30—3—2016.
1..తొక్కుడు బిళ్లాట:- గుర్తుందా? అప్పుడు నాకు ఏడో ఎనిమిదో ఏళ్లుంటాయి.
ఆట చివర్లో కళ్లు మూసుకుని గళ్లు దాటాలి.
అలా మూసుకున్నపుడు మా వరాలు గబగబా గీత తుడిపి కొత్తది గీసేది. చేతిలో తయారుగా ఉండేది తడి బట్టొకటి. సీతాలు, దుర్గ.. దాంతో కుమ్మక్కే.. అందరూ కలిసి నన్ను ఔటు చేసే వారు.
మరి అప్పుడు తప్పు గడిలోనో, లేక పోతే గీత మీదో కాలు పడక తప్పదు కదా?
ఎందుకంటే ఎవరౌటైతే వాళ్లు తీపి తినిపించాలి. మా అమ్మ నాల్రోజుల కోసారి మైసూరు పాకం చేసేది. ఇంట్లో వెన్న కాచిన నేతితో. గుమ్మం ముందుకొచ్చి పితికిన పాలు పోయించుకునే వారు అప్పట్లో. పాలవాడు, గిన్నెలో కొద్దో గొప్పో నీళ్లుంచి, అవి కింద పడకుండా గిన్నె గిర్రున తిప్పి తలక్రిందులు చేసే వాడు. అపకేంద్ర బలంతో ఒక్క చుక్క కూడా కింద పడేది కాదు.
ఇంతకీ మైసూరు పాకం చెయ్యడంలో మా అమ్మను మించిన వాళ్లు లేరని చెప్పు కునే వాళ్లు అప్పట్లో. ఎన్ని సార్లు చేసినా ఒకే లాగ వచ్చేది. అదే నా స్వంత కాపురంలో చెయ్య బోతే.. ఒకో సారి ఒకో లాగ వచ్చేది. మైసూర్ పాయసం, బంక, ఇటిక.. ఇలా చాలా పేర్లు పెట్టుకునే వాళ్లం.
మా అమ్మ మైసూర్ పాక్..,చిన్న చిన్న డైమను ముక్కలు చేసి సీసాల్లో పెట్టేది. ఒక్కోటి నాలిక మీదేసుకుంటే జర్రున జారి పోయేది గొంతులోకి. ఆ ముక్కల కోసం అన్న మాట. అంత తొండి చేసే వారు.
అమ్మ ఏమనేది కాదు. తనే విస్తరాకు ఆకులుగా తుంచి తలో రెండు ముక్కలూ పెట్టేది.
0 వ్యాఖ్యలు:
Post a Comment