"అమ్మాయికి కావాలనిపించేది.."
అనుపమ ఒకే మాట అంది.
ఒక్కసారిగా ఆ హాల్లో సందడంతా సద్దుమణిగింది. పక్కలో బాంబు పేలినట్లు కుర్చీల్లోంచి లేవబోయి ధడేల్మని కూలబడ్డారు అందరూ. నిశ్శబ్దం.. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. పెను తుఫాను తరువాత ఏర్పడిన ప్రశాంతత ఆవరించుకుంది అంతటా.
ఒక్కసారిగా ఆ హాల్లో సందడంతా సద్దుమణిగింది. పక్కలో బాంబు పేలినట్లు కుర్చీల్లోంచి లేవబోయి ధడేల్మని కూలబడ్డారు అందరూ. నిశ్శబ్దం.. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. పెను తుఫాను తరువాత ఏర్పడిన ప్రశాంతత ఆవరించుకుంది అంతటా.
మూడు క్షణాలు మాత్రమే ఆ నిశ్శబ్దం..
ఇనుప డబ్బాలో గులకరాళ్ళు వేసి ఆడించినట్లు
అందరూ ఒక్కసారిగా మాట్లాడ్డం మొదలు పెట్టారు. అవన్నిటినీ విడదీసి
వినగలిగితే..
"నువ్వేమన్నావో నీకు తెలుస్తోందా?"
తండ్రి ప్రభాకర్.
"మతిగాని పోయిందేమిటే అమ్మాయ్!"
నాన్నమ్మ.
"ఒంటి మీద స్పృహ ఉండే అన్నావా?"
తల్లి విమల.
"అనేముందు ఆలోచించే అన్నావా?"
తాతయ్య.
"రాంగ్ డెసిషన్, తొందరపాటు, ఇంత మంచి ఛాన్స్..ప్చ్,
దేనికైనా ప్రాప్తం ఉండాలి.." బాబాయ్,
మామయ్య, అన్న, వదిన..
ఇంత కల్లోలం సృష్టించిన అనుపమ ఏం
మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఇంతకీ అనుపమ అన్న ఒక్క మాటా ఏమిటి?
"నచ్చలేదు."
.........................
మంచిగంధం రంగుకి మజంతా అంచు ఉప్పాడ
చీర.. అనుపమకి బాగా నప్పింది, శరీరం చీర
రంగులోనూ, బుగ్గలు అంచు రంగులోనూ కల్సిపోయి. వంపు సొంపులు కనీ కనిపించకుండా పొందిగ్గా ఉంది.
ఎంత కాదనుకున్నా పెళ్ళి చూపులంటే
ఏదో అలజడి. ఇంతకాలం చదువు, ఉద్యోగం అంటూ
స్వేఛ్ఛగా పారే సెలఏరులా ఉన్న అమ్మాయికి ఆనకట్ట వేసే బంధానికి పునాది పడబోతోంది.
తొలిసారిగా పురుషుడ్ని ఆకర్షించాలనే ప్రయత్నం.. ఎలా ఉంటాడో తనతో జీవితం పంచుకోబోయే వాడు.. ఒకర్నొకరు
అర్ధం చేసుకుని, అన్నీ చర్చించుకుంటూ బ్రతకుతేనే జీవితం సఫలం.
ఎందుకో తెలియని కంగారు..
పురుషుడి తొలి స్పర్శ ఎలా ఉంటుందో! అంటే..
ఇంతవరకూ సహ ఉద్యోగులని ఎన్నో సార్లు కర స్పర్శ చేసింది కానీ అదంతా యాంత్రికంగా
ఏ భావం లేకుండా, స్నేహితురాళ్ళతో చెయ్యి కలిపినట్లే అనిపించింది.
ఇప్పుడు, ’తన’ అనుకున్న వాడి చెయ్యి అందుకుంటుంటే.. ఆ ఆలోచనకే అప్రయత్నంగా అనుపమ తల వంగిపోయింది సిగ్గుతో.
"త్వరగా రా అనూ! వచ్చేశారు. చాలా బాగున్నాడు.." వదిన వచ్చి నెమ్మదిగా అంది అనుపమ చెవిలో. తడబడుతున్న
అడుగులతో హాల్లోకి వెళ్ళింది.
విమల, ప్రభాకర్లు అతిథుల్ని ఆహ్వానించి సోఫాల్లో కూర్చోపెడుతున్నారు.
కాబోయే పెళ్ళికొడుకు విక్రాంత్ తల్లిదండ్రులతో,
ఒక్కగానొక్క తమ్ముడితో వచ్చాడు. బాగా ఆస్థిపరులు.
ఆ దర్పం అంతా ఆహార్యంలో, మాటల్లో కనిపిస్తోంది. పేరుపొందిన మల్టినేషనల్ కంపనీలో చాలా
మంచి ఉద్యోగం..నెలకి రెండో మూడో లక్షలు జీతం. అబ్బాయి కలల్లో ఊహించే రాజకుమారుడిలా ఉన్నాడు.
అతనిలో ఆకర్షణ పెద్ద కళ్ళు.
దట్టమైన కనురెప్పలు తామరపూరేకు మీద వాలిన గండు తుమ్మెదల్లా ఉన్నాయి.
ఎప్పుడూ నవ్వుతున్నట్లుగా, పరిసరాల్ని క్షణం వదలకుండా
పరిశీలిస్తున్నట్లు.. కళ్ళతోనే మాట్లాడ గలుగుతున్నట్లున్నాయి.
కోటేసినట్లున్న ముక్కు, తీరైన పలువరుస..
వంక పెట్టడానికి లేదు. బలిష్ఠమైన చేతులు,
ఎద చూస్తే ఏ అమ్మాయికైనా కౌగిలిలో వాలిపోయి సేద తీరాలనిపిస్తుంది.
చూడగానే ఈడూజోడూ బాగుందని ప్రభాకర్
అనుకుంటే, విమల మొహం వెయ్యి కాండిల్ బల్బులా వెలిగిపోయింది.
అంతా సరదాగా గడిచిపోయింది.
అమ్మాయీ, అబ్బాయీ హాలు పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి,
అరగంట పైగా మాట్లాడుకున్నారు. అబ్బాయి,
పాంటు జేబుల్లో రెండు చేతులూ పెట్టుకుని, తల కొంచెం
ఎత్తి సంతోషంగా మొహం పెట్టి వస్తే, అమ్మాయి మొహంలో ఏ భావం కనిపించకుండా
పొందిగ్గా వచ్చి కూర్చుంది.
అనుపమ అక్కరకొచ్చే ఆధునిక చదువులే
చదివింది. చదువుకి తగిన ఉద్యోగం.. అందంలో
పెళ్ళికొడుక్కి తీసిపోదు.
ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తామన్న
పెళ్ళివారు, దార్లో ఉండగానే చెప్పేశారు, మరునాడు మాటలకి రమ్మని. ఇంకా ఏదీ సర్దుకోకుండా,
హాల్లోనే కూర్చుని పెళ్ళివారి మంచితనం, పెళ్ళికొడుకు
అందచందాలు, వాళ్ళ ఆస్థిపాస్థుల గురించి తీరిగ్గా మాట్లాడుకుంటుండగానే
వచ్చేసింది ఫోన్. అందరూ గలగలా మాట్లాడుతుంటే అనుపమ ఏదో ఆలోచిస్తూ
ఉండిపోయింది.
"ఏమ్మా? ఏమంటావు? ఈ సంబంధం నీకిష్టమేనా? పెళ్ళికొడుకు నచ్చాడా?" ఫార్మల్గా అడిగాడు ప్రభాకర్.. ఎందుకు నచ్చడూ అనుకుంటూ.
అప్పుడు అనుపమ ఆ మాట అంది.
....................
లేత కనకాంబరంగు షిఫాన్ చీర మీద ముదురు
కనకాంబరం గళ్ళున్న పొట్టి చేతుల బ్లౌజ్.. కెంపులసెట్ ధరించి,
బారెడు జడని చివర కనీ కనిపించని నల్లని రబ్బర్ బాండ్ తో బంధించి,
నుదుటిమీద పడుతున్న ముంగురులు సవరించుకుంటూ తన గదిలోంచి బైటికి వచ్చింది
అనుపమ. సంధ్యకాంతిలో మెరిసిపోతున్న అమరశిల్పి జక్కన్న శిల్పం
నడచి వస్తోందా అనిపిస్తోంది.
"అమ్మా! సునీతతో గుడికి వెళ్ళొస్తా." గట్టిగా అరచింది.
ఎవరూ పలుకలేదు.
అనుపమ ఆ మాట అన్నప్పట్నుంచీ..
అందరూ అన్ని విధాల నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎవరెంత చెప్పినా అదే మాట. రకరకాలుగా తమ నిరసనని వ్యక్తీకరిస్తున్నారు.
"అమ్మా! నాన్నా!" ఎంతో సౌమ్యంగా ఉండే అనుపమ హాలు దద్దరిల్లేలా
కేక పెట్టింది.
అప్పుడు బైటికి వచ్చారు విమల,
ప్రభాకర్.
"ఏంటమ్మా! ఇంక నాతో మాట్లాడరా ఎవరూ? ఏమంత కాని పని చేశాను?
నాకు ఆ పెళ్ళికొడుకు నచ్చలేదు.. అంతే. ఇంక లోకంలో అబ్బాయిలకి కరవొచ్చిందా? అందరూ ఇలాగే స్ట్రైక్
చేస్తుంటే, రేపే వెళ్ళి వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో చేరిపోతాను."
"అదే ఎందుకు నచ్చలేదూ అని.
మా బాధలో మేం ఏదోలా ఉంటే హాస్టల్లో చేరనక్కర్లేదు. కొన్ని రోజుల్లో మర్చిపోతాం. కానీ ఇంత మంచి సంబంధం.."
అనుపమ కళ్ళల్లో కనిపిస్తున్న ఎర్ర జీరలు చూసి ఆపేసింది విమల.
"ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా?
చెయ్యి పట్టుకున్నాడా? వాళ్ళని అడిగిన గడువు ఇవేళ్టికి
ఆఖరు. చెప్పెయ్యనా?" ప్రభాకర్ నెమ్మదిగా
అడిగాడు.
"చెయ్యి పట్టుకోలేదు.
మూడడుగులు పైగానే దూరంగా కూర్చున్నాము. అయినా నాకు
నచ్చలేదు. వాళ్ళకి అదే చెప్పండి." వీధిలో హారన్ మోత విని పరుగెడుతున్నట్లుగా నడుస్తూ వెళ్ళింది అనుపమ.
.....................
అనుపమ మళ్ళీ ఒక మాట అంది.
ఈ సారి అందరూ ఆశ్చర్యంగా చూశారు.
అనుపమకి మళ్ళీ పెళ్ళిచూపులయ్యాయి.
ఇంట్లో స్వేఛ్ఛగా ఉండదని రత్నాచలం గుడికి వెళ్ళారు. అబ్బాయీ, తల్లిదండ్రులు, చెల్లెలు..
సాదా సీదాగా ఉన్నారు. ఒక చిన్న ఇల్లు, తండ్రి పెన్షనూ తప్ప ఇంకేం లేదు. అబ్బాయి
"ధర్మ" చామన ఛాయలో కళగానే ఉన్నాడు.
ప్రశాంతమైన చిరునవ్వుతో సింపుల్గా ఉన్నాడు.
"షాది డాట్ కామ్"
లో చూసి అనుపమే అతని అడ్రస్, వివరాలు ప్రభాకర్కి ఇచ్చింది. విక్రాంత్ కంటే జీతం తక్కువే.. ఆ మాటకొస్తే అనుపమ కంటే రెండో మూడో వేలు తక్కువే.
అబ్బాయి, అమ్మాయి
విడిగా అరగంట మాట్లాడుకున్నారు, గుళ్ళో ఉన్న తోటలో అరుగుల మీద
కూర్చుని.
"మీరే ఫోన్ చేసి చెప్పండి ప్రభాకర్
గారూ, మాకు సమ్మతమే.." పెళ్ళికొడుకు
తండ్రి అన్నాడు, ధర్మ కారు ముందుకి నడిపించబోయే ముందు.
"నాకిష్టమే!" వాళ్ళ కారు కదలగానే అంది అనుపమ, అక్కడే గుడి బయటే.
.........................
"నాతో కూడా ఏం జరిగిందో చెప్పకూడదా?"
నిష్ఠూరంగా అంది సునీత.
అనుపమ, సునీత
కాంటీన్లో ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర కూర్చున్నారు. ఇద్దరూ ఇంటర్మీడియట్ నుంచీ ఇంజనీరింగ్ అయేవరకూ కలిసి
చదువుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకోగల స్నేహితులు.
ఒకే కంపెనీలో ఉద్యోగం కూడా.
"నిన్ను రికమెండ్ చెయ్యమన్నారా?"
చిరునవ్వుతో, కొంచెం కోపంగా అంది అనుపమ.
"అదికాదు అనూ! అదే.. ఏమిటి కారణం? అది వద్దనడానికి,
ఇది కావాలనుకోడానికీ అని.."
"సునీ! కొన్ని భావాలని విప్పి చెప్పలేం. నాకెందుకో అతని వ్యవహారం
నచ్చలేదు."
"అతనేమైనా ముద్దిమ్మని అడిగాడా?"
సునీత కుతూహలంగా అడిగింది.
"అటువంటిదే. ఇది కారణం అని ఎవ్వరికీ చెప్పనంటే చెప్తాను.." అనుపమ
చెప్పిందంతా మాట్లాడకుండా, కళ్ళు పెద్దవి చేసి విని, అర్ధం చేసుకున్నట్లు తలూపింది సునీత.
................
ధర్మ అందించిన చెయ్యి పట్టుకుని
రెండు మెట్లున్న చిన్న బల్ల ఎక్కి మంచం మీద కూర్చుంది అనుపమ. పెళ్ళి హడావుడి అయి, అత్తవారింటికొచ్చింది. చిన్న ఇల్లు. కింద రెండు, పైన ఒకటీ
పడగ్గదులు. చుట్టూ ఉన్న కాస్త స్థలంలో రకరకాల మొక్కలు..
మాలతీ తీగ, రాధామనోహరం తీగ మేడ మీదికి పాకి అక్కడున్న
స్తంభాలకి అందంగా అల్లుకుని, గదిలోకి మంచి సువాసనల్ని అందిస్తున్నాయి.
పైనున్న గది.. వాళ్ళ ఊర్లో ఉన్న తాతగారి సామానుతో
అలంకరించారు. అందులోదే ఎత్తైన పందిరి పట్టిమంచం. దాని మీదున్న బూరుగు దూది పరుపు.. ఎటువంటి ఆధునిక బెడ్లకీ తీసిపోదు. సహజమైన చల్లదనంతో అలరిస్తుంది.
ఆ మంచం మీదికే మెట్లున్న బల్ల సహాయంతో ఎక్కాలి.
మొదటిరాత్రి ఎక్కడా అని ఎవరూ అనుకోలేదు.
కేరళలో హనీమూన్ మాత్రం అనుపమ అన్నగారు వివాహ బహుమతి కింద ఇచ్చాడు.
అది వారం తరువాత. మరి.. ఏదైనా
హోటల్లోనా.. అనుపమకి కుతూహలంగా ఉంది. ఎవర్నడగాలన్నా
బెరుకు.. ధర్మ చల్లగా నవ్వడం తప్ప ఏమీ మాట్లాడట్లేదు.
జీలకర్రా బెల్లం నెత్తిమీద పెట్టేటప్పుడు,
అతని కళ్ళల్లోకి చూస్తుంటే.. అన్నిటా నీకు నేను
తోడుగా ఉంటాను, అనే భరోసా కనిపించింది. తాళి కట్టేటప్పుడు, మునివేళ్ళు కదులుతుంటే గిలిగింతలతో
తనువు పులకరించింది. కాలి మట్టెలు పెడుతున్నప్పుడు, ఒక విద్యుత్ ప్రవాహం వేళ్ళలోనుంచి శరీరమంతా పాకింది. చిటికిన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతుంటే.. తగిలీ తగలని అతని శరీర స్పర్శకి గుండె వేగంగా కొట్టుకోడం తెలిసింది.
అదే తడబాటు.. అదే గగుర్పాటు, ధర్మా ప్రక్కన మంచం మీద కూర్చున్నప్పుడు
కూడా! పది నిముషాలు గడిచాయి. కొద్దిగా తల
వంచి కూర్చున్న అనుపమ తల ఎత్తి గదంతా పరికించింది. కనీ కనిపించకుండా
చేశారు అలంకరణ. తన చేతికి పాల గ్లాసు ఇవ్వలేదు కానీ ఫ్లాస్కులో
పెట్టినట్లున్నారు. ఒక మూలగా చిన్న బల్ల మీద ప్లాస్కు,
పళ్ళెంలో కొద్ది కొద్దిగా పది రకాల మిఠాయిలు, కారప్పూస,
నాలుగైదు రకాల పళ్ళు ఉన్నాయి.
"పెళ్ళి హడావుడిలో సరిగ్గా
తినుండరు.. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే రాత్రి ఆకలేస్తుంది.
అందుకే తినేవన్నీ పెడతారు. మొహమాటం పడకమ్మా!"
అత్తగారు మెట్లెక్కుతుంటే చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ మానవుడు మౌనంగా కూర్చుంటే కబుర్లేం సాగుతాయీ!
"నాక్కూడా బిడియంగా,
కొత్తగా.. ఉద్వేగంగా ఉంది. ఏవైనా కబుర్లు చెప్పుకుందామా?" చెవిలో గుసగుసగా
అంటూ చెయ్యి పట్టుకున్నాడు ధర్మ. అతని ఊపిరి వెచ్చగా మెడకి తగిలింది.
భయంతో చల్లబడిన తన చేతికి వేడి నిప్పు కణిక తాకినట్లనిపించింది.
ఉలిక్కి పడి మొహంలోకి చూస్తూ అతని
నుదుటి మీద చెయ్యి వేసింది. మొహం ఎర్రగా బీట్రూట్ దుంపలా ఉంది.
"జ్వరం వచ్చిందా?"
అనూ చేతిని అలాగే ఉంచుకుని, తల అడ్డంగా తిప్పుతూ
మనోహరంగా నవ్వాడు ధర్మ.. ఈ అమ్మాయి తనదీ! తనంటే ఎంత ప్రేమ.. ఎంత ఆదుర్దా, అతృత.. చాలు. ఇంకేం అక్కర్లేదు.
అప్పుడు ధైర్యం వచ్చింది. అనూ కళ్ళల్లోకి చూస్తూ
నవ్వాడు. అనుపమ బుగ్గలు కూడా ఎర్రగా కందిపోయాయి.
"అంటే.. కబుర్లనే కాదు.. నువ్వు దగ్గరగా ఉంటే ఈ జ్వరం ఎగిరిపోతుంది."
మరింత దగ్గరగా లాక్కున్నాడు. అనుపమ కబుర్లేం చెప్పకుండా
కౌగిలిలో ఒదిగిపోయింది.
..............................
"నువ్వేం అనుకోకపోతే..
నేను ఎందుకు నచ్చానో అడగను కానీ విక్రాంత్ ఎందుకు నచ్చలేదో తెలుసుకోవచ్చా
అనూ?" కేరళలో అలిప్పి వద్ద, కాటేజ్
ముందు అను చెయ్యి పట్టుకుని పచార్లు చేస్తూ అడిగాడు ధర్మ.
అనుపమ ఆగిపోయింది.
"మీకెలా తెలుసు?"
"నాకు అతనికి కామన్ ఫ్రెండ్స్
ఉన్నారు. మన పెళ్ళి కార్డ్ ఇవ్వగానే చెప్పారు..
" మొహమాటంగా అన్నాడు.
"ఇంకా ఏం చెప్పారు?"
"అంటే.. నీకు నేనెలా నచ్చానో అని ఆశ్చర్యపోయారు. విక్రాంత్ నాకంటే
ఎలిజిబుల్ కదా అని.." ఏం చెప్పాలా అని భర్త మొహంలోకి చూసింది
అనుపమ. ఫరవాలేదు అన్నట్లు నవ్వాడు ధర్మ.
"అతని చూపులు నాకు నచ్చలేదు."
అర్ధం చేసుకున్నట్లుగా అనుపమని పొదివి పట్టుకుని, నుదుటిమీద ముద్దిచ్చాడు ధర్మ.
అనుపమ కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
ఒక్క మాటతో తన అంతరంగం తెలుసుకున్నందుకు. అంతకంటే
ఏం చెప్పగలదు? కాబోయే జీవిత భాగస్వామిని మొదటిసారి చూసినప్పుడు..
ఆ చూపుల్లో ప్రేమ, జీవితమంతా నీకు నేనుంటాను అనే
ధైర్యం, భద్రత కనిపించాలి కానీ కామం కాదనీ.. ఆ చూపులు ఎక్కడెక్కడో ఒడలంతా తడుముతున్నట్లు అనిపించకూడదనీ, తనకి విక్రాంత్ కళ్ళలో అదే కనిపించిందనీ! అతనితో గడిపిన
అరగంటా తలుచుకుంటే ఇప్పటికీ అసహ్యంతో ఒళ్ళు జలదరిస్తుంది. మాట్లాడుతున్నాడే
కానీ అతని దృష్టంతా తన ఒంటిమీదే ఉంది. తనగురించి తను చెప్పుకోడమే
తప్ప, ఎదుటివాళ్ళ గురించి తెలుసుకుందామనే శ్రద్ధ లేదు.
ఎందుకు నచ్చనూ అనే అహం ప్రతీ కదలికలోనూ ఉంది. అమ్మాయికి
కావాలనిపించేది అదికాదు.. శృంగారం జీవితంలో భాగమే కానీ కామం జీవితం
కాకూడదు. తను ఒక స్నేహితురాలు అవాలికానీ అవసరాలు తీర్చే యంత్రం
అవకూడదు. ధర్మతో గడిపిన పదిరోజుల్లో తనకి కావలసింది దొరికిందనిపించింది.
తృప్తిగా రెండు చేతులతో అతని చెయ్యి పట్టుకుని కాటేజ్లోకి నడిచింది అనుపమ.
* .............................*
11 వ్యాఖ్యలు:
నేను చదివాను .అమ్మాయి మనసు గురించి బాగా చెప్పారు .
అభినందనలు .
భానుమతి గారూ కథ చాలా బావుంది.
బాగా రాశారు.
నేను కూడా చదివాను.స్త్రీ మనసు పొరలలో నిక్షిప్తమైన భావనలను చక్కగా వివరించారు.మరోమారు అభినందనలు.
ఈ కథ నేను పత్రికలో వచ్చినప్పుడే చదివేసానండీ. మగువ మనసులోని భావాలను అంతే సున్నితంగా ఆవిష్కరించారు. మరోసారి అభినందనలు అందుకోండి.
బాగుంది భానుమతిగారూ!
కథ బాగుంది.కొనుగోలు చేయబడుతున్న వస్తువులాగా చూడబడటాన్ని అమ్మాయి హర్షించలేక పోవటం సమర్థనీయమే కదా. 'ఇదంతా మామూలే' అనుకొనక తప్పని పరిస్థితి నుండి మహిళాలోకం ఆత్మవిస్వాసంతో బయటపడటాన్ని ఈ కథ ప్రదర్శిస్తోంది.
అందరికీ నా కృతజ్ఞతలు.
కథ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడే చదివాను భానుమతి గారూ!చాలా చక్కగా రాశారు.
చాలా బాగా రాసారు భానుమతి గారు.... అమ్మాయి మనస్సు చాలా చక్కగా చెప్పారు... డర్టీ ఫెలో విక్రాంత్ అనిపించింది .....
Post a Comment