేదా! కళ్లు తుడుచుకుని పాలు తాగి, “ఏదీ ప్రాబ్లమ్" అడిగింది గౌరి.
  సుష్మతో పాటు తనూ వేస్తోంది కదా జగన్నాటకంలో పాత్ర.
  “కవిత ఎలా ఉంది?”
  “కొత్త వాతావరణం కదా! హుషారుగానే ఉంది. జరిగిందాని ఇమ్పాక్ట్ తెలుసుకునే వయసు దానికింకా లేదు. అదృష్టవంతురాలు.” అంది గౌరి.

  డాక్టర్ దగ్గర్నుంచి వస్తుంటే బంటీ హుషారుగా తమ కాలేజ్ సంగతులు చెప్తున్నాడు. మూర్తి, శారద ఒకళ్లనొకళ్లు చూసుకున్నారు.
  “ఏం మాట్లాడకు” అన్నట్లుసైగ చేశాడు మూర్తి. ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేక బంటీ కావాలని ఇదంతా చేస్తున్నాడని అనిపిస్తోంది శారదకి.
  మధ్యలో మూర్తి ఇరకాటంలో పడిపోయాడు. ఎట్లాగో కష్టపడి బంటీని నార్మల్ చెయ్యగలిగామనుకుంటే, శారదని పట్టుకోవడం కష్టంగా ఉంది.
  “అవును డాడీ. మేం ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కాలేజ్.. డ్రామా వేస్తున్నాం. అందులో నాదే మైన్ రోల్. ఇంక టూ డేస్ ఉంది. మరి నేను లేకుండా ఎలా మానేజ్ చేస్తున్నారో.. ఒక సారి ఫోన్ చేసి కనుక్కుందామా?”
  “అలాగా! నీకు హెల్త్ బాగా లేదని తీసుకొచ్చారు కదా! కొంచెం నీరసం తగ్గాక వెళ్దువుగాని.”
  “సరే డాడీ! మీరు ఇంట్లోకి వెళ్లండి. నేను ఫోన్ చేసి కనుక్కుంటాను.” ఆటో దిగగానే అన్నాడు బంటీ.
  ఇంటి ఎదురుగానే యస్.టి.డి బూత్ ఉంది. మూర్తి కూడా వెళ్దామనుకుని ఆగిపోయాడు. ఇంట్లోకి వెళ్లకుండా గేటు వెనకాల నిల్చుని చూడ సాగాడు.

  బంటీ కాలేజ్ కి ఫోన్ చేశాడు. వెంకట్ ఫోన్ తీశాడు.
  “సర్! ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది. కాలేజ్ కి రావచ్చా సార్? నావల్ల డ్రామాకి ఇబ్బంది కదా సార్? నేను వచ్చి కాలేజ్ డేకి వేస్తాను.”
  “డ్రామాకి మేం ఇంకొకళ్లని అరేంజ్ చేశాము. నువ్వు నీ ఆరోగ్యం చూసుకో. ఇంటర్ పరీక్షలు తప్పకుండా రాద్దువుగాని. వచ్చేటప్పుడు మీ నాన్నగారినికూడా నీ వెంట తీసుకురా.”
  “అలాగే సర్. ఉజ్వల సంగతి ఏమైనా తెలిసిందా సర్?” ఆతృతగా అడిగాడు బంటీ.
  “తెలీలేదమ్మా. నన్ను కలుసుకుందుకు వాళ్ల పేరెంట్స్ బయలుదేరి వస్తున్నారివేళ.”
  “సరే. మా ఫాదర్ ని తీసుకుని రావచ్చా సార్?”
  “తప్పకుండా. మెడికల్ సెర్టిఫికేట్ కూడా తీసుకుని రా.” ముందు జాగ్రత్తగా అన్నాడు వెంకట్.
  బంటీ దగ్గర ఊర్మిళ నంబర్ లేదు. వాళ్లింటికి వెళ్లి కనుక్కోవలసిందే. ఇంట్లో ఒప్పుకోరే.. ఛా! తనే చేతులారా చేసుకున్నాడు. ఇంటర్ అయే వరకూ ఓపిక పట్టవలసింది. హాలిడేస్ లో వచ్చినప్పుడు, గౌరి, సుష్మ, ఊర్మిళల గురించి మాత్రమే చెప్పింది ఉజ్జీ. వాళ్లు అక్కడే ఉన్నారు. ఇంక ఊర్మిళ ఒక్కతే మిగిలింది. గన్ షాట్ గా దానికి తెలిసే ఉంటుంది. ఇవేళ దాన్ని కలవాల్సిందే అనుకున్నాడు బంటీ.
  రోడ్ క్రాస్ చెయ్యడంలో నడవడంలో ఎక్కడా తడబాటు కనపడలేదు బంటీలో. బంటీని చూసి, అప్పుడే బయటికి వస్తున్నట్లు తనతో కలిసి ఇంట్లోకి నడిచాడు మూర్తి.
  “తమాషాగా ఉందే.. ఒక్క రోజులో ఇంత మార్పా! తప్పకుండా హాస్టల్, ఇష్టంలేని చదువు ప్రభావం అయుంటుంది.” అనుకున్నాడు మూర్తి.
  “డాడీ! రేపు బయల్దేరి కాలేజ్ కి వెళ్దాం. మెడికల్ సర్టిఫికేట్ తో పాటు మిమ్మల్ని కూడా తీసుకు రమ్మన్నారు ప్రిన్సిపాల్. అయామ్ ఆల్ రైట్. ప్లీజ్ డాడీ..”
  “అలాగేనమ్మా. తప్పకుండా. ఇంటర్ అయాక ఇక్కడే బి.యే లిట్ లో చేరచ్చు.” అన్నాడు మూర్తి.
  “”ష్యూర్ డాడీ. ఒక్క సారి మా ప్రెండ్ ని కలిసి రావచ్చా? ఒన్నవర్ లో వచ్చేస్తా.”
  ‘ఫాదర్' కాలేజ్ గేటు దగ్గరికి రాగానే దుఃఖం ముంచుకొచ్చింది సరస్వతికి. కిందటి సారి వచ్చినప్పుడు గేటు వరకూ పరుగెత్తుకుంటూ వచ్చి ‘టా..టా’ చెప్పింది ఉజ్జీ. అప్పుడు ఉజ్జీ నిలుచున్న గేటు దగ్గర కాసేపు ఆగిపోయింది. అడుగు ముందుకు పడట్లేదు.
  “పద సరూ!” సంతోష్ చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్లాడు. సాయంత్రం ఆరు దాటింది.
  వెంకట్ వీళ్లని చూడగానే లోపలికి రమ్మని, నీళ్లు, కాఫీ ఇచ్చి సేద తీరాక మొదలు పెట్టాడు. “అయామ్ సారీ అండీ. ఎలా జరిగిందో, ఎక్కడికెళ్లిందో ఏ మాత్రం క్లూ లేదు. రెండు నెలల నుంచీ టెస్ట్ లలో మంచి పెర్ ఫామెన్స్ లేదు. మీకు నోటిఫై చేస్తూనే ఉన్నాం.”
  “మీ మీద అంత భరోసా పెట్టి ఇక్కడుంచాం. అలాగంటే ఎలాగండీ..” ఇంకా ఏదో అనబోతున్న సరస్వతి చెయ్యిపట్టి ఆపాడు సంతోష్.
  “మరీ చిన్న పిల్లలు కాదు కదా! చీట్ చెయ్యాలంటే ఎవరికైనా పెద్ద కష్టం కాదు. తల్లిదండ్రుల దగ్గరున్నా చీట్ చేస్తారు పిల్లలు. ఉండండి తన రూమ్మేట్ ని పిలుస్తాను.” రిహార్సల్స్ అయి తమ బిల్డింగ్ కి వెళ్తున్న మంజులని పిలిపించాడు వెంకట్.
  మంజుల వచ్చి తనకు తెలిసిందంతా చెప్పింది అరగంట సేపు.
  “మీకు హెల్త్ బాగా లేదని చెప్పింది ఆంటీ.” మంజుల చెప్పింది వినగానే సరస్వతి మొహం పాలిపోయింది. తను వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుని, ప్రిన్సిపాల్ కి చెప్పమనడం.. అదీ మమ్మీ వాళ్లు రమ్మన్నారని. యస్సెమ్మెస్ లు చేస్తుండడం.. ఇవన్నీ వింటుంటే సరస్వతికి మతిపోయినంత పనైంది. తమకి తెలీకుండా ఇంత ఎదిగి పోయిందన్నమాట.
  అనుమానం లేదు. ఎవరితోనో.. ఎక్కడికో వెళ్లిపోయింది. చిన్నపిల్లని ఎవరో ట్రాప్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్లపోయారో! ముంబాయా, దుబాయా!
  సుష్మ పరుగెత్తుకుంటూ వచ్చి “పిన్నీ” అని పిలిచింది.
  సుష్మని చూడగానే మళ్లీ భోరుమంది సరస్వతి.
  పిన్నిని గట్టిగా పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నించింది సుష్మ.
  “నేనేం చెయ్యను పిన్నీ.. నాకు నా చదువుతోనే సరిపోతుంది. ఎప్పుడైనా రూమ్ కి వచ్చినా హీరోల గురించీ, సినిమాల గురించీ తప్ప మాట్లాడదు. ఏమైనా చెప్పబోతే, ‘థాంక్స్ ఫర్ మోరల్ లెసన్స్ అనేది.”
  “అవును. నన్నలాగ అనీ అనీ అలవాటైపోయింది.”
  “ఏదో టీనేజ్ ఆకతాయితనం అనుకున్నా కానీ ఇలా చేస్తుందనుకోలేదు.” అన్నాడు సంతోష్ బాధగా.
  “సెల్ ఆన్సర్ చెయ్యట్లేదు. ఎవరైనా చెయ్యనియ్యట్లేదేమో!” సరస్వతికి మళ్లీ కళ్లనిండా నీళ్లు. “ఇక్కడుండి చేసేదేంలేదు. పదండి. అక్క ఇంటికి వెళ్లి రేపు రాత్రికి హైద్రాబాద్ వెళ్దాం.”
  “పదండి. మిమ్మల్ని దింపి, నేను మా ఇంటికి వెళ్తాను. అలాగే రేప్పొద్దున్న పోలీస్ రిపోర్టిద్దాం.” వెంకట్ కారు దగ్గరకి తీసుకెల్లి తలుపు తీశాడు.
  “మీకు మా వల్ల బాగా ఇబ్బంది కలిగింది. వెరీ సారీ..” అన్నాడు సంతోష్ కారులో కూర్చుంటూ.
  “మీరేం చేస్తారండీ! ఆ వయసలాంటిది. ఈ మధ్య రెచ్చగొట్టే టీనేజ్ లౌవ్ స్టోరీ సినిమాలు ఎక్కువైపోయాయి. చాలా మంది ఆ ప్రవాహంలో కొట్టుకు పోతున్నారు.” వెంకట్ కారు బైటికి పోనిస్తూ అన్నాడు.

Monday, October 30, 2017

అంతా ప్రేమమయం- 13

Posted by Mantha Bhanumathi on Monday, October 30, 2017 with No comments
                                 అంతా ప్రేమమయం- 13


   సంతోష్ నీరసంగా తమ గదికి వెళ్లాడు. దార్లోనే ట్రావెల్ ఆఫీసుకి వెళ్లి టికెట్లు తీసుకున్నాడు. ఇంకో గంటలో బస్ ఉంది. అది కొంత నయం.
  సరస్వతి రూంలో పడుకుంది. తనకి ఏదో కారణం చెప్పి ఇవేళే వెల్లిపోతున్నాం అని చెప్పాలి.
  ఈ న్యూస్ సరస్వతికి ఎలా చెప్పాలి? అసలు తను హాస్టల్లో చేర్చద్దు అంది. ఉజ్వల ధోరణి బాగాలేదు అని శతవిధాల చెప్తూనే ఉంది. వినకుండా గారం చేసి కూతురు ఆడించినట్టల్లా ఆడాడు.
  బాబా మందిరం కేసి తిరిగి నమస్కారం చేసి మొక్కుకున్నాడు, కూతురు క్షేమంగా ఇంటికి రావాలని.
  కాళ్లు మొరాయిస్తున్నాయి, తన గదిలోకి వెళ్లడానికి. గట్టిగా ఊపిరి పీల్చి సరస్వతిని లేపాడు. “లే.. బట్టలన్నీ సర్దు మనం వెంటనే హైద్రాబాద్ వెళ్లాలి.”
  “ఆఫీసులో వచ్చెయ్యమన్నారా? రేపు నాసిక్ వెళ్దామనుకున్నాం కదా! ఎప్పుడూ ఇంతే. రాకరాక వస్తే..” సరస్వతి మొదలు పెట్టింది. ఐతేనేం ఉపాయం తనే చెప్పింది.
  “అవును సరూ! అర్జ్ంట్. మళ్లీ ఇంకో సారి వద్దాం.”
  “ఏం చేస్తాంలే.. ఎలాగో సెలవు దొరికిందనుకుంటే.. మామూలేగా.” ఏ మాటకామాటే చెప్పాలి. పది నిముషాల్లో సర్దేసి తయారై పోయింది సరస్వతి.
  బస్ లో కూర్చుని వెనక్కి వాలి ఆలోచిస్తున్నాడు సంతోష్. మెదడు చాలా చెడ్డది. ఎప్పుడూ జరుగ కూడనివి జరిగాయేమోనని ఆలోచిస్తూంటుంది. ఏమైపోయింది ఉజ్జీ? అసలు బతికుందా.. లేక ఎవరైనా.. కళ్లు గట్టిగా మూసుకున్నాడు. కణతలు గట్టిగా నొక్కుకున్నాడు.
  తనకి తెలిసి ఉజ్వల వెళ్లే వాళ్లెవరూ లేరు. సరు వాళ్లక్క ఫామిలీ క్లోజ్ గా ఉంటారు. వాళ్లు కాలేజ్ ఉన్న ఊర్లోనే ఉన్నారు. అక్కడికి వెళ్తే తనకెందుకు ఫోన్ చెస్తారు?
 పరీక్షలకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఇంతకీ రేపు సరూని తీసుకెళ్లాలా వద్దా? తీసుకెళ్తే ఒక బాధ, తీసుకెళ్లకపోతే ఇంకొక బాధ. ఇద్దరం వెళ్లడమే మంచిది. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదనేది అమ్మ. దాచి పెడ్తే ఇంకా ఏడవాల్సి వస్తుందేమో!
  “భగవంతుడా! ఎవరం కూడా ఏడవాలిసిన అవసరం రాకుండా చూడు.” దాదాపు పదో సారి దేవుడిని ప్రార్ధించాడు.
                                    ………………..
  కాలేజ్ ఆడిటోరియంలో సమావేశమయ్యారు భాస్కర్రావు, ఆది, ఆణు, ప్రవీణ్.. ఇంకా డ్రామాలో వేషం వేసే పదిమంది పిల్లలు. భాస్కర్ తల పట్టుకుని కూర్చున్నాడు. ఇంకా మంజుల రాలేదు. అసలు ఆ కాలేజ్ లో డ్రామా వెయ్యడం అదే మొదటి సారి.. అదీ వెంకట్ అభ్యంతర పెట్టడు కనుక.
  రెసిడెన్షియల్ కాలేజ్ లో ఆటలు, పాటలు, డ్రామాలు వంటి కార్యక్రమాలు పెడ్తే బోలెడు సమయం వృధా అయిపోతుంది కదా అని ఆలోచిస్తారు. ‘ఈ వేషాల కోసమా, మేం ఇంత డబ్బు ఖర్చు పెట్టి పిల్లల్ని ఇక్కడ చేర్పించింది..’ అంటూ తల్లిదండ్రులు నానా గోలా చేస్తారు. అలా ఉంటుంది యమ్సెట్ ఫీవర్.
  “ఈ బాచ్ వాళ్లు చాలా చురుకుగా ఉన్నారు. అందుకే ధైర్యం చేశాడు భాస్కర్. తన ఇంగ్లీష్ పోర్షన్ అయిపోయింది. రెండు సార్లు రివిజన్ కూడా అయింది. అతని క్లాస్ లోనే రిహార్సల్స్ వేస్తాము. అదీ పదిరోజులు మాత్రమే..” అని మానేజ్ మెంట్ దగ్గర పెర్మిషన్ తీసుకున్నాడు వెంకట్.
  పిల్లలందరికీ వాళ్ల పోర్షన్ కాగితాలిచ్చేసి, చదువు బోర్ కొట్టినప్పుడు బట్టీ కొట్టండి అని చెప్పాడు భాస్కర్.
  ఎంతో అనుభవం ఉన్న నటుల్లాగా రెండ్రోజుల్లో బట్టీ కొట్టేసి తయారైపోయారు. అమ్మాయిల వేషాలక్కూడా ఆ క్లాసులో మగ పిల్లల్నే తీసుకున్నారు.
  చాలా మందికి ఇంకా గడ్డం మీసం రాలేదు. చాలా సులువై పోయింది. భాస్కర్ కి  ఆశ్చర్యం వేసింది. ఇప్పటి పిల్లల ఎక్స్ పోజరే వేరు కదా!
  తమ చిన్నప్పుడు రెండు నెలలు పైగా రిహార్సల్ చేయించే వారు. ఇప్పుడు రెండ్రోజుల్లో రెడీ అయిపోయారు. ఒక వారం ప్రాక్టీస్ చేయిస్తే జె.వి. సోమయాజులు గారినే మించి నటించే లాగున్నారు.
  ముఖ్యంగా బంటీ.. తనదే మైన్ రోల్. ఆ ఉచ్ఛారణ, మాడ్యులేషన్.. సూపర్బ్. ఆ అబ్బాయి ఇంగ్లీష్ చూసి ముందు ఇంగ్లీషులో వేయిద్దామనుకున్నాడు. కానీ మిగిలిన పిల్లలు పాత యురోపియన్ ఇంగ్లీష్ మాట్లాడలేక పోయారు. అయినా తన దగ్గర తెలుగు స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఈ మంజుల ఎలా ఉంటుందో!
  వాళ్ల క్లాస్ కి తను వెళ్లడు. యాక్టర్లందరూ తలలు వేళాడేసి కూర్చున్నారు. వాళ్ల ఉత్సాహం అంతా నీరు కారిపోయింది.
  “గుడీవినింగ్ సార్.” భాస్కర్ తలెత్తాడు. ఒక్క క్షణం తన కళ్లని తనే నమ్మలేకపోయాడు. బంటీకి ఆడ వేషం వేస్తే ఎలా ఉంటాడో అలా ఉంది మంజుల. పోలికలు వేరైనా, అదే పెర్సనాలిటీ. బంటీ మొహం చూసి తను ఆ రోల్ కి సెలెక్ట్ చేశాడు. మంజుల ఇంకా బాగా సరిపోతుందేమో అనిపించింది.  అబ్బాయిలా నటించ గలదా?
  “దామ్మా! నువ్వు డ్రామాలు బాగా వేస్తావుట కదా!”
  “అవును సార్. రాష్ట్ర స్థాయిలో బహుమతులు వచ్చాయి.”
  మంజుల తెలుగు ఉచ్ఛారణకి ఆశ్చర్య పోయాడు భాస్కర్.
  “ఏ ఊరు మీది?”
  “ఏలూరు సార్. మా ఇంటి పేరు ‘బందా’ వారు.”
  “అలా చెప్పు.” ఒక్క సారిగా ఎక్కడ లేని ధైర్యం వచ్చింది భాస్కర్ కి. బంటీ కిచ్చిన కాగితాలు మంజుల కిచ్చి, గంట సేపట్లో ఎంత నేర్చుకోగలుగుతే అంత నేర్చుకుని రమ్మన్నాడు. కథంతా వివరించి, సీన్లు ఎన్ని ఉంటాయో స్క్రీన్ ప్లే చూపించి వివరించాడు. ఈ లోగా మిగిలిన పిల్లల చేత రిహార్సల్ వేయించాడు.
  మంజుల తర్వాత ప్రవీణ్ ది పెద్ద రోల్. అతనే కొంచెం కష్ట పడాల్సి వచ్చింది. ఎందుకంటే అతని మాతృ భాష కన్నడం. అందుకని, తెలుగు డైలాగులు కన్నడంలో రాసుకుని తయారవ వలసి వచ్చింది.
  “ఇంక మూడ్రోజులే ఉంది. ఫోర్టీన్త్ న పదకొండింటికే ఫంక్షన్. మన డ్రామా పన్నెండుకి మొదలవుతుంది. పొద్దుట్నుంచీ మేకప్ లూ అవీ.. అందుకని మనం ఈ మూడ్రోజులూ పొద్దున్న సాయంత్రం కూడా రిహార్సల్ చెయ్యాలి. మీ స్డడీ టైమ్ అడ్జస్ట్ చేసుకోండి. చదువు ఏ మాత్రం దెబ్బ తినకూడదు.” అందరినీ హెచ్చరించాడు భాస్కర్.
  మొదటి సీనే మంజులది. బాక్ గ్రౌండ్ లో భాస్కర్ చెప్తుంటే ప్రవేశిస్తుంది. ఇంక అక్కడి నుంచీ మంజుల పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు తిరుగు తుంటాయి.
  ఇచ్చిన ఒక గంటలో ఎలా ప్రిపేరయిందో కానీ.. రిహార్సల్స్ మొదలయినప్పటి నుంచీ, మంజులని కాక, ఆ అమ్మాయి వేసే రోల్ నే చూడ సాగాడు భాస్కర్.
  మొత్తం డ్రామాలో నాలుగు సీన్లలో ఉంది మంజుల. రెండు  సీన్లు రిహార్సల్స్ చెయ్య గలిగారు. మంజుల చేసే పద్ధతి చూసి మిగిలిన వాళ్లకి కూడా ఊపు వచ్చింది. అప్పటికే వాళ్లు ప్రిపేరయి ఉన్నారు కూడా.
  చిన్న చిన్న మార్పులు మంజులే చేసింది.రెండు సీన్లు అయ్యాక మంజుల అంది, “సార్! మిగిలిన రెండు సీన్లూ రేప్పొద్దున్నకి తయారై పోతాను.
  రిహార్సల్స్ అవుతున్నంత సేపూ మంజులకి వేరే దృష్టి లేదు. అంతలా లీనమైపోయింది.
  “సరేనమ్మా! మిగిలిన పాత్రల వాళ్లవి కూడా ఏమైనా మార్పులుంటే చెప్పమ్మా. సంభాషణలు పలకడంలో, నిల్చోవడంలో.. ఆడియన్స్ కి ఎదురుగా ఎవరుండాలీ, ఏ పక్కగా ఎవరుండాలీ వంటి వాటిల్లో కొంచెం సహాయం చెయ్యి.
  భాస్కర్‍కి మంజులని చూస్తే ఎంతో ముచ్చటేసింది. ఈ గండం గట్టెక్కెంచడానికి దేముడిచ్చిన వరం అనుకున్నాడు. గట్టెక్కించడమే కాదు.. కొండెక్కించేలాగుంది.
  “సంతోషంగా సార్” అంది. ఆ పిల్లకి సహజంగా, వంశ పారంపర్యంగా అబ్బిన కళ అది. మన దేశంలో కూడా ‘ఓపెరా’ ల లాగా నాటకాలతో జీవనం సాగించ గలుగుతే, ఇతర విద్యలు అనవసరం అటువంటి వాళ్లకి.
  మంజుల వెంటనే రంగం లోకి దిగిపోయింది. ప్రవీణ్‍కి చాలా సూచనలిచ్చింది. ఎక్కువ సమయం అతని మీదే వెచ్చించింది. ప్రవీణ్ కూడా “అమ్మాయి చెప్పడం ఏమిటి, నేను వినడం ఏమిటి” అనుకోకుండా, అన్నీ రాసుకుని, తెలియనివి ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకున్నాడు.
  మిగిగ్లిన వాళ్లవి చిన్న రోల్స్. తర్వాత ఆర్ణవ్‍ది మంచి పాత్ర. వాడు ఇంకా పెద్ద కళ్లతో పాల బుగ్గలతో అమ్మాయిలాగే ఉంటాడు. కానీ వాడికి రెండు మూడు తప్ప పెద్ద డైలాగులేవు. అంతా యాక్షనే.
  అసలందరూ టివీల ప్రభావమో ఏమో కానీ, ఇలా చెప్తే అలా అందేసుకుంటున్నారు.

  మొత్తానికి రిహార్సల్ అంతా అయే సరికి మూడు గంటలు పట్టింది. మరునాడు పొద్దున్న పదిగంటలకి కలుద్దామనుకున్నారు. ఆది వాళ్లకి అప్పుడు భాస్కర్రావు క్లాసే. మంజుల కూడా వచ్చెయ్యగలనంది. తనకి తెలుగు క్లాసుట. తెలుగులో ఆ పిల్ల లెక్చరర్‍ని పక్కన కూర్చో పెట్టి పాఠాలు చెప్పగలదు.
  “అందరూ మీ స్టడీ అవర్స్ ని కవర్ చేసుకోవాలి. నాకు మాట తేకూడదు.”
  “తేం సార్.” మరు నిముషంలో హాల్ ఖాళీ అయింది.
  భాస్కర్ వెళ్దామనుకుంటుండగా వెంకట్ వచ్చాడు.
  “రిహార్సల్ ఎలా ఉంది? బంటీని పిలిపించాలా?” నవ్వుతూ అడిగాడు.
  భాస్కర్‍కి కళ్లలో నీళ్లు తిరిగాయి, ఆనందంతో. “థాంక్యూ సర్. మంజుల ఈజ్ అవుట్‍స్టాండింగ్. అసలు ప్రోగ్రామ్ రూపమే మారి పోయింది. మొదట్లో మీ మీద కోపం వచ్చిన మాట నిజం. కానీ ఇప్పుడు బంటీ లేకపోవడమే మంచిదనిపిస్తోంది.”
  “నాకు అనుకోకుండా మిమ్మల్ని చూస్తూనే స్ట్రైక్ అయింది. ఈ అమ్మాయి వేసిన డ్రామాకి స్టేట్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చింది. లక్కిగా నేను వెళ్లాను. తను మన కాలేజ్ లో జాయిన్ అయినప్పుడే అనుకున్నాను.. ఏదో మోనో యాక్షన్ అయినా చేయించాలని. తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు మీ మూలంగా ఛాన్స్ వచ్చింది. ఇలాంటి రిక్రియేషన్స్ హెల్ప్ చేస్తాయని నా నమ్మకం.” వెంకట్ అన్నాడు.
  “ష్యూర్ సర్. డెఫినిట్‍గా హెల్ప్ చేస్తాయి.”

  ఉలిక్కిపడి లేచింది ఉజ్వల. ఎదురుగా గడియారం ఎనిమిది చూపిస్తోంది. ఇంట్లో అలికిడి లేదు. ఊర్మిళ ఇంకా లేవలేదు.
  తొమ్మిదికల్లా స్టూడియోలో ఉండాలి. ఫిబ్రవరి పదకొండు తన లైఫ్‍లో చాలా ఇంపార్టెంట్ డే. ఇవేళే తను ఆదిత్యని కలవబోతోంది. పర్సనల్‍గా. అది కూడా కొన్ని గంటలు ఫ్రీగా మాట్లాడుతూ.
  ఒక్క ఉదుట్న బాత్రూంలో దూరింది. స్నానంతో సహా అన్నీ వెంట వెంటనే కానిచ్చేసింది.
  “ఊర్మీ! లే లే. టైమయిపోతోంది. ఫాస్ట్..”
  “అబ్బ ఉండవే! పడిగాపులు పడ్డవేగా. నిన్న చూడు ఎంత టైర్ అయిపోయామో. మెల్లిగా వెళ్దాం.”
  “సరే, నువ్వు తర్వాత రా. నే వెళ్తున్నా.”
  “హేయ్.. హౌ డేర్ యు? ఇంత చేస్తున్న నన్ను వదిలి నువ్వెళ్తావా? ఊర్మిళ ఒళ్లు విరిచుకుంటూ లేచి తీరుబడిగా తయారయింది.. ఊజ్వల అసహనంగా పచార్లు చేస్తుంటే.
  “టిఫిన్ పాక్ చేసి తీసుకుపోదాం. తినడానికి నో టైమ్. ఆక్కడ కూడా ఎక్కడికైనా వెళ్లడాన్కి టైమ్ ఉండకపోవచ్చు.” ఊర్మిళకి నవ్వొచ్చింది.
  “ఎంత ఆత్రం” అనుకుంది. “అక్కడ వాళ్లెవరూ పన్నెండు వరకూ రానేరారు” అంటూ రెండేసి బాక్సుల్లో ఉప్మా, పెరుగన్నం స్పూన్లతో సహా పెట్టింది.
  స్టూడెయోలోకి స్కూటీ వెళ్తుంటే సరిగ్గా తొమ్మిదయింది. అప్పటికే వాణి, ఇంకొక అమ్మాయి వచ్చేసి ఉన్నారు. అంతా హడావుడిగా ఉంది. లోపలైతే చెప్పక్కర్లేదు. లైట్లన్నీ వేసేసి ఎవరి పన్లు వాళ్లు చేసుకు పోతున్నారు. మధ్య మధ్య ప్రొడక్షన్ మానేజర్ కేకలు. ఊర్మిళని తినేసేలా చూసి,స్కూటీ పార్క్ చేసి లోపలికి నడిచింది ఉజ్వల.
  “ఉజ్జీ! సారీనే.. టైమ్ కి వచ్చాం కదా!” ఊర్మిళ వెనకాలే వస్తుంటే తలెగరేసి వాణి పక్కనే కూచుంది.
  “ఇంత ఎర్లీగా వచ్చేశారే అందరూ?”
  “నైన్ థర్టీకి ఆదిత్య వస్తున్నాడట. వెంటనే ప్రోగ్రామ్ స్టార్త్.” అప్పజెప్పినట్లు చెప్పేసి, కాలూపుతూ కూర్చుంది వాణి.
  ఈ పిల్ల ఇంత నిశ్చింతగా ఎలా కూర్చుందో అనుకుంది ఉజ్వల. ఉజ్వలకైతే కాళ్లలోంచీ వణుకు మొదలయింది. అరచేతుల్లో చెమటలు. ‘స్టే కూల్’ అని మనసులో అనుకుంటూ కూర్చుంది.
  ఊర్మిళ బిక్కమొహం వేసుకుని పక్కకి వచ్చి “సారీ.. సారీ. లెంపలేసుకుంటున్నాగా!” అంది.
  “ఇట్ సాల్రైట్. కూర్చో.” అంది. ‘ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నానేంటీ.. అసలు ఊర్మి వల్లే కదా ఈ ఛాన్స్ వచ్చింది’ అనుకుంటూ ఊర్మిళ చెయ్యి పట్టుకుని నొక్కింది.
  “రండి మేడం.” ఎవరో పిలిచారు. గుండె దడదడలాడుతుండగా లోపలికి నడిచింది ఉజ్వల.
  వాణీ, వీణా (ఇంకో అమ్మాయి.. అప్పుడే పరిచయం అయింది.) గుసగుస లాడుతూ వెనుక వచ్చారు. ఎందుకో గానీ వాళ్లిద్దరూ ఉజ్వలని తమతో కలుపుకోలేదు. మొదట్నుంచీ శతృవుని చూసినట్లే చూస్తున్నారు. ఊర్మిళ కూడా లేచి మొహమాటంగా చూస్తూ ఫాలో అయింది.
  “ఇట్రండి మేడమ్” అంటూ ఇంకా లోపలికి.. రికార్డింగ్ రూమ్ వెనక్కి తీసుకెళ్లారు. ఊర్మిళ కూడా వెళ్తుంటే ఎవరూ అడ్డు చెప్పలేదు. అక్కడ పెద్ద అద్దాలు గోడకి అతికించి ఉన్నాయి. ముగ్గురమ్మాయిల్నీ కూర్చో పెట్టి లైట్ గా మేకప్ చేశారు. ఉజ్వల బాత్రూమ్ లోకి వెళ్లి కొత్త డ్రెస్ వేసుకుని వచ్చింది.
  “అబ్బ.. హీరోయిన్ లాగ్ ఉంది.. అందుకే కుళ్లి పోతున్నారు వాళ్లిద్దరూ..” అనుకుంది ఊర్మిళ.
  ఉజ్వలకి గర్వంగా అనిపించింది.. ఊర్మి బొటన వేలెత్తి థమ్సప్ సైన్ చూపిస్తుంటే.
  అందరూ మళ్ళీ స్టూడియోలోకి వచ్చారు. ముందు రోజుకీ ఆ వేళ్టికీ పోలికే లేదు. అంతా హార్ట్ షేప్ బుడగలతో, పువ్వులతో అలంకరించారు. గుండ్రంగా వేదిక. దాని మీద ఒక మహారాజా కుర్చీ. దానికెదురుగా కొంచెం చిన్న కుర్చీ (మహారాణీ?) ఉన్నాయి.స్టూడియో అంతా వాక్యూమ్ క్లీనింగ్ చేసి ఫ్రెషనర్ జల్లారు. కామెరా మన్ లైట్లు సరి జూసుకుంటున్నాడు.
  ఎక్కడి నుంచి వచ్చారో కానీ బిలబిలా పదిమంది అమ్మాయిలు వచ్చి ఆడియన్స్ లో కూర్చున్నారు. ఊర్మిళని కూడా వాళ్లతో కూర్చోమన్నారు.ఉజ్వల, వీణి, వీణలని వేరుగా ఒక దగ్గర కూర్చోపెట్టారు. ప్రొడక్షన్ మానేజర్, అతని అసిస్టెంట్ చైతన్య, పదోసారి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదాని చూసుకున్నారు.
  
  ఇంతలో బైట ఒక్క సారిగా కలకలం మొదలయ్యింది.. అడుగుల చప్పుళ్లు, మాటలు.. గబగబా నడుస్తూ హీరో ఆదిత్య లోపలికి వచ్చాడు. అందరూ లేచి నిలుచున్నారు. చెయ్యూపుతూ, పళ్లు మెరెసేలా నవ్వుతూ, మేకప్ రూమ్ లో కెళ్లి పోయాడు ఆదిత్య.
  తన ముందు నుంచి ఆదిత్య వెళ్లి పోయాక, ఆ గాలిని దీర్ఘంగా పీల్చి, అంతు లేని ఉద్వేగానికి లోనయ్యింది ఉజ్వల. “ఈ క్షణం కోసమే అంత రిస్క్ తీసుకుంది.. అమ్మో వద్దొద్దు. దాన్ని గురించి ఆలోచిస్తే ఇప్పుడేం చెయ్యలేను. ఏమవుతుందో రేపు చూసుకుందాం” మూతి బిగించి కళ్లు గట్టిగా మూసి తెరిచింది.
  పక్కన కూర్చున్న వాళ్లిద్దరూ ఎంత ఆరామ్ ఉన్నారో! తను కూడా అలా ఉండ గలుగుతే ఎంత బాగుండును? అందరిలో ఉత్సాహం నింపుతూ, హీరో ఆదిత్య మేకప్ రూం లోంచి బైటికి వచ్చి, మహారాజా కుర్చీలో కూర్చున్నాడు.
  “ఏం ఠీవి? మేకప్ ఎక్కువ లేకపోయినా మహారాజు లాగే ఉన్నాడు” అనుకుంది ఉజ్వల.
   “మిస్. వాణి!” పిలుపు వినపడింది. నిరుత్సాహంగా వెనక్కి వాలింది ఉజ్వల. తర్వాత వీణని పిలిచారు. అసలు వాళ్లెం అడుగుతున్నారో, ఏం చేస్తున్నారో.. ఏదీ ఉజ్వల మనసుకెక్కలేదు.
  “మిస్. ఉజ్వలా!” ఎప్పటికో పిలిచారు..

  అప్పుడు టైమ్ పదకొండున్నర.
.......................

Monday, October 23, 2017

అంతా ప్రేమమయం- 12

Posted by Mantha Bhanumathi on Monday, October 23, 2017 with No comments
                                                        అంతా ప్రేమమయం- 12


  రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఆరు గంటలకి ‘ఫాదర్' దగ్గరకి వచ్చాడు వెంకట్.
  చంద్రశేఖరం గారు హైద్రాబాద్ లో ఉండిపోయారు. శంకర్ కాలేజ్ వ్యవహారాలు అన్నీ చూసుకుంటున్నాడు.
  “ఉజ్వల గురిచి ఏమైనా తెలిసిందా?”
  “లేదు సార్. ఆమె సెల్ ఆఫ్ చేసేసింది. వాళ్లింటికి ఫోన్ చేస్తే నో ఆన్సర్.” చెప్పాడు శంకర్.
  “అవును. వాళ్లు ఇంట్లో లేరు. ఇక్కడంతా మామూలే కదా?”
  “మామూలే సార్. ఇప్పుడే గౌరి వచ్చింది. వాళ్ల చెల్లెలు ఎలా ఉందో తెలుసుకోవడానికి.”
  “అరే.. ఈ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయా. ఇంటికెళ్లి స్నానం చేసి వస్తాను. వచ్చాక గౌరిని పిలుద్దాం.”
  వెంకట్ ఊర్లో ఉంటాడు, కానీ కాలేజ్ నుంచి అంత దూరం లేదు. ఊళ్లోకి ప్రవేశిస్తూనే మొదట్లోనే ఉంటుంది అతని ఇల్లు. రెండ్రోజుల్నుంచీ చాలా అలసి పోయాడు. శారీరికంగా మానసికంగా.
  ఇంటికెళ్లి, వేడి వేడి నీళ్లతో స్నానం చేసేసరికి నిద్ర ముంచుకొచ్చింది. ఆపుకుని కాలేజ్ కి వెళ్లాడు.
  “కాస్త రెస్ట్ తీసుకుని మధ్యాన్నించి వెళ్లచ్చు కదా!” భార్య మణి అడిగింది.
  “లేదు లేవోయ్. కాసిని అర్జంట్ పనులున్నాయి. చూసుకుని ఇవేళ త్వరగా వచ్చేస్తాలే.”
  ఫిబ్రవరి, మార్చి పరీక్షరోజులని తెలుసు మణికి. కాలేజ్ లో పిల్లలకే కాదు, అతని శక్తికీ, ఓర్పుకీ కూడా గడ్డు రోజులే. వెంకట్, మణిలకి ఇద్దరమ్మాయిలు. ఒకమ్మాయి బెంగుళూరులో, ఇంకొకమ్మాయి చెన్నైలో చదువుతున్నారు. పెద్దమ్మాయి అపర్ణ ఐఐయమ్ లో యెమ్. బిఏ చేస్తోంది. బి.యస్సీ అవగానే ఎంతో క్లిష్టమయిన కాట్ పరీక్షలో మంచి రాంక్ తెచ్చుకుంది.
  రెండో అమ్మాయి శిరీష చెన్నై ఐఐటి లో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది.
  తన పనిలో ఎంత తలమునకలుగా ఉన్నా, పిల్లలకోసం తప్పనిసరిగా రెండుగంటలు కేటాయించేవాడు వెంకట్. మణి ఐతే పిల్లలు చదువుతున్నంత సేపూ ఏవో పనులు చేసుకుంటూ మెలకువగానే ఉండేది. వెంకట్ కి తన భార్యనీ పిల్లలనీ చూస్తే ఏంతో గర్వంగా ఉంటుంది. కానీ ఎవరికీ వాళ్ల గురించి చెప్పడు.
  ‘ఫాదర్’ లో పని చేసే వాళ్లకి అక్కడున్నంత సేపూ కాలేజ్, స్టూడెంట్స్ తప్ప ఇంకేం గుర్తుండరు.

  వెంకట్ తన గదిలోకి అడుగు పెడ్తూనే బయటి ప్రపంచం మరచి పోయాడు. ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి.
  ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్రి ఫైనల్స్ కండక్ట్ చెయ్యాలి. అలా అని యమ్ సెట్ కోచింగ్ నెగ్లెక్ట్ చెయ్యడానికి లేదు.
  కంప్యూటర్ల పుణ్యమా అని పేపర్ వర్క్ తగ్గింది. పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడాలి. అన్నీ ప్రింటవుట్లు తియ్యమని మొన్ననే చెప్పాడు. అవన్నీ పేరెంట్స్ కి పంపించారో లేదో చూడాలి. అలా అష్టావధానం చేస్తుండగా కడుపులో మంటగా అనిపించింది. టైమ్ చూశాడు. ఒంటిగంట. అప్పుడు గుర్తుకొచ్చింది. పొద్దుట్నించీ ఏమీ తినలేదని. డైనింగ్ హాలుకి నడిచాడు.
  “గుడ్ మార్నింగ్ సార్.” లక్ష్మి విష్ చేసింది.
  “గుడ్. మీతో చాలా మాట్లాడాలి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం.” అన్ని పనులూ కలిసొస్తాయని, చాలా రోజులయింది అటుకేసి వెళ్లి ఆనీ.. అమ్మాయిల హాస్టల్ కేసి నడిచాడు.
  “చెప్పండి మేడమ్. ఉజ్వల గురించి ఏమైనా తెలిసిందా?”
  “లేదు. పొద్దుట్నించీ గౌరి మూడు సార్లు తిరిగింది.”
  “అయామ్ సారీ. ఆ సంగతే మరచి పోయాను.”
  డైనింగ్ హాలుకి వెళ్లగానే భోజనం చేస్తున్న అమ్మాయిలంతా లేచి నిలుచున్నారు.
  “కూర్చోండి” అంటూ గౌరి ఎక్కడుందో చూసి ఆ బల్ల దగ్గరకి నడిచాడు. తను ప్లేట్ తీసుకుని లక్ష్మిని కూడా తీసుకోమన్నాడు.
  ప్రతీ బల్ల దగ్గరా అన్నం, పప్పు, సాంబారు, కూర గిన్నెల్లో పెట్టుంటాయి. అందరూ తమ పళ్లాల్లో వడ్డించుకుని అక్కడే కూర్చుని తింటారు.
  వెంకట్ సార్ తమ డైనింగ్ హాలుకి వచ్చారు.. బి కేర్ ఫుల్. అమ్మాయిలందరికీ ఇన్ఫో వెళ్లి పోయింది.
  బుద్ధిగా ఎక్కడెక్కడున్నవాళ్లూ తమతమ బల్లల దగ్గరికి వచ్చి, తినడమే తమ ధ్యేయమన్నట్లు తినేస్తున్నారు.
  గౌరి ఉన్న బల్ల దగ్గరే సుష్మ, మంజుల కూడా ఉన్నారు.
  “ఏమ్మా గౌరీ! కవితతో మాట్లాడ్తావా? బాగా ఉందిట.” వెంకట్, కవిత ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి, కవితని పిలిపించమని రిక్వెస్ట్ చేశాడు.
  కొంచెం సేపట్లో మోగింది ఫోను.
  వెంకట్ మాట్లాడి గౌరికిచ్చాడు. గౌరి కృతజ్ఞతతో చూస్తూ ఫోన్ అందుకుంది.
  “కవితా ఎట్లా ఉన్నావు?” కవిత గట్టిగా మాట్లాడ్డం వల్ల అందరికీ వినిపిస్తోంది.
  “మంచిగున్నా అక్కా. ఇక్కడందరూ మంచిగా చూసుకుంటున్నారు. నిన్న నాకసలు అన్నం తినబుద్ధి కాలేదక్కా. ఏడుపొచ్చింది. వార్డెన్ మేడమ్ దగ్గరుండి తినిపించిండ్రు. మంచోళ్లక్కా. నిన్న నాకు అన్నింట్లో యూనిట్ టెస్టులు పెట్టిన్రు. అన్నింట్ల తొంభై పైననే వచ్చినయ్.” కాసేపు మాట్లాడ నిచ్చి, ధైర్యం చేప్పి గౌరి ఫోన్ పెట్టేసింది.
  “సర్!” మంజుల అంది, “ఉజ్వల, సుష్మ కజిన్ సార్.”
  “వాట్.. ఈ సంగతి నాకెవరూ చెప్పలేదే!” వెంకట్ ఆశ్చర్యంగా చూశాడు సుష్మ కేసి.
  “మా పిన్ని కూతురు సర్.”
  “నీకు తెలుసా ఉజ్వల సంగతి?”
  “తెలుసు సార్. కానీ పిన్నీ వాళ్లు ఫోన్ ఎత్తడం లేదు.”
  “అవునమ్మా. షిర్డీ వెళ్లారుట. సన్ డే వస్తారు. మాకందరికీ ఆందోళనగా ఉంది. ఏం చెయ్యాలో అర్ధం అవడం లేదు.”
  “ఏం ఫర్లేదు సార్. కేర్ ఫ్రీ టైపు. ఎక్కడికో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లుంటుంది. వచ్చేస్తుంది. మీరేం వర్రీ అవకండి సార్..” సుష్మ మొహమాటంగా అంది.
  “ఎలాగమ్మా! ఎంత కూల్ గా ఉందామనుకున్నాఅదే ఆలోచనలోకి వస్తోంది. ఏదైనా అనుకోనిది జరుగుతే మేం ఏం చెయ్యాలి? పేరెంట్స్ మా మీద భరోసా పెట్టుకుని పంపుతారు కదా! పదహారేళ్ల పిల్ల మాయం అయిందంటే.. నాట్ ఎ స్మాల్ థింగ్.” సీరియస్ గా అన్నాడు.
  అందరూ మాట్లాడకుండా తినేశారు.
  “వస్తానమ్మా! సారీ, ఇవేళ మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అందరూ బాగా చదువుతున్నారు కదా! ఆల్ ద బెస్ట్.” హాల్లో ఉన్న పిల్లలందరికీ చెయ్యూపి, వెంకట్ బైటికి నడిచాడు. మగ పిల్లల డైనింగ్ హాల్స్ కంటే అమ్మాయిలవి నీట్ గా ఉంటాయి.
  బాయిస్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు.
  బంటీ సమస్య తీరింది. ఉజ్వలది కూడా తీరి పోతే ఈ సంవత్సరం గట్టెక్కినట్లే అనుకున్నాడు వెంకట్.

  “మే వుయ్ కమిన్ సర్?”
  తల దించుకుని సీరియస్ గా పరీక్షలకు కావలసిన బడ్చెట్ చూసుకుంటున్న వెంకట్ తలెత్తాడు. ఎంత సర్ది చూసినా ఎప్పుడూ లోటే వస్తుంది.
  ముఖ్యంగా కెమిస్ట్రీలో..పిల్లలు ఏం చేస్తుంటారో కానీ కెమికల్స్ ఊది పారేస్తుంటారు.
  ఇంగ్లీష్ లెక్చరర్ భాస్కర్రావుతో ఆది, ఆణు, ప్రవీణ్ లోపలికి వస్తున్నారు. భాస్కర్రావు ఆణు కేసి చెప్పు అన్నట్లు చూశాడు.
  వాళ్లని చూడగానే వెంకట్ కి చిరాకంతా మాయమై, మొహంలో నవ్వు చోటు చేసుకుంది. భాస్కర్ చాలా ఉత్సాహంగా, చురుకుగా తయారయ్యాడు. వైస్ ప్రిన్సిపాల్ శంకర్ కి కుడి భుజంలా ఉంటున్నాడు.
  “యస్..” పెన్ కింద పెట్టి ప్రసన్నంగా చూశాడు వెంకట్. ఎదురుగా నిల్చున్న ముగ్గరు స్టూడెంట్స్ జెమ్స్. మంచి రాంకులు సాధిస్తారని వెంకట్ కి గట్టి నమ్మకం.
  “ఈ సారి కాలేజ్ డే ఫిబ్రవరి ట్వెల్త్ వచ్చింది సార్.”
  “సో.. వాట్?”
  “ఆ రోజు వాలంటైన్స్ డే కదా?”
  “అవునవును. కానీ కాలేజ్ డే నాడు హాలిడే ఎలా ఇస్తాం?” వెంకట్ కి ఆ రోజు క్లాసులో స్టూడెంట్స్ అంతా సెలవు ఇమ్మని అడగటం గుర్తుకొచ్చింది.
  “వద్దు సార్. ఎలాగో కాలేజ్ డే అయిన మరునాడు సెలవుంటుంది కదా! ఆ రోజు మేం ఒక డ్రామా వేస్తు్నాం. ప్రిపేరయిపోయాం కూడా.”
  “మరిప్పుడు సమస్య ఏమిటి?”
  “ఏం లేదు. అందులో బంటీది ముఖ్యమైన రోల్. మీరు హైద్రాబాద్ తీసుకెళ్లారని..” అన్నాడు భాస్కర్.
  ఇంతలో ఫోన్మోగింది. “ప్రిన్సిపాల్ గారూ! నా పేరు సంతోష్. ఉజ్వల ఫాదర్ ని.”
  వెంకట్ ఉద్వేగంతో మళ్లీ అడిగాడు.
  సంతోష్ కొంచెం గట్టిగా చెప్పాడు, వినిపించలేదేమోనని.
  వెంకట్ తన చెవులను తనే నమ్మలేకపోయాడు. “ఒక్క నిముషం..” అని, “మీరు ఫైవ్ మినిట్స్ ఆగి వస్తారా ప్లీజ్..” భాస్కర్రావుతో అన్నాడు.
  భాస్కర్ తన బృందంతో బైటికి నడిచాడు.
  “హలో.. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?”
  “షిర్డీ నుంచే నండీ. నేను ఏదో పని మీద ఆఫీస్ కి ఫోన్ చేస్తే, మీరు ఫోన్ చెయ్యమన్నారని చెప్పారు. ఉజ్వల ఎలా ఉందండీ? ఎనీ ప్రాబ్లమ్?” అడిగాడు సంతోష్.
  “మీరు కొంచె.. ఆందోళన పడకుండా వినండి..” వెంకట్ జరిగిందంతా చెప్పాడు.
  సంతోష్ కి గుండె ఆగిపోయినట్లయింది. “ఎప్పట్నుచీ..”
  “ఎనిమిదో తారీఖు రాత్రి నుంచీ కనిపించడం లేదు.”
  “ఎవరికీ ఏం చెప్పలేదా?” తారీఖు చూశాడు. ‘పది’ అంటే రెండ్రోజులయింది.
  వాళ్లమ్మకి బాగా లేదని వెళ్దామనుకుంటున్నానని అందరితో చెప్పిందని వెంకట్ చెప్పాడు.
  “సరే నండీ. మేం ఇవేళ బైల్దేరి హైద్రాబాద్ వెళ్లి, అక్కడ్నుంచి మీ కాలేజ్ కి వస్తాం. రేపు రాత్రి అవుతుంది. రాత్రి మిమ్మల్ని కలవచ్చా?”
  “తప్పకుండానండీ. ఎదురు చూస్తుంటాను.”
  వెంకట్ ఫోన్ పెట్టేసి గట్టిగా నిట్టూర్చాడు రిలీఫ్ తో. తిరపతిని పిలిచి భాస్కర్రావును రమ్మని చెప్పాడు.
  భాస్కర్ వాళ్లు వచ్చి, మళ్లీ అంతా చెప్పారు.
  “ఇప్పుడు వేరే వాళ్లని పెట్టాలంటే కష్టం సార్. బంటీ చాలా బాగా చేస్తున్నాడు.” ఆది, ఆణు వేడుకోలుగా అన్నారు.
  “ఇప్పుడు కుదరదమ్మా. బంటీకి హెల్త్ బాగా లేదు. మేం బాధ్యత తీసుకోలేం. కొంచెం ఆగండి.” అని కంప్యూటర్ లో ఏదో వెదికాడు.
  “అమ్మాయిల్లో ఆ రోల్ కి ట్రై చేయండి. మంజుల స్కూల్లో చాలా డ్రామాల్లో వేసింది. బంటీని పిలవడం మాత్రం వీలు పడదు.” అన్నాడు వెంకట్.
  “బంటీకి ఏమయింది సార్? వాలంటీన్స్ డేకి నన్ను బొకే కొనమన్నాడు.. ఇంతలో..” ఆది మాట పూర్తి కాకుండానే వెంకట్ అన్నాడు ఆతృతగా..
  “బొకేనా? ఎవరికో తెలుసా?”
  “తెలీదుసార్. ఎన్ని సార్లడిగినా చెప్పలేదు.”
  “సరే. మీరు మంజులని పిలిచి యాక్ట్ చేయించండి. తను చెయ్యగలదని అనుకుంటాను. స్టడీస్ లో కూడా బాగా ఉంది.” అన్నాడు వెంకట్.
  వాళ్లు వెళ్లిపోయిన తరువాత వెంకట్ దీర్ఘాలోచనలో పడ్డాడు.. ఉజ్వల వెళ్లిపోవడానికీ, బంటీకి ఏమైనా సంబంధం ఉందేమోనని.
  కానీ, ఇద్దరూ ఎప్పుడూ కలిసినట్లు లేదు. పోన్లో అనుకుందామంటే బంటీకి ఫోనే లేదు.

  తల విదిల్చి, అనవసరం ఆలోచించడం అనుకుని పనిలో పడ్డాడు వెంకట్.*