Saturday, April 2, 2016

పున్నమివెన్నెల-చల్లని గాలి

Posted by Mantha Bhanumathi on Saturday, April 02, 2016 with 1 comment
3. 2-4-2016.
పున్నమి వెన్నెల-చల్లగాలి:
ఈ మధ్యని వేడి చాలా ఎక్కువైంది కదా! AC వెయ్యక తప్పట్లేదు. పొద్దున్న లేచే సరికి ఒళ్లంతా పొడి బారి పోయి, తలంతా దిమ్ము.. గదిలోంచి బైటికి రాగానే వేడి.
ఏంటో.. ఈ బందిఖానా..
30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో.. ఒక్క సారి రింగులు చుట్టేసుకుంటే..
సాయంత్రం అయే సరికి డాబా మీద పక్కలు వేసెయ్యాలి. ఆ వెయ్యడం రోజుకొకరి డ్యూటీ. పెందరాళే భోజనాలు చేసేసి, మంచినీళ్లు, మద్యలోనవల్డానికి కారప్పూస.. పెట్టుకుని 9 కల్లా పైకి చేరుకోవాలిసిందే.. సెకండ్ షో సినిమాకి వెళ్తే తప్ప.
కొబ్బరాకులు సరిగ్గా పిట్టగోడ మీది నుంచి వంగి పలుక రిస్తుంటే.. ఆ ఆకుల్లోంచి పక్కింటి దీపాల నీడలు పరుచుకుంటే.. డాబా అంతా వింత కాంతులే.
పిల్లలు చదువుకోడానికి అక్కడ రెండు బల్బులు..
కబుర్లు చెప్పుకుంటూ, మధ్యలో చదువుకుంటూ.. పడుక్కుంటే.. చల్లనిగాలి హాయిగా తాకుతుంటే ఎప్పుడు నిద్ర పట్టేదో! అప్పుడప్పుడు ఉక్క.. ఉక్క తరువాత వేసే గాలి ఇంకా హాయి.
అప్పట్లో దోమలు కూడా ఉండేవి కాదు. ఆతరువాత రావడం మొదలెడితే.. ఫోల్డింగ్.. దోమతెరలు దించుకోవాలిసిందే.. డాబా మీద పడక మాత్రం మారదు.
ఇంక ఏ అర్ధ రాత్రో జల్లు మొదలైతే.. సన్నగా పడినంత సేపూ ముడిచి పెట్టుకుని పడుకున్నా.. పెరిగే సరికి లేచి, పక్క బట్టలు వగైరా సర్దుకుని చంకనేసుకుని, కిందికి పరుగో పరుగు.
పున్నమి నాడు వాన వస్తే మటుకు కోపం వచ్చేది.
ఇప్పుడు డాబాలేవీ? ఉన్నా.. పడుక్కోడాలేవీ?