Wednesday, September 6, 2017

ప్రజ-పద్యం సామాజిక పద్య సుధా స్రవంతి, కవి సమ్మేళనం.ప్రజ-పద్యం సామాజిక పద్య సుధా స్రవంతి, కవి సమ్మేళనం.

Posted by Mantha Bhanumathi on Wednesday, September 06, 2017 with No comments

                                 ప్రజ-పద్యం సామాజిక పద్య సుధా స్రవంతి, కవి సమ్మేళనం.

సెప్టెంబర్ 2వ తేదీ, 2017- గుంటూరు

   పది రోజుల్నుంచీ ఉత్సాహం. గుంటూరు కవి సమ్మేళనంకి వెళ్లాలని. గుంటూరంటే మరేంటి? నేను పెరిగిన ఊరు. అక్షరాలు నేర్చుకున్న ఊరు. మండుటెండలో కూడా హాయిగా, రోడ్ల మీద కుందుళ్లు, నేలా -బండా,  బంతితో వీపు వాయింపులు, బచ్చాలు.. వగైరాలు ఆడిన ఊరు. (అప్పుడు ఎప్పడో వచ్చే రిక్షాలు తప్ప అంత ట్రాఫిక్ ఉండేది కాదు.)
   పాండురంగ విద్యాలయంలో 4, 5 క్లాసులు, BH బళ్లో 1st ఫార్మ్, మాజేటిలో 2,3 ఫార్మ్ లు, మళ్లీ BH లో 4,5,6(sslc) ఫార్మ్లు, వుమన్స్ కాలేజ్ లో Puc, B.sc లు చదివి చదువు అంతా నేర్చేసుకున్నానన్న feeling. కొమాండూరి తిరుమలాచారి గారి దగ్గర సంగీతం, ఉషా వాళ్ల కుట్టు క్లాసుల్లో కుట్టు.. అలా ఎన్నో నేర్చుకున్న ఊరు.

   ఎన్నెన్నో జ్ఞాపకాలు.. ఎంతో మంది స్నేహితులు, ఇప్పటికీ ప్రాణంలా చూసుకునే వాళ్లని అందించిన ఊరు. రామకోటి ఉత్సవాలు, హిందూకాలేజ్లో, మునిసిపల్ హాల్లో, మా కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన నాటకాలు, కచేరీలు, ఉపన్యాసాలు..
   ఓహ్.. గుంటూరంటే ఉత్సాహం ఉరకలేస్తుంది. అందులో మా నాన్నగారిని, అన్నయ్యని మించిని అభిమాన ఆప్యాయతలందిచే మేనల్లుడు రవి వడ్లమాని.. ("ఇది మీ ఇల్లత్తయ్యా! ఎప్పుడైనా, ఏ సమయంలో నైనా, మేం ఊర్లో ఉన్నా లేకపోయినా వచ్చి మీ ఇష్టం వచ్చినన్నాళ్లు ఉండండి" అంటాడు.), వాడికి తగ్గ ఇల్లాలు రాజి.. (మేం కారాలు తినమని, వేరుగా వంటలు చేయించి, దగ్గర నుంచుని వడ్డిస్తుంది) బోలెడు కబుర్లు.. పక్కనే అన్నయ్య కట్టించిన గుడి, అందులో కొలువైన దేవతలు.. మరి గుంటూరు వెళ్లే అవకాశం వస్తే ఎగిరి గంతెయ్యాలి కదా!
  ప్రస్థుతానికి వస్తే..

  సంధ్య గోల్లమూడి వార్తా పెట్టిలో టపా.. "అక్కా, మనం టాక్సీలో వెళ్దాం, మధ్యలో ప్యూర్ సంస్థ పనులున్నాయి, సత్తెనపల్లి దగ్గర రెండు ఊర్లలో బళ్లల్లో సరుకులు ఇవ్వాలి."
  చలో అనుకుంటూ, 1వ తేదీన పొద్దున్నే 5 గంటలకి, మా ఇంటి దగ్గరకి వచ్చి ఎక్కించుకున్న సంధ్య ఇన్నోవా లో
బయల్దేరాం. మధ్యలో నార్కట్ పల్లి దగ్గర వివేరాలో ఫలహారం. తొమ్మిది కల్లా సత్తెనపల్లి చేరాం..అంత ర్రాష్ట్ర పన్నులు కట్టి.
అక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఎడం పక్కకి తిరిగి అచ్చంపేచ రోడ్ ఎక్కాం. 'ప్యూర్' సంస్థకి అనుబంధంగా సహాయం చేసే 'స్నేహ హస్తం' అనే ఇంకొక సంస్థలో పనిచేసే కరీముల్లా పల్లెకి ముందు వచ్చిన యన్ టిఆర్ విగ్రహం దగ్గర వేచి చూస్తు
న్నాడు.
   మమ్మల్ని 'గ్రంధసిరి' అనే ఊరికి తీసుకెళ్లాడు. పేరు భలే ఉంది కదూ! ఊరు మాత్రం అంత బాలేదు.. లేని రోడ్లు.. ఉన్న సిమెంట్ రోడ్లు గుంతలు. మొత్తానికి బడి దగ్గరకు వెళ్లాం. చాలా పెద్ద స్థలం. ఒక పక్కగా నాలుగ్గదులు వరండా ఉన్న బడి భవనం. ఆ స్థలం అంతా నీరు, బురద. వాన పడ్తే, రోడ్డు మీద నీల్లన్నీ, స్కూల్లోకి వచ్చేస్తాయిట. ఒక పక్క, గోడనానుకుని సన్నని బాట.. అందులో మధ్యలో చిన్న గుట్టలా మాన్ హోల్. నేను వెళ్ల లేననుకున్నా. ఎలాగో, యంగ్ కరీముల్లా చెయ్యి పట్టుకుని మెల్లిగా తీసుకెళ్లాడు.
   ఉన్నది పాతిక మంది పిల్లలట. అప్పర్ ప్రైమరీ స్కూల్. ఒకటి నుంచీ ఆరు వరకూ పిల్లలుంటారు. ఇంత తక్కువ మందా! అదే అడిగాము. ఊరంతా తిరిగి యాభై మంది వరకూ చేర్పిస్తే, మధ్యలో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్స్ లో చేర్పిస్తార్ట తలిదండ్రులు.
   పిల్లలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియమ్ కూడా మొదలు పెట్టారుట. ఐనా పిల్లల్ని తీసుకుపోతున్నారని ఆ హెచ్చెమ్ కుసుమ గారు వాపోయారు.
   ముందుగా బడి ఆవరణని శుభ్రం చేయించి, తోట, ఆట స్థలం ఏర్పరచుకోండి అని సలహా ఇచ్చాను. ఆ విధంగా చెయ్యడానికే మాత్రం ఖర్చవుతుందో కనుక్కోమని సలహా ఇచ్చాను. వాళ్లు ఆ మాత్రం వర్కవుట్ చేస్తే ఏదైనా మనం కూడా చెయ్యచ్చని నా ఆలోచన.
   ఆ తరువాత వేల్పూరు ప్రైమరీ స్కూలుకెళ్లాం. అక్కడ కాస్త ఫరవాలేదు. స్కూల్ బిల్డింగ్ కి రంగులూ, ఆవరణ కాస్త శుభ్రంగా ఉన్నాయి.
రెండు స్కూల్లోనూ టివీలు మా చేత ఇప్పించింది సంధ్య. వాటిని ఇమ్మని డబ్బులిచ్చింది ఒవరో ఐతే మేము సోకు చేసుకున్నామన్నమాట.
   అంతా సవ్యంగా చేసి, గుంటూరు బయల్దేరాం.
సశేషం..
   గుంటూరు చేరేసరికి నీరసం వచ్చేసింది, ఎన్ని బిస్కట్లుతిన్నా, టీలు తాగినా. మధ్యాహ్నం మూడవుతోంది మరి..
   మేనల్లుడి రెండో అమ్మాయి వల్లీ భాస్కరలక్ష్మి నవ్వుతూ ఆహ్వానించి మా ముగ్గురికీ దగ్గరుండి వడ్డించి భోజనం పెట్టింది. తను కాలిఫోర్నియా లో ఉంటుంది. వారం అయిందిట వచ్చి. రవికేమో దగ్గు, జ్వరంట. పడుక్కున్నాడు. రాజి ఫ్రెండింట్లో భోజనాలని వెళ్లింది.
   మేం, అన్నాలు తినేసి విహారానికి బయల్దేరాం. శ్యామలా నగర్లోనే సంధ్య పెద్దమ్మ కొడుకుంటారు. తను వాళ్లింటికీ, అక్కడే ఎదురుగా  నా బాల్యస్నేహితురాలు డా. నిర్మల (తను 30 ఏళ్లు పైగా చికాగో దగ్గర గైనకాలజిస్ట్ గా చేసి, కాలిఫోర్నియోలో  పదవీ విరమణానంతరం విశ్రాంతి తీసుకుంటుంటోంది.. డా. రామకృష్ణ గారు తను.. ఇండియా వస్తూ వెళ్తుంటారు. వాళ్లమ్మగారిని (90 ఏళ్లు) చూడ్డానికి.
సాయంత్రం వరకూ కబుర్లు చెప్పుకుని, ఇంటికెళ్లి, మళ్లీ కబుర్లు.. టీలు.. తరువాత రాత్రి భోజనం. పిదప పెందరాళే నిద్ర పోయాం. మర్నాడు పొడుగు రోజుంది మరి ఎదర..
   2-9-2017.
మరపురాని రోజు. తొమ్మిదికి బయలుదేరి, తొమ్మిదిన్నరకల్లా సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ఆవరణకు చేరుకున్నాం.
మేము ఇంట్లో ఇడ్లీలు తినేసి బయల్దేరాం. ఇక్కడ కారాలెక్కువేస్తారని భయం. ప్రాంగణంలోకి వెళ్తూనే, అనంత కృష్ణ, పట్వర్ధన్ గేటు వద్దే స్వాగతం పలికారు. మద్దాలి శ్రీనివాస్, రాము (ఇతనే మనకి బడి ఆవరణలో ఏర్పాట్లు చేసింది. ఆ స్కూల్ అతని ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మా మేనల్లుడు రవికి స్నేహితుడు).
ఫలహారాలు, పలకరింపులు, వందనాలు అయాక సరిగ్గా పది గంటలకి కార్యక్రమం ఆరంభించారు. ముఖ్యోద్దేశం చెప్పాక, ఆట్టే బోర్ కొట్టకుండా, పద్య పఠనం ప్రారంభించారు.
ఇంక ఆగని కవితా వెల్లువ.. పద్యాల మీద పద్యాలు.. రాగ యుక్తంగా, వివిధ కథా వస్తువులు.. ఎందరో గురువులు.. కంది శంకరయ్యగారు, గోలి హనుమచ్ఛాస్త్రిగారు,  టేకుమళ్ల వంకటప్పయ్యగారు, అర్క సోమయాజి.. చాలా మంది బృందం ద్వారా పరిచయస్థులే. అందుకే అస్సలు కొత్తనిపించ లేదు.
ఎంతో వింతయిన విషయం.. ఆరంభించిన కొద్ది నిముషాల్లోనే, ఇది కవి సమ్మేళనమేనా అని ఆశ్చర్యం కలిగేలాగ హాలు నిండి పోయింది. వైజాగ్, నెల్లూరు, ఒంగోలు, బందరు, విజయవాడ, రాజమండ్రీ, హైదరాబాద్, ఆదిలా బాద్.. ఎక్కడెక్కడి నుంచో కదిలి వచ్చేశారు.
పద్యానికి ఈ కాలంలో కూడా ఇంత ఆదరణ ఉందా అనిపించింది.
మేం వెళ్లగానే పేర్లిచ్చేశాం కనుక, వరుసలో ఐదూ, ఆరూ అనుకుంటా.. మా వంతు వచ్చేసింది. సంక్షిప్త పరిచయం తరువాత పద్యాలు కాస్త రాగ యుక్తంగానే చదివాను. అందరి పద్యాలూ గుర్తుండవు కదా.. నేను చదివినవి ఇక్కడ పెడ్తాను.
మాతృభాష గురించి..
  1. ఉత్పలమాల: ఎన్నియొ భాషలున్నయును యెన్నగ నుండెడి దొక్కటే కదా
                 యెన్నియొ దేశముల్ తిరిగి యెంతయు నేర్చిన యెన్నిభాషలున్        
                 యెన్నడు నాదమర్చినను యేమియు చేసిన నిల్చునే మదిన్
                 పన్నము నుండి తిన్నగనె వచ్చుగదా నదె మాతృ భాషగా.

     2. శార్దూల విక్రీడితము.
  గారాబమ్మును సేయు వేళలను, యంకమ్మున్ పరుండే తఱిన్,
                మారామున్ తన తల్లితో పలుకు నే మాటోనదే యౌనదిన్,
                ఏరోజైనను మాతృ భాషయె కదా యే భావమున్ తెల్పగన్
                రారా రమ్మని ప్రేమ మీర పిలిచే లాలిత్యముం జూపగన్.

3. చంపకమాల.
 మనసున యున్న మాటలను మన్నిక చెప్పను నేది వచ్చునో
                తనువున నెక్కడైన చిరు తాకిడి యైన చటుక్కునేమనున్
                ఎనగొను నాలుకన్ తిరుగు నేమది యమ్మయు చెప్పినట్టిదే
                కనుగొన నేమి కష్టము నికన్ యది నిక్కము మాతృ భాషయే.

   4. మధ్యాక్కర.      
మాధుర్యమున దేల్చివైచి మధుర నాదంబుల ముంచి
                                ఏధనముగ నేది యున్న, నెవ్వరి మాతృభాషకును
                                సాధర్మ్యము కలద భువిని సౌకర్యముగ భాషణకును
                                సాధుఁజేయ మన సంస్కృతిని సర్వ సమయములయందు.
   
     5. మధ్యాక్కర.     చల్లగాలికి కొమ్మ లూపు శాఖి కన్నను మేలు కాద
                               ఘొల్లుమనుచు గోల చేయు గువ్వలు గొడ్లు పురుగులు
                               ఎల్లజీవులకన్న మేలు యీ మాట లాడేటి మనిషి

                               వల్లగ నా మాటలందు మాతృ భాషయె మిన్న కాద.

కవులు అందరూ చదివిన పద్యాలు ప్రజ-పద్యం బృందంలో టాపా పెట్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నిర్వాహకులు చొరవ తీసుకోవాలని నా విన్నపం.

ఇదీ నాకు ఇచ్చిన పత్రం.
భోజనాల వేళయింది.. చాలా ఆలిశ్యంగా. అనూహ్యమైన స్పందన వచ్చినప్పుడు తప్పదు మరి. అందుకే వచ్చే సారి నుంచీ రెండు భాగాలుగా చేద్దామనుకున్నారు.
వారి ఇంట్లో శుభకార్యంలాగా నిర్వాహకులు, ఆప్యాయంగా కొసరి కొసరి, ఛలోక్తులతో వడ్డిస్తూ కడుపునిండా తినిపించారు.

   అన్నదాతకి శుభాభివందన ధన్యవాదాలు. (వారి పేరు గుర్తులేదు.. చేప్తే ఇందులో చేరుస్తాను.)
అందరూ వచ్చే సమావేశానికి ఎదురుచాస్తూ సెలవు తీసుకున్నాం.



0 వ్యాఖ్యలు: