Monday, August 18, 2014

Posted by Mantha Bhanumathi on Monday, August 18, 2014 with No comments
17th Aug-2014.

                    “అమ్మా! కృష్ణాష్టమి అంటే..”
  అప్పుడు రెండో క్లాసు చదువుతున్నా.. ఆరేళ్ళుంటాయి.  మా చిన్నప్పుడు కృష్ణాష్టమికి బడికి సెలవుండేది కాదు. నాలుగింటికి వచ్చేసి, పాలు తాగి ఆటలాడుకుని వచ్చే సరికి పట్టుచీర కట్టుకున్న అమ్మ కనిపించింది.
   “ఇందుగలడందులేడను
   సందేహము వలదు చక్రి సర్వోపగతుండు..”
   రాగయుక్తంగా భాగవతంలో పద్యాలు పాడుతూ, సాయంత్రం అమ్మ తులసి కోట చుట్టూ కడిగి ముగ్గులేసి తులసమ్మకి అలంకారం చేస్తుంటే అనుమానం వచ్చింది. తెల్లారకట్ల మామూలుగా అయిపోయింది కదా! ఇప్పుడెందుకూ అని. ఎందుకైనా మంచిదని నేను కూడా మొహం, కాళ్ళు చేతులూ కడిగేసుకుని పట్టుపరికిణీ కట్టేసుకున్నా. అసలు ఏం వంక దొరుకుతుందా అని చూస్తుంటా. బుద్ధిగా తులసమ్మ దగ్గర పీట వేసుక్కూర్చుని, కళ్ళు ముసుకుని నాకొచ్చిన పద్యం పాడేశా..
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొల త్రాడు పట్టు దట్టి
సంజె తాయతులను సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు”
   అమ్మ పిండివంటలేమైనా చేసిందేమో అని ఒక కన్ను తెరిచి చూస్తున్నా..
   ఊహూ.. చలిమిడి, వడపప్పు, పానకం, పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి దంచిన ఉండలు, అరటిపళ్ళు.. అంతే.. నాకు చాలా నిరుత్సాహం.. బొండాలు, బజ్జీలు, మైసూర్ పాక్, లడ్డూలు.. పోనీ బొబ్బట్లు.. ఊహూ! ఆలోగా అమ్మ, వీధి గుమ్మం నుంచి చిన్న చిన్న పాదాలు ముగ్గేసింది. అమ్మ భలే తొందరగా ఒక్క నిముషంలో వేసేసింది.
   “ఏంటమ్మా ఇవేళ?” కృషుడి విగ్రహాన్ని కూడా తులసమ్మ పక్కన పెట్టి, దీపం వెలిగిస్తున్న అమ్మని అడిగాను.
   “కృష్ణాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజు. అందుకే మనింటికి పిలుస్తున్నామన్నమాట. ఆ పాదాల మీద అడుగులేసి వచ్చేస్తాడు.”
   “పుట్టిన వెంటనే ఎలా నడుస్తాడు?”
   “దేముడు కదా.. అందుకని నడవగలుగుతాడు..”
   “మరి.. రోటిక్కట్టేస్తే పాకుతూ చెట్ల మధ్యనించి వెళ్ళాడని చెప్పావు కదా అప్పుడు..”
   “అది వేరు యశోదమ్మ ఇంట్లో అది.. అయినా నీ ప్రశ్నలన్నింటికీ మీ నాన్నగారు జవాబు చెప్తారు. నువ్వు మాట్లాడకుండా అక్కడ కూర్చుని పూజ చూడు.”
   ఓహో.. అర్ధమయింది. పుట్టగానే అందరిళ్ళకీ నడుచుకుంటూ వెళ్ళి, నేనొచ్చానోచ్ అని చెప్పి, ఆ తరువాత యశోదమ్మ ఇంట్లో పాకుతూ, అల్లరి చేస్తూ.... అయినా అమ్మకి చెప్పడం చాతకాపోతే.. మీ నాన్నగారంటుంది.
   సరే.. పూజంతా అయ్యాక, నాకు మా ఆఖరన్నకీ (మిగిలిన అన్నలు వేరే ఊళ్లలొ చదువుతున్నారు)..  చలిమిడి, వడపప్పు వగైరాల ప్రసాదం.. బంగాళ దుంపల వేపుడు,  చారన్నం, పెరుగన్నం పెట్టేసి, తను ప్రసాదం మాత్రం తింటోంది. మా నాన్నగారు కాంపుకెళ్ళారు.
   “ఇదేం పండగ.. చలిమిడి..” మా అన్న చిందులు తొక్కాడు. నేను కొబ్బరి ఉండలు తింటుండగా..
   “అది అంతే.. నేనైతే ఉపోషం.. ఉడికించినవేం తినకూడదు. కడుపు చలవ. నూనెలో వేయించినవి అస్సలు నైవేద్యం పెట్టకూడదు.”
   “కడుపు మాడ్చుకుని చలవంటావేంటమ్మా! చాదస్తం..” యస్సస్సెల్సీ చదువుతున్న అన్నయ్య అడిగాడు. నిజమే.. అన్నయ్యంటుంటే నాకూ అనుమానం వచ్చింది.
   “అంటే.. ఆకలేసే కడుపు కాదు.. కడుపున పుట్టిన పిల్లలంతా సుఖంగా ఉండేలా చూడమని కృష్ణుణ్ణి వేడుకుంటాం.. పొద్దుట్నుంచీ కన్నయ్యనే తలుచుకుంటూ, పాటలు, పద్యాలు పాడుకుంటూ ఆయన ధ్యానం లోనే గడుపుతామన్నమాట.” అమ్మ మాటలకి అన్నయ్య అయోమయంగా చూస్తూ వెళ్ళిపోయాడు.
   “నేనైతే.. కడుపు నిండాతిని, బోలెడు పిండివంటలు చేసి.. కనయ్యకి నైవేద్యం పెట్టి, కడుపు చలవ చూడమంటా..” ప్రకటించేశాను.
   అమ్మ పకపకా నవ్వి, నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
                                            *------------------------*
ఇవేళ కృష్ణాష్టమి కదా! చిన్న జ్ఞాపకం.
  

   

0 వ్యాఖ్యలు: