అజ్ఞాత కులశీలస్య..
27వ భాగం.
27వ భాగం.
కాంచీపురంలో కోవెలలన్నిటిలోనూ పూజలు జరిపించి
వచ్చాడు పురుషోత్తమ దేవుడు. చక్రవర్తికి జరిగే మర్యాదలన్నీ
జరిగాయతడికి.
విజయోత్సాహంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు
కళింగ సైనికులు. కాంచీ పురంలో తమ ‘ప్రతీక్ష’ నొకరిని పెట్టి,
బంధించిన కంచిరాజుతో, పద్మావతితో, వరదయ్యతో. కంచి నుంచి
భారీగా కప్పం వసూలు చేశాడు పురుషోత్తముడు.
ముఖ్యంగా.. కాంచీపురంలో ఉన్న గజబలాన్నంతటినీ గ్రహించి
వేశాడు.
సీ. ఇనుమడించిన యట్టి యిభ బలగమ్ముతో
కన్నుల వెలుగొంద కాంతులెన్నొ
దేవుని యండనే దివ్యముగా నుండ
నాత్మవిశ్వాసమే నతిశ యింప
కాంచీపురము యంత కైవశ మవగానె
ధీరత్వమున తాను దీటు గాను
వీధులందు కవాతు సాధనమున చేయ
ఓఢ్ర వీరులు యంత నొలయ గాను
తే.గీ. విజయ భేరిని మోగించి వెడలె నపుడు
రమ్య పురుషోత్తముడతడు రాకొమరుడు
మాధవుడతని వెనువెంటె మౌనముగను
కదల సైన్యము తోడనే కటకమునకు.
కటకము చేరిన వెంటనే, మహరాజు నేనా కలవకుండా..
కంచిరాజునీ, వరదయ్యనీ కారాగారంలో పెట్టమని ఆజ్ఞ ఇచ్చి
తన మందిరానికి వెళ్లిపోయాడు పురుషోత్తముడు.
మహరాజుగారేమంటారో!
మరి పద్మావతి?
“మొదటగా కనిపించిన ఛండాలునకిచ్చి పెళ్లిచేసి పంపించు..”
తన మందిరానికి వెళ్తూ పురుషోత్తమ దేవుడు, వెనుతిరిగి
చూడకుండా అని వెళ్లి పోయాడు.
మాధవుడు నిశ్చేష్టుడై నిలబడి పోయాడు.
ఏ పాపం ఎరుగని రాకుమారి ఏం చేసింది? రాజుల ఆగ్రహాలు
ఇంత అర్ధంలేకుండా ఉంటాయా? కంచిలో ఏదో ఆవేశంలో
అనేశాడనుకున్నాడు కానీ.. ఇంత లాగ మనసుకు
పెట్టుకున్నాడా రాకుమారుడు?
ఏమైనా.. తనకి చేతనయింది చెయ్యాలి. రాకుమారునిది
తాత్కాలికమైన కోపం. కొన్ని రోజులైతే మరచిపోతారు.
అప్పటి వరకూ, తనే బాధ్యత వహించాలి.
పురషోత్తముడన్న మాటలు, పద్మావతి వరకూ వెళ్ల
కూడదు. మరి ఆవిడనెక్కడ ఉంచాలి? రక్షణ ఏది?
ఒక నిశ్చయానికి వచ్చి, పద్మావతీ దేవి మేనా వద్దకు
నడిచాడు మాధవుడు.
………………
“మాధవా! వచ్చావా నాయనా! ఉండు.. దిష్టి తీసేస్తాను.
అంత పెద్ద యుద్ధం చేసి గెలిచి వచ్చావంటే ఎంత మంది
కళ్లు పడుంటాయో!” సీతమ్మ వాకిట్లోనే నిలిపేసి, చాటలో
ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి, పెరటి లోపల, దూరంగా..
మూలగా ఉన్న పొయ్యిలో వేసింది.
ఎంత దూరమైతే మాత్రం, మిరపకాయలు పొయ్యిలో పడ్డాక
ఊరుకుంటాయా… పొగ, గొట్రు ఇల్లంతా పాకి పోయాయి.
వంట చేస్తున్న పని వాళ్లు, ఆజమాయిషీ చేస్తున్న నంద,
గౌతమిలు.. అందరూ ఖళ్లు ఖళ్లున దగ్గుతూ, ముక్కుకు
నోటికీ అంగోస్త్రాలు అడ్డు పెట్టుకుని వచ్చారు.
ఆ రోజు.. యుద్ధం నుంచి వచ్చే సైనికుల కోసం, అరవై
మందికి పైగా భోజనం సిద్ధం చెయ్యమని నందునికి ఆదేశం
వచ్చింది. అప్పుడే అనుకున్నారు గౌతమీ, సీతమ్మా,
మాధవుడు వచ్చేస్తున్నాడని.
“ఈ రోజు మాధవునికి ఇష్టమైన సన్న బియ్యం పాయసం
చేస్తా.. అందరికీ చేద్దామా నందా?” సీతమ్మ నందుడిని
అడిగింది ఆత్రంగా.
“తప్పకుండా చేద్దామమ్మా! విజయోత్సాహంతో వస్తున్నారు
సైనికులు. యుద్ధం అవగానే అఘ మేఘాల మీద చారులు
వార్త తీసుకొచ్చేశారు. మరి ఆ సంబరాలు చేసుకోవాలి కదా!”
“అమ్మమ్మా! మన తూరుపు చావడిలో రెల్లిల్లు ఖాళీగానే
ఉంది కదా!” సీతమ్మని దూరంగా తీసుకెళ్లి అడిగాడు మాధవుడు.
“ఉంది. కానీ.. దాని వెనుకే పశువుల పాక ఉంది. బాగుంటుందా?”
“ఫరవాలేదమ్మమ్మా! చుట్టూ పూల తోటుంది కదా.. కంచి
నుంచి ఒక యువతిని తీసుకొచ్చాను..”
“యువతినా?” మాధవుని మాట పూర్తి కాకుండానే సీతమ్మ
సంభ్రమంగా అంది.
“అబ్బెబ్బే.. ఏవో ఊహించుకోకు. ఆమె రాకుమారుని
వరించింది. కొన్ని రోజులు, ఎవరికీ తెలియకుండా మన దగ్గర
ఉంచుకోవలసిన పరిస్థితి. అక్కడైతే, ఏకాంతంగా ఉంటుందని.
అటుపక్కకి ఎవరూ వెళ్లరుకద! అందుకే..”
“రాకుమారుని వరించిందా? కంచి రాకుమారి కాదు కద..”
సీతమ్మ ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేస్తుంది.
“అవునమ్మమ్మా! కానీ ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు.
అమ్మకీ, నాయనగారికీ చెప్తాను. ఇంకొక రెండు ఘడియల్లో
మేనా ఇక్కడికి వస్తుంది. కొంచెం శుభ్రం చేయించి, పానుపు
వేయిస్తావా?”
“మరి.. రాకుమారి అంటే, ఎంతో సుకుమారంగా పెరిగి
ఉంటుంది. ఈ పాకలో ఉండగలదా? గవాక్షాలు కూడా లేవు.
హంసతూలికా తల్పాలు లేవు.. మెత్తని బూరుగు దూది
పరుపుందనుకో. కానీ.. ఈ మట్టి ఇంట్లో ఎలా ఉండ
గలుగుతుంది?” సీతమ్మకి సందేహాల పరంపర వచ్చేస్తోంది.
“తప్పదమ్మమ్మా! కొన్ని రోజులు.. దమయంతీ దేవి,
సీతమ్మవారిలాగ ఉండాలి. మంచి రోజులు వచ్చాక
మహారాణీ అవుతుంది. ఆ మహా తల్లులు కానల్లో ఉన్నట్లుగా,
పద్మావతీ దేవి మన వద్ద ఉండాలి.”
“ఓ.. వనవాసమన్నమాట. ఘడియలో సదుపాయాలు
చేయించెయ్యనూ..”
“ఇక్కడ ఏలోటూ ఉండదు కన్నయ్యా! వాల్మీకి ఆశ్రమంలో
జానకమ్మని చూసుకున్నట్లుగా చూసుకుంటాము. రాకుమార్తెని
మన ఇంటి ఆడపడుచుని చూసుకున్నట్లు గౌరవించుకుందాము.”
నందుడు, గౌతమీ హామీ ఇచ్చారు, మాధవుడు విషయం వివరించగానే.
పద్మావతీ దేవిని తమ ఇంటికి తీసుకొని రావాలని, మాధవుడు
ఎప్పడో నిర్ణయించుకున్నాడు. ఊరూ పేరూ తెలియని అనాధని
తనని ఆదరించి, కన్న బిడ్డలాగ చూసుకుంటున్న నంద,
గౌతమిలు పద్మావతీ దేవిని ఆదరించరేమోనన్న శంక అతనికే
మాత్రమూ లేదు.
అయినా.. అవునని పించుకునే వరకూ అనుమానం తప్పదు
కదా! తేలిక పడిన మనసుతో, రెల్లు గృహాన్ని శుభ్రంచెయ్యడంలో
సీతమ్మకి సహాయం చేసి, మేనా కోసం ఎదురు చూడ సాగాడు.
మేనా వచ్చింది.
బోయీలు కిందికి దింపగానే, మాధవుడు పరుగెత్తినట్లుగా
దగ్గరగా వెళ్లాడు.
తెరలు తప్పించి, పద్మావతీ దేవి కిందికి దిగింది. దాదాపు
పది హేనురోజులు ప్రయాణం.. రాత్రిళ్లు మజిలీలు చేసినా,
పగలంతా మేనాలో కూర్చొనుటే.
మొహం వాడిపోయి, వలువలు చెదిరి పోయి, ముంగురులు
రేగి పోయి.. రాకుమారి అలసటగా నిలబడి చుట్టూ గమనించింది.
మాధవుడిని ఎరిగున్నదే కనుక సంకోచం పెట్టుకోలేదు.
తమ సభలో అతడు రాయబారిగా ఎంతటి ప్రజ్ఞ చూపించాడో
స్వయంగా చూసింది. తమ విధి ఈ విధంగా ఉంటే, వరదయ్య
రూపంలో దురదృష్టం వెన్నాడుటలో వింత ఏమి లేదు.
“అమ్మా! మీరు కొద్ది దినములు, ఈ పేదవాని ఆతిధ్యము
స్వీకరించ వలసిందిగా కోరుతున్నాను.” మాధవుడు విధేయుడై
అన్నాడు.
“అంత మాట వద్దు సోదరా! కారాగారము తప్పించి నీ
ఇంటికి.. పుట్టింటికి తీసుకొని వచ్చావు. అంత కంటే ఏం
కావాలి ఈ శాపగ్రస్తకి? అమ్మా, నాన్నలని చూపించవా?”
మధుర స్వరంతో, హుందాగా అంది పద్మావతి.
“మడిలో ఉన్నారు. ఈ రోజు అతిధులు చాలా మంది
వస్తున్నారు. మీరు లోనికి వచ్చి, స్నాన పానాదులు చేశాక,
పలుకరిస్తారు. రండి రాకుమారీ!”
“నేనిప్పుడు రాకుమారిని కాదు సోదరా! మీ సోదరిని.
ఆ విధంగానే సంబోధించండి.” పద్మావతి పలుకులను విని
తలెత్తి చూశాడు మాధవుడు. కానీ.. ఆవిడ మోములో
గాంభీర్యం ఏ మాత్రం సడలలేదు.
“ఇటు రండి సోదరీ!” మాధవుడు తూరుపు చావడి
వైపుకి తీసుకెళ్లాడు.
అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వసతిగృహంలో వచ్చే
పోయే వారికి అటు ప్రక్కకి ప్రవేశం లేదు.
రెల్లుగడ్డితో వేసిన పర్ణ కుటీరం.
పాలరాయి భవంతులలో నివసించిన సుకుమారి.. పేడతో
అలికిన కుటీరంలో ఉండగలదా? రాకుమారికి చూపించడానికి
మాధవుడు సంకోచించాడు. కానీ, పరుల కంట పడకుండా
ఉండగలిగే చోటు అదే వారింట. అది కూడా, యాత్రలకు వచ్చే
ఘోషా స్త్రీల కొరకు వేయించాడు నందుడు.
ఇంటి లోపల అన్ని సదుపాయాలూ ఉన్నాయి. అయినా..
గాలీ, వెలుతురూ తక్కువే అనుకోవచ్చు. ఐతే ఆరు బయట
ఆహ్లాదమైన వనం.. చల్లని గాలి ఏ లోటున్నా తీర్చేస్తుంది.
పూలవనంలో వెలిసినట్లున్న ఆ ఇంటిని చూడగానే
రాకుమారి పద్మావతి, చెంగు చెంగున పరుగెత్తి, ఇంటిలోకీ,
వెలుపలికీ వెళ్లి, అంతా పరిశీలించింది.
“చాలా బాగుంది సోదరా! ఇంతకంటే ఇంకేమి కావాలీ?
ప్రస్థుత పరిస్థితులలో నా అంత అదృష్టవంతులెవరూ
ఉండరనుకుంటున్నాను.” కళ్ల నిండా నీళ్లతో, నవ్వుతూ
అంది పద్మావతి.
మాధవుని మోము మ్లానమయింది. తనేదో తప్పు చేసినట్లు
తల పక్కకి తిప్పాడు.
“నిజం అన్నా! వేరెవరి పాలైనా పడితే.. అంతఃపుర స్త్రీలని
యే విధంగా అవమానిస్తారో కథలు కథలు వింటూనే ఉంటాము.
మీరు నా గౌరవాన్ని కాపాడుతున్నారు. పిదప విధి
నిర్ణయమేవిధంగా ఉందో అట్లే జరుగుతుంది. నాకు చాలా
సంతోషంగా ఉంది. ఇవి ఆనంద భాష్పాలు.” బుగ్గల మీదుగా
నీరు కారి పోతోంది.
“అయ్యో.. ఎందుకు తల్లీ ఆ కన్నీరు.. మంచే జరుగుతుంది.
నేనిక్కడుండగా నిన్ను చీమ కూడా కుట్టదు.” అప్పుడే
అక్కడి కొచ్చిన సీతమ్మ, తన కొంగుతో పద్మావతి
కన్నీరు తుడిచి.. చటుక్కున వెనక్కి నడిచింది, సంకోచిస్తూ..
రాకుమారి.. తను తాకచ్చో లేదో! సహజ సిద్ధమైన మాతృ
హృదయంతో ఓదార్చ బోయింది. పద్మావతి సంభ్రమంగా
చూసింది సీతమ్మని.
“మా అమ్మమ్మ. సీతమ్మ.” మాధవుడు పరిచయం చేశాడు.
సీతమ్మ రెండడుగులు వెనక్కి వేసింది.
“అమ్మమ్మా! మరి ఆ తడబాటెందుకు?” పద్మావతి, చెంగున
ముందుకొచ్చి గాఢంగా కౌగిలించుకుంది సీతమ్మని.
సీతమ్మ మురిసి పోతూ, పద్మావతి వీపు మీద వాత్సల్యంగా
రాసింది.
మాధవుడు నిట్టూర్చాడు, హృదయం తేలిక అవగా. రాకుమారి
ఈ పరిసరాల్లో సర్దుకు పోగలదో లేదో అని సంశయించాడు
అప్పటి వరకూ. భారమంతా దించేసినట్లయింది.
పది మాసములు పైగా పద్మావతిని కాపాడాలి. ఆ తరువాతే
ఏమైనా చెయ్య గలుగుతే. పద్మావతి తమ గృహములో, తమ
కుటుంబంలో కలిసి మెలసి తిరిగేటట్లే కనబడుతోంది. ఇంక భయం
లేదు. మేనాలోని వస్తువులను కుటీరంలో పెట్టమని బోయీలకి
చెప్పాడు మాధవుడు.
ఎక్కువేమీ లేవు.. ఐదు పావడాలు, వానికి సరిపోయే కంచుకము,
వల్లెవాట్లు. అంతే. ఇంకేమీ లేవు.
“తేలికగానే తెచ్చాను.. మేనాలో బరువుంటే కష్టమని.. ఐనా
ఇంక నేను సాధారణ యువతినే కదా!” పద్మావతీదేవి మాటలకి
హృదయం కలచి వేసింది మాధవునికి.
………………
పద్మావతీదేవి నందుని గృహంలో బాగా కలిసి పోయింది.
తను కూడా వారికి వంట వద్ద సహాయం చేస్తుంది. చీని చీనాంబరాలు
కట్టకుండా మామూలు వలువలే ధరిస్తోంది. వచ్చిన వెంటనే
తన దగ్గరున్న నాణాలుపయోగించి పావడాలు, చోళీలు కుట్టించింది.
సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, పూజకి
పువ్వులు సమకూరుస్తుంది. మంచిరోజులు వస్తాయని ఆశతో
నిరీక్షిస్తోంది.
పురుషోత్తమదేవుని మనసారా వరించింది.. ఒక రకంగా
యుద్ధం జరగడం మంచిదే అనుకుంది. లేకున్న, స్వయంవరంలో
వేరెవరినో వరునిగా ఎన్నుకోవాలి.. తండ్రిగారెలా ఉన్నారో?
పూజకి పూలు కోస్తూ చింతిస్తుంది.
అప్పుడప్పుడు మనసంతా ఆందోళనతో తల్లడిల్లుతుంది.
తలపుల నిండుగా పురుషోత్తమదేవుడు. ఎప్పటికైనా అతడి
చెంతకి చేర గలుగుతానా అనుకుంటుంది.
మనసులోనే కామాక్షీదేవిని వేడుకుంటుంది.
మధ్యాక్కర.. “పరమశివుని పొంద నీవు పవలురేయి తపస్సు చేయ
హరుడు కళ్లు తెరవడాయె అతివ వేదన నాపగాను
విరివింటిదొర తానె వచ్చి విషధరుని పతిని సేయ
పురహరుని ముదము మీర పొందితీవు, కృపను జూపు.
అమ్మా! నీకు అనంగుడు చేసినట్లే, నాకు మాధవుడు
సాయపడ బోతున్నాడు. కానీ మన్మధునికి, నీ పతి చేసినట్లు
ఇక్కడ జరుగకుండా చూడు. పురుషోత్తమదేవుడే.. మనసా
వాచా కర్మణా, నా పతి కాగలడని నిన్నే నమ్మి యున్నానమ్మా!
నన్ను, నన్నాదరించిన వారిని కాచుకొనుమమ్మా!”
చిన్ననాటి నుంచీ ప్రేమగా నన్ను పెంచుకున్న తండ్రి, వివాహం
కోరుకున్న వానితో జరుపుటకు సంశయించడమా! అంతా విధి
రాత కాకపోతే! పదేపదే వాపోతుంది, తను తెచ్చుకున్న చిన్న
కామాక్షీదేవి విగ్రహం ముందు కూర్చుని.
ఎవరైనా పిలవగానే నవ్వుతూ పరుగెత్తి వెళ్తుంది.. తన విచారం
లోలోనే దాచుకుని పైకి కనిపించనియ్యకుండా!
“మాకు ఆడపిల్లలలు లేని లోటు తీరుస్తున్నావమ్మా!” గౌతమి,
దగ్గరకు తీసుకుని బుగ్గ మీద చిన్న ముద్దిస్తుంది.
“మరీ అంత ప్రేమ పెంచుకోవద్దు! ఆడపిల్ల మనింట్లో ఎంత కాలం
ఉంటుందమ్మా? పెళ్లైతే అత్తగారింటికి వెళ్లిపోతుంది కద!”
మాధవుడు వారించాడు.
“అత్తవారింటికి…” పద్మావతి గొంతు గద్గదమయింది.
“తప్పకుండా వెళ్తావు తల్లీ. నాదీ బాధ్యత.”
“పుట్టింటి ప్రేమనే ఆడపిల్లా మరువదన్నా!” పద్మావతి
సర్దుకుని అంది.
……………….
28వ భాగం.
ఆ రోజు, తెల్లవారకుండానే, అభ్యంగన స్నానమాచరించి, నూతన
వస్రాలను ధరించి, తన వద్దనున్న కొద్దిపాటి నగలను పెట్టుకుని
వచ్చి, నంద గౌతమిలకు, సీతమ్మకి నమస్కరించింది
పద్మావతీ దేవి. అప్పటికే వారు వంట ప్రయత్నంలో పడ్డారు.
“ఈ రోజు నా జన్మదినమమ్మా! ఆశీర్వదించండి.”
“దీర్ఘాయుష్మాన్ భవ. వచ్చే పుట్టినరోజుకి నీవు వుండవలసిన
చోటికి చేరాలి తల్లీ!” నందుడు ఆశీర్వదించాడు.
అప్పుడే అక్కడికొచ్చిన మాధవుడు కళ్లు విప్పార్చి
సంభ్రమంగా చూస్తుండి పోయాడు.
“అన్నా! నీవు కూడ ఆశీర్వదించాలి.” వంగి నమస్కరించ
బోతే, ఆపి, లేపి, తల మీద చెయ్యి పెట్టి దీవెనలందించాడు.
కం. “సిరి యొలుకు చుండు మోమున
చిరునగవులతో మరిమరి శింజానముగా
కరిముఖుడు నీకు నాసర
నిరతము నొసగును మరింత నెరవు నిలుపగా.”
“ధన్యవాదాలన్నా! ఏనాటి బంధమో ఇది. మనిద్దరి
తనువులున్నంత వరకూ నిలవాలని ఆ పరాశక్తిని కోరుతున్నాను.”
మిలమిల మెరిసే కన్నులతో అంది పద్మావతి.
“ఆ జగన్నాధుని దయ ఉండాలి గానీ ఏదీ అసాధ్యం కాదు
ఈ జగాన. అంతా సవ్యంగా జరుగుతుంది సోదరీ. చింత
వద్దు.” మాధవుడు చిరునవ్వుతో అన్నాడు.
“అవును. వచ్చే రథయాత్రకి, సేవ చేస్తానని మొక్కుకోమ్మా!
నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.” అనుకోకుండా సీతమ్మ
అన్న మాటలకి ఉలిక్కి పడ్డారు, మాధవుడూ పద్మావతీ.
“నిజమే అమ్మమ్మా! ఆ విధంగా.. ఇప్పుడే మొక్కుకుంటాను.”
పద్మావతి తేరుకుని, వెంటనే అంది.
మాధవుడు ప్రశంసా పూర్వకంగా చూశాడు.
………………..
“అభినందనలు కుమారా!” కపిలేంద్రదేవుడు తన మందిరంలో,
పురుషోత్తమదేవుని తో సమావేశమయ్యాడు.
“అంతా మీ ఆశీర్వాదమే, మీ సహకారమేగా తండ్రీ!”
పురుషోత్తముడు వినమ్రంగా అన్నాడు.
“నా సహకారమే కాదు.. ఆ జగన్నాధుని దయ కూడా. అప్పుడు
యుద్ధానికి సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నా కదా.. సరైన
సమయానికి ఇరువురు అన్నదమ్ములు, యోధాను యోధులు..
పూరీ పట్టణం నుంచి వచ్చి సైన్యంలో స్వచ్ఛందంగా చేరారు.
వారే, కాంచీపురం మీదికి సైన్యాన్ని తీసుకుని వెళ్లి, యుద్ధంలో
పురుషోత్తమ రాకుమారునికి సహాయంగా వెళ్లెదమని అడిగారు.
వారిని చూడగానే.. మన సైనికులకి ఎక్కడలేని జవ సత్వాలూ
వచ్చేశాయి. అంతే.. ఆనతి నివ్వడమేమిటి.. కదం తొక్కుతూ
బయలుదేరారు.” కపిలేంద్ర వర్మ సంతోషంగా అన్నాడు.
“వారిరువురూ సాక్షాత్ జగన్నాధ, బలభద్రులని నా అనుభవం
చెప్తోంది తండ్రీ.”
“అంత కన్నా మనకి పెద్ద వరమేముంటుంది. ఈ సంతోష
సమయంలో నాదొక కోరిక కుమారా!”
“ఆజ్ఞాపించండి తండ్రీ.”
“కాంచీ పురం రాజును విడుదల చేద్దాము. చెప్పుడు మాటలను
విని అతడు అనాలోచితంగా ప్రవర్తించాడు. అతని రాజ్యాన్ని
అతనికిచ్చేద్దాము. మన ప్రతీక్షని తిరిగి వచ్చెయ్య మందాం.”
“మీ చిత్తం తండ్రిగారూ!” కొద్దిగా ఖిన్నుడై అన్నాడు పురుషోత్తమ
దేవుడు.
“కుమారా! మీరే రణ మందు గెలిచి కంచిరాజును బందీగా తెచ్చారు.
మేము కాదనుట లేదు. కానీ.. రాజనీతి కొద్దిగా అర్ధం చేసుకోవాలి
మీరు. ఇప్పుడు వారి రాజ్యం వారి కిస్తే భవిష్యత్తులో మనకి
అనుకూలంగా ఉండగలరు కంచి రాజు. కావాలంటే కప్పం
కట్టమని అడుగుదాము. నేను కావేరీ తీరం వరకూ మన
రాజ్యాన్ని విస్తరింప వలెనని యోచిస్తున్నాను..”
“అంటే..”
“అవును. విజయనగర సామ్రాజ్యాన్ని కూడనూ జయించ
వలెనని నా వ్యూహం! మీది ఉడుకు రక్తం. కొంచెం ఆగి ఆలోచిస్తే
మీకే అర్ధమవుతుంది.”
“సరే తండ్రీ! మీరే వెళ్లి వారిని విడిపించి పంపండి. కానీ..
ఆ మంత్రి వరదయ్యని మాత్రం..”
“ఎప్పటికీ వదలను. రోజూ కారాగరం అంతా ఆ వరదయ్య
చేతనే చీపురుతో తుడిపించమని ఆజ్ఞ ఇస్తాను.” కపిలేంద్ర దేవుడు
నవ్వుతూ అన్నాడు.
అప్పటికి పురుషోత్తమునికి కినుక తగ్గి, మోములో ముదము
వచ్చింది.
“అమ్మయ్య. ఇప్పటికి నాకు చింత వదలినది. తక్షణమే
కారాగారానికి విచ్చేస్తున్నామని కబురు పంపండి.” సేనానికి
ఆదేశమిచ్చాడు ప్రభువు.
పురుషోత్తముడు తండ్రి నమస్కరించి తన మందిరానికి
వెళ్లి పోయాడు. తండ్రిగారి ప్రతిపాదనకి, మనస్ఫూర్తిగా అంగీకరించి.
వారు పంపిన సైన్యమే లేకున్న, యుద్ధములో గెలిచే అవకాశమే
లేదు కదా!
………………………..
“సోదరా! మా పితృదేవులు క్షేమంగా ఉన్నారా?” సూర్యోదయానికి
ముందే నిదుర లేచిన పద్మావతి, కాసేపు తోటలో మొక్కల
సంరక్షణ చూసి, పూజకి పువ్వులు కోసి, మాలలు కడుతూ అడిగింది.
అప్పుడే పశువుల దగ్గర పని ముగించుకుని వచ్చిన మాధవుడిని.
“కాంచీపుర రాజుగారిని బంధ విముక్తులని చేశారు రాకుమారీ!
నిన్నటిరోజునే. వారిని కంచి రాజ్యానికే సామంతులుగా
నియమించారు కపిలేంద్ర వర్మ. మీరు మీ రాజ్యానికి ఏగ వచ్చును..
హాయిగా.” మాధవుడు చిరు బాధాతప్తుడై అన్నాడు.
ఇంట్లో గలగల్లాడుతూ ఆడపిల్ల తిరుగుతుంటే ఆ అందమే వేరు
అనుకుంటూ. .
పద్మావతి మౌనంగా ఉండిపోయింది.. అనేకానేక భావాలు
మదిలో సుళ్లు తిరుగుతుండగా.
“అనగా.. కాంచీపురం రాజు ఓడిపోయిన రాజ్యాన్ని తీసుకుని
ఏలుకుంటారా?” రాకుమారి పౌరుషంగా అడిగింది.
మాధవుడు నిలువుగా తల ఊపాడు.
“ఇప్పుడు నేను మా తండ్రితో వెళ్తే ఛండాలునితో పెండ్లి
చేయించాలని శపధం పట్టిన పురుషోత్తమ దేవుల వారి మాట
ఏమిటి? ఆ ఒప్పందాలలో నన్ను కూడా విడిచి పెట్టెదమని
అని యుంటిరా మహారాజు?”
పద్మావతి ప్రశ్నలకి మాధవుడు ఆశ్చర్యంగా చూశాడు.
“సోదరీ! మీకు..”
“నాకు అన్నీ తెలుసు సోదరా! నేను ఇప్పుడు ఆత్మాభిమానము
వదలి వెళ్లినా, పతిదేవునిగా భావించి మనసులో నిలుపుకున్న
పురుషోత్తమదేవుని పౌరుషమునకు భంగము కలిగించిన
దాననవుతాను. దానికి నేనొప్పలేను. పైగా..
సీ. కన్నకూతురి కూర్మి కానని నాతండ్రి
దుష్టబుధ్ది యయిన ధూర్తు నమ్మి
కన్నుమిన్ను కనరాక యథార్ధ మెరుగక
విష్ణు భక్తు వివిధ విధములుగను
హేళనము సలిపి హీనపరచుటను
సైపగ లేక నే శ్రమము పడితి
తొందరపాటు యెంతో చేటు యౌనని
యెరుగని నా రాజు యేద పోయె
ఆ.వె. బిచ్చముగ నొసగిన విషయము నేలను
బిడియమును వదలిన పేద వాడు;
స్వాభిమానము కల జవ్వని యెన్నడూ
తిరిగి వెడలదుకద తిరిపెమునకు”
“మరి ఈ పేదవాని ఇంట నుండగలరా రాకుమారీ?”
“మా జనకునకు రాజ్యము లేనప్పుడు కలుగని సందేహము
ఇప్పుడెందుకు కలిగింది అన్నా?”
“అంటే..” మాటలు దొరక్క ఆగిపోయాడు మాధవుడు.
“అర్ధమయింది. రాకుమారి అనగానే ఆ దూరం వచ్చేస్తుంది
సహజంగా. అందుకే నేను ఆ పదవి వద్దనుకుంటున్నా సోదరా!
నాకు మీ అందరితో బాంధవ్యం, మీ ఆప్యాయత కావాలి.
పైపై మెరుగులే తప్ప ప్రేమలు లేని ఆ సౌధాలు, ఆ బోగ భాగ్యాలు
నాకు వద్దు. పురుషోత్తమ దేవుల ఆజ్ఞానుసారమే నాకు సేవకుని
వెదకండి. కానీ, కాస్త మంచివానిని చూడండి.”
మాధవుని గుండె కదిలి పోయింది పద్మావతి పలుకులు విని.
పక్కనే ఉండి అంతా వింటున్న నందుడు కన్నులు
తుడుచుకుంటూ ముందుకు వచ్చాడు.
“మాధవా! సిరులొలుకు ఈ చిన్నారి మన ఇంటికి
వచ్చినపుడే నా కూతురయింది. ఆ విధముగనే భావించి ఇచ్చట నుంచితిమి..
మానినీ వృత్తం.
మంజుల నాదము మా యెద నిండగ మప్పుగ నుండగ మన్ననతో
రంజిలు నిల్లదె రమ్యముగా చిరు లాస్యము సవ్వడి రాజిలగా
కంజజు సృష్టిన కన్నులు పండగ కానగ నుల్లము కంపితమౌ
పంజన జవ్వని బంగరు తల్లిగ వచ్చెను గామన వాకిటకే.
మన ఇంటి సిరిని మంచివానికే ఇచ్చి కళ్యాణ మొనర్చెదము.”
“అంతే. మాధవుని వివాహముతోనే పద్మావతికి కూడా
మంచి వరుని చూసి జరిపిద్దాము.” గౌతమి అందుకుంది.
అంతకు ముందు జరిగిన సంభాషణ వినకున్ననూ, నందుని
మాటలతో, పద్మావతికి ధైర్యం కలిగించడానికి అనేసింది..
సమయోచితంగా.
మాధవుని మనసులో కాదంబరీ దేవి మెదిలింది అసంకల్పితంగా.
“అసాధ్యమౌ నా కోరికని అణగ దొక్కెయ్యాలి..” అనుకుంటూ
ముందుకు కదిలాడు రోజూ వారీ కార్యాల నెరవేర్చడానికై.
వాకిలి దాటుతుండగానే ఎదురయ్యాడు, కోటలోని భటుడు.
“రాకుమారుడు పురుషోత్తములవారు మిమ్మల్ని పిలువనంపారు
ప్రభూ!” రాకుమారునికి కుడి భుజం వలే నుండే మాధవుని కూడా
ప్రభూ అని మన్నించడం ఎవరూ చెప్పకుండానే నేర్చుకున్నారు,
కోటలోని పరివారం.
“అక్కడికే బయలుదేరాను. ఎక్కడున్నారు వారు?”
“ఉద్యానవనంలో. మాధవీలతా మంటపం వద్ద. మిమ్మల్ని
అచ్చటికే రమ్మన్నారు.”
తన అశ్వం కళ్యాణిని అధిరోహించి భటుని వెంటే బయలుదేరాడు
మాధవుడు.. పట్టణంలోని విశేషాలను విచారిస్తూ.
“నగరంలోని ప్రజలందరూ కుశలమేనా? కపిలేంద్ర ప్రభువు
పాలనలో సంతుష్టులై ఉన్నారా?”
“ఉన్నారు ప్రభూ! యుద్ధాలు జరుగుతున్నా, పాడి పంటలకేమీ
లోటు లేదు. సమరాలకి కూడా అలవాటు పడిపోయారు ప్రజలు.”
మాధవుడు గ్రహించాడు.. ఎప్పటికైనా ఈ యుద్ధాలు ముగిసేనా
అని అడుగుతున్నాడతడని.
ఒక్కొక్క వంశం మారి కొత్త పాలన రాగానే జైత్ర యాత్రలు..
సామ్రాజ్య విస్తరణ. సామాన్య ప్రజ భీతితో కాలం గడపడం లో
వింత లేదు. కానీ అది ఏ దేశంలో నైనా తప్పని స్థితే. వారు
ఊరుకున్నా, పక్క రాజ్యం వారు ఊరుకోరు. ముష్కరుల
దాడి సరే సరి. అది నిరంతరం సాగిపోయే ప్రక్రియే.
“రాకుమారుడు పురుషోత్తమ దేవుల వారి మీదే కొంత ఆశ
ఉంది ప్రభూ! వారు మహరాజు అయే సరికి కళింగ రాజ్యం సుస్థిర
మవుతుందని, జన సామాన్యం నిశ్చింతగా కాలం గడప గలరనీ
అనుకుంటున్నారు.” ఎందుకైనా మంచిదని, భటుడు పొగిడాడు..
రాకుమారుని మిత్రుడాయె మరి.
మాధవుడు చిరునవ్వుతో తల పంకించాడు.
“అదిగో ప్రభూ.. మాధవీలతా మంటపం. రాకుమారులు ఏ క్షణంలో
నైనా వచ్చేస్తారు.” భటుడు అభివాదం చేసి వెళ్లి పోయాడు.
మాధవుడు, గుర్రాన్ని కొంచె దూరంలో కట్టేసి రాగానే, పురుషోత్తమ
దేవుడు కూడా వచ్చేసి, మిత్రుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు.
“మనం రోజూ, యుద్ధ విద్యని అభ్యాసం చెయ్యాలి మాధవా. గజ
సమూహాలని పెంచాలి. తండ్రిగారు ఆనతిచ్చారు. రాబోయే కాలంలో,
సామ్రాజ్య రక్షణకై, మనం తయారుగా ఉండాలి.”
“అవశ్యం రాకుమారా! రేపటి నుండే ఆరంభిద్దాం.”
“పద్మావతీ దేవి ఎక్కడుంది? ఆవిడ వివాహం ఏమయింది?
ఆ కంచి రాజుతో వెళ్లి పోతోందా?” పురుషోత్తముడు, కించిత్
దర్పంగా అడిగాడు.
మాధవుడు తనని పిలిపించిన కారణం గ్రహించాడు.. యుద్ధం,
అభ్యాసం.. అవన్నీ సాకులే.
“పద్మావతీదేవి క్షేమంగానే ఉన్నారు ప్రభూ! మా బంధువుల
ఇంట ఉంచాను. వారందరితో బాగా కలివిడిగా ఉంటున్నారుట.”
“హూ.. మరి వివాహం..”
“తగిన వరుని కోసం వెతుకుతున్నాను.”
“ఇంకా ఏ ఛండాలుడూ దొరకలేదా? అంత కష్టమా?”
మాధవునికి అర్ధ మయింది. రాకుమారుడు తనకు జరిగిన
అవమానం మరచి పోలేకుండా ఉన్నాడు. పద్మావతీ దేవి మీద
మంచి అభిప్రాయం కలిగించుట తన ప్రధమ కర్తవ్యం.
“రాకుమారా! పద్మావతీ దేవి ఉత్తమురాలు. రాకుమారి అయిననూ
కించిత్తు కూడా గర్వము లేదు. మేము వారిని చాలా మధ్యతరగతి
కుటుంబంలో ఉంచాము. వారితో వారి కుమార్తె వలెనే కలిసి
మెలసి మెలగుతున్నారు.”
పురుషోత్తమ దేవుడు, మాధవుని మాటల మీద పెద్ద ఆసక్తి
లేనట్లు పరిసరాలని పరికించ సాగాడు.
“ప్రభూ! మీరు ఆనతి ఇచ్చినటులే రాకుమారిని మాలిన్యాన్ని
తీసి, శుభ్ర పరచే వాని కే ఇచ్చి వివాహం జరిపించడానికి
ప్రయత్నిస్తాను. విజ్ఞులు మీరు.. ఆలోచించండి.. రాకుమారి
పద్మావతీ దేవి..
సీ. అభము శుభము తెలియని యమాయకురాలు
ఎండకన్నెరుగని ఇంతి యాపె
నీ గుణగణముల నెటులనో విని యుండి
పేర్మిని యెంతయో పెంచు కొనెను
పవలు రేయిను గడుప కడు కష్ట పడగ
క్షణమొక గడియగా గడుపు చుండె
పరిచారిక వలెనే పనులు చేయుచునుండె
పదుగురి మెప్పునే బాగ పొందె
ఆ.వె. కన్న తండ్రి యేమొ కనడు వినడుమాట
బెదరి పోయినట్టి బేల సుమతి
తప్పు నొకరు చేయ దండన మొకరికా
ఏమి తర్క మిదియె ఎన్నగాను?
ఇంత కన్ననూ మీకు నేను చెప్పదగిన వాడను కాను.”
మాధవుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
పురుషోత్తమ దేవుడు సాలోచనగా చూశాడు మాధవుని.
మంచి మిత్రుని లక్షణమే అది..
అంతలో..
“అన్నా! అన్నా.. కాపాడండి..” ఆర్తనాదం వినిపించింది..
పురుషోత్తమ మాధవులిద్దరూ ఆందోళనగా చుట్టూ చూశారు.
మాధవీ లతా మంటపం వెనుక నున్న సెలయేరు దగ్గర నుంచి..
పరుగున వెళ్లారు ఇరువురూ.
సెలయేరులో కొట్టుకుని పోతూ కనిపించింది, రాకుమారి కాదంబరీ దేవి..
……………………….
29
చేతులు పైకెత్తి కొట్టుకుంటూ వడిగా పారుతున్న ఏటిలో కొట్టుకు
పోతోంది రాకుమారి కాదంబరీ దేవి.
పురుషోత్తముడు చప్పట్లు కొట్టి, భటులను పిలవ బోతుండగానే,
మాధవుడు పరుగున వెళ్లి సెలయేరులో దూకాడు.
చెలులు ఒడ్డున పరుగులు పెడుతున్నారు. ఒకటే కేకలు..
అంతా క్షణంలో గందరగోళం కింద తయారయింది. పురుషోత్తముడు,
గజ ఈతగాళ్లని పిలవనంపాడు.
మాధవుడు పెద్ద పెద్ద బారలు తీస్తూ, రాకుమారిని చేరుకుని,
జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాడు
అప్పుడు పరుగెత్తుకుంటూ వచ్చారు చెలికత్తెలు,
పురుషోత్తమ దేవుడు, భటులూ.
మాధవుడు, ప్రాధమిక చికిత్స చేసి, రాకుమారి తాగేసిన
నీళ్లన్నీ కక్కించాడు. నోట్లో నోరుపెట్టి ఊదటం వచ్చా
అని అడిగాడు, అక్కడున్న చెలులని.
అడ్డంగా తల తిప్పారు అందరూ.
ఏంచేద్దామన్నట్లు పురుషోత్తముడి కేసి చూశాడు.
అతడు తల నిలువుగా ఊపాడు తనకేసి తిరిగిన
మాధవునికి, నువ్వే తగిన వాడివన్నట్లుగా..
వెటనే మాధవుడు, రాకుమారి నోటిలో నోరు పెట్టి గాలి
ఊద సాగాడు. చుట్టూ మూగినవారందరూ రాకుమారుని
చూసి దూరంగా కదిలారు. కాదంబరి వద్ద మాధవుడు,
పురుషోత్తముడు మాత్రమే ఉన్నారు.
కొంచెం సేపటికి నెమ్మదిగా కన్నులు తెరిచింది రాకుమారి.
ఆ లోగా కొందరు చెలికత్తెలు పరుగున వెళ్లి రాకుమారి
వస్త్రములు తీసుకొని వచ్చారు.
పరిచారికలు సపర్యలు చేస్తుండగా, మిత్రులిద్దరూ, మండపం
దగ్గరకు వెళ్లి, అక్కడున్న అరుగు మీద కూర్చోబోయారు.
అప్పుడే మాధవునికి, పొడి అంగవస్త్రము, పంచ, అంగీ
తీసుకొని వచ్చి ఇచ్చాడొక భటుడు. అతడు నీటిలోనికి
దూకగానే, రాకుమారుని సైగ అందుకుని మాధవుని ఇంటికి
వెళ్లి తీసుకొని వచ్చాడతడు.
మాధవుడు దుస్తులు మార్చుకోగానే, అరుగు మీద
విశ్రాంతిగా కూర్చున్నారు మిత్రులు.
“ధన్యవాదాలు మిత్రమా! మా సోదరిని కాపాడినందుకు.”
“నాకంటే మీరు ఈతలో సమర్ధులు కదా! మరి అలా
ఊరుకున్నారేమి రాకుమారా?” మాధవుడు సందేహంగా అడిగాడు.
“నాకంటే ముందు నువ్వు స్పందించావు మిత్రమా!
ఇరువురమూ ఏటిలోనికి దూకి.. అక్కడ చేసేదేమీ
లేదని ఊరకున్నాను.” పురుషోత్తముడు చిరునవ్వుతో
అన్నాడు. కానీ మాధవునికి అనుమానంగానే ఉంది.
కావాలనే తనకి అవకాశం ఇచ్చాడు రాకుమారుడని.
తన సంశయమును మనసునందే నిలిపి, రాకుమారునితో
పద్మావతీ దేవి గురించి చెప్ప బోయాడు మాధవుడు. అంతలో..
రాకుమారి కాదంబరీ దేవి, నెమ్మదిగా, చెలుల ఆసరాతో
వచ్చి పురుషోత్తముని ఎదురుగా నిలిచింది. మాధవునికి,
గుండె ఒక క్షణం ఆగినట్లు అనిపించింది.
మోములో అలసట, శారీరక నిస్త్రాణ, మానసిక అలజడి..
అయినా రాకుమారి కన్నులు మాత్రం స్వచ్ఛమైన నీటిలో
తిరుగుతున్న చేప పిల్లల లాగ అనిపించాయి మాధవునికి.
కం. “మిలమిల మెరిసే చుక్కలు
అల నింగిన నిలువ లేక అవనికి వచ్చే
ఎల నెలత కన్నుల నిలిచె
కలనైన మరువగ లేను గాదిలి మీరన్.”
మనసులోనే తన భావాలని దాచుకుని, ఏదో పని
ఉన్నట్లు లేచి వెళ్ల బోయాడు.
“మిత్రమా! ఎచ్చటికి? మా సోదరి నీకు కృతజ్ఞతలు
తెలుపుకుందామనుకుంటుంటే.. పలాయన వాదం పనికిరాదు
సుమా!” పురుషోత్తముడు వారించాడు.
మొహం, బుగ్గలు ఎఱ్ఱ వడుతుండగా మాధవుడు కూర్చున్నాడు.
పురుషోత్తముడు, మిత్రుని అవస్థ ఓరకంట చూసి నవ్వుకున్నాడు.
“ధన్యవాదాలు మాధవ మంత్రులకి. తమ ప్రాణాలకు
తెగించి నా ప్రాణాలు కాపాడారు. ఎన్నటికి మరువలేను.
ఏమిచ్చిననూ ఋణము తీర్చుకొనలేను.” కాదంబరి వినమ్రంగా
పలికింది.
“అంత మాటనవద్దు రాకుమారీ! అది నా ధర్మం.”
అలవోకగా తనను చూస్తున్న కాదంబరి వాలు చూపులకు
పరవశమౌతూ అన్నాడు మాధవుడు.
ఏమా సౌందర్యపు గుబాళింపులు.. అందని చందమామకై
ఆరాట పడకూడదని ఎంత చెప్పినా వినదే ఈ పాడు మనసు.
వద్దు వద్దనుకుంటూనే కాదంబరీ దేవినే చూస్తున్నాడు.
బుద్ధెరిగాక ఒక మగువని, అదీ.. తన మనసు దోచిన వనితని
ఇంత దగ్గరగా చూడడం ఇదే.. ఎంత మరలిద్దామనుకున్నా,
బుద్ధి నిర్దేశిస్తున్నా, మనసు మాట వినడం లేదు.
పురుషోత్తముడు వినోదంగా పరికిస్తున్నాడు ఇరువురినీ.
కాదంబరీ దేవి కూడా, మాధవుని అందానికి ఆకర్షితు
రాలయినట్లే ఉందనుకున్నాడు.
తనని స్పృశించిన తొలి పురుషుడతడు.. ఎంత స్పృహ లేకున్నా, మొహంలో మొహం పెట్టి, పెదవులకి పెదవులానించి.. ఊపిరందించిన యువకుడు. తెలిసీ తెలియని స్థితిలో అందిన ఆ స్పర్శ వెంటాడుతూనే ఉంది.
“అలా ఆసీనులు కండి సోదరీ!”
చెలులు, మండపంలో నున్న పెద్ద బండని శుభ్ర పరచగా,
సుకుమారి కాదంబరి, సున్నితంగా కూర్చుంది.
“కఠినమైన బండ మీద కూర్చుంటే కందిపోతుందేమో
రాకుమారి మేను..” మాధవుడు మదిలో అనుకుంటూ అటూ
ఇటూ చూశాడు ఏదయినా మెత్తని గడ్డి దొరుకుతుందేమోనని.
అంతలో చెలులు మాధవీలతా మంటపం లో దీపం
వెలిగించారు. పగలైననూ, అక్కడ వృక్ష ఛాయలు చీకటిని
వ్యాపింప చేస్తాయి.
ఒద్దికగా కూర్చుని ఉన్న కాదంబరీ దేవి, సృష్టికర్త శ్రద్ధగా
కూర్చుని అమర్చినట్లుంది. మోమున కానపడు ప్రశాంతత
ఎటువంటి కలతనైనా దూరం చేసేట్లుంది.
కన్నులు తిప్పుకోడం కష్టంగా ఉంది మాధవునికి. పురుషోత్తమ
దేవుడు మాత్రం అదేమీ గమనించనట్లు, కాదంబరి వద్దకు
వెళ్లి, చెయ్యి పట్టుకుని నాడి చూశాడు.
“ఫరవాలేదు.. కొద్ది వేగంగా ఉంది కానీ, త్వరితంగానే సరై పోతుంది.”
అన్నగారి వాక్కులకి రాకుమారి మోము మరింత మందార
ఛాయని దాల్చింది.
కం. అలతిగ తలవంచి యతివ
కలలుగనే కన్నుల వెలుగదె కాంచగనే
అల మందస్మిత వదనము
వెలయగ కను విందుగ నిల వేడుక గానే.
కాదంబరీ దేవి సౌకుమార్య సౌందర్యం మాధవుని మనస్సుని
మరే పక్కకీ మరలింప నంటోంది. కానీ వివేకం వెనక్కి లాగుతోంది.
“మాధవ మంత్రులకి మా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము.”
కాదంబరి నమస్కరిస్తూ పలికింది.
“అది నా ధర్మము రాకుమారీ.” మాధవుడు గంభీరంగా అన్నాడు.
“రాకుమారిని మందిరానికి తీసుకుని వెళ్లండి.” పురుషోత్తముడు
ఆనతిచ్చాడు.
నెమ్మదిగా అడుగులు వేస్తూ కాదంబరీ దేవి రాజమందిరం
వయిపు సాగింది, చెలులు పట్టుకుని తీసుకుని వెళ్తుండగా.
మలుపు తిరిగేటప్పుడు వెను తిరిగి మాధవుని వైపు ఒక
వాలు చూపు విసిరింది. అనుకోకుండా మాధవుడు చెయ్యి
పైకెత్తాడు, అభివాదం చేస్తున్నట్లుగా.
పురుషోత్తముడు గమనించనట్లు, వనం లోనికి నడిచాడు.
మాధవుడు తేరుకుని పరిసరాలు గమనించే లోగా మిత్రుడు
బ్రహ్మకమలం చెట్టు దగ్గరగా వెళ్లి ఆ పుష్పాల అందాలని
పరికిస్తున్నాడు.
“ఫ్రభూ! రాకుమారి..”
“అవును మాధవా.. మా కుటుంబమంతా నీకు ఋణపడి
ఉంటుంది, రాకుమారిని కాపాడినందుకు. ఆ ఋణం ఏ విధంగా
తీర్చుకోవాలా అనేది తండ్రిగారితో ఆలోచించి నిర్ణయం
తీసుకుంటాను.”
“ఈ రాకుమారి గురించి కాదు దేవా నేను అడుగుతున్నది..
పద్మావతీ దేవి భవిష్యత్తు. తండ్రి చేసిన తప్పిదానికి బిడ్డని
శిక్షించడం న్యాయమేనా? ధర్మ ప్రభువులు ఆలోచించాలి.”
మాధవుడు అభ్యర్ధ్ధనగా అన్నాడు.
“మనసుకి గాయం చాలా లోతుగా తగిలింది మాధవా! చూద్దాం..
ఆ జగన్నాధుని నిర్ణయమేమిటో.”
అప్పటి వరకూ ఉన్న తీవ్రత రాకుమారుని కంఠంలో కనిపించక
పోవడంతో మాధవుడు కాస్త ఉపశమనం పొందాడు. కొద్ది ధైర్యం
వచ్చింది, పరిస్థితులు చక్కబడతాయని.
మాధవుడు తోటలో పచార్లు చేస్తున్నాడు అస్థిమితంగా. కుడి
చెయ్యి పిడికిలి బిగించి ఎడం అరచేతిలో కొట్టుకుంటున్నాడు.
మధ్యలో తల అడ్డంగా తిప్పుతున్నాడు.
ఆ రోజు యాత్రికులు, బాటసారులు ఎక్కువ మంది రాలేదు.
నందుడు, సీతమ్మ కలిసి వంటపనులు చేస్తున్నారు. గౌతమికి
శిరోభారంగా ఉందని, వెనుక వరండాలో చాప మీద కన్నులు
మూసుకుని విశ్రాంతి తీసుకుంటోంది.
పద్మావతి అప్పుడే సీతమ్మకి కూరగాయలు తరిగి ఇచ్చి
పున్నాగ చెట్టు కింద ఉన్న బండ మీద కూర్చుని మాధవుడ్ని
గమనిస్తోంది.
భృకుటి ముడిచి తీవ్రంగా మధన పడుతుంటే ఇంక
ఆగలేకపోయింది.
“సోదరా! నీ వ్యాకులతకి కారణం నేనేనా? నా వలన మీకు
అసౌకర్యం కలుగుతోందా? ఏదయినా ధర్మ సత్రం లోనికి..”
ఆందోళనగా అటు తిరిగాడు మాధవుడు.
“అయ్యో.. అది కాదమ్మా! జగన్నాధుని ఉత్సవాలు దగ్గర
పడుతున్నాయి. నీ సమస్యకి పరిష్కారం చూపమని ఆ దేవ
దేవుడ్ని వేడుకుంటున్నాను. ఆయన తప్పక కరుణిస్తాడు..
దారి చూపుతాడు. నీ వంటి సౌజన్యవతికి ఇటువంటి కష్టం
రాకూడదు.”
“ఇది నేను కష్టం అనుకోవట్లేదు అన్నా! ఏది జరిగినా మన
మంచికే అని నమ్ముతాను. ఇది లేకున్న మీ ఇంటి
ఆడపడుచునయ్యే అదృష్టం నాకు కలిగేదా?
ఆ రాజ బోగాలకంటే, ఈ స్వేచ్ఛా జీవనమే నాకు ఉల్లాసం
కలిగిస్తోంది. పరిచారికలూ, ఆర్భాటాలూ లేకుండా.. ఏకాంతంలోని
ఆనందాన్ని అనుభవించే భాగ్యం కలిగింది. నా జీవితంలో
మరపురాని, మరువ లేని రోజులని గడుపుతున్నాను.” పద్మావతి
మిలమిల మెరిసే కన్నులతో అంది.
నిజమే.. పద్మావతిలో చాలా మార్పు వచ్చింది.
అందని చందమామలా, అందరికీ ఆమడదూరంలో ఉండే
రాకుమారి, సాధారణ యువతిలా మారిపోయింది. పరిసరాల
మీద కొత్తగా కలిగిన ఆసక్తి, అనురక్తి.. సహజత్వం
వ్యక్తిత్వాన్ని మెరుగు పరచింది.
కాకి గూడులోనుంచి బైటికి నెట్టి వేయబడ్డ కోకిల పిల్లని
చూసినా, ధాన్యం గింజలేరుకుంటున్న పిచ్చుకలని చూసినా,
ఉట్టి మీద పెట్టడం మర్చి పోయిన పాలకుండలో మూతి పెట్టి
మూతి నాక్కుంటూ వెళ్లే నల్ల పిల్లిని చూసినా స్పందిస్తోంది.
ఒక రోజు రెండు ఉడుతలు ఒక దాన్నొకటి తరుముకుంటూ
వెళ్లే దృశ్యాన్ని కళ్లార్పకుండా చూస్తూ, ఆనందిస్తోన్న ప
ద్మావతిని చూసి అడిగాడు.
“సోదరీ.. మా బంధువుల అమ్మాయిలని అప్పుడప్పుడు
వస్తుండమని చెప్పేదా?”
“నేనెవరో చెప్పనని మాట ఇస్తేనే..” పద్మావతి షరతుకి
ఒప్పుకున్నాడు.
అప్పటి నుంచీ ఇద్దరు కన్నియలు రెండు రోజులకొక మారు
వచ్చి ఆటపాటలతో కాలం గడపుతున్నారు. పద్మావతి ఒ
రియా నాట్యం, తెలుగు పాటలు నేర్చుకుంటోంది వారి వద్ద.
“అన్నా.. ఏమా చింతన” పద్మావతి హెచ్చరికకి వర్తమానంలోకి
వచ్చి చిరునవ్వు నవ్వాడు మాధవుడు.
“నా గురించేనా లేక మా కాబోయే వదిన గారి గురించా
ఆలోచనలు?”
ఉలిక్కి పడ్డాడు మాధవుడు.
ఇంటిలోని వారందరికీ తన మనస్థితి వ్యక్త మవుతోందా?
“కొంచె కొంచెంగా.. నడతలో అన్య మనస్కం, చూపులో
శూన్యత, మాటలో తడబాటు అన్యాక్రాంతమైన మనసుని
చెప్తున్నాయి సోదరా. నేనిలా అంటుంటే ఎర్రబడ్డ నీ మోము
కూడా..” మాధవుని అంతరంగాన్ని విప్పిచెప్తున్న పద్మావతిని
కినుకగా చూశాడు.
“ఎవరా అదృష్ట వంతురాలు అన్నా? నీ వంటి మంచిమనిషిని
చేపట్టబోయే యువతిని నాకెప్పుడు చూపిస్తావు?”
“అందని పండు సోదరీ. ఆశ పడితే నిరాశే ప్రాప్తం. ముందుగా
నీ సమస్య పరిష్కరించాకే నా వివాహం. అది, తల్లిదండ్రులు
మెచ్చిన అమ్మాయి తోనే.”
“రాకుమారి కాదంబరీ దేవి కదా సోదరా? చూడ చక్కని
వనిత. చాలా మంచి స్వభావం అని కూడా విన్నాను.”
మాధవుడు కంగారుగా అటూ ఇటూ చాశాడు. అసలు తమ
ఇంట అటువంటి ప్రస్థావన రావడమే తప్పు. ఎవరికైనా తెలుస్తే
తన తల తియ్యడం ఖాయం.
పద్మావతి ఎలా గ్రహించిందీ?
“రాకుమారుడు పురుషోత్తమునికి నీడలా తిరిగే నిన్ను
ఆకర్షించగల వనిత ఆవిడే అయుంటుందని ఊహించా అన్నా.
నా వద్ద ఆమె చిత్ర పటం కూడా ఉండేది. రాకుమారుని
కుటుంబంలోని అందరి గురించీ మా చారులు వార్తలు
సేకరించారు. అప్పటి రోజుల్లో.. తెలుసుకోవడం ఆవశ్యం
అనిపించింది.”
“ఈ విషయం ఎవరి వద్దా..”
“అనను. కానీ మన ప్రయత్న లోపం ఉండకూడదు సోదరా!
కనీసం రాకుమారి మనసు తెలుసుకునే అవకాశం కొరకు
చూడాలి.” పద్మావతి అనునయంగా అంది.
“నా విషయానికి చాలా అవరోధాలున్నాయమ్మా! రాకుమారి
వివాహం రాజకీయ ప్రయోజనాలను కలిగించాలని
అనుకుంటారు. పైగా.. వారు క్షత్రియులు. కుల సమస్య
ఉండనే ఉంది. ముందుగా నీ విషయం చూడాలి. మరల
జగన్నాధుని రథయాత్ర ఆసన్న మవుతోంది. ఆ జగద్రక్షకుడే
కాచుకోవాలి.”
వీధి వాకిట సందడి విని పిస్తే అటుగా వెళ్లాడు మాధవుడు.
ఇరువురు రాజ భటులు..
“మహారాజు కపిలేంద్ర వర్మల వారు మిమ్ములను అత్యవసరంగా
రమ్మన్నారు ప్రభూ!” వార్త వినిపించాడు ఒకడు.
………………….
30
మాధవుడు పట్టు వస్త్రములు ధరించి, జరీ తలపాగా పెట్టుకుని,
మెడలో ముత్యాల హారం అలంకరించుకుని.. నుదుట సింధూర తిలకం
దిద్దుకుని, అమ్మమ్మకీ, అమ్మకి, తండ్రిగారికీ నమస్కరించి..
పద్మావతిని ఎదురు రమ్మని బయలు దేరాడు.
తొలి సారిగా.. మహరాజుగారు కబురు పంపారు. ఉన్నంతలో
తనని తాను ఆకర్షణీయంగా అలంకరించుకుని బయలు దేరాడు..
లోలోపల కొంత ఆందోళనగా ఉన్ననూ.. ఎందుకు రమ్మన్నారో..
ఒక రాజభటుడు కళ్యాణికి జీను అదీ తగిలించి, మాధవుని
చూసి అలా నిలబడి పోయాడు.
సాగనంపడానికి వాకిలి వద్దకు వచ్చిన నందుడు, భటుని
ఆరాధనా పూర్వక దృష్టిని కని, తాను కూడా ఒక సారి చూశాడు,
కుమారుని వంక.
పుంసా మోహన రూపాయ.. అని శ్రీరాముడిని వర్ణించినట్లుగా
అనిపించాడు నందుడికి.
సీ. మోము మెరయనెంతొ ముచ్చట గొలుపుచూ
తీరైన నాసిక తెలివి చూప
ధీర గంభీరమౌ దృక్కుల కన్నులు
పదునైన తలపుల బాగ తెలుప
నిలువెల్ల నలరారు నేరిమి శౌర్యము
శత్రుగుండెల నింపు శంక వెఱపు
ఆజాను బాహువై నాదాటు నిలిచిన
ఆరీతి దోచదా అతివ మనసు
ఆ.వె. నలువ నెమ్మి నెంతొ నాణ్యము నెలగొల్పె
చెలువ మందు మరియు శీల మందు
అతడి నడవడి యదె యందరి మోదమౌ
మాధవు డను నామ మంత పలుక.
ఏ రాచమందిరంలోనో తిరుగాడ వలసిన వాడు.. తన ఇంట.
అచ్చు ఆ చిన్ని మాధవుని వలెనే.
ఆ ఆలోచన రాగానే నందునికి ఒక్క సారిగా దిగులు
కమ్ముకుంది. అంటే ఆ కృష్ణయ్యలాగా, త్వరలో తన ఇంటి
నుండి వెళ్లి పోయి.. కంటికి కనిపించడా! అదే జరుగుతే
గౌతమి తట్టుకోగలదా? ఆ యశోదమ్మలా జీవన మంతా
వేదనేనా?
మొహమంతా దిగులు కమ్ముకుంది.
వీడ్కోలు చెప్పుదామని వెను తిరిగిన మాధవుడు తండ్రి
ఆవేదనని గ్రహించాడు.
“మహరాజుని కలుసుకోవడానికే వెళ్తున్నాను తండ్రీ. మరల
తిరిగి వస్తా కదా! ఎందుకంత ఆందోళన?”
“తొలిసారి నిన్ను ప్రత్యేకంగా మహారాజుగారి పిలువనంపారు
కదా.. ఏమి వార్త వినాలా అని కించిత్ సందేహం మాధవా!
మరల ఏదైనా యుద్ధ ప్రతిపాదన వచ్చి మాకు దూర
మవుతావేమోనని..” అంతలో గౌతమి కూడా వచ్చి పక్కన
నిలిచింది కళ్లనిండా నీళ్లతో.
పద్మావతీ దేవి సంభ్రమంగా చూస్తోంది. ఇంతటి ఆప్యాయతలు
తమ రాజమందిరాలలో కానరావేమి? రాజుగారిని
కలవడానికి వెళ్తుంటే.. దేశాంతరం వెళ్తున్నట్లు వీడ్కోలు
చెప్తున్నారెందుకో!
“నేను ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే మిమ్మల్ని కూడా
తీసుకెళ్తాను.సరేనా? నిన్ను కూడా అమ్మమ్మా.” దూరంగా
నిల్చుని చూస్తున్న సీతమ్మ దగ్గరగా వెళ్లి, భుజాలు పట్టుకుని
చెప్పాడు.
“మామూలుగా కోటకి వెళ్తుంటే అంతటి కన్నీరెందుకమ్మా?”
“యుద్ధ వార్తలు విన వస్తున్నాయమ్మా! కాంచీపుర దండయాత్ర
అయి ఇంకా ఆరేడు మాసములు గడవలేదు. రాజుగారు పిలువ
నంపారంటే బలమైన కారణం ఉంటుంది కదా! మా కున్నది
ఒక్కగా నొక్కడు. ఇతడు మా వ్యాపారం మీద అంత ఆసక్తి
కన పరచకుండా, గురుకులంలో చేరి, రాకుమారినితో సమముగా
అన్ని విద్యల్లోనూ ఆరి తేరాడు. అదే మా వ్యాకులతకి కారణం.”
పద్మావతి సందేహానికి సమాధానం చెప్పాడు నందుడు.
“ఇదేమీ దినచర్య కాదు. ఇదే మొదటి సారి ఇటువంటి
పిలుపునందుకోవడం.” సీతమ్మ వివరించింది.
“ప్రతీ దినమూ కోటకి వెళ్లినా అది రాకుమారుని కలవడానికే
తప్ప మహారాజు..” గౌతమి మాట్లాడలేక పోయింది.. గొంతులో
ఏదో అడ్డు పడ్డట్లయి.
“ఏమీ అనుకోనిది జరగదమ్మా! సోదరుడు శుభవార్తతో
వచ్చెదరు. చూస్తూ ఉండండి.” పద్మావతి ధైర్యం చెప్పింది.
“నీ నోటి ఫలం.. అంతకన్ననూ కావలసినదేమున్నది తల్లీ!”
గౌతముడు కాస్త నెమ్మదించాడు.
కళ్యాణి నెమ్మదిగా నడుస్తోంది.. యజమాని అంతరంగం
ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే ఉంటుంది. మాధవుడు పైకి బింకంగా
ఉన్నాడు కానీ.. లోలోపల బెదురుగానే ఉంది. ముందురోజు
రాకుమారి ప్రాణాలు కాపాడేటప్పుడు.. అత్యవసర
పరిస్థితులలో నోటిలో నోరు పెట్టి.. తప్పలేదు. ఆ సంగతి తెలిసి,
శిక్షించడానికి పిలిచారా? తనకి శిరచ్చేదన తప్పదా?
మరణం అంటే ఏ మాత్రం భయం లేదు. తెలిసీ తెలియని
వయసులోనే అతి దగ్గరగా, తడబడుతున్న అడుగులతో,
తెర మరుగున దాగి, వణకుతున్న చేతులని కళ్లకి అడ్దు
పెట్టుకుని, దడదడ మని కొట్టుకుంటున్న గుండెలతో..
అంతఃపుర స్త్రీలని, పసి వారిని, ముసలి వారిని.. అందరినీ
నరికెయ్యడం చూశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లి
వీపుకు ఆనుకుని, నిద్దర కాచుకుని పారిపోతున్నప్పుడే
మరణం అనివార్యమని తెలుసుకున్నాడు.
కానీ తన మీదే ఆశలు, ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న
తల్లిదండ్రుల శోకం తలచుకుంటేనే మనసు వికలమవుతోంది.
అయితే.. రాసి పెట్టినదేదో జరగక తప్పదు.
గుండె దిటవు చేసుకుని కళ్యాణి కళ్లెం లాగాడు. అశ్వం
వేగం పెంచింది.
మహరాజు కొలువు తీరి ఉన్నారు. మంత్రి సామంతాదులందరూ
తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు.
లోలోపల బెదురుగా ఉన్నా, మాధవుడు బింకంగానే అడుగు
పెట్టాడు సభలోకి.
ఠీవిగా.. తల కొద్దిగా వాల్చి మహారాజుకి అభివాదం చేశాడు.
ఇరువురు భటులు వచ్చి రాజుగారి వద్దకు తోడ్కొని వెళ్లారు.
మాధవుడు ఓరకంట పురుషోత్తమ దేవుని కోసం వెదికాడు.
రాకుమారులందరూ, రాజుగారి సింహాసనం పక్కన వరుసగా
ఆసీనులై ఉన్నారు. హంవీరకుమారుడు, అతని ఏక గర్భ
సహోదరుడు తప్ప మిగిలిన పదహారు మందీ, ఆసీనులై ఉన్నారు.
ఇటువంటి సభలోనికి అడుగు పెట్టడం ఇదే ప్రధమం
మాధవునికి. చిత్రంగా, లోలోన ఉన్న భయం అంతా మాయం
ఐపోయింది. తాను ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నట్లుగా
అనిపించింది. రాచకొలువు కొత్తగా లేదు. తన రక్తంలో
జీర్ణించుకుని పోయినట్లుంది.
కపిలేంద్ర వర్మ, తన వద్దకు రమ్మని మాధవునికి సైగ
చేశాడు. రాజ సింహాసనం వద్దకు వెళ్లగానే, లేచి ఆలింగనం
చేసుకుని సభకి పరిచయం చేశాడు.
“ఈ రోజు మేమందరం ఈ విధంగా ఆనందంగా ఉన్నామంటే,
ఈ యువకుడు ప్రాణాలకు తెగించి మా రాకుమారిని కాపాడిన
వైనమే. మా ఒక్కగానొక్క కుమార్తెని కాపాడి మమ్ములను
ఋణగ్రస్తులను చేశాడు. అందుకే ఇతడికి మంత్రి పదవి
ఇస్తున్నాను. అంతే కాదు.. మాకు ముఖ్య సలహా దారుగా
కూడ ప్రత్యేక బాధ్యత అప్పగిస్తున్నాను.” సభ చప్పట్లతో
మారు మోగి పోయింది.
మాధవునికి తాను వింటున్నదేమో ఒక క్షణం అర్ధం అవలేదు.
ఇదంతా కలా.. నిజమా!
రాకుమారిని తాకినందుకు శిక్షిస్తారేమో అనుకుంటే.. ఈ విధంగా
సత్కరిస్తున్నారా! తాను అదృష్ట వంతుండే. పురుషోత్తమ దేవుని
వంక తిరిగాడు.
చిరునవ్వుతో తన మిత్రుడు చెయ్యెత్తి కనుసన్నలతోనే
పలుకరించాడు.
అధికారిక దుస్తులు తలపాగా అందిస్తూ.. అంగుళీయకం
తొడిగాడు కపిలేంద్ర వర్మ.
“మాధవ మంత్రీ! ఈ అంగుళీయకం సహాయంతో మీరు
నిరభ్యంతరంగా, కోట లోపలికి, కొలువునకు, మా రాజ
మందిరానికీ వస్తూ వెళ్తుండ వచ్చు. ఈ రోజు సాయం కాలం,
మా మందిరంలో నున్న తోట వద్దకు ఒకసారి రండి.
మీతో ఆంతరంగికంగా మాట్లాడాలి.” మాధవునికి మాత్రమే
వినిపించేట్లుగా అన్నాడు.
సభలోని వారందరినీ మాధవునికి పరిచయం చేశారు,
ప్రధాన మంత్రి గోపీనాధ పాత్రుడు.
కొద్దిగా తలవంచి, వినయం ప్రదర్శిస్తూనే, తన అభిమానం
నిలుపుకుంటూ ప్రతీ ఒక్కరినీ పలుకరించాడు మాధవుడు.
ప్రధమ పరిచయంలోనే ప్రముఖులందరికీ మాధవుని పట్ల
సుహృద్భావం ఏర్పడింది.
చివరగా రాకుమారుల వద్దకు వచ్చారు.
“తన సోదరులని మీ మిత్రుడే పరిచయం చేస్తారు మాధవ
మంత్రీ!” గోపీనాధ పాత్రుడు నవ్వుతూ పురుషోత్తమ దేవునికి
అప్పగించారు.
పురుషోత్తముడు లేచి మిత్రుని ఆప్యాయంగా ఆలింగనం
చేసుకున్నాడు.
………………………...
“గౌతమీ! మన ఇంటికి బండేదో వస్తోంది, మాధవుని గుర్రం
వెనుకగా!” సీతమ్మ సంభ్రమంగా అరిచింది.
హడావుడిగా లోపలినుంచి వచ్చారు నంద, గౌతమిలు.
మాధవుడు, ఇంటిముందు ఆగి, గుర్రం కట్టేసి వచ్చాడు.
ఆ లోగా బండి మీద సంభారాలన్నీ కిందికి దింపారు భటులు.
ఇంట్లోని వారందరికీ పట్టు వస్త్రములు, ఆభరణాలు..
తినుబండారాలు. అన్నింటినీ లోపలికి చేరవేసి, వంగి వంగి
నమస్కరిస్తూ వెళ్లిపోయారు, బోయీలు, భటులూ.
“ఇదంతా ఏమిటి నాయనా?” గౌతముడు అడిగాడు,
ఆనందంతో.
“అనుకోకుండా చేసిన సహాయానికి ప్రతిఫలం తండ్రీ..”
కిందటి రోజున వనంలో జరిగిన సంఘటన వివరించాడు మాధవుడు.
“రాకుమారిని తాకి, ఊపిరందించినందులకు శిక్షిస్తారేమోనని
భయపడ్డానమ్మా! కానీ రాజుగారు దయార్ద్ర హృదయులు.
మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. రోజూ కోటకి వెళ్లాలి.
నాకు అప్పగించిన బాధ్యతలని నిర్వర్తించాలి.”
“చాలా సంతోషం కుమారా! మన బంధువైన గోపీనాధ పాత్రుల
తరువాత మరల నీకు అంతటి గౌరవం దక్కింది.” నందుడు
ఆనందంగా వచ్చి కుమారుడిని కౌగలించుకున్నాడు.
“ఆగాగు.. లోపలికి రాకు. దిష్టి తియ్యాలి.” సీతమ్మ పరుగున
ఇంట్లోకి వెళ్లింది.
కొద్దిగా నడుం వంచి వెళ్తున్న సీతమ్మని ఆందోళనగా
చూశాడు మాధవుడు.
“వయసు ప్రభావం కుమారా! ఆవిడ ఆరోగ్యానికేమీ
ఫరవాలేదు.” గౌతమి హామీ ఇచ్చింది.
సంధ్యా సమయానికి ఒక ఘడియ ముందుగానే తన
అశ్వాన్నెక్కి బయలు దేరాడు మాధవుడు. ఈ సారి
కళ్యాణి ఉత్సాహంగా కదం తొక్కుతోంది.
మంత్రి హోదాలో మాధవుడు కోటకి వెళ్తున్నాడు.
మహారాజుగారు అందించిన అంగుళీయకాన్ని ధరించి..
అధికారిక దుస్తులతో.. ఠీవిగా!
ఆ.వె. దర్పమున హయమును ధాటిగా నదిలించి
ఆధి పత్యమంత యరయ జూప
కనుల నిండుగ కని కదలెను నందుడు
కూర్మి కుమరు ప్రతిభ గుండె నిండ.
కోటలోనికి వెళ్తుంటే కూడా, అక్కడ నిలచి ఉన్న భటులందరి
అభివాదములు గమనించి.. కొద్దిగా బిడియ పడ్డాడు మాధవుడు.
రోజూ వచ్చే కోటే.. కానీ ఏదో కనిపించని భేదం.. ఒడలంతా
తెలియని ఉత్సాహం. పరిసరాలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి.
తనని మహారాజుగారెందుకు రమ్మన్నారో.. ఏ కార్యము
నప్పగించెదరో!
ఒకటే ఆలోచన.. ఒకటే ధ్యేయం.
రాజుగారు అప్పగించబోయే బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి.
మంత్రిగా మొట్ట మొదటి కార్యం.
ఏమయి ఉంటుంది?
తనను కూడా యుద్ధంలోనికి రమ్మనెదరా? కాంచీపుర
దండయాత్రలో తన నైపుణ్యమును వినియే యుందురు కదా!
పరిపరి విధముల చింతించుచూ రాజ మందిరం వద్దకు చేరాడు
మాధవుడు. అక్కడే నిలబడి యున్న భటుడు గుర్రాన్ని
తీసుకుని వెళ్లి పోయాడు.
మాధవునికి ఏ ఆటంకమూ లేదు. రాచ ముద్రికను కూడా
ఎవరూ అడగ లేదు. వార్తలు అనతి కాలం లోనే కోటలో
వ్యాపించేస్తాయి.
నెమ్మదిగానే ఐనా, హుందాగా సోపానాలు అధిరోహించాడు
మాధవుడు.
మహారాజు కపిలేంద్ర వర్మ ప్రధాన మంత్రితో ఏదో చర్చలో
ఉన్నారు. మాధవుడు దూరంగా నిలబడి అభివాదం చేశాడు.
కూర్చోమన్నట్లు తల పంకించి, తన మాటలు కొనసాగించారు
మహారాజు.
కొద్ది సేపయ్యాక, ప్రధాన మంత్రికి సెలవిచ్చి మాధవుడిని
పిలిచారు కపిలేంద్ర వర్మ.
అంతా రాజుగారే మాట్లాడారు.. మధ్య మధ్య మాధవుని
సందేహాలను తీరుస్తూ!
“మేము దక్షిణదిశగా, రాజమహేంద్రవరం, కొండవీడు రాజ్యాలను
స్వాధీనం చేసుకోవడాని వెళ్తున్నాం. మీరు, రాకుమారుడు
పురుషోత్తమ దేవుడు ఇంతకు మునుపు చేసినట్లే రాజ్య రక్షణ
గావించాలి.”
“అలాగే ప్రభూ మీ ఆనతి.”
“అంతే కాదు.. మీ మీద మరొక గురుతరమైన బాధ్యత
పెడుతున్నాను..”
మాధవుని మరింత దగ్గరగా రమ్మని, తన ఆదేశాన్ని
నెమ్మదైన స్వరంతో అందజేశారు మహరాజు.. నమ్మలేనట్లు
చూస్తున్న మాధవునికి, ఏం ఫరవాలేదన్నట్లుగా ధైర్యాన్ని తన
చూపులతోనే ఇస్తూ.
సమావేశం అయ్యాక, నెమ్మదిగా మందిరం బయటికి వచ్చాడు
మాధవుడు, ఆలోచనలతో నిండిన మదితో!
…………………………
31
“మాధవా! జగన్నాధుని సేవకి సమయం ఆసన్నమవుతోంది.
ఈ సారి మరింత ఘనంగా ఏర్పాట్లు చెయ్యమని తండ్రిగారు
ఆదేశ మిచ్చారు. మొత్తం భారమంతా మన మీదనే.. ఇంక ఒక
మాసము మాత్రమే ఉంది. ఈ లోగా, నీవు రెండు మారులు పూరీ
పట్టణమునకు పోయి రావలెను.” పురుషోత్తమ దేవుడు, కొలనులో
ఈత కొడ్తూ అన్నాడు.
గుర్రపు స్వారీ.. కత్తి యుద్ధం సాధనలయ్యాక మిత్రులిరువురూ
వనములో కొలను వద్ద, స్నానం చేసి మంటపంలో కూర్చుని
ఆ రోజు రాచకార్యాలను ముచ్చటిస్తారు.
“అలాగే రాకుమారా! ఈ మారు కూడా జగన్నాధుని సేవించుకునే
అదృష్టం మిమ్ములను వరిస్తున్నట్లుంది. తప్పకుండా అన్ని
ఏర్పాట్లనూ చేసెదను.” మాధవుడు కొలనులోనుండి బైటికి
వచ్చి, అంగ వస్త్రముతో త్వర త్వరగా అద్దుకుని, మంటపం
వెనుకకు వెళ్లి దుస్తులు ధరించి వచ్చాడు.
“ఏమాయె మాధవా? ఏమా తొందర? సభకి ఇంకా
సమయమున్నది కదా!” మాధవుడు పలుక కుండా మంటపంలో
ఆసనం మీద కూర్చున్నాడు.
అప్పుడు వినిపించింది, పురుషోత్తమునికి కలకలా రావం..
“ఓహో.. మా సోదరి వచ్చుచున్నదా? నిజమే.. ఇప్పుడు
అంతఃపుర స్త్రీలు విహారం చేసే సమయం ఆసన్న మయింది కదా!
మనం బయలు దేరుదాం.”
కాదంబరీ దేవి, కొలనులో దిగడానికి కావలసిన దుస్తులు
ధరించి వచ్చింది చెలులతో. వెనుకే చెలులందరు అవసరమైన
ఇతర సామగ్రి తో అనుసరిస్తూ వస్తున్నారు.
సోదరిని చూసినంతనే పురుషోత్తముని మోము మందహాసంతో
విచ్చుకుంది. వనమంతా చిరు సవ్వడులు మొదలయ్యాయి.
వాతావరణ మంతా ఆహ్లాదంగా తయారయింది.
మహా స్రగ్ధర.
అరుగో యా నెచ్చెలుల్ కాయగ నదె రయమున్ హాయిగా రాకుమారే
యరుదెంచంగానె యా తోయముల యలల నా హాసముల్ యేమనేనో
చిరు వయ్యారాలు చూపించి యుడుత లదె వేంచేసి యానంద మందే
మురిపెమ్మెండైన నెంతో ముదము నిలిచెగా మోమునే మెచ్చగానే.
అన్నగారి పాదములంటి నమస్కారము చేసింది కాదంబరి.
“కుశలమేనా సోదరీ!” చిరునవ్వుతో విచారించి, స్నేహితుని
వెదకుతూ పయనమయ్యాడు పురుషోత్తముడు.
మాధవుడు మహారాజుగారి ఆనతి మేరకు పూరీలో జరుగబోవు
రథయాత్ర ఉత్సవానికి పర్యవేక్షణ జరుపుతున్నాడు. వారమున
కొక మారు పూరీ వెళ్తున్నాడు.
కోటలో కొలువునకు ప్రతీ దినమూ వెళ్ల వలసిందే.
అప్పుడప్పుడు, చెలులతో నడయాడుతూ.. అరుదుగా
ఏకాంతమును ఆస్వాదిస్తూ, వనములలో కాదంబరీ దేవి
ఎదురు పడుతూనే ఉంది మాధవునికి.
ఒక సారి మాత్రము, సూటిగా కళ్లలోకి చూసి చిరు నవ్వు
నవ్వింది.
హృదయం చిక్క బట్టుకుని పక్కకి తిరిగి వెళ్లి పోయాడు.
అప్పటి నుండీ, గుండెలోనే తిష్ట వేసుకుని కూర్చుంది.
రాకుమారునికి చెప్తే..
తల విదిల్చాడు.. అసలే రాకుమారుడు పరిహాసం చేస్తుంటాడు.
అది మహా రాజుగారికి తెలుస్తే.. తల తీసేసినా ఆశ్చర్యం లేదు.
కోటలో రాకుమారికీ, పూటకూళ్ల మాధవునికీ పొంతనెక్కడ?
అత్యాశే.. అందుకే సాధ్యమయినంత వరకూ అణచి వేస్తున్నాడు.
ఒక వేళ, కోటలోని వారు ఆంగీకరించినా.. తన ఇంటిలోని
వారు ఒప్పుకోవాలి కదా! వారి దృష్టిలో కుల సామరస్యం లేదాయె.
ప్చ్.. ఈ స్పందనలనెందుకు పెట్టాడో ఆ భగవంతుడు?
ఇంట్లో సీతమ్మ, మనుమని పెండ్లి చేయాలని గొడవ..
ఇంకెందుకాలిశ్యం, మాధవుడు మంత్రి అయ్యాడు కదా
అంటుంది. తనకి తెలిసిన మంచి సంబంధాలు చెప్తూంటుంది.
గౌతమీ నందులు కూడా అదే ఆలోచిస్తున్నారని తెలిసి పోతోంది.
అంతా ఆ జగన్నాధుని మీదనె భారం పెట్టి కాలంగడుపుతున్నాడు
మాధవుడు.
అనుకున్న సమయం రానే వచ్చింది.
మాధవుడు వారం రోజులు ముందుగానే పద్మావతీ దేవిని,
సీతమ్మని తోడుగా తీసుకుని పూరీలో దింపి వచ్చాడు.
అక్కడ మంత్రిగా అతనికి సకల సదుపాయాలతో
భవనం ఏర్పాటు చేసుకున్నాడు.
రథయాత్ర సమయంలో పద్మావతి జగన్నాధుని సేవ చేస్తానని
మొక్కుకుందని సీతమ్మే గుర్తు చేసింది.
పద్మావతి ప్రతీరోజూ, ఆలయానికి వెళ్లి ప్రాంగణ మంతా శుభ్రం
చేస్తోంది, మిగిలిన భక్తులతో కూడి.
ఆ సంవత్సరం మరింత వైభవంగా చేయాలని నిశ్చయించాడు
కపిలేంద్ర వర్మ. కాంచీపుర విజయం ఒక ఎత్తైతే.. రాజ్యంలో
సకాలంలో వానలు పడి సుభిక్షంగా ఉండడం మరొక కారణం.
రథయాత్ర ప్రారంభ సమయానికి వచ్చేస్తానని వాగ్దానం
చేశాడు మాధవునికి. అంతవరకూ స్వామి సేవని పురుషోత్తముని
చెయ్యమని ఆదేశించాడు.
రెండురోజులు ముందుగానే రాచ కుటుంబమంతా వచ్చేసింది..
వారితోనే నంద గౌతమిలు కూడా..
మార్గ మధ్యంలో విశ్రాంతి సమయంలో పరిచయమయింది,
రాకుమారి కాదంబరీ దేవి వారికి. మాధవ మంత్రి తల్లిదండ్రులనగానే,
సమీపానికి వచ్చి పలుకరించింది. ఇంక.. రాకుమారిని జన
మధ్యంలో చూసిన వారు ఆమె సౌకుమార్యానికి, అందచందాలకు
ఆశ్చర్య చకితులై ఉండిపోయారు.
సీ. దేవేంద్ర వనమునందే వెలసినయట్టి
పారిజాత విరుల పసిమిగలిగి
పున్నమి చంద్రుని పొలపము పొడచూప
మేని ఛాయ పొసగు మిసిమి వెలుగు
మల్లిరేకుల సుకుమారపు సొగసులు
మోమునందు విరియ మురిపముగను
సరస కొచ్చిననంత సంపంగి తావియె
ఆహ్లాదముగ నెంతొ ఆవరించ
తే.గీ. మీనముల పోలు కనుదోయి మెరుపులవియె
అభినివేశము కలిగిన యలతి యనగ
అణువునణువున కనబర్చ యణకువెంతొ
అతిశయము కూడ కానగ యరుదుగాను.
అణకువతో, ఆదరముతో సంభాషించింది కాదంబరీ దేవి.
సీతమ్మ పాడుతున్న జానపద గేయాలతో సునాయాసంగా
గడిచి పోయింది సమయ మంతా.
మధురగతి రగడ.. అరె చూతముగా ఆది పురుషునే
యరుగుచు నందరు నాటల నాడను
కరివరదుడతడె, కలియుగముననూ
హరి హరి యన భవ హరమ్ము కల్గును.
జగన్నాధు డతడె జాడతెలియగను
జగముల నేలడ జలధిని నిల్చిని
ఖగవాహనుడే కాచగ జనులను
నగమెత్తినయా నారాయణుడును.
పాటలయ్యాక, భజన చేస్తూ పూరీ పట్టణం చేరారు అందరూ.
ఏటికేడు జగన్నాధ రధ యాత్రని వీక్షించడానికి భక్త సందోహం
పెరిగి పోతోంది. భక్తులకి సదుపాయాలు చెయ్యడానికి ఆలయ
నిర్వాహకులు కొత్త మార్గాలు వెతుకు తున్నారు.
రాచకుటుంబం వారి విడిది సమూహం వద్దనే మాధవుని
కుటుంబం కూడా ఉన్నారు. సముద్రపు ఒడ్డుకి దగ్గరలోనే
కట్టిన వసతి గృహాలు.. సూర్యోదయం చూడాలంటే సముద్రపు
ఒడ్డునే చూడాలి.
ప్రతీ ఉదయం సముద్రపు ఒడ్డుకి వెళ్లడం కాదంబరీ దేవికి
అలవాటయింది. చిన్నపిల్లలా ఒడ్డునున్న ఇసకలో గూళ్లు కట్టడం,
రెండు చేతులతో పావడా ఎత్తి పట్టుకుని అటూ ఇటూ ప
రుగులు పెట్టడం.. అరమరికలు లేకుండా అందరితో కలిసిపోతోంది.
“నంద మహాపాత్రుల కుమార్తె నా మీరు?” పద్మావతిని
చూసి అడిగింది కాదంబరి, సముద్ర పొడ్డున అలల్లో ఆడుకుంటూ.
“అవును రాకుమారీ. దత్త పుత్రిక.” పద్మావతి సమాధానం
చెప్పే లోగా, అక్కడి కొచ్చిన సీతమ్మ అందుకుంది.
“చాలా సంతోషం. మీకు కత్తి యుద్ధం నేర్పిస్తాను. ఇక్కడున్న
కాలమంతా. తరువాత కూడా మీరు మా కోటకి వస్తే మనం
చాలా విద్యలు నేర్చుకొన వచ్చును.” కాదంబరీ దేవి,
పద్మావతి దగ్గరగా వచ్చి అంది.
“కత్తి యద్ధం.. అమ్మాయిలు యుద్ధాలు చెయ్యడం
ఎందుకు రాకుమారీ?” సీతమ్మ సందేహం.
“క్షత్రియ కన్యలకి యుద్ధ విద్యలన్నీ వచ్చి ఉండాలి
అమ్మమ్మా? నేను రోజూ అభ్యాసం చేస్తుంటాను. పద్మావతీ దేవికి
నేర్పిస్తాను.”
“యుద్ధ విద్యల సంగతి ఎలా ఉన్నా, మీ స్నేహం కలకాలం
వర్ధిల్లాలని ఆ జగన్నాధుని ప్రార్ధిస్తాను.” సీతమ్మ అక్కడి నుంచి
వెళ్లి పోయింది.
“రోజూ జగన్నాధుని సేవకి వెళ్తున్నారా మీరు పద్మావతీ?”
ఎవరూ చెప్పక పోయినా, ఎందుకో పద్మావతిని ఇతర చెలుల్లాగా
కాకుండా మన్నిస్తుంది కాదంబరీ దేవి.
“అవును. ఆలయం శుభ్రం చేయడంలో నా వంతు నేను సహాయం
చేస్తున్నాను. దేవునికి పూల మాలలు కడ్తాను. వంట శాలలో
కూడా చేయందిస్తున్నాను. ఉదయం స్నానాదికాలు పూర్తవగానే
వెళ్లి సంధ్యా సమయానికి విడిదికి చేరుతాను.” పద్మావతి చెప్పింది.
మూడవరోజు రాత్రి భోజనాలయిన పిదప ఆరుబయట
కూర్చున్నారందరూ. సముద్రపుగాలి ఆహ్లాదంగా వీస్తోంది.
అక్కడక్కడ మేఘాలు కదలాడుతున్నా, ఆకాశంలో తారలు
పలుకరిస్తున్నట్లుగా మిణుకు మిణుకు మంటున్నాయి.
“మీరు కటకం వచ్చి చాలా దినాలయిందా? ఇక్కడి
వాతావరణం నచ్చిందా?” కాదంబరీ దేవి ప్రశ్నలకి అవునన్నట్లుగా
నిలువుగా తలూపింది పద్మావతి.
రాకుమారి పద్మావతిలోని రాచఠీవి, ఆవిడ పూటకూళ్ల
ఇంటికి చెందినది కాదని చెప్పకనే చెప్తోంది. కాదంబరికి
కాంచీపురం దండయాత్ర గురించి కొంచెం తెలిసినా, పూర్తి వివరాలు
తెలియవు. పద్ధెనిమిది మంది యువరాజులున్న కోటలో
అంతఃపుర స్త్రీలు రాజకీయాలకి దూరంగానే ఉంటారు.
“నంద మహా పాత్రులు మాకు బాగా కావలసిన వారు.
దక్షిణదేశంలో జరిగిన యుద్ధంలో మా కుటుంబం చెల్లా
చెదురై పోయింది. సోదరుడు మాధవుడు వచ్చి నన్ను కటకం
తీసుకొని వచ్చారు, శతృ సైనికుల బారిని పడకుండా.”
పద్మావతి, కొంచెం వ్యవధి తీసుకుని చెప్పింది.
“అయ్యో.. అంత పని జరిగిందా! మేమంతా మీకు తోడుగా
ఉంటాము పద్మావతీ దేవీ. మీరేమీ బెంగ పడకండి. జగన్నాధుని
సేవలో ఏమైనా అంతరార్దం ఉందా?” చిరునవ్వు చిందిస్తూ అడిగింది
కాదంబరి.
“ఊ..” సిగ్గుపడుతూ అంది పద్మావతి. మోము యెర్ర మందారమే..
“ఎవరా అదృష్ట వంతుడు?”
“ఎవరైనా ప్రస్తుతం నా మీద కినుక వహించారు. వారి అనురాగం
పొందేలాగ అనుగ్రహించమనే నా వేడుకోలు.”
“జగన్నాధునికి సేవ చేస్తే కోరుకున్న వరుడు లభ్యమవుతాడా?”
కాదంబరీ దేవి ఆశ్చర్యంగా అడిగింది.
“అనే అంటారు పెద్దలు. కావలసింది నమ్మకం. ఆది దేవుని
మీద భారమంతా వేసి స్మరణ చేస్తుంటే తప్పక కోరిక నెరవేరుస్తాడు.
మన తల్లిదండ్రులేనా కాదంటారేమో కానీ ఆ అంతర్యామి మాత్రం
మనని కాచుకునే ఉంటాడు.”
సాలోచనగా చూస్తుండి పోయింది కాదంబరీ దేవి.
“ఏమి రాకుమారీ.. ఎవరైనా రాకుమారుడు మీ హృదయాన్ని
దొంగిలించాడా? రేపు ఉషోదయం అయిన వెంటనే ఆలయ
ప్రాంగణానికి వచ్చెయ్యండి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది.”
పద్మావతి, కాదంబరీ దేవి వద్దకు వచ్చి భుజం మీద చేయి వేసి అంది.
కాదంబరి తలకొద్దిగా వాల్చింది. మోములో కళ తగ్గింది.
చూపుడు వేలుతో తల కొద్దిగా పైకి లేపి కళ్లలోకి చూసింది
పద్మావతి.
“ఏమయింది రాకుమారీ? ఎందుకా కలత?”
“అతను రాకుమారుడు కాదు. మామూలు వ్యక్తి. కానీ హృదయ
స్పందనకి ఆ విశేషం అక్కర లేదు కదా!”
“ఆ సంగతి ఎవరికైనా అభ్యంతర పెట్ట వలసిన విషయం
కాదనుకుంటాను.”
“అతడు క్షత్రియుడు కూడా కాదు. అసలు నా మీద ఎటువంటి
అభిప్రాయం ఉందో కూడా తెలియదు. ఈ విషయం ఇప్పుడు
ప్రధమంగా మీ వద్దనే బైట పెట్టాను.” కాదంబరీ దేవి లో గొంతుతో అంది.
పద్మావతికి అంతా అర్ధమవుతున్నా రాకుమారి నోటివెంటే
చెప్పించాలని ఆగింది.
మాధవుని మనసు కూడా గ్రహించింది. ఇరువురికీ ఒకరి మీద
ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు అడ్డు చెప్పడానికేమీ ఉండదనే
అనిపించింది.
“మా ప్రాణాలు కాపాడిన మీ సోదరుడే పద్మావతీదేవీ..” రాకుమారి
బిడియం వదిలి అనేసింది. ఎవరైనా తనకి సహాయం చెయ్య గలిగితే
అది పద్మావతే అని గ్రహించిందామె.
పద్మావతికి కాదంబరీ దేవి మీద అవ్యాజ్యమైన అభిమానం కలిగింది.
దగ్గరగా తీసుకుని కౌగలించుకుని, నుదుటి మీద చిన్నగా
ముద్దిచ్చింది.
“తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది రాకుమారీ!”
“మరి మీ మనసు దోచిన వీరుడెవరో నాకు చెప్పరా?”
కాదంబరీ దేవి ప్రశ్నకి జవాబుగా చిరునవ్వు విసిరింది పద్మావతి.
“త్వరలో తెలుస్తుంది. అంత వరకూ వేచి ఉండాలి. తప్పదు.”
“నేనేమో మీతో అంతా చెప్పేశాను స్వేచ్ఛగా. మీరు మాత్రం..”
బుంగమూతి పెట్టింది.
పద్మావతి కిలకిలా నవ్వింది.
“రాకుమారీ! మీ ప్రేమ ఫలిస్తుందని నాకు నమ్మకం ఉంది.
కానీ నాది వేరు. అపార్ధాలు, అలుకలతో కూడి ఉంది. ముందు
అవన్నీ తొలిగి పోవాలి. ఆ తరువాత మరుగున పడిన ప్రేమ
బైటికి రావాలి. కాస్త సంక్లిష్టమయన ప్రేమ కథ నాది. అందుకనే
సమయం వచ్చినప్పుడు చెప్తాను. మీ రంటే నాకు చాలా
అభిమానం కలిగింది. మా సోదరునికి తోడైతే మనం బంధువులం
కూడా అవుతాము. చాలా ఆనందంగా ఉంది.”
కాదంబరీదేవి కూడా ఆనందంగా నవ్వింది.
“నింగినున్న చందమామ కిందికి వచ్చినట్టుందే..”
పద్మావతి కించిత్ ఆశ్చర్యంగా అంది. వాతావరణం ఆహ్లాదంగా
తయారయింది.
………………..
32
పూరీ నగరం రథోత్సవమునకు ముస్తాబవుతోంది.
కళింగంలోని వివిధ ప్రాంతాల నుండే కాక, దేశం నలు మూలల
నుంచీ ప్రవాహంలా ప్రజలు వస్తూనే ఉన్నారు.
ఆలయ నిర్వాహకులతో సమంగా మాధవుని బృందం కూడా
భక్తుల సదుపాయాలకై కృషి చేస్తోంది.
ఆలయంలోని వంటశాలలకు అదనంగా పెద్ద పెద్ద గాడి పొయ్యలు
తవ్వించి, భోజన శాలలు కూడా, తాటాకు పందిళ్లలో ఏర్పాటు
చేశారు.
నంద గౌతమిలు సీతమ్మతో సహా, సూర్యోదయం అవుతూనే,
స్నానం, అర్ఘ్య పాదాదులు ముగించుకుని వచ్చేస్తున్నారు. వంటలకు
వారి వంతు సేవ అందించడానికి. అదే విధంగా వంటకాల మీద
పట్టున్న భక్తులు చాలా మంది వచ్చి చేస్తున్నారు. అందరకీ
అధికారి ఆలయ వంటశాల నిర్వాహకుడు.
కటకం నుండి విడతలు విడతలుగా అరటాకులు వస్తూనే
ఉన్నాయి బళ్ల మీద.
రాకుమారి పద్మావతి, కాదంబరి దేవితో కూడా వచ్చి కూరలు
తరగడం, పూల మాలలు కట్టడం వంటి సేవలు చేస్తున్నారు.
రథయాత్ర ఆరంభమైన కొద్ది సేపటికి మహారాజు కపిలేంద్ర వర్మ
విచ్చేయనున్నారని వార్త వచ్చింది.
ఉత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ.. రెండు కళ్లూ చాలటం
లేదని అనుకుంటున్న వారే! సంబరాలు మిన్నంటాయి.
ఆషాడ శుక్ల విదియ రానే వచ్చింది.
తెల్లవారక ముందే ఆలయం ముందున్న ప్రధాన రహదారి
అంతా భక్తులతో నిండి పోయింది. ఎందరు వచ్చినా క్రమశిక్షణ
మాత్రం తప్పదు. స్వామి రథయాత్రకి సానుకూల మయేటట్లుగానే
నిలబడి ఉంటారందరూ.
మూడు రధాల్లోనూ ముగ్గురు మూర్తులనీ ఆసనాల మీద కూర్చో
పెట్టారు.
“మనీమా! మనీమా!” అనే కేకల మధ్య పురుషోత్తమ దేవుడు రథం
అధిరోహించాడు. ఒక్క క్షణం.. క్రిందటి సంవత్సరం జరిగిన ఉత్సవం,
ఆ తరువాతి పరిణామాలు గుర్తుకొచ్చాయి.
స్వామిని ఒక పరి పరికించాడు. జగన్నాధుని అవతారాలు కనుల
ముందు నిలిచాయి. రథము మీద నీల మాధవుడు..
సీ. హరి యవతారమె అరుదెంచె నిలకును
అరి భంజనము లనె అరయ చేయ
నీరము నుండి విసార రూపముననె
నరభుజు సోమకు నరకగాను
కరువము కూర్మమై గరిమన నిడుకొని
సురులకు నమృతము సరిగ సరద
పరగ పరశురామ, వర రామ రూపమై
దరుమము నిలబెట్ట ధరణి యందు
ఆ.వె. కరములు కనరాని కరణపు జన్ములై
వరమొసగగ, రాజు బరువు గాను
పురము పూరి యందు పురుల ప్రతిష్టింప
తెరవు నీల ధవుడు యరదమెక్కె.
(కరణము= కారణము, అరదము= రథము)
కన్నులు మూసుకుని జగన్నాధుని మనసారా ప్రార్ధించి, బంగరు పిడి
గల చీపురు అందుకుని శుభ్రం చేశాడు.
శుభ్రం చేశాక అటూ ఇటూ చూశాడు, మాధవుని కోసం. ఇంక స్వామి
వారి రధం దిగి కొద్ది దూరం నడచి తన అశ్వాన్నెక్కి వెళ్లి పోవాలి.
మహరాజుగారు వస్తానన్నారు. ఎక్కడికి వచ్చెదరో, ఎప్పుడు వచ్చెదరో.
చేతిలో చీపురు పట్టుకుని చూస్తున్నాడు పురుషోత్తముడు.
అంతలో తాళాలు తప్పెట్లు వినిపించాయి. ఆలయ పాండాలు
పాటలు పాడటం మొదలు పెట్టారు, రథం చుట్టూ మూగి.
తురగ వల్గన రగడ.
కదలు తాయి కదలుతాయి కదలి సాగు తాయి ముందు
కదలు తాయి రథ చక్రాలు కదలి మెదలు తాయి ముందు
కదలి పోతు పాపములను కదము తొక్కి తోసి ముందు
కదలి కదలి జగము నేలు కంబమయ్య కలిసి ముందు.
మాధవ మంత్రి, పాండాలను పక్కకి తప్పించి రథం దగ్గరికి
వచ్చాడు. ఒక్క ఉదుట్న రథం మీదికి ఎక్కాడు. అతడి వెనుకే,
మేలి ముసుగులో ఉన్న రాకుమారి పద్మావతీ దేవిని, చెయ్యి
పట్టుకుని ఎక్కించాడు.
పురుషోత్తమ దేవుని చేతిలో ఇంకా చీపురు అలాగే ఉంది.. రథం
మీద ఉన్నఆలయ పూజారులు ఆ సమయంలో, హడావుడి
చేస్తున్న పాండాలని క్రమశిక్షణలో పెట్టడంలో అటు తిరిగి
కిందికి చూస్తున్నారు.
అంతా నిమేష మాత్రంలో జరిగి పోయింది.
మాధవుడు, చీపురు ఉన్న పురుషోత్తముని చేయి పట్టుకుని,
వేరొక చేతిలో పద్మావతి చేతినుంచాడు.
“ప్రభూ! ఇంత కాలానికి పద్మావతీ దేవికి తగిన వరుడు,
మలినాలను శుభ్రం చేసే వాడు దొరికాడు. అది మీరే.. స్వామి వారి
వద్ద శుభ్రం చేశారు.. చేతిలో చీపురు ఇంకా అచటనే ఉంది.
మా సోదరి పద్మావతీ దేవిని స్వీకరించి వివాహమాడవలసిందిగా
మిమ్మల్ని కోరుతున్నాను. ఈ జగన్నాధుని సాక్షిగా జరిగిన
దానికి ఈమె ఏ మాత్రం బాధ్యురాలు కాదు. మిమ్ములనే
తన పతిగా మనసా వాచా కర్మణా భావిస్తోంది.”
పురుషోత్తమ దేవుడు ఊహించని సంఘటన ఇది.
మాధవుడు పురుషోత్తముని చేతిలో ఉన్న పొరక కట్టని
తీసుకున్నాడు.. దానిని, కింద నిలుచుని ఉన్న ఆలయ ఉద్యోగికి
అందజేసి, ఆ చేతిలో, పద్మావతి వేరొక చేతినుంచాడు.
రెండు కరములూ, తన విభుని చేతనుంచి, పద్మావతీ దేవి
నును సిగ్గుతో.. మేలి ముసుగు లో నుండి ఓర కంట చూసింది.
పద్మావతిని చూసి పన్నెండు మాసములు పైనే అయింది.
అప్పటి కంటే కాస్త చిక్కింది.. చక్కనమ్మ చిక్కినా అందమే
అన్నట్లుంది. మనసు నిండా నింపుకున్న చెలి.. విధి విలాసంతో,
దట్టమైన మబ్బుల చాటున దాగిన చందమామ వలె ఉంది
అన్ని రోజులూ..
జగన్నాధుని కృప.. మబ్బులు తొలగిన పున్నమి చంద్రునిలా
కాంతులు వెదజల్లుతోంది తన చెలి.. ఆదిదేవుని కృపతో తన
మనసునావరించి ఉన్న మబ్బులు కూడా తొలగి పోయాయి.
శివుని కోసం తపస్సు చేసిన పార్వతీదేవి పట్టుదల పద్మావతి లో
కూడా ఉంది. అదే ఆవిడ సౌందర్యాన్ని పది రెట్లు పెంచింది. ఆవిడని
ఆవరించి ఉన్న తేజము రథము లోనికి ఒక వింత వెలుగును
తీసుకుని వచ్చింది. జగన్నాధుని మూర్తి కూడా చిరునవ్వుతో
పరికిస్తున్నట్లు అనిపిస్తోంది. పాండాలు తక్కువ ధ్వనిలో తమ
భజనలు సాగిస్తున్నారు.
పురుషోత్తముడు మారు మాటాడక, ప్రసన్న వదనంతో..
పద్మావతీ దేవిని పట్టుకుని, స్వామికి నమస్కారం చేశాడు.
తేరు వద్దకి కొందరు ఆడవారిని కూడా తీసుకుని వచ్చాడు
మాధవుడు, పద్మావతికి సహాయముగా! అందరూ కిందినుంచి
చూస్తున్నారు.
సీ. హృదియందు నందరు ముదముతో నలరగా
ముదితలందరు కూడి మురియ గాను
కదిలెడి రథమందు పదిలముగ నిలిచి
పెదవి చాటున నవ్వు పొదలి పుచ్చ
మది నిలిచిన యతివదె నోర కన్నుల
కాంచ నతడి కుడి కన్నదరగ
అదిరి పడిన రాజు ఆ మీసముం దిప్ప
అతివ బుగ్గలవియే యరుణిమవగ
ఆ.వె. చెదరిన తన మదిన చింత తీరగనంత
మాధవుడు హితునికి వందనమిడె
ముదమున పురుషోత్తము కరచాలనమిడ
మిత్రులిదియె కూడి మిసిమి పంచె.
మాధవుడు ఆనందం పట్టలేక, కిందికి దిగి, పండాలతో
సమానంగా తను కూడా నాట్యం చేయ సాగాడు.
“మహరాజుగారు వస్తున్నారు.. పక్కకి జరగండి..” రాజ భటులు
త్రోవ చేయగా, కొద్ది దూరంలో కపిలేంద్ర దేవుడు, రాణులతో కూడి
రథములో వచ్చి దిగి, నడిచి స్వామివారి తేరు వద్దకు వచ్చాడు.
నడచి వస్తున్న మహరాజు సాక్షాత్తు ఆది విష్ణువు వలెనే ఉన్నాడు.
జగన్నాథ రథయాత్రకి మ్రోగిస్తున్న దుందుభిలు రాజుకు కూడా
స్వాగతం పలుకుతున్నాయి.
సీ. కపిలుని కనులను కరుణయె కురవగ
అరుణ కిరణములె హలను మెరవ
కపిల ప్రభువు విజయ పథమున నరగ
జయ నరడలవె మొరయ నచటనె
కలిసి జనులు కరములు కలిపి భజన
సలుపుచు నడువగ సదమలముగ
అవని పులకరము లవి యనుభవములె
అలవి నెరుగక నిహమును పరము
ఆ.వె. జినుని రథ విహరణ మనుసరణముననె
చనగ సహజ సహితమున హలధరు
సకల జనులు రథమును కదిలి నడుపగ
నగరి నడుమనె వెలసెగ సరకము.
(కపిలుడు= విష్ణువు, హల= భూమి, కపిల ప్రభువు= కపిలేంద్రవర్మ, అరడ= దుందుభి, మొరయు = మోగ, జినుడు= జగన్నాధుడు, విహరణము= విహారము, సహజ= సోదరి, హలధరుడు= బలరాముడు, సరకము= స్వర్గము)
రాణీవాసపు స్త్రీలలో కాదంబరీ దేవి కూడా ఉంది. ఆమె మోము
ఆనందంతో వెలిగి పోతోంది. పద్మావతితో తన సోదరుని పరిణయము..
సోదరులందరిలో పురుషోత్తమ దేవునివద్దే కాదంబరికి చనువు
యెక్కువ. అతను దండయాత్రలకి ఎక్కుగా వెళ్లక పోవడం, కోటలోనే
ఉండి రాజధాని రక్షణ చూడడం ప్రధాన కారణమైతే, స్వభావ
సిద్ధంగా ఆప్యాయతని పంచడం ఇంకొక కారణం.
రాజ్యం గురించే కాక, కుటుంబం గురించి కూడా పట్టించుకోవడం
పురుషోత్తముని ప్రత్యేకత. క్లుప్తంగా చెప్పాలంటే.. రాజ్యంలో,
కోటలో.. అందరి అభిమానాన్నీ చూరగొన్నాడు పురుషోత్తమ దేవుడు.
తండ్రి రాకని గమనించిన పురుషోత్తముడు, రథం దిగి, పద్మావతి
చేయి పట్టుకుని దింపి, మహరాజుకి పాదాభివందనం చేశాడు.
మహారాజు, తనయుడ్ని లేపి ఆలింగనం చేసుకున్నాడు.
“తండ్రీ! మీ అనుమతి లేకుండా..”
చేయెత్తి ఆపేశాడు కుమారుడిని కపిలేంద్ర వర్మ.
“మాధవునికి నేను ఆనతి, అనుమతులనిచ్చిన పిదపే,
నీ వద్దకు ఆ సమయంలో తీసుకుని వచ్చాడు రాకుమారిని.
పద్మావతీ దేవి మా కోడలుగా మన కోటలోనికి ప్రవేశించడానికి
అన్ని విధాలా తగిన కన్య. త్వరలో వివాహం జరిపించే ఏర్పాట్లు
చేద్దాము.”
ఆ హడావుడిలో, గుంపులో.. ఏ విధంగా జరిగిందో కానీ,
మాధవుడు, కాదంబరీ దేవీ పక్క పక్కకి వచ్చేసి నిలుచున్నారు.
ఇరువురి మొహాలూ వేయి నక్షత్రాల కాంతితో వెలిగి పోతున్నాయి.
ఇద్దరూ లక్ష్మీ నారాయణ స్వరూపాల్లా ఉన్నారు.
తాను అనుకున్నది జరిగిందని.. సంవత్సరమంతా పడిన
తపన మాయమయిందని మాధవుడు సంతోషంగా ఉన్నాడు.
తనకి నచ్చిన చెలి సోదరునికి ఇల్లాలవుతోందని, ప్రతీరోజూ
కలుసుకోవచ్చని కాదంబరీదేవి ఆనందంగా ఉంది.
“నా మీద ఇంకొక బాధ్యత ఉన్నది తండ్రీ!” పురుషోత్తముడు
మహారాజుతో అన్నాడు.
“రథయాత్ర అయిన పిదప మాట్లాడుకుందాం. మీ బాధ్యత నాది
కూడా.. తప్పక నెరవేరుద్దాము.” కపిలేంద్ర వర్మ.. రథం కదపడానికి
సిద్ధ పడుతూ అన్నాడు.
కోలాహలం మొదలయింది.
మేళతాళాలతో జగన్నాధుని రథం కదిలింది.
బలభద్ర, సుభద్రల రథాలు కూడా వెనువెంట కదిలాయి.
రాచ కుటుంబ మంతా, కొద్ది దూరం నడచి, తమ తమ వాహనాల
మీద వెళ్లి పోయారు వసతి గృహాలకి. సంధ్యా సమయానికి, గుండీచా
ఆలయానికి చేరుకుంటారు.. అక్కడ తోట విడిదిలో జగన్నాధునికి
జరుగబోయే పూజలను తిలకించడానికి.
రాకుమారి పద్మావతీ దేవి ఆనందానికి అవధుల్లేవు. విడిదికి
రాగానే సీతమ్మని పట్టుకుని గిరగిరా తిప్పేసింది. సీతమ్మ,
ఆగమని చెప్పి, ఉప్పు మిరపకాయలు తీసుకుని వచ్చి దిష్టి తీసింది.
గౌతమి దూరంగా నిలుచుని చూస్తోంది.. కన్నులు విప్పార్చి.
ఇన్ని రోజులు తమ ఇంట్లో తమ బిడ్డగా ఉన్నది రాకుమారా?
సంకోచంగా దూరంగా జరుగుతోంది గౌతమి.
“అమ్మా! నేనెప్పుడు మీ కుమార్తెనే.. రాకుమారిని కాదు. మీరే నా
వివాహం జరిపించాలి. చీరసారెలతో అత్తవారింటికి పంపాలి..”
దగ్గరగా వచ్చి, గౌతమిని గట్టిగా కౌగలించుకుంది పద్మావతీ దేవి.
“అంతకంటే అదృష్టమేముంటుంది తల్లీ..” గౌతమి ఆప్యాయంగా
వీపు నిమిరింది.
…………………….
33.
పూరీ పట్టణం కన్నుల పండువగా అలంకరించారు.
స్వామి వారి రథయాత్ర అయాక కొన్ని రోజులు అక్కడే ఉంటారు
భక్తులు. ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు.
రథయాత్ర అయిన మరునాడు..
మహారాజుగారి ఆనతిపై విడిదిలో సమావేశ మయ్యారు, ప్రధాన మంత్రి,
పురుషోత్తమ దేవుడు, మాధవుడు.
నందుడుని కూడా పిలువనంపాడు పురుషోత్తముడు.
అటువంటి సమావేశానికి రావడం అదే ప్రధమం నందుడికి. అయినా
ఏ మాత్రం తడబడకుండా వచ్చి, అభివాదం చేసి నిలుచున్నాడు.
అందరినీ ఆశీనులు కమ్మని ఆనతి ఇచ్చి ప్రారంభించాడు కపిలేంద్ర వర్మ.
“మనకి, మన రాజ్యానికి శుభ సమయం ఆసన్నమయింది.
దండయాత్రలు, రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడం, అంతర్ బహిర్శత్రువుల
నణచడం.. వాటన్నిటి మధ్య, మానసికోల్లాసం కలిగే ఆశ కనపడుతోంది.
అదే.. కుమార పురుషోత్తముని వివాహం. మన మిత్ర రాజ్యముల
ప్రభువులందరికీ ఆహ్వానం పంపించాలి.”
“అవును ప్రభూ. ఇంత వరకూ కనీ వినీ ఎరుగని విధంగా చెయ్యాలి.”
ప్రధాన మంత్రి అన్నాడు.
“కాంచీ పుర రాజునకు వర్తమానం పంప వలెను కదా!” మాధవుడు
సన్నగా అన్నాడు.
“ఏ మక్కర లేదు. వారి రాజ్యంతోనే, రాకుమారి పరి గ్రహణం కూడా
ఐపోయింది. ఇంక వారికేమాత్రం సంబంధం లేదు.” పురుషోత్తముడు..
పౌరుషంగా అన్నాడు.
“అవుననుకోండి. రాకుమారి పద్మావతీ దేవి కూడా ఆ విధంగానే
సెల విచ్చారు. కంచి రాజుగారు వారి రాజ్యానికి వెళ్లినప్పుడు అడిగాను..
రాకుమారి కూడా వెడలెద రేమోనని..”
“ఏమని సెలవిచ్చారు మాధవా?”
“ఇంక కాంచీపురం వెళ్లనని..”
పురుషోత్తముని మోము మరింత ప్రసన్నంగా అయింది.
“తన తండ్రిగారు చేసిన పని రాకుమారికి సుతరామూ నచ్చలేదు.”
మాధవుడు సెలవిచ్చాడు.
“ఇన్ని రోజులూ పద్మావతీ దేవి ఎక్కడున్నారు? మీ బంధువులింటనా?”
“మా గృహమునందే ఉన్నారు రాకుమారా! మా ఇంటి ఆడపడుచు వలెనే
చూసుకున్నాము.” నందుడు చటుక్కున అనేశాడు.. మాధవుడు వారించే
లోపుగానే.
మాధవుడు తల కొద్దిగా వంచాడు, ఏమనాలో తోచక.
మహరాజు కపిలేంద్ర దేవుడు వినోదంగా చూస్తున్నారు.
పురుషోత్తముడు తన ఆసనం మీదినుంచి లేచి వచ్చి, మాధవుడిని
ఆలింగనం చేసుకున్నాడు.
“ధన్యవాదములు మిత్రమా! నీ వంటి మిత్రుడున్న వారికి నిత్యం
మహదానందమే. నిన్ను ఎంతగానో బాధించి ఉంటాను. ఏమనుకోకుమీ!”
మాధవుని మోము సంతోషంతో వెలిగి పోయింది.
వెంటనే అందుకున్నాడు..
“సీ. హరికృప యరయగ యనయము, తొలగెగ
అరటములు వెరగు పరచుచునవి
అరమరికలవెగ హరణమయె నటుల
యరులు హితులయిరి యనగి పెనగి
కరములు కలియను, గడువులు తెలియగ
కరిముఖు యనుమతి కలిగియిపుడు
వరములు నొసగగ పరిపరి విధముల
ముదమలరగ కన మురిపమునను
ఆ.వె పదిలముగ మనమరగెదము, కటకమునె
సిరి హరి యిరువురు మిసిమిని కురియ
సురలు నభము నిలిచి సురతమున కనగ
పరిణయము జరుగును పరవశముగ.”
(అరటములు= కష్టములు, అనగి పెనగి= కలసి మెలసి)
ఉత్సాహంలో పద్యం పాడేశాడే కానీ.. మహరాజుగారేమంటారో అని
సంకోచంగా చూశాడు మాధవుడు.
కపిలేంద్ర దేవులు చిరునవ్వుతో చూశారు.
“మాధవ మంత్రి మంచి కవి యని మాకు తెలియదే..”
“శ్రీనాధ మహాకవి ఏకలవ్య శిష్యుడు తండ్రీ. చక్కని కవిత్వం అల్లడమే
కాదు,
అద్భుతంగా గానం చేస్తారు కూడా..” పురుషోత్తముడు కించిత్ గర్వంగా
చెప్పాడు.
“మనం వ్యవధి చిక్కినప్పుడు సాహిత్య సమావేశాలు కూడా చెయ్యాలి.
వీనిలో ఉన్న ఉల్లాసము ఎక్కడా ఉండదు.” మహారాజు నిట్టూర్చి అన్నాడు.
అతడికి రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడంలోనే సమయం గడిచి పోతోంది.
ఇతరములేవీ మనసునకెక్కుట లేదు. పురుషోత్తముని వివాహ వార్త
కాస్తంత ఆటవిడుపు.
“ఒక చిన్న సర్దుబాటు మాధవా.. చివరి పాదంలో ‘పరిణయములు
జరుగు పరవశముగ’ అని దిద్దాలి.” సాభిప్రాయంగా జనకుని చూస్తూ
అన్నాడు పురుషోత్తముడు.
మాధవుని బుగ్గలెర్రవడ్డాయి.
“ఇదేమి కొత్త వార్త కుమారా?”
“సోదరి కాదంబరీ దేవిని మాధవ మంత్రికి ఇచ్చి పరిణయం
జరిపించాలని మా కోరిక మహరాజా. మాధవుడు, సోదరి కూడా
సుముఖులేనని మాకు తోచుచున్నది. చిన్నతనం నుండీ నాకు
తెలిసినవాడు.. మన ఎదుటనే మసలుతాడు. ఎవరో తెలియని
వారికి ఇచ్చి దూర దేశాలకి పంపే కంటే ఇది మంచిదని
మాకు తోచుచున్నది.” పురుషోత్తముని కేసి ఉలిక్కి పడి చూశారు,
మాధవుడు, నందుడు.
రాకుమారి తన కోడలా? నందుడు ఆశ్చర్యంగా చూశాడు.
పురుషోత్తమునికి తన మనసే విధంగా తెలిసింది? అంతలా
బయట పడిపోయాడా తను.. మాధవునికి కూడా ఆశ్చర్యమే..
మహారాజు మాత్రం ఆలోచనలో పడ్డారు.
మరీ పూటకూళ్ల వాని కొడుక్కి రాకుమారినిచ్చి..
నందుడు మహారాజు ఆంతర్యం గ్రహించాడు.
అటు చూస్తే మాధవుని బుగ్గలు మందారాలే అయ్యాయి. రాకుమారిని
అతడు అభిమానిస్తున్నాడని తెలుస్తూనే ఉంది.
మాధవుడు తన ఇంటికి వచ్చిన కొత్తలో ఒక హస్త సాముద్రికుడు
చెప్పిన మాట గుర్తుకొచ్చింది నందునికి.
మత్తేభము.
మణి మాణిక్యముయే కదా యనుచు నా మారాజులే చెప్పియున్
యణగిన్ యుండడుగాదయీతడవియేహారీతకార్యాలనీ
యణువంతైనను యోర్చుకోడు తన శౌర్యాంజస్సునే యడ్డుకున్
ఫణిరాజై తన భోగముం బలిమి కాపాడున్ తనే యాపదన్.
ఆ సాముద్రికుడు, మాధవుడు ఏ కపటమైన కార్యాలనీ సాగనియ్యడని,
తన శౌర్యాన్ని అడ్డుకుంటే అది ఎవరైనా ఓర్చుకోడనీ, నాగరాజు వలే
తన భోగభాగ్యాలనీ, బలాన్నీ కాపాడుకుంటాడనీ చెప్పాడు.
అతడు పెరుగుతుండగా అయిన, అవుతున్న అనుభవాలన్నీ
ఆ మాటలు నిజమేనని చెపుతున్నాయి.
రాకుమారునితో స్నేహం, అతి పిన్న వయసులోనే మంత్రిపదవి లభ్యం..
ఈ లక్షణాలన్నీ మాధవుడు క్షత్రియ కుమారుడేనని చెపుతున్నాయి.
ముఖ్యంగా ఆ మొహంలో ఉట్టిపడే రాచకళ..
మహరాజుకు, ఈ పేద బ్రాహ్మని కొడుక్కి కుమార్తె నిచ్చి వివాహం
చేయుటకు మనసొప్పుతుందా? పురుషోత్తముడు మిత్రుని మీద నున్న
అభిమానంతో ఈ ప్రతిపాదన తెచ్చి ఉంటాడు.
తను నిజం చెప్పాలా? మాధవుని ఆంతర్యమేమిటో.. నందుడు
ఎటూ తేల్చుకొనలేకున్నాడు. అతడి సందిగ్ధ స్థితిని మహరాజు గ్రహించాడు.
“నంద మహాపాత్రులు ఏమో చెప్పాలనుకుంటున్నారు.. కుల సమస్యా?”
అంటే.. మహారాజు సుముఖంగా ఉన్నారా? మాధవుడు ఉలిక్కి పడ్డాడు.
ఇంక నందునికి తప్పలేదు..
“మహారాజా! మాధవుడు మా కన్నబిడ్డ కాదు. శ్రీకృష్ణుడు నందునింట
పెరిగినట్లే మాధవుడు మా ఇంట పెరిగాడు. ఎచట నుండి వచ్చాడో..
ఏ కులమో మాకు తెలియదు. కానీ శీల వంతుడు. అతడికి సాటి అతడే.
అతడు ‘అజ్ఞాత కులశీలుడు’. వంగ దేశ సరిహద్దులలో ఉన్న మా అమ్మగారి
ఇంటికి అతనికి సుమారు పది సంవత్సరముల వయసులో వచ్చాడు.
మాకు పిల్లలు లేనందున మేము తెచ్చుకుని పెంచుకున్నాము. మా బిడ్డడే..”
చెప్పేశాడు నందుడు. మాధవుడు ఏమనుకొనెనో.. తనకి నచ్చినా
నచ్చక పోయినా ఇంక వేరే దారి లేదు. మహరాజుకి వాస్తవం వెల్లడించ
వలసిందే.
అక్కడ ఉన్న ముగ్గురూ ఏమి మాట్లాడాలో తెలియక కాసేపు అలా ఉండి
పోయారు. అప్పుడే గుర్తుకొచ్చింది పురుషోత్తమునికి, కవి సార్వభౌముడు
శ్రీనాధుడు మాధవుని చూడగానే, వంగదేశపు యువకునిలా ఉన్నాడే అన్న మాట.
ఇతడు వంగదేశపు రాకుమారుడా?
అచ్చటనున్న వారందరూ మాధవునే చూస్తున్నారు.. ఏం చెప్తాడా అని..
మాధవుడు లేచాడు..
“మహారాజుగారు మన్నించాలి. నేనెవరో.. నా పుట్టుక ఏదో..
ఎప్పుడో ఒకప్పుడు వివరించవలసిన ఆవశ్యకత వస్తుందని అనుకోలేదు.
మా బంధువులలో.. లేదా.. మాకు సాటి అయిన సంబంధం వస్తే ఆ అవసరం
వచ్చేది కాదేమో! నంద మహాపాత్రుని కుమారునిగా నడిచి పోయేది.
ఇప్పుడు రాకుమారి ప్రసక్తి వచ్చింది కనుక అంతా వెలికి తీయవలసి
వస్తోంది.” నిజమే అన్నట్లు తలూపారు మహారాజు.
“మరొక్కసారి మన్నించమని అడుగుతున్నాను.. నన్ను అజ్ఞాత
కులశీలునిగానే ఉండిపొమ్మని నా కన్నతల్లి ఆదేశించింది. ఆవిడ మాట
నేను జవదాటలేను. అయినా నేనిప్పుడు అజ్ఞాతకులశీలుడిని కాను.
ఆ జగన్నాధుడు నాకు ఆత్మీయులైన తల్లిదండ్రులనొసగాడు. నేను
గౌతమీ నందమహాపాత్రుల కుమారుడనే. ఏకన్నియని చేపట్టినా
వారి పుత్రునిగానే.. నా ఈ అర్హతలతోనే పదవినిచ్చినా, పడతినిచ్చినా
స్వీకరిస్తాను. వ్యక్తిగత సంస్కారం ఇదైతే.. నా విద్యల గురించి, నా
తెలివితేటల గురించి రాకుమారునికి బాగుగా తెలుసు.. ఇంతకంటే
నేను చేప్పగలిగినదేమీ లేదు. మీరే శిక్ష విధించినా ఆనందమే.”
అభివాదం చేసి కూర్చున్నాడు మాధవుడు.
నందుడు తన కుమారుని అనిర్వచనీయమైన భావంతో చూశాడు.
గర్వం, ప్రేమ, ఆప్యాయతలతో మనసంతా నిండి పోయింది. పెదవుల
చాటున తన సంతోషాన్ని దాచి వేశాడు.
కపిలేంద్రుడు నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్న మయింది.
మాధవుడు, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా మహారాజుకి అల్లుడు కావలసిన
అర్హత సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పద్మావతీ దేవి విషయంలో
అతను చూపించిన చొరవ ఎంతో ఎన్న దగింది.
ఇంక పూటకూళ్ల ఇల్లా.. అక్కడ రాకుమారి ఉండగలదా అనేదే ప్రశ్న.
సౌకర్యాలన్నింటినీ తనే ఏర్పాటు చేస్తాడు. మాధవుని ప్రతీక్షగా
కొత్తగా జయించిన రాజ్యానికి పంపే యోచన ఉండనే ఉంది.
క్షత్రియకన్య కోడలుగా రావడానికి నందుడు అంగీకరిస్తే..
అదే అడుగుతే నందుడు చిరునవ్వు నవ్వాడు.
“మహరాజా! కులం గోత్రం తెలియని పిల్లవాడిని మా కన్న బిడ్డవలే
సాకాము. మాకేం అభ్యంతరం ఉంటుంది. మహలక్ష్మి మా ఇంటికి వస్తానంటే
అంతకంటే కావలసినదేముంది?”
పురుషోత్తముడు లేచి వచ్చి మాధవుని భుజం తట్టి కరచాలనం చేశాడు.
“రాణీగారినీ, రాకుమారినీ సంప్రదించి వివాహ ప్రయత్నాలు చేద్దాము.
రెండు వివాహాలూ ఒకే సారి.. వారం రోజుల లోగా చెయ్యాలి. ఆ తదుపరి,
దక్షిణాన చక్కబెట్ట వలసిన కార్యాలున్నాయి.”
కోటలో పెళ్లి సంబరాలు.. కపిలేంద్ర దేవుడు అడిగిన వెంటనే కాదంబరీ దేవి
సిగ్గుల మొగ్గై తల ఊపింది. కాదంబరి తల్లికి, అమ్మాయి ఉన్న ఊర్లోనే
ఉంటుందని ఆనందం..
ఏ ఆటంకం లేకుండా కళ్యాణాలకి ముహుర్తాలు పెట్టేశారు.
కటకంలో ఉన్న అన్ని వనాల్లోనుండీ, రంగు రంగుల పూలు కోటకి
బళ్లలో వస్తున్నాయి. నగరంలోని ఆడవారందరూ అలంకరణలో వారి
ప్రతిభ చూపిస్తున్నారు.
పెళ్లికొడుకును, పెళ్లి కూతురిని చెయ్యడం.. ఇరు జంటలకూ కోటలోనే
జరుగుతున్నాయి.
అయిదు రోజుల పెళ్లి శాస్త్రోక్తంగా ఆట పాటలతో జరుగుతోంది.
నందుని సోదరుడు.. బంధువులు అందరూ కోటలోనే తమ విడిది
గృహంలో ఉండి పెళ్లి వేడుకలలో పాలు పంచుకుంటున్నారు.
ఊయల సంబరం, బంతి ఆటలు.. కోటంతా కోలాహలమే.
సీ. పేరంటమును సేయ పెండ్లి సంబరములో
తూగుటుయ్యల యందు తోడు గాను
పిల్లలు పాపలు వెను వెంట యుండగా
వధువు వరుడు నూగె బాగు గాను
ముద్దు ముచ్చట్లతో మురిపించగా నంత
ముత్తైదువలు కూడి మోద మంద
పూలదండల బరువు తలల దించంగ
యొద్దికనిరువురూ యూగె నంత
ఆ.వె పెద్ద ముత్తయిదువ పేర్మితో వచ్చెగా
అక్షతలను వేయ యలసి యున్న
చేతులు కలిపేను చెలిమి నుండుడనుచు
రంజనముగ నెపుడు రాజిలగను.
కపిలేంద్ర దేవుని కుమారులందరూ వారి భార్యలతో వచ్చారు, వారికి
నిర్వహించమని ఇచ్చిన రాజ్యాల నుంచి.. మహారాజు, తన రాణులందరితో
కలిసి వైభవంగా కళ్యాణాలు జరిపిస్తున్నారు.
కంచిరాజుకి వర్తమానం పంపించారు.. కానీ అస్వస్థత కారణంగా రాలేనని
తిరుగు వర్తమానం పంపాడతడు.
నంద, గౌతమిలు తమ అదృష్టంగా భావించి కుమారుని, కుమార్తెల
వివాహాలు జరిపించారు. సముద్రం నుంచి నీటిని గ్రహించినా, ఆ నీటిని
ఆకాశం వేరెక్కడో వెదజల్లుతుంది.. అదే న్యాయం అక్కడ కూడా జరిగింది.
మాధవుడు, పద్మావతి పుట్టిన దెవరికో.. కానీ ఆనందం కలిగించేది
వేరొకరికి. మాధవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, నక్షత్రాలతో
ఊసులాడాడు.. తన యోగక్షేమాల గురించి అమ్మకి చెప్పమని.
తనని రక్షించి ప్రాణాలు కోల్పోయిన అమ్మ ఎప్పుడూ కనురెప్పల
మాటునే ఉంటుంది మాధవునికి.
-----------------
34
క్రీ.శ. 1445.
“గజపతుల తళ్లు”
మాధవీలతా మంటపంలో కూర్చుని ఉన్నారు మాధవుడు,
కాదంబరీ దేవి. వివాహమై రెండు సంవత్సరములు దాటినా, ఇంకా
నవ దంపతుల వలెనే జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు.
చెలులు వచ్చి దీపాలంకరణ చేసి వెడలి పోయారు.
సంధ్య కాంతులు మెల్లి మెల్లిగా శార్వరీ మిళితమవుతున్నాయి.
చారల్లా కనిపిస్తున్న కెంజాయ సొగసులు సువర్ణ వర్ణంలో కలిసి
పోయి మంటంపమంతా తీగలతో అల్లిన రంగవల్లులని తీర్చి
దిద్దుతున్నాయి.
మిశ్రమ కాంతుల పరావర్తనంలో కాదంబరీ దేవి వింత సొగసుతో
వెలిగి పోతోంది.
అనుకోకుండా మాధవుని కంఠం ఒక చాటువుని పలికింది,
కాదంబరిని చూస్తుంటే..
“సీ. మకరధ్వజుని కొంప యొకచెంప కనుపింప
జీర కట్టినదయా చిగురు బోణి
యుభయకక్షములందు నురు దీర్ఘతరములౌ
నెరులు పెంచినదయా నీలవేణి
పసుపు తావులు గ్రమ్ము పైటచేలము లెస్స
ముసుగు వెట్టినదయా ముద్దుగుమ్మ
పూర్ణ చంద్రునిబోలె బొసగ సిందూరపు
బొట్టు పెట్టినదయా పొలతి నుదుట
తే.గీ. యెమ్మె మీరగ నిత్తడి సొమ్ములలర
నోర చూపుల గుల్కు సింగార మొల్క
గల్కి ఏతెంచె మరుని రాచిల్క యనగ
వలపులకుచేటి యొక వడ్డెకుల వధూటి.”
గంభీరమైన కంఠస్వరంతోమంద్ర స్తాయిలో సమ్మోహనంగా
పాడుతున్న మాధవుని చూసి నును సిగ్గుల మొగ్గైంది కాదంబరి,
పద్య అర్ధం కాకపోయినా భావం అర్ధమయింది.
“ఒక వంక మన్మధునే సవాలు చేస్తూ, నాభి కిందికి పాదాలు తాకే
చీర కట్టు, రెండు చేతుల ప్రక్క నుండి సాగిన దీర్ఘమైన, పిరుదులు
దాటిన కేశ సంపద, నుదుటిన పూర్ణ చంద్రుని పోలిన సింధూరపు
బొట్టు, పచ్చని కాంతులు వెదజల్లుతున్న మేలి ముసుగులోని
ఓఢ్ర వనిత, సొగసు మీర సొమ్ములు పెట్టి మరుని రాచిలుక
వలె సింగార మొలుకు తోంది.”
వివరించాడు మాధవుడు.
“అబ్బ.. ఎంత సొగసైన పద్యమో! ఇంత చక్కని భావంతో
తెలుగులో మీరే చెప్పారా స్వామీ?” కాదంబరీ దేవి సంభ్రమంగా అంది.
“నేనా.. ఏదో రాస్తాను కానీ.. ఇంతటి పద సంపద నాకెక్కడిది?
ఇది కవి సార్వభౌముడు శ్రీనాధ మహాకవి ఓఢ్ర వనితని వర్ణిస్తూ
చెప్పిన పద్యం. ఎంత హృద్యంగా ఉందో కదా? ఇందలి వర్ణన
నీకు సరిగ్గా సరి పోయింది.”
కాదంబరీ దేవి బుగ్గలు ఎర్ర మందారాలే అయ్యాయి.
“నేను ఓఢ్ర వనితని ఐతే.. తమరు వంగ యువకులా?” మేల
మాడింది కాదంబరి.
నిమేష మాత్రం మాధవుని కంటి చూపులో తీక్ష్ణత కనిపించింది.
“నేను కూడా ఓఢ్ర యువకుడినే కదా!” సర్దుకుని సమాధాన
మిచ్చాడు మాధవుడు.
వివాహమయ్యాక, మాధవుని నివాసం కోటలో, మహాపాత్రుల
కోసం కట్టించిన కొత్త మందిరంలోనికి మారిపోయింది.
నందుడు, గౌతమీ, సీతమ్మ తమ వసతి గృహాన్ని వేరే
వారికి అప్పగించి కోటలోని మాధవుని గృహానికి మారి పోయారు.
కోటలోని వంటశాలలో సలహాలిమ్మని పురుషోత్తముడు కోరితే
ప్రతీ రోజూ వంటవారికి ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో
చెప్తున్నారు.. వారి విద్యని మరచి పోకుండా.. రాజుగారి
ఉద్యోగుల వలెనే వారికి కూడా భృతి అందుతోంది.
మాధవుని కుటుంబం వరకూ కాలం ప్రశాంతంగానే సాగి పోతోంది.
దేశంలో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఆ రోజు..
సాయం సంధ్యా సమయం..
కపిలేంద్ర వర్మ మాధవమంత్రిని పిలువనంపాడు.
“మంత్రి వర్యా! ఈ దండయాత్రలో మీరు కూడా మా వెంట
వస్తున్నారు. చాలా సుదీర్ఘ యాత్ర ఇది. సముద్ర తరంగాల వలే
ఒకదాని తరవాత ఒకటి జరిపి.. కృష్ణా గోదావరీ తీరాలన్నింటినీ
మన వశం చేసుకోవాలని యోచిస్తున్నాము. రాజమహేంద్రవరం రెడ్డి
రాజ్యం మన దయింది. కొండవీడు, అద్దంకి, పాకనాడు,
విజయనగరం.. మధ్యలో ఓరుగల్లు మీద మన పతాకం
ఎగర వలెనని వాంఛిస్తున్నాము.”
“అటులనే మహారాజా! మరి ఇచ్చట కోట రక్షణ..”
“పురుషోత్తముడు చూసుకొన గలడు. ఈ మారు మీ ప్రతిభని,
ప్రజ్ఞా పాటవాలని మాకు అందజేయండి.”
“తమ ఆజ్ఞ ప్రభూ!” మాధవుడు ఇంటికి వెళ్లి వార్త అందించాడు.
“హూ.. గజపతుల తళ్లు మళ్లీ మొదలయ్యాయన్న మాట.”
నందుడు విచారంగా అన్నాడు.
“అంటే..” గౌతమి అడిగింది.
“వరుస దండయాత్రలు. తమ రాజ్యం సుస్థిరం అయితే సరి పోదు.
రాజ్య విస్థరణ కావాలి. సువిశాల సార్వభామాధికారం కావాలి.
ఎంత జన నష్టం కలిగినా ఫరవాలేదు. అదే మన రాజుల ఆశయం.
తెరలు తెరలుగా అలలు వస్తున్నట్లు దండయాత్రలు సాగించాలి..”
“యుద్ధానికి వెళ్లక తప్పదా?” కాదంబరి కళ్లనిండా
నీళ్లతో అడిగింది.
“తప్పదు దేవీ! మీ తండ్రిగారు, అన్నదమ్ములు అందరూ రణ
సన్నిద్ధులైనప్పుడు నేను పిరికి వాడి వలే ఉండలేను కదా!
పైగా రాజాజ్ఞ మీరడం అసంభవం.”
“జయాపజయాలు..”
“దైవాధీనాలే.. కానీ ప్రయత్న లోపం లేకుండా పోరాడితే
విజయం తధ్యం. ఇప్పుడు గజపతుల కాలం నడుస్తోంది. ఎ
క్కడికి వెళ్లినా విజయం వరిస్తోంది. మీరు అనవసరంగా ఆందోళన
పడవద్దు దేవీ!” మాధవుడు ఓదార్చాడు.
మాధవునికి దక్షిణ ప్రాంతాలకి వెళ్లడం మనసులో ఇష్టంగానే
ఉంది. శ్రీనాధ మహాకవిని ఇంకొక్క మారు చూడగలుగుతే..
ఎందుకో వారంటే అమితమైన ఆరాధన మాధవునికి.
రెడ్డిరాజుల రాజ్యాలన్నీ గజపతులు ఆక్రమించుకుంటుంటే
శ్రీనాధులవారు ఎక్కడుంటున్నారో? శ్రీశైలం లోనే ఉన్నారో..
ఏమయ్యారో?
మాధవుని మనసంతా కలతగా ఉంది. వారిని చూసి ఏమైనా
చెయ్య గలుగుతే.. వారి చిరుగుల శాలువానే మెదలుతోంది కన్నుల
ముందు.
“స్వామీ!” కాదంబరి పిలుపుకి కన్నులు తెరిచాడు మాధవుడు.
“ఎప్పుడు బయలు దేరుతారు?” స్థిరమైన కంఠస్వరంతోనే
అడిగింది కాదంబరి. మొదట్లో ఉన్న సందేహం, భయం లేవు.
అనుమతిస్తే తనుకూడా వచ్చి యుద్ధంలో పాల్గొనే దైర్యం.. కనిపిస్తోంది.
“ఏమిటో దేవీ! ఈ యుద్ధాలు ఎందుకో అర్ధం లేవనిపిస్తోంది.
ఎంత ప్రాణ నష్టం.. ఈ ఖర్చులన్నీ సర్దుకొనుటకై సుంకాలు పెంచడం..
ఎక్కడా అంతులేదు. సంగీత సాహిత్యాలు ఆస్వాదిస్తూ
విశ్రాంతిగా కాలం గడపగలరా ప్రజలెన్నటికైనా అనిపిస్తోంది.”
విచారంగా అన్నాడు.
“తే.గీ. సృష్టి మొదలైన దాదినె సృకము బట్టి
కక్ష కార్పణ్య ములతోను కలసి కూడి
సూక్ష్మ జీవుల మొదలుగా సురభి యంత
పోరు సలుపుటకే నిల పొడమి రేమొ!”
(సృకము= బాణము)
“నిజమే ప్రభూ! మంచీ చెడూ కలిసే ఉంటాయెప్పుడూ.
ఎవరూ తప్పించలేరు. ఊరికే కూర్చుని, ఎవరి జీవనం వారు
సాగిస్తున్నా.. ఎదుటి వారు ఊరుకోరు కదా!”
కాదంబరి ఊరడించడానికి ప్రయత్నించింది.
మాధవుడు మాత్రం రాజుల రాజ్యకాంక్షని సమర్ధించలేక
పోయాడు.
గంగ నుండి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కోరికే
లేకపోతే.. కపిలేంద్ర వర్మ హాయిగా ఉండి, తన ప్రజలకి సుఖ
సంతోషాలనిచ్చే వాడు కదూ!
ఓడించిన రాజ్యం నుండి కన్నియని తెచ్చుకోవడం..
వివాహమాడ్డం. అందరు రాజులదీ అదే వ్యవహారం.
మాధవుని మనసులోని అల్ల కల్లోలాలెలా ఉన్నా, వారం రోజుల
లోగా దక్షిణ దిశగా కదిలాయి గజపతుల సైన్యాలు.
రెడ్డిరాజ్యం పతనమయ్యాక, విజయనగరం దేవరాయల
రాజ్యంలోని భాగమయిన రాజమహేంద్రవరం.. అతని కుమారుడు
మల్లిఖార్జునయ్య హయాంలో బలహీనమై పోయింది. కపిలేంద్రుని
పుత్రుడైన హంవీర కుమారుడు గోదావరీ తీరాన్ని జయించి
కళింగంలో కలిపేశాడు. దానికి, రఘునాధ నరేంద్ర మహా పాత్రుని
పరీక్షగా నియమించారు.
కోరుకొండ దాటి గోదావరి తీరం చేరారు, మాధవుని తో
కళింగ సైన్యం. మహారాజు స్వయంగా సైన్యాన్ని నడిపిస్తుంటే
ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండ వలసిందే కదా!.
గోదావరి తీరం చేర బోతుండగానే, మాధవునికి, తాము కాంచీ
పురానికి వెళ్లినప్పటి విశేషాలన్నీ వరుసగా జ్ఞప్తికి వచ్చాయి.
గోదావరీ తీరం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.. కపిలేంద్ర
దేవుని సైన్యం. కానీ.. ఈ మారు మిత్రుడు పురుషోత్తముడు లేడు.
విశ్రాంతికని ఆగిన ఘడియలోపే.. డేరాల వద్ద కోలాహలం..
అనేక అశ్వాలు వస్తున్నట్లు, గిట్టల చప్పుళ్లు.
బైట కావలి ఉన్న వారే కాకుండా.. డేరాల లోనుంచి
సైనికులందరూ అప్రమత్తులై బైటికొచ్చేశారు.. కత్తులు చేతులతో
తిప్పుతూ.
మాధవుడు, మహారాజు మాత్రం చిరునవ్వుతో చూస్తున్నారు.
ముందుగా వస్తున్న గుర్రం మీద, రఘునాధ మహా పాత్రుడు..
అల్లంత దూరం నుంచే గుర్రం దిగి, నడిచి కపిలేంద్ర దేవుని దగ్గరికి
వచ్చాడు.
“ప్రభూ! నాకు ముందుగా కబురు పంపి ఉంటే మీకు సర్వ
సదుపాయాలూ చెయ్యక పోయే వాడినా!” అలుకగా అన్నాడు.
“మేము ఎవరికీ చెప్ప దలచుకోలేదు రఘునాధా! కృష్ణా తీరం
వరకూ సాగుదామని అనుకుంటున్నాము. ఇక్కడ పాలన
అంతా బాగా నడుస్తోందా?” కపిలేంద్రుడు అడిగాడు.
“చాలా బాగా నడుస్తోంది ప్రభూ. పంటలు బాగా పండుతున్నాయి.
ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. గోదావరి అద్దరిని, ఒక గ్రామానికి,
కపిలేశ్వర పురం అని పేరు పెట్టుకున్నారు.” రఘునాధుడు
చిరునవ్వుతో అన్నాడు.
“కృష్ణా తీరంలో కూడా ఒక కపిలేశ్వరపురం రావాలి ప్రభూ.”
మాధవుడు అన్నాడు.
“అదే కదా మన ప్రయత్నం. ఇంక విశ్రాంతి తీసుకుందాము.
రేపు సూర్యోదయాత్పూర్వమే బయలు దేరాలి.” కపిలేంద్రుడు సెలవు
ఇచ్చాడు.
“కొండవీడులో అంతః కలహాలతో పరిపాలన అస్తవ్యస్తం
అయిపోయింది. అర్ధం పర్ధం లేని పన్నులతో ప్రజలు అసంతృప్తితో
ఉన్నారు. అంతే కాదు.. ఈ ప్రాంతమంతా విజయనగరం రాయల
అధీనంలోనే ఉంది. దేవరాయల కుమారుడు మల్లికార్జునయ్య
ఏలుబడిలోనే.. ఇదే మంచి తరుణం. మనం స్వాధీనం పరచు
కోవడానికి.” కృష్ణాతీరం చేరుతూనే కపిలేంద్రుడు అన్నాడు.
కృష్ణాతీరం వద్ద శ్రీనాధులవారి సమాచారం సేకరించడానికి
ప్రయత్నించాడు మాధవుడు.
కృష్ణాతీరం అంతా తిరుగుతూ ఉండే వేగులు రహస్యంగా
రాజుల సమాచారాలు సేకరిస్తారు. కానీ.. ఒక కవి గురించి వారి
కెందుకు?
“కొండవీడు, విజయనగరం అనతి కాలం లోనే స్వాధీన
పరచుకుంటున్నారు కదా! మల్లిఖార్జునయ్య, తన తండ్రి
దేవరాయలు వలే సమర్ధుడు కాదు. అప్పుడు శ్రీశైలం ప్రాంతం
కూడా కటకం ప్రభువుల సామ్రాజ్యంలోనికే వస్తుంది. ఆ తరువాత
మీరు చెప్పిన వ్యక్తిని పట్టుకోవచ్చును మంత్రీ!”
“పట్టుకోమనటం లేదు. క్షేమ సమాచారాలు మాత్రం
తెలుసుకొమ్మంటున్నాం.” మాధవుడు వివరించాడు.
“అటులనే ప్రభూ! త్వరలో తెలుసుకుంటాము.” చారులలో
ప్రధాని సెలవిచ్చాడు.
కానీ.. ఆ మరునాడే జరిగిందది..
సుల్తాన్ నసీరుద్దీన్ అబ్దుల్ ముజాఫర్ మొహమద్ షా..
వంగ దేశాధిపతి, కటకం మీదికి దండెత్తి వస్తున్నాడని.. అత్యంత
వేగంగా పరుగు పెట్టే అశ్వాల నధిరోహించిన వేగులు వర్తమానం
తీసుకుని వచ్చారు.
హంవీరుడు బహమనీ సుల్తానుల నెదుర్కొనడానికి వెళ్లాడు,
ఇతర సోదరులతో కలిసి.
కొండవీడు, విజయనగరం ఎప్పుడైనా కలుపు కోవచ్చును.
కొద్ది మాసములు ఆగినా ఏం మార్పుండదు.
ముందుగా వంగ సుల్తాను ఆక్రమణని ఆపాలి.
సైన్యాన్ని వెనుకకు మరలమని ఆదేశమిచ్చాడు మహరాజు.
“వంగదేశం మీదికి దండయాత్రా ప్రభూ!”
“అవును మాధవా! వంగ కళింగ దేశాలని ఏకం చెయ్యాలి.
వంగదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి. గణేశుల
పాలన తదుపరి గజపతులు ఏలాలి. మత మార్పిడులని ఆపాలి.
మీరు కూడా మాతో వస్తున్నారు. గంగా తీరం వరకూ గజపతి
సామ్రాజ్యం విస్తరించాలి. జానూపురం స్వాధీనమయ్యాక
కుమార హంవీరుని కూడా మనతో కలవమని ఆదేశం
పంపుతున్నాను.” కపిలేంద్రుడు ఆవేశంగా అన్నాడు.
వంగ రాజ్యం..
లోపలి అలజడి పైకి కనిపించకుండా బింకంగా అన్నాడు
మాధవుడు..
“తమ ఆజ్ఞ ప్రభూ! అటులనే వంగ సుల్తానుని ఓడిద్దాం.”
……………………
35
కళింగ సైన్యాలు వెను తిరిగాయి.
“మన పయనం వేగంగా సాగాలి. సుల్తాన్ సైన్యం వంగ
సరిహద్దులు దాటి ఈవలకు రాకుండా మనం అచ్చటికి
చేరుకోవాలి.” కపిలేంద్రదేవుడు ఆదేశాలనిచ్చాడు.
“ఒక చిన్న మనవి ప్రభూ!”
“ఏమది మాధవా?”
“మార్గ మధ్యంలో అరసవిల్లి అని సూర్యదేవుని క్షేత్రముంది.
కొచెం దారి పక్కకి తిప్పుతే మనం ఆ ప్రత్యక్షనారాయణుని
సేవ చేసుకొన వచ్చును. అందునా, మనం వెళ్తున్నది రణానికి.
ఇటు దక్షిణాన యుద్ధం మాని మరీ వెళ్తున్నాము. ఆలనాడు
రామ రావణ యుద్ధంలో రామునికి రణ మధ్యంలో చింత
కలుగుతే అగస్త్య మహామునియే అతనిచే ఆదిత్యునికి సేవ
చేయించారు.
కం. కలతను రణమున రాముడు
యలసి సొలసినంతనె ముని, యర్కుని భక్తిన్
కొలువమనగ యినకులజుడు
గెలువము కోరగ నొసగెను క్షేమము జయమున్.”
మాధవుడు ఆపేశాడు.. మహారాజు ఏమంటారో అని
సందేహ పడుతూ.
“అవును. మనం కళింగులం కూడా ఆదిత్యుని భక్తులమే కదా!
మేము కూడా రఘురాముని వలెనే సూర్య వంశీయులమే. అవశ్యం
వెళ్లెదము. సూర్య దేవుని అర్చించి, యుద్ధానికి వలసిన ధైర్య
స్థైర్యాలని సమ కూర్చుకునివెళ్లెదము.” కపిలేంద్ర దేవుడు,
సేనాధిపతికి ఆదేశ మిచ్చాడు.
అరసవిల్లి.. ఏడవ శతాబ్దంలో ప్రభాకరునికి ఆలయ నిర్మాణం
జరిగింది. ఆలయంలో సూర్యుని పాదాల మీదికి, సంవత్సరానికి
రెండు సార్లు ఉదయ సూర్యకిరణాలు పడి, గర్భాలయం
అంతా రంగురంగుల కాంతులతో నిండి పోతుందని చెప్తారు.
మాధవునికి మహదానందంగా ఉంది.
ఈ మారు మహారాజు కపిలేంద్ర దేవులు విచ్చేస్తున్నారని
వర్తమానం పంపించారు వార్తా హరులచే.
కోరుకొండ వద్ద ప్రతీక్షగా నున్న సామంతుడు ఎదురేగి, సకల
మర్యాదలూ చేశాడు. సరిగ్గా సూర్యోదయ సమయానికి,
నాగావళీ నదిలో స్నానం, అర్ఘ్య సమర్పణ ముగించి,
అరసవిల్లి చేరారు, కపిలేంద్రుడు, మాధవుడు, ప్రధాన సేనాని.
శాస్త్రోక్తంగా పూజలు చేసుకుని, భోజనాదులయ్యాక,
సైన్యాన్ని ముందుకురికించారు కపిలేంద్ర, మాధవులు.
తినడానికి, విశ్రమించడానికీ తప్ప ఇంక దేనికీ ఆగకుండా
కళింగ, వంగ సరిహద్దులని చేరారు.
మాధవునికి బాలవ్వ గుర్తుకొచ్చింది.
“ప్రభూ! ఇచ్చటనే మా పినతండ్రిగారి వసతి గృహముంది.
ఈ రోజునకు అచ్చట ఆగుదామా? సరిగ్గా మన బాటకి
ఆనుకునే ఉంది.”
“అంత కన్న ఇంకేమి కావాలి మాధవా? ఎక్కడైనా ఆగ
వలసినదేగా. మీ గృహానికే వెళ్లెదము.”
మాధవుడు మహదానందంతో సైన్యాలని మరలించాడు
తనని ఆదుకుని, జీవిత మిచ్చిన పూటకూళ్ల ఇంటికి.
దూరం నుంచే సైన్యాన్ని చూసిన జగన్నాధ మహాపాత్రుడు
వంటలు చేసే వారికి ఆదేశ మిచ్చాడు. సాధారణంగా సైనికులు
వారి సంభారాలని వారే తెచ్చుకుంటారు. పూటకూళ్ల ఇంటివారి
పని వండి వడ్డించడమే.
“చిన్నాన్నా!” వంటకాలు ఏమిచెయ్యాలో ఆదేశ మిస్తున్న
జగన్నాధుడు, మాధవుని పిలుపు విని వెనక్కి తిరిగాడు.
ఆప్యాయంగా హత్తుకుని కుశలమడిగాడు.
“సైన్యంలో నువ్వున్నావని ఊహించనేలేదు సుమా! చాలా
ఆనందంగా ఉంది మాధవా! నిన్ను దండయాత్రలో
పాల్గొనమన్నారా రాజుగారు..” ఆశ్చర్యంగా అడిగాడు.
“రాకుమారులంతా తలొక దిక్కుకూ యుద్ధానికి వెళ్లారు.
నేనే మిగిలాను. రాకుమారుడు పురుషోత్తమ దేవుని కోటలో
ఉంచి.. నన్ను రమ్మని ఆదేశించారు. చిన్నమ్మా! కుశలమా?
తమ్ముడు గురుకులంలో ఉన్నాడా? విద్యలుబాగా
నేరుస్తున్నాడా?” జగన్నాధునికి ఒక కుమారుడు.
పది సంవత్సరాలు నిండాయి. గురుకులానికి పంపారు.
“అంతా క్షేమమే కుమారా! మీ వారినందరినీ చెరువు
వద్దకు తీసుకెళ్లి రండి. ఈలోగా భోజనాలు తయారవుతాయి.”
మాధవుడు మహరాజుని అర్ఘ్య సమర్పణకి చెరువు
వద్దకి తీసుకుని వెళ్లాడు. తనకి ఉత్కళ దేశంలో ఆశ్రయమిచ్చి
ఆదరించిన ఊరు. ఆప్యాయంగా బంధువులని పలుకరించాడు.
మర్రిచెట్టు వద్ద ఆగి ఊడలన్నింటినీ తడిమి పలుకరించాడు.
అంతటి మహరాజు, మాధవుని బాల్య చేష్టలని చూసి
తను కూడా చిన్న పిల్లడైపోయాడు.
రాబోయే సంగ్రామం సృహే లేదెవరికీ.
మనసుకీ, శరీరానికీ ఆ మాత్రం ఆటవిడుపు కావాలి.
చెరువులో అలసి పోయే వరకూ ఈత కొట్టారు. కపిలేంద్రదేవులు
తాను ఎవరో చెప్పవద్దన్నారు.
ఒక్కొక్క స్థలమహిమ.. ఒక్కొక్క కాల మహత్యం.
ఉ. మానవుడెంత యెత్తు ఘనమై నెదిగేనుగ యప్పుడప్పుడున్
చీనపు బాల్యమే తలచు చేష్టల చేయుచు పాపడౌనుగా
మానము జేయునా ప్రభువు మానసమున్ చెలగేటి కోర్కెలన్
స్యోనముగాను మాధవుని చూసియు నాడుకొనంగ వేడుకన్.
(చీనపు= బంగారపు, మానము= మన్నించు, స్యోనముగా= సుఖముగా)
మరునాడు, ప్రాతఃకాలముననే స్నాన అర్ఘ్య పానాదులు
ముగించుకుని, బాలేశ్వర్ నుంచి బయలుదేరారు, కపిలేంద్ర దేవుడు,
మాధవుడు..తమ సైన్యాన్నంతా సమాయత్తం చేసుకుని.
సరిహద్దు దాటాక, వంగ దేశం లోనికి ప్రవేశించగానే ఒక్క సారిగా
ఉద్వేగానికి లోనయ్యాడు మాధవుడు.
మధ్యాహ్నానికి, దుర్గాదేవితో కలిసి తాను ఆగిన చోటికి
చేరుకున్నారు.
మరి కొన్ని వృక్షములు పెరిగాయి కానీ పెద్ద మార్పులేమీ లేవు.
తాము తెచ్చుకున్న స్వల్ప ఫలహారాలను, సైనికులు అడవిలో
సేకరించిన ఫలాలతో కలిపి ఆరగించి ఒకింత విశ్రాంతికి
ఉపక్రమించారు, మహరాజు, అతడి సైన్యం.
మాధవుడు మాత్రం.. తన హయం మీద ఆ ప్రాంతమంతా
ఒక సారి కలియదిరిగాడు.. తన తల్లి ఆనమాళ్లు ఏమైనా
అగుపించునేమోనని.
మానవ హృదయపు బలహీనత..
ఒకటిన్నర దశాబ్దపు నాటి గుర్తులు కనిపిస్తాయా? వెర్రితనం
కాకపోతే..
ఏది ఏమైనా కన్న తల్లిని తలచుకొని, మనసులో దుఃఖాన్ని
అక్కడే అణచి వేస్తూ తిరుగుతుంటే, కనిపించింది..
అదీ.. కళ్యాణి ఒక వటవృక్షం దగ్గర ఆగి పోయి, కదలనని
మొరాయిస్తుంటే!
మాధవుడు గుర్రం దిగి వటవృక్షం చుట్టూ.. జాగ్రత్తగా అడుగులు
వేస్తూ తిరిగాడు.
దొరికింది.. చెట్టు మొదట్లో, ఇంచు మించుగా.. అది కూడా ఒక
వేరు ఏమో అనిపిస్తూ.. ఒక కత్తి పిడి. వంగి, చూస్తూ.. తన దుస్తుల్లో
ఉన్న చిన్న బల్లెం వంటిదాన్ని తీసి, మట్టిని తవ్వ సాగాడు.
కొద్ది సేపట్లోనే బైట పడింది..
కొద్దిగా మొన వద్ద బండగా అయిన కత్తి. తుప్పు పట్టినా..
పదును అలాగే ఉంది. దాని మీద దుర్గాదేవి పేరు చెక్కి ఉంది.
ఆ కత్తిని చూడగానే జలజలా రాలాయి మాధవుని కనుల వెంట నీళ్లు.
అక్కడే నేల మీద కూలబడి, కత్తిని ఒడిలోనికి తీసుకుని,
వెక్కి వెక్కి ఏడవసాగాడు.
మహరాజు, పరివారం శబ్దానికి అందనంత దూరంలో ఉన్నారు.
సీ. కాలమెంతెంతైన కాలుని మహిమనే
కన్నతల్లిని తనే కానడాయె
ఆ తల్లి కైపట్టి యరుల దునిమినట్టి
కరవాలమును చూడ కనులు వెఱవ
చిన్ననాటి స్మృతులె చిత్తమునమెదల
చేష్టలుడిగె నంత చితికె హృదియె
మింటినే కాంచగ మెదలె మాతృ కరము
చాచిదీవెన లంత చల్లగ నిడ
ఆ.వె. మాధవు మదియంత మైమరచి మురిసె
అమ్మ తనని బిగిని హత్తు కొనెనొ
ఆకశమున నిలిచి ఆదరముగనెంతొ
కత్తినిచ్చి నట్టు కలను కనగ.
చేతిలో నున్న కత్తిని ఆప్యాయంగా తడిమాడు. అమ్మ
స్పర్శ జ్ఞప్తికొచ్చింది.
తన పై వస్త్రంతో శుభ్రంగా తుడిచాడు.
తనకి కత్తిని ఎలా తిప్పాలో నేర్పించిన కత్తి. అమ్మ చేతిలో
అత్యంత వేగంగా మెరుపులా తిరిగిన కత్తి. తనను రక్షించడానికి
శతృవుల కొందరిని దునిమిన కత్తి.
ఇదే కత్తితో తమ గతి మార్చిన వారిని శిక్షిస్తాడు. మంచికో
చెడుకో తన దేశం మీదికే దండెత్తే అవకాశం వచ్చింది. సర్వ శక్తులూ
ఒడ్డి ముష్కురులను దండించడానికి తోడ్పడతాడు. ఎక్కడి నుంచో
తమ దేశానికి వచ్చి తమ దేశస్థులని చంపుతూ.. తమ దేవుళ్లని
బద్దలు కొడ్తూ, తమ సంపదలని కొల్ల గొడ్తూ..
ఎవరిచ్చారు వారికి అధికారం?
సైనికుల కలకలం వినిపించి.. తన ఆలోచనల నుంచి
బైటికొచ్చాడు మాధవుడు. అమ్మ కత్తిని అంగవస్త్రంలో నుంచి,
కళ్యాణి జీను కింద దాచాడు. అది శరీరానికి తాకగానే కళ్యాణిలో
కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.
గట్టిగా సకిలించి.. మాధవుడు ఎక్కగానే ముందుకురికింది.
“ఎచ్చటికెళ్లారు మాధవ మంత్రీ? మేము కించిత్ ఆందోళనకు
గురయ్యాము.” కపిలేంద్రుడు అడిగాడు.
సైన్యం అంతా తయారుగా ఉన్నారు. మాధవుని కొరకే వేచి
ఉన్నట్లు అనిపించింది.
“క్షమించాలి మహారాజా! చుట్టు ప్రక్కల ఏమైనా ఫలములు
దొరకునేమో అనీ..” మాధవుడు తనకు సంబంధించిన వస్తువులను
గుర్రానికి కట్టి, తను కూడా ఎక్కి, రాజు పక్కకి వెళ్లాడు.
మనసులో ఏమనుకున్నా మోములో కనిపించ నీయకుండా
కపిలేంద్రుడు గుర్రాన్ని అదిలించాడు.
బాలేశ్వర్ వద్దనుంచి అక్కడ తాము నిర్వహిస్తున్న గజశాల
నున్న ఏనుగులు కూడా కలిశాయి. సైన్యంలో రధాలు కూడా
ఉన్నాయి. మహారాజు, ఎప్పుడేది కావలిస్తే అది అధిరోహించ వచ్చు.
అక్కడికి దగ్గరలోనే నసీరుద్దీన్ షా సైన్యాలు ఎదురు
రాబోతాయని చారులు సూచనలిచ్చారు.
కపిలేంద్రుడు గజం అధిరోహించి ముందుకు కదిలాడు.
మాధవుడు అవసరాన్ని బట్టి మారడానికి అనుకూలంగా
అమర్చుకున్నాడు.
మధ్యాక్కర.
కదలె గజపతుల సేన కదముతొక్కుతు వేగముగనె
అదరెగ నవనియె నంత హయముల సవ్వడి వలనె
బెదరగ నడవిని యన్ని పికములు మెకముల్ పురుగులు
ఛదము చాటున దాగి యుండ సడి లేక చలనము లేక.
(ఛదము= కప్పు, ఆకు)
చారుల సమాచారమును బట్టి, ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా
నసీరుద్దీన్ షా సైన్యాలు.. లేదా వారు గుడారాలు ఎదురు పడే
అవకాశం ఉంది.
అందుకే.. కళింగ సైన్యం అప్రమత్తతతో సాగుతోంది. విశ్రాంతికై
ఎక్కడ ఆగిన గానీ.. పరిసరాలన్నీ ముందుగా పరికించి మరీ
విడిది చేస్తున్నారు.
జానూపూర్ దగ్గర పడుతుండగానే.. వంగ సైన్యాలు ఎదురు
పడ్డాయి.
అప్పటికే ఢిల్లీ పాదుషా దండయాత్రల నెదుర్కొని అలసి
ఉన్న వంగ సైనికులు కళింగుల ధాటి ఎదుర్కొనలేక పోయారు.
మాధవుడు, అరివీర భయంకరుడై.. కనిపించిన వంగ సైనికులను..
ఊచకోత కోస్తున్నాడు.
చివరికి వంగ సైనికులకు లొంగిపోక తప్పలేదు.
పాండువా కోటలోకి విజయోత్సాహంతో అడుగు పెట్టారు
కళింగులు.
మాధవుడు కోటంతా తిరిగి తల్లి దండ్రులని స్మరించుకున్నాడు.
కోటలోపలి సైనికులంతా కూడా లొంగి పోయారు. ఆడవారిని, పిల్లల్నీ
ఏమీ చెయ్యద్దని అందరికీ ఆదేశాలు వెళ్లిపోయాయి.
వంగరాజ్యం కళింగుల వశమయింది. కళింగ సైనికులు
విజయోత్సాహంతో పండుగ చేసుకున్నారు.
కపిలేంద్రదేవుడు చక్రవర్తి అయ్యాడు.
………………..
36
వంగ దేశంలో కొలువు తీరి ఉన్నాడు కపిలేంద్ర దేవుడు.
హృదయం ఉప్పొంగుతుండగా.. మాధవుడు అన్నిటా తానై నిలిచి నిర్వహిస్తున్నాడు. గణేశుల పాలన అనంతరం హిందూ రాజు రాజ్యం చేపట్ట బోతున్నాడు.
కొలువులో అత్యధిక శాతం ముస్లిములే..
చాలా మంది బలవంతంగా మత మార్పిడి గావింప బడ్డవారే. అందుకే వారికి ముసల్మాను రాజైనా, హిందూ రాజైనా ఒకటే. రాజు నిర్దేశించినట్లు నడుచుకోవలసిందే.
ఒక్క సారి సభంతా కలయజూశాడు మాధవుడు.
ఇరుపక్కలా వరుసగా అమర్చి ఉన్న ఆసనాలలో.. నాల్గవ వ్యక్తి మీద అతడి దృష్టి నిలిచింది.
తన తండ్రిగారి పోలికలు చాలా కనిపించాయి.
చిన్నాన్న.. నరసింహ గణేశ్. ఇప్పుడే పేరుతో పిలుస్తున్నారో!
కళ్లలో చమరుస్తున్న నీటిని వెనక్కి తోసేశాడు. దేశం వదిలి వెళ్లినప్పుడు మాధవుని వయసు పది సంవత్సరాలకి అటూ ఇటూ ఐనా.. అనుభవాలు అతడికి అంతకంటే ఎక్కువ ఏళ్లని ఇచ్చాయి, మానసికంగా.
అతడు ఎక్కడ గుర్తుపడ్తాడో అని వెంటనే తల తిప్పి సభలో మిగిలిన వారిని పరికించాడు.
సగం మంది పైగా తన తండ్రికి తెలిసిన వారే.
కానీ.. ఎవరూ తనని గుర్తించినట్లు లేదు.
చనిపోయాడని అనుకుంటున్నారు. పైగా వేష భాషలు ఓఢ్ర బ్రాహ్మణ యువకుని వలెనే ఉన్నాయి.
కానీ.. సభలో ఉన్నవారి అహార్యాదులన్నీ ముసల్మానులవే.
వాళ్లందరూ స్వచ్ఛందంగానే ఆవిధంగా తయారయ్యారా?
సందేహమే.. ముమ్మాటికీ కాదు.
అందరి మొహాల్లో ఒక రకమైన విరక్తి భావం. ఇప్పుడు కొత్త రాజెలా ఉంటాడో అనే ఆసక్తి కూడా కనిపించలేదు.
ఏదేమైనా.. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు నిలుస్తుందో తెలియదు.. కానీ, హిందూ రాజ్యం ఏర్పడింది వంగ దేశంలో.
ఢిల్లీ సుల్తానులెలాగా కాచుకునుంటారు.. వంగ దేశాన్ని కబళించడానికి.
అందరూ కలుస్తే ఒక్క హిందూ రాజుని తరమడం ఏమంత కష్టం?
అదంతా తరువాత..
ప్రస్తుతం వరించిన విజయాన్ని.. సంబరాలతో జరుపుకోవడమే సమంజసం.
ఎంతగా సర్ది చెప్పుకుందామనుకున్నా.. కన్నీరు ఆపుకో లేక పోయాడు మాధవుడు. కళ్లలో చిప్పిల్లుతున్న నీటిని, చూపుడు వేలితో విదిల్చాడు, తన పక్కకి తిప్పి.
ఎవరూ చూడలేదనే అనుకున్నాడు.
కానీ చూడ కూడని వారే చూశారు..
“ఏమది మాధవ మంత్రీ! ఎందుకా ఆందోళన?” సింహాసనం మీద ఆసీనుడైన కపిలేంద్రుడు అడిగాడు.
“ఏం లేదు ప్రభూ.. ఇవి ఆనంద భాష్పాలు. ఇంతటి వైభవం చూస్తుంటే సంతోషంతో..” నదరక బెదరక, ధీమాగా అన్నాడు, చిరు నవ్వుతో.
మహారాజు కూడా మందహాసం చేశాడు.
సభనంతా మాధవుడే నిర్వహిస్తున్నాడు. వంగ భాష వచ్చీరానట్లుగా మాట్లాడుతూ.. మధ్యలో సంస్కృత పదాలని ఉపయోగిస్తూ.. వంగ భాషలోనే మాట్లాడాలనే ఉత్సాహాన్ని అదిమి పట్టి.
పాండువా, జానుపూర్ సుల్తానుల వద్ద నుంచి సామంతులుగా ఉంటామని అంగీకార పత్రాలు తీసుకున్నాడు.
అంతే కాదు..
కప్పం కట్టించుకుని, ప్రతీ వత్సరమూ శ్రావణ మాసం లోగా కప్పం కట్టాలనీ, అది, ఆరు నూర్ల అశ్వాలతో పంపాలనీ ఒప్పందం చేసుకున్నాడు.. అది ఎంత కాలం సాగుతుందో అని మనసులో చింతిస్తూనే..
వెంటనే ఒక శాసనం తయారు చేయించాడు..
వంగ దేశాన్ని గౌడ దేశం అని కూడా అంటారు.
గౌడ దేశాన్ని జయించిన మహారాజు కపిలేంద్ర వర్మకి “గౌడేశ్వర” అనే బిరుదునిచ్చినట్లుగా ఆ శాసనంలో రాయించాడు మాధవుడు.
సభంతా కరతాళ ధ్వనులతో మారు మోగి పోయింది.
సభికులంతా ఒక్కొక్కరే వచ్చి తమ పరిచయం చేసుకుని, మహారాజు గారికి అభివాదం చేసి వెళ్తున్నారు.
మాధవుని పినతండ్రి వచ్చాడు. కుతూహలంగా చూశాడు మాధవుడు. అప్పటికి తన భావ కల్లోలాన్ని అదిమి పట్టగలిగాడు.
“నా పేరు ‘నయీమ్ హస్సేన్’ సాబ్. ఇక్కడ కొత్వాల్ గా పనిచేస్తున్నాను.” ఉర్దూలో పరిచయం చేసుకుని.. మాధవుని వంక కూడా చూసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు నయీమ్ గా మారిన నరసింహుడు.
మహరాజు తరువాత వచ్చిన కోశాధికారితో మాట్లాడుతుండగా, పక్కకి తిరిగి పై వస్త్రంతో మొహం తుడుచుకున్నట్లుగా ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు మాధవుడు.
చిన్నా భిన్నమై పోయిన తన కుటుంబం..
చిన్నాన్న గారి పిల్లలు ఎలా ఉన్నారో.. ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఉండాలి.
నయీమ్ మాత్రం మాధవుని గుర్తించలేదని తెలుస్తోంది.
సీ. చిందర వందరై చెదరి పోయినవయ్య
చక్కనైన కుటుంబ సంవిధములు
కొందరి మత మౌఢ్య కుత్సిస యుక్తిచే
కొందరి యత్యాశ కోరికలకు
నలిగి నాశనమైన నామరూపము లేని
నడిచేటి శవములై నలుగు వారు
ఎందరెందరిచట ఈ సభ యందున
కలరో యెవరయిన కనుగొనగను
తే.గీ. మానవుని మనుగడ కేమి మనన కేమి
కొఱత లేకుండుటకు నేమి కోర వలెను
మారణములేలనో మరి మతములేల
శాంతి సౌఖ్యము కల్గిన చాలు గాద.
(సంవిధము= జీవిక, బ్రతుకు తెరువు, మనన= ఆయువు)
మాధవుని ఆలోచనలు, మనసులో ఛెళ్లుమని కొట్టిన చర్నాకోల దెబ్బకి ఆగిపోయాయి.
మరి తాము చేస్తున్నదేమిటి?
మారణ హోమమే కదా!
ఎంతమందిని చంపాడో లెక్కేమైనా ఉందా?
కానీ.. తన చేతిలో ఏముంది? రాజు సేవకునికి వేరే దారి ఉండునా? చెప్పిన పని చేయుటే కదా! రాజు అనుగ్రహం ఉన్నంత కాలము ఏ సమస్యా రాదు. ఆగ్రహం వస్తే ఏమగునో తెలియదు.
యాంత్రికంగా ఒక్కొక్కరినీ మహరాజు వద్దకు తీసుకొచ్చి పరిచయమయ్యాక వారి ఆసనమునకు పంపుతున్నాడు.
చిన్నాన్నని కలిసి మాట్లాడుదునా.. అనేదే అతడి సమస్య.
కలిసి తమవారి యోగక్షేమాలు అడగాలని ఉంది. అయితే.. చారులు అందరి కదలికల మీద కన్నేసి ఉంచుతారు. తాను ఏదో కుట్ర పన్నుతున్నాడని అనుమానం వచ్చినా ఆశ్చర్యము లేదు.
మౌనంగా ఉండుటయే ఉత్తమం.
మనసు చిక్క బర్చుకుని నిర్వికారంగా అచ్చటి నుండి కదిలాడు మాధవుడు సభ అయిన పిదప.
కపిలేంద్రుడు తిరుగు ప్రయాణమునకు ఆనతి నిచ్చాడు.
వంగదేశ విజయం.. అందులోని సామంతరాజులనీ, ఉద్యోగులనీ కలవడం మొదలైన పనులన్నీ సమాప్త మయ్యాయి.
ఒక పక్షం రోజులయ్యాయి. అచ్చటి సుల్తానుకే రాజ్యం వప్పజెప్పి కదిలారు ఓఢ్ర సైనికులందరూ కళింగ రాజ్యానికి.
పదిహేను రోజులు.. వ్యవధి దొరికినప్పుడు తను బాల్యంలో తిరుగాడిన ప్రదేశాలన్నీ తిరిగాడు మాధవుడు. ఆ సెలయేళ్లు, ఆ వనాలు, భవనాలు, తటాకాలు.. ఎచ్చటి కేగినా, చేయి పట్టుకుని నడిపించిన కన్న తల్లే కనిపించింది.
పల్లె పల్లె తిరిగాడు. అచ్చటి నావల్లో బాల బాలికలతో కలిసి కేరింతలు కొడుతూ విహరించాడు. సస్య శ్యామలమైన దేశం వంగ దేశం.
చెరువుల్లో చేపలు పట్టాడు. తను పట్టిన చేపల్ని పల్లె వనితల చేత వండించుకుని కడుపార తిన్నాడు. వంటలోని అచ్చమైన వంగ రుచులు చిన్నప్పటి కోటలోని చవులను జ్ఞప్తికి తెచ్చాయి.
ఆ.వె. ఎక్కడెక్కడైన ఎంత తిరిగిననూ
నిక్కము కనడుగ మనిషి యునికినె
తనదు మాతృ దేశ దర్శనమ్మొసగుగా
ఎంత తృప్తి నైన ఎన్న గాను.
ఎక్కడ తిరుగుతున్నా తన బంధువుల కోసం వెదకుతూనే ఉన్నాడు.
ఏమో.. దాయాది అన్నదమ్ములు కనిపిస్తారేమో!
కనిపించినా గుర్తు పట్టగలడా? వారి ఆహార్యమంతా ముసల్మానుల వలే ఉంటుంది కదా! అయినా.. ఎక్కడో చిరు ఆశ..
అదే నిజమయింది..
ఒకరోజు.. తాము చిన్నప్పుడు తరచుగా విహరించే వనానికి వెళ్లాడు మాధవుడు. అది తమ కుటుంబానికే పరిమిత మయింది ఒకప్పుడు. మారిన పరిస్థితులలో ఆ వనం రాజుగారి కోటలోకి చేరి పోయింది.
ఆ వనంలోని తటాకంలో కొద్ది సేపు ఈత కొట్టి, తాను చిన్నప్పుడు సేద తీర్చుకునే వటవృక్షం నీడని కూర్చున్నాడు మాధవుడు.
అనుకోకుండా నోటివెంట పలికిందొక విషాద కవిత.
సీ. ఇచ్చోటనే గద ఏ యరమరికలు
లేక చిట్టి చిలకలె దరి చేరె
తరుముతు తరుముచూ దాగుడు మూతలు
యాడిన పొదలన్ని యవియె కాద
చిన్నారి పొన్నారి చిరుత కథలు యెన్నొ
పాడిగ యత్తలు పలుకగాను
ఈ నీడ నిదురించి ఎన్నగా నెన్నెన్ని
కనిన కలలు యన్ని కల్లలాయె
ఆ.వె. అమ్మ యొడిన నిచట యలసి నిదురపోగ
అన్నదమ్ములదిగొ యాట లేప
సోదరి యిట కేగి సొలసినఁ దమ్ముని
యొడిని చేర్చు కొనగ యూరడిల్లె.
చాటువు చెవిని పడగానే, అటుపక్క గుర్రంమీద వెళ్తూ ఆగి విన్న ఒక యువకుడు మాధవుని చెంతకు వచ్చాడు.
అతడే తన చిన్నాన్న నరసింహుని సుతుడే అయుండచ్చు నని అనిపించింది మాధవునికి. మాధవుని కన్న రెండు సంవత్సరాలు పెద్ద వాడు.
“చాలా బాగా చెప్పారే.. మీకు ఈ పరిసరాలు తెలుసా మంత్రీ?”
అక్కడ ఎవరికీ తెలుగు రాదులే అని తన ప్రజ్ఞ చూపబోయిన మాధవుడు ఆశ్చర్యంగా చూశాడు.
“మీరు..”
“కొత్వాల్ నయీమ్ హుస్సేన్ గారి కొడుకును, ఆజమ్ హుస్సేన్. నాలుగు వత్సరములు బీజాపూర్ బహమనీ సుల్తాను వద్ద సైన్యంలో ఉన్నాను, మా రాజు గారి ఆజ్ఞతో. అందుకే తెలుగు వచ్చు బాగా. మీ భావం అర్ధమయింది. ఈ ప్రాంతాన మీరు బాగుగా తిరిగినట్లున్నారే..”
మాధవుని మనసులో వేవేల ధ్వనులు.. ఒక్కసారి అన్నని ఆలింగనం చేసుకో గలుగుతే.. ముందుకు రాబోయాడు..
అమ్మ మాట గుర్తుకొచ్చింది.. ‘అజ్ఞాత కుల శీలస్య వాసో దేయో న కస్యచిత్’ ఎవరికీ నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియ నియ్యకు..”
బుద్ధి, మనసు వివాదంలో పడ్డాయి, మాధవునిలో..
…………………….
0 వ్యాఖ్యలు:
Post a Comment