Monday, June 13, 2011

అదిరేటి వంటలు. కాం ఇన్ అమెరికా

Posted by Mantha Bhanumathi on Monday, June 13, 2011 with 1 comment
బ్లాగర్ మిత్రులందరికి వందనాలు. చాలా రోజుల తరువాత పలుకరిస్తున్నందుకు మన్నించాలి.
పెద్ద మునిగిపోయే పనులేమి లేవు కానీ.. అమెరికా  రావడం, వచ్చాక పిల్లలతో కాలం గడపడం.. ఆ పైన కాసింత బద్ధకం.
సియాటల్ లో ఇప్పుడిప్పుడే వాతా వరణం బయట తిరగడానికి అనుకూలంగా అవుతోంది.
సాయంత్రం అలా వ్యాహ్యాళికి వెళ్లి, పార్కులో అందరితో కబుర్లు చెప్పి వస్తున్నాము.
అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేవరకు ఎప్పుడెప్పుడు వచ్చి పిల్లల్ని చూస్తామా అనిపిస్తుంది. వచ్చిన నెలకే తోచక ఎప్పుడేల్తామా అని రోజులు లెక్కపెట్టు కోవడం.. కనిపించనిదాని కోసం ప్రాకులాడడమే మానవ  స్వభావం.
బ్లాగ్ గురువు జ్యోతి గారి కాలం కి వంటలు రాసి పంపాలని ప్రయత్నం.. తమాషా ఏమిటంటే.. చేత్తో అటు ఇటు ఉప్పు కారం, మసాలాలు  విసిరేస్తే కుదిరే వంటలు.. కొలతలతో చేస్తే ఓ మాదిరిగా వస్తున్నాయి. ఏదో ఒకటి ఎక్కువో.. తక్కువో! 
ఇంకా బాగా ప్రయోగాలు చేసి పంపుతాను. అన్నట్లు ఇవేళ కారట్ రైస్ చేసాను.
రెండు పావులు బియ్యం మరీ ముద్దగా కాకుండా, మేకుల్లా కాకుండా వండి పెట్టుకోండి. అర్ధకిలో కారట్ తురిమి, రెండు ఉల్లిపాయలు, రెండంగుళాల అల్లం, ఆరు వెల్లుల్లి పాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు (సైజుని, మీ రుచిని పట్టి మార్చుకోవచ్చు..) సన్నగా.. అతి సన్నగా తరిగి ఉంచుకోవాలి. మూకుడు లేదా కళ్లాయి లేదా బాండిలో ఒక గరిట నూనె, రెండు చెంచాలు నెయ్యి వేసి, కాగాక, కారట్ తప్ప మిగిలినవి వేసి, అవి అదిరిపోయే వాసన వచ్చే వరకు వేయించి కారట్ తురుము వెయ్యాలి. అది మెత్తబడ్డాక అన్నం వేసి, ఉప్పు, పసుపు, కొంచెం వేయించిన వేరుసెనగ పొడి, మెత్తటి వేయించిన కొబ్బరి కోరు, వేయించిన ధనియా-జిర పొడి వేసి (కమాన్.. ఇవన్ని మీ రుచికి సరిపోయేట్లు అని వేరే చెప్పాలా..) బాగా కలిపి.. మూతపెట్టి, చిన్న మంట మీద ఉంచండి.
పదినిముషాలయ్యాక.. కొత్తిమీర కోరు, జీడిపప్పు ముక్కలు (వేయించి) చల్లండి.
అంతే.. కారట్ రైస్ రెడి.. దిన్ని ఉల్లిపాయ పెరుగు పచ్చడితో తినచ్చు. లేదా నిమ్మకాయ పిండుకుని అలాగే లాగించేయ్యచ్చు.
బాగుందంటే చెప్పండి.. జ్యోతిగారి కాలం కి పంపుతాను. ఫోటో తియ్యలేదుస్మి.. బాగా వచ్చినట్లు ఎవరైనా చెప్తే అప్పుడు తీసి పంపుతా.

1 వ్యాఖ్యలు:

Sudha Rani Pantula said...

భానుమతిగారు, మీరు కథల ద్వారా మాకు పరిచయమే కాని...బ్లాగ్ రాస్తున్నారని ఇప్పుడే చూసానండి...ఇంకా చూడాలనుకోండి పూర్తిగా....ప్రస్తుతం మాత్రం వంటా భానుమతిగారిగా మాత్రమే మూడు పోస్టులు చూసాను...చేసి చూడమంటారా...చూసి రాయమంటారా..సరేమరి..మిగిలిన పోస్టులు చూసి తప్పకుండా రాస్తాను...మిమ్మల్ని ఇలా అమెరికాలో చూడడం కూడా సంతోషం...మనం మనం హైదరాబాదే అయినా...