Wednesday, October 31, 2018

"అజ్ఞాత కులశీలస్య"

Posted by Mantha Bhanumathi on Wednesday, October 31, 2018 with 2 comments
                              "అజ్ఞాత కులశీలస్య"


తొలి ప్రస్థానం


                   సీ. జనమమెత్తినదాది జగతిలో మనుజుండు
                                   జాతి పోరులనెన్నొ జరుప గాను;
                          జంతు జాలములనే చాల చంపెను నాడు
                                  మార్గమదియె గాన మనుగడకును ;
                          ఆహారమున కైన యాహార్యమున కైన
                                  యన్వేషణముచేసె నంత తాను,
                          ఆశ తీరనె లేదు యన్నియమరిననూ
                                   వెదకులాటను నింక వేగ పఱచె.
 ఆ.వె. ఆడువారి కొరకొ నాట గెలుచుటకో
                              దేవుని కొరకో నదె ధనమునకొ
                              రాజ్యవిస్తరణకొ రాజ్య మేలుటకునో
 పురజనుల తరుముతు పోరు సలుపు.
అనాదిగా మానవుని అనేక విధములైన కోరికలు, ఇంకా ఇంకా ఏదో కావాలనే ఆశ, జాతి మనుగడకే ప్రమాదం కల్పిస్తున్నాయి. ఆ కోరికలనే నియంత్రించుకోగలుగుతే మానవుడే మహనీయుడు కాలేడా?

  సాటి మనుషులనూ, తోటి జీవులనూ, పొరుగు దేశాలనూ, పర మతాలనూ ఆదరించ గలుగుతే.. భూతలమే స్వర్గం కాదా!

  అటువంటి ఆలోచనే అత్యాశా?
పదిహేనవ శతాబ్దంలో, భారత దేశ చరిత్ర అనేక మార్పులకు లోనయింది. పరదేశ 
పాలనని నిరోధించే, ప్రతిఘటించే.. అనేక మంది రాజులు, దేశమాత గౌరవాన్నీ, ఉనికినీ 
కాపాడాలని శతవిధాల పాటు పడ్డారు.
  ఆ శతాబ్దిలో.. రెండవ దశాబ్దంలో వంగ దేశంలో జన్మించి, మూడవ దశాబ్దంనుండీ, 
పది సంవత్సరాల పసి వయసులో.. కళింగ దేశానికి వలస వెళ్లి, ఒంటరి జీవన పోరాటాన్ని
సాగించిన అజ్ఞాత కులశీలుని కథ ఇది.
  పసితనం నుంచే అనేక విపత్కర పరిస్థితులను అధిగమించిన ఆ చిన్నారి, తనకు 
ఎదురైన అవరోధాలను, ఏ విధంగా ఎదుర్కొంటాడు? అతని పయనం సాగే వైనమేది?
.........................
  క్రీస్తు శకం 1434- మాఘ మాసం.

                        

                      



   ఆ అరణ్యంలో గుర్రం గిట్టల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు! గుర్రం మీద ప్రయాణిస్తున్న ఇద్దరి గుండెలూ ఆ గిట్టల శబ్దంతో సమంగా కొట్టుకుంటున్నాయి.

  వెనుక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్లు పరుగెడుతోంది గుర్రం.

  “అమ్మా! ఒక ప్రశ్న అడగనా? కాదు కాదు.. రెండు ప్రశ్నలు.”

  మాధవుడి పిలుపు విని, కళ్ళెం గట్టిగా పట్టుకుని కొద్దిగా తల వెనక్కి తిప్పింది దుర్గాదేవి. వాళ్ళనెక్కించుకున్న గుర్రం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది, కొంచెం కూడా వేగం తగ్గించకుండా.
  మాధవుడికి పది సంవత్సరాలు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధం, విలువిద్య ఆరు వత్సరాలనుండీ నేర్చుకుంటున్నాడు. వంశపారంపర్యంగా వచ్చిన తెలివి, మెలకువలు అతన్ని ఆ విద్యల్లో రాణించేలాగ చేశాయి.
  “ఒకటి, మనం ఎక్కడికెళ్తున్నాం? రెండు, హిందూ మతమైతేనేం ఇస్లామ్ మతమైతేనేం?”
  చుట్టూ పరికించింది దుర్గాదేవి. నింగి కనిపించకుండా ఎగసిన చెట్లు, వాటినల్లుకున్న లతలు, కనుచూపు మేరలో ఏ ప్రాణీ ఆనటం లేదు. మనుషుల అలికిడికి ఎక్కడెక్కడో పొదల్లో దాక్కోడం వాటికలవాటే. సన్నని బాట మెలికలు తిరుగుతూ సాగిపోతోంది.
  లయ బద్దంగా హయం పరుగిడుతుంటే, రౌతు నింజిలి కాసింత నెమ్మదించ సాగింది. అలసటను ఆవేదనను మరపించి మనసును ఊరడింప జేసింది. దుర్గాదేవి వీపు సాగదీసి గుండె నిండుగా గాలి పీల్చి వదిలింది. మాధవుడు కూడా సర్దుకుని కూర్చున్నాడు.

కం. చల్లని గాలులు వనమున
       మెల్లగ వీచగ పుడమిని మిగుల ముదంబున్
కొల్లగ నలసిన మేనికి

       యల్లన కలుగును నవరతి హాయిగ తాకన్.



    వంగ, ఉత్కళ దేశాల మధ్య నున్న అడవి అది. ఎడమ పక్కన కొన్ని యోజనాల దూరంలో సముద్రం, కుడి వైపున కొండలు, మైదానాలూ ఉన్నాయని తెలుసు దుర్గాదేవికి.. ఉత్కళ సరిహద్దు దాటి కళింగ దేశం చేరుకుంటే అక్కడ ఏదో విధంగా, కత్తిసాము నేర్పి ఐనా జీవనం కొనసాగించవచ్చు.

  “మనం వెళ్తున్నది కళింగదేశం. రెండవ ప్రశ్నకి జవాబు పెద్దయ్యాక నీకే తెలుస్తుంది”
  “ఇంక ఆ దేశంలోనే ఉండిపోతాము కదూ!  స్నేహితులని, బంధువులనీ ఎన్నటికీ కలవము కదా!”
  దుర్గాదేవి వామహస్తం వెనుకకి తిప్పి, తన వీపుకి కట్టుకున్న కుమారుడిని మరింత హత్తుకుంది, కన్నులలో నీరు చిప్పిల్లుతుండగా.
  మాధవుడు రెండు చేతులతో మరింత బిగించి పట్టుకున్నాడు అమ్మని.
  “ఎక్కడైనా ఆగుదామా? ఆకలిగా ఉందమ్మా!”
  కన్నతల్లి కడుపు మెలితిప్పినట్లయింది. మాధవుడి వీపుకి కట్టిన మూటలో తిండిపదార్ధాలు ఉన్నాయి. అనువైన ప్రదేశం చూసుకుని ఆకలి తీర్చుకోవచ్చు. దూరాన పొగ కనిపిస్తోంది. ఏదైనా గ్రామం ఉందేమో!
  కళ్ళాన్ని కొద్దిగా బిగించింది.. గుర్రం వేగాన్నిపెంచింది.
  తమ పట్టణం నుండి బయలుదేరి పన్నెండు ఘడియల పైనే అయుంటుంది. గుర్రానికి కూడ విశ్రాంతి అవసరమే! యజమానురాలి నిస్సహాయతని అర్ధం చేసుకుని పరుగు పెడుతోంది అంతే.
  దుర్గాదేవి ఆలోచనల్లో ఉండగానే, గుర్రం వేగం తగ్గించి చదునుగా ఉన్న చోట ఆగింది. అక్కడినుంచి వచ్చిన పొగనే దుర్గాదేవి గమనించింది. ఆరీ ఆరని నెగడులోనుంచి వస్తున్న పొగ అది. రెండుమూడు ఘడియలకి మునుపే ఎవరో అక్కడి నుంచి వెడలినట్లున్నారు. ఆ ఆనమాళ్ళు కనిపిస్తున్నాయి. వంట చేసుకున్న గుర్తులు.. మంచినీటి కుండలు, మట్టి పిడతలు, మిగిలి పోయిన కట్టెలు.
  మాధవుడి కట్టును విప్పి, తను కిందికి దూకి, చేయి అందించింది.
  ఇద్దరూ, గాఢంగా ఊపిరి పీల్చి, నడుం సాగదీసు కున్నారు. కాళ్ళూ చేతులూ కూడా ఝాడించి, శరీరాన్ని స్వాధీన పరచుకుంది దుర్గాదేవి. గుర్రాన్ని చెట్టుకి కట్టేసి, దాని వీపు కాళ్ళు నిమరసాగింది.
మాధవుడు ఒక వస్త్రంలో గుగ్గిళ్ళు తీసుకుని గుర్రానికి తినిపిస్తున్నాడు..
  “హయరాజా.. మనం మూడు నాలుగురోజుల్లో కటకం చేరుకోవాలి. తెలుసు కదా?” దుర్గాదేవి గుర్రంతో మాట్లాడసాగింది. గుగ్గిళ్ళు భక్షిస్తూనే నిలువుగా తలూపింది గుర్రం.
  మాధవుడు మరింత ఆనందంగా దాని మెడ సవరిస్తూ నిలుచున్నాడు. దుర్గాదేవి గుర్రాన్ని నిమురుతూనే.. కటకం వెళ్ళాక తమకు కావలసిన ధైర్య సాహసముల గురించి చెప్పసాగింది.

    తే.గీ. కన్నుల నెపుడు స్థిరతయు కాన వలెను
           కలత కలిగిన నాడు వికలము వలదు
           బలిమి కల రాచ బిడ్డవు బాగ  ఎరుగు
           కాళి మాత నీ వెనువెంట కలదు నిజము.

   అశ్వానికి చెప్తున్నా అదంతా మాధవుడు వినాలనే.  కుండలో నీళ్ళు తీసుకుని చేతులు కడుగుకుని.. సంచీలోనుండి భక్ష్యాలు, పులిహోర తీసింది.
   మాధవుడు కూడా, చేతులు కడుక్కునొచ్చి, కొంచెం దూరంలో ఉన్న బాదం చెట్టు కిందికెళ్ళి ఆకులు, పుల్లలు ఏరుకొచ్చాడు. చకచకా నాలుగేసి ఆకులు కలిపి విస్తర్లు కుట్టి, శుభ్రంగా కడిగి తీసుకొచ్చాడు.
  ఒక్కొక్క భక్ష్యం, రెండు కుడకలు పులిహోర మాత్రం వేసింది వాటిల్లో దుర్గాదేవి.
  మాధవుడు తింటూనే తనకి వచ్చిన సందేహాలు అడిగి తీర్చుకున్నాడు. ఆకలి, సంశయాలు.. రెండూ తీరాక, లేచి ఆకు పారేసి.. అంతా సర్దేసి, గుర్రాన్ని మాలిష్ చెయ్యసాగాడు.. దానితో సంభాషిస్తూ.
  కళ్లలో నీళ్లు బైటికి కనిపించకుండా తను కూడా లేచి, చల్లని నీళ్లతో మొహం తొల్చుకుని వచ్చింది దుర్గాదేవి. మాధవుడు మామూలుగా మూడు రెట్లు తినగలడు.. అర్ధాకలితో లేపెయ్యవలసి వచ్చింది. తన వంటి స్థితి ప్రపంచంలో ఏ తల్లికీ రాకూడదు.
  ఆహార పదార్ధాలు జాగ్రత్తగా వాడుకోవాలి.. ఎప్పటికి అనుకున్న చోటికి చేరగలుగుతారో! అప్పటి వరకూ ప్రాణాలు నిలుపుకోవాల్సి ఉంది.
  “ఇంకొక మాట మాధవా!” మాధవుడు తల్లి చేయి పట్టుకున్నాడు. ఆవిడ గొంతులో ఆవేదన అర్ధం చేసుకున్నట్లుగా.
  “మన పెద్దలొక మాట చెప్తారు.. ‘అజ్ఞాతకులశీలస్య వాసో దేయో న కస్యచిత్.’ ఊరూ, పేరు, కులము, శీలము తెలియని వారికి తమ గృహములందు స్థానమియ్యకూడదని, ఇచ్చినచో ప్రమాదమనీ!
భవిష్యత్తులో నీకు సంకట స్థితి ఏర్పడ వచ్చు. నిజం చెప్తే చారులకు దొరికిపోతాము. అంచేత అనృతం ఆడక తప్పదు. నీకు ఎవరి ఆశ్రయం దొరుకుతే వారి కులమేనని చెప్పాలి. వారికి అనుగుణంగా మసలుకోవాలి సుమా!”

  “జై కాళీ..” అంటూ గుర్రాన్ని చెట్టునుంచి విడిపించింది.  ఆ కాళీ మాత దయ ఏ విధంగా ఉందో అనుకుంటూ.

  నిజంగా ఆ మాత తమ దీనావస్థని చూస్తోందా? దుర్గాదేవి తల విదిలించి మనసును సర్ది పుచ్చుకుంది. ఇప్పుడు ఏదైనా చింతించడానికి సమయం లేదు.. సాగి పోవలసిందే!

  మాధవుడు రికాబు మీద కాలేసి, ఒక్క గెంతుతో జీను మీద కూర్చున్నాడు. దుర్గాదేవి ఒక కాలు ఎత్తబోయింది. సరిగ్గా ఆ సమయంలో ఒక బాణం రివ్వున వచ్చి ఆమె గుండెలో దిగింది. ఆమె నోటినుండి కేక బైటికి వచ్చేలోగా గుర్రాల గిట్టల చప్పుడు వినిపించింది.

  “మాధవా! నువ్వు వెళ్ళిపో! నీకు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకో. నా కోసం ఆగద్దు. గణేశుల రాజ వంశంలో హిందూత్వ చిహ్నంలా నువ్వైనా నిలిచి ఉండాలి, చరిత్ర చెప్పడానికైనా! ధైర్యంగా బ్రతుకు. రాజ్యాల కోసం పోరాటం వద్దు. మన వంశం నిలుపు.. జై కాళీ..” గుర్రం జీను మీద ఒక్క దెబ్బకొట్టి, ఒరలోంచి కత్తి తీసి వెనక్కి తిరిగింది దుర్గాదేవి కాళికావతారం ఎత్తి.

   మాధవుడు గుర్రం కళ్ళెం పట్టుకుని ముందుకు వంగాడు. వెంటనే గుర్రం పరుగు తీసింది వాయువేగంతో.

  దుర్గాదేవి బాణం బైటికి లాగకుండా కత్తి ఝళిపించింది. రెండు గుర్రాల మీద ఇద్దరు వంగ సైనికులు దగ్గరగా వస్తున్నారు. వారిని ముందుకు సాగనీయకుండా ఒక ఘడియ సేపు ఆపి, వారి అశ్వాలు ఒక పూట మాత్రం కదలకుండా వాటి కాళ్ళకి గాయాలు చేసి.. నేలకొరిగింది, వంగ బెబ్బులి దుర్గాదేవి.. వంగ దేశాన్నేలిన గణేశుల రాజవంశంలో మిగిలిన హిందూ స్త్రీ..
  ఆ సమయం చాలు.. మాధవుని గుర్రం ఆ సైనికులకి అందనంత దూరం వెళ్ళడానికి, మనుగడకై మార్గాలు వెతకడానికి.
                                             ………………


2వ భాగం.
                                                కుటుంబం
ఎక్కడో పర్షియా దేశం నుంచి భరతావనికి వచ్చి, ఒక్కొక్కటిగా దారిలో దేశాలనాక్రమిస్తూ వచ్చిన ముసల్మానులు భారత దేశంలో స్థిరపడి పోయారు.. రాజులుగా, చక్రవర్తులుగా! ఒకరి వెనుకగా నొకరుగా..


   కం. కొండల కోనల కనుమల
          దండుగ దండెత్తి బలిమి దాడిని సలిపిన్
          దండకమున జనుల నరికి
          పండుగ చేసి కొనుమనుచు పర దొర లుడివెన్.  .
           
   ఆ పర దొరలు అన్ని దిక్కులకూ చొచ్చుకుని వచ్చి ఆక్రమించ సాగారు.
   పదిహేనవ శతాబ్దపు ఆరంభంలో, వంగదేశాన్ని చేజిక్కించుకుని పాండువా రాజధానిగా
 ఘియాజుద్దీన్ అజమ్ షా పాలించాడు. అక్కడ దినాజ్ పూర్ అనే ఊరికి హకీమ్(గవర్నర్)గా
ఉన్న  రాజా గణేశు, ఆ రాజును చంపి వంగదేశ సింహాసనాన్ని అధిష్టించాడు. 
కానీ, వెనువెంటనే సరిహద్దుల్లోని జానుపురం సుల్తాను దండయాత్రనెదుర్కోవలసి వచ్చింది. 
పరిస్థితుల ప్రాబల్యం వల్ల కొడుకు ‘జాదూ’ని ఇస్లామ్ మతానికి మార్చడానికి ఒప్పుకుని, 
జలాలుద్దీన్ అనే పేరుతో పట్టం కట్టాడు. జానుపూర్ సుల్తాను వెను తిరిగాడు.
  సుల్తాన్ యుద్ధం విరమించుకుని వెళ్ళగానే, మళ్ళీ కొడుకు మతం మార్చి తను 
సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. హిందూ పండితులు ఆ మార్పిడిని ఒప్పకోలేక పోయారు, 
రాజు భయానికి తలలూపినా!
  అందుకే కాబోలు.. జాదూకి ఇస్లామ్ మతం అంటేనే గురి కుదిరింది.
  సంవత్సరం లోగానే.. జలాలుద్దీన్ అనుచరులు గణేశుడిని చంపి, అతన్ని రాజుని చేశారు.
  ఆ పోరుల్లో రాజా గణేశుని అంతఃపురం అంతా అయోమయంలో మునిగిపోయింది. ఎవరు 
ఏమతాన్ని అనుసరిస్తున్నారో.. పూజలు చెయ్యాలో నమాజు చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి.
  చిన్నరాణీగారి దగ్గరి బంధువు దుర్గాదేవి. ఆవిడ భర్త కూడా గణేశ వంశంవాడే. రాజుకు 
తమ్ముడౌతాడు, గణేశునికి కుడి భుజమై కనుసన్నలలో ఉండేవాడు.
  రాజా గణేశ్ నిస్సహాయ స్థితిని చిన్ననాటి నుంచీ గమనిస్తూనే ఉంది దుర్గాదేవి. 
అంతఃపురమంతా ముసల్మానులు.. గణేశుని ద్వంద్వ వైఖరిని నిరసించి అతన్ని 
మట్టుపెట్టిన వారు. జలాలుద్దీన్ సింహాసనమెక్కగానే మతమార్పిడులు ఉధృతంగా 
మొదలయ్యాయి.

  దుర్గాదేవి మతమార్పిడులను నిరసించింది. జన్మతః ఉన్న మతాన్ని ఎందుకు 
మార్చుకోవాలి? అంతఃపుర స్త్రీలలో యుద్ధ నైపుణ్యం ఉన్నది ఆమెకే! గణేశుని తమ్ముని 
వరుసైన ఆమె భర్త ని, హిందూమతాన్ని విస్తరింపచేస్తున్నాడని రాజా గణేశునితో పాటే 
సంహరించారు.
సాధారణంగా అటు నుంచి బైటికి వెళ్ళే వారిని ఆపరు.. ఆ సంగతి గమనించే ఆ మార్గాన్ని ఎంచుకుంది దుర్గాదేవి.

  దక్షిణదిశగా పయనం సాగించింది.

  బయలుదేరి రెండు రోజులయింది. ఇంక క్షేమంగా తప్పించుకున్నామనే అనుకుంది.

  కానీ.. అతఃపురంలో గలగల లాడుతూ తిరిగే మాధవుడు కనిపించకపోతే అనుమానం వచ్చింది అందరికీ! వేట మొదలయింది. స్వయంగా జలాలుద్దీన్ ఆదేశాలిచ్చాడు.       

  కోట ఆనుపానులన్నీ తెలిసిన దుర్గాదేవి వలన ఎప్పటికైనా అపాయమే..

  ఇద్దరు సైనికులకి వాయువేగంతో నడిచే గుర్రాలనిచ్చి పంపించాడు రాజా జలాలుద్దీన్.
  వారే.. దుర్గాదేవిని అడ్డుకుని చంపేశారు. కానీ.. ముందుకు వెళ్ళి మాధవుడిని ఆపలేరు. ఏ దేశానికి వెళ్తున్నాడో, ఏ కొండల్లో కోనల్లో దాగి ఉంటాడో ఎవరు చెప్పగలరు?
  తమ గుర్రాలని నెమ్మదిగా నడిపించుకుంటూ సమీప గ్రామానికి బయల్దేరారు.తప్పని సరిగా.. భర్తలు లేని స్త్రీలంతా ముసల్మాన్ సైనికులకి బీబీలుగా మారిపోయారు. ఇష్టంలేని వారు కొందరు ప్రాణ త్యాగం చేశారు. కొందరిని పారిపోతుంటే మాన ప్రాణాలని కొల్లగొట్టారు.
  కొన్ని రోజులు అంతఃపురంలో మహారాణి నీడలో తలదాచుకున్న దుర్గాదేవి కొడుకుని తీసుకుని పారిపోవాలని నిశ్చయించుకుంది.. కానీ ఏ విధంగా? ఎక్కడికక్కడ కాపలా! రోజూ ముస్లిమ్ స్త్రీ లాగానే మేలి ముసుగు వేసుకునే ప్రాసాదం అంతా తిరుగుతూ పరికిస్తోంది. తన చిన్న మందిరంలో మాధవుడికి యుద్ధ విద్యలు నేర్పిస్తూ కర్తవ్యాన్ని బోధిస్తోంది.
  అనుకున్న సమయం ఆసన్నమయింది..
  ఆ రోజు ఈద్.. అందరూ పండగ పిండివంటలు సుష్టుగా తిని ఆయాస పడుతున్నారు.
  “మంచి జీరా పానీ భాయ్.. తిన్నది అరిగి తేలిగ్గా ఉంటుంది. సేవించండి.” అందరికీ మత్తుమందు కలిపిన పానీయాన్ని అందించింది.
  మాధవుడు కూడా పొడుగాటి కమీజ్ వేసుకుని పానీయం అందిస్తున్నాడు.
  కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నారు అందరూ..
  మహారాణీకి కూడా చెప్పలేదు..
  భర్త తరచుగా వెళ్ళే, ఉత్కళ దేశం లోని కటకం వలస వెళ్లాలని నిశ్చయించుకుంది. అక్కడికి ఇంకా శతృవుల బెడద వచ్చినట్లు లేదు. భర్త వాడిన గుర్రాన్నే తయారుగా ఉంచింది.. మగ వేషం వేసుకుని, సర్ది పెట్టుకున్న సామాన్లు తీసుకుని మాధవుడితో సహా గుర్రం ఎక్కి, వంటశాలకి సరుకులు తెచ్చే దారిలోనుంచి కోట దాటింది.
“తల్లీ కొడుకులిద్దరినీ చంపేశామని చెప్దాము. ఇద్దరము ఒకే మాట మీదుండాలి.” ఒకరినొకరు హెచ్చరించుకున్నారు.
  ఆనమాలుగా దుర్గాదేవి ఖడ్గాన్ని తీసుకున్నారు. ఆవిడ వీపుకి కట్టుకున్న మూటని విప్పారు. ఏమైనా నాణాలు దొరకచ్చేమో.. జలాలుద్దీన్ పాదూషా నాణాలకి ఏదేశంలో నైనా విలువ ఎక్కువే!
  దుర్గాదేవి తెలివి తక్కువ అతివ కాదు.. నాణాలని మాధవుడి వీపుకి కట్టింది. ఏ ఆపద వచ్చినా కుమారుడిని రక్షించడమే ప్రధమ కర్తవ్యం. అవసరమైతే అశ్వం కూడా తన ప్రాణాలనే ముందు వదులుతుందని తనకి అవగతమే!
   సైనికులిద్దరూ నిరాశతో వెనుతిరిగారు.. దుర్గాదేవి భుజాలకి కట్టిన మాధవుడి అంగీలని తీసుకుని.. ఖడ్గంతో సరిగా అవి కూడా సాక్ష్యాలే మరి.
                                         …………..
  మాధవుడు ఒక రకమైన మొండితనంతో ముందుకు సాగుతున్నాడు.
  అమ్మ దగ్గర గారాలు పోయే వయసులో ఒంటరి పోరాటం.. పరిస్థితులే కావలసిన ధైర్యాన్ని, తెలివినీ ఇస్తాయి. అదే.. బ్రతకాలనే పట్టుదల. సృష్టిలోని ప్రతీ పాణికీ ఉండేది.  కొన ఊపిరితో నైనా పోరాడే శక్తినిచ్చేది ఆ ఆశే!

     కం. వలలో చిక్కిన పులుగులు
            జలధిన్ మునిగిన పశువులు, జారిన ఇలకున్
            జల చరములు, సర్పములు న
            కులముల నోట బడిన, నవి  కూర్చును శక్తిన్.   
             
 చీకటి పడుతుండగా అడవి చివరనున్న గ్రామానికి వచ్చాడు. ఆ దారిలో అనేకసార్లు మాధవుడి తండ్రిని తీసుకెళ్ళిన గుర్రం, అలవాటుగా ఒక పూటకూళ్ళ ఇంటి వద్ద, అరుగు పక్కగా ఆగింది.
  నెమ్మదిగా గుర్రం దిగాడు మాధవుడు. ఎవరితో ఎలా మాట్లాడాలి? బెదురుగా అటూ ఇటూ చూస్తూ నిలుచున్నాడు. ఎన్నడూ అంతంత దూరం ప్రయాణించ లేదేమో.. తూలు వచ్చింది.  సైనికులు వెంటాడుతున్నారేమోనన్న అనుమానం.. వెనుతిరిగి అమ్మ వద్దకు వెళ్దామని ఉన్నా, ఆమ్మ ఆజ్ఞ పాటించవలసిన ఆవశ్యకత ఆపేసింది.
  అరుగు మీదనే కూర్చుని, మొహం మోకాళ్ల మీద పెట్టుకుని కుమిలిపోసాగాడు. అమ్మ ఏమయింది? ఎక్కడుంది? ఆ చిన్ని మనసుకు తెలుసు.. ఇంక అమ్మ రాదని. కానీ తట్టుకోగల వయసు లేదు. చిన్న నాటి నుంచీ యుద్ధాలు, చంపుకోవడాలు చూస్తూ ఉన్నా కూడా.. అప్పుడు ఓదార్చడానికి అమ్మ ఉంది. ఇప్పుడూ.. ఎవరున్నారు?
  భుజం మీద చెయ్యి పడింది ఎవరిదో! ఉలిక్కిపడ్డాడు మాధవుడు. వెన్నులోంచీ వణుకు వచ్చింది. అమ్మ చెప్పిన జాగ్రత్తలు మర్చిపోయి ఏమరుపాటుగా ఉన్నాడు.
  ఒళ్లంతా కుంచింపజేసి అరుగు మీదనుంచి గుర్రం మీదికి దూకి కళ్ళెం లాగాడు.
  కానీ గుర్రం కదల లేదు.
  ఇంకా ఏడుపొచ్చేసింది.. గుర్రం అలసిపోయింగా? అకలేస్తోందా? మరణమే శరణ్యమా?
  “బాబూ! భయం లేదు. కిందికి దిగు.” చల్లని పిలుపు.
  ఐనా.. భయంగానే చూశాడు బాలుడు.
  తలంతా ముగ్గుబుట్టలా అయిపోయిన ఒక ముసలమ్మ.. నుదుటి మీద పెద్ద కుంకుం బొట్టు. ముఖమంతా ముడుతలు. చిరునవ్వు నవ్వుతూ పిలిచింది.
  ప్రసన్నవదనంతో పిలుస్తున్న కాళీమాతలా అనిపించింది మాధవుడికి.
  వెంటనే దిగి, ఆవిడ ఒళ్ళో తల పెట్టి బావురుమన్నాడు.
  “అమ్మా.. అమ్మా..” వెక్కెక్కి ఏడవసాగాడు.
  తన చేత్తో మాధవుడి వీపు నిమురుతూ ఓదార్చింది ఆ పూటకూళ్లమ్మి.
  “ఎవరు బాబూ నువ్వు? ఎక్కడికి పయనం?”
  “వంగ సైనికుల నుండి తప్పించుకుని వస్తున్నాను. కటకం వెళ్ళాలి. ఇది ఏ గ్రామం? ఇక్కడికెంత దూరం కటకం?” తన పేరు చెప్పి, వెక్కుతున్నా స్పష్టంగా అన్నాడు మాధవుడు.
  గుర్రం సకిలిస్తుంటే అటు చూశారు ఇద్దరూ. తల నిలువుగా ఆడించింది అశ్వం.
  “ముందు నువ్వూ నీ గుర్రం ఆకలి తీర్చుకుని సేద తీరండి. పిదప మాట్లాడుకుందాం.” అవ్వ, మాధవుడిని తీసుకుని లోపలికి నడిచి, ఎదురైన నడి వయస్కుడికి గుర్రం సంగతి చూడమని చెప్పింది.
  “నీ దుస్తులు, పరికరాలు నా కుమారుడు తీసుకుని వస్తాడు మాధవా! ఈ లోగా నిశ్చింతగా స్నానం చెయ్యి. ఎన్నడనగా బయలు దేరావో.. ఇక్కడికి వంగ సైనికులు రారు. ఇది ఉత్కళ దేశం సరిహద్దులో నున్న బాలేశ్వర్ గ్రామం. అడవిని దాటావు కనుక క్షేమమే! ఎందుకైనా మంచిది, గుర్రాన్ని వెనుక భాగంలో కట్టెయ్యమని చెప్తాలే.”
  మాధవుడికి ఉన్నట్లుండి నీరసం వచ్చేసింది.
  నిలుచున్న చోటే స్పృహ తప్పి తొక్కలా కిందికి వేళ్ళాడి పోయాడు.
  “అయ్యో! ముక్కు పచ్చలారని పాపడు.. వయసుకు మించిన అనుభవాలు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు పాపం..” అనుకుంటూ నెమ్మదిగా లేపి, నడిపించి తల్పం మీద పరుండబెట్టింది బాలవ్వ, వంగ, కళింగ దేశాల మధ్య రాకపోకలు సాగించే వర్తకులకి, సైనికులకీ, యాత్రికులకీ అన్నపూర్ణాదేవిలా ఆదరించే పూటకూళ్ళవ్వ.
........................
3వ భాగం.

                       


  కళ్ళు తెరిచిన మాధవుడికి ఒక్క క్షణం తానెక్కడున్నాడో అర్ధం కాలేదు.
  “అమ్మా.. అమ్మా!” అరిచాడు. అరిచాననుకున్నాడు.
  అప్పుడు గుర్తుకొచ్చింది..
  ఇంకెక్కడి అమ్మ… అమ్మ చెప్పిన పనులు చేస్తూ వాటిలో అమ్మని చూసుకోవలసిందే!
  లేచి నిలబడడానికి ప్రయత్నించాడు. పక్కనే ముక్కాలి పీట మీదున్న మంచి నీటి చెంబు 
కింద పడి చప్పుడు చేసుకుంటూ దొర్లి పోయింది.
  బాలవ్వ వడివడిగా వచ్చింది.
  “ఏమాయె? లేవకు మాధవా! నీకు బాగా ఉష్ణం చేసింది. అడవిలో ఏదో పురుగు కుట్టినట్లుంది. 
వైద్యులు ఇచ్చిన ఔషధం మరి నాలుగు రోజులు తీసుకోవాలి. ఆ పైన మంచి ఆహారం 
తీసుకోవాలి. కనీసం ఒక మాసం పట్టచ్చు. అప్పుడే నిన్ను పంపుతా.” మాధవుడిని 
అవశిష్టాలు తీర్చుకోవడానికి అవతలికి తీసుకెళ్ళి, వేడి వేడి నీటితో మొహం కడిగి, 
తడి వస్త్రంతో శరీరం తుడిచి బట్టలు మార్చింది.
  మాధవుడికి నోట మాట రావట్లేదు. నిశ్శబ్దంగా అవ్వ చెప్పినట్లు చేసి, పాలు త్రావి, 
కళ్లు మూసుకుని మంచం మీద పడుకున్నాడు.
  మరి అవ్వకివ్వడానికి సరి పోయే నాణాలున్నాయా? అమ్మ తన వీపుకి కట్టిన మూట తీసి
చూడనే లేదు. ఆలోచనలకి శిరోభారం ఎక్కువయింది. తల అటూ ఇటూ విదిలిస్తూ భారం 
తగ్గించుకోవడానికి ప్రయత్నించ సాగాడు.
  జాలితో... సేద తీర్చడానికి నిద్రాదేవి ఆ బాలుడిని తన ఒడిలోకి తీసుకుంది.
  దూరం నుంచి చూస్తున్న బాలవ్వ గట్టిగా నిట్టూర్చింది.
  ఏం చెయ్యాలి ఈ పసివాడిని?
  తాను కాపాడగలదా? వయసు సహకరిస్తుందనేది సందేహమే! నిస్సహాయురాలు. బాగా 
కోలుకునే వరకూ ఉంచుకుని, బాలుడు కోరినట్లుగా కటకం చేరుస్తే.. ఆ పైన ఆ కాళీమాతే 
చూసుకుంటుంది.
  అంతలో..
  వాకిలి నుంచీ, పెరటినుంచీ.. ఇరువైపులా గుర్రం సకిలింపులు వినిపించాయి. 
బాలవ్వ ఉలిక్కిపడి లోపలికి వెళ్ళి, పనివాడికి చెప్పవలసింది చెప్పి, చేతులు 
తుడుచుకుంటూ వీధి గుమ్మం తీసి అరుగు మీద నిల్చుని కళ్ళ చికిలిస్తూ చూసింది. 
కళ్ళ మీద చేతులానించి చూస్తే… కనిపించాయి మూడు గుర్రాలు, వాటి మీద నున్న 
రౌతులు నిశితంగా చుట్టుప్రక్కల పరికిస్తున్నారు.


  ఒకే ఒక క్షణం బాలవ్వ గుండె ఆగిపోయినట్ల నిపించింది.
  వంగ సైనికులు.
  మాధవుడిని వెతుక్కుంటూ వచ్చి ఉంటారు. అనుమానం లేదు.
  అవ్వ ఆలోచనలో ఉండగానే దగ్గరగా వచ్చేశారు సైనికులు. ఇంక ఇంట్లోకి తిరిగి వెళ్ళడం 
అసంభవం.
  “ఏమవ్వా? భోజనం ఉందా?” ముగ్గురిలో అధికారిలా ఉన్నవాడు అడిగాడు.
  “అర ఘడియలో చేసేస్తా. ఆ పక్కనే చెరువుంది. ముఖము, కాళ్లు చేతులు ప్రక్షాళన 
చేసుకుని రండి. వడ్డిస్తా.” బాలవ్వ ఇంటికొచ్చిన వాళ్లకి అన్నం పెట్టితీరాలి. అది 
పూటకూళ్ళ సాంప్రదాయం.
  లోపలికి వెళ్లి మాధవుడి మంచాన్ని సావిట్లోనే ఒక పక్కగా జరిపింది. గాఢంగా నిద్రపోతున్న
మాధవుడి మీద కంబళీ కప్పింది. ఎసరుపెట్టి అది కాగేలోగా పెరటి అరటి కాయలు 
నాలుగు తరిగి, బూరెల మూకుట్లో వేసి, కొడుకుని పిలిచి కత్తెర చేతికిచ్చి మాధవుడిని 
చూపించింది.
  “సరిగ్గా అర ఘడియలోగా పనైపోవాలి.”
  బాలవ్వ వంట ముగించే లోగా సైనికులు వచ్చేశారు.
  మాధవుడి మంచానికి కొద్ది దూరంలోనే అవ్వ ఆకులు వేసి వడ్డించింది.
  “అవ్వా!” వేడి వేడి వరి అన్నంలో మిరపకాయ పచ్చడి కలిపి, పురుషిడు నెయ్యి వేసిన 
ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటూ పిలిచాడు అధికారి.
  “ఏం బాబూ! భోజనం అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్తారా? అరుగు మీద ఏర్పాట్లు 
చేయించనా నా కొడుకు చేత?”
  అవ్వ కొడుకు జగన్నాధ మహాపాత్రుడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. పెద్దవయసు 
వచ్చింది… అమ్మకి మతి స్థిమితం పోలేదు కదా?
  “లేదవ్వా. మేము అత్యవసరమైన పని మీద కటకం వెళ్తున్నాము. ఇచ్చటికి  పంచకళ్యాణి 
గుర్రంమీద ఒక బాలుడు వచ్చాడా? లేదా, అతని జాడ ఏమైనా తెలుసా?”
  “అమ్మా!” సరిగ్గా అప్పుడే మాధవుడు కదిలాడు.
  “జగన్నాధా! ఒక పరి చిన్నవాడిని చూస్తావా? శిరోభారం ఎక్కువయిందో ఏమో!” 
కొడుకుని ఆదేశించింది, సంవత్సరాల తరబడి వివిధ పరిజనాలతో మెలగి సందర్భానుసార 
వర్తనము నేర్చుకున్న బాలవ్వ.
  జగన్నాధుడు తల్లి ఆలోచన అర్ధంచేసుకున్నవాని వలె, మాధవుని మీది కంబళి తొలగించి 
నుదుటిమీద చెయ్యి వేసి చూశాడు.
  సలసల మరిగిపోతోంది.
  ఆ సావడిలోనే ఒకమూలగా, ఇసుకలో నిలబెట్టిన కుండలోని నీరు తీసి, ఒక అంగవస్త్రమును 
ఆ నీటితో తడిపి, పిల్లవాని నుదుటి మీద ఉంచాడు. కాస్త ఉపశమనం కలిగిందేమో… 
గట్టిగా మూలిగి, కళ్లు మూసుకున్నాడు బాలుడు.
  “ఎవరవ్వా ఈ బాలుడు?” అడగనే అడిగాడు అధికారి.
  ఆ ప్రశ్న ఎప్పుడడుగుతాడా అని ఎదురు చూస్తోంది బాలవ్వ.
  “నా మనవడు బాబూ! నా పెద్ద కొడుకు కటకంలో ఉంటాడు. అక్కడ కోడలితో కలిసి 
పూటకూళ్ల ఇల్లు నడుపుతున్నాడు. వాడి కొడుకే ఈ చిన్నపాత్రుడు. చూసిపోదామని 
వచ్చారు. క్రిందటి సూర్యాదివాసరమునుండి ఒకటే పులకరం. ఆ వేడి మధ్యాహ్నానికి 
పెరుగుతోంది. అందుకే పూర్తిగా తగ్గాక  పిల్లవాడిని పంపుతానని కొడుకునీ, కోడల్నీ 
వెళ్లిపోమన్నా.. ఇక్కడే కూర్చుంటే అక్కడ వ్యాపారం గంటకొడుతుంది. కాస్త కూర 
వెయ్యమంటారా బాబూ?”
  “చాలవ్వా. ఇంక ఏమాత్రం తిన్నా ఇక్కడే తిష్టవేయాలి, భుక్తాయాసంతో.”
  “దానికేముందయ్యా? నా కొడుకుల వంటి వారే మీరు. కావలసినన్ని దినములుండచ్చు.”
  భోజనం చేసి, ఆకులు పెరట్లో తవ్విన గోతిలో పడేసి, నూతి దగ్గరకెళ్లి, నీళ్ళు చేదుకుని 
చేతులు కడుక్కున్నారు సైనికులు.
  మహాపాత్రుడందించిన వస్త్రంతో చేతులు తుడుచుకుని, మాధవుని మంచం వద్దకు వచ్చారు 
ముగ్గురూ.
  బాలవ్వ నేల శుభ్రం చేస్తూ పక్క చూపులు చూస్తోంది, గుండె గుబగుబ లాడుతుండగా.
  మాధవుడి భుజాలు దిగిన ఉంగరాల జుట్టు కుప్పై గంతలో ఎండుటాకుల కింద కప్పబడి 
ఉంది. ఇప్పుడు అతనికున్నది అప్పడే మొలిచినట్టున్న వరిపైరు లాంటి జుట్టు. అతని 
విశాల నేత్రాలు జ్వరపు వేడికి ఎర్రబడి ఉబ్బిన మొహంలో కుంచించుకుపోయి గీతల్లా ఉన్నాయి. అందులో… చావడిలో అంతా మసక వెల్తురు. ఉన్న గవాక్షాలు కూడా మూసేసింది బాలవ్వ, చలిగాలి తగుల్తుందని.
  పైగా, పెరటిలో కానీ, వీధిలో కానీ ఎక్కడా గుర్రపు జాడ లేదు.
  సైనికులు రుచికరమైన భోజనంతో తృప్తిగా ఉన్నారు.
  ఆ బాలుడే మాధవుడైతే, ముసలవ్వ తొణక్కుండా బెణక్కుండా... అంత బే ఫికర్ 
ఉండగలుగుతుందా! కనీసం ఆమె కొడుకైనా తడబడడా తేడా ఉంటే..
  వీధివాకిలి వద్దనే నిలబడి మెడ సారించి, మూడుగుర్రాలూ కంటికి కనిపించడం మానేవరకూ 
చూసి, అరుగు మీదనే కూలబడి పోయింది బాలవ్వ, ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించి పోగా.
                                    ………………..
  మాధవుడు తన సంచీలో ఉన్న నాణాలను మంచం మీద పరచి లెక్కిస్తున్నాడు.
  కొన్ని రాజా గణేశుని సువర్ణ గ్రామాలు. అవి ‘దనుజమర్దన’ అనే పేరిట ఉన్నాయి. అవి 
ఇరువదిరెండున్నాయి. గణేశుని రాజ్యంలో వాని విలువ అధికమే! కానీ ఉత్కళ, కళింగల్లో… 
అదీ వంగ దేశం జలాలుద్దీన్ ఏలికలో ఉన్నప్పుడు, ఏ మాత్రం విలువ ఉంటుందో 
అనుమానమే. దుర్గాదేవి నాణాలు సేకరించినపుడు అదే సందేహాన్ని వెలిబుచ్చింది.
  వెండి నాణాలలో కొన్ని జలాలుద్దీన్ హిందువుగా ఉన్నప్పటివి. అవి ‘మహేంద్రదేవ’ 
అనే పేరుతో మిక్కుటముగా ఉన్నాయి.ఈ నాణాల విలువ కూడా సందేహాస్పదమే.
  మిగిలినవన్నీ ‘జలాలుద్దీన్’ పేరిటనున్నవే. ఆ సమయంలో వంగదేశంలో చెల్లుబడిలో 
ఉన్నందువల్ల వాటిని చాలా సేకరించింది దుర్గాదేవి. అందులో బంగారు, వెండి, రాగి 
నాణాలున్నాయి. అవే ఆదుకోవాలి తనని అనుకున్నాడు మాధవుడు.
  వానిలో కొన్ని బాలవ్వకివ్వాలి. తను మాసంరోజులు పైగా ఉండిపోయాడు. ఎన్ని నాణాలు 
తీసుకుంటుందో…. ఏదైనా ఉపాధి కలిగేవరకూ సరిపోతాయో లేదో!
  పరిపరి విధాలుగా సాగాయి అ చిన్ని మనసులో ఊహలు.
  కానీ తను వంగదేశంలో లేనని మరచాడు. వాటి విలువ కళింగంలో ఎంత ఉండునో..
  ముందుగా ఒక షరాయి, కమీజు కుట్టించుకోవాలి. ఉత్కళదేశంలో మగపిల్లల ధాటికి 
తట్టుకోగలిగిన వస్త్రాలు నేస్తారని విన్నాడు. తమ వంగ దేశంలో అధికంగా సున్నితమైనవే 
లభిస్తాయి. రాజాంతఃపురంలో జీవనం కనుక సరిపోయింది. ఇప్పటి నుండీ… 
ఏ విధంగా సాగబోతోందో ఆ కాళీ మాతకే ఎరుక.
  “మాధవా! ఏం చేస్తున్నావు? నీ కోసం క్షీరాన్నం చేశాను. వచ్చి తాగిపో. ఇంకా బలం 
రావాలి.” బాలవ్వ పిలుపు విని, నాణాలని దాచి, లోపలికి వెళ్లాడు.
  ఉన్నట్లుండి ఏడుపు వచ్చింది… బాలవ్వ పిలుపు అచ్చు అమ్మ పిలిచినట్లే ఉంది.
  కానీ.. ధీరోదాత్త క్షత్రియ బాలుడు కన్నీరు కార్చకూడదు. కళ్ళు చికిలిస్తూ ఏడుపు 
ఆపుకున్నాడు.
  “ఏం చేస్తున్నావు మాధవా?”
  “వస్తున్నానవ్వా! సామాను సరుదుకుంటున్నా. ఈ భానువారం కటకం వెళ్దామని 
యోచిస్తున్నా.”
  “ఇంకా నీకు పూర్త స్వస్థత చేకూరలేదు. ఇంకొక మాసం ఉండి వెళ్ల వచ్చును కదా?” 
బాలవ్వకి మాధవుడ్ని వదలాలని లేదు. ఇంట్లో ఒక బాలుడు తిరుగాడుతుంటే ఆ 
అందమే వేరు.
  కానీ పరాయి పిల్లవాడు… ఏమని ఆపగలదూ? పైగా అతని పూర్తి వివరాలు తెలియవు. 
ఆవిడకి కూడా  ‘అజ్ఞాత కుల శీలస్య..’ అనే నానుడి గుర్తుకొచ్చింది.చూడబోతే సంపన్న 
కుటుంబంనుండే వచ్చినట్లున్నాడు. కత్తి యుద్ధం విలువిద్యలలో నేర్పరి. గత రెండు 
వారముల నుంచీ అభ్యాసం చేస్తుంటే చూసింది.
  ఆ ఠీవీ, దర్పం సామాన్యులకుండవు.
  అదృష్టం.. వంగ సైనికులు మాధవుని గురించి వెతకడం మాని వేసినట్లుంది. పసివాడిని 
అడవిలో ఏ జంతువో తిని వేసుండ వచ్చనుకున్నారేమో!
  “మీకు భారముగా ఎన్ని దినములు ఉండగలనవ్వా? మా అమ్మ సూచించిన చోటికి ఎ
న్నటికైననూ చేరవలెను కదా. ఏదైన పని వెత్కుకోవాలి కూడా భుక్తికి.” స్థిరమైన కంఠంతో 
అన్నాడు. పిల్లవాడు పేలవంగా కనిపిస్తున్నా నిశ్చయం ధృడంగా ఉంది.
  “ఒక వారం ఆగు మాధవా! కటకం నుండి పెద్దబ్బాయి, నంద మహాపాత్రుడు వస్తున్నాడు. 
అతని వెంట వెళ్ల వచ్చును. సైనికుల బెడద కూడా ఉండదు. నీకు ఏదైనా పని కూడా 
ఇప్పిస్తాడు.”
  “అలాగే అవ్వా! నీకు ఎన్ని రూకలు ఇవ్వాలో చెప్తే నా వద్ద నున్నవి కొన్ని సరిపోతాయేమో 
చూస్తాను.” పెద్ద మనిషిలా మాట్లాడుతున్న మాధవుని చూస్తుంటే బాధతో పాటుగా ముచ్చట
కూడా వేసింది బాలవ్వకి.
  కాసేపు తటపటాయించింది. ముక్కుపచ్చలారని ఈ పసివాడి దగ్గర ధనం తీసుకోవడమా!
  కానీ వైద్యానికీ, సంబారాలకీ చాలా వెచ్చించవలసి వచ్చింది. పూటకూళ్ల రాబడి అంతంత 
మాత్రమే. తమ తిండి వెళ్లిపోతుందంతే ఖర్చులు పోగా.
  “నీదగ్గరెన్నున్నాయో చెప్పు. అందులోనుంచి నేనేరుకుంటా.”
  మాధవుడు ఆనందంగా అన్ని నాణాలూ కింద పోశాడు.
  బాలవ్వ కళ్లు పెద్దవి చేసి చూసింది. ఎవరి కంటా పడకుండా ఎలా దాచాడో ఇన్ని రోజులు.. 
ఆశ్చర్యమే! అటూ ఇటూ ఖంగారుగా చూసి, ద్వారం మూసేసి వచ్చింది.
  రాచబిడ్డడే అయుండాలీ బాలుడు. ఈ ధనం ఇతడికి పదహారేళ్లు నిండే వరకూ సరి పోతుంది. నిరంతరం వెంటాడే శత్రువుల నుంచి తప్పించుకోవడమే ఇతనికి ఉన్న సమస్య. అప్పటికప్పుడు బాలవ్వ మనసులో ఉభయ తారకంగా ఉండే ఒక పధకం రూపు దిద్దుకుంది.
  “చూడు బాబూ నువ్వు ఎవరివో నాకు తెలియదు. కానీ, ఈ వయసులో నీవు ఒంటరిగా 
బతకాలంటే కష్టమే. నీకు చూస్తే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం తప్ప ఏ పనులూ వచ్చినట్టే లేదు. కటకంలో బంధువులెవరైనా ఉన్నారా? ఎక్కడి కెళ్తావు? ఎవరి దగ్గరుంటావు? మీ అమ్మగారు ఎవరిదైనా చిరునామా ఇచ్చారా?” మాధవుడిని పక్కన కూర్చోపెట్టుకుని అడిగింది లాలనగా.
  తల అడ్డంగా ఊపాడు మాధవుడు. గద్గద స్వరంతో అన్నాడు..
 
  ఆ.వె. “అమ్మ ఎరుక లేదు మమ్మ నన్ను మురిపె
           ముంగ పెంచె ముద్దు ముద్దుగ, నను  
           కన్నతల్లి హెచ్చు కలతతో వీడెను
           కృపతొ నాదు కొనిరి కీడు లేక.”


  బాలవ్వ హఠాత్తుగా వెళ్లి బాలుడ్ని హత్తుకుంది హృదయం ద్రవించగా.
  “నీ గురించి ఏమైనా చెప్తావా మాధవా?”
  మాధవుడు ఏం మాట్లాడలేదు. బాలవ్వ నడుం గట్టిగా పట్టుకుని వెక్క సాగాడు.
  “వద్దులే కన్నా! అప్పుడు సైనికులతో అన్న మాటనే నిజం చేస్తాను. మా నందుడి కొడుకు 
గానే కటకం పంపుతా నిన్ను. వాళ్లకి ఎలాగూ పిల్లలు లేరు. కోడలు కూడా సంతోషిస్తుంది. 
ఐతే.. మా పిల్ల వానిలా మనాలంటే అక్కడికి వెళ్లే లోగా కొన్ని పనులు నేర్చుకోవాలి మరి. 
సరేనా!”
  మాధవుడు నడుం పట్టు మరింత బిగించాడు.. అనుకోకుండా దొరికిన ఆలంబన 
వదులుకోనన్నట్లుగా.
  “నాకు కులం అదీ తెలియదవ్వా. రాజుగారి కొలువులో మా నాయన పని చేసే వారు. 
యువరాజు గారి తో కలిసి చదువుకుంటున్నా.. అంతలో కోటలో ఎన్నెన్నో మార్పులొచ్చి.. 
పెద్ద రాజునీ, మా తండ్రిగారినీ.. అందరినీ చంపేశారు. అమ్మా నేనూ పారిపోయి వస్తుండగా, 
దారిలో అమ్మని కూడా….” భోరుమన్నాడు మాధవుడు.
  బాలవ్వ బాలుడి తల నిమురుతూ ఉండిపోయింది. మాట ఇచ్చేసింది కానీ, కొడుకు కోడలు 
ఏమనెదరో!
                                       ……………
4వ భాగం


  “గుర్రాన్నేమి చేద్దామమ్మా?” నంద మహాపాత్రుడు అడిగాడు, నూతిలోంచి నీళ్లు, తొట్టిలోకి 
 తోడుతూ. నందుడు, అతని భార్య గౌతమి, బాలవ్వ దగ్గరకు వచ్చి రెండు రోజులయింది.
  తొట్టిలో నీళ్లని కూర గాయల మళ్లలోకి పోస్తున్నాడు మాధవుడు. గత మూడు నెలలుగా 
బాలవ్వ పూటకూళ్ల ఇల్లు నడపడంలో మెళకువలు నేర్పిస్తోంది ఆతడికి.
  మొదటిదీ, ముఖ్యమైనదీ పెరటి తోట పెంచడం. ఏ రోజుకారోజు తాజాగా తోటలోనుంచి 
తెంపిన కూరలు వాడటం వల్లనే, బాటసారులే కాక, పల్లెలో వారుకూడా బాలవ్వ భోజనం 
చెయ్యడానికి వస్తుంటారు వారికి అవసరమైనప్పుడు.
  స్వతహాగా చురుకైన మాధవుడు అన్ని పనులనూ త్వరితగతిని నేర్చేసుకున్నాడు.
  అత్యవసరమైతే అత్తెసరు వేసి, చారు పెట్టి, అరటికాయ వేపుడు కూడా చెయ్యగలడు. 
ఏ పని చెయ్యాలన్నా నిస్సంకోచంగా చేసేస్తాడు.
  నందుడు,  గౌతమి కూడా మాధవుడినీ అతని కలుపుగోలు తనాన్నీ మెచ్చుకుని, 
పెంచుకుందుకు సంతోషంగా వప్పుకున్నారు.  
  బాలవ్వ హాయిగా నిట్టూర్చింది. ‘క్రిందటి జన్మలో వీడు నిజంగానే నా మనవడై ఉంటాడు’ 
అనుకుంది. రోజూ తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూనే ఉంది.
  పూటకూళ్ల ఇల్లన్నాక రకరకాల మనుషులు వస్తుంటారు. అందరితో నేర్పుగా మసలుకోవాలి. ఎన్నెన్నో వదంతులు.. ఒక్కోసారి ఎవరికీ చెప్పకూడని నిజాలు కూడా చెవుల బడుతుంటాయి.
  ఏదీ పట్టించుకోకుండా, అందరినీ సమ దృష్టితో చూడాలి.
  అవన్నీ మాధవునికి సమస్య కానే కాదు. రాజాంతఃపురంలో అలవాటే. అక్కడైతే మరీ కష్టం. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియదు. సరిహద్దు దేశాల గూఢచారులు కూడా తిరుగుతుంటారు. అందులో.. హిందువైతే ఒకరకంగా, ముసల్మానైతే మరొకరకంగా ఉంటుంది వ్యవహారం.
  బాలుడిని  సాగనంపడానికి వ్యాకుల పడుతున్న బాలవ్వతో అదే అన్నాడు వయసుకి 
మించిన అనుభవాలను ఎదుర్కొన్న మాధవుడు.


 ఉ.మా||  “అందరి తోడనే కలసి యండగ నుండమ నంటు నే సదా
              కొందరి మాటనే పనుచు కొందును నొవ్వను గాద నెన్నడున్
              పందను గాదునే నెపుడు పంకము లో కడకాలువే యగా  
              కొందల మేలనో వలదు కొంచెము యూరడి లమ్మ హాయిగన్.


  మాధవుని పద్యాన్ని గుర్తు చేసుకుంటూ, వాడి ముందు చూపుకి, సమయస్ఫూర్తికి 
మురిసిపోతున్న బాలవ్వ కడుగుతున్న వంటపాత్రలను పక్కన పెట్టి ఆలోచనలో పడింది..
  “అవ్వా! గుర్రాన్ని నాతో తీసుకెళ్ల వచ్చా?” మాధవుని ప్రశ్నకి ఉలిక్కి పడ్డారు నందుడు, 
గౌతమి.
  తీసుకెళ్లడానికే ఇబ్బందీ లేదు. ఇంకా ఒక గుర్రాన్ని తగ్గిస్తే ప్రయాణపు వ్యయం తగ్గుతుంది 
కూడా. కానీ.. తీసుకెళ్లాక బాలుడు గుర్రాన్ని అమ్మడానికి వప్పుకోకపోతే? కటకంలో వారు 
చేసే పనికి హయం అవసరం లేదు. పోషించడానికి తగిన ధనం వారు సమకూర్చుకోలేరు.
  కానీ, మాధవుడు లేకున్న అశ్వం ఏ విధంగా ఉంటుందో అనుమానమే. వారిరువురికీ ఉన్న 
భంధం అటువంటిది.
  “అలాగే తీసుకెళ్లు కన్నయ్యా!”
  మాధవుడు ఆనందంతో ఎగురుకుంటూ వెళ్లాడు గుర్రానికి దాణా వెయ్యడానికీ, తన నేస్తానికీ 
శుభవార్త చెప్పడానికీ.
  “అశ్వాన్ని పోషించగల శక్తి మనకి లేదమ్మా. యుద్ధ భయాలతో కటకం కూడా అట్టుడికి 
పోతోంది. వచ్చిన ఆదాయం బొటాబొటీగా సరిపోతోంది. ఇప్పుడు బాలుని కూడా పోషించాలి. వానికి చదువు సంధ్యలు నేర్పించాలి. మా అబ్బాయని చెప్తాము కనుక పనివానిలా చూడలేము. మాధవుని చూస్తే విధివశాన వీధిన పడిన రాకుమారుని వలె ఉన్నాడు” నందుడు ఆందోళనగా అన్నాడు.
  బాలవ్వ చిరునవ్వు నవ్వింది.
  “వ్యయం గురించిన చింత వద్దు నందా. రాకుమారుడన్నావు కదా.. మరి సంపద ఉండదా? 
బాలుడు యుక్తవయస్కుడయ్యే వరకూ సరిపోయే టన్ని నాణాలున్నాయి వాని వద్ద. 
అందులోనూ సువర్ణ నాణాలెక్కువ. వాటి విలువ ఎంతో కూడా తెలియని అమాయకుడు 
మాధవుడు. అతడికి, అశ్వానికీ కూడ పోషణకి సరిపోతాయి. మీకు కూడనూ సౌలభ్యంగా 
ఉంటుంది.”
  తల్లిని సాలోచనగా చూశాడు నందుడు.
  “ఇంకేమి సందేహము? మాధవుడు చాలా అణకువగల పిల్లడు. ఇంత చిన్న వయసులో 
అంతటి అవగాహన ఉండటము అరుదు. ఏ బెంగా లేకుండా హాయిగా వెళ్లి రండి. 
అప్పుడప్పుడు జగన్నాధుని పంపుతుంటాను.”
  “నా ఆదాయం అశ్వాన్ని కొని, పోషించగల స్థాయిలో లేదు కదా మరి ఏ విధంగా 
చుట్టుప్రక్కల వారికి సమాధానము చెప్పగలను? వారి అసూయా దృక్కులను ఎదుర్కొనేదెలా?”
  అదీ నిజమే.. బాలవ్వకి ఏమనాలో పాలుపోలేదు.
  “అవ్వా, నేనొక ఆలోచన చెప్పనా?” అప్పుడే అక్కడికి వచ్చిన మాధవుడు సంకోచంగా 
అడిగాడు.
  తలూపింది బాలవ్వ.
  “గుర్రాన్ని మీరు మాకిచ్చారని చెప్దాము. నన్ను కూడా అక్కడి వారెవరూ చూడ లేదు కదా? 
నా తోడని చెప్పవచ్చును. ఇంక దాని పోషణకి.. అక్కడక్కడే బాడుగకి ఇవ్వ వచ్చును 
కదా? నేను చెప్తే నా కళ్యాణి వింటుంది. మరీ దూరం కాకుండా, ఒకటి రెండు దినాల్లో 
వచ్చేలాగున..” ఆశగా నందుని కేసి చూశాడు మాధవుడు.
  నిజమే.. గుర్రాలను బాడుగకి తీసుకుంటారు. అందరూ కొన లేరు కదా! నందునికి బాలుని 
సూచన నచ్చింది. పైగా పట్టణం కనుక అద్దె కూడా ఎక్కువే కటకంలో.
  “ఇంక రెండు దినములలోనే మన ప్రయాణం. అన్నీ సర్దుకో మాధవా.” నందుడు అనుమతి 
ఇచ్చినట్లు తలూపి అన్నాడు.
  అవ్వని వదిలి వెళ్లడం బాధ గానే ఉన్నా మాధవుడికి కటకం వెళ్లక తప్పదు. అది అమ్మ 
కోరిక. వంగ రాజ్యానికి వీలైనంత దూరంగా వెళ్లాలని దుర్గాదేవి ఆశించింది. ఆ విధంగానే 
నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు మాధవుడు.


                                        2 వ అధ్యాయం
                                 మలి జీవనం


  “ఒక్కనివీ రాగలవా మాధవా? మీ అమ్మ నేను లేకుండా గుర్రం మీద కూర్చొనుటకు 
భయపడుతుంది.”
  మాధవుడు తలూపాడు మౌనంగా, రెండు కారణాలతో.. ‘మీ అమ్మ’ అని నందుడు అనగానే 
అమ్మ కన్నుల ముందు మెదిలి దుఃఖంతో గొంతు పూడుకు పోయింది. అనుకోకుండా ఇంకొక 
అమ్మ, ఇంత త్వరలో దొరికినందుకు ఆనందోద్వేగాలతో కూడా మాట రాలేదు.
  ఆ పసివాని కన్నులలో నీటి పొర చూడగానే అసంకల్పితంగా గౌతమికి మాతృ భావన 
ఉప్పొంగింది. స్త్రీకి సహజ లక్షణం కదా అది! దగ్గరగా వెళ్లి అదుముకుని తల మీద ఆప్యాయంగా
రెండు చేతులతో నిమిరింది.
  ఆ దృశ్యం చూస్తున్న బాలవ్వ నిశ్చింతగా నిట్టూర్చింది, బాలకృష్ణుడిని నందుడి ఇంటికి 
చేర్చిన వసుదేవుని లాగ.. కొద్ది మాసములలోనే మాధవుని మీద ఎంతో వాత్సల్యాన్ని 
పెంచుకున్న బాలవ్వకి, తీసుకెళ్తున్నది తన కొడుకే ఐనా తన శరీరంలోని ఒక భాగం 
వెళ్లిపోతున్నట్లే అనిపించింది. అదే... విశ్వప్రేమ నిర్వచనం.
  కళ్లు తెరవని పసిగుడ్డును ఎచటికో.. ఎరుగని చోటికి తీసుకెళ్తుంటే దేవకీదేవి మనసు ఎంత 
క్షోభించి ఉండాలి! బాలవ్వ కన్ను ముందు పచ్చి బాలింత నిలిచింది, కళ్ల నిండా నీళ్లతో..


     కం. కన్నులు తెరవని పాపడు
            కన్నయని వదల మనమును గట్టి పరచియున్
            దన్నుల నిస్త్రాణమునను
            వెన్నుని మీదనె బరువును వేసెను కలతన్||


  తెలిసీ తెలియని వయసులో తనయుడిని ఒంటరిగా దూరతీరాలకు పంపవలసి 
వచ్చినప్పుడు మాధవుని కన్న తల్లి ఎంత క్షోభ పడి ఉంటుందో! కళ్లు తుడుచుకుంటూ, 
కను చూపు మేర వరకూ, సాగిపోతున్న గుర్రాలని చూసి ఇంట్లోకి వెనుతిరిగింది బాలవ్వ.
                              …………………


  నంద, గౌతమిల అశ్వం వేగంగా వెళ్లలేకపోతోంది. అక్కడికీ, బాలవ్వ ఇచ్చిన తిను
బండారాలు, కొద్ది సంభారాలు మాధవుడి కళ్యాణికే కట్టేశారు. మాధవునికి కళ్యాణి కళ్లెం 
పట్టుకుని లాగి కూర్చోవడం కష్టమనిపిస్తోంది. పది ఘడియల ప్రయాణం పిదప కాస్తంత 
విశ్రాంతి అవసరమనిపించింది రౌతులకి, గుర్రాలకీ కూడా.
  చెట్టు నీడన ఆగి, గుర్రాలకి మేత తినిపించి, వానిని రుద్ది, తోమి.. వాటితో మాటలాడి 
తాము కూడ తెచ్చుకున్నది తిని విశ్రాంతిగా చెట్టు నానుకుని కూర్చున్నారు.
  మాధవుడు, గౌతమి పక్కన చేరి కాళ్లు వత్త సాగాడు.
  “ఇదేం పని కన్నయ్యా?” ఒక వంక మురిసిపోతూనే అంది గౌతమి.
  “అశ్వారూఢ యైన అమ్మకు అలసట తీరే వరకూ కాళ్ళు పట్టడం నాకు అలవాటే కదా! 
ఇంకా చాలా దూరం పయనం సాగించాలి మనం.” మాట్లాడుతూనే గౌతమి ఒడిలో నిద్ర 
పోయాడు మాధవుడు.
  “ఫరవాలేదు. ఎవరికీ అనుమానం రాదు. మాధవుడు మన బిడ్డే అనుకుంటారు అందరూ. 
మనసులోనుండీ ప్రేమ వస్తేనే ఈ విధంగా ప్రవర్తిస్తాము. లేకున్న తెచ్చిపెట్టుకున్నట్లే 
ఉంటుంది.” తృప్తిగా అంది గౌతమి.
  ఒక ఘడియ విశ్రాంతి తరువాత జరిగిన ప్రయాణం వేగంగా జరిగింది.
  కళ్యాణి మీద మాధవునితో పాటు గౌతమి కూర్చుంది. నందుడి గుర్రం మీదికి కొద్ది 
సామాన్లను చేర్చారు. బరువు సమానంగా సర్దటం వలన సులువయింది అశ్వాలకి.
  సూర్యాస్తమానం లోగా అనుకున్న గ్రామానికి చేరుకో గలిగారు.
  రాత్రికి అక్కడి పూటకూళ్ల ఇంటిలో బస చేస్తున్నప్పుడు మొదలయింది పరీక్ష, అందరికీ. 
అచ్చటి వారికి నంద, గౌతమిలు పరిచయమైన వారే..
  “ఈ బాలుడు మీ అబ్బాయా? మరి ఇంతకాలం వదిలి ఏ విధంగా ఉన్నారు?” ప్రశ్నల 
పరంపర..
  అడిగిన వారందరికీ తృప్తి కలిగేటట్లు సమాధానాలు చెప్పి హాయిగా నిట్టూర్చారు ముగ్గురూ. 
పైగా వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న శ్రద్ధ అనుమానాలకి తావీయలేదు.
                                      ………………….
  రెండు రాత్రుల మజలీల తరువాత కటకం పరిసరాల్లోకి ప్రవేశించింది మహపాత్రుల 
కుటుంబం. క్రోసు దూరమునుండే బారాబతీ కోట గోడలు గోచరమయ్యాయి. మాధవుని 
కన్నులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి. ముందుకు వంగి కళ్లెం పుచ్చుకున్నవాడు, 
నిటారుగా అయి అటూ ఇటూ కదిలాడు. వెనుకగా కూర్చున్న గౌతమి ఉలిక్కి పడింది.
  “ఏమాయె మాధవా?” ఆతృతగా ప్రశ్నించింది.
  తలపైకెత్తి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూపించాడు. కొద్ది దిగువ నుంచి 
వెళ్తున్నారేమో, ఎత్తుగా చిత్రాకారుడు శ్రద్ధతో గీసిన త్రిమితీయ చిత్రంలా కనిపిస్తోంది. 
సూర్యాస్తమయానికి ఆకాశం సిద్ధమౌతోంది.
  రెండు పాయలుగా విడి పోయిన మహానదీ ప్రవాహం మందంగా సాగుతోంది.  పచ్చని చెట్లకి 
రంగు రంగుల పువ్వులు. ఫల వృక్షాలకి వేళ్లాడుతున్న కాయలు పళ్లు.  వీటి మధ్య ఠీవిగా 
నిలుచున్న కోట, మాధవునికి స్వాగతం పలుకుతోంది.
  గౌతమికి అందులో వింతేమీ కానరాలేదు. ఎప్పుడూ చూసేదే.. బాలుడు ఎప్పుడూ కోటని 
చూసినట్లు లేదు, అందుకే సంభ్రమంగా చూస్తున్నాడనుకుంది.
  “అది రాజుగారి కోట. కళింగ దేశాన్నేలే గాంగేయ రాజు, నాల్గవ భానుదేవుడు అందులో 
ఉంటాడు. రాజుగారి కోట ఎప్పుడూ చూడలేదా? ఈ సారి ఎవరైనా వంటవాళ్లు సంభారాలు 
తీసుకెళ్లేటప్పుడు నిన్ను తీసుకెళ్లమని చెప్తాలే..” గౌతమి మాటలకి నవ్వుకున్నాడు 
అటువంటి కోటలోనే పుట్టి పెరిగిన మాధవుడు.


  ఉ.     కోటకి కాపలా వలెను కూకటి యైన నదీమ తల్లియే
          దీటుగ హారమై నిలిచి తీరుగ కన్నుల విందు సేయగా
          మాటయె రాని మాధవుడు మానుల రంగుల పూల కాంచుచున్
          మేటి కుమారుడై కదలి మీరము దాటెను ధీ పటుత్వమున్.


  పుట్టినదాదిగా అనుక్షణం భయాందోళనల అంతరాళం లోనే అందిన విద్యలు నేర్చుకుంటూ 
పెరిగిన మాధవునికి, స్వత సిద్ధంగా ప్రకృతిని ఆస్వాదించే ప్రకృతిని ప్రసాదించాడు 
ఆ పరమాత్మ.
  కత్తి యుద్దంలో, గుర్రపు స్వారీలో, విలు విద్యలో తన వయసుకి మించి రాణిస్తున్నాడు. . 
అంతే కాదు, తన భావాలని మాటల్లో వ్యక్తీకరించే నేర్పు, పరిసరాలలో నిశ్శబ్దంగా నీటిలా 
కలిసిపోయే స్వభావం.. బాలుని ఇతర ప్రతిభలకి, సువర్ణానికి సువాసన అబ్బినట్లు అమరింది.
  తెర చాటునుంచి గమనించిన హత్యలు, బలాత్కారాలు.. ఏ పరిస్థితులలో నైనా మొండిగా 
జీవనం సాగించగలిగే ధైర్యాన్నిచ్చాయి. అయితే, చూడ్డానికి మాత్రం, అమాయకంగా అప్పుడే 
ప్రపంచాన్ని గమనిస్తున్న పసిబాలుడిలాగే ఉంటాడు.
  ప్రతీ విషయాన్నీ కుతూహలంగా, ఉత్సాహంగా పరిశీలించే విశాల నేత్రాలు అదనపు 
ఆకర్షణ, సుందరమైన ఆ మోముకి. అందుకే చూడగానే మారు ప్రశ్న వేయకుండా 
ఒప్పేసుకున్నారు నందుడు, గౌతమీ, మాధవుడిని పెంచుకోవడానికి,!
  
                       


  సంజకెంజాయ వెలుగులలో, మహానది ఒడ్డుకు దగ్గరగానున్న పట్టణంలోకి ప్రవేశించగానే 
కనిపించే “కళింగం” పూటకూళ్ల ఇంటి ప్రాంగణం లోనికి ప్రవేశించారు నందుని పరివారం.
  లోపల అంకణం విశాలంగా ఉన్నా, ఇల్లు చిన్నదే. ముందున్న పెద్ద వసారా అన్ని పనులకీ 
ఆసరా అవుతోంది. అక్కడే పది మంది వరకూ విశాలంగా కూర్చుని భోజనాలు చెయ్యడానికి 
అనుకూలంగా ఉంది.
  “క్షేమంగా వెళ్లి వచ్చారా తల్లీ! చీకట్లు కమ్ము కుంటున్నాయని కొంచెం ఆందోళన 
పడుతున్నాను. రండి.. స్నానాలు చేసి వచ్చారంటే వేడివేడిగా కుడుములు తినచ్చు.” 
కొద్ది బొంగురు గొంతుతో యాభై ఏళ్లు దాటిన స్త్రీ ఒకామె ఎదురొచ్చి ఆత్మీయంగా 
పలుకరించింది.
  “అంతా బాగేనా సీతమ్మా?” గుర్రం మీదినుంచి తాను దిగి, గౌతమీ, మాధవులకు 
చెయ్యందిస్తూ అడిగాడు నందుడు.
  నుదుట మెరిసి పోతున్న రాగి నాణమంత కుకుమ బొట్టుతో, కళ్లలో కరుణను, చిరునవ్వులో 
ఆప్యాయతను కురిపిస్తున్న సీతమ్మని అబ్బురంగా చూశాడు మాధవుడు.
  “ఈవిడ నీకు అమ్మమ్మ మాధవా! మన దగ్గరే ఉండి బాగోగులను చూసే దేవుడిచ్చిన తల్లి. 
వీడు మా అబ్బాయి సీతమ్మా. అమ్మ దగ్గరున్నాడు ఇన్ని నాళ్లూ. ఇంక మా దగ్గరకి 
తీసుకొచ్చి విద్యలన్నీ నేర్పిద్దామనుకున్నాము.” గుర్రాలకి కట్టిన వస్త్రాలనీ, వస్త్రాలలో కట్టి 
ఉంచిన కొన్ని సంభారాలనీ ఇంట్లోకి చేరుస్తూ అన్నాడు నందుడు.
   క్షణంలో సగంసేపు ముడిచిన కనుబొమ్మల్ని విడదీసి, అభావంగా లోనికి నడిచింది 
సీతమ్మ
, ఆహారం ఏర్పాటు చెయ్యడానికి. ఇంతకాలం ఈ కుమారుని గూర్చి ఒక్క మాటైన అనలేదే 
అనే సందేహాన్ని మనసులోనే అదిమింది. అనవసరమైన విషయాలలో తల దూర్చడం ఆవిడ 
స్వభావం కాదు.
  నిజంగానే సీతమ్మ, మహాపాత్రుల గృహానికి భగవంతుడు పంపిన బహుమానమే.. 
అస్తవ్యస్తమైన ఆవిడ జీవితానికి కూడా రక్షణ దొరికింది. పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే, 
యుద్ధానికి బయలుదేరిన రాజుగారి సైన్యంతో, వారికి వంటవార్పులకి వెళ్లిన మొగుడు తిరిగి 
రాలేదు. శత్రురాజులకి పట్టుబడి, వారితో వెళ్లిపోయాడనే వార్త వచ్చింది. భర్త ఆనుపానులు 
తెలియని వారు నిత్య సుమంగళులే.
  రంగురంగుల చీరలు పొందిగ్గా రోజూ కట్టి, నున్నగా దువ్వి వేసిన ముచ్చల ముడిలో 
తెల్లని పూదండ దురిమి, ప్రేమతో ఇంటివారిని చూసుకుంటూ.. బాటసారులకి ఆప్యాయత 
రంగరించి, అన్నపూర్ణాదేవిలా  భోజనం వడ్డించే సీతమ్మ, ఎంత పుణ్యం చేసుకుంటే 
లభ్యమౌతుంది! ఆవిడ అండ చూసుకునే ఆరు మాసాలకొక్కసారి ఉత్కళం వెళ్లి అమ్మని 
చూసి వస్తుంటాడు నందుడు, సతీ సమేతంగా. వారు లేరన్న లోటు తెలియకుండా పూటకూళ్ల 
గృహాన్ని నడిపిస్తుంది సీతమ్మ.

                                    ………………………..

5వ భాగం
  “కళింగం”.. దేశంలోనూ, గృహంలోనూ కూడా అతి త్వరలోనే ఇమిడి పోయాడు మాధవుడు. 
నదీ జలాల పాయలు నేలనంతా సస్య శ్యామలం చేస్తున్నాయి. ఏటి ఒడ్డున కొబ్బరి చెట్లు, 
ఇళ్ల వెనుక అరటి తోటలు. అంబరాల్లా నీడనిచ్చే వృక్షాలు. అందులో ఫల వృక్షాలు 
ఎన్నెన్నో.. మాధవుడికి వంగదేశానికీ, కళింగ దేశానికీ పెద్ద వ్యత్యాసమేమీ కనిపించలేదు.
  ఇంటిలోని వారికి తలలో నాలుకలా, పూటకూళ్ల అతిధులకి ఆహ్లాదాన్ని పంచే చిన్ని 
కృష్ణునిలా కలిసిపోయాడు. ఒక్క క్షణం కనిపించకపోతే అందరి నోటా మాధవుని పేరే..
  
   సీ. తొలిపొద్దు రాకమున్ దోటలో కలకలం
              మాధవుఁ కదిలించి మత్తు తీర్చ;
       నిదురని వదిలించి నేరిమి చూపించ
               దినకృత్యములకేగి దీక్ష జూపు.
       లేలెమ్మనుచునమ్మ లేబుగ్గ నిమురగా
               గారాల బాలుండు గరిమ జూపె.
       అంతట యరుదెంచె నతడు తండ్రియు కూడ,
               నట్టింట చెలరేగె నవ్వులెన్నొ.

ఆ.వె. అలికిడి వినగానె నమ్మమ్మ సీతమ్మ
         మురిపె మంత జూపె ముదము తోను
         ఒక్క బుడుత డొచ్చి యూపెను యిల్లంత
         సంతసంబు నంత సరస మాడ.
 
  మాధవుని అశ్వం, కళ్యాణికి కూడా కటకం బాగా నచ్చింది. తన చిన్ని యజమాని బాధ్యత
తనదే నన్నట్లు ప్రవర్తిస్తుంటుంది. అతడు ఆనందంగా ఉంటే.. అంతకన్న ఇంకేమి కావాలి?
  కళ్యాణిని బాడుగకి కూడా బాగానే తీసుకెళ్తున్నారు. గుర్రపు స్వారీ నేర్పించడానికి తప్ప, 
దూరా భారాలు పంపడం మాధవుని ఇష్టం లేదు. ఆ సంగతి గ్రహించిన నందుడు కూడా అర్ధం 
చేసుకుని, ఆ పనికే నియోగిస్తున్నాడు. పైగా ఆ ఆదాయం మీదనే ఆధార పడి లేరు కదా! 
అవసరమొస్తే మాధవునీ ధనమే బోలెడుంది.
  వారానికి మూడు రోజులు, రోజంతా కళ్యాణిని తీసుకెళ్తారు రెండు క్రోసుల దూరంలో ఉన్న 
విద్యాలయం వారు. మొదట్లో మాధవుడు కూడా వెళ్లేవాడు. మధ్యాహ్నాలు, గుగ్గిళ్లు 
తినిపించడం, మాలిశ్ చెయ్యడం వంటి పనులు చేసి అలవాటు చేశాడు.
  మరీ వెంటపడుతుంటే నిఘా చేసినట్లుగా ఉంటుందని నందుడు, గుర్రంతో వెళ్లద్దని 
మాధవుడికి చెప్పాడు. ఆ మాటే కళ్యాణికి నాలుగు రోజులుగా చెప్పి.. తనతో వెళ్లడం 
మానేశాడు. అశ్వాలకి ఆకళింపు చేసుకునే శక్తి ఎక్కువే. ఏ మాత్రం ఎదురు తిరగకుండా వెళ్లి 
వస్తోంది.
  మిగిలిన రోజుల్లో, మాధవుడు ఐదారు ఘడియలపాటు, సవారీ చేసి వస్తున్నాడు. కోట 
చుట్టూ తిరగడం, దగ్గరలో నున్న అడవికి వెళ్లడం.. స్వారీ చేస్తూనే కత్తి తిప్పడం వంటివన్నీ 
సాధన చేస్తున్నాడు.
  యుద్ధ విద్యలు నేరుస్తూ ఉండక పోయినా. తను నేర్చుకున్నది మరచి పోకుండా ఉండాలని 
ఆ బాలుని ఆలోచన.
  కోట చుట్టూ తిరుగుతూ అనుకుంటాడు.. ఎప్పటికైనా లోపలి కెళ్తానా అని..
  ఏమో! ఎవరు చెప్ప గలరు? ఏం జరగబోతోందో!
                                    ……………..

  మాధవుడు కళింగం వచ్చి నెల దాటింది.
  జన్మతహా తనకున్న కుతూహలం కొద్దీ, కోట చుట్టూ తిరిగేటప్పుడు, లోపల జరిగేదేమైనా 
కనిపిస్తుందేమోనని గోడ సందుల దగ్గరొక క్షణం ఆగి చూస్తాడు. రాజుగారి లాగా దుస్తులు 
ధరించిన ఒక ఆజాను బాహుడు రోజూ లోపలికి వెళ్లి రావడం చూస్తున్నాడు. అతని వెంట 
గుర్రాల మీదా, నడుస్తూ సైనికులు..
  అప్పుడప్పుడు నందుడు కూడా మాధవునితో స్వారీకి వెళ్తుంటాడు.
  “వారేనా రాజు గారు తండ్రీ?” ఒకరోజు అడిగాడు మాధవుడు, ప్రముఖంగా కనిపిస్తున్న
ఆ వ్యక్తిని చూపించి.
  “రాజుగారు కోటలో ఉంటారు. బైటెందుకు తిరుగుతారు? అతడు సామంత రాజులలో 
ముఖ్యుడు. పేరు కపిలేంద్ర దేవుడు. ప్రస్థుతం పరిపాలనంతా వారే చూస్తున్నారు. రాజు గారికి 
నమ్మకమైన సామంతులు.”
  “నిజమా! వారే మహారాజులనుకున్నా..” మామూలుగా అనేసి అటూ ఇటూ చూడ సాగాడు 
మాధవుడు.
  ఉలిక్కి పడ్డాడు నందుడు. బాలవాక్కు బ్రహ్మ వాక్కంటారు. ఆందోళనగా చూశాడు.. 
ఎవరైనా వింటే..
  కను చూపు మేర ఎవరూ లేరు.
  “నీకు ఈ రాచ విద్యలన్నీ బాగా అబ్బాయే?” మాట మార్చాడు.
  “అవును తండ్రీ. రాజుగారి అబ్బాయి కంటే నేనే బాగా స్వారీ, కత్తి తిప్పడం చేస్తా తెలుసా!” 
అంతలో అమ్మ వారింపు గుర్తుకొచ్చి, కళ్లు గట్టిగా మూసుకుని మనస్సును స్వాధీనంలోకి 
తెచ్చుకున్నాడు.
  “ఎవరా రాజు గారు?”
  “వారు వంగ దేశ రాజు గారి వద్ద సామంతులు.” తనకి తెలిసిన అంత పా్రముఖ్యత లేని పేరు 
చెప్పాడు మాధవుడు.
  “ఈ విద్యలన్నీ సరే, రేపటి నుండీ, సూరి సోమయాజి గారి దగ్గరకు పంపుతున్నా నిన్ను. 
అక్షరాలు, మంత్రాలు, వీలైన భాషలు నేర్చుకోవాలి. బ్రాహ్మణ బాలునికి పాండిత్యం ప్రధానం.”
  “అలాగే నేర్చుకుంటాను నాన్నగారూ! సంస్కృతం, ఆంధ్రం, వంగ భాషలు అక్షరమాలలు, 
మాటలు, పదాలు రాయడం వచ్చు నాకు. ఓడ్రమే రాదు.”
   “ఫరవాలేదు. మూడు భాషలు చాలు. కళింగ, ఉత్కళాలలో ఓడ్రం సంభాషణ 
జరపగలుగుతే సరి పోతుంది.” నందుడికి ఆశ్చర్యమేసింది, మాధవుని ప్రతిభ చూస్తుంటే.
                                          ……………

  “అసలు మాధవుడు మీ కన్న కొడుకేనా?” సీతమ్మ ప్రశ్నకి ఉలిక్కి పడ్డారు ముగ్గురూ. 
అందరూ పెరటి వాకిలిలో ఉన్నారు.
  సూర్యోదయం అయి నాలుగు ఘడియలయింది. మాధవుడు కళ్యాణికి ఆహారం తయారు 
చేస్తున్నాడు. తల ఎత్తి గౌతమిని చూశాడు. వంట పాత్రలు శుభ్రం చేస్తున్న గౌతమి మొహం 
పాలిపోయింది.
  అరటి మొక్కలకి, వాడిన నీళ్లు వెళ్లడానికని, కాలువలు చేస్తున్న నందుడు ఏదో అనబోయి 
ఆగిపోయాడు.. సీతమ్మ ప్రశ్నలోని అర్ధాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ..
  గౌతమి ఒకసారి మాధవుడిని పరకాయించి చూసింది.
  నిజమే..
  మాధవుడు తమ బిడ్డడి లాగ లేడు. ఆచ్ఛాదన లేని వక్షము, నీరెండలో పచ్చగా, నున్నగా 
మెరిసిపోతోంది. తీర్చి దిద్దిన నాసిక, విశాల నేత్రాలు, ఎప్పుడూ నవ్వుతున్నట్లుండే 
పెదవులు.. నలకూబరుడు చిన్నతనాన ఈ విధంగానే ఉండే వాడేమో! ‘దిష్టి తగులగలదు..’ 
అని తనకు తనే వారించుకుని నందుడిని చూసింది.
  నందుడు కూడా అందగాడే.. నున్నని గుండు, ముడి వేసిన పిలక. పచ్చని పసిమి ఛాయ. 
ఆ శరీర ఛాయే ఇద్దరినీ తండ్రీ కొడుకులంటే నమ్మ బలుకుతుంది.
  అంతే.. కానీ… ఏమిటి తేడా?
  ఒక్కసారిగా సీతమ్మ ప్రశ్నకి కారణం అర్ధమయింది గౌతమికీ, నందుడికీ కూడా.             
ఇంకా అయోమయంగానే చూస్తున్నాడు మాధవుడు...
  వారు ఏమని సమాధానం చెప్తారా అనుకుంటూ. ఇన్ని రోజులుగా రాని అనుమానం 
ఇప్పుడు.. తాను ఏమైనా అనుచితంగా ప్రవర్తించలేదు గద..
  ఒక్క సారిగా అమ్మ గుర్తుకొచ్చింది మాధవునికి. ఆపుకోలేని ఏడుపొచ్చేసింది. పరిస్థితుల 
పాబల్యం కానీ, ఆటలాడుకుంటూ అమ్మ ఒడిన నిదురించే వయసు..
  ఏం చెయ్యాలి?
  అమ్మ కావాలి.. ఎక్కడుంది?
  మమకారంతో తననే చూస్తున్న గౌతమి కనిపించింది.
        
  మ.   అటు చూస్తే మరి రక్కసుల్ వలెను తన్నాఘా తమున్చేయనే
          కటువున్ కంటకులందరూ తరుముతూ కారుణ్యమున్ జూపకన్
          ఎటుపో యేవని క్రోధమున్ వదలకా యీ బాలునిం రూపు బా
          పుటకే వేచియు నుండ నమ్మకడకే పోవంగ దుఃఖింపనున్.

  పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమె ఒడిలో దూరి భోరుమన్నాడు. ఆ మట్టి నేల మీదే, తడి చీరతోనే, 
హత్తుకుని తల నిమురుతూ ఉండి పోయింది గౌతమి, మాధవుని గిరజాల జుట్టులో వేళ్లు జొనిపి 
నిమురుతూ.
  అవును.. మాధవుడు వచ్చిన నాటినుండీ వానికి పరిసరాలనీ, ఊరిలోని పరిచయస్థులనీ, 
బంధువులనీ చూపడం,  పూటకూటింటికి వలసిన సంభారాలన్నీ సమకూర్చుకోవడంలోనూ 
కాలం వేగంగా గడిచి పోయింది.
  కొన్ని సున్నితమైన అంశములను పట్టించుకోలేదు. ముఖ్యంగా మాధవుని కేశములు..
  భుజాలు దాటి, ఉంగరాలు తిరిగిన దట్టమైన శిరోజములు, పాల భాగాన్ని సగం పైగా 
కప్పుతున్న ముంగురులు.. మాధవుడు క్షత్రియ బిడ్డడేమో అనే సందేహము కలుగక మానదు 
చూసిన వారికి.
  వెక్కుతూనే నిద్రలోకి జారుకున్నాడు మాధవుడు. నందుడు వచ్చి పిల్లవాడిని భుజం మీదికి 
వేసుకుని తడిసి పోయిన పంచని అలాగే విప్పి సావడిలోనికి తీసుకెళ్లి చాప మీద పడుక్కో 
బెట్టాడు. గౌతమి వచ్చి, పొడి వస్త్రం కట్టి కంబళీని కప్పింది.
  సీతమ్మ కొద్దిగా బెదురుతూ లోపలికి వచ్చింది..
  “ఇలా అవుతుందనుకో లేదు నందా! మీకు ఏదో చెప్పాలని, ఉపోద్ఘాతంగా అన్నాను. 
మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఏమనుకోకండి. కావాలని చెయ్యలేదీ పని.”
  “ఫరవాలేదు సీతమ్మగారూ. మాధవుడు అసలే నాన్నమ్మ మీద బెంగ పెట్టు కున్నాడు. 
ఇంతకాలం అక్కడే ఉన్నాడు కదా! మీరలా అడగడం వలన ఆవిడ జ్ఞప్తికి వచ్చింది. 
అందుకే అమ్మ ఒడిలోకి పరుగెత్తాడు.” నందుని మాటలకి తలూపింది సీతమ్మ, 
అర్ధం చేసుకున్నట్లుగా.
  “ఇంతకీ మీరు ఏదో చెప్పాలని అన్నారు, ఏమిటదీ” గౌతమి అడిగింది.
  సీతమ్మ మొహమాటంగా చూసింది.
  “చెప్పండమ్మా! ఏమనుకోము.”
  “ఏం లేదు, మాధవునికి ఉపనయనం చెయ్యాలి కదా అని. పదేళ్లు నిండాయన్నారు.. 
అందుకని. బోసిగా ఉన్న వాని వక్షం చూడగానే అనిపించింది.. ఆ విషయం మరచారని 
ఆ విధంగా మాట్లాడాను.” సీతమ్మ మొహమాటంగా అంది.
  నంద, గౌతమిలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
  నిజమే.. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చెయ్యాలి కదా! చెయ్యకపోతే సీతమ్మలాగే 
అందరూ అనుకునే ప్రమాదం ఉంది. ఈ మాసంలోనే..
  “అలాగే సీతమ్మా! రేపే పురోహితుల వారిని కలుస్తాను. అమ్మనీ, తమ్ముడినీ కూడా 
రప్పించుకోవాలి. పనిలో పని, మా జగన్నాధుడికి మంచి పిల్ల ఎక్కడైనా ఉందేమో చూడు. 
వీని ఒడుగూ, వాని పెళ్లీ కలిపి చేసేద్దాము.” నందుని మాట వింటూనే సీతమ్మ మొహం 
ఆనందంతో విప్పారింది.
  తనమాటకి విలువ ఇచ్చారు.. యజమాని అనే భావమే కలగనియ్యరు ఎన్నడూ. వీరి అండ 
దొరకుట నిజంగా తన అదృష్టమే.
  “అదెంత పని. నీటి కోసం ఏటికి పోయినప్పుడొక మాట వేశానంటే రేపే మన ఇంటికి వస్తారు
కన్యాదాతలు.” సీతమ్మ ఉత్సాహంగా బైటికి వెళ్లింది, బిందె పట్టుకుని.
                                   ……………………


6వ భాగం


  నందుడు అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు, పంచలో.. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. 
మాధవుడు ఒక స్థంభాన్ని ఆనుకుని కూర్చుని చూస్తున్నాడు. సమస్య ఏమిటో 
తెలియడం లేదు..
  తనేమైనా సహాయం చెయ్యగలడేమో..
  మధ్యాహ్న భోజనాలయి, బాటసారులందరూ నిష్క్రమించారు, వారి వారి దిశలలో. 
అంతా సవ్యంగానే ఉంది కదా! మరి..
  మనసులో తలపోస్తున్నాడు.. జన్మ కారకుడు కాకపోయిననూ, తనని ఆదరించి అక్కున 
చేర్చుకున్న తండ్రికి ఏవిధంగా ఉపశమనం కలిగించ గలనా యని..


                కం.   వ్యాకులిత మనము నటుయిటు
                        ఏకాగ్రతతో నడచుచు భృకుటి ముడిచెనే
                        నే కారణమో తెలిపిన
                        నీ కలతను మాన్పగలను నిక్కముగానున్.


  “ఏ మయినది తండ్రీ?” ఆగలేక దగ్గరగా వెళ్లి అడిగేశాడు.
  మాధవుడిని పరికించి చూశాడు నందుడు.
  ఈ పసివాడు తన సమస్యని పరిష్కరించగలడా?
  కానీ గౌతమికి నమ్మకం కలిగింది బుడుతని మీద. అతడి వయసు చిన్నదైనా మానసిక 
వయసులో పెద్దే.
  “నీకు ఉపనయనం, జగన్నాధ పాత్రునికి పెళ్లీ చెయ్యాలని సంకల్పించాము. జగన్నాధునికి 
పదునెనిమిది వత్సరాలు వచ్చాయి. అలాగే నీక్కూడా..”
  “అవ్వ వస్తుందా?” ఉత్సాహంగా అడిగాడు బాలుడు.
  నందుడు నిస్సహాయంగా చూశాడు గౌతమిని. ఆవిడ అదేమీ పట్టించుకోలేదు. అంతే 
ఉత్సాహంతో సమాధానం చెప్పింది.
  “వస్తుంది మాధవా. ఇంకా బంధువులు కూడా వస్తారు. ఇంక పదిహేను దినములలోనే 
ముహుర్తం. అమ్మాయి వాళ్లు ఇక్కడి వారే. శుభకార్యాలు ఇక్కడే జరుగుతాయి.”
  అప్పుడు అర్ధమయింది మాధవుడికి, నందుడి చింతకి హేతువు.
  “దిగులెందుకు తండ్రీ? మన వద్ద నాణెములున్నవి కదా! సరిపోవా?”
  నిజమే ఉన్నవి.. కానీ అవి వాడుట సముచితమేనా? తటపటాయించాడు నందుడు. 
ఉపనయనం చెయ్యడం తన బాధ్యత. దానికి పిల్లవాని వద్ద ధనం తీసుకొనడమా! తల 
విదిలించాడు.
  ఎవరైనా ఉన్నారేమోనని ఒకపరి అంతా పరికించి అన్నాడు మాధవుడు..
  “నేనే మీ పుత్రుడనే! నా ధనము మీది కాదా? సంకోచము వద్దు. మనం త్వరలో అంతకు 
అంతా సంపాదించుకోవచ్చు. ఇప్పటికి ఆ నాణములను ఉపయోగించెదము.”
  సంతోషంగా కుమారుని కౌగిలించుకుని నుదుటి మీద ఆదరంగా చుంబించాడు నందుడు.
  “వెంటనే దిష్టి తీయ వలసిందే..” అప్పుడే లోనికి అడుగు పెడుతున్న సీతమ్మ అంది, 
ఆనందంగా.
                                       …………………
  మహా పాత్రుల గృహము కళకల్లాడిపోతోంది.
  మాధవుని సహాయంతో నందుడే ఇంటికి వెల్లలు వేశాడు.
  గోడల మధ్య అక్కడక్కడ ఎర్ర మట్టి రాసి కొన్న భాగాలని వదిలేశారు, గౌతమి సూచన
మేరకు. ఆ భాగాల మీద, చక్కని రంగవల్లులు దిద్దారు, సీతమ్మా తనూ కలిసి.
  
      ఆ.వె.   ఇరుగు పొరుగు వారు నిష్టులందరు కూడి
                 పసుపు నంత దంపి బాగ చెరగి
                 మామిడాకులన్ని మలచి తీరుగ కట్టి
                 తోరణములు చేసె తొణగు నంత.


  పసుపు రాసిన గడపలకి బొట్లు పెట్టే వారు, అరిశలకి పిండి దంచే వారు, పొయ్యిల మీద 
బాణలి పెట్టి చక్కిలాలు చేసే వారు, పువ్వుల మాలలు కట్టే వారు.. కన్ను విందేను 
చూచువారందరికీ.
  “ఈ అరటి చెట్టు ఎక్కడ పెట్టించాలి అమ్మమ్మా?” మాధవుడు, నుదుట నామముతో, 
బుగ్గను దిష్టి చుక్కతో, కొత్త పంచెను గోచీ పోసి కట్టి, ఉత్తరీయాన్ని నడుముకి బిగించి 
వచ్చాడు. పక్కనే గెలతో నున్నపెద్ద అరటి చెట్టు పట్టుకుని శ్రేష్ఠి గారి కొడుకు నాగయ్య 
నవ్వుతూ..
 “అయ్యయ్యో.. ఎంత పని చేశావురా?” గట్టిగా అంది సీతమ్మ. ఒక్క సారిగా అందరూ పనులు 
ఆపేసి అటు చూశారు.
  ఏం తప్పుచేశానా అని మాధవుడు అయోమయంగా చూస్తున్నాడు.
  ఇంటిలోనుండి గౌతమి పరుగెత్తుకుంటూ వచ్చింది.
  “ఏమయిందేమయింది?”
  “పెళ్లకొడుకుని చేసి పారాణి పెట్టాక ఇల్లు కదల వచ్చునా? వీడేమో.. పనులన్నీ 
చేసేస్తున్నాడు. అసలే ముహుర్తం లేదని, ఇన్నాళ్లూ వీడిని పెంచిన బామ్మ లేకుండానే చెయ్య 
వలసి వచ్చింది. ఆవిడేమనునో అని హడలుతుంటే వీడెక్కడ దొరికాడమ్మా!” సీతమ్మ 
మాటలకి అందరూ నవ్వేశారు.
  అమ్మయ్య అనుకున్నాడు మాధవుడు.
  “అమ్మమ్మా! నేనెక్కడికీ వెళ్లేదు. మన పెరటి లోనివే. నువ్వు ఆయాస పడవద్దు. నిమ్మదిగా 
నుండు.” మాధవుడు పరుగెత్తుకుని వచ్చి సీతమ్మ నడుం పట్టేసుకున్నాడు.
  సరిగ్గా అదే సమయానికి, ఎడ్ల బళ్లు వచ్చి ఆగాయి వాకిలి ముందు.
  ముందుగా, జగన్నాధుడు దిగి, తల్లికి చెయ్యందించాడు.
  బాలవ్వ దిగుతూనే కళ్లప్పగించి అంతా పరికించింది. సంతోషంతో మొహం విప్పారింది.
  పదంగల్లో మాధవుడు గెంతుకుంటూ వచ్చి, గుమ్మం దాట బోయి ఆగిపోయాడు.. సీతమ్మ 
మాటలు గుర్తుకొచ్చి.
  బాలవ్వ, కళ్లారా బాలుడిని చూస్తూ, లోపలికి వచ్చి, హత్తుకుంది గాఢంగా.
  కన్నుల నుండా నీళ్లు.. బుగ్గల మీదుగా కారి పోతున్నాయి.
  మాధవుని స్థితి కూడా అంతే. అయితే..ఇద్దరివీ వేర్వేరు కారణాలు!
                                  …………………


  మామ్మా, మనవలని చూస్తున్న వారికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. 
ఎప్పటి అనుబంధమో అని కూడ అనుకున్నారు.
  తాను చొరవ తీసుకుని పంపిన పసివాడు అనందంగా ఉన్నాడని బాలవ్వ, తనకి మాతా 
పితరులను, రక్షణను ఏర్పరచినందుకు మాధవుడు.. ఒకరి కొకరు అన్యోన్య ఆత్మీయతా 
భావనలో తాదాత్మ్యం చెంది పోయారు.
  “అవ్వా! కులాసానా? చిన్నాన్న బాగా చూసుకుంటున్నాడా? లేదంటే చెప్పు, నేను 
వచ్చేస్తాను.” మాధవుడి మాటలకి ఫక్కున నవ్వి, నెత్తి మీద ఆప్యాయంగా తట్టాడు 
జగన్నాధుడు.
  “చిన్నమ్మ ఎంతో బాగుంది అవ్వా! అచ్చంగా అమ్మ లాగనే నవ్వుతూ ఉంటుంది. నేనే 
ముందు చూశాగా! చిన్నాన్న గురించిన విశేషాలన్నీ చెప్పేశా.” మాధవుడు చిన్నాన్నని 
ఆట పట్టించాడు.
  “అమ్మయ్య. నీకు నచ్చింది కదా? ఐతే నాకునూ..” జగన్నాధుడు బండిలో నుండి అన్ని 
వస్తువులనూ దింపి లోపలికి తీసుకుని వచ్చాడు.
  “త్వరగా స్నానం, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రమే పెళ్లికొడుకుని 
చేస్తాము.” గౌతమి, బాలవ్వ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ జగన్నాధునికి చెప్పింది.  
  బాలవ్వ ముంగిలి లోనే కాళ్లు చేతులూ కడుగుకొని ఇల్లంతా తిరిగి, తృప్తిగా తల పంకించింది. ప్రతీ ముగ్గునీ పరికించి చూసింది.
  స్నాన, భోజనాది కార్యక్రమాలయ్యాక, విశ్రాంతిగా పంచలో కాళ్లు చాచుకుని, 
స్థంభానికానుకుని కూర్చుంది బాలవ్వ.
  మాధవుడు నెమ్మదిగా ఆవిడ పక్కనే చేరాడు.
  కాళ్లు రాస్తూ, ఒళ్లో తల పెట్టి పడుక్కున్నాడు.. మొహం లోకి చూస్తూ.
  “ఏమిటి చూస్తున్నావు కన్నయ్యా?”
  “నీ నుదుట కుంకుమ సంధ్యా సమయంలో సూర్యుడిలా మెరుస్తోందవ్వా. తాతగారు..”
  అటూ ఇటూ చూసింది బాలవ్వ కలవరంతో.. ఎవరైనా ఉన్నారేమోనని.
  అందరూ పనులు ఆపేసి వెళ్లిపోయారు ఇళ్లకి. మాధ్యాహ్న కార్యక్రమాలకి. గౌతమి 
లోపల ఏదో పనిలో ఉంది. మగవాళ్లిద్దరూ బైటికి వెళ్లారు.
  మాధవునికి బాలవ్వ వద్ద నున్నప్పుడు ఆ విషయం అడగాలని తోచ లేదు.. అప్పుడు 
ఎక్కడ నీడ దొరుకుతుందా అనే వ్యాకులముతోనే సరి పోయింది. ఇప్పుడు అంతా సవ్యంగా 
స్థిరమయింది కదా.. కుతూహలం వచ్చింది.
  “తాతగారు, ఇప్పటి రాజు తండ్రిగారితో వెళ్లిపోయాడు.. హిమాలయాలకి. అప్పటి నుంచీ 
జాడ లేదు. చాలా ఇళ్ల్లలో గాధలంతే.. యుద్ధాలకో, యాత్రలకో వెళ్లి పోతారు ఇంటి మగవారు. 
ఆడవారు నిత్య ముత్తైదువులుగా ఉంటారు.. వారి వర్తమానం తెలియక. అలాగే జీవితాలు 
గడిచి పోతుంటాయి.” బాలవ్వ నిట్టూర్చింది.
  “మరేమీ భెంగ పడకవ్వా! మాధవుడున్నాడుగా చూసుకుంటాడు.” గోముగా అన్నాడు.
  బాలవ్వ చటుక్కున ముందుకు వంగి బాలుడి నుదుట ముద్దు పెట్టింది.
  అలాగే స్తంభానికి ఆనుకున్న బాలవ్వ కిందికి జారి కళ్లు మూసుకుంది తృప్తిగా. ఆమె ఒడిలో 
మాధవుడు..


                 కం.  అనుబంధం ముడివడుటకు,
                        కనికరమును జూపుటకును కావలె మరియా
                        జనమానువేధ మింకను
                        మనసు మనసు కలిసినంత మనును నిబంధం.


  జీవన యానంలో ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎదురు, పడతారో.. ఏ బంధాలు 
ఏర్పడతాయో, అవి ఏ విధమైనవో ఆ విధాతకే తెలియాలి.
                                          …………..


  గాఢ నిద్రలో నున్న బాలవ్వ ఉలిక్కిపడి లేచింది. అంతా హడావుడిగా అటూ ఇటూ 
తిరుగుతున్నారు. ఆడవారు చీనాంబరాలు ధరించి ఒద్దికగా ఒక దగ్గర కూర్చుని పూల 
మాలలు కడుతున్నారు.
  వసారాలో ఆ పక్కన ముగ్గులతో అలంకరించిన పీట.. దాని ముందు పసుపురాసి, 
బొట్లుపెట్టిన రోలు, రోకలి. స్తంభాలకి అల్లుకున్న పువ్వుల తీగలు సహజ తోరణాలు. 
పైనుంచి మామిడి తోరణాలు కూడా కట్టారు.
  బాలవ్వ ఒడిలో తల పెట్టి అడ్డంగా కాళ్లు జాపి పడుకున్న మాధవుడు కూడా లేచాడు, 
కళ్లు నులుముకుంటూ.
  “లేచారా? రండి, అలా వెళ్లి ముఖము, కళ్లు చల్లని నీళ్లతో కడుక్కుని రండి. వేడి పాలు 
తాగుతే అలసట తగ్గుతుంది. కన్నయ్యకి నాయనమ్మ ఒడి, వెచ్చగా, హాయిగా ఉన్నట్లుంది. 
ఒడలెరుగక నిద్రించాడు.” గౌతమి, బాలవ్వకి చెయ్యందించి లేపింది.
  అంతలో జగన్నాధుడు, నామం, బుగ్గన చుక్కతో వెళ్లి పీట మీద కూర్చున్నాడు. అతడి 
పక్కన బంధువుల అబ్బాయిని తోడు పెళ్లి కొడుకుగా కూర్చో పెట్టారు.

  బాలవ్వ, మాధవుడు క్షణాలలో పెరటి వాకిట్లో పనులు ముగించుకుని, పరుగున వచ్చేశారు.
  ముత్తయిదువలు, పెళ్లి కొడుకుకి, తోడుకీ నెత్తి మీద నూనె పెట్టడం, అక్షింతలు వెయ్యడం 
ఆశీర్వదించడం జరిగాక, ఇద్దరికీ అభ్యంగన స్నానం చేయించి.. కొత్త వస్త్రములు కట్టారు.
  కొడుకుని నిండుగా చూసుకుంటూ కోడలు చేతనే మొదటిగా పసుపు కొమ్ములు దంపించింది 
బాలవ్వ. నంద, గౌతమిలు ఆశీర్వదించాక.. మిగిలిన ఆడ వారందరూ పసుపు కొమ్ముల మీద 
మూడూ పోట్లు వేసి అక్షింతలు వేశారు.
  చివరిగా బాలవ్వ వెళ్లి, జగన్నాధుని ఆశీర్వదించింది.
  ఆ తరువాత, పందిరికి రాట పాతడం, అందరూ పాటలు పాడడం..
  ఒకరి నొకరు పరిహాసాలు..
  “వదినా! ఇంక మేము ఎంతసేపు కూర్చోవాలి?” జగన్నాధుని పిలుపుకి అటు తిరిగిన 
గౌతమి.. హారతి పళ్లెం తీసుకు వచ్చి, హారతిచ్చి లేపింది పెళ్లి కొడుకునీ తోడు పెళ్లికొడుకునీ.
                                   …………….
  మాధవుని ఉపనయన మహోత్సవం జరుగుతోంది.
  గౌతమీ, నందులు  పీటల మీద కూర్చుని శ్రద్ధగా చేస్తున్నారు.


  “బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ 
ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, 
నిర్మలత్వం మరియు పుష్టిని ఇచ్చుగాక”
  మంత్ర యుక్తంగా మాధవుని చేత పలికించి యజ్ఞోపవీతాన్ని ధరింప జేశారు ఆచార్యుల వారు.   
  “వటువు వయసెంతన్నారూ?”
  “పది సంవత్సరాలు నిండాయండీ గురువు గారూ!” మాధవుడు అనేశాడు. అసంకల్పితంగా.
  చిన్నపిల్లవాడి చలాకీతనం.. అందరూ నవ్వుకున్నారు.
  “మరి ఇంతకాలం ఆగారెందుకూ? బ్రాహ్మణ బాలులకు ఉపనయనం ఎనిమిది సంవత్సరాలకి
చెయ్యాలి. పదకొండు వత్సరాలంటే క్షత్రియ బాలురకు చేసే వయసు.” నిష్ఠూరంగా అన్నారు 
ఆచార్యులవారు.
  మాధవుని మొహం విప్పారింది ఆ మాట వినగానే..
  “నేను క్షత్రియ బాలుడినే కదా. ఔచిత్యంగానే ఉంది..” నోటి వరకూ వచ్చిన మాటని 
వెనక్కి తోసేశాడు, అమ్మ చెప్పిన జాగ్లత్త గుర్తుకొచ్చి.
  “నీ కుల గోత్రాలు ఎట్టి పరిస్థితుల లోనూ బయట పెట్టద్దు. అజ్ఞాతంగానే ఉండనీయాలి.” 
గుర్రం పరుగు తీయబోయే ముందు అమ్మ చెప్పిన మాట.. మాధవుని కన్నులలో నీరు తిరిగింది 
అప్రయత్నంగా.
  “ఇన్ని సంవత్సరాలు, అమ్మ వద్ద పెరిగాడు. అందుకే మాకు అవకాశం రాలేదు స్వామీ. 
ఏదైనా ప్రాయశ్చిత్తం..” నందుడు వినయంగా అన్నాడు.
  “అయ్యో.. నేనేం అనలేదు. విచారం వలదు నాయనా. అప్పుడైతే మంచిదని అన్నాను. 
ఇప్పుడైనా గాయత్రీ మంత్రం నిష్ఠగా త్రికాలములందూ పఠిస్తే దోషం పోతుంది.”మాధవుని 
పెద్ద పెద్ద కన్నుల నిండా నీరు చూసిన ఆచార్యులు గాభరాగా అన్నారు.
  గౌతమి, మాధవుని దగ్గరగా తీసుకుని తల నిమిరింది. పంచ శిఖలూ.. మధ్య మధ్యలో 
నున్నని గుండూ మెత్తగా తగిలాయి.
  అమ్మ నడుం గట్టిగా పట్టుకుని కన్నీళ్లని లోనికి తరిమేశాడు మాధవుడు.
  దండం ధరించి, పచ్చని పంచ కట్టుకుని, ముందుగా మాతృమూర్తిని, పితృదేవుడిని భిక్ష 
అడిగి, అందరినీ వరుసగా యాచించాడు మాధవుడు.


                                  


  “అచ్చంగా ఆ వామన మూర్తి లాగనే ఉన్నాడు నా చిట్టి తండ్రి..” నాన్నమ్మ మెటికలు 
విరిచింది.
  “పోలిక బావుంది. మూడడుగులూ అడిగి చక్రవర్తిని ముంచకుండా చూసుకో బాలవ్వా!” 
నవ్వుతూ అన్నారు ఆచార్యులవారు.
  “నా కన్నయ్య ఆ విధంగా ఎందుకు చేస్తాడు.. సార్వభౌముని రక్షిస్తాడు కానీ.” గౌతమి 
రోషపడింది.
  “కోపం వద్దు తల్లీ. పరహాసానికన్నాను. ఆ వామనుడు లోక రక్షణకే కదా ఆవిధంగా చేసింది. 
ఈ బాలుని లో ఆ కళే ఉంది. మంచి పనులు చేస్తూ తప్పక వృద్ధిలోకొస్తాడు.”
  వచ్చిన ఆహుతులందరూ మాధవుని ఆశీర్వదిస్తూ అదే అనుకున్నారు.. బాలునిలో ఏదో 
శక్తి నిక్షిప్తమై ఉందని.
                                    …………………..


  “అమ్మా! ఈ తల ఇంతేనా?” తడుముకుంటా అడిగాడు మాధవుడు. పంచ శిఖలూ తీసేసి, 
నున్నగా గుండు చేసి, వెనుక మాత్రం చిన్న శిఖ ఉంచారు.
  ఉపనయనం అయి, వచ్చినవారందరూ వెళ్లి పోయారు.
  రోజూ గాయత్రి జపిస్తున్నాడు మాధవుడు.
  “అంతే కద మాధవా! ఒడుగయ్యాక బ్రాహ్మణ బాలురు ఈ విధంగానే ఉంటారు.  వచ్చే 
వారం నుంచీ గురువుగారి వద్దకు వెళ్లి, భాష, వేదం, స్మార్తం నేర్చుకోవాలి. అసలు గురుకులం 
లో పెట్టేద్దామనుకున్నాం కానీ, ఇన్నేళ్లకి మా వద్దకొచ్చావని దగ్గరే ఉంచుకుందా
మనుకున్నాం.” గౌతమి వివరించింది.
  “మరి వేదం, భాష అంటున్నారు కదా.. మనం వంటలు ఎందుకు చేస్తున్నాం? రాజుగారి 
కొలువులోనో, విద్వత్ సభల్లోనో తండ్రిగారు వేదాలు చదవచ్చు కదా? వారు చదువుకొన 
లేదా?” మాధవుని సందేహం సరైనదే. కానీ జవాబు చెప్ప వచ్చులో లేదో.. నందుని వంక 
చూసింది గౌతమి.
  “ఫరవాలేదు. బాలుడు విషయాలు గ్రహించాలి. చెప్తాను.. అలా వ్యాహ్యాళి కెళ్లినప్పుడు.” 
నందుడు నెమ్మదిగా అన్నాడు.
  “అయ్యో నా ఉంగరాల జుత్తు..” తల మళ్లీ తడుముకుంటూ కినుకగా అన్నాడు మాధవుడు. 
అప్పుడప్పుడు అతడి లోని పసి బాలుడు పైకొస్తుంటాడు.. అనుభవాలు ఎంత పెద్దరికాన్ని 
తెచ్చినా.
  “అంతే.. అంతే. నేను కూడా చాలా ఏడ్చాను. ఎనిమిదో ఏడు వరకూ ఆగారు 
మా తల్లిదండ్రులు. శరీరంలోంచి ఒక భాగం కోల్పోయినంత బాధ కలిగింది. సాంప్రదాయం 
మరి.. తప్పదు.” ఓదార్చాడు నందుడు.
  “చాలా రోజులయింది. కళ్యాణినొక పరి తిప్పి రానా నాన్నగారూ?”
  నిజమే.. వారం పైనయింది. ఎవరూ బాడుగకి కూడా తీసుకోలేదు. వెనుక భాగాన కాసేపు 
వదులుతున్నారంతే. గుర్రాలకి స్వారీ చాలా ముఖ్యం.. లేకున్న శరీరం బరువు పెరిగి పోయి 
కదల లేవు.
  మాధవుడు నాలుగంగల్లో పెరటిలోనికి వెళ్లి, కళ్యణిని మాలీషు చెయ్య సాగాడు. 
పావుగంట పైగా చేసి, కాసిన్ని గుగ్గిళ్లు తినిపించి, బంధనం విప్పి, జీను నమర్చి, స్తంభం 
పట్టుకుని పైకెక్కి.. నాలుగు క్షణాల్లో ఇల్లు వదలి వెళ్లి పోయాడు.

  గౌతమీ నందులు, మాధవుడు కనిపించే వరకూ చూస్తూ నిలిచి ఇంట్లోకి వెళ్లి పోయారు.
.................



                                        

                                         








                                    





2 వ్యాఖ్యలు:

gopi pinnali said...

ఇప్పటి వరకూ వెలువడిన నాలుగు భాగాలూ చదివాను. చాలా ఆసక్తికరంగా సాగుతున్నది. చరిత్రలోని కోణాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ సాగుతున్న ఈ నవల ఏదైనా విస్వవిద్యాలయానికి పంపితే పాఠ్యగ్రంథం హోదా పొందగలదేమో...
అభినందన వందనాలతో...

Mantha Bhanumathi said...

ధన్యవాదాలు గోపీనాధ్ గారూ.
చాలా సంతోషం. మీ సలహా.. ప్రయత్నిద్దాం.
మంథా భానుమతి.