"అజ్ఞాత కులశీలస్య.."
17 వ భాగం.
17 వ భాగం.
“కాంచీపురాధీశునితో సంధి ఏమిటి రాకుమారా? వారు మన
దండయాత్రలకి చాలా దూరాన ఉన్నారు కదా? ఇప్పటికి గోదావరీ
తీరం అయింది. కృష్ణా తీరం దాటాక కదా కావేరీ తీరం వచ్చేది.
మధ్యలో విజయనగరం రాయలు ఉన్నారు. నెల్లూరు తీరం దాటాలి.
నాకైతే అయోమయంగా ఉంది మిత్రమా!” మాధవుడు, కళ్యాణికి
గుగ్గిళ్లు పెడుతూ అన్నాడు.
పురుషోత్తమ దేవుడు తన గుర్రాన్ని కట్టేసి విశ్రమిస్తున్నాడు.
అప్పటికే అతని గుర్రం మాలీషు చేయించుకుని, గుగ్గిళ్లు తినేసి,
హాయిగా కునికి పాట్లు పడుతోంది.
బ్రాహ్మీ ముహుర్తంలోనే బయలు దేరారు, ముందరి మజిలీ నుంచి.
ఉషోదయం తొందరగానే వస్తుంది కనుక ధైర్యం చేశారు. దారంతా
గ్రామాలు.. సస్య శ్యామలమైన ప్రదేశం.
“ఒక్క ఘడియ మాత్రమే ఆగుతున్నాము మిత్రమా!” త్వరగా
బయలుదేరాలి మనం.” రాకుమారుడు వేగిర పెట్టాడు.
గోదావరీ తీరం అది.
మిత్రులిద్దరూ బయలుదేరి మూడు రోజులయింది. రాజమహేంద్రవరం
చేరుకున్నారు. కోరుకొండ వరకూ వారి రాజ్యమే అయినా కూడా..
రాకుమారుడనని ఎవరికీ చెప్పలేదు. ఆ విధంగా ప్రజలే
మనుకుంటున్నారో తమ పాలన గురించి తెలుసుకుందామని..
వారి పరిపాలన అందరికీ సంతృప్తిగా ఉందని తెలుసుకుని,
మరింత ఉత్సాహంతో పయనం సాగించారు.
దారిలో రెడ్ల పాలన.. రాయల పాలనల గురించి తెలుసుకుంటూ
వెళ్లాలని ప్రణాలిక రచించారు కపిలేంద్ర దేవుడు.
ఆవిధంగా ఆయా రాజ్యాల ఆనుపానులు కూడా తెలుస్తాయని
మహారాజు ఉద్దేశ్యం.
చెప్పిన వెంటనే గౌతమి అభ్యంతర పెట్టినా నందుడు సర్ది
చెప్పడంతో ఆనందంగానే పంపింది. “ఈడు వచ్చి కుర్రవాడిని
ఇంట్లో కట్టి పడేస్తే ఏ విధంగా అభివృద్ధి సాధించగలడు?
ఆ జగన్నాధుడే కాస్తాడు పుత్రుడిని.” సీతమ్మ కూడా అవునంటూ
మద్దతిచ్చింది.
“మిత్రమా! రాజమహేంద్ర వరం సమీపించగానే ఏదో తెలియని
ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది మనసంతా! ఏదో చెప్పాలని
ఉత్సుకత..” పురుషోత్తముడు పరవశంగా అన్నాడు.
“నిజమే! ఈ పవిత్ర గోదావరీ తీర మహత్యమటువంటిది.
రెడ్డిరాజుల పరిపాలన కూడా గజపతుల పరిపాలన వలెనే
ప్రజల మన్నన పొందింది. మహాకవి శ్రీనాధుడు వీరి పాలన
గురించి చక్కని పద్యం రాశారు వినిపించుదునా?”
అడిగేశాడే కానీ మాధవునికి విపరీతమైన భయం కలిగింది.
ఒక కాబోయే రాజు ముందు వేరొక రాజును పొగడడమా?
బెదురుగా ఉన్నా బింకంగా నిలుచున్నాడు. క్షత్రియ రక్తం కదా!
“అవశ్యం మిత్రమా.. వినిపించు. ఉత్తరోత్తరా మనకి ఉపయోగ
పడవచ్చును కదా!” పురుషోత్తముడు నవ్వుతూ అన్నాడు.
మాధవుడు మొదలుపెట్టాడు, రాగయుక్తంగా..
“ సీ. ధరియింప నేర్పిరి ధర్బ వెట్టెడు వ్రేళ్ల
లీల మాణిక్యాంగుళీయకములు
కల్పింపనేర్చిరి గంగ మట్టియ మీద
గస్తూరికా పుండ్రకములు నొసల
సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల
దార హారములు ముత్యాల సరులు
చెరువంగ నేర్చిరి శిఖల వెన్నడుములు
గమ్మని క్రొత్త చెంగలువ విరులు
తే.గీ. ధామమున వెండియును బైడి తడబడంగ
బ్రాహ్మణోత్తము లగ్రహారముల యందు
వేముభూపాలు డనుజన్ము వీరభద్రు
ధాత్రి ఏలింప గౌతమీ తటమునందు.”
“ఎంత బాగా వ్రాశారు మిత్రమా! కళ్లకి కట్టినట్లుంది. మనం కూడా
ఈ విధంగా పరిపాలన సాగించాలి భవిష్యత్తులో.” పురుషోత్తముని
ప్రశంస విని అమ్మయ్య అనుకుని నిట్టూర్చాడు మాధవుడు.
“రాకుమారా! శ్రీనాధులవారు ఎచటనున్నారో ఏమైనా తెలిసిందా?
నాకు వారిని కలవాలని ఉంది మిత్రమా!”
“రాజమహేంద్రవరంలో లేరని విన్నాను. హంపీ, కర్ణాటక దేశాలలో
పర్యాటన చేస్తూ, అక్కడి రాజులకు, పండితులకు తమ పాండిత్య
ప్రకర్షని చూపిస్తున్నారు. రాచకొండ సింగ భూపాలుని వద్ద నున్నారని వి
న్నాను. వారు దేశ సంచారులు. మనకి ఎక్కడైనా ఎదురు పడే
అవకాశం ఉంది. ఇంక మన ప్రయాణం కొన సాగిద్దామా?”
పురుషోత్తమదేవుడు, లేచి తన హయం వద్దకు నడిచాడు.
“ఇంతకీ మన పయనోద్దేశ్యం చెప్పనేలేదు రాకుమారా?
కాంచీపురం ఐతే, విజయనగర రాజుల సామంత రాజ్యం. దేవరాయలు
అక్కడ గట్టి రక్షణ ఏర్పాటు చేశాడు. మనం సంధి ప్రయత్నాలేవో
చేస్తే దేవరాయలితో చెయ్యాలి కానీ, కంచి రాజుతోనా? నాకు ఏమీ
బోధపడుట లేదు.”
“నీకు బోధపడదులే మిత్రమా!” పురుషోత్తముడు గుంభనగా నవ్వాడు.
“అంటే..మీకు తెలుసునా?”
“అదంతే! నాకు తెలియకుండా ప్రయాణం అవుతానా? తండ్రిగారికి
అన్ని విషయాలూ తెలుసును. వారి చారులు వృత్తిలో నిష్ణాతులు.
చారులు సేకరించని విషయాలు రాజ్యంలో లేవు.”
రాకుమారుని మాటలు విని ఉలిక్కి పడ్డ మాధవుడు, పక్కనే హయాన్ని
నడిపిస్తున్న మిత్రుని వంక చూశాడు. అయినచో.. తన గురించి కూడా..
ఆ సమయంలో గుర్రాల వేగం తగ్గింది.. దారి క్లిష్టంగా ఉండడంతో. పైగా
నదీతీరం అవడంతో.. నేల జారుతోంది కూడా.
మాధవుని ఆందోళనని పట్టించుకోకుండా, జాగ్రత్తగా హయాన్ని
నడుపుతున్నాడు పురుషోత్తముడు.
“ఇంక మంచి దారి మొదలవబోతోంది.. మనం వేగాన్ని పెంచాలి.
ఈ సాయంకాలానికి అర్ఘ్యం విడవడానికి కృష్ణా తీరం చేరాలి సుమా!”
“అటులనే రాకుమారా! గుర్రాల అవసరాలకి మాత్రమే ఆగుదాము.”
“ఇంకొక ముఖ్యమైన విషయం.. నన్ను ఇతరుల సమక్షంలో రాకుమారా
అని సంబోధించ వద్దు. మనిద్దరం మిత్రులము.” పురుషోత్తముడు గుర్రాన్ని
వేగిర పరచాడు.
“అటులనే మిత్రమా!” మాధవుడు కళ్యాణి పక్కలు సున్నితంగా
కాళ్లతో కొట్టాడు.
రెండు గుర్రాల డెక్కల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు
అక్కడ.
…………………
“ఇదే సరైన ప్రదేశం మిత్రమా! ఇక్కడే సంధ్యా వందనం చేసుకుని,
సమీపాన ఉన్న గ్రామంలో విశ్రమిద్దాము ఈ రాత్రికి.” కృష్ణ ఒడ్డుకు
కాకపోయినా, బెజవాడ దగ్గర్లో ఉన్న గ్రామం వద్దకి చేరారు మిత్రులిద్దరూ.
కృష్ణా నది నుండి తవ్విన కాలువ ఒకటి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం
చేస్తోంది. దట్టమైన వృక్షాలతో ఆ ప్రాంతం, నదీ తీరం కన్నులకింపుగా
ఉన్నాయి.
సంధ్య వార్చడానికింకా సమయం ఉన్నా, గుర్రాలు అలిసి పోయాయని
ముందుగా ఆగి పోయారు. అక్కడి ప్రకృతిని తనివితీరా ఆస్వాదించడం
ఒక కారణమైతే.. సమీపంలో మంచి గ్రామం ఉండుట మరొక కారణం.
గుర్రాలని కట్టేసి, అక్కడున్న మఱ్ఱి చెట్టు దగ్గరికి పరుగెత్తాడు మాధవుడు.
“అద్భుతం మిత్రమా! ఎంత రమణీయం ఈ ప్రకృతి.. రండి రండి..
సంధ్యకింకా సమయం ఉంది కదా! కొద్ది సేపు ఈ అందాలని ఆస్వాదిద్దాం..
తురగవల్గన రగడ కళిక:
సంజ వెలుగు చూడ నల్ల చాల సంత సంబు నుండు
*కంజ తావు నంత గానె కాచు గాద చల్ల గుండు
గూడు వదలి వెళ్లె గాద గువ్వ లన్ని కూడు కొఱకు
గూడు లోని కూనలన్ని పాట పాడు నమ్మ కొఱకు
అస్త మించు భాను డదియె నలల పైన తేలియాడు
వస్త నంటు చందురూడు వగలు తెలిపె కలువ చూడు.
ఆలమంద మేత నాపి యవికి జేర పయనమయ్య
పాలు త్రావ దూడలన్ని పరుగు పరుగు గెంతు లెయ్య.
ఒడలు పులక రించె గాద ఊడలున్న మఱ్ఱి చెంత
బెడద లన్ని వదలి వేసి వెడల గాను మనము సుంత.”
(కంజ= అమృతం)
రగడ పాడుతూ మాధవుడు నాట్యం చేయ సాగాడు. చెట్టుక్కట్టేసిన
గుర్రాలు కూడా తలలూపుతూ తై అంటున్నాయి.
పురుషోత్తముడు నవ్వుతూ వెళ్లి గుర్రాలని విప్పి, జీనులు తీసి
నిమర సాగాడు. గుర్రాలు.. యజమానిని పక్కకు తప్పించి హాయిగా
నాట్యం మొదలు పెట్టాయవి కూడా.
ఆహ్లాదంగా ఉంది వాతావరణం.
“ఏం మిత్రమా! ఆ పల్లె ప్రజల ప్రభావమా! రగడలందుకున్నావు?
మీ గురువు గారేమంటారో?” మేలమాడాడు పురుషోత్తమ దేవుడు.
మాధవునికి శ్రీనాధుని కవిత్వం ఇష్టమని ఆయన శిష్యునిగా
సంబోధిస్తుంటాడు.
“ఈ చల్లగాలిలో, సూర్యాస్తమయ కాంతులలో లయ ప్రాధాన్య కవిత
రావడంలో వింతేముంది మిత్రమా! జానపదాలకి రగడలు, ద్విపదలే
కదా సాధనాలు! ఇంక మా గురువుగారా.. వారు కూడా రగడలు వాడారు
కదా? శివరాత్రి మహాత్యంలో, కాశీ ఖండంలో..” మాధవుడు తీసి పోలేదు.
సమాధానాలు తయారుగా ఉంటాయి.
“నిజమే మిత్రమా! అదుగో.. సంధ్యా సమయం ఆసన్న మౌతోంది.
మనం ఆట పాటలు ఆపి కార్యక్రమం లోనికి ప్రవేశిద్దామా?”
ఇరువురూ తమతమ అశ్వాలకు సాంత్వన చేకూర్చి, స్నాన
సంధ్యాదులను పూర్తి చేసినంతలోగానే..
ఇరువురు ఆగంతకులు సమీపించారు వారిని.
“ప్రభూ! మీకు భోజన వసతులు ఈ కొండపల్లి గ్రామంలో ఏర్పాటు
చేశారు. ఈ రాత్రికి విశ్రమించి ప్రాతఃకాల మందే మీ ప్రయాణం కొన
సాగించ వచ్చు.” ఇద్దరిలో అధికారిలా ఉన్నతను అన్నాడు.
“మీరు..” మాధవుడు సందేహంగా అడిగాడు.
“మేం.. కపిలేంద్రుల వారి సైనికులం. గజపతుల రాజ్య సరిహద్దులు
దాటాక, మీకు తోడుగా, మమ్మల్ని ముందు వెనుకల వెడలమని
మహారాజుగారి ఆనతి. కోరుకొండ దాటినప్పట్నుంచీ వస్తున్నాము.
ఈ ప్రాంతం నుంచీ మీకు కొత్త కనుక బయటికి వచ్చి కనిపించాము.
రెడ్డి రాజుల చారులు, విజయనగర రాజుల వేగులు అన్ని ప్రాంతాల
కాచి ఉంటారు. జాగరూకతతో ఉండాలి.”
“ఎంత మంది ఉన్నారు మీరు?”
“నలుగురు మీకు ముందు, నలుగురు మీకు వెనుక. మీ వెనుక వారు
కొద్ది సమయంలో కలుస్తారు.”
“మీరు మా రాజ్యం వారని మాకు నమ్మకం ఎటుల?” మాధవుడు
చేతిని కత్తి ఒర మీద నుంచి అడిగాడు.
“ఇదిగో.. రాజుగారి ముద్రిక.” లో దుస్తుల్లోంచి జాగ్రత్తగా తీసి ఇచ్చాడు.
పురుషోత్తముడు కొద్ది దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు.
మాధవుడు రాకుమారుని వంక తిరిగి తల ఊపాడు.. సరే అన్నట్లు.
అశ్వాలకి అన్నీ అమర్చి, అధిరోహించి, సైనికులు దారి తియ్యగా
ముందుకి నడిచారు, స్నేహితులిద్దరూ.
కొండపల్లి గ్రామానికి వెళ్లే దారిలోనే ఉంది పూటకూళ్ల ఇల్లు. అక్కడ
అరుగు మీద కూర్చుంటే కొండ మీద నున్న కోట కనిపిస్తుంది. మామూలు
బాటసారుల వలెనే ఆహార్యం ఉంది కనుక, గజపతుల
రాకుమారుడని.. కాబోయే చక్రవర్తి అనీ, ఎవరికీ అనుమానం రాలేదు.
మాధవుడు, సైనికులు కూడా తమ తోటి ప్రయాణీకుని వలెనే పురుషోత్తముని
చూడ సాగారు. అందరివీ ఒకే రకం తలపాగాలు, దుస్తులు.
కోట వైభవం తగ్గినట్లు అనిపిస్తోంది. పెదకోమటి వేమారెడ్డి
హయాంలో ఒక వెలుగు వెలిగింది.. కొండవీటి కోటకి పోటీగా.
అంతఃకలహాలతో ప్రజాపాలన కూడా అంతంత మాత్రంగానే ఉంది.
ప్రజలు కొత్త సుంకాలు కట్టలేక అసంతృప్తులై ఉన్నారు.
“కొండవీటి రెడ్డిరాజుల వైభవం ఎందుకు పోయింది?” పురుషోత్తముడు
సైనికాధికారిని అడిగాడు. అతడు గజపతుల చారుడు కూడా.
“పెదకోమటి వేమారెడ్డి కొడుకు రాచవేమారెడ్డి అస్తవ్యస్త పాలన
వల్ల.. అతడికి రాజమండ్రీ రెడ్డిరాజులనెదుర్కోవడం సాధ్యం కాలేదు.
పైగా కనీ వినీ ఎరుగని సుంకాలతో ప్రజా కంటకుడిగా పేరు పొందాడు.
చివరికి అనూహ్యమైన రీతిలో ఒక మామూలు బలిజ వాని చేతిలో
చచ్చిపోయాడు.”
“అదేవిధంగా?” మాధవుడు అడిగాడు కించిత్ ఆశ్చర్యంతో.
“రాచవేముడు పురిటి మంచం మీద పన్ను వేశాడు. ఈ పురిటి పన్ను
వసూలు చెయ్య బోతుంటే, సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు
రాచవేముడిని పొడిచి చంపేశాడు. ఒక ప్రభువుని, సామాన్యుడు
చంపాడంటే.. ఆ రాజ్యం ఏ విధంగా దిగజారి పోయిందో తెలుస్తుంది.
అతడితోనే కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించింది. ముక్క చెక్కలయి,
అటు విజయనగరంలో కొంత, ఇటు రాజమండ్రీలో కొంత కలిసి
పోయింది. కొంత తెలంగాణాలో.. దేవరకొండలో కలిసింది. ఇది పొరుగు
రాజ్యాలకి ఒక పాఠం లాగ మిగిలింది.”
“మరి ఆ రాజుని ఆశ్రయించుకుని ఉన్న పండితులు, మంత్రులు,
సైన్యాధికారులు.. అందరూ ఏమయ్యారు?”
“ఏమౌతారు సామీ.. ఇతర రాజుల ప్రాపుకై వెళ్తారు. అదంత
సులభం కాదు. ఎక్కడైనా కొలువు దొరికే వరకూ నానా పాట్లు పడుతుంటారు.”
“భోజనానికి రండి స్వామీ. కాళ్లూ చేతులూ ప్రక్షాళన కానియ్యండి..”
పూటకూళ్ల ఇంటి వారి పిలుపు విని అందరూ లేచారు.
………………..
18 వ భాగం
“ఇంతకీ మిత్రమా! మనం కంచి ప్రయాణం ఎందుకో..” ఆపేశాడు
మాధవుడు. గుంటూరు దాటి పలనాడు ప్రవేశిస్తున్నారు పురుషోత్తముని
బృందం. వీరి దృష్టికి ఆనేట్లుగానే ముందూ వెనుకలుగా
పయనిస్తున్నారు అనుచరులు.
అనుకున్న సమయానికే, ప్రాతఃకాలమందే స్నాన పానాదులన్నీ
ముగించుకుని బయలుదేరారు.
కొండపల్లి పూటకూళ్ల ఇంటివారు ప్రయాణీకులకి ఆరోజుకి సరిపోయే
ఆహారం అరిటాకుల్లో కట్టి ఇచ్చారు, అర్ధం గ్రహించి. మినప రొట్టి,
నంజుకోను కొరివికారం. పులిహోర, బొబ్బట్లు. ఇంకా చాలా
ఇస్తామన్నారు కానీ.. పురుషోత్తముడు వద్దని వారించాడు.
“ఎప్పటి కప్పుడు నెచ్చట నైనను
అప్పము లచ్చటి వైని వలదనను
కప్పడి వలెనుం గన్పడ వలయును
ఒప్పుగ సాగుదు మూర్మి కలియజను.”
అశ్వాన్ని అధిరోహించిన పురుషోత్తముడు కాలితో సున్నితంగా
హయం మీద లయ వేస్తూ పాడాడు.
“మిత్రమా! మా గురువుగారి ప్రభావం మీమీద కూడా పడినట్లుందే!”
మాధవుడు పకాలున నవ్వుతూ అన్నాడు.
“ఆరునెలలు చాలు గదా వారు వీరవడానికి.. మరి ఇన్ని వత్సరముల
సాంగత్యం. ఇంతకీ నేను పాడింది రగడేనా?”
“సందేహమెందుకు దేవా? ఉత్కళిక మధురగతి రగడ. చక్కని లయ.
ప్రయత్నిస్తే మంచి కవి కాగలరు మీరు.”
“చూచెదము. ఈ రాచకార్యాలలో ఏ కాస్తయినా సమయం చిక్కవలె
కదా!” పురుషోత్తమ దేవుడు నిట్టూర్చాడు.
“కృష్ణా తీరానికీ గుంటూరు సీమకీ గల వ్యత్యాసాన్ని గమనించారా
మిత్రమా?”
చూశానన్నట్లు తల పంకించాడు పురుషోత్తముడు.
“అక్కడ, ఎక్కడ చూసినా పచ్చదనం. ఇక్కడ తుప్పలు, బీళ్లు.
అక్కడక్కడ మిరప, పత్తి పంటలు తప్ప తక్కినవేమీ కానరావు.”
మాధవుడు చేయి చాచి చుట్టూ చూపించాడు.
“ఇంకా, ఇంకా పలనాటి సీమలోనికి వెళ్తుంటే జొన్న చేలు తప్ప
ఏమీ ఉండవుట కదా?”
“అవును దేవా! అన్నీ మెట్ట భూములు. వర్షాలు తక్కువ. బావుల్లో
నీళ్లు పాతాళంలో ఉంటాయి. శ్రీనాధుల వారు కొన్నేళ్ల క్రితం ఈ సీమకి
వచ్చి చాలా కష్ట పడినట్టు చెప్తారు. విద్వన్మణులు కదా.. బాధనీ,
కష్టాన్నీ, సుఖాన్నీ, శృంగారాన్నీ కూడా తమ చాటువులలో
సెలవిస్తారు.” మాధవునికి మిత్రుడిని దేవా అని సంబధించడం ఇష్టం.
పేరులోనే ఉందికదా అంటాడు పురుషోత్తమ దేవుడు అభ్యంతర
పెట్ట బోతే.
“ఇంకేం మిత్రమా! వదలు కొన్ని శ్రీనాధుల వారి చాటువులను.
మనకి ప్రయాణపు బడలిక తెలియకుండా ఉంటుంది. అసలే వేడి గాలులు మొదలయ్యాయి.”
కం. “జొన్నకలి జొన్న యంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ బలినాటి సీమ ప్రజలందరకున్"
కొంచె విషాదంగా పాడాడు మాధవుడు.
“పలనాటి సీమని బలినాటి సీమ అన్నారు కవి.. ఆకలిలో కూడా
చమత్కారమే మహానుభావునికి.” రాకుమారుడు చిరునవ్వు నవ్వాడు.
“అంతే కాదు.. దీనికి తోడు, చింతకూరా, బచ్చలి కూరా కలిపిన
పులుసు నంజుకి. ఆ చేదు భరించలేక నీళ్లు తాగుదామంటే మంచి
నీటికి కూడా కరవే. అందుకే పరమశివుడిని నిందా స్తుతి చేశాడు.”
“నిందించాడా” ఆశ్ర్యపోయాడు పురుషోత్తముడు.
కం. “సిరిగల వానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.”
ఈ సారి నవ్వాపుకోలేక పోయారు ఇద్దరూ.
“సందర్భోచితంగా భలే అల్లుతారు పద్యాలు మీ గురువుగారు. అంతే
కాదు.. రసికుడనే వారెవరూ పలనాడు వెళ్లరనీ, వెళ్లినా అక్కడ
ఉండలేరనీ చెప్పి, గోదావరీ తీరానికి వెళ్లి పోయారుట.”
పురుషోత్తముడు నవ్వాపుకున్నాక అన్నాడు.
“అవును.. అసలే శృంగారానికి పేరొందిన వారు కద!”
అలసట తెలియ కుండా కబుర్లు చెప్పుకుంటూ పలనాటి
సీమ దాటేశారు.
పాకనాడు ప్రవేశించే సరికి అపరాహ్ణం దాటింది. గుర్రాలు కూడా
వేగం తగ్గించి ఈడుస్తూ వెళ్తున్నాయి.
ఒక గ్రామ పరిసరం కనిపించింది. అక్కడున్న సత్రం దగ్గరాగి,
గుర్రాలను శాలలో కట్టేశారు. అంతలో సైనికులందరూ కూడా వచ్చి,
రాకుమారునిదీ, మాధవునిదీ కూడా గుర్రాల పనిని వారు చూశారు.
కాస్త ఒడలు చల్ల బడుతుందని మిత్రులిరువురూ, పక్కనే ఉన్న
సెలయేరులో ఈతకి దిగారు. ఒక అరగంట నీటిలో సేద తీర్చుకుని,
ఒడ్డుకి వచ్చి పొడి దుస్తులు ధరించి.. సత్రం అరుగు మీద, తాము
తెచ్చుకున్న భోజనం తిని.. విశ్రమించారు.
“మిత్రమా..”
“తెలియును.. అర ఘడియ మాత్రమే కదూ?” నవ్వుకుంటూ కనులు
మూసుకున్నారు.
మూసుకున్నారు.
………………
“మనం నెల్లూరు మండలం దాటి వెళ్తాము కదూ సేనానీ?”
సైన్యాధికారిని అడిగాడు పురుషోత్తముడు.
“అవును దేవా! ఈ రాత్రికి అచ్చటనే విశ్రాంతి.”
“కందుకూరు, పైడిపాడు.. దారిలో ఏమైనా కనిపించునా?”
“కొంచెం దారి మళ్లాలి. అవసరమా ప్రభూ? అటులయిన
మనం వేగం కొంచెం పెంచాలి. హయములు హుషారుగానే ఉన్నాయి.”
“అచట మంచి వసతి గృహం ఉందని విన్నాను. వీలైతే రేపు
ఆగుదామక్కడ.” పురుషోత్తముడు గుర్రాన్ని అదిలించాడు.
“మిత్రమా! కందుకూరు వద్ద మండలాలన్నీ విజయనగరం
రాయల ఏలుబడిలో ఉన్నవి కదా? అక్కడ ఏమి కార్యమో
అడగ వచ్చా?” మాధవుడు గుర్రాల వేగం కొద్దిగా తగ్గాక
పక్కకి వచ్చి అడిగాడు.
“పలనాటి సీమ దాటాం కదా! నెల్లూరు సీమలో.. అందులో
కందుకూరు సన్న బియ్యానికి ప్రసిద్ధి. పైడిపాడు నేలే ప్రభువు
మైలార రెడ్డి మంచి ఆతిధ్యానికి పేరు పొందిన వాడు. ఎంత వేగిరం
వెళ్తే అంత మంచి భోజనం దొరుకుతుంది. అందుకనే..”
పురుషోత్తముడు గుంభనగా అన్నాడు, నవ్వు ఆపుకుంటూ.
మాధవుడు వింతగా చూశాడు మిత్రుడిని. తనకి తెలిసీ, ఆహారం
పట్టింపులేం లేవు రాకుమారుడికి.
మైలార రెడ్డి, విజయనగరం రాజు సామంతుడు. దేవ రాయలకు
అనేక యుద్ధాలలో సహాయం చేసి, చాలా మందికి భూదానా
లిప్పించాడు.
రాజకీయాలకు అతీతంగా దానధర్మాలకు ప్రసిద్ధి చెందిన వాడు.
చేయి చాచినవాడిని కాదనడని ప్రతీతి. రాజ్యాలందరూ పాలిస్తారు
కానీ, తమ కీర్తిని తమకు తెలియకుండానే దూరతీరాలకు వ్యాపింప
చేసుకునే వాళ్లు అరుదు. మైలారరెడ్డి గురించి గజపతుల రాజ్యం
వరకూ వెళ్లిందంటే ఆశ్చర్యమే మరి.
“ప్రభూ! పైడిపాడు చేరాము.” సేనాని కనిపిస్తున్న పట్టణాన్ని
చూపించి అన్నాడు.
“సంధ్యా సమయం ఆసన్న మౌతోంది. ఏదైనా వసతి గృహం వద్దకు
చేరితే సంధ్యా వందనం చేసుకుని విశ్రమిద్దాము. చెరువో, కాలువో
ఉంటే మరీ మంచిది.” పురుషోత్తముడు ఆదేశ మిచ్చాడు.
“ఇచ్చట ప్రభువు, బాటసారులకి చక్కని ఏర్పాట్లు చేశారు దేవా.
మనం నేరుగా అక్కడికే వెళ్లిపోవచ్చు. ఆనుకునే చక్కని కొలను
కూడా ఉంది. పక్కనే రామాలయం.”
“ఇంకేం మరి.. ఆలోచనెందుకు?”
విన్నదానికంటే ఆహ్లాదంగా ఉందక్కడి వాతావరణం. పరిసరాలు
ప్రశాంతంగా ఉన్నాయి.
సాయం సంధ్య కార్యక్రమం చేసుకుని, ఆలయం లోనికి వెళ్లి
రాకుమారుడు పూజలు చేసుకుని వచ్చాడు, మిత్రుడు వెంట రాగా!
“ఇంకా అర ఘడియలో వడ్డన చేస్తామని చెప్పమన్నారు సామీ!”
రాజుగారి వసతి గృహం నుంచి వార్తాహరుడు వచ్చి చెప్పాడు.
పట్టణంలో ప్రవేశించగానే సైనికులు అశ్వాలని శాలకి తీసుకు వెళ్లారు..
వాటి సదుపాయం చూడడానికి.
“ఈ సీమలో బాటసారుల బాగోగులు చక్కగా చూస్తున్నారు మాధవా!
మన పర్యటనలో గమనించ వలసిన ముఖ్య విషయం.. మనం ఆచరించ
వలసినది కూడా.”
“కళింగ దేశంలో కూడా, చక్కగా ఉన్నాయి మిత్రమా! చెప్పాలంటే,
ఇచ్చటి వాటి కంటెనూ బాగుగా. మనకి కాశీ యాత్రికులు అధికంగా
వస్తుంటారు.. దీర్ఘ ప్రయాణాలు చేస్తూ.. మీకు అచ్చట పూటకూళ్ల
గృహానికి రావలసిన అవసరం లేదు కనుక తెలియక పోవచ్చు..”
మాధవుడు వివరించాడు.
“అవునవును.. నేను మాటలాడుతున్నది వసతి గృహం
యజమానితో.. ఆ మాటే మరచాను సుమా!” నవ్వుతూ
అన్నాడు పురుషోత్తముడు.
మాధవునికి ఒక్కొక్క సారి ఆశ్చర్యం కలుగుతుంటుంది..
తన జీవితం ఏ విధంగా సాగుతోందో చూస్తుంటే. విధి వ్రాసిన
రాతలు ఎంత వింతగా ఉంటాయో..
చిన్ననాటనే తల్లిదండ్రులను దూరంచేసి నందుకు నిలదియ్యాలా?
కర్కశకుల కంట పడకుండా తప్పించి, ప్రేమ ఆప్యాయతలు
పంచే కుటుంబాన్నందించి నందుకు మొక్కాలా? ఇప్పుడు
రాకుమారునితో ఈ స్నేహం, యీ చనువు ఎందుకు ఏర్పడ్డాయో,
ఎంత ముందుకు తీసుకొని వెళ్తాయో? ఆ విధి విలాసం ఏమిటో..
వేచి చూడ వలసిందే అనుకున్నాడు మాధవుడు.
రాజులతో అతి చనువు పనికి రాదని కన్న తల్లి చెప్పిన
పాఠం గుర్తుకొచ్చింది. అనుక్షణం రాజుని వెన్నంటి ఉన్న
కన్న తండ్రి, రాజుతోనే అసువులు కోల్పోయాడు.
అయినా ఏదీ తప్పించలేరు మానవ మాత్రులెవరూ!
రాచ కుటుంబంతో సన్నిహితత్వం తాను కావాలనుకుంటే
వస్తుందా, వద్దనుకుంటే పోతుందా?
“మిత్రమా! మనం రేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాము.
నాకు ఈ పరిసరాలు బాగా నచ్చాయి. రేపంతా కోనేటి స్నానం,
రాముల వారి ధ్యానం. ఎల్లుండి ప్రాతః కాలమందే పయనం
సాగిద్దాము. పద.. పద. క్షుద్బాధ అధికమవుతోంది. శాంతింప
జేయాలి దేహాన్ని ముందు.”
భోజనం అయాక ఆరుబయట అరుగు మీద కూర్చున్నారు,
పురుషోత్తముడు, మాధవుడు, ఆ వసతి గృహం యజమానీ!
తాంబూల సేవనం అవుతోంది. చల్లనిగాలి సేద తీరుస్తుంటే,
పున్నమి సమీపిస్తోందేమో.. పలుచని వెన్నెల పరచుకుంటోంది
ప్రాంగణ మంతా.
“సామీ! ఎందాకా పయనం?” యజమాని అడిగాడు.
“కాంచీ పురం వరకూ. ఇక్కడే.. ఆరుబయట నిదురిస్తే
ఎంత హాయి..”
“అట్లానే సామీ! ఇక్కడ దొంగల భయాలేంలేవు. హాయిగా పండచ్చు.
ఈ గృహంలోని వారు చాలా మంది పండుకుంటారు.” గృహ
యజమాని చెప్తుండగానే, మాధవుడు లేచి లోపలికి వెళ్లాడు,
రాకుమారునికి పానుపు గురించి అనుచరులకి చెప్పాలని.
తరువాతి ప్రయాణానికి కూడా కాస్త సరుదుకోవాలి..
“కొంచెం ప్రధాన రహదారికి పక్కకి ఉంది కదా.. మీ పట్టణానికి
కూడా బాటసారులు వస్తుంటారా తరచుగా?”
“వస్తారు స్వామీ! మా రాములోరు ఈ పరగణాలో ప్రసిద్ధి
చెందినోరు. గుడికి వస్తుంటారు చుట్టు పక్కల గ్రామాల వారు.
శ్రీరామనవమి తొమ్మిది దినాలూ ఉత్సవాలు చేస్తాము. అప్పుడు
పందిట్లో హడావుడే హడావుడి. యక్షగానాలు, హరి కథలు..
ఒకటేమిటి. అందరికీ భోయనాలు రాజుగారే!” వసతి గృహయజమాని
గర్వంగా చెప్పాడు.
“అంత ఐశ్వర్య వంతమా ఈ ప్రాంతం?”
“అవును సామీ. మూడు రకాల పంటలు పండుతాయి ఏటికేడూ.
ఇంక పాడి చెప్పనక్కర్లేదు. అదంతా శ్రీరాముల వారి వంటి
మా రాజు మహత్యం. వారు బ్రాహ్మణులను, పేదవారినీ ఆదరిస్తున్న
ఫలం. రాయల వారితో చెప్పి వారి రాజ్యం లోనే కాక బైట
కూడా అగ్రహారాలిప్పించారు. నిత్యం ఇంత మంది ప్రజల
ఆశీస్సులనందుకుంటుంటే, మరి ఆ దేవుడు కూడా మంచి
చూపు చూస్తాడు కదా!”
“నిజమే. రాజు యోగ్యుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.”
పురుషోత్తముడు సాలోచనగా అన్నాడు. దేశాటన వల్ల ఎన్ని
అనుభవాలు.. ఎన్నెన్ని కొత్త విషయాలు గ్రహించ వచ్చు..
ప్రజలలో ఉండే మంచి పేరే శ్రీరామరక్ష ప్రభువుకి.
“అంతే కాదు సామీ.. మా రాజు గారు ఎందరికో దిన
వెచ్చాలు ఏర్పాటు చేశారు. చేస్తున్నారు.”
“దిన వెచ్చాలా? దేనికి?”
“బ్రతికి చెడిన వారికి. పండితులు, కవులు.. ఇదివరకు
పతనమైన రాజాశ్రయాలలో వైభోగం అనుభవించిన వారు,
సలహా దారులు.. ఎవరైనా ఆశ్రయిస్తే చాలు, వారి ఆకలి పోగొడతారు.
వారు ఏ పనీ చెయ్యలేరు కదా! మా వసతి గృహంలోనే ఒక
మహానుభావులున్నారు. ఎన్నో కావ్యాలు గ్రంధాలు రాశారు.
మహాకవిట. కొండవీటి రెడ్డిగారి దగ్గరో వెలుగు వెలిగారట.
వారికి దిన వెచ్చాలిస్తున్నారు మా రాజుగారు. వారి అనుచరుడు
వండి పెడుతుంటాడు. త్వరలో శ్రీశైలం వెళ్తారుట. వారు
ఎక్కడా ఎక్కువ రోజులుండలేరని అందరూ చెప్పుకుంటారు.
కాశీఖండం అనే కావ్యం రచించి విశ్రాంతి కోసం ఇక్కడ
ఉందామని వచ్చారుట.” యజమాని ఇంక లేవడానికి
ఉద్యుక్తుడై అన్నాడు.
“కాశీ ఖండమా?” పురుషోత్తముడొక్క సారి ఉలిక్కి పడి
లేచాడు.
“అవును సామీ! ఇక్కడ అందరికీ అప్పుడప్పుడు తన
కావ్యాలు వినిపిస్తుంటారు కూడా.” అంత ఆశ్చర్య పోవలసిన
సంగతేమిటో అర్ధం కాలేదు యజమానికి.
“వారిని మేము కలుసుకోవచ్చా?”
“మహ చక్కగా కలవచ్చు. ప్రాతఃకాల విధులు నిర్వర్తించుకుని,
వారు ఆలయంలో రావి చెట్టుకింద అరుగు మీద కూర్చుని కొలువు
తీరుతారు. అప్పుడు వారి వంటివారే అందరూ వచ్చి చర్చలు
చేస్తుంటారు. ఆ చర్చల ద్వారానే తెలిసింది, వారు శ్రీశైలం
వెళ్ల బోతున్నారని.”
పురుషోత్తమునికి లిప్త మాత్రం పట్టింది కర్తవ్యం నిర్ణయించడానికి.
“మా మిత్రునికీ విషయం చెప్పవద్దు. రేపు కవిగారిని కలిసి
మేం ప్రయాణమౌతాము. రెండు రోజులకీ మీరు మాకు వసతి
సదుపాయాలు చూసి రొక్కం చెప్తే మాధవుడిచ్చేస్తాడు.”
“అట్లాగే సామీ! ఆ సామికి చెప్తా లేవగానే మీ సంగతి.”
“ఎవరు మిత్రమా ఆ సామి?” అప్పుడే ఏర్పాట్లు ముగించుకుని
అక్కడికి వచ్చిన మాధవుడు అడిగాడు.
“ఎవరో.. రాజుగారికి ఆప్తుడట. దేశాటనలు బాగా చేస్తారని
చెప్తున్నారు. మనకి దిశా నిర్దేశం చేస్తారని, రేపు కలుద్దా
మనుకుంటున్నా.”
……………….
19వ భాగం.
“మాధవా! మనం వేగిరం ప్రాతః కాల సంధ్యాదులు పూర్తి చేసుకుని,
చక్కని దుస్తులు, ఉత్తరీయం ధరించి తయారవాలి. ఇవేళ ఒక విశిష్ట
వ్యక్తిని కలువ బోతున్నాము.” తొలి కోడి కూసిన వెను వెంటనే
మాధవుడిని నిదుర లేపాడు పురుషోత్తముడు.
మాధవుడు, తను చేయవలసిన పని రాకుమారుడు చేస్తున్నందుకు
సిగ్గు పడుతూ లేచి మిత్రునికి అభివాదం చేసి, ఇరువురి పడక బట్టలనూ
సరి చేసి, వసతి గృహంలో పెట్టి వచ్చాడు.
బావి వద్దకేగి కాలకృత్యములు తీర్చుకుని ఏటి ఒడ్డునకేగారు
మిత్రులిరువురూ.
పచ్చపచ్చని వరిచేల అందాలనీ, భానోదయానికి స్వాగతం
పలుకుతూ ఎర్ర తివాసీ పరచినట్లున్న ఆకాశాన్నీ చూస్తూ
పరవశమౌతూ, ఆదిత్యహృదయం చదవసాగాడు మాధవుడు.
అది గౌతమి నేర్పిన అలవాటు. స్నానం పూర్తి అవుతూనే
అసంకల్పితంగా “రశ్మిమంతం సముద్యంతం..” అని మొదలు పెట్టేస్తాడు.
పురుషోత్తముడు ధ్యానం చేస్తున్నాడు.
సూర్యోదయం అవుతుండగానే ప్రత్యక్ష నారాయణ మూర్తికి అర్ఘ్యం
అర్పణ చేసి, దుస్తులు మార్చుకుని, ఆలయానికి వెళ్లి, శ్రీరాముని
దర్శనం చేసుకున్నారు.
జగన్నాధుని భక్తుడైన పురుషోత్తముడు విష్ణు ఆలయం చూస్తే
మైమరచి పోతాడు.
ఆ దిప్యమంగళ విగ్రహాన్ని చూసి తరించి ఆలయం బయటికి
రాగానే కనిపించిందొక సుందర దృశ్యం.
చెట్ల ఆకుల మధ్యలోనుంచి సూర్యకిరణాలు ఆలయ ప్రాంగణ మంతా
పరుచుకున్నాయి.
ఆలయమంతా , తెల్లవారకుండానే భక్తురాళ్లు వచ్చి తీర్చిదిద్దిన
రంగవల్లులతో కళకళలాడుతోంది.
నేలరాలిన పొగడపూలని కూడా రంగవల్లుల్లాగ తీరుగా, అందంగా
దిద్దారు వనితలు. వాటినుంచి వచ్చే తేలికైన పరిమళం ఆహ్లాదాన్ని
కలిగిస్తోంది.
వసతి గృహ యజమాని చెప్పినట్లుగానే అక్కడ, చెట్టు కిందనున్న
అరుగు మీద ఆసక్తి కరమైన సాహిత్య చర్చ సాగుతోంది.
సీ. మబ్బు ల చాటున మఱుగున దాగిన
వెలుగు ఱేడు యతడు వేగ రాగ
వేద పండితులంత వీధరుగున చేరి
పఠనము సేయగ పనస లన్ని
కవిసార్వభౌముడు గంగాధరుడికిని
యభిషేకము సలిపి యనువు నెంతొ
కొలువుతీరె నపుడె కోవెల నందున
సాహిత్య చర్చలే సలుప గాను
తే.గీ. చేరి కవులు, కోవిదులంత చేరికగను
మారు పలుకక కవిరాజు మాట లన్ని
కోరి వినుచు తామంతయు కూర్మి తోను
భూరి పదములే కదయని పొగుడు నంత.
రాగయుక్తంగా వినవస్తున్న సీస పద్యాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ,
పరిసరాలను పరికించడం మాని అటు పక్కగా చూశాడు మాధవుడు.
సంభ్రమంగా కన్నులు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు
ఐదు క్షణాలు.
“మిత్రమా! శ్రీనాధుల వారు.” మాధవుడు చిన్నగా అరిచాడు
ఉద్వేగంతో.
“నీకెలా ఎరుక మిత్రమా?” ఆశ్చర్యపోతూ అడిగాడు
పురుషోత్తముడు. తాను మిత్రుడిని తక్కువగా అంచనా వేశాడు..
అతడికి చాలా విషయాలు తెలుసు.
“వారి చిత్రపటం నావద్ద ఉన్నది రాకుమారా! ఒక సారి కాశీ
యాత్ర కేగుతున్న పండితులొకరు నాకు ఇచ్చారు. తేలికగా
గుర్తుపట్టేశాను.”
మిత్రునికి శ్రీనాధ కవీంద్రుని చూపించి ఆశ్చర్యాంబుధిలో
ఓలలాడిద్దామని సంబర పడిన పురుషోత్తమునికి కించిత్
ఆశా భంగం కలిగినా, మాధవుని గ్రహణ శక్తికి ముచ్చట
పడకుండా ఉండలేక పోయాడు.
“కొద్దిగా చిక్కారు, చిత్రపటం కన్నా. అయినా ఆ ఠీవి,
ఆ గాంభీర్యం వేరెవరికుంటాయి చెప్పండి. తారల మధ్య
చంద్రునిలా వెలిగి పోతున్నారు పండితుల మధ్య. వీరినేనా
చూపిస్తానన్నారు? అందుకేనా మనం ఇచ్చట మజిలీ చేశాము..”
సంభ్రమానందాలతో ఏక బిగిన ముచ్చటిస్తున్న మాధవుని
చిరునవ్వుతో వారించాడు పురుషత్తమ దేవుడు.
“నాకు కూడా తెలియదు మిత్రమా! వారు దేశాటనలో ఉన్నారని
మాత్రమే తెలుసు. గృహ యజమాని నిన్న రాత్రి చెప్పగానే నాకు
కూడా విస్మయం కలిగింది. ఈరోజు వారిని కలవడానికనే ఇక్కడ
ఆగుదామన్నాను. కలుసుకున్నాక నీ సంతోషాన్ని
చూద్దామనుకున్నాను. ఈలోగానే..”
“ధన్యుడిని మిత్రమా! ఇంత భాగ్యం కలిగించావు. ఎప్పుడెప్పుడు
వారిని కలిసి నాలుగు మాటలు వారి నోట విందామా అని ఆతృతగా
ఉంది.” మాధవుడు ముకుళిత హస్తాలతో అన్నాడు.
“మనం కూడా వెళ్లి వెనుక వరుసలో కూర్చుని వీక్షిద్దాం.”
పురుషోత్తముడు దారి తీశాడు.
మాధవుడు ఏదో లోకంలో ఉన్నట్లుగా మిత్రుడిని అనుసరించాడు.
అతడికి ఇంకా నమ్య శక్యంగా లేదు. తల చిరకాల వాంఛ
నెరవేర బోతోందా? శ్రీనాధ మహాకవిని ప్రత్యక్షంగా చూస్తున్నాడా?
కళ్లు మాటి మాటికి చెమరుస్తున్నాయి. తనతో మాట్లాడుతారో
లేదో.. చూడగానే ఏమనాలి?
వెనుక వరుసలో గురువుగారి మోము కనులకు బాగా ఆనేలాగ
కూర్చున్నారు. తన్మయత్వంతో వీక్షిస్తూ కూర్చున్నాడు మాధవుడు.
కలలో లాగ వినిపిస్తున్నాయి వారి పలుకులు.
“ప్రౌఢ దేవ రాయల కొలువులో, డిండిమభట్టుతో వాదన చేయు
సమయంలో మీకు ఏమనిపించింది మహా కవీ?” ఒక పండితుడు
కుతూహలం తో అడిగాడు.
“శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసి నప్పడు, రచించిన కావ్యాలలో
ఏ దోషమూ లేదన్న ధీమా ఉన్నపుడు ధైర్యంగా ఉంటుంది
పండిత వర్యా! మన కున్నది అంతా సరస్వతీ కటాక్షం, ఆ పరమేశ్వరుని
అనుగ్రహం అనుకున్నపుడు ఏ ఆందోళనా ఉండదు. గౌడ
డిండిమభట్టులవారు ఉద్దండ పండితులు. వారితో వాదించ గలిగే
అవకాశం దొరకడమే నాకు అపురూపం.” శ్రీనాధుని పలుకులలో
ఎంతో వినయం.
“సెలవు కవీశ్వరా! మరల రేపు సమావేశ మవుదాము.” ఒకాయన
సైగ అందుకుని, పండితులు లేచారు.
“చెప్పలేను పండితులారా! రేపే శ్రీశైలం పయనమవుదామనుకుంటున్నాము,
ఆ మల్లిఖార్జునుని ఆనతి కలుగుతే..” శ్రీనాధుని మాటలకు విచారంగా
చూశారందరూ. ఒక్కొక్కరే వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, భారమైన
హృదయాలతో అక్కడి నుంచి కదిలారు.
అందరూ కదలి వెళ్లాక, వెనుక వరుసలో కూర్చున్న మిత్రులిరువురూ
లేచారు.
ఇద్దరినీ దగ్గరగా రమ్మని సైగ చేశాడు శ్రీనాధుడు. దగ్గరగా వెళ్లి
పాదాభివందనం చేశారు. చెరో పక్కనా కూర్చోమని చెప్పి, పరీక్షగా
మొహాల్లోకి చూశాడు కవీంద్రుడు.
“ఇంతవరకూ మిమ్ములను ఇచ్చట చూడలేదు. ఎవరు నాయనా?”
కొద్దిగా వణుకుతున్నట్లున్న కంఠం.. అయినా ఝంకారం తగ్గ లేదు.
“బాటసారులం కవి సార్వభౌమా! కళింగ నుంచి కాంచీపురం వెళ్తూ
మధ్యలో మజిలీ చేశాము.” పురుషోత్తముడు జవాబిచ్చాడు.
“కళింగ దేశమా? మీరు బాట సారుల వలె లేరే? కార్యార్ధులై
సాగుతున్నట్లున్నారు. మోముల్లో రాచకళ ఉట్టి పడుతోంది.
ఈ కుర్రవాడు వంగ దేశస్తుని వలే ఉన్నాడు. గజపతులు
రాజమహేంద్రవరం స్వాధీన పరచుకున్నారా?” శ్రీనాధులవారు
ఇంకా ఏదో అడుగుతుంటే..
అప్పుడని పించింది పురుషోత్తమ దేవ, మాధవులిద్దరికీ..
అనవసరంగా ఈ మహానుభావుని కదిలించామా అని.. తమ పర్యాటన
రహస్యం బట్ట బయలైపోతుందేమో అని..
మ్లాన వదనాలతో సమాధానాలు ఇవ్వ బోయారు.
కానీ.. ఆ మహాకవి..అర్ధ శతాబ్దంగా రాజకీయానుభవాలతో
తలపండిన వాడు.. ఆ మాత్రం గ్రహించలేడా! మాట మార్చేశాడు.
“ఎవరైతేనేమిలే నాయనలారా! తెలుగు సాహిత్యం మీద
మీ అభిరుచి శ్లాఘనీయం. పరాయి భాష వారై ఉండీ తెలుగు
కవిని గుర్తు పెట్టుకున్నారంటే, నన్ను చూడడానికి వచ్చారంటే..
అభినందనలు అంజేయాలిసిందే. రాజకీయాలకీ, సాహిత్యానికీ
ముడి వెయ్య కూడదు. గజపతులకీ, రెడ్డి రాజులకీ, విజయనగర
రాజులకీ, రాచకొండ వారికీ, బహమనీ సుల్తానులకూ జరిగే
నిరంతర పోరులకూ మన తెలుగు సాహితీ మాతకీ సంబంధం
లేదు..” ఆయాసంతో ఆగి, పక్కనున్న రాగి పాత్రతో నీరు కంఠంలో
పోసుకుని గడగడా తాగారు శ్రీనాధ కవి.
“స్వామీ!” కంగారుగా లేవబోయాడు మాధవుడు.
ఆందోళన వలదన్నట్లు చెయ్యి అడ్డంగా ఊపి గంభీర కంఠంతో
చెప్ప సాగాడు శ్రీనాధుడు.
“నేనొక సారి కొండవీటి ప్రభువు రాయబారిగా రాచకొండకు
బయలు దేరాను. ఆ సమయంలో రెండు రాజ్యాల మధ్య పచ్చగడ్డి
వేస్తే భగ్గుమనేది. నేను విజయనగరంలో ఉన్నాను. మా ప్రభువు
అస్వస్థులై ఉన్నారు కూడాను. కృష్ణలంకలో, నది ఒడ్డునకు
మా కోమటి వేమ ప్రభువు కులదైవం కటారిని (కత్తి) తీసుకు వెళ్లారు
మా సైనికులు, ప్రక్షాళన చేయుటకు.. ఆ కటారిని,
మా సైనికులనోడించి, రాచకొండ సైనికులు తీసుకొని పోయారు.
సింగభూపాలుని మెప్పించి ఆ కటారిని తిరిగి తేవలసిన బాధ్యత
నాకు ఇచ్చారు ప్రభువు. ” శ్రీనాధుని గొంతు గద్గదమయింది..
పాత జ్ఞాపకాలు ముసురు కోగా!
ఈ విషయాలు శ్రోతలిద్దరికీ తెలియనివే.. అవి జరిగినప్పుడు
చిన్న పిల్లలు వారు. గురుకులంలో విద్యాభ్యాసం జరుగుతున్న
కాలం. రాజకీయాలు పట్టించుకునే సమయం లేదు. అర్ధం చేసుకునే
వయసు కూడా లేదు.
“నేను తిరిగి రాగానే, విషయం తెలిసింది. అమాత్యుల వారికి
చెప్పి బయలు దేరాము.. నేనూ, దుగ్గనా. దుగ్గన అంటే మా
బావమరిది. మంచి కవి కూడా. ఆ సమయంలో రాచకొండనేలే
సింగ భూపాలుడేమన్నారో తెలుసా?
‘వైరం సమరమందే. సాహిత్యమందు సామరస్యమే.’
ఈ వాక్యమే నేను అనుక్షణం మననం చేసుకుంటూ ఉంటాను.
రాజమండ్రీ రెడ్డి రాజుల ప్రాపు కేగినపుడు, విజయనగరం ప్రౌఢరాయల
సహాయం అర్ధించినపుడు, రాచకొండ వారి వద్ద, కన్నడ దేశంలో
ఎక్కడైనా నాకు ఆకలి తీర్చేది, చేపట్టిన కార్యం
సానుకూలమయేట్లుగా చూసిందీ సాహిత్యమే. అందుకే నేను
మరణ సమయంలో కూడా కవిత్వం వదల కూడదని
నిశ్చయించుకున్నాను.”
శ్రీనాధుల వారి పలుకులనూ వింటూ, వారిని చూస్తుంటే మాధవునికి
ఒక పక్క సంతోషమూ, ఇంకొక పక్క విచారమూ కలిగాయి.
చేతులకి కంకణాలతో, మెడనిండా ముత్యాల, బంగరు మాలలతో,
జరీ పట్టు పంచలతో వెలుగొందిన కవీంద్రులు.. దిన వెచ్చాలతో
కాలం గడపటమా! పైకి కనిపించడం లేదు కానీ, దుస్తులు
శిధిలావస్థలో ఉన్నాయి.
“ధన్యులు మహాకవీ తమరు. కవిత్వానికి తనువు, మనసు
అర్పించగలగడం ఎందరికి సాధ్యమవుతుంది?” సంభాషణ
అంతా పురుషోత్తమ దేవుడే కొన సాగిస్తున్నాడు.
“నా సంగతి సరే.. మీ విషయం ఏమిటి? నేను మీ రాజకీయాల
గురించి అడగటం లేదు. తెలుగు భాష, అందులో కవిత్వం,
పద్యాలు.. మీ వరకూ ఏ విధంగా చేరేయా అని. పైగా మీ
మాతృభాష కూడా కాదు. ఇదే నిజమైతే నిజంగా
ఆనందించవలసిందే!”
“నూటికి నూరు పాళ్లు నిజం గురువుగారూ! మాతృభాష కాదు కానీ,
అక్షరాలు దిద్దాక, మేము నేర్చుకునే నాలుగు భాషల్లోనూ తెనుగు
తప్పకుండా ఉంటుంది. మా మాధవుడికి మీ కావ్యాలలో చాలా
పద్యాలు కంఠస్తం. మా కళింగ దేశంలో మీ శృంగారనైషధం
పండితుల చర్చల్లో ముఖ్యాంశమైతే.. భీమఖండం, క్రీడాభిరామం
పద్యాలు, ద్విపదలు, రగడలు పాటకజనం నోళ్లలో నిత్యం
నానుతూంటాయి.”
పురుషోత్తముని మాటలకి శ్రీనాధ మహాకవి పరమ సంతోషంతో
ఉప్పొంగి పోయారు.
ఏ కవికయినా అంత కంటే కావలసినది ఏముంటుంది? వంద
కనకాభిషేకాల పెట్టు పాఠకాదరణ.
“ఏముంది నాయనా! కావ్యాల పేర్లు ఉచ్ఛరించడం ఏమంత
కష్టమయిన పని?” బింకంగా అన్నారు శ్రీనాధుడు.
మనసులో సంతోషపడుతూనే..
పురుషోత్తమునికి అర్ధమవుట లేదు.. ఏ విధంగా కవి
సార్వభౌములని నమ్మించగలమా అని మాధవుని వంక చూశాడు.
మాధవుడు ఇంకా సంభ్రమం నుంచి తేరుకోనట్లుగా తేర పారి
చూస్తున్నాడు, శ్రీనాధుడిని.
“మాధవా! గురువుగారేదో అంటున్నారు వింటున్నావా?
వారి కావ్యాలేమి చదివావూ? చాటువులు ఏం విన్నావు అని
అడుగుతున్నారు.” మాధవుని భుజం తట్టి అన్నాడు పురుషోత్తముడు.
అంతే..
ఒక్క సారిగా కంఠం సవరించి.. గొంతెత్తి రాగయుక్తంగా
అందుకున్నాడు మాధవుడు. అతని గొంతులోనుండి
రాగఝరి ప్రవహించ సాగింది.
ఆలయ ప్రాంగణంలో మనుషులు, పక్షులు, ఉడతలతో సహా
నిలిచి విన సాగారు.
“చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు
రచియించితి మరుత్తరాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యవ్వనమున
శాలివాహన సప్తశతి నుడివితి
సంతసించితి నిండు జవ్వనమునను
హర్షనైషధ కావ్యమాంధ్ర భాష
బ్రౌఢ నిర్భరవయః పరిపాకమున గొని
యాడితి భీమనాయకుని మహిమ
బ్రాయ మెంతయు మిగుల గైవ్రాలకుండ
గాశికా ఖండమను మహా గ్రంధమేను
దెనుగుజేసెద గర్ణాట దేవకటక
పద్మనవహేళి శ్రీనాధ భట్ట సుకవి.”
అక్కడితో ఆప లేదు మాధవుడు. శృంగార నైషధము
నుండి, భీమ ఖండం నుంచి.. వరుసగా సీస పద్యాలు, రాగాలు
మార్చి వినిపిస్తూనే ఉన్నాడు.
చివరికి శ్రీనాధుల వారే నవ్వుతూ ఆపమని, మాధవుని చెయ్యి
పట్టుకునే వరకూ సాగింది కవితా ఝరి.
“గురువుగారూ, మీ కాశీ ఖండం నుంచి కూడా..”
“ఇంక చాలు నాయనా. అపరాహ్ణం సమీపిస్తోంది. భోజన సమయం..
పద్యాలను మించి నీ గానం అలరిస్తోంది. కానీ వీనులతో పాటుగా,
జఠరాగ్నిని కూడా శాంత పరచాలి కదా! మిమ్ములను కలిసి
నందుకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. మీరు కార్యార్ధులు.
మేము దేశాటన చేయు వారం. ఇరువురి మార్గాలు వేర్వేరు. మరల
ఎప్పటికైనా కలువ గలమో లేదో.. ఆ పరమేశ్వర కృప.”
శ్రీనాధుల వారు లేచారు.
పక్కనే ఉన్న అనుచరుడు చెయ్యందించాడు.
“గురుదేవా!” మాధవుని పిలుపు విని వెను తిరిగారు.
చెయ్యి పట్టుకుని వారిని అక్కడున్న అరుగు మీద కూర్చుండ
బెట్టారు మిత్రులిరువురూ.
“మా చిరు కానుకను స్వీకరించ వలసినదిగా కోరుతున్నాము.
అన్యధా భావించ వలదని మనవి.” పురుషోత్తమ దేవుడు
నూరు బంగారు నాణాలు, పట్టు వస్త్రములు కల ఒక సంచీని,
కొన్ని ఫలములతో, ఒక పళ్లెరమున పెట్టి సమర్పించి, సాష్టాంగ
నమస్కారము చేశాడు.
మాధవుడు కూడా కొన్ని నాణములు, వస్త్రములు ఇచ్చాడు.
దూర ప్రయాణం చేయునపుడు రాకుమారుని పరివారం ఆ మాత్రం
ధనం, వస్తువులు తెచ్చుకోవడం సాధారణమే.
శ్రీనాధుడు సంతసించి, యువకులనిద్దరినీ ఆశీర్వదించి ఉత్సాహంగా
తమ నెలవునకేగారు.
ప్రతిభకి పట్టం కట్టినపుడు, ఏ కవికైనా బహు సంతసమే కదా!
………………
20 వ భాగం.
“మిత్రమా! అదిగో కాంచీ పురం. చాలా పురాతనమైన పట్టణం.
మహా భారత కాలం నుంచీ ఉందని చెప్తారు. ఇక్కడ ఉన్న ఆలయాలు
బహు ప్రసిద్ధాలు. మన విడిది ఏర్పాటు అయిందా? ఇంతకీ..
ఇంత దూరం ఎందుకొచ్చామో?” మాధవుడు, కళ్యాణిని
రాకుమారుని అశ్వం పక్కగా నడిపిస్తూ అడిగాడు.
“అవును మిత్రమా!
‘పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి’
అని పేరుపొందింది ఈ పట్టణం. మోక్ష విద్యకు మూల పీఠం.
అద్వైతమునకు ఆధారం. ఆదిశంకరులు స్థాపించిన కామకోటి
పీఠ స్థానం. వరదరాజస్వామిని ఎప్పుడెప్పుడు సేవిస్తానా అని
ఉర్రూతలూగుతోంది నా మనసు.”
“కంచికెందుకు…”
ఇంక మాధవుని సందేహానికి సమాధానం చెప్ప వలసిందే
అనుకున్నాడు పురుషోత్తమ దేవుడు.
పకపకా నవ్వాడు.
“విజయనగర రాజు, దేవరాయల సామంతుడైన కాంచీపుర
రాజునకు చక్కని చుక్క అయిన కుమార్తె ఉంది మిత్రమా!
పేరు పద్మావతి. రుక్మిణీ దేవి, శ్రీకృష్ణుని గురించి విని, ఆయన
చిత్ర పటాన్ని చూసి వరించి నట్లు గానే పద్మావతి కూడా..”
“రాకుమారి రాయబారం పంపిందా మిత్రమా?” మాధవుడు
ఆత్రంగా అడిగాడు.
“ఇంకా లేదు. కానీ చారుల వార్త అందుకుని తండ్రిగారు చూసి
రమ్మన్నారు. ఈ వివాహం జరుగుతే, రాజకీయంగా కూడా ఉపయోగం
ఉంటుందనేది వారి అభిప్రాయం.”
“రాకుమారికి ఏవిధంగా వార్త పంపుతారు?”
“మరీ ఇంత అమాయకుడవేమయ్యా మిత్రమా? ఏ చారుల ద్వారా
వార్త తెలిసిందో.. వారి సహకారం తోనే.”
నవ్వుతూ సిగ్గు పడ్డాడు మాధవుడు.
“రాకుమారి, రేపు ఉద్యానవనానికి వస్తుంది. అందుకే ఆ దిశలో
ఉన్న గృహంలో వసతి ఏర్పాటవుతుంది.. నా సంగతి సరే.. మరి
నీ ప్రణయ విశేషాలు చెప్పవా?”
“నాకేమి ప్రణయం మిత్రమా? కోటలో వలె మాకు ప్రణయ
సందేశాలుండవు. మా ఇళ్లల్లో సాధారణంగా పెద్దలే చూసి
పరిణయం నిశ్చయం చేస్తారు. మాకు ఇష్టమయిన తరువాతనే అనుకోండి.”
“అప్పటి వరకూ వలపు కలుగ కుండా ఆగుతుందా మిత్రమా?”
పురుషోత్తముడు మిత్రుని మనసెరిగినట్లు అన్నాడు..
కం. “చూసిన వేళనట నదియె
వేసిన నొకవలపు నమ్ము పేర్మిని బాగా
నా సిన దాని మరులుగొని
భాసిలు కన్నులును మోము బాగుగను సఖా!
ఎర్రబడిన నీ బుగ్గలే చెపుతున్నాయి.. వలపుల చెలి దాగుందని.
ఎవరో చెప్పు మిత్రమా! హంస రాయబారం నడుపుతాను.”
“అబ్బెబ్బే.. ఎవరూ లేరు మిత్రమా! నిజంగానే..” మాధవుని
గొంతులో వచ్చిన వణుకు అతడు నిజం చెప్పట్లేదన్న
సంగతి చెప్పింది. అయినా రెట్టించలేదు పురుషోత్తముడు.
ముందుగా తను వచ్చిన పని పూర్తయితే, పిదప మిత్రుని
సంగతి చూడవచ్చు.
కాదంబరీ దేవిని చూసినప్పుడు మాధవుని మోములో కానిపించిన
వెలుగు మర్చిపోలేదతడు. కానీ కులం? తండ్రిగారూ, సోదరీ ఏమనెదరో..
రాజకీయ ప్రయోజనం కలిగించే వరుడెవరూ సోదరికి సరైనవాడు..
కనిపించుట లేదు. క్షత్రియుడు కాదనే కానీ.. మాధవుడు అన్ని
విధాలా సరైన జోడు. ఏదో ఒక రాజ్యానికి పరీక్ష గా నియమిస్తే సరి పోతుంది.
తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది పురుషోత్తమునికి.
ఇవన్నీ పెద్దలు చూసుకోవలసిన విషయములు. ముందుగా తన వివాహం
సానుకూలమైతే.. అప్పుడు చూసుకోవచ్చు.
సానుకూలమైతే.. అప్పుడు చూసుకోవచ్చు.
“ప్రభూ!” సేనాని పిలిచాడు.
ఆలోచనల్లోంచి బైటపడ్డాడు రాకుమారుడు.
“తమ వసతి రాజోద్యానవనానికి ఆనుకుని ఉన్న వసతి గృహంలో
ఏర్పాటు చేశాము ప్రభూ. అక్కడికి వరదరాజ స్వామి ఆలయం
చాలా దగ్గర. అర్ఘ్య సమర్పణకి నది కూడా దగ్గర లోనే ఉంది.”
పురుషోత్తముడు, మాధవుని చూసి చిరునవ్వు నవ్వాడు.
అందరూ వసతిగృహానికి బయలు దేరారు.
సేనాని వర్ణించినట్లుగానే ఉంది.. ఒక చిన్న రాజ ప్రాసాదం
లాగా ఉంది.
“విజయనగర రాజులు వచ్చినప్పుడు వారితో వచ్చిన మంత్రి
సామంతులు ఇచ్చటనే విడిది చేస్తారు ప్రభూ. అన్ని సదుపాయాలూ
ఉన్నాయి. ఇచ్చ వచ్చిన రోజులుండ వచ్చునిచట. భోజనం కూడా
చాలా రుచిగా ఉంటుంది.”
గుర్రాలకి కూడా మంచి శాల ఉంది.
“ఈ రోజుకి విశ్రాంతి తీసుకుందాము మాధవా! రేపు ప్రాతఃకాలమున
లేచి కర్తవ్యం ఆలోచిద్దాము.”
“అశ్వాలని అప్పజెప్పి వస్తాను రాకుమారా! సాయం సంధ్యవార్చుటకు
ఆలయ కోనేటికి వెళ్దాము. చాలా ప్రశాంతంగా ఉంటుదని చెప్తున్నారు
సేనాని.” మాధవుడు గృహము యజమానితో మాట్లాడి, గుర్రాలని
తీసుకుని వెళ్లాడు.
…………………..
వరదరాజస్వామి ఆలయం.. చోళ రాజులు 11వ శతాబ్దంలో
కట్టించిన గుడి, 108 వైష్ణవ ఆలయాలలో ఒకటి. విస్తారమైన 23
ఎకరాల ఆవరణలో అనేక ఆలయాల సముదాయం కట్టించారు.
వైష్ణవ గురువు రామానుజాచార్యులు ఈ గుడిలో నివసించారు.
కోనేటిలో మునుగుతూ అన్నాడు మాధవుడు.. “దీనిని ఆనంద
సరోవరం అంటారుట. ఈ కోనేటి అంతర్భాగాన అత్తి కర్రతో చేసిన
విగ్రహాలుంటాయి. నలభై సంవత్సరాల కొకసారి ఆ దేవతా
మూర్తులను వెలికి తీసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారుట.”
“చాలా హాయిగా ఉంది మిత్రమా! నువ్వు చెప్పింది నిజమే. ఇంత
విశాలమైన ఆవరణ ఉన్న ఆలయాన్ని చూడడం ఇదే ప్రధమం.
ఈ ప్రశాంతత మనసులో చాలా కాలం అలా నిలిచి పోతుంది.”
వరదరాజస్వామి దర్శనం అయిన పిదప ఆవరణంతా తిరిగి
తమ వసతికి చేరుకున్నారు.
తమిళ వంటకాలతో భోజనం.. సాంబారు, తైరు సాదం,
కొబ్బరన్నం, మిరియాల రసం.. పూర్తిగా వేరు రుచులతో!
కమ్మగా ఉన్నాయి. కడుపు నిండుగా తిని విశ్రమించారు.
వారం రోజుల నుంచీ ప్రయాణంలోనే ఉన్నారేమో.. కంటి నిండుగా
నిదుర పోయారు.
“మిత్రమా! ఈ ఉదయం వేగవతి నది వద్దకు వెళ్దామా, ప్రాతః
సంధ్య వార్చుటకు? ఎక్కడైనా నదీతీరాన్ని మించిన సలిల సేవనం
ఉండదు కదా! అశ్వముల నధిరోహించి వెళ్తే పట్టణం నలుమూలల
చూసి రావచ్చును. ఆ తరువాత ఉద్యాన వనమునకు మీరు వెళ్ల
వచ్చును. నేను వీధులన్నీ పర్యటించి వచ్చెదను.” మాధవుడు
పురుషోత్తమ దేవుని వద్దకు వచ్చి అన్నాడు.
మిత్రులిరువురూ సూర్యోదయాత్పూర్వమే నదికి బయలు దేరారు.
పక్షుల కిలకిలారావాలు తప్ప మనుషుల అలికిడి లేదెక్కడా..
అశ్వాలని చెట్లకి కట్టేసి, మార్చుకోబోయే దుస్తులను ఏటిగట్టున
పెట్టి.. నీళ్లలో దిగబోతూ అన్నాడు మాధవుడు..
“ఆగండి రాకుమారా! నదిలోనికి దిగవద్దు.” ఆందోళనగా ఒక కంఠం
కొద్ది దూరం నుంచి వినిపించింది.
ఉలిక్కిపడి ధ్వని వినవచ్చిన దిక్కుకు చూశారు.
పురుషోత్తమదేవుడు ఆందోళనగా ఆలకించాడు.
ఈ దేశంలో తనని రాకుమారునిగా గుర్తించి, సంబోధించడమా?
ఇంక తన రాకలోని రహస్యం? మాధవుడు జాగ్లత్తగా వెనుతిరిగి,
రాకుమారునికి రక్షగా నిలుచున్నాడు. రెండంగల్లో, దుస్తులలో
దాగిన కరవాలాన్ని తియ్యగలిగే విధంగా.
“మిత్రులమే రాకుమారా! సంశయం వద్దు..” వృక్షం చాటునుండి
వినవచ్చిందొక స్త్రీ స్వరం. వెంటనే, ముగ్గురు స్త్రీలు గుర్రాల మీద వచ్చి
ఎదురుగా నిలబెట్టారు అశ్వాలని.
మధ్యలో మెరుపుతీగవలె నున్న యువతి రాజకుమార్తె వలె ఉంది.
ఆ ఠీవీ, ఆహార్యం, మోములోని ప్రసన్నత, కళ.. చెప్పక చెపుతున్నాయి.
మిగిలిన ఇద్దరూ చెలికత్తెలని తెలిసి పోతోంది.
“మేము దేశాటన చేయు బాటసారులం. నదిలో స్నాన మాచరించి
అర్ఘ్య సమర్పణ చేయుదమని..” మాధవుని మాట పూర్తి కాకుండానే
సమాధానం వచ్చింది.
“తమరు పురుషోత్తమదేవులనీ, గజపతుల రాకుమారులని, కాబోయే
సార్వభౌములనీ మాకు తెలుసు రాకుమారా! మీరు రానున్నారని వార్త
కూడా మా వేగులు తెచ్చారు. మిమ్ములను వెతుక్కుంటూనే వచ్చాము.
ఈ నదిలో మొసళ్లు చాలా ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని
దిగవద్దన్నాము. పట్టణంలో కోనేరులు, సెలయేరులు చాలా ఉన్నాయి.
ఏకాంబరేశ్వరుని ఆలయ తటాకం చాలా పెద్దది. అందులోనికి,
వేగవతీ నది నుంచే నీరు ప్రవహిస్తుంది.” ఒక చెలికత్తె వివరించింది.
“మీకు ధన్యవాదాలమ్మా! ఇంతకీ మీ పరిచయం..” మాధవుడే
సంభాషణ జరుపుతున్నాడు.
“మీరెవరో చెప్పనేలేదు స్వామీ?” ఇంకొక పరిచారిక అడిగింది.
“నేనెవరో తెలుసునన్నారు కదా! ఇతడు మా మంత్రి, మాధవ
మహాపాత్రులు.” పురుషోత్తమ దేవుడు జవాబిచ్చాడు.
మాధవుడు ఉలిక్కి పడ్డాడు.. మంత్రి.. తనా!
మిత్రుని వంక చూశాడు. పురుషోత్తముడు అవునన్నట్లుగా తల
ఊపాడు, చిరునవ్వుతో.
తన మీద ఇంతటి బాధ్యత.. నిర్వహించగలడా? దీని కొరకేనా
తను కళింగకోటలో ప్రవేశించింది?
అయోమయంగా చాశాడు.
“మా వివరాలు సేకరించినపుడు, మీరెవరో కూడా చెప్తే..” తెలుస్తూనే
ఉంది, చిత్రపటం చూడకపోయినా.. అయినా నిర్ధారణ అవకుండా
నిర్ణయానికి రాలేరు కదా!
“మీరు గ్రహించినట్లుగానే.. వీరు కాంచీపుర రాకుమారి పద్మావతీ దేవి.
అంద చందాలలో, విద్యలలో తనకి తనే సాటి.” కించిత్ గర్వంగా
చెప్పింది చెలికత్తె.
…………………..
కళ్యాణం
21వ భాగం
“రాకుమారా! నేను మంత్రినా?”
“అవును మాధవా! మంత్రివవకూడదా? ఇప్పుడు నువ్వు
చెయ్యవలసిన ఒక బృహత్ కార్యం ఉంది. పద్మావతీ దేవికి
నేను మాట ఇచ్చాను. మా ఇద్దరి కళ్యాణం తప్పక జరుగుతుందని.
ఆ వాగ్దానం నెరవేర్చ వలసిన బాధ్యత నీదే. ఏ రీతిగా చేస్తావో మరి.”
నది ఒడ్డున కలిసిన రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాడు
పురుషోత్తముడు. త్వరలో రాయబారిని పంపి రాజుగారితో విషయం
చెప్తానని మాట ఇచ్చాడు.
తన తండ్రికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని చెప్పింది
పద్మావతీ దేవి.
“కాంచీపురం రాజుగారి వద్దకు కళింగ రాయబారిగా వెళ్లాలి.
మా కళ్యాణం జరిపించాలి.”
ఇరవై సంవత్సరాలు ఇంకా పూర్తిగా నిండలేదు. లౌక్య
సంభాషణ రాదు. అందునా రాజుగారి వద్దకు..
“రాకుమారా! నేనేమిటి.. రాయబారం ఏమిటి? నా కసలు
సరిగ్గా మాటలాడడం రాదు. ఏదో మా పూటకూళ్ల ఇంటికి
వచ్చినవాళ్లతో నాలుగు కబుర్లు చెప్పడం తప్ప.” మాధవుడు
బెదురు కన్నులతో అటునిటు చూస్తూ అన్నాడు.
ముద్దుమోముతో ముచ్చటగా కనిపించాడు మాధవుడు.
తనకి ఒక అనుజుడుంటే ఈ బాలుని వలెనే ఉండే వాడేమో!
కానీ తప్పదు. రాజుగారి వద్దకు పంపాలిసిందే. పురుషోత్తముడు
తప్పదన్నట్లు తల నిలువుగా ఊపాడు.
మాధవునికి ఒకింత ఉత్సాహము, ఒకింత సందేహము..
అందుకే అన్నాడు..
కం. “ఆనతి మీరను సాధ్యమ
యేను హితుడ నదియు కాక భృత్యుడ గాదా
కానగ కళ్యాణమునకు
నేను ప్రయత్నము సలిపెద నిక్కము మిత్రమా!”
“రేపే వారి సభలోనికి అనుమతి సంపాదించెదము.” చిరునవ్వుతో
అన్నాడు పురుషోత్తముడు.
వారితో వచ్చిన అనుచరులిరువురికి ఆపని అప్పజెప్పి,
స్నేహితులిద్దరూ, తమతమ అశ్వాల మీద కాంచీపురం అందాలు
చూడడానికి బయలుదేరారు. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం
పల్లవరాజులు తమ రాజధానిని చేసుకుని, అనేక ఆలయాలు
నిర్మించిన పట్టణం.
విద్యా బోధనలో, విద్వాంసులను తయారు చెయ్యడంలో కాశీ
పట్టణమంత ప్రాముఖ్యతను పొందింది.
ఏకాంబరేశ్వరుని ఆలయంలో గాలిగోపురం, వెయ్యి స్తంభాల
మండపం నిర్మితమౌతున్నాయి. విజయనగరరాజుల సామంతులు
కూడా ఆలయనిర్మాణాల మీద శ్రద్ధ వహిస్తున్నారు.
కామాక్షీ దేవి కంచిని కాపాడుతూ ఉంటుందని అంటారు. అందుకే
పల్లవులనుంచి, చోళులకి, చోళుల నుంచి రాయలుకీ రాజ్యం మారినా,
ఆలయాలు చెక్కు చెదరలేదు.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా!
భారత దేశంలోని సప్త మోక్షపురులలో కంచి ఒకటి. అతి
ప్రధానమైన శక్తి క్షేత్రం.
మాధవ, పురుషోత్తములు ఆలయాలను దర్శించుకుని, తమ
వసతిగృహానికి చేరుకున్నారు.
భోజనానంతరం, రాజ్య సభలో వినిపించవలసిన వివరాలను
పత్రం మీద రాసుకుని, విశ్రాంతి కుపక్రమించారు.
……………….
“రాకుమారా! ఉద్యానవనమునకా? సాయం సంధ్య వీక్షణకా?”
అశ్వాలనెక్కుతూ అడిగాడు మాధవుడు.
“రెంటికీ..”
“రాకుమారి వస్తున్నారా?”
చిరునవ్వే సమాధానమయింది.
“కొద్ది పరిచయంలోనే సన్నిహితులైనట్లున్నారే.. నేను మీ
వద్దనే ఉండాలి మరి. రక్షకునిగా. చెవులు మూసుకుని కన్నులు
బాగుగా తెరుస్తా.” మేలమాడాడు మాధవుడు.
మాటల్లోనే ఉద్యానవనం వద్దకు చేరారు.
రాకుమారి, చెలికత్తెలు వటవృక్షం కింద ఆసనాల వలే పేర్చిన
రాళ్ల మీద కూర్చున్ని ఉన్నారప్పటికే.
ఆకుపచ్చని చీని చీనాంబరాలలో వనలక్ష్మివలే మెరిసిపోతోంది
రాకుమారి.
పురుషోత్తమదేవుని రాక చూసి, చెలికత్తెలు తప్పుకున్నారు
పక్కకి. పద్మావతీదేవి, లేచి నిలుచుని అభివాదం చేసింది.
మాధవుడు, రాకుమారుడు కనిపించేటట్లుగా కొద్ది దూరంలో
అప్రమత్తుడై నిలుచున్నాడు.
పురుషోత్తముడు తన ఆలోచనని పద్మావతికి చెప్పాడు.
“మీ తండ్రిగారే మందురో చూసి, మేము ఎల్లుండి తిరుగు
ప్రయాణం సాగించెదము.”
“మరి నా మాటేమిటి రాకుమారా” వణుకుతున్న కంఠంతో
అడిగింది పద్మావతి.
“రాజుగారి స్పందన మీద ఆధారపడి ఉంది. వారు సరేనంటే
పెళ్లి వారమై వస్తాము. మిమ్మల్ని తోడ్కొని వెళ్తాము.”
“కాదంటే..” రాకుమారి కన్నుల నిండా నీరు..
“సమరమే!”
“వద్దు రాకుమారా! నన్నొక్కదాన్నీ తీసుకెళ్లండి. సమరమంటే
మళ్లీ జన నష్టం.. ఇక్కట్లు. శ్రీకృష్ణుల వారివలే తీసుకెళ్లండి. ఎవరేనా
అడ్డు వస్తే వారితో యుద్ధం..” సిగ్గుపడి ఆపేసింది పద్మావతి,
పురుషోత్తముని అనురాగపు చూపుల కని.
“అటులనే.. దేవిగారి ఆనతి”
…………………
“రాకుమారా! మన కర్తవ్యం?” మాధవుని వంక సాలోచనగా
చూశాడు పురుషోత్తముడు.
“రాజుగారి రాయబారిని ఆహ్వానిద్దాము. పత్రం రాశాను.
మన అనుచరుని చేత పంపుదాము.”
మాధవుడు, పురుషోత్తమ దేవుడు తిరుగు ప్రయాణానికి
సన్నాహాలు చేస్తున్నారు. ముందు రోజు, రాజ్య సభలో మాధవుడు,
పురుషోత్తముని గురించి చెప్పి, రాకుమారి పద్మావతికి తగిన
వరుడని వివరించి, వివాహమునకు అంగీకరించ వలసినదిగా కోరాడు.
పురుషోత్తమదేవుని ప్రతిభ గురించి విని ఉన్న రాజు అంగీకారం
తెలిపే లోపుగానే, మంత్రి సమూహంలోని ఒక మంత్రి లేచాడు..
జరగబోయే సంఘటనలకి.. అవి మంచి అవనీ, చెడు అవనీ,
ఎవరో ఒకరే కారణ భూతులవుతారు. దాని ఫలితం అనేక
మంది అనుభవిస్తారు. రావణాసురిడి వధకి, లంక నాశనానికీ
శూర్ఫణఖ లాగా.
“రాజా! వినికిడి మాటలని బట్టి కన్యని ఇచ్చుట అంత
సమంజసనీయం కాదు. మనలో ఎవరైనా కళింగదేశం వెళ్లి, అక్కడి
స్థితి గతులని చూసి నిర్ణయించాలి. వివాహముల యందు
తొందరపాటు పనికిరాదు.”
రాజుకి ఆ సలహా నచ్చింది.
“సరే మంత్రి వర్యా! ఈ మాటే వారికి అందజేయండి. కపిలేంద్ర
దేవులు ఆహ్వానం పంపుతే, మీరే వెళ్లి రండి. ఆ పిదపనే
వివాహం చేద్దాము.”
సభలో జరిగినదంతా మాధవుడు పురుషోత్తమునికి చెప్పాడు.
ఆ సమయానికి.. చెప్పినప్పుడు కిమ్మనకుండా, ప్రయాణమౌతున్న
రాకుమారుని చూసి ఆ ప్రశ్న అడిగాడు మాధవుడు.
“ఐతే. జగన్నాధుని ఉత్సవాలప్పుడు రమ్మందాము రాకుమారా!
అప్పుడు మన వైభవం కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది.”
అనాలోచితంగా, అడక్కుండా సలహా ఇచ్చాడు మాధవుడు.
పురుషోత్తమునికి మంచి సలహా వలెనే అనిపించింది. తన
పత్రంలో ఆ సంగతి కలిపి, అనుచరునికి ఇచ్చి, మహారాజుకి
అందజేసి రమ్మని ముందుకు కదిలాడు, మాధవునితో.
తిరుగు ప్రయాణంలో అతి తక్కువ మజిలీలతో, వారంరోజుల
లోగానే చేరుకున్నారు కటకం. చేరిన వెంటనే జగన్నాధుని
రథయాత్ర ఉత్సవాలకి సన్నాహాలు మొదలయ్యాయి.
కపిలేంద్ర దేవుని ఆనందానికి హద్దుల్లేవు.
అనుకున్న విధంగా కాంచీపుర రాజుతో సంబంధం కలుస్తోంది.
విజయనగర దేవరాయల్ని ఓడించడానికి, రాజ్యం ఆక్రమించడానికి
చిన్నదైనా అవకాశం దొరుకుతుంది.
“ఈ జగన్నాధుని రధయాత్ర ప్రాముఖ్యమేమిటి తండ్రీ? ఈ సారి
రాకుమారినితో నేను కూడా వెళ్తున్నాను పూరీ.”
“పూరీ జగన్నాధుని ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ, బలభద్ర, సుభద్రల
విగ్రహాలను, తొమ్మిది రోజులు గుండీచా ఆలయానికి ఆ తరువాత
మౌసీమా దగ్గరకి, తీసుకెళ్తారు, మూడు రధాల్లో. ఈ రధాలను
భక్తులు లాగుతారు. రధం లాగడం ప్రధాన సేవ కింద.. అది లాగడం
అదృష్టం అన్నట్లు భావిస్తారు. ఆ భక్తులని జగన్నాధుడు కరుణతో
చూస్తాడని నమ్మకం.
ఏ ఆలయం లో నైనా మూల విరాట్టుల విగ్రహాలు రాతితో చేస్తారు.
జగన్నాధుని ఆలయంలో చెక్కతో చేసి ఉంటాయి. విష్ణుమూర్తి
పక్కన అన్ని ఆలయాల లో శ్రీదేవి, భూదేవి ఉంటారు. కానీ
ఆది విష్ణువు ఇక్కడ కృష్ణుడై, బలరామ, సుభద్రలతో కొలువై
ఉన్నాడు.ఆ విగ్రహాలను స్వయంగా విశ్వకర్మే చెక్కాడట.
ఈ గుడిలో సుదర్శన చక్రాన్ని పూజించడం మరొక ప్రత్యేకత.
అన్నా చెల్లెలి బంధం
కన్నార కనగ బలభద్ర కన్నయ్య లనూ
చెన్నారు సుభద్ర నడుమను
పొన్నారిగ విశ్వకర్మ పొడమెను బాగా.
జగన్నాధుని గురించి వేదాలలో చెప్పలేదంటారు. దశావతారాలలో
చేర్చ లేదు. అవతారాల అవతరణకే కారణ భూతుడని అంటారు.
కానీ.. కొన్ని ఒరియా గ్రంధాలలో తొమ్మిదవ అవతారం కింద
వర్ణించారు. అందుకనే నేమో.. బౌద్ధులు కూడా జగన్నాధుని
కొలుస్తారు. హిందూ విధి విధానుసరణ ప్రకారం పూజలు కూడా
జరగవు. బ్రాహ్మణేతరులు పూజలు నిర్వహిస్తారు. కొందరు
ఆదివాసీల ఆరాధ్య దైవమని కూడా చెప్తారు.
విగ్రహాలు రత్న వేదిక మీద వెలసి ఉంటాయి. ఆ మూర్తులని
ఆరడుగుల వేప కొయ్యలతో చేశారు. చతురశ్రాకారంలో
ఉన్న మోములు, త్రికోణాకారపు తల. పెద్ద కన్నులు.
జగన్నాధుని మోము నలుపు, బలభద్రుడు తెలుపు,
సుభద్ర పసుపు పచ్చ రంగుల్లో ఉంటారు.”
మాధవుడు అడిగిన ప్రశ్నకి నందుడు సమాధానం చెప్పాడు.
“శిలలతో చేసినవి, లోహంతో చేసినవి చూశాం కానీ కొయ్య
విగ్రహాలని ఆలయాలలో ఎక్కడా చూసినట్లు లేదు కదా
నాయనగారూ?”
“అవును. అడవులలో కోయదొరలు పెద్ద పెద్ద విగ్రహాలను
చేసి వాళ్ల గూడేల మధ్యలో పెట్టుకుని పాటలు, నృత్యాలతో
పూజిస్తారని విన్నాం. కానీ నాగరిక పట్టణాలలో పూరీ ఆలయమే
ప్రసిద్ధమయింది.. ఇటువంటి ఆగమ శాస్త్రంతో.”
“ఏది ఏమైనా కళింగ ప్రజల ఆరాధ్య దైవం పూరీ జగన్నాధుడు.
రాజుగారితో రధయాత్రకు వెళ్లబోతున్నావు. ఎంతటి
అదృష్టమో కన్నయ్యా!” సీతమ్మ మురిసిపోతూ అంది.
“మనం అందరం వెళ్దాం అమ్మమ్మా! రాకుమారుడిని అనుమతి
అడుగుతాను. రెండు రోజులు వసతి గృహానికి సెలవు ప్రకటిద్దాము.”
“సెలవు అవసరం లేదు. సంభారాలు బయట పెట్టి సేవకులని
చూసుకోమందాము. గత కొన్ని సంవత్సరాలుగా వారికి
నేర్పించాము కదా!” నందుడు ఉత్సాహంగా అన్నాడు. రాజుగారి
పరివారంతో రధ యాత్రకి అంటే.. మాటలా మరి..
……………….
22 వ భాగం.
“అబ్బా! ఎంత సుందరంగా ఉందో జగన్నాధుని ఆలయం.”
మాధవుడు గట్టిగా అరిచాడు. మేనా లోంచి గౌతమీ, సీతమ్మలు
తొంగి చూశారు.
రాజుగారి పరివారంతో వెళ్తున్నారు నంద మహా పాత్రుని కుటుంబం.
నంద, మాధవులు గుర్రాల మీద, గౌతమి, సీతమ్మలు మేనాలో.
ఒక బిడారులా సాగుతున్నారు.
సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. కళింగదేశంలో ప్రతీ ఒక్కరికీ
పూరీ జగన్నాధుని దర్శనం జీవితంలో ఒక్క సారైనా
చేసుకోవాలనే కోరిక ఉంటుంది. సీతమ్మ వంటి వారికి అది
తీరని కోరికే.
“మాధవుని ధర్మమా అని నా కన్నులు పుణ్యం చేసుకో
బోతున్నాయి” కనిపించిన వారందరికీ చెప్పి మురిసిపోయింది.
నెమ్మదిగా సాగుతోంది ప్రయాణం. పది మందితో ప్రయాణం కద!
ఆడవారు వృద్ధులు మేనాలలో, సైనికులు అశ్వాల మీద,
రాకుమారుడు, బంధువులు, అంతఃపుర స్త్రీలతో రధాల మీది,
నడవగలిగిన ప్రజలు కాలి నడకన వెడలుతున్నారు.
ఎంత ప్రయత్నించిననూ మహారాజు, ఇతర రాకుమారులూ
రధయాత్ర సమయమునకు చేరుకో లేక పోయారు. ఉత్తరాన
ముసల్మానులు, దక్షీణాన రెడ్డిరాజులు, పశ్చిమాన
బహమనీ సుల్తానులు పోరు సల్పుతున్నారు.
రధయాత్రలో రాచ కుటుంబం, రాజుగారు చేయవలసిన
సేవలన్నింటినీ పురుషోత్తమ రాకుమారుని చెయ్యవలసినదిగా
ఆదేశం ఇచ్చారు కపిలేంద్రుడు.
“అయ్యవారూ! ఈ జగన్నాధ స్వామి, ఇక్కడ వెలిసిన
స్థల పురాణం చెప్పరా? చాలా మందికి తెలియదు. కాలక్షేపంగా
కూడా ఉంటుంది.” నందుడిని అడిగాడు రాచ పరివారంలోని
ఒక సైనికుడు.
“అవునవును..” అందరూ ఏక కంఠంతో పలికారు.
నందుడు కొంచెం మొహమాటంగా నోరు విప్పాడు. అతడికి
వివరాలు బాగా తెలుసును, కానీ ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు.
ఐతే, భక్తి భావంతో మొదలు పెట్టాడేమో, ధార అలవోకగా
సాగి పోయింది.
“స్కంద పురాణంలో, పురుషోత్తమ మహాత్ముడు చెప్పిన
వివరం ఇది. సత్య యుగంలో, ఈ ఆది దేవుడు, నీలమాధవుడనే
పేరుతో అడవిలో ఆదివాసీల పూజలు అందుకుంటుండే వాడు.
ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాధుడిని, సవరులను
పాలించే రాజు, విశ్వావసు ఎవరికీ తెలియకుండా వెళ్లి పూజలు
చేసుకుని వస్తుండే వాడట.
ఆ సమయంలో, అవంతీ నగరం రాజధానిగా కళింగ నేలే
చంద్రవంశ రాజు ఇంద్రద్యుమ్నుడికి, అడవిలో వెలిసిన
నీల మాధవుని గురించి ఒక యాత్రికుడు చెప్పాడు.
ఇంకా వివరాలు అడుగుదామంటే, ఆ యాత్రికుడు
కనిపించకుండా మాయమయ్యాడు.
ఇంద్రద్యుమ్నుడు తన పురోహితుడైన విశ్వపతిని పిలిచి
నీలమాధవుని ఆలయం దర్శించి, తెలుసుకుని రమ్మని పంపాడు.
విశ్వపతి మహానది ఒడ్డున ఉన్న సవరద్వీపవనం వెళ్లి
విశ్వావసుని కలిశాడు. విశ్వావసు కుమార్తె లలితని వలచి
వివాహం చేసుకున్నాడు.
ఒక రోజు మామగారిని, తనకి నీలమాధవుడిని చూపించమని
అడిగాడు. అల్లుని మాట కాదనలేక, తన ఉనికిని రహస్యంగా
ఉంచమన్న దేవుని ఆనతి ఉల్లంఘించలేక, విశ్వావసు,
అల్లుని కళ్లకి గంతలు కట్టి తీసుకెళ్లాడు. విశ్వపతి తెలివిగా
దారిలో ఆవాలు చల్లుకుంటూ వెళ్లాడు.
దైవదర్శనం అయాక, ఉపవాస దీక్ష తీసుకుని, రోహిణీ కుండంలో
స్నానం చేసి కల్ప వృక్షం కింద కూర్చుని తపస్సు చేశాడు.
అప్పుడతనికి ఒక అపురూప దృశ్యం కనిపించింది.
సీ. నింగినుండి విడియ నేలకొక వెలుగు
దివినుండి వచ్చిరి దివిజు లందు
నారదాది మునులు నలువరాణి సిరియు
పరమేశ్వరుడు బ్రహ్మ పార్వతియును
ఇంద్రాది సురులును యీప్సితముల కోరి
రంభాది యచ్చరల సహితముగ
శ్వేతాంబరములను చిన్నిదపు నగల
ధరియించి వచ్చిరి ధరకు నంత.
ఆ.వె. భక్తినంత మదిని బాగుగా నిలిపియు
వినయముగ శిరముల వెలది నుంచి
నామము నిరతముగ నాలుక కదలాడ
నీల మాధవుని యనిశము కొలువ.
ఆ దృశ్యం కనిన వెను వెంటనే విశ్వపతి అవంతీ నగరానికి
వేగిరం వెళ్లి, ఇంద్రద్యుమ్నునికి నీలమాధవుని మహత్యమును
వివరించాడు.
సంభ్రమాశ్చర్యములతో విశ్వపతి చెప్పింది విని, మరికొందరు
పరివారం వెంటరాగా సవర వనానికి బయలుదేరాడు రాజు,
దైవదర్శనానికై.
అతడికి మరింత ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది
అంతలోనే..
గోప్యతా వాంఛితుడైన నీలమాధవుడు, విద్యాపతి అవంతికి
పయనమవగానే మాయమయ్యాడు.
మొలిచిన ఆవ మొక్కల సహాయంతో త్రోవ చూసుకుంటూ
ఆలయానికి రాగానే, విగ్రహాలు లేని గుడి కనిపించింది.
ఐతే ఆ తీరమంతా బంగరు ఇసుకతో కప్పబడి ఉంది.
ఇంద్రద్యుమ్నుడు నిరాశగా నిరాహార దీక్ష మొదలుపెట్టి,
అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద గుడి కట్టించి
నరసింహ స్వామిని ప్రతిష్ట చేస్తాడు.
ఆలయంలోనే నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి సముద్ర
తీరానికి వెళ్లమని ఆదేశిస్తాడు. చాంకీనది ముఖద్వారం వద్దకి
వేప దుంగలు కొట్టుకొస్తాయనీ, వాటితో, జగన్నాదుడు, బలభద్రుడు,
సుభద్ర, సుదర్శన చక్ర విగ్రహాలను తయారు చేసి ప్రతిష్టించమని
చెప్తాడు.
దుంగలైతే కొట్టుకొచ్చాయి కానీ, వాటిని విగ్రహాలుగా చెక్కే
వాళ్లు కనిపించలేదు.
రాజ్యంలోని శిల్పులని అందరినీ పిలిపించాడు రాజు. ఎవరికి
వారే మా వల్ల కాదంటే మా వల్ల కాదని తప్పుకున్నారు.
కలతతో ఆ మారాజు, మాధవుడినే స్మరిస్తూ ధ్యానం లోనికి
వెళ్లాడు. కళ్ల ముదు నారాయణుడు ప్రత్యక్షమై యజ్ఞం
నిర్వహించమని చెప్పాడు.
ఇంద్రద్యుమ్న మహారాజు, దేశంలోని ఋత్విక్కులను
ఆహ్వానించి అద్భుతమైన యజ్ఞం చేశాడు.
శాస్త్రోక్తంగా జరిగిన ఆ యజ్ఞానికి దేవతలందరూ సంతోషించారు.
యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో
విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి
వాసుదేవునిలాగా, వ్యూహని సంకర్షణు వలె, యోగమాయని
సుభద్ర లాగా మరియు విభవున్ని సుదర్శనం వలె నిర్మించమన్నాడు.
ఆ నిర్మాణానికి శిల్పి త్వరలో రాగలడని చెప్పాడు.
కం. సాక్షాత్తు సుర స్థపతియె
యీక్షేత్రము న యడుగిడగ నేమర రాడా
వీక్షా సారించి మరీ
మాక్షీకముగ విగ్రహముల మలచుట కొరకై.
యజ్ఞనరసింహరాజు చెప్పినట్లే దేవశిల్పి విశ్వకర్మ వృద్ధ
బ్రాహ్మణుని వలె ఇంద్రద్యుమ్నుని వద్దకు వచ్చి తాను
విగ్రహాలను చెక్కగలనని అన్నాడు.
కానీ కొన్ని షరతులు విధించాడు.
తాను ఒక్కడే ఏకాంతంలో పనిచేసుకుంటానన్నాడు.
ఎట్టి పరిస్థితులలోనూ, ఎవరూ తలుపులు తీసి లోపలికి
రాకూడదన్నాడు.
ఆహారాది విషయాలకి కూడా తన వద్దకు రావద్దన్నాడు.
అన్నింటికీ ఒప్పుకుని రాజు, ఆ చిత్రకారునికి పని ఇచ్చాడు.
ఆలయం లోపలికి వెళ్లి తలుపులు బంధించమన్నాడతడు.
ప్రజలతో సహా, రాచ పరివార మంతా కుతూహలంగా ద్వారాల
వెలుపల వేచి చూస్తున్నారు. అప్పుడప్పుడు రాజు కూడా,
రాణీ తో సహా వచ్చి చూస్తున్నాడు.
కొన్ని రోజులు లోపలి నుంచి శబ్దాలు వినిపించాయి.
తరువాత ఆ శబ్దాలు ఆగిపోయాయి. అందరూ ఆందోళనగా,
ప్రాకారం బైట నిలబడి వేచి ఉన్నారు.
మరి కొన్ని రోజులు గడిచాయి.
రాజుగారు, రాణీగారు వచ్చి సంగతి విచారించారు.
“ప్రభూ! ఆ శిల్పికి లోపల ఏదయినా అస్వస్థత కలిగిందంటే..
లేదా ప్రాణాపాయం కలిగినా, ఆ పాపం మనకి చుట్టుకుంటుంది.
శిల్పాలు చెక్కుతుంటే శబ్దం రావాలి కదా?” రాణీగారి మాట
విని రాజుకూడా వ్యాకులత చెంది. తలుపులు తెరవమని
ఆజ్ఞాపించాడు.
తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించగానే ఎదురు పడ్డ దృశ్యం
రాజుని, రాణీని కలవర పరచింది.
తన షరతుని అతిక్రమించిన ఇంద్రద్యుమ్నునికి కనిపించడం
ఇష్టం లేక విశ్వకర్మ మాయమయ్యాడు. జగన్నాధ, బలభద్ర,
సుభద్రల విగ్రహాలు, చేతులు, కాళ్లు లేకుండా ఉండి పోయాయి.
వ్యాకులతతో వెనుతిరిగిన రాజుని, కలలో జగన్నాధుడే
ఓదార్చి, అదే ఆకారములతో ఈ ఆలయంలో ఉండ
దలచుకున్నానని చెప్పాడు.
“రాజా! అందుకనే శిల్పాలు ఆ స్థితిలో ఉండగా మిమ్మల్ని
తలుపులు తెరిచేట్లు ప్రేరేపించాను. ఇదంతా నా సంకల్పమే.
నువ్వు కలత చెందవద్దు. ఈ విగ్రహాలనే ప్రతిష్టించి పూజలు
సలుపు?”
ఇంద్రద్యుమ్న మహారాజు, అవే విగ్రహాలని ప్రతిష్టించాడు.
పూరీ జగన్నాధ ఆలయం ఆ విధంగా ప్రసిద్ధి చెంది భక్తుల
సందోహంతో కలకలలాడుతూ ఉంటుంది.”
నందుడు పూరీ ఆలయం గురించి వివరించగానే అందరి
మనసుల్లోనూ భక్తి పెల్లుబికింది. ఉత్సాహంతో, ఎప్పడెప్పుడు
జగన్నాధుని చూద్దామా అని ముందుకు నడవసాగారు..
ఆ స్వామిని మనసారా కొలుస్తూ.. పాటలు పాడుతూ.
కవిరాజవిరాజితము:
1. పదపద ముందుకు పాటలు పాడుచు
పాదము లన్నియు బాగుగనే
తదిగిణ తోం తకతాం తకతోం యని
తప్పెట తాళము దంచగనే
ముదముగ నెంతను మోకరిలంగను
ముచ్చట గొల్పగ మోదమునే
సదమలమౌ మన సామిని కొల్వగ
సామముగా చన సారమునే
2. మది తలచేముగ మాదొరనే మరి
మాటికి నామము మాధవునే
కదడుకొనంగను కాలిడి సాగగ
ఖంగు మనే తమ గజ్జెలనే
వదలకనే నడవంగ మనం మధు
పమ్ముల సవ్వడి వాడిగనే
కదలెదమే మరి గట్టిగ సేయగ
గానము నంతను ఖాసమునే||
ముందుగా నడుస్తున్న వారిలో ఒకతను పెద్దగా పాడడం
మొదలుపెట్టాడు.
ఎక్కడి నుంచి తీశారో.. డప్పులు, బూరాలు చేతుల్లోకి
వచ్చేశాయి. ఒక చరణం సూత్రధారి పాడగానే మిగిలిన
వారు అదే అందుకుని పాడుతున్నారు.
రథయాత్రకై, కటకం నుంచి పూరీ వరకూ రాచ పరివారం
యాత్ర సాగింది.
మాధవుడు, పురుషోత్తమదేవుని రథం పక్కగా గుర్రాన్ని
నడిపిస్తున్నాడు.
పూరీ నగరం దగ్గర పడుతోందనగా, రథం ఆపి, మాధవుని
తన రధం మీదకి ఎక్కంచుకున్నాడు రాకుమారుడు. మాధవుని
గుర్రాన్ని, కాలినడకనున్న ఒక సైనికుడు అందుకున్నాడు.
“మాధవా! కాంచీపురం నుండి రాయబారి వస్తున్నాడు కదా?”
“అవును ప్రభూ! వారి మంత్రులలో ఒకరు వచ్చి ఉంటారు.
వారికి సరైన వసతి గృహం ఏర్పాటు చెయ్యమని చెప్పాము.”
“ఈ కోలాహలంలో వారికి సరైన మర్యాద జరుగక పోవచ్చును.
నువ్వే దగ్గరుండి చూసుకోవాలి సుమా!”
“అలాగే దేవా! నేను స్వయంగా ఆ ఏర్పాట్లు చూస్తాను.
మీరు నిశ్చింతగా ఉండండి.” ముందు రథం మీదనున్న
కాదంబరీ దేవిని ఓరకంట చూస్తూ అన్నాడు మాధవుడు.
“ఈ రథయాత్ర మనిద్దరికీ ఒక పరీక్షయే. ఫలితాలు
ఎవ్విధంగా ఉంటాయో వేచి చూడ వలసినదే!” సాలోచనగా
అన్నాడు పురుషోత్తముడు.
……………….
23 వ భాగం.
పురుషోత్తమదేవుడు, పరివారంతో పూరీ పట్టణం చేరే సరికి
జ్యేష్ఠ బహుళ చతుర్దశి వచ్చింది.
మరునాడే అమావాస్య.. నూతన దేవతా మూర్తుల నేత్రోత్సవం
జరిగే రోజు. పూజలు మామూలుగా జరుగుతాయి. మరునాడు
ప్రజలకు నవయవ్వన దర్శనం.
ఆలయంలో పూజల ఏర్పాట్లు జరుగుతుండగానే రాచ పరివారం
వారి వారి వసతి గృహాలలో కుదురు కున్నారు.
పూరీ పట్టణం అంతా జన సందోహంతో కళకళ లాడుతోంది.
ఎక్కడెక్కడి వారూ, బళ్లలో, గుర్రాల మీద, కాలి నడకన
వస్తున్నారు. ప్రధాన రహదారి అంతా మామిడాకులతో, పూల
తోరణాలతో అలంకరించారు. నగరంలోని అన్ని ధర్మ సత్రాలు,
పూటకూళ్ల ఇళ్లు నిండి పోయి, ఖాళీ ప్రదేశాలలో డేరాలు
వేసుకుని స్థిర పడ్డారు.
అంత మంది జనం ఉన్నా.. ‘మనిమా’ (జగన్నాధా) అంటూ
క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు. వారందరికీ సదుపాయాలు
చూడడానికి సేవా సమితి ఉంది. అందులోని స్వచ్ఛంద సేవకులు
నిరంతరం తిరుగుతూనే ఉంటారు. ఆలయంలోనే ప్రజలందరికీ
భోజన ఏర్పాట్లు జరుగుతాయి.
పాడ్యమి రోజున కాంచీపురం నుంచి మంత్రి వరదయ్య వచ్చారు.
వస్తూనే అక్కడి కోలాహలాన్ని చూసి సంభ్రమంతో కన్నులు
తిప్పుకో లేకపోయారు.
వరదయ్యగారికి, మాధవుడి కుటుంబం ఉన్న దగ్గరే విడిది
ఏర్పాటు చేశారు.
జనంలో కలిసి పోయి, పురుషోత్తముడు ఎటువంటివాడో
కనుక్కుంటున్నాడు వరదయ్య.
తృప్తిగా రాత్రి నిదురించాడు.. రథయాత్ర సంబరాలు చూడడానికి
సంసిద్ధ మౌతూ.
ఆషాఢ శుక్ల విదియ.. ఏడాదిగా ఎదురు చూస్తున్న రోజు రానే
వచ్చింది.
పాండాలు సూర్యోదయానికి ముందే లేచి పూజలు నిర్వహించారు.
‘మనీమా..’ అని పెద్దగా అరుస్తూ విగ్రహాలని కదిలించారు. పహండీ
ఉత్సవం ఆరంభమయింది.
ప్రధాన రహదారి వద్దకు తీసుకుని వచ్చి, రథాల వెనుక భాగం
నుంచి అలంకరించిన రత్న పీఠముల మీద సుభద్ర, బలభద్ర,
జగన్నాధులని ఆసీనులని చేశారు.
ఆదిదేవుడు రథారూఢుడయ్యాడు. ఇరు ప్రక్కలా నున్న రథాలలో
భగినీ, అగ్రజులు..
ఒక్క సారిగా కోలాహలం మొదలయింది. మనీమా అని అరుస్తూ
భక్తులు ఆవేశంతో ఆనంద తాండవం చేస్తున్నారు.
ఆనవాయితీగా వచ్చే రాజుగారి బదులుగా సాక్షత్ విష్ణు
స్వరూపులైన రాకుమారులు పల్లకీలో, పరివారంతో వచ్చేశారు.,
బాజా భజంత్రీలు మారు మ్రోగాయి. ప్రజల సంభ్రమం పెచ్చు
పెరిగింది.
రాచకుటుంబం ముందుకు నడిచింది, ప్రజలంతా దారి నివ్వగా.
మాధవుడు, పురుషోత్తముని వెనుకే ఉన్నాడు అప్రమత్తుడై. నంద,
గౌతమిలు, సీతమ్మతో సహా ఆ పరివారంలోనే ఉన్నారు.
కాంచీపురం నుంచి వచ్చిన వరదయ్య మంత్రి మాధవుని వెనుకనే
ఉన్నాడు.. కన్నుల పండువగా జరుగుతున్న ఉత్సవాన్ని వీక్షిస్తూ.
సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఇంత దగ్గరగా జగన్నాధుని
వీక్షించ గలగడం.. జన్మ ధన్య మయిందనుకుంది. భక్తులందరూ,
కులమత భేదాల్లేకుండా వినమ్రతతో రథాలకి ఇరు ప్రక్కలా,
రహదారి మీద వేచి ఉన్నారు... జయజయ ధ్వానాలతో.
రాకుమారుడు పురుషోత్తమ దేవుడు పల్లకీ దిగి, భక్తులందరికీ
అభివాదం చేశాడు.
పదహారు కళలతో వెలుగొందుతూ, ఆదిదేవుని ప్రతిరూపంలాగే,
విష్ణు స్వరూపుని వలెనే ఉన్నాడు. కాకుంటే ఇతడు పచ్చని పసిమి..
నీల మాధవుడు నల్లన.
పూజారులు వేద మంత్రాలుచ్ఛరిస్తూ ఉండగా, మంగళ వాద్యాలు
మ్రోగుతుండగా పురుషోత్తమ దేవుడు స్వామి రథం వద్దకు నడిచాడు.
లోకాలనేలే పరమాత్మునికి, దేశాన్నేలే రాజు సేవకుడైనాడు.
రథాన్ని అదిరోహించి, బంగరు పిడిగల చీపురు నందుకున్నాడు.
స్వయంగా రథం లోపల జాగ్రత్తగా, ఎక్కడా దుమ్ము ధూళి
కనబడకుండా తుడిచాడు.. మరీ మరీ. సవినయంగా, భక్తి ప్రపత్తులతో.
అదే.. ‘చెరా పహారా’ సేవ.
భక్తుల సందడి మిన్నంటింది.
కాంచీపుర రాయబారి వరదయ్యకి మాత్రం ఒడలంతా కారం
రాచుకున్నట్లయింది.
రాకుమారుడు, కాబోయే మహారాజు, చీపురు పట్టుకుని
ఊడవడమా! ఎక్కడయినా, ఎన్నడయినా. ఎవరైనా కన్నారా?
కనగలరా? చిరచిర లాడుతూ పక్కకి జరిగి తలతిప్పుకున్నాడు.
ఆ హడావుడిలో ఎవరు పట్టించుకుంటారు అతడినీ, అతడి
భావాలనీ..
కన్నుల పండువలా జరుగుతున్న ఉత్సవాన్ని తిలకించడంలో
మునిగి పోయారు.
జగన్నాధ రథయాత్ర ప్రారంభ మయింది.
జగన్నాధుని రథం పేరు ‘నందిఘోష’, సారధి దారుకుడు.
బలభద్రుని రధం ‘తాళ ధ్వజం’.
సుభద్రాదేవి రధం ‘దేవదళం’.
సీ. నగరి యా యది మరి నడచుచున్న నగమా
యని భ్రాంతి తోడనే సురలు చూడ
జగమేలు సామియే జనుల మనమునందు
నాల్కలందును కూడ నాను తుండ
సొగసైన సోదరి, సోదరు కూడియు
తాదాత్మ్య మొందుచూ తరలి రాగ
అటునిటు నడయాడ యవె రెండు రథములు,
నందిఘోష యనెడి నరద మొకటి
ఆ.వె. ఆది విష్ణు తాను యధిరోహణము చేసె
అన్న చెల్లి కలసి యంత బాగు గాను
జయజయ ధ్వనులవె ఝంపె తాళము తోను
వెనుక రమని వదలి వెడలె తాను.
ఈ యాత్రలో లక్ష్మీ దేవిని పాల్గొన నియ్యరు. దానికి ఒక కమ్మని
కథ చెప్తారు. రథయాత్ర అరకోసు దూరంలో ఉన్న గుండీచా ఆలయం
వరకూ సాగుతుంది. గుండీచా ఆలయం జగన్నాధుని, తోట
విడిది. అరటి, కొబ్బరి మొదలైన చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది.
గుండీచా ఆలయంలో, ప్రధాన ఆలయంలో లాగ బ్రాహ్మణేతరులు
కాకుండా బ్రాహ్మణ పూజారులు పూజలు సల్పుతారు. దేవదాసీలు
తమ నాట్యాలతో స్వామిని అలరిస్తారు. తాము గోపికలై
గీతగోవిందంలోఅష్ట పదులు పాడుతూ నాట్యం ఆడుతూ ఉంటారు.
మూడవ రోజును హీరా పంచమి అంటారు. ఆ రోజున, తనని
ఇంట్లో వదిలేశారని కోపగించిన లక్ష్మీదేవి, సువర్ణ లక్ష్మిగా
వస్తుంది గుండీచా గుడికి. అలంకరించిన పల్లకీలో భక్తులు
తీసుకు వస్తారు ఆది లక్ష్మిని. అక్కడి పూజారులు అమ్మవారిని
పూజించి, జగన్నాధుని వద్దకు గుడిలోనికి తీసుకెళ్తారు.
ఆది దంపతులిరువురినీ ఎదురెదురుగా కూర్చో పెడతారు.
ఈ ముచ్చట మనసారా ఆస్వాదించడానికి భక్తులు
తండోపతండాలుగా వస్తారు.
పదుగురిలోనూ స్వామిని తమ నివాసానికి రమ్మని అర్ధిస్తుంది
లోక మాత. అంగీకారాన్ని తెలిపి పూల హారాన్ని.. జ్ఞాన మాలని
ప్రసాదిస్తాడు స్వామి. గుండీచా గుడినుండి బైటికి వచ్చి,
తన అసహనాన్ని, “రథ భంగం” చేయడంలో.. నందఘోషని
కొద్దిగా విరగ కొట్టడంలో చూపించి, చింత చెట్టు చాటున
దాగుతుంది రమ. వచ్చిన దారి లో కాకుండా, హీరా ఘోరీ
బాటలో వెను తిరుగుతుంది మహాలక్ష్మి.. తన కోపానికి
స్వామి ఏ విధంగా స్పందిస్తాడో అని భయపడుతూ.
ఈ విన్యాసాలన్నీ పూజారులు పరమానందంతో చేస్తుంటారు.
మరునాడు.. షష్ఠి రోజున రథాలని పడమటి దిక్కు నుంచి
దక్షిణం వైపుకి బహుదా యాత్రకి అనుకూలంగా తిప్పుతారు.
దీనిని దక్షిణ మోడా సేవ అంటారు.
సప్తమి రోజునుంచి మూడు రోజులు, రాసలీల జరుగుతుంది.
జగన్నాధుని రసమండపానికి తీసుకొస్తారు. గీత గోవిందం నుంచి
గీతాలు గానం చేస్తూ నాట్యం చేస్తారు దేవదాసీలు, గోపికల వలె
అలంకరించుకుని.
కవిరాజవిరాజితం (హంసగీతి)
1. మురళియె మోగెను మోదము కల్గగ
ముద్దుగ నర్తనముం సలిపే
కురికొని వచ్చిరి కోరిక చెప్పిరి
గోపిక లందరు ఘోష్టిగనే
గిరికొను చుండగ కేళినొనర్చగ
కీర్తనలూ సరి గీతములూ
సిరులొలికించుచు చేరిరిగా మరి
సేవలు బాగుగ చేయగనే
2. విరులను కూర్చిరి వేడుకగానదె
వెల్లువగా నిడె ప్రేమగనే
హరి చిరునవ్వుతొ యానతి నిచ్చెను
నాటలకే సిరి హాసముతో
మరులను గొల్పగ మానస మంతయు
మన్నన సేయగ మప్పిడెనే
చరణము లన్నియు జాలము సేయగ
చక్కగ నాట్యము సల్పగనే.
మామూలుగా నిశ్శబ్దంగా ఉండే గుండీచా ఆలయంలో ఆ ఏడు
రోజులూ శ్రవణాభరణంగా సాగుతుంటాయి గీత నర్తనాలు.
“జగన్నాధా.. పరాత్పరా, మనీమా..” భక్తులు పారశ్యంతో అరుస్తూ
ఉండగా, మేళతాళాలతో మొదలయింది జగన్నాధ రథయాత్ర.
ఆ రథాలను లాగడానికి పోటీపడి వస్తున్నారు భక్తులు.
అరకోసు దూరం.. కానీ, ఒక రోజంతా పడుతుంది గుండీచా
గుడికి చేరడానికి.
రాకుమారుడు కొద్దిదూరం రథం లాగి, పక్కకి తప్పుకున్నాడు.
అతడి వెనుకే మాధవుడూ, మిగిలిన పరివారమూ. గుండీచా
ఆలయానికి చేరాక, సాయం సంధ్యా పూజలకి వెళ్లి, మరునాడు
తిరుగు ప్రయాణం చెయ్యాలని కార్యక్రమం నిర్ణయం జరిగింది.
ఎక్కువ రోజులు రాజధానిని వదిలి ఉండరాదు. ఏ క్షణంలో
ఏ పక్కనుంచి దాడి జరుగుతుందో చెప్పలేరు.. మహారాజు,
మిగిలిన కుమారులు మూడు సరిహద్దులలోనూ దండయాత్రలు
చేస్తున్నా కూడా!
సంధ్యా పూజలు పూర్తయాక రాకుమారుని వసతికి వచ్చాడు
మాధవుడు.
“నీ పరివారంతో విశ్రాంతి తీసుకో మాధవా, సూర్యోదయాన్నే
బయల్దేరదాం.”
“మీకు రక్షణ..”
“ఇక్కడి సైనికాధికారి చూస్తాడు. నమ్మకస్తుడే.”
“ప్రభూ! రాయబారి, మంత్రి వరదయ్య ఇక్కడి నుంచే తీర
మార్గాన వెళ్లిపోతానంటున్నారు కాంచీపురానికి.”
“అదేమిటి? కొన్ని రోజులు మా ఆతిధ్యమో, లేదా బహుద
యాత్ర (జగన్నాధుని తిరుగు ప్రయాణం) అయే వరకూ ఇచ్చటనే
ఉంటారనుకున్నానే..” పురుషోత్తముడు ప్రశ్నార్ధకంగా చూశాడు.
“కాంచీపురం రాజు, వీరి రాకకై చూస్తుంటారు కదా దేవా!
రాకుమారి కూడా..”
“అవునవును. వలసిన ఏర్పాట్లు చూడండి. దారిలో ఆహారానికి
సమృద్ధిగా ఉండే టట్లు చూడండి.”
“రాజుగారికి ఏమయినా పత్రం రాసిద్దామా? అదే.. మన రథయాత్ర
గురించి, అందులో రాచ కుటుంబం, రాజుగారు వహించే పాత్ర..”
మాధవుడు అడిగాడు. అతనికి వరదయ్య అసంతృప్తత
తెలిసి పోయింది, అతడి హావభావాలతో..
“అక్కర లేదు. వారు దగ్గరుండి చూశారు కదా! మన భక్తి
భావాలు జగద్విదితమే. ఆ పరాత్పరుని సేవలో మనకి కులమత
భేదాలు లేవని తెలిసి పోతుంది బాగా. అంత కన్ననూ ఏం
కావాలి ఎవరి కైనా!”
పురుషోత్తమ దేవునికి చాలా తృప్తిగా ఉంది, మహారాజుగారు
తనచేత జగన్నాధుని సేవ చేయించి నందుకు. ఈ జన్మమునకు
అవకాశం దొరుకుతుందనుకోలేదు, తనకి కళింగ సింహాసనం
దక్కుతుందనికూడా ఎన్నడూ ఆశించ లేదు.. అంతమంది
సోదరులుండగా. మహారాజుగారి మనోగతం అవగతమయింది
కూడా మొన్న మొన్ననే కదా! వారు దండయాత్ర కెళ్లడం,
తనకి జగన్నాధుని సేవ దొరకడం అదృష్టమే!
మాధవుడు కించిత్ ఆందోళనగా వెను తిరిగాడు.
రాకుమారుడు, కాంచీపురం రాజుకి పత్రం రాసిస్తే ఎంతో
సౌకర్యంగా ఉండేది.. తన మనసుకి.
ఇప్పుడు ఈ వరదయ్య ఏం ప్రమాదం తెస్తాడో..
ఏదో అనిర్వచనీయమైన భావం అస్థిమితతకి లోనయ్యేలాగ
చేస్తోంది మాధవుని.
పెను ముప్పు రానున్నదా? వేచి చూడవలసిందే!
………………….
24 వ భాగం.
ఎప్పుడెప్పుడా అని పద్మావతి ఎదురు చూస్తున్న రోజు
రానే వచ్చింది. వరదయ్య మంత్రి కాంచీపురం వచ్చేశాడు.
ఏ వార్త తెచ్చారో.. తండ్రిగారు తన మనోహరునికిచ్చి ఎప్పుడు
పరిణయం చేస్తారో! పురుషోత్తమ దేవుని తలచుకుని ఊహలలో
తేలిపో సాగింది.
సభలో..
వరదయ్య వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు.
తెర చాటునుండి చూస్తున్న రాకుమారికి కుడి కన్ను అదిరింది.
ఈ అశుభ సూచన లెందుకో.. కలవర పడుతూ చూసింది.
వరదయ్యగారి మోము ప్రసన్నంగా లేదెందుకనో!
“వరదయ్య గారూ! సంతృప్తులయ్యారా మీరు గజపతుల రాకుమారుని
సమర్ధతతో, రాచ కుటుంబపు వివరములతో? పురుషోత్తమ
రాకుమారుని గురించి ఇప్పటి వరకూ మంచి మాటలే విన్నాము.
మీ యాత్రా విశేషములేమి? మీ అనుభవమ్మెట్టిది?”
రాకుమారి ముందుకు వంగింది, ఉత్సుకతతో.
“ప్రభూ! గజపతుల ఐశ్వర్యమ్మునకూ, వారి గుణగణాలకూ
సాటి ఎవరూ లేరు. ఎన్న దగిన వంశమే. కానీ..” సందేహముతో
ఆగి పోయాడు వరదయ్య.
“ఏం జరిగింది వరదయ్య మంత్రీ.. నిస్సంకోచంగా చెప్పండి.
పురుషోత్తముడు పిరికి వాడా? చదువులు నేర్వలేదా? కోపతాపముల నియంత్రించుకోలేడా? స్త్రీ లోలుడా? మదిర మత్తులో తేలుతుంటాడా?
భయం లేదు.. చెప్పండి.” మహరాజు మరీ మరీ అభయ మివ్వగా
మొదలు పెట్టాడు వరదయ్య.
“రాకుమారునికి ఎటువంటి అవలక్షణాలూ లేవు.. ఐతే..
సీ. ఇన వంశమున నెంతొ యింపుగా జనియించి
గజపతి పేరుతో గణుతి కెక్కె
పురుషోత్తముడనుచు పురజను పేర్మిని
కూర్మిని గ్రహియించె కోరి తాను
నారాయణు రథము నడిపించు సమయాన
మిన్నంటె సంబరం మేలు గాను
వంశ మర్యాదయే పాటించ లేకనే
ఛండాలుని వలెతా జాడు చేసె
ఆ.వె. క్షత్రియుడతడేను గాని పౌరుషమేమి
చేవ లేక తాను చిదియు పోయె
పరువు తక్కువైన పనిచేసి నదెగాక
భక్తి యనుచు నెంతొ బాగ నుడివె.
ఇదే ప్రభూ, నేను వీక్షించి సిగ్గుతో తలదించుకుని తిరిగి
వచ్చేశాను. ఇంక మన ఆడపడుచుని ఆ ఛండాల కార్యము
చేసిన వాని చేతికిచ్చెదరో లేదో.. మీ చిత్తము.”
వరదయ్య తాను చెప్పదలచినది చెప్పేసి, ఏదో భారం
దించుకున్నట్లు తేలిగ్గా కూర్చున్నాడు.
రాకుమారి పద్మావతికి గుండె దడగడలాడ సాగింది.
అయి పోయింది.. తన కలలన్నీ కల్లలై పోయాయి.
“ఏ విషయమైననూ విశ్లేషించే వారి చాతుర్యము మీద
ఆధారపడి మంచో చెడో నిర్ణయింపబడుతుంది. పోయి పోయి
ఈ నిత్యశంకితుడి చేత పడింది తన కళ్యాణం జరిపించడం.
భగవంతుని సేవకు కూడ ఇంత వక్ర భాష్యం చెప్పగలవాడు
ఇతడే ఈ జగాన.. తండ్రిగారే విధంగా స్పందిస్తారో!
జగన్నాధా నీవే దిక్కు.” పద్మావతీదేవి మనసులో
వేయి మొక్కులు మొక్కుకుంది. రాజును అనుకూలంగా
ఆలోచించేలా చెయ్యమని.
కానీ.. జగన్నాధుని సంకల్పం వేరుగా ఉంది.
రాజు స్పందన ప్రతికూలంగా ఉంది. కన్నులు ఎర్రవారాయి.
ముక్కుపుటాలు అదురుతున్నాయి. చెయ్యి కత్తిపిడి మీదికి చేరింది.
ఎంత ధైర్యం.. ఛండాలురి పని చెసే రాజు, తన కుమార్తెను
కోరడమా!
“వెంటనే కటకం రాజుకి వర్తమానం పంపండి. మా రాకుమారిని
అటువంటి వారికివ్వడానికి ఇష్టం లేదని. పెండ్లి అయ్యాక
మా ఆడపడుచుని కూడా చీపురు పట్టుకుని రహదారిని
ఊడవమంటారేమో! ఆ రాకుమారునికి, సేవకుల కూతురైతే సరి
పోతుంది.” రాజు లేచి విసవిసా నడిచి వెళ్లి పోయాడు.
పెనుముప్పు సంభవించ బోతోంది. ఏ విధంగా
ఆపగలుగుతుంది తాను?
మరి పురుషోత్తమ రాకుమారుని మీద పెంచుకున్న మమత?
తన మదినిండుగా అతని రూపే.. అతడే యరుదెంచి సమస్యని
పరిష్కరించవలె కాదా..
కం. తలకించెను మది నిన్నే
తలచి తలచి యేమరగను తలపున నీవే
తలవాకిట నీవే కద
తలరారగ వచ్చి నా వెతల మాన్పనుగా.
కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన మందిరానికి చేరుకుంది
పద్మావతి.
తన వలపు సఫలమవకపోయినా ఫరవాలేదు.. ఆ జన్మ
బ్రహ్మచారిణిగా ఉండి పోగలదు. ఆ వరదయ్య సంకుచితత్వం
అంతా పదాలలో తెలుపుతూ లేఖ పంపుతే ఎంత ప్రమాదం?
అసలు, ఆలయాలకి కాణాచి యైన కాంచీపురంలో నివసిస్తూ,
జగన్నాధుని సేవలో రాజూ, పేదల తారతమ్యాలుండవని..
ఆ మాత్రం గ్రహింపు ఆ మంత్రికి కానీ, ఈ రాజుకి కానీ లేకపోవడం
ఎంత ఆశ్చర్యం? ఆవేదనలో తండ్రినే పరాయివానిగా భావన
వచ్చింది పద్మావతికి. అది సహజమే.. తన వారనేది
ఎవరయ్యా అంటే ఆ పరాత్పరుడే కద..
ఎంతటి పుణ్యం చేసుకుంటే, ఆదివిష్ణువు సేవ లభ్యమవుతుంది.
ఆ పుణ్యాత్మునికి ఇల్లాలుగా వెళ్లి అటువంటి సేవలో పాలు
పంచుకొనగలగడం ఎంతటి అదృష్టం?
తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు తండ్రి.
పద్మావతీదేవి భయాందోళనలు నిజం చేస్తూ, కళింగదేశానికి
రాయబారి లేఖను తీసుకుని వెళ్లిపోవడం జరిగి పోయింది.
కాంచీపురంనుంచి మంచి వార్త కోసం ఎదురు చూస్తున్న
మాధవునికి ఆశాభంగం కలిగించిందా లేఖ. వార్తాహరుడు
మాధవునే కలిశాడు కటకం రాగానే. అతడే కద మరి కంచి రాజు
సభకి రాయబారిగా వెళ్లిన వాడు.
ఈ లేఖ చదివి పురుషోత్తముడే విధంగా స్పందిస్తాడో
తలచుకుంటే వెన్నులోంచీ చలి వేసింది మాధవునికి. రాకుమారుడు
అంత కోపిష్టి కాదు. పోన్లే అని వదిలేసినా వదిలెయ్య వచ్చు.
అలా అని పట్టించుకోకుండా ఉండగలిగేటట్లు లేదు ఆ లేఖ.
వరదయ్య చాలా అవమానం కలిగించేట్లు రాశాడు.
కంచి రాజుగారి సభలో చెప్పిన పద్యం లాగే.. అంతకంటే
ఇంకా కఠినంగా.. జుగుప్స కలిగించే పదాలని వాడాడు.
ఎందుకో గానీ వరదయ్య మంత్రికి గజపతుల మీద ఆగ్రహం ఉందేమో
అనిపించేలాగ ఉంది ఆ లేఖ.
అది నిజమే కూడా.. గాంగేయరాజు భానుదత్తుడి ఆస్థానంలో
ఉండి అతడి పరివారంతో పాటుగా, కపిలేంద్రుడిచే వెళ్ల
గొట్టబడ్డాడు వరదయ్య. రాజ్యం కోల్పోయి, అజ్ఞాతంగా కాలం
గడుపుతున్న రాజు దగ్గర ఉండలేక, కాంచీపురం రాజు ఆస్థానంలో,
తన తెలివితేటలతో స్థానం సంపాదించి నిలదొక్కుకున్నాడు.
ఏ మాత్రం అవకాశం దొరికినా గజపతుల పతనాగ్నికి ఆజ్యం
పొయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈసంగతులేమీ తెలియని మాధవునికి ఆలేఖనీ, అది తెచ్చిన
వార్తాహరునీ ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.
కానీ మిత్రునికి ఇవ్వకుండా ఉండలేడు. ఇస్తే ఫలితమెట్లుండునో.
రాకుమారుడు కూడా వార్త కోసం ఆతృతగా యెదురు చూస్తున్నాడు.
తప్పదు..
గుండె చిక్క బట్టుకుని పురుషోత్తమదేవుని మందిరానికి వెళ్లాడు.
“మాధవా రా..రా. ఇప్పుడే అనుకుంటున్నా నీ గురించి.
వార్తేమైనా వచ్చిందా?”
వచ్చిందన్నట్లుగా నిలువుగా తలాడించాడు మాధవుడు.
“ఏదీ లేఖ?” చెయ్యి చాచాడు రాకుమారుడు.
నెమ్మదిగా పత్రం విప్పి చేత పెట్టాడు మాధవుడు.
ఉత్సాహంగా చదవడం ఆరంభించిన పురుషోత్తముడి
కన్నులు నెమ్మదిగా ఎర్రవారడం మొదలయ్యాయి. పూర్తిగా పఠించిన
పిదప, ఆగ్రహావేశాలతో లేచి నిలుచున్నాడు.
సీ. ఘనుడా యతడు లేక గార్దభ జన్మము
నెత్తిన మూర్ఖుడా నేమి తలతు
ఆది దేవుని సేవ యందులీన మగుట
యంత హీనమగునా యకట, నేమి
యీ కండ కావరం, యే మహరాజుని
ఛండాలు డననెంత జాడ్య మౌగ
నుచ్ఛము నీచమును రవంతయును లేదు
నాలుక తిరిగన నట్ల నుటయె
తే.గీ. ఇచ్చటను నే ప్రతిన పూని యీక్షణమును
చెప్పు చున్నాడ వినుమదే చేకొనియెద
సమరమున రాకుమారిని సాధనమున
పెండ్లి చేయ ఛండాలుతో పెంపు గాను.
మాధవుడు భయపడినంతా అయింది. ఏం చెయ్యాలిప్పుడు..
“రాకుమారా! తెలియక రాసిన లేఖ అయుంటుంది. నేను వెళ్లి
విషయం వివరించి వస్తాను. మీ పైననే అనురాగం పెంచుకుని,
ఆశలు పెట్టుకున్న రాకుమారిని మధ్యలో శిక్షించ వద్దు.
చేతులు పట్టి ప్రాధేయ పడుతున్నా దేవా. కనీసం తండ్రిగారు
వచ్చే వరకూ ఆగండి.” బ్రతిమాలాడు పురుషోత్తముని.
“అదేమీ తెలియక రాసిన పత్రం కాదు. ఒడలంతా పొగరు
పట్టి రాసినది. అటువంటి తండ్రికి జన్మించినందుకు పద్మావతి
అనుభవించ వలసిందే. నువ్వు చెప్పినట్లు తండ్రిగారు వచ్చు
వరకూ ఆగెదను. వారైననూ ఉపేక్షించెదరనుకోను. ఇది
ఘోరమైన అవమానం. కోరి వధువు నడుగుతే.. ఇటువంటి
లేఖయా”
“దేవా! ఊరట చెందండి. జరిగేది జరుగక మానదు. మనం
మహానదీ తీరమునకు వెళ్లి కాసింత ధ్యాన మగ్నుల మవుదాము.
నేను వెళ్లి అశ్వములను తీసుకుని వచ్చెదను.” మాధవుడు
నమస్కరించి, మందిరం వెలుపలికి వచ్చి, కాంచీ పురం నుంచి
వచ్చిన వార్తా హరుని పంపి వేశాడు.
“ప్రభూ! మీరేమీ లేఖ ఇవ్వరా?” వార్తాహరుడు అడిగాడు.
కనీసం ఆహారం సదుపాయం కూడా చెయ్యకుండా పంపేస్తున్నారని
కినుకగా ఉందతడికి.
“త్వరలో జాబుకి ఎదురు చూడమని మీ రాజుకి మనవి చెయ్యి.”
వింతగా చూస్తూ వెను తిరిగాడు వచ్చినవాడు. వానికి అక్షరాలు
చదవడం రాదు. తమ రాజుగారిని మన్నించకుండా సంబోధిస్తుంటే
ఆశ్చర్యం కలిగింది.. లేఖలో ఏముందో తెలియని రాయబారికి.
కావాలనే అటువంటి వానిని పంపాడు, వరదయ్య మంత్రి.
…………………
“కొత్త మార్గాన తీసుకొస్తున్నావు మాధవా?”
పురుషోత్తమ దేవుడు ఉదాసీనంగా అడిగాడు.
“అవును ప్రభూ! కాస్త ఎక్కువ దూరం సవారీ చేస్తే మనసు స్థిమిత
పడుతుందని. చుట్టు తిరిగి గుట్టల దారిలో తిప్పాను అశ్వాన్ని.”
“చూశావా! మన మనోగతంలాగే ఉంది ప్రకృతి కూడా. ఎక్కడా
పచ్చదనం లేదు.” నిర్వేదంగా అన్నాడు రాకుమారుడు.
“దాందేముంది ప్రభూ.. ఒక క్రోసు వెళ్లామంటే పచ్చదనం
వచ్చేస్తుంది. ఓరిమి వహించాలంతే.”
హూ.. ఓరిమి. ఎంత కష్టం.. అనుకున్నాడు పురుషోత్తమదేవుడు!
పడ్డవాడికి తెలుస్తుంది బాధ.. పక్కనున్నవాడికేమి? ఎన్నైనా
నీతులు చెప్పగలడు.
మాధవుడికి అర్ధమయింది. కానీ ఏమి చేయగలడు? కాస్త
గుడ్డిలో మెల్ల.. కపిలేంద్ర దేవులు త్వరలో రానున్నారు.. అదీ,
కొంత వంగ దేశాన్ని స్వాధీనం చేసుకుని. వారు అనుభవజ్ఞులు.
ఏనిర్ణయం తీసుకున్నా సరైనదే అవుతుంది.
“మాధవా!”
“ప్రభూ..”
“కత్తి యుద్ధం చేద్దామా? ఆవిధంగా ఆవేశం తగ్గించుకోవచ్చేమో!”
“అవశ్యం ప్రభూ. ఇక్కడే.. దగ్గర్లో మైదానం ఉంది. అక్కడ చేద్దాం.
చాలా రోజులయింది మనిద్దరం చేసి.”
ఇద్దరూ, మహానది ఒడ్డునే.. ఇసకలో ఉన్న మైదానం లోకి
వెళ్లారు. గుర్రం దిగి, సర్దుకుని కత్తి ఝళిపిస్తున్న రాకుమారుని చూసి
మాధవుడికి గుండె దిగజారి పోయింది. అంతటి రౌద్రం ఆ మొహంలో..
ఆ విదిలింపులో..
సంధ్య కాంతిలో మరింత.. ప్రళయకాల రుద్రుడి లాగనే ఉన్నాడు.
“ప్రభూ! భయం వేస్తోంది మిమ్ము చూస్తుంటే..”
“ఫర్లేదు మాధవా! గురుకులంలో అభ్యాసం చేసినట్లే.. కాకపోతే
కాస్త ఆవేశం జోడించి..”
మాధవుడు కూడా కిందికి ఉరికి కత్తి పట్టాడు.
మొదట్లో ఆటలాగ మొదలైన యుద్ధం.. పోను పోను భీకరంగా
సాగుతోంది.
మాధవుడు, రాకమారుని విసుర్లని తప్పించుకుంటూనే దీటుగా
చేస్తున్నాడు. రెండు ఘడియలు పోరాటం అయ్యాక.. రాకుమారుడు
కంఠం మీదికి విసిరిన వేటు అతి కష్టం మీద తప్పించుకుని, కిందికి
పడిపోయి దండం పెట్టాడు.
“ప్రభూ! ఇంక చాలు.”
కత్తి కింద పడేసి, పురుషోత్తముడు కూడా, నేల మీదికి
వాలి పోయాడు.
“రేపటి నుంచీ, ఇదే అభ్యాసం. గజసైన్యం, అశ్వ దళం..
అందరినీ అప్రమత్తులని చేసి, యుద్ధానికి సన్నిద్ధులని చెయ్యాలి.
గురుకులాలలో మిగిలిన విద్యార్ధులనందరినీ సైన్యంలోనికి తీసుకోవాలి.
అందరం అదే పని మీదుందాం.”
“నదికి వెళ్లి అర్ఘ్యం సమర్పిద్దామా దేవా?” మాధవుడు
వినమ్రంగా అడిగాడు.
పురుషోత్తముడు నవ్వుతూ లేచి, మాధవునికి చెయ్యందించాడు.
కానీ.. ఆ నవ్వు పేలవంగా ఉంది.
……………..
25
కపిలేంద్ర వర్మ కటకం వచ్చి నాలుగు రోజులయింది.
ఈశాన్య సరిహద్దులో కలకలం సృష్టిస్తున్న జానుపూర్ సుల్తాను,
మహమద్ షాని వెళ్లగొట్టడమే కాక, అతని రాజ్యం లోని
కొన్నిపట్టణాలను ఆక్రమించుకుని విజయోత్సాహలతో
వచ్చిన రాజు, తన రాజ్యం లోని పరిస్థితులనవగాహన
చేసుకుంటున్నాడు.
పురుషోత్తమ దేవుని పరిపాలనతో సంతుష్టుడయ్యాడు.
మాధవుడతడికి చేదోడు వాదోడుగా ఉండటం మరింత తృప్తినిచ్చింది.
గత మూడు రోజుల నుంచీ అశ్వ, గజ దళాల అభ్యాసాల
గురించి కూడా వింటున్నాడు. రాకుమారుడు, సైనికులనందరినీ
కత్తి యుద్దంలోనూ, విలు విద్యలోనూ అభ్యాసం చేయిస్తున్న
విన్యాసాలని కూడా విన్నాడు.
కటకం పట్టణ రక్షణకై ఉంచిన సైన్యాన్ని కూడా అప్రమత్తంగా
ఉంచుతున్నందుకు పురుషోత్తమ రాకుమారుడిని మనసులో
మెచ్చుకున్నాడు.
కంచి విశేషాలు తెలుసు కోవడానికి ఆరోజు కుదిరింది
కపిలేంద్రవర్మకి.
కుమారుడుని, మాధవుడిని తన మందిరానికి పిలిపించాడు.
“కుమారా! కాంచీపుర విశేషాలేమి? వరదరాజ స్వామిని
అర్చించి వచ్చారా? శివ కేశవులకు భేదము లేదు. ఏకాంబరేశ్వరునికి
అభిషేకము చేసి వచ్చితిరి గాదా! జగములనేలు అమ్మ
కామాక్షిదేవిని కళింగదేశమును చల్లగా కాచుకొమ్మని వేడినారు
కదా! మార్గ మధ్యమున నే అవరోధములనూ ఎదుర్కొన లేదుగా?”
“మార్గాయాసము ఏమీ లేకుండా చల్లగా వెళ్లి వచ్చాము
ప్రభూ. మధ్య మజిలీలు కూడా ఆహ్లాదంగా గడిచాయి.
కంచిలో అన్ని ఆలయాలలోనూ అర్చిత సేవలు చేసుకున్నాము.”
మాధవుడు వివరించాడు.
“కుమారుని మోమెందుకో ఉదాసీనంగా ఉంది మరి. కారణమేమి?”
పురుషోత్తమదేవుడు మాట్లాడకుండా ప్రక్కకి చూశాడు.
మాధవుడు మౌనంగా ఉండిపోయాడు.
“కుమారుని వరించెనని చారులు చెప్పిన యతివ
యనుకూలమనపించలేదా? వ్యాకులతకు కారణం ఏమి?
కాంచీపుర రాజుని కలవలేదా? వివరం తెలియజెయ్యి
మాధవా!” మహరాజు ఆజ్ఞాపించాడు.
మాధవుడు తాము కంచి వెళ్లినప్పటి నుండి జరిగిన
సంగతులన్నీ వివరించాడు.
“అక్కడ కొలువులో ఉన్న వరదయ్య మంత్రి మన మీద
కక్ష కట్టినట్లు అనిపించింది ప్రభూ! అతడే.. నేను అడిగినప్పుడు
సంతోషంగా ఒప్పుగుని సరే అన బోయిన కంచి రాజుకి అడ్డు
కట్ట వేశాడు. ఆ తరువాత జగన్నాధుని రథయాత్రకి విచ్చేశాడు.”
కపిలేంద్రుడు తల పంకించాడు.
“ఐతే.. ఆ వరదయ్య తిరిగి వెళ్లి ఆ రాజుకు ఏం చెప్పాడో..”
మాధవుని మాట పూర్తి చెయ్యలేదు..
“రాయబారిగా వచ్చినవాడు అపభ్రంశంగా వదరుతే సరిదిద్ద
వలసిన ధర్మము రాజు దేకదా! అంతటి అవమానకరమైన లేఖ
రాస్తాడా? ఇది మన పరువుకీ, మన శక్తికీ సంబంధించిన విషయం తండ్రీ!
కం. పరమాత్ము సేవ నగడుగ
పరిహాసము సల్పు వారు పాతకులె కదా
హరికి విరోధులగుదురుగ
మరి యరి భంజనము సేయ పరగెద తండ్రీ!”
పురుషోత్తమ దేవుడు ముక్కు పుటాలదురు తుండగా, ఆగ్రహాన్ని
అదుపులో పెట్టుకొనుటకు ప్రయత్నించాడు.
“అటులనే చేద్దాం కుమారా! మరికొంత శిక్షణ ఇవ్వాలి
సైనికులకూ, అశ్వ గజములకూ కూడా. మన సైన్యాధ్యక్షునికి
చెప్తాను. యుద్ధానికి సన్నిద్ధం కమ్మని. కానీ.. ఉత్తర దండయాత్ర
నుంచి వచ్చి నాలుగు దినములు కూడానూ అవలేదు. సైనికులంతా
అలసి సొలసి ఉంటారు. కొన్ని రోజులు వారి వారి కుటుంబాలతో
గడవనిద్దాం. పిదప.. సడి చెయ్యకుండా బయలుదేరి ఆకస్మాత్తుగా
మీద పడాలి. అదే మన వ్యూహం.” మహారాజు అనుభవంతో చెప్తున్న
మాటలు..
అక్కడ విజయనగరం దేవరాయలి అండ ఉంది. నెమ్మదిగా..
తెలియకుండా కొద్ది కొద్దిగా సైన్యాన్ని సరిహద్దులకి చేరుస్తుండాలి.
మధ్యలో రెడ్డిరాజుల పాలన.. ఎంత అసమర్ధులైనా.. ఇంకా వారి
రాజ్యం స్వాధీనమవలేదు.. కపిలేంద్ర వర్మ ఆలోచిస్తున్నాడు.
పురుషోత్తముడిని త్వరపడద్దని బాగా హెచ్చరించాలి.
“దగ్గరగా రా కుమారా! పరిష్వంగ సుఖం మా కందించు.” తండ్రి
మాటను మన్నించి పురుషోత్తమ దేవుడు, అతడి కౌగిలిలో ఒదిగాడు.
కానీ.. ఇంకనూ ముఖమంతా కందగడ్డలా ఎర్రగానే ఉంది,
భావోద్వేగాలతో.
“ఒక్క రెండు నెలలు కుమారా.. యుద్ధానుభవాలింకనూ
మెదలుతూ ఉంటాయి సైనికులకి. అవి కాస్త మరపుకి రానివ్వాలి.
ఈ లోగా మీరు మీ అభ్యాసాలు, శిక్షణలూ బాగుగా చేస్తూ
ఉండండి. మీ కోరిక తప్పక తీర్చగలను. ఇదే నా వాగ్దానము.
ఇంక మీమీ పనుల మీద నిమగ్నమవ్వండి.” చేతిలో చెయ్యేసి,
భుజం మీద నొక్కి వదిలాడు మహారాజు.
…………………
పురుషోత్తమ దేవునికి ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. ఇంకా
రెండు మాసములా! ఆ లోగా కంచి రాజు స్వయంవరం చాటింపు
వేశాడని చారులు చెప్పారు.
తను సైన్యాన్ని సమాయత్తం చేశాడు కదా.. ఎందుకు ఆగాలి
అన్ని రోజులు?
కంచి రాజు వద్ద సైన్యం అంత యెక్కువ ఉన్నట్లు లేదు.
రేపే తండ్రికి చెప్పి సమరానికి తరలి వెళ్లాలి..
ఒక నిర్ణయానికి వచ్చి నిదుర కొరిగాడు.
కపిలేంద్ర వర్మ.. చెట్టంత ఎదిగిన కొడుకుని ఏమనలేక
పోయాడు.
“సరే.. మీకంత తొందరగా ఉంటే.. తప్పదనుకుంటే, మీరు
తయారు చేసుకున్న సైన్యంతో వెళ్లండి” అన్యమనస్కంగానే అనుమతి
ఇచ్చాడు.
కానీ.. మనసులోనే ఏదో ప్రణాలిక వేసుకుంటున్నాడు. పైగా..
చెప్తే వినేట్లు లేడని.. స్వయంగా అనుభవంతో నేర్చుకుంటాడని అ
నుమతిచ్చినట్లున్నాడు. తండ్రి ప్రేమ అంటే అంతే మరి..
కం. కొడుకుల మాటల కాదన
కడిమిని చూపగ నరగొనుగ జనకులు యిలన్
బడిమిని సేయుట నైనను
తడబడకను చేసెదరుగ తప్పుల నెన్నో.
కపిలేంద్ర దేవుడు అంత తెలివి తక్కువగా తప్పులు
చేయు వాడు కాదు. ఎంతటి మేధ లేక పోతే.. రాజ్యంలోపలి,
వెలుపలి శత్రువులను మెలకువతో నియంత్రించ గలుగుతున్నాడు?
పురుషోత్తముడు మరునాటి నుంచే సైన్యాన్ని సమాయుత్తం
చేయుట ఆరంభించాడు.
మంచి ముహుర్తం చూసుకుని నూటపది ఏనుగులతో, రెండువందల
అశ్వాలతో బయలుదేరాడు.. ఆరు విడతలుగా.
మరీ ఎక్కువమంది ఒకేసారి కదుల్తే చారులు వార్తని చేరేస్తారు.
మధ్యలో రెడ్డి, విజయనగర రాజ్యాల మీదుగా వెళ్లాలి. ఏనుగులకి
అడవుల్లో వెళ్లడం తెలుసు కనుక అటవీ మార్గంలో పయనం
సాగించారు. ఎదురవుతున్న ఆటంకాలని తొలగిస్తూ, సాగుతున్నారు.
రాత్రి సమయాలలో తమ శిబిరాల వద్ద, నెగడులు, మంటలు
పెట్టుకుని జంతువుల నుండి రక్షించుకుంటున్నారు.
కాంచీపురం సరిహద్దుల వద్ద, అడవి మధ్యకు చేరి, శిబిరాలను
నిర్మించుకుని రణానికి సన్నిద్ధులయ్యేసరికి పక్షం రోజులు పట్టింది.
పద్మావతీ దేవి స్వయంవర సన్నాహాలలో ఉన్న కంచిరాజుకి
వార్త చేరనే చేరంది. వేగులు అప్రమత్తులై అన్ని ప్రాంతాలలోనూ
తిరుగుతూనే ఉంటారు.
స్వయంవరం నిలిపి వేసి, తానుకూడా యుద్ధానికి సిద్ధంగానే
ఉన్నాడు.
నాలుగు రోజుల సమరం తరువాత, పురుషోత్తముని సైనికులను,
వెళ్లగొట్టి విజయ భేరి మోగించాడు కంచి రాజు.
ఏనుగులకి గాయాలు మాత్రమే అయ్యాయి కానీ.. అశ్వాలు
ఇరవై, సైనికులు పదిమంది మరణించారు. తాను చేపట్టిన
తొలి యుద్ధంలో ఓడిపోయి వెనుతిరిగాడు పురుషోత్తమ దేవుడు.
అప్పుడు అర్ధ మయింది.. అనుభవజ్ఞుడైన తండ్రి చెప్పిన
మాటలలోని సత్యం. తొందరపాటుతనం ఎంత చేటో కూడా
తెలియవచ్చింది.
అవమాన భారంతో.. నెమ్మదిగా వెనుతిరిగి వెళ్తున్న
పురుషోత్తముడ్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు మాధవుడు.
ఆశాభంగం ఎంతటి పని నైనా చేయిస్తుంది. రాకుమారుడు ధ్యాన
యోగాదులతో కొంత తేరుకుంటున్నాడు. దారిలో రంగనాధ స్వామి
ఆలయ దాపుల్లో విడిది చేశారు సైనిక బృందం.
సంధ్యావందనాది కార్యక్రమాలయ్యాక, పురుషోత్తమ దేవుడు
వంటరిగా ఆలయంలో గడుపుతానని చెప్పాడు. స్వామి దర్శనం,
పూజ అయిన పిదప చీకట్లు ఆవరించుకోవడంతో గర్భగుడి
తలుపులు మూసి వెళ్లిపోయాడు అర్చక స్వామి.
“స్వామీ మేమీ రాత్రికి ఇచ్చట విశ్రమించ వచ్చా?”
మాధవుడు అడిగాడు.
“కొద్దిమంది ఫరవాలేదు సామీ.. కానీ.. జాగ్రత. దోపిడీ
దొంగలుంటారు. బాట సారులని దోచుకుంటారు.” హెచ్చరించి
వెళ్లిపోయాడు అర్చకుడు.
రాకుమారునికి, తనకీ ఆహారం అక్కడికే తెప్పించి, ఇద్దరు
సైనికులని మాత్రం ఉండమని అందరినీ తమ సత్రాలకి వెళ్లమని
చెప్పాడు. ఏనుగులూ, అశ్వాలూ వాటి వాటి శాలల్లో సేద
తీరుతున్నాయి.
గర్భగుడిలో వెలుగుతున్న దీప కాంతులు తప్ప ఏ వెలుతురూ లేదు.
సైనికులిద్దరినీ వంతుల వారీగా ప్రధాన ద్వారం వద్ద కాపలా
కాయుమని, తను మండపం అరుగు మీద, రాకుమారు దృష్టికి ఆనేట్లుగా
కూర్చున్నాడు.
ఏ క్షణమైనా, కత్తి ఒరలోనుండి లాగడానికి సిద్ధంగా..
ఒక ఝాము గడిచింది.
పురుషోత్తముడు కన్నులు మూసుకుని ప్రార్ధిస్తున్నాడు.
ఉ. “చేసిన నేరమేమి యది? చీకిలితో నొక తీరుగా నదే
వాసిగ తేరునూడిచితి భక్తిన, రాజను దృష్టి చూపకే
చేసితి నేనహర్నిశము సేవను శ్రద్ధగ నీదయం గొనన్,
భాసమునే కటాక్షమును బాసిల రావదె నన్ను బ్రోవగా.”
కన్నుల వెంట నీరు కారి పోతోంది ధారగా.
“జగన్నాధా! దీన బాంధవా.. బుద్ధి తెలిసిన నాటి నుంచీ
నీ సేవ చేసుకుంటున్నాను. ఆసేవనే పరిహసిస్తుంటే
సహించలేక సమరానికి సంసిద్ధమై
వెడలితిని. చెడు మాటలన్నవారిని శిక్షింపక యుండుట
న్యాయమా? నా పక్షమున నిలచి చేదోడుగా ఉండి గెలిపించక
పోతివా పరంధామా!”
మనసంతా జగన్నాధుని మీద ఉంచి ప్రార్ధిస్తున్నాడు రాకుమారుడు.
ఆదిదేవుని రూపు తప్ప మరి ఏదీ కాన రావట్లేదు.
ఆ విధంగా రెండు ఘడియలు కూర్చుని ఉంటాడు..
స్పష్టంగా, గంభీమైన కంఠస్వరం విన వచ్చింది..
“రాకుమారా విచారము మాని వెనుకకు మరలు. కాంచీపుర
రాజుతో మరల యుద్ధం చెయ్యి. ఈ మారు తప్పక గెలుస్తావు.
నా ఆభయం, సహకారం ఉంటుంది. నీ సైనికులకు కూడా తగిన
శక్తి లభ్యమవుతుంది.”
“నిజంగానా! ఆ పరాత్పరుడు నాకు సందేశ మిచ్చాడా?”
నమ్మలేని పురుషోత్తమదేవుడు కన్నులు తెరిచాడు.
రెండు ఘడియలనుకున్నాడు కానీ.. తెల్లవార వచ్చింది.
అయినా అలసటనేది లేదు. రాత్రంతా విశ్రమించినట్లే అనిపించింది.
రాకుమారుడు కన్నులు తెరవగానే, మాధవుడు వచ్చేశాడు.
“ప్రభూ! కుశలమేనా?” ఆందోళనగా అడిగాడు. రాత్రంతా
మెలకువతో ఉన్నా, కించిత్తుకూడా సోలిపోకుండా కళకళ్లాడుతూ
కనిపించాడు మాధవుడు.
“కుశలమే మాధవా! నాకు జగన్నాధుడు ఆదేశమిచ్చాడు..
వెనుకకు మరలి సమరం సాగించమని. తాను సహకారం
అందిస్తానన్నాడు. మన సైనికాధికారులకు విషయం తెలియ
పరచండి.”
“అట్లే చేద్దాం దేవా! అధికారులతో మాట్లాడుతాను.”
మాధవుడు, పురుషోత్తముడు, పినాకినీ నదికి వెళ్లి స్నాన
పానాదులనంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలి వచ్చారు.
వారు తిరిగి వచ్చేసరికి, సైనికులు కాలకృత్యాలు తీర్తుకుని,
ఫలహారాలు చేసేసి తయారుగా ఉన్నారు. ఆహార పదార్ధాలు,
వంటవారు కూడా వారి వెంట ఉంటారు. అనువైన చోటు
చూసుకుంటే రెండు ఘడియల్లో భోజనం తయారై పోతుంది.
సైన్యాధికారులు తయారుగా ఉన్నారు.
రాకుమారుని, మాధవుని చూడగానే దగ్గరగా వచ్చారు.
“ప్రభూ! మన సైనికులు కూడా ఓడిపోయి వెనుకకు మరలడాన్ని
చిన్నతనంగా భావిస్తున్నారు. మరల యుద్ధం చెయ్యడానికే
ఆటంకమూ లేదు. మనం ఇప్పుడే.. తక్షణమే మరలచ్చు.”
ముఖ్య సైనికాధికారి వచ్చి సెలవిచ్చాడు.
మాధవుడు పురుషోత్తముడిని ఉత్సాహ పరచి, ఫలహార
శిబిరానికి తీసుకెళ్లాడు.
“మాధవా! నేను చేస్తున్నది మంచి పనేనంటావా? అలసి సొలసిన
సైనికులను, అశ్వాలనూ మరల యుద్ధం చెయ్యమనడం అమానుషం
అవుతుందా? మనం మరింత నష్ట పోతామా?”
మాధవుడు చిరునవ్వు నవ్వాడు.
భృకుటి ముడిచి వింతగా చూశాడు పురుషోత్తముడు.
తనెంతో వేదనలో ఉంటే నవ్వడం.. అదేమి పద్ధతి..
“అపార్ధం చేసుకోకు మిత్రమా! కురుక్షేత్ర సంగ్రామం ముందు
అర్జునుడి మాటల్లాగ అనిపించి నవ్వొచ్చింది. ఆరంభంలో నిర్వేదం
ఆ మహానుభావునికే తప్పలేదు మనమెంత? కృష్ణ పరమాత్మ
చెప్పింది మననం చేసుకోవడమే మనం చెయ్యవలసింది.
* ఆ.వె చేయదగినదియును, చేయరాదనెడిది
నీదు కరమునందు నేది లేదు
పాత కర్మ కెపుడు పాశ బద్ధుడ వీవు
కనుక కదలవయ్య కదనమునకు.
ఇంకా..
* ఆ.వె. పురుష శ్రేష్ఠ! నీకు పూర్తి గోప్యమునైన
జ్ఞానమిచ్చినాను జ్ఞాని కమ్ము
బుద్ధిమంతుడ వీవు పూర్తిగా యోచించి
సబబు నైనదొకటె సాగనిమ్ము.
(*ప్రముఖ పాత్రికేయులు శ్రీ గోపీనాథ్ పిన్నలిగారు
అందరికీ అర్ధమయే రీతిగా భగవద్గీత అధ్యాయలను
తెనిగించారు. వారి సౌజన్యంతో.. అందులోని పద్యాలు.. రచయిత్రి.)
పై విధంగా చెప్పి భగవానుడు అర్జునుడి నిర్ణయానికే వదిలేశాడు.
కానీ.. ధర్మమునకు కట్టుబడిన అర్జునుడు కదనానికి కదిలాడు..
పరమాత్మ బోధించినట్లుగా.
అదే విధముగా, పరాత్పరుని సేవలో లీనమయిన భక్తులను
అవమానించడం, భగవంతుని దూషించడం కన్నా ఘోరమైన నేరం.
ఆ నేరాన్ని కంచి రాజు చేశాడు. అందుకు శిక్ష పడాలిసిందే.
భగవానుడి ఆనతి కూడా అయిన పిదప ఆలోచించ
వలసిన పని లేదు. అయిననూ.. మరొకమారు యోచించి..” మాధవుని
మాట మధ్యలో
ఆపేసి ఫక్కున నవ్వాడు పురుషోత్తముడు.
“నిర్ణయం తీసుకోవాలి. అంతేగా! ఆ శ్రీకృష్ణులవారి లౌక్యము
కన్ననూ మిక్కుటముగా మించిపోయావయ్యా మాధవా! అదే
పేరు కదా మరీ.. రణ భేరి మోగిద్దాం.. పద.”
…………………
26
మాధవుడు రాకుమారునికి కొద్దిగా వెనుకగా తన అశ్వాన్ని
నడిపిస్తున్నాడు. సమరానికి సంసిద్ధమయ్యాక, వారం రోజులాగి
వెళ్దామన్నాడు మాధవుడు. ఆ లోగా వైద్యులని పిలిపించి,
దెబ్బలు తగిలిన, భటులకి, అశ్వాలకి, గజాలకీ వైద్యం
చేయించాడు. బలమైన ఆహారం ఇప్పించాడు. రోజూ అభ్యాసాలు
చేయించాడు.
అనుకూలమైన అటవీ ప్రాంతం లభ్యమయింది అదృష్టవశాత్తూ..
ఆ ప్రాంతం.. రెడ్డి, రాయల రాజ్యాల మధ్యలో.. అనామకంగా
ఉంది. జన సంచారం కూడా ఎక్కువగా లేదు.
శన్యూషమందు వినాయకుడిని, జగన్నాధుడినీ అర్చించి
బయలు దేరారు.. ఈసారి ఇంకా చిన్న గుంపులుగా..
అయినా.. విజయోత్సవాలలో మునిగి పోయిన కాంచీపురం రాజు,
తిరిగి గజపతులు దండయాత్రకి వస్తారని ఊపించలేదు.
ప్రమత్తంగా ఉన్నాడు.
చారులు కూడా, పురుషోత్తముడు వెనుతిరిగి వెళ్లపోయాడని
చెప్పారు.
వరదయ్య మంత్రి మరల స్వయంవరం ఏర్పాట్లలో నిమగ్న
మయ్యాడు. రాజులందరికీ వర్తమానాలు పంపించుట, రాబోయే
వరులకి వసతి ఏర్పాట్లు.. ఎక్కడా ఏ లోటూ రాకూడదు కదా!
రాకుమారుని ముందుగా కొద్ది మంది భటులు, వెనుక గజాలు,
అశ్వ దళం సాగుతోంది. కాంచీపురం రాజ్య సరిహద్దుల్లోకి
వచ్చాక కనిపించిందొక గొల్ల వనిత.
అప్పటికి వేగం తగ్గించి జాగ్రత్తగా అటూ ఇటూ పరికిస్తూ
వెళ్తున్నారు.. శతృరాజ్యం కదా..
కనిపించడమే కాదు.. చేతులూపి ఆగమని సైగ చేసింది.
ఆశ్చర్యంగా చూస్తూ ఆగాడు మాధవుడు. పురుషోత్తముడు కూడా.. అవాంఛనీయమైనదేదైనా అనిపిస్తే, గుర్రాలు దౌడు తీయడానికి
వీలుగా కళ్లెం పట్ఠుకునే ఉన్నారు.
“స్వామీ! నా పేరు మాణమ్మ. పాలు పెరుగు అమ్ముకుని
జీవిస్తుంటాను. మూడు నాలుగు ఘడియల క్రితం ఇద్దరు రౌతులు
ఇటుగా.. కాంచీపురం వైపు వెళ్లారు. వారి వెనుక పెద్ద సైన్యం ఉంది.
మీరు రాకుమారుడు పురుషోత్తమ దేవులే కదా?”
ఉలిక్కి పడ్డారు మాధవ, పురుషోత్తములు. శతృరాజుకు తాము వ
స్తున్నట్లు ముందుగానే తెలిసి పోయిందా?
ఆందోళనగా అటూ ఇటూ చూశారు.. ఒర లోనుంచి కత్తి
తియ్యబోయారు.
“కత్తులు తియ్యకండి బాబూ! ఇక్కడ మీ శతృవులెవరూ లేరు.
ఆ రౌతులు.. తమ పేర్లు బలభద్రుడు, జగన్నాధుడు అని చెప్పారు.
పూరీ పట్టణంలో ఉంటారుట. అదెక్కడో పాలమ్ముకునే నాకెలా
తెలుస్తుంది? దాహంగా ఉందని మజ్జిగ తాగారు. ఒకరు తెల్లగా,
ఒకరు నీలంగా ఉన్నారు. తెల్ల గుర్రం మీద ఒకరు, నల్ల గుర్రం మీద
ఒకరు వచ్చారు.” మాణమ్మ ఆగింది ఆయాసంతో. కత్తులు చూసి
భయపడి పోయింది.
మాధవ, పురుషోత్తములు మొహాలు చూసుకున్నారు.
బలభద్ర, జగన్నాధులా?
“భయంలేదవ్వా! నిన్నేం చెయ్యము.” మాధవుడు గుర్రం దిగి,
అవ్వని ఓదార్చాడు.
“వారిద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారయ్యా! రంగులు వేరుకానీ
రూపులొక్కలాగే ఉన్నాయి. మజ్జిగ తాగి, ధనం లేదన్నారు. చేతికున్న
ఉంగరం తీసిచ్చారు. కాసేపట్లో మీరొస్తారనీ, ఈ ఉంగరం మీకిచ్చి,
రూకలు తీసుకొమ్మనీ చెప్పారు.” కొంగుకి కట్టిన ఉంగరం తీసిచ్చింది
మాణమ్మ.
ఆ ఉంగరం చూడగానే మాధవుని కన్నులు పెద్దవయ్యాయి
ఆశ్చర్యంతో.
అది, గజపతుల కోశాగారంలోని ఉంగరం. వారి ముద్ర స్పష్టంగా
కనిపిస్తోంది. ఉంగరం రాకుమారునికిచ్చాడు మాధవుడు.
అటూ ఇటూ తిప్పి చూశాడు పురుషోత్తముడు. తమ ఆస్థానంలోదే..
కానీ దేవదేవుడే స్వయంగా.. నమ్మ శక్యంగా లేదు.
“నిజమే నయ్యా! నా ధనం నాకిస్తే వెళ్లి పోతాను.” గొల్ల వనిత
తొందర చేసింది.
ధనం ఇచ్చి ముందుకు కదిలారు రాకుమారుడూ, పరివారం.
పురుషోత్తమ దేవునికి ఒడలు పులకరించగా ఆశువుగా
కవిత్వం వచ్చేసింది.
ఆ.వె. “నమ్మ శక్య మేన నామీన కరుణను
చూప గాను వచ్చె చొక్క గాను
అన్న తోడు కొనియు నార్తినే బాపగా
ఆదిదేవుడతడె నాదరమున.”
మాధవుడు దీటుగా జవాబిచ్చాడు..
ఆ.వె. “తనదు భక్తులకును తానెపుడును రక్ష
యొసగు చుండు నతడు యొద్దికగను
మనసునంత నిలిపి మాధవు కొలిచిన
మరి కలద యపజయమన్న పదము?”
అనుకోకుండా అనేశాడు కానీ అంతలోనే బెదురుతూ చూశాడు.
దేవదేవునికి అనంత నామములుండగా మాధవుడనే పేరే రావాలా? రాకుమారులేమనుకున్నారో?
పురుషోత్తమ దేవుడు ఫకాలున నవ్వాడు.. దైవబలం ఉందనిన
ధీమా అతనికి ఉల్లాసాన్నిచ్చింది.
“నిక్కముగా నుడివావు మాధవా! అటు ఆ స్వామి, ఇటు
ఈ మిత్రుడు కాచుకొను చుండగా.. ఇంక నాకు ఓటమి ఎక్కడిది?”
ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు సాగారు.. సైనికులకు
ప్రోత్సాహము అందిస్తూ!
……………….
కాంచీ పుర సరిహద్దుల్లోనే ఎదురయింది పురుషోత్తమ దేవునికి
సంభ్రమాశ్చర్యములు కలిగించే దృశ్యము.
గజదళం ముందుకు సాగుతుండగా, అశ్వముల మీది సైనికులు,
పదాతి దళం.. కలిసి కాంచీ పురాన్ని ముట్టడిస్తున్నారు.
గజాల మీద కళింగ రాజ్య పతాకములు ఎగురు తున్నాయి.
కంచి సైన్యాలు వారి ధాటికి తట్టుకోలేక వెనుతిరుగు తున్నాయి.
సీ. గజములన్నియును ఘీంకారముం జేయగా
భీతిల్లి నరిసేన వెను తిరిగెగ
అశ్వదళములన్ని యబ్బురముగ కదం
తొక్కుతూ కడిమిని దూసు కెళ్లె
కరవాలముల నన్ని కసమస తిప్పుతూ
యోధులందరు కూడి హోరు చేయ
ఓఢ్ర సైనికులంత యుగ్రమూర్తులయిరి
కంచి శూరుల యొక్క గర్వ మడచ
ఆ.వె. సైన్యమే మెలపుతొ చాకచక్యమునను
క్రమమున నడవగను గాఢముగను
సాధనముగ నెంతొ సమరమే సలుపగా
రాకుమారు నివ్వెఱ పడి నిలిచె.
గొల్ల వనిత చెప్పిన అన్నదమ్ములు ఎక్కడున్నారా అని
వెతికాడు మాధవుడు.
శతృసైన్యంలోకి చొచ్చుకుని పోయి వీర విహారం చేస్తూ కనిపించారు
ఇద్దరూ.
తమ సైనికాధికారులకి కూడా ఆనతిచ్చి, తమ గజాలని
ముందుకురికించారు పురుషోత్తమ దేవ, మాధవులు.
సైన్యం రెట్టింపవడంతో.. మహోత్సాహంతో ముందుకురికింది
గజపతుల సైన్యం. సాధ్యమయినంత వరకూ జంతునష్టం,
జన నష్టం అవకుండా చూడమని ఆదేశాలిచ్చారు బలభద్ర,
జగన్నాధులు.
శతృ సైన్యాన్ని బెదరగొట్టి, వెను తిరిగేట్లు చెయ్యడమే తమ
ముఖ్యోద్దేశ మని గట్టిగా చెప్పారు.
అదే విధంగా.. సైనికులు అలసిపోయే విధంగా ముప్పు
తిప్పలు పెడుతున్నారు, రణరంగంలో ఆరి తేరిన కళింగ
సైనికులు.
చివరికి.. స్వయంగా కాంచీపుర పాలకుడు యుద్ధ రంగానికి
రాక తప్పలేదు.
రాజు ఏనుగు పై రాగానే మహోగ్ర రూపం దాల్చి పురుషోత్తమ
దేవుడు తన గజాన్ని ఎదురుగా నడిపించాడు. గజపతుల
గజం కదా.. అందులో, పురుషోత్తమ మాధవులు ప్రాణాలు కాపాడిన
గజం.. రణరంగంలో ఏ విధంగా చెలరేగి పోవాలో బాగా నేర్చిన
గజం.. తన యజమాని మనో భావాలను బాగా ఆకళింపు
చేసుకున్నది..
ఒక్క సారిగా.. దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకారం చేసింది.
కంచి రాజుకి ఏనుగు సవారీ అంతగా అనుభవం లేదు..
ఆ అరుపుకే హడలి పోయాడు.. ఐనా, సహజంగా వీరుడు
కనుక, శత విధాల పోరాడాడు.
కాంచీ పుర సైనికులు అంతకు ముందు జరిగిన రణంలో
అలసి పోయి ఉన్నారు.. గెలిచిన ఆనందంలో సంబరాలు
చేసుకుంటుంటే యుద్ధానికి సన్నిద్ధమవాలన్నారు. గజపతుల
సైన్యం సగం పైగా కొత్తగా వచ్చింది. పైగా వారి రోషం, ధ్యేయం
ముందర ఎంతటి యోధులైనా బలహీన పడక తప్పటం లేదు.
మొదటి రోజు ముగిసిన యుద్ధంలో కంచి సైన్యానికి బాగా నష్టం
వచ్చింది.
రెండవ రోజున దిగజారిన ఉత్సాహంతో వచ్చారు యుద్ధానికి.
గజపతుల సైన్యం మరీ రెచ్చిపోయింది.
చివరికి, పురుషోత్తముని పక్కనే ఉండి కాచుకుంటున్న
మాధవుడు, కంచి రాజుని బంధించి తీసుకొచ్చాడు.
“ఆ వరదయ్యని కూడా బంధించండి.” పురుషోత్తముడు
హుంకరించాడు.
సైనికులు వెళ్లి, తన గృహములో బిక్కుబిక్కు మంటూ
కూర్చున్న వరదయ్యను తెచ్చి అప్పగించారు.
“అంతే కాదు.. పద్మావతిని కూడా బంధించి తీసుకు రండి.”
ఆవేశం తగ్గని పురుషోత్తముడు ఆనతిచ్చాడు.
కంచి రాజు తల దించుకుని నిలుచున్నాడు.
“ప్రభూ! రాకుమారిని బంధించా?” మాధవుడు ఆశ్చర్యంగా అడిగాడు.
“ఇప్పుడామె రాకుమారి కాదు. ఒక సేవకుని కూతురు. ఆమెని,
చీపురుతో మలినాలని శుభ్ర పరచే సేవకుని కిచ్చి వివాహం
చేస్తాను. చెప్పిన పని చెయ్యి మాధవా!” ఆగ్రహంతో ఆదేశ మిచ్చాడు
కాబోయే చక్రవర్తి.
మనసు చివుక్కు మన్నా, మొహంలో చూపించకుండా అక్కడి
నుంచి కదిలాడు మాధవుడు.
యుద్ధం ముగిసింది.
“ప్రభూ! వారిరువురూ వెళ్లి పోతున్నారు.” చూపించాడు
మాధవుడు.
అప్పటి వరకూ రణరంగంలో స్వైర విహారం చేసిన
యువకులు.. బలభద్ర, జగన్నాధులు శరవేగంతో దూసుకెళ్తున్నారు.
“అరే! మాకు మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్లి పోతున్నారే..”
సంభ్రమంగా అన్నాడు పురుషోత్తముడు.
“మనకి చెప్పి రాలేదు కదా! వారు అనుకున్న కార్యం చేసి
మరలి పోతున్నారు.” మాధవుడు భక్తిగా వారికి నమస్కరించాడు.
“ఎవరు వారు?” కాంచీపుర రాజు అడిగాడు, కళ్లు వెడల్పు
చేసి. తన ఓటమికి వారే కారణము.. అనుకోని విధంగా,
ప్రమత్తులై ఉన్న తన సైనికుల మీద దాడి చేశారు.. అదీ..
హఠాత్తుగా.
“మాక్కూడా తెలియదు. దైవ భక్తుని దూషించిన వారిని
శిక్షించడానికి స్వయంగా వచ్చిన ఆ దైవ స్వరూపులని
అనుకుంటున్నాం. మా మహారాజుగారు, కటకం నుండి
పంపిన సైన్యానికి, ప్రధాన సైన్యాధికారుల వలే ప్రత్యక్షమయి,
పని అవగానే వెడలి పోతున్నారు.
దైవ భక్తుని హీన పర్చడం, దైవాన్ని దూషించిన కంటే
పాపం.. అదే భాగవతం మనకు నేర్పిన పాఠం. అందుకే
పాప ఫలం అనుభవించక తప్పదు. కన్య నివ్వమని..
వివాహం చేసుకుని ముత్యాల పల్లకిలో తీసుకుని వెళ్తామని
కోరితే ఆనందంగా ఇవ్వ వలసింది. కానీ.. తాము, దుష్ట శక్తుల
ప్రభావంతో జగన్నాధుని భక్తుని దూషించారు. అనుభవించక
తప్పదు.” మాధవుడు వివరించాడు.
కంచిరాజు, తన పక్కనే బంధింపబడి యున్న వరదయ్యని
చూశాడు. ఇతని వల్లనే కదా.. ఇంత నాశనం అయింది.
ప్రతీ యుద్ధానికీ ఇటువంటివారు ఒకరు ఉంటూనే ఉంటారు.
తన వివేకం ఏమయింది?
…………………….
0 వ్యాఖ్యలు:
Post a Comment