Thursday, March 31, 2016

నేల-బండ

Posted by Mantha Bhanumathi on Thursday, March 31, 2016 with No comments
31-3-2016- శుభోదయం.
2. మీరు ఎప్పుడైనా ‘నేల-బండ’ ఆట ఆడారా? ఒకో సారి ఒకో ఆట పట్టుకుని వదలకుండా ఆడే వాళ్లం.
 నాకు పదేళ్లప్పుడు..
  మేం అరండేల్ పేట, ఒకటో అడ్డరోడ్డు, పదో లైన్లో పాటిబండ ప్రసాదరావుగారింట్లో ఉండేప్పుడు ఆడే వాళ్లం.. రోజూ! ఎండ మండిపోతున్నా వారింట్లో.. పెద్ద పెరట్లో బోలెడు నీడుండేది. రకరకాల చెట్లు.
చెట్టు మీద చెయ్యేస్తే బామ్మగారు.. ప్రసాదరావుగారి తల్లి, కర్ర పట్టుకునొచ్చేది. ఎందుకో కానీ.. చాలా నాపరాళ్లు, బండలు, చిన్న అరుగులు ఉండేవి. ఒక మూలగా ఒక రేకుల గది ఉండేది. అందులో బుల్లి సంసారం.. ఇద్దరే ఉండేవారు, కొత్తగా పెళ్లయిందనుకుంటా.
దమయంతి (ఇంటివాళ్లమ్మాయి), లైలా, చిన్నమ్మ, కమల.. ఇంకా ఇంటివాళ్లబ్బాయి చిట్టి, తన స్నేహితులు కూడా ఉండే వారు.
పంటలేసుకునే వాళ్లం. చివరికి మిగిలిన వాళ్లు దొంగని తెలుసు కదా! ఇంక చూడండి.. దొంగ ఎవర్ని పట్టుకుంటే వాళ్లు దొంగే. నేలా, బండా.. ఏది కావాలి? దొంగ ఎంచుకుంటుంది (టాడు).
నేల ఎంచుకుంటే.. నేల మీద మనం ఉండకూడదు. దొంగ వస్తుంటే బండ మీదికి దుంకెయ్యాలి. ఒక సారి.. చిన్న బండ అది. నాకు ఒక కాలు బండ మీద ఒక కాలు నేల మీద ఉండి పోయింది. దొంగ పట్టుకుంది.
ఏం చెయ్యాలి?   శిఖరాగ్ర సమావేశాలయ్యాయి.. చుట్టుపక్కలున్న పిల్లలంతా వచ్చేశారు. బామ్మగారు అటుకులు పెట్టింది. నవులుతూ ఒకటే చర్చలు.
చివరికి దొంగకే ఓటేశారందరూ. గొణుక్కుంటూ, నేను పరికిణీ దోపుకుని.. అరిచా.. “రెడీ?”

0 వ్యాఖ్యలు: