సూర్య స్తుతి- కందాల మాల.
1. కరివదనుని కృప తోడను
యొరు సాహసమే ననుకొని యొక శతకమునే
పరి పరి సాధన చేసితి
యరడ యొసగె నా గభస్తి యంతనె నర్కా.
ఆ విఘ్న నాయకుని దయతో, దినకరుడిచ్చిన తెప్ప(అరడ) వంటి ఆసరాతో ఒక శతకమును సమర్పించ నెంచి గొప్ప సాహసము చేశాను.
2. ఉదయించిన భానుని గని
సదమల నేదో తలంపు చక్కగ రాగా
చదువులు నేర్పిన గురువుల
పదములకంజలి ఘటించి వ్రాసితినర్కా.
ఉదయించిన సూర్యుని చూసి, నిర్మలమైన ఆలోచన కలిగి, నా గురువుల పాదములకు నమస్కరించి, ఈ శతకమును వ్రాశాను.
3. కెంజాయ మెరుపు సొగసుల
కంజపు నెచ్చెలిదె వచ్చె కాంతులు విరిసెన్
మంజిమ నిండగ మదిలో
అంజలి నిరతము ఘటింతు యనవధి నర్కా!
కెంపు రంగు మెరుపుల అందముతో తామరపూ చెలికాడు రాగా, మనమున మనోజ్ఞత(మంజిమ) నిండగా ఎల్లప్పుడు నమస్కరిస్తూంటా నీకు అర్కా.
4. నిశి గడిచె నిదుర లేకను
కుశలమడగ వచ్చె గాద కూర్మి హితుడదే
కుశము విడిచి నర్ఘ్య మిడెద
యశనము బాగుగ నమర్చ యనిశము నర్కా
నిద్ర లేక రేయంతా గడవగా, ప్రేమతో క్షేమమడగ వచ్చిన హితునికి నీటిని అర్ఘ్యము విడుస్తూ అర్కుని ఆహారము సమకూర్చమని వేడెదను.
5. పులుగుల కిలకిల లవిగో
నులి వెచ్చని తొలి పొడుపు మినుకుల వెలుగులో
పులకించగ సకల జగము
అలతిన గైకొను నమస్సు యనయము నర్కా
పక్షుల కిలకిలారావములతో, వెచ్చని తొలి పొద్దు కిరణముల వెలుగులో సమస్త జగమూ పులకించగా, నా చిరు నమస్సు లెల్లప్పుడూ అందుకో అర్కా.
6. నభమున నుదయించి దినము
నభయము నొసగేవు నీవు నావనములకున్
యభి వెలుగుల నదమున నీ
యభిముఖము నిలిచి కొలిచెద యనిశము నర్కా.
ప్రతీ దినమూ ఆకశమున నుదయించి ఆ వనాలకు అభయాన్నిస్తావు. అంతటనా వెలుగుల సముద్రములో నీ ఎదురుగా నిలిచి ఎప్పుడూ నిను కొలిచెదనర్కా.
7. కనిపించెడి దైవమితడు
కనవలె నుదయించు సూర్యు గారవముననే
యనవరతము నిల కాచును
ననుదినమర్చన సలిపెద నవిరత మర్కా.
కనిపించే దైవం కనుక, ఉదయించే సూర్యుని చూడవలె. ఎల్లప్పుడూ ఇలను కాపాడే ఆ దైవమును ప్రతీదినమూ ఎల్లప్పుడూ అర్చించెదనర్కా.
8. తిమిరాప హారి నీవే
క్రమమును తప్పక తన విధి కావించగనే
గమనము మారదు నెన్నడు
నమిత విధేయులము నీకు ననిశము నర్కా!
చీకటిని నశింపచేసి, క్రమం తప్పకుండా తన విధి నెరవేరుస్తూ, నడకను ఎన్నటికీ మార్చని నీకు ఎప్పుడూ ఎంతో విధేయులము అర్కా.
9. అఖిల జగములకు యలతిన
నిఖిలము చుఱుకును యిడుకొన నేరిమి నెపుడూ
మఖమును నిలిపియు నిరతము
సుఖమును ప్రాణుల కొసగుదు సూటిగ నర్కా.
లోకాలన్నింటికీ ఎల్లప్పుడూ తేలికగా, నేర్పుగా, వేడిని ఇస్తూ, ధర్మము నిలిపి, జీవులకు సుఖమునొసగెదవు అర్కా.
10. అట నాకశముననుదినము
నెటువంటి యలసట లేక నేమరక సదా
పటుతరముగ పాలింతువు
నిటు నీ లోకము లెపుడును నీవే నర్కా
ఆటు వింగినీ, ఇటు నేలనూ కూడా ఎల్లప్పుడూ అప్రమత్తుడవై సమర్ధవంతంగా పాలిస్తూ ఉంటావు నీవే అర్కా.
11. అలనా మబ్బుల దాగియు
నిలనీ కిరణ కరణముల నింపుగ నిడివిన్
సులువుగ నంతను తాకుచు
కలువల నిదురింప జేయ గరిమిని యర్కా.
మబ్బులలో దాగి, నీ కిరణముల నులి వెచ్చని స్పర్శతో సున్నితంగా తాకుతూ కలువలను జోకొడతావు అర్కా.
12. భాసురమౌ ననవరతము
కోసల యధిపతి నిరతము కొలువగ నిన్నే
బాసట యొసగగ బాగుగ
యాసర నిచ్చితివి నీవె యనిశము నర్కా.
నిరంతరం ప్రకాశించే నిన్ను కోసలరాజు శ్రీరాముడు నిత్యమూ కొలువగా, బాసటగా నిలిచి ఆసరా నిచ్చావు అర్కా.
13. రవి చొరవని చోటుననే
భువనమున నెవరు నిలువరు పుష్టియు లేకన్
జవసత్వము లుడిగేనుగ
యవిరళముగ నాదుకొనుమ యనయము నర్కా
రవి లేని చోట బలం లేక, నిస్త్రాణగా నీరసించి పోయెదరు అందరూ. ఎల్లప్పుడూ అత్యంతమూ ఆదుకొనుము అర్కా
14. సప్త హయముల రధమదియె
తప్తము నందింప నీవు తప్పక నెపుడున్
లిప్త యయిన నేమరకను
తృప్తిగ నడిపించెదవుగ కృపతో నర్కా.
ఏడు గుర్రముల రధమును క్షణ మాత్రమైనా ఏమరకుండా, సంతోషముగా దయతో నడిపిస్తావు అర్కా.
15. సురలసురులెపుడు సమముగ
పరినిష్ఠను వేడుకొనెడి పరమాత్మవుగా
హరిహరులు నలువ సహితము
నిరతము నర్చించెదరుగ నెమ్మిక నర్కా.
సురలు, అసురులు కూడా సమానంగా వేడుకునే పరమాత్మవు. త్రిమూర్తులు ప్రేమతో ఎల్లప్పుడు నిను అర్చించెదరు అర్కా.
16. అదితి తనయుడాదిత్యుడు
విదితము గను రక్షసేయ విశ్వము నంతన్
ముదమునొసగు ననవరతము
సదమల వనముల కొసగును సత్తువ నర్కా
అదితి కుమారుడైన ఆదిత్యుడు విశ్వాన్ని రక్ష్తిస్తాడని తెలిసినదే. ఎప్పుడూ సంతోషాన్నిస్తూ, వనాలకి సత్తువనిస్తాడు నిర్మలంగా అర్కా.
17. సకలవ్యాపకుడు సదా
యకలంకుడనిమిషుడు తిమిరాంతకుడతడే
శుకశౌనకాది మునులకు
యకవము వైరాగ్య మొసగు యాత్మయె నర్కా.
సకల వ్యాప్తి చెందిన దోషములు లేని దేవత, చీకటి నశింపచేయువాడు, శుక శౌనకాది మునులకు, వైరాగ్యమొసగే ఆత్మ అతడే అర్కా.
18. నియతుడు సర్వేంద్రియముల
నియమము తప్పకనె కాచు నికరము గానే
నయముగ జీవుల రుగ్మపు
మొయిలు కడవ బెట్టుగాద ముదముగ నర్కా.
సర్వ ఇంద్రియాలనీ నియంత్రిస్తూ, క్రమం తప్పకుండా ప్రాణుల రుగ్మతలనే మేఘాలని కుండలో సంతోషంగా దాచిపెడతావు కద అర్కా.
19. క్లేశములను తొలగించగ
నాశలు తీర్చగను వచ్చి నాకాశమునన్
యైశపు ప్రతినిధిగ నిలిచి
కోశము లైదింటి కాచు కుతపుడ వర్కా.
కష్టాలని తొలగించి ఆశలను తీర్చుటకుఈశ్వరుని ప్రతినిధి వలే ఆకాశంలే నిలిచి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములను కాచే సూర్యుడవు అర్కా.
20. యుక్తా యుక్తములెరుగుచు
భుక్తీ భోగముల నొసగు పోడిమి దయతో
శక్తీ సౌఖ్యము లమరగ
భక్తీ ముక్తి నిను గొల్వ బాగుగ నర్కా.
భక్తితో నిను కొలువ, మంచీ చెడూ తెలిసి, ఆహారాన్ని, సంపదనూ కరుణతో ఒసగి, శక్తి,సౌఖ్యము, ముక్తి అమరుస్తావుగా అర్కా.
21. తేజస్సు నిచ్చు సతతము
భాజనమున లోకములకు బాళిగ నీవే
పూజింపగ భక్తి నెపుడు
రాజిల్లగ రవి పొలపము రమ్యము నర్కా.
ఎంతో యోగ్యముగా ఎల్లప్పుడూ తేజస్సుని చక్కగా లోకాలకునిచ్చేటి వానిని భక్తితో పూజిస్తుంటే, రవీ ప్రకాశము రమ్యంగా వెలుగుతుంది అర్కా.
22. ప్రత్యక్ష దైవ ముగనే
నిత్యము వెలుగుచు నభమున నిర్దేశింపన్
కృత్యముల దిశలనంతను
సత్యము యిదియే నిశాంత సవితృడవర్కా.
నిత్యము వెలుగుచూ ఆకసమున అన్ని దిశలలో పనులను నిర్దేశించే ప్రత్యక్షదైవము, నిశిని అంతముచేసే సవితృడనేది నిజము అర్కా.
23. విష్ణు మహేశ్వర బ్రహ్మల
జిష్ణు వరుణ వాయు వగ్ని చేతనములచే
నిష్ణుడయిన పర బ్రహ్మము
నుష్ణము నుర్వికి యొసంగు నుష్ణుడవర్కా.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే, వరుణుడు మొదలైన పంచభూతములచే నేర్పరి యైన పరబ్రహ్మము, భూమికి వేడినిచ్చెడి సూర్యుడవే అర్కా
24. చేకొన్న పని నెరపుటకు
నాకొను ప్రాణుల గరిమిని నాదుకొనగనే
చేకొని చెట్లకు ప్రాణము
నేకటముగను నొసగేవు నీకొవ నర్కా.
తమ పని చేసుకొనుటకు, ఆకలికొన్న ప్రాణుల వేడిని ఆదుకునే చెట్లను, ఆపేక్షతో ఆర్ద్రతతో గమనించి ప్రాణము నిచ్చేవు అర్కా.
25. బహుముఖముల నిల కొసగెద
విహమందు పరము, సమస్త వీక్షణములతో
నహమడచగ నందరికిని
మహిమను జూప నిను కొలుతు మదిలో నర్కా!
అనేక విధములుగా ఇహంలో పరాన్ని ఇచ్చి, చూపులతో అహాన్ని అణచి మహిమ చూపే నిన్ను మనసులో కొలిచెదను అర్కా.
26. కనిపించే దైవమనుచు
నిను యనవరతము కొలవగ నెంతో పుణ్యం
కనగను చేసిరి మనుజులు
దినకరు నిన్ కొలువ గాను దీక్షను యర్కా.
కనిపించే దైవమని నిన్ను ఎల్లప్పుడూ కొలుచుటకు, అర్చించుటకు మనుష్యులు ఎంతో పుణ్యం చేసుకున్నారు అర్కా.
27. నింగికి నీవే యధిపతి
పొంగెడు సంద్రపు తరగల పొంగారగనే
సంగడి చేయగ సూర్యుడ
బంగరు జలధి యహి చేర్చ బాగుగ నర్కా.
ఆకాశమునకు అధిపతిగా, సముద్రపు తరంగాలతో విజృభించి స్నేహం చేస్తూ, అందలి నీటిని మేఘానికి అందిస్తావు బాగా అర్కా.
28. వేదములన్నిటి నంతనె
సాదరముగ నువ్వఖిలము సాధింపగనే
నాదిత్యా నిను వేకువ
నాదరమున పిలిచి పూజ నడిపెద నర్కా.
అన్ని వేదములనూ అవుపోసన పట్టిన నిన్ను వేకువను వినయంగా పిలిచి పూజచేసెదను అర్కా.
29. వర్షమునకు కారకుడని
హర్షముతో జనులు నీకు నర్ఘ్యము వదలన్
కర్షకులందరు కొలుతురు
ఘర్షణ లేకనె కపిలుడ గరిమను యర్కా
వర్షమునకు కారకుడవని ఆనందముతో జనులు అర్ఘ్య మివ్వగా, రైతులందరూ నిన్ను ఏక భావముతో శ్రద్ధగా కొలుస్తారు అర్కా.
30. ధనపతికి సహచరుడవుగ
యిన నీ హితుడే వరుణుడు యీప్సితముగనే
విన వింధ్య దాటి బ్రహ్మము
యనుదినమును యాట లాడె యానతి నర్కా.
కుబేరుని స్నేహితుడవు, వరుణుడి హితుడవు. వింధ్య పర్వతము దాటిన బ్రహ్మము నీ అనుజ్ఞతో ప్రతీ దినమూ ఆటలాడుతుంది అర్కా.
31. ఆ పచ్చని కాంతి వలయ
మాపును పోగొట్టి జల్లు మణికాంతులనే
తాపము కలిగించు తరణి
నూపిరి ప్రాణులకు నిలప నున్నతి నర్కా.
సూర్యబింబం చుట్టూ ఉన్న పచ్చని కాంతి వలయం, చీకటిని పోగొట్టి, మాణిక్య కాంతులను వెదజల్లుతుంది. వేడిని కలిగించి నీవు, ప్రాణులకు ఊపిరి నిలుపుతావు అర్కా.
32. అరుణిమ కాంతుల మెరపులు
విరజిల్లగ వచ్చె నదిగొ వేదోదయుడే
కరుణను కాచుకొనుచునే
ధర సృష్టిస్థితిలయలకు ధార్మికు డర్కా.
ఎర్రని కాంతులు విరజిమ్ముతూ వచ్చాడు వేదోదయుడు భానుడు. దయతో ఇలలో సృష్టి స్థితి లయములను ధర్మముతో కాచుకుంటాడు అర్కా.
33. నభమున నిలిచిన గ్రహముల
విభవమ్ముల నతడు బాగ వితతము సేయన్,
ఇభుడును నీకనుచరుడే
యభయమ్ము నొసగు నిహమున యనయము నర్కా.
ఆకాశంలో నున్న గ్రహముల వైభవములను వ్యాప్తి చెందిస్తాడు. చంద్రుడు అతనికి అనుచరుడు. ఎల్లప్పుడూ ఇహలోకమున అభయము నిచ్చును అర్కా.
34. తారల నియతిని నిరతము
మేరకు నిర్దేశ పర్చ మింటిని నిలిచే
సారము నివ్వగ నిరతము
తేరునధిష్టించి నీవు తిరుగెద వర్కా.
తారలు చక్కగా ఆకాశాన నిలుచుటకు బలిమి నీయ, రధాన్నధిరోహించి తిరుగుచుందువు అర్కా.
35. మాత్రిక వయ్యా, జగముల
నాత్రము తొలగింపగాను నాశల నింపన్
పాత్రత కల తేజస్వికి
సూత్రముతో తేజమొసగు సూర్యునివర్కా.
జగాలన్నింటికీ మూలం నువ్వే. విపత్తులు తొలగించి, ఆశలు నింపి, అర్హుడైన వానికి ఏర్పాటులో వెలుగు నిస్తావు అర్కా.
36. ద్వాదశ రూపములందున
నా దిశలన్నిటిని కాచు నాదిత్యుడవే
ఖేదము మాన్పగ రావా
మోదమొసంగగ నిలకు సుముఖముగ నర్కా!
పన్నెడు రూపాలలో దిక్కులన్నిటినీ కాపాడే ఆదిత్యుడవు. దుఃఖము మాన్పి సంతోషాన్నిచ్చుటకు ఇలకు చక్కగా రావా అర్కా!
37. సత్వమొసగెదవు సతతము
చత్వరమున్ ముగ్గులిడ నిశాంతము నందే
సత్వమె నీ కృప మాపై
నత్వము లేదెపుడు నిజము నమ్ముము నర్కా
ఎల్లప్పుడూ బలము నిచ్చెదవు. తెల్లవారు ఝామునే ముంగిలి ముగ్గులతో నింపగా నీకృప మాపై నుండుట భాగ్యమే అనునది మా కనుమానమే లేదు నిజముగా అర్కా.
38. తూరుపు కొండల వచ్చియు
వారుణి గిరుల వెడలెదవు పరగగ నెంతో
పేరిమి నా పర్వతములు
కోరి నమించ విదథులుగ కూరిమి నర్కా.
తూర్పు కొండల్లో ప్రవేశించి, పశ్చిమాన ఉన్న గిరుల వెనక్కి వెళ్తావు. ఆ పర్వతములు ప్రేమతో నమస్కరించి ధన్యులయ్యె నర్కా.
39. నిగమముల నిష్ణుడు యినుడు
నగణితముగ నవధి లేక యల్లుకొనగనే
సగుణుడు సద్భావమునను
అగమాదుల వెలుగు నింప యగపడు నర్కా.
వేదాలలో నిష్ణాతుడు సూర్యుడు. విస్తారంగా, అడ్డులేక వ్యాపించే సగుణుడు. మంచి మనసుతో కొండలలో వెలుగునిపుతూ కనిపిస్తాడు అర్కా.
40. దివసము నంతయు వెలిగెడు
సవితృని తేజము జనులకొసగగ బజనమున్
దివమును యేలెడు దినకర
సవమున యర్ఘ్యమి డెదముగ సంతత మర్కా.
రోజంతా వెలుగుతూ తన తేజస్సును బలిమిని జనులకిస్తూ ఆకాశాన్నేలే సూర్యునికి, ఎల్లప్పుడూ నీటిలో నిలిచి అర్ఘ్యమిచ్చెదను అర్కా.
41. శుభముల నొసగెడు సుతపుడ
భయమును బహుమతిగ నెపుడు బాగుగ నిడగా
నభమునను నిలిచి కనియెడి
రభువు దివికి భువికి నతడు రక్షగ నర్కా.
శుభాలనిచ్చే సూర్యుడు నిరంతరం అభయాన్నిస్తూ నింగిని నిలిచి చూస్తూ, దివికి, భువికి రాయబారిగా రక్షచేస్తున్నాడు అర్కా.
42. వియతుల కిలకిల రవములె
జయమును పలుకగ నుదయము జయమొసగగనే
రయమున విభవము నివ్వగ
నయమున యినుని కిరణములనయముగనర్కా.
పక్షుల కిలకిలలతో జయమొసగుమని ఉదయమే పలుకరించగా, వేగంగా ఇనుని కిరణాలు ఎల్లప్పుడూ వైభవాన్నిస్తాయి.
43. జవనమున దివస మంతయు
అవిరతముగ నింగినందు ఆడగ నర్కా
ప్రవిభాసిలు వీరుడవుగ
సవిత నమస్సులివె నీకు సన్మతి నర్కా.
దినమంతా వేగముగా ఎల్లప్పుడూ ఆకశమున ఆడుతూ వెలుగొందే వీరుడవు సవితా. నీకు సవినయంగా నమస్సు లందిస్తాను అర్కా.
44. హర్షమున కమలము విరియ
కర్షణ సేయగ వసుధను కర్షకు లంతా
వర్షము వచ్చిన నీదయ
తర్షము తీరద నుడువుము తప్పక నర్కా.
కమలం ఆనందంగా విచ్చుకోగా, రైతులు వ్యవసాయం చేయుటకు సిద్ధమవగా, వర్షం రావడం నీదయ. అది వచ్చిన దప్పిక తీరుతుంది, రప్పించు అర్కా.
45. సృష్టిస్థితి లయములకును
శిష్టుడవు, కమలజు ప్రీతి చెందగ నెంతో
అష్ట దిశల కనుసన్నల
కష్టము లేక నడిపెదవు గాదిలి నర్కా.
జ్ఞానివైన నీవు, సృష్టికర్త ప్రీతి చెందగా, సృష్టి స్థితి లయములకునున్న అష్ట దిశలను నీ కనుసన్నల సులభంగా ఇష్టముతో నడిపెదవు అర్కా.
46. జీవము లేదు జగములను
లేవుగ తారలు నభమున లేనిచొ నీవే
చేవ నిడగ సకలములకు
కావుము మమ్ముల నిరతము కరుణను నర్కా.
నీవు లేనిచో లోకములలో జీవములేదు, నింగిన చుక్కలు లేవు. అన్నిటికీ సత్తువ నిస్తూ మమ్మల్ని ఎప్పడు కావుము అర్కా.
47. కమలము మురియును నినుగన
విమల చరిత, తిమిర హరివి వెలుగుల దొరవే
అమిత మగు పొలపమలరగ
కమనీయము నీ యుదయము కలతెఱగర్కా.
నిన్ను చూడగానే కమలం మురుస్తుంది. నిర్మల చరితుడవు, చీకటి పారద్రోలే వాడవు, అనంతమైన తేజస్సు చూపు, నీ రాక కమనీయ మన్నది నిజమర్కా.
48. అంగకమునంత సతతము
బంగరు ద్రావణపు మెరుపు భాసుర మౌగా
చెంగట నిలువక దూరపు
కంగనన నిలిచి కొలుతురు గమకమునర్కా.
నిలువెల్లా ఎల్లప్పుడూ బంగారు రంగు మెరుపు వెలుగుచుండగా, దగ్గరగా నిలువలేక, దూరపు ప్రదేశమున నిలిచి నిన్ను బాగుగా కొలుతురు అర్కా.
49. కరుణను చూపగనంతయు
అరుణుడవై యక్కసమిడ యగ్నిని పోలిన్
వరుణము పీల్చి తరుణమున
ధరణికి వర్షణముగ నిడెదవుగా నర్కా.
ఎర్రగా అగ్నిని పోలి తాపము నిచ్చే నీవు కరుణ చూప, నీటిని పీల్చి, భూమికి వర్ష రూపముగా నిస్తావు అర్కా.
50. విశ్వము నడిపించుటకే
యశ్వములేడు నడిపించు యరదము మీదన్
శశ్వత్ తిరుగుచు నీవే
నిశ్వసనమిడగ జగత్తు నిలిపెదవర్కా.
ఈ లోకాన్ని నడుపుటకు సప్తాశ్వ రధము మీద మరలమరల తిరుగుచూ ఊపిరి నందిస్తూ జగమును నిలిపెదవు అర్కా.
0 వ్యాఖ్యలు:
Post a Comment