అజ్ఞాత కులశీలస్య..
37
37
“ఏ జన్మలోనో ఇక్కడ విహరించినట్లుగా అనిపించింది హుస్సేన్ గారూ. కళింగ దేశీయుడిని, ఈ ప్రాంతమునకు రావడం ఇదే కదా! చాలా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి ఇచ్చట”
మాధవుని బుద్ధి హెచ్చరించింది.. ప్రమాదంలో పడవద్దని.
“ఏమయినా.. మీ పద్యం వింటుంటే మా చిన్నతనం గుర్తుకొచ్చింది మంత్రిగారూ! మేము అన్నదమ్ములం అక్క చెల్లెళ్లతో కూడి ఆ విధంగానే ఆటలాడే వాళ్లం. ఆ ఆనంద మంతా చెల్లా చెదురై పోయింది.. విధి విలాసం.” ఆజమ్ హుస్సేన్ విచారంగా అన్నాడు.
“అయితే.. మీ కుటుంబం అంతా..” మాధవుడు ఆగిపోయాడు. కంఠం నొక్కుకు పోయినట్లు అనిపించగా.
“చెల్లా చెదరై పోయింది. మునుపటి రాజుగారికి దగ్గరి బంధువులం మేము. గణేశ వంశస్తులం. కత్తికొక కండగా నరికిన వారిని నరకగా మిగిలిన వాళ్లం.” చిన్నా భిన్నం అయిన తన కుటుంబాన్ని తలచుకుని, కళ్ల నిండా నీళ్లతో అన్నాడు ఆజమ్ హుస్సేన్.
“అవును విన్నాను. గణేశుల వంశం వారినందరినీ బలవంతంగా మతం మార్పించేశారని.”
“అంతే కాదు.. ఇష్టం లేని వారిని మా కళ్ల ముందే చంపేశారు. మా పెద్దమ్మగారు కొడుకుని తీసుకుని పారి పోయారు. వారి జాడ తెలియలేదు. అందరం కలసి మెలసి ఆడుకుంటూండే వాళ్లం. మీ పద్యం వింటూ ఉంటే ఆ పాత సంగతులన్నీ గుర్తుకొచ్చాయి.” హుస్సేన్ విచారంగా అన్నాడు.
ఒక్క నిమేషం ఆలోచించాడు మాధవుడు.
తనెవరో చెప్పాలా అని.
చెప్తే.. తన కుటుంబాన్ని కలుసు కోవచ్చును. కానీ వివేకం వద్దని హెచ్చరించింది. అమ్మ మాటని పాటించమంది.
కం. గతమంత చరిత్ర యెగా
వెతకల్గిన చేయునంత విధములు లేవే
గతి లేదు విధియె రాసెను
కతలుగ చెప్పుకొన తప్ప కాలము గడవన్.
“అంతే హుస్సేన్ సాబ్. పాత సంగతులు తలచుకొనుట తప్ప చేయ గలిగిందేమీ లేదు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ దేశం.. కాదు కాదు.. మన దేశం సస్య శ్యామలంగా ఉంది. కలకాలం ఆ విధంగా ఉండాలని ఆ దుర్గా మాతని కోరుతున్నాను. మహరాజు గారి ఆనతి అయింది. మేము రేపే బయలు దేరుతున్నాము.” మాధవుడు వీడ్కోలు చెప్పి తన విడిదికి బయల్దేరాడు.
ఒకే ఒక్క సారి హుస్సేన్ గారి ఇంటికి తీసుకెళ్లమని అడగాలన్న కోరికని అదిమి పట్టి, ముందుకి నడిచాడు.
ఆజమ్ హుస్సేన్ కూడా అర్ధ మనస్కుడై అచ్చటి నుంచి కదిలాడు..
రక్త బంధం వెనక్కి, రాజకీయం ముందుకి నడవ మన్నాయి. రాజకీయమే గెలిచింది.
మాధవుని జీవితంలో వంగ దేశంలో గతమనే అధ్యాయానికి తెర పడి పోయింది.
విజయోత్సాహంతో కటకం ప్రవేశించారు కళింగ సైనికులు.
కోటలోనికి ప్రవేశిస్తూనే మాధవుడు తన గృహమునకు సాగి పోయాడు. సంధ్య వేళ దాటి ఘడియ అయింది.
కోటంతా దీప తోరణాలతో అలంకరించారు.
మాధవుడు అన్య మనస్కంగానే కోటలో తన అశ్వాన్ని నడుపుతున్నాడు.
అన్న గారు కలిస్తే, కనీసం.. తన వారు ఎవరెవరు ఉన్నారో కూడా అడగ లేక పోయాడు.
వంగ దేశానికి వెళ్లకుండా ఉన్నా బాగుండేది. అంతా భ్రమ కానీ, వెళ్లడం వెళ్లకపోవడం తన చేతిలో ఏముంది?
రాజుగారి ఆనతిని కాదన గలడా?
తన ఇంటిని సమీపిస్తూ ఉండగానే, అతడి కన్నులు విచ్చుకున్నాయి.
అది తన గృహమేనా?
ఏమా అలంకరణ..
ద్వారమందే ఎదురేగి, హారతి ఇచ్చింది ధర్మపత్ని. ఆ వెనుకే నిలిచి ఆనందం నిండిన కన్నులతో ప్రియ పుత్రుడిని చూసుకుంటున్నారు నంద, గౌతమిలు.
సీతమ్మ అస్వస్థత కారణంగా ఎక్కువ సమయం తన కక్ష్య లోనే గడుపుతోంది.
“ఇదీ నా ఇల్లు. వీరంతా నా వాళ్లు. గతాన్ని తలచుకొని వగచడం మానివేయాలింక” మాధవుడు మనసు దిటవు పరచుకుని ధృడ నిశ్చయంతో, చిరు నవ్వుతో అందరినీ పలుక రించాడు.
కపిలేంద్ర దేవుని కుమారులందరూ రాజ్య విస్తరణ జరుపుతుండగా, పురుషోత్తమ దేవుడు, కళింగ రాజ్యానికి కాపలాగా ఉన్నాడు, తండ్రి యానతి మేరకు.
పురుషోత్తమ దేవునికి గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కాలం గడుపు తున్నాడు మాధవుడు.
చెరువులు తవ్వించడం, కాలువలు తీయించడం.. పాడి పంటలకు లోటు లేకుండా పాలన సాగుతోంది. గజపతుల పాలనలో సామాన్య ప్రజానీకం లోటు లేకుండా జీవిస్తున్నారని ఇతర దేశాలలో అనుకుంటున్నారు.
నంద గౌతమిలకు వృద్ధాప్యపు ఛాయలు సోకుతున్నాయి. సీతమ్మ స్వర్గారోహణ చేసింది. మాధవుడే శాస్త్రోక్తంగా కర్మ కాండలు చేశాడు.
వివాహమైన ఏడు సంవత్సరాలకి, కాదంబరీ దేవి శుభవార్త మాధవుని చెవిన వేసింది. నందుని గృహమంతా ఆనంద డోలికలలో ఊగి పోయింది. ఇంటిలోనికి పసిపాప రాబోతుంటే.. ఇంకేం కావాలి?
అదే సమయంలో పురుషోత్తమ దేవుని భార్య పద్మావతీ దేవి కూడా శుభవార్త చెప్పింది.
అంత కన్న సంతోషమేముంటుంది..
మహారాజు కపిలేంద్ర వర్మ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. రాజమహేంద్రవరం తో పాటుగా కృష్ణా తీరం కూడా గజపతుల కైవశ మయింది. గజపతుల తళ్లు సాగుతూనే ఉన్నాయి. రాజకుమారుడు హంవీరుడు, వాని పుత్రుడు, మిగిలిన అన్న దమ్ముల సహకారంతో అదే పని మీద ఉన్నారు.
గంగా నది నుంచీ కావేరి వరకూ విస్తరించింది గజపతుల సామ్రాజ్యం.
ఒక శుభ ముహుర్తాన కాదంబరీ దేవి అమ్మాయిని, పద్మావతీ దేవి అబ్బాయిని ప్రసవించారు.
మాధవుడు తన కుమార్తెకు కాత్యాయని అని పేరు పెట్టాడు.. కాదంబరీదేవికి కూడా చాలా నచ్చింది ఆ పేరు. నందుని ఆనందమునకైతే అంతే లేదు. గౌతమికి ఎప్పుడూ చిన్నారి కాత్యాయని ధ్యాసే.
మాధవుని ఇంటనే కాదు.. కోటలోని తోటలన్నీ కిలకిలా రావములతో నిండి పోతున్నాయి.
అప్పటి వరకూ తాము ఎంతటి ఆనందాన్ని కోల్పోయారో.. పాపాయి కాత్యాయని ముద్దు మాటలతో తెలియ వచ్చింది. ఆట్టి ఆనందానికి నోచుకున్నందుకు జగన్నాధునికి సర్వదా కృతజ్ఞతలు తలుపుకుంటాడు నందుడు.
మాధవుని రాక తమ జీవితాలనే మార్చి వేసిందంటుంది గౌతమి.
ఆ రోజు కృష్ణాష్టమి.
కాత్యాయనిని చిన్ని కృష్ణునిలాగ అలంకరించి సాయం కాలం భవనం ముంగిట తోట లోనికి తీసుకు వచ్చారు. అప్పుడే మహరాజు కూడా వన విహారానికి వచ్చి, మాధవుని ఇంటికి వచ్చారు. మనుమరాలు బుడిబుడి అడుగులతో తాత కెదురేగి స్వాగతం పలికింది.
కాలి మువ్వలు మంజీర నాదాన్ని పలికాయి.
“చిన్ని కృష్ణుడు వచ్చేశాడే నా వద్దకు.” తాత సంబరంగా, మీసాలు దువ్వు కుంటూ దగ్గరగా తీసుకుని ఎత్తుకున్నారు. ఎన్ని రాజ్యాలు జయించినా కలుగని ఆనందం కపిలేంద్ర దేవుని మోమున.
“అవును ప్రభూ! మనందరికీ ఆనందం కలిగిస్తూ వచ్చేశాడు.
“మ. మరియా మంజుల నాదమున్ మురిసెనా మాయిల్లు, ముచ్చట్లతో
మురిపాలన్ మునిగేముగా మిసిమితో మోగేటి మువ్వల్సడిన్
సిరినిం బోలు వరాల పాప తన బోసిన్నవ్వులన్ జల్లగా
హరి రాడా మరి సంబరాల కిపుడే హాయౌ కదా సందడిన్.”
“ఎంత చక్కని పద్యం అల్లావయ్యా. సెభాష్.” మెళ్లో ఉన్నముత్యాల హారం తీసి అల్లుడి మెడలో వేశాడు కపిలేంద్రుడు.
కాదంబరీ దేవి పరుగు పరుగున వచ్చి తండ్రిగారికి పాదాభివందనం చేసింది.
“దీర్ఘాయుష్మాన్ భవ. బాగున్నావా తల్లీ?” ఒకే కోటలో ఉన్నా తండ్రీ కూతుళ్లు కలుసు కోవడం ఎప్పుడో కానీ పడదు.
“బాగా ఉన్నాను తండ్రీ. అంతా మీ ఆదరణ, ఆశీర్వచనముల ప్రభావము.
సీ. అత్తమామలు నన్ను యాదరించుచు నెంతొ
కన్న కూతురివలె కాచు కొనగ
అనురాగ జలధిని యలరించి హర్షమున్
పతియె చెంతనె యుండి పలుకరించ
ముద్దులొలుకు పాప మురిపించి యొడిచేర
మాతృత్వ మధురిమ మనసు నిండ
మా మంచి గృహమిదే మది సంతసమునుంచు
కనరాదు యెందునా కలత యెపుడు
ఆ.వె. చదువులమ్మ యిచట సంగీత సాహిత్య
రూపు దాల్చి నిలిచె యెపుడు తాను
నెమ్మి యిచట సతము కమ్మగా వడ్డించు
వచ్చి పోవు వారి కిచ్చకముగ.”
తియ్యని కంఠస్వరముతో, రాగయుక్తంగా వీనుల విందుగా తన సంసారాన్ని వర్ణించిన ప్రియ పుత్రికని హత్తుకుని, నుదుటి మీద చుంబించి, మెడలోని నవరత్న హారాన్ని కుమార్తెకి అలంకరించాడు మహా రాజు.
“ఇదంతా పతి సాంగత్య మహిమే! అంతియే కాదు.. మీ సోదరుడు పురుషోత్తమ దేవుడు కూడా మంచి కవే. గ్రంధ రచన సాగిస్తున్నాడు సుమా! మాధవ మంత్రి గారికి తెలిసియే యుండును. మనము తెలుగు నాడు నందలి రాజ్యాలనేలుతున్న సమయంలో కమ్మనైన తెలుగులో మీరు కవిత లల్లుతుంటే అవధిలేని ఆనందం కలుగుతోంది మాకు. మా జన్మ సార్ధక మైనట్లే మంత్రీ!”
“మహారాజా! మా గృహం పావనం చేయరా?” కపిలేంద్ర దేవుడు వచ్చిన వార్త విని పరుగున అచ్చటికి వచ్చిన నందుడు అర్ధించాడు.
“మరొక్క మారు తప్పక వచ్చెదము మహా పాత్రా! మిమ్మందరినీ కృష్ణాష్టమి వేడుకలకి మా మందిరాని ఆహ్వానించాలని వచ్చాము.” ఆప్యాయంగా నందుడిని ఆలింగనం చేసుకుని అన్నాడు.
“మీరు రావాలా మహారాజా! ఎవరితో నైనా..”
“ఇది మహారాజు ఆహ్వానం కాదు మిత్రమా! వియ్యాలవారి పిలుపు. మీ కోసం ఎదురు చూస్తుంటాము.” కపిలేంద్రుడు తన మందిరానికి పయనమయ్యాడు.
రాచ మందిరం ముందే.. కృష్ణుని రాసలీల అలంకరణ చేశారు. చిన్నారి కాత్యాయని బొమ్మల దగ్గరగా పరుగెత్తుకుని వెళ్లి అన్నీ సుతారంగా పట్టుకుని ఆనందిస్తోంది.. తన చిరు గజ్జలు సవ్వడి చేస్తుండగా.
మందిర ద్వారం వద్దే ఎదురయ్యాడు.. ఇంకొక చిన్ని కృష్ణుడు.. యువరాజు పురుషోత్తమదేవుని తనయుడు, ప్రతాప రుద్ర దేవుడు. కాత్యాయనికీ ప్రతాపరుద్రునికీ రెండు రోజులే తేడా.
పురుషోత్తమ దేవుడు, పద్మావతి సహితంగా వచ్చాడు. వస్తూనే మంత్రి మాధవుడిని, మనసారా ఆలింగనం చేసుకుని లోపలికి తోడ్కొని వెళ్లాడు.
కాదంబరీ దేవిని, పద్మావతి పలుకరించి ఒక పక్కగా ఆసీనులై ఉన్న అంతఃపుర స్త్రీల దగ్గరికి తీసుకుని వెళ్లింది.
కపిలేంద్ర దేవుని భార్యలు, వారి సంతానం.. అందరూ మహారాజుగారి మందిరానికి వచ్చేశారు.
వారి పద్ధెనిమంది కుమారులు, మనుమలు మనమరాళ్లతో కోలాహలంగా ఉంది.
తన సంతానం ఎవరెవరో రాజుగారికే తెలియడం కష్టం.
ఒక్కొక్కరినే పిలిపించుకుని పరిచయం చేసుకున్నారు.
కృష్ణుని గాధలను మనసారా ఆడారు పాడారు. మనుమలు, మనుమరాళ్లు.. ముప్ఫై సంవత్సరాలనుంచీ పసిపాపల వరకూ ఉన్నారక్కడ. ఒకే కోటలో ఉన్నా కొందరు అదే ప్రధమం తాతగారిని చూడటం.
అందరూ కలిసి కోలాటం ఆడారు.
ఉట్టి మీది కుండని కొట్టి, వెన్నని చిన్ని కృష్ణులు ఆరగించారు.
అలనాడు నందుని ఇంట నున్న సందడి మరలా వచ్చిందేమో అనిపించ సాగింది.
కళింగదేశంలో పూరీ జగన్నాధుని కొలిచే ఆచారం ప్రతీ ఇంటా ఉన్నందువల్ల.. క్రిష్ణాష్టమి భక్తితో జరుపుకుంటారు.
హంవీరదేవుడు, అతని కుమారుడు దక్షిణ కపిలేశ్వరుడు బహు పరాక్రమ వంతులు. ఇరువురూ వచ్చి తండ్రిగారికి నమస్కరించి, తమ నివేదికని అంద జేశారు. కృష్ణా తీర ప్రాంతాలని వారు పాలిస్తున్నారు. ఆ తీరమంతా రెడ్డి రాజులను ఓడించి వారు కైనసం చేసుకున్నదే.
మిగిలిన కుమారులు కూడా తమ ఏలుబడి లో ఉన్న రాజ్యాల స్థితి గతులను వివరించారు.
సింహాసనం ఎక్కిన దాదిగా శత్రువుల నెదుర్కొనడంలో, రాజ్య విస్తరణలో మునిగి తేలుతున్న కపిలేంద్ర దేవుడు సావధానంగా తన కుటుంబంతో గడపడం అరుదుగా జరుగుతుంది.
విందు అనంతరం అందరినీ సమావేశ పరచారు.
నూతన వస్త్రములు, పేరు పేరునా మణి హారాలు బహుకరించారు.
అందరూ ఆనంద సందోహం లో మునిగి తేలుతూ ఉండగా గంభీరమైన కంఠస్వరం వినిపించింది.
“నా తరువాత సింహాసనాన్ని అధిరోహించాలని కుమార పురుషోత్తమ దేవుని కోరుతున్నాను. నా వారసుడు పురుషోత్తముడే.” కపిలేంద్ర దేవుడు ప్రకటించాడు.
చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది.
…………………
38
పురుషోత్తమదేవుని తల్లి మోము పున్నమి చంద్రుని లా వెలిగి పోయింది.
మిగిలిన భార్యలు మ్లాన వదనాలతో లేచి నిలబడ్డారు.
హంవీర దేవుడు, అతని కుమారుడు దక్షిణ కపిలేశ్వరుడు నిశ్శబ్దంగా నిష్క్రమించారు.
రాజ్యం లో ప్రజలందరూ పురుషొత్తమ దేవుని సాక్షాత్తు జగన్నాధుని అవతారంగా
భావించి అతడే తమ భావి చక్రవర్తి అని అనుకుంటున్నా, అతని అన్నదమ్ములకీ
విషయం అవగాహన అవలేదు.
భావించి అతడే తమ భావి చక్రవర్తి అని అనుకుంటున్నా, అతని అన్నదమ్ములకీ
విషయం అవగాహన అవలేదు.
కపిలేంద్ర దేవుని కుమారులందరూ, మహారాజు తో సహా, దండయాత్రలు సాగించడంలో
నిమగ్నమై ఉండగా పురుషోత్తమ దేవుని కళింగ రాజ్యంలోనే ఉంచి, రాజ్యాన్ని
సుభిక్షంగా ఉంచుతూ, ప్రజలు సుఖ శాంతులతో జీవించేలాగ పాలన సాగించేట్లు
చూశాడు కపిలేంద్రుడు.
నిమగ్నమై ఉండగా పురుషోత్తమ దేవుని కళింగ రాజ్యంలోనే ఉంచి, రాజ్యాన్ని
సుభిక్షంగా ఉంచుతూ, ప్రజలు సుఖ శాంతులతో జీవించేలాగ పాలన సాగించేట్లు
చూశాడు కపిలేంద్రుడు.
కపిలేంద్రుని కుమారులు అందరు.. పురుషోత్తముడు తప్ప, కాబోయే చక్రవర్తి
హంవీరదేవుడనే ఆనుకున్నారు.
హంవీరదేవుడనే ఆనుకున్నారు.
రాజ్యం సుస్థిర పడడానికి హంవీరుని పరాక్రమం తోడ్పడిందనడం లో సందేహం
లేదెవరికీ. కానీ.. కుమారులలో కొందరు పురుషోత్తముని కూడా ఆహ్వానిస్తూ..
మహారాజు ప్రకటనకి సంతోషిస్తున్నట్లే కనిపిస్తోంది.
లేదెవరికీ. కానీ.. కుమారులలో కొందరు పురుషోత్తముని కూడా ఆహ్వానిస్తూ..
మహారాజు ప్రకటనకి సంతోషిస్తున్నట్లే కనిపిస్తోంది.
మందిరం బయటికి రాగానే, హంవీరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.
“లోకంలో ఎక్కడైనా ఇంతటి అన్యాయం కనగలమా? పట్టపురాణీ కొడుకుని నేను.
మహరాజు ఆవిడగారిని పెండ్లి కూడా ఆడలేదు. ఆవిడకి పుట్టినవాడు వారసుడా?
కాబోయే చక్రవర్తా? ఈ రాజ్యం నిలవడానికి సరిహద్దుల్లో మనం రణం సలుపుక
పోతే కటకం ఒక్కటే ఉండేది కళింగంలో.” నిప్పులు చెరుగుతూ హంవీరుడు తన
మందిరానికి వెళ్లాడు. అతని వెనుకే అతని పరివారమంతా..
మహరాజు ఆవిడగారిని పెండ్లి కూడా ఆడలేదు. ఆవిడకి పుట్టినవాడు వారసుడా?
కాబోయే చక్రవర్తా? ఈ రాజ్యం నిలవడానికి సరిహద్దుల్లో మనం రణం సలుపుక
పోతే కటకం ఒక్కటే ఉండేది కళింగంలో.” నిప్పులు చెరుగుతూ హంవీరుడు తన
మందిరానికి వెళ్లాడు. అతని వెనుకే అతని పరివారమంతా..
అతని కుమారుడు దక్షిణ కపిలేశ్వరుని దగ్గరగా పిలిచాడు.
“రేపే మనం బయలుదేరుతున్నాం. సూర్యోదయాత్పూర్వమే.. అశ్వశాలకీ,
గజ శాలకీ వెళ్లి ఏర్పాట్లు చేయించు. కొండవీడుకి వెళ్లి, ఆక్కడ ఆలోచన సాగిద్దాం.
జగన్నాధుని అవతారమట.. చూద్దాం!”
గజ శాలకీ వెళ్లి ఏర్పాట్లు చేయించు. కొండవీడుకి వెళ్లి, ఆక్కడ ఆలోచన సాగిద్దాం.
జగన్నాధుని అవతారమట.. చూద్దాం!”
ప్రకటన చేశాడే కానీ కపిలేంద్రుడు, ఆ రాత్రంతా అసహనంగా పచార్లు చేస్తూనే
ఉన్నాడు. మిగిలిన కుమారులు మౌనంగా తన నిర్ణయాన్ని ఆమోదిస్తారని తెలుసు.
హంవీరుడు హర్షించడనీ తెలుసు. కానీ తనకి చెప్పకుండా, వీడ్కోలు లేకుండా,
మందిరం నుండి నిష్క్రమించడం ఆవేదన కలిగిస్తోంది.
ఉన్నాడు. మిగిలిన కుమారులు మౌనంగా తన నిర్ణయాన్ని ఆమోదిస్తారని తెలుసు.
హంవీరుడు హర్షించడనీ తెలుసు. కానీ తనకి చెప్పకుండా, వీడ్కోలు లేకుండా,
మందిరం నుండి నిష్క్రమించడం ఆవేదన కలిగిస్తోంది.
తను చేసిన పని ఎంత వరకు సక్రమమైనది?
తన ప్రియసఖికి ఇచ్చిన మాట నిలుపుకోవడానికేనా పురుషోత్తముని తన
వారసునిగా ఎన్నుకున్నది? అటువంటి ప్రలోభాలకి లొంగుతే తన వివేచనకి
విలువేముంది?
వారసునిగా ఎన్నుకున్నది? అటువంటి ప్రలోభాలకి లొంగుతే తన వివేచనకి
విలువేముంది?
అది మాత్రమే కారణం కానే కాదు.
నిజమే.. హంవీరుడు పరాక్రమవంతుడే. ఎన్నో యుద్ధములలో గెలిచి అవలీలగా
ఆ రాజ్యాలను ఆక్రమించి, సామ్రాజ్య విస్తరణకి తోడ్పడ్డాడు.
ఆ రాజ్యాలను ఆక్రమించి, సామ్రాజ్య విస్తరణకి తోడ్పడ్డాడు.
కానీ ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని ఏలగల సామర్ధ్యం అతనికి ఉందా?
పరిపాలనకి పరాక్రమం ఒకటే సరిపోదు.
సమన్వయం, సరైన సమయంలో తీసుకోవలసిన నిర్ణయం, వివేకం, విచక్షణ, శాంతం..
ఎన్నో లక్షణాలు కావాలి. తళ్ళు సాగిస్తూ, రాజ్యం పెంచుకుంటూ పోతుంటే ప్రజల
కష్ట సుఖాలు చూడగలవారెవరు?
ఎన్నో లక్షణాలు కావాలి. తళ్ళు సాగిస్తూ, రాజ్యం పెంచుకుంటూ పోతుంటే ప్రజల
కష్ట సుఖాలు చూడగలవారెవరు?
పురుషోత్తముడు సౌమ్యుడు. అవసరమైనప్పుడు తన పరాక్రమాన్ని చూపగల ధీరుడు.
అతనికి దైవకృప కూడా ఉందని కాంచీపురం రణంలోనే నిరూపించబడింది.
తన వద్ద పొరపాటున్నపుడు, ఆవేశంతో తప్పు చేయబోయినప్పుడు వెనుకడుగు వేసి,
పెద్దల మాట వినగలవాడని, పద్మావతి పరిణయం సమయాన తెలిసింది.
అతనికి దైవకృప కూడా ఉందని కాంచీపురం రణంలోనే నిరూపించబడింది.
తన వద్ద పొరపాటున్నపుడు, ఆవేశంతో తప్పు చేయబోయినప్పుడు వెనుకడుగు వేసి,
పెద్దల మాట వినగలవాడని, పద్మావతి పరిణయం సమయాన తెలిసింది.
పైగా తనకి తోడు నీడగా మాధవ మంత్రి ఉండనే ఉన్నాడు.
తన నిర్ణయం ముమ్మాటికీ సమంజసమైనదే.
ఆ ఆలోచన వచ్చాక.. తనని తాను సమర్ధించుకున్నాక, ఎప్పుడో అర్ధరాత్రి దాటాక
కాస్త నిద్ర పట్టింది కపిలేంద్ర దేవునికి.
కాస్త నిద్ర పట్టింది కపిలేంద్ర దేవునికి.
“ప్రభూ!” ఎవరో పిలుస్తున్నట్లు లీలగా వినిపిస్తోంది. కలలోనా ఇలలోనా..
కను రెప్పలు తెరిచాడు కపిలేంద్ర దేవుడు. తలంతా భారంగా.. కనురెప్పలు
బరువుగా అనిపించాయి. గవాక్షాలకున్న తెరలు తొలగించారెవరో. సూర్యకిరణాలు
తీక్షణంగా పలుకరించాయి.
బరువుగా అనిపించాయి. గవాక్షాలకున్న తెరలు తొలగించారెవరో. సూర్యకిరణాలు
తీక్షణంగా పలుకరించాయి.
ఎందుకు లేపాలి? కాస్త విశ్రాంతి తీసుకోనియ్యరా? కోపంగా అటూ ఇటూ చూశాడు.
పరిచారకుడు.. చేతులు కట్టుకుని నిలుచున్నాడు, వినయంగా. ప్రభువు ఆగ్రహానికి
గురి కావలెనా అనుకుంటూ..
గురి కావలెనా అనుకుంటూ..
భృకుటి ముడిచి చూశాడు మహారాజు.
“యువరాజు పురుషోత్తమ దేవుడు, మాధవ మంత్రి తమ దర్శనార్ధమై వేచి ఉన్నారు
ప్రభూ.. మూడు ఘడియలు దాటింది.”
ప్రభూ.. మూడు ఘడియలు దాటింది.”
ఇరువురి మిత్రుల, ఇటువంటి ఆగమనం ఇదే ప్రధమం. ఏదో అనూహ్యమైన
విశేషమే జరిగి ఉంటుంది.
విశేషమే జరిగి ఉంటుంది.
మహారాజు త్వరగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని వెలుపలికి వచ్చారు.
పురుషోత్తముడు ఎదురేగి తండ్రిగారిని తోడ్కొని వెళ్ళి ఆసీనులని చేశాడు.
మాధవుడు అభివాదం చేశాడు. అతని కళ్లలో ఏదో వ్యాకులత.
కపిలేంద్రుడు ఇరువురినీ మార్చి మార్చి చూశాడు.. మౌనంగా.
“ప్రభూ! యువరాజు హంవీర దేవుడు, తమ బలగాన్ని తీసుకుని వెడలి పోయారు.
గజములు, అశ్వములు, పదాతి దళం..”
గజములు, అశ్వములు, పదాతి దళం..”
మాధవుడు వర్ణించాడు.. ఏమేమి తీసుకుని వెళ్లారో..
తల పంకించాడు కపిలేంద్రుడు. హంవీరకుమారుని వెంట వెళ్లడం అలవాటే కనుక
మారు మాటాడక తరలి ఉంటారు సేనానులు.
మారు మాటాడక తరలి ఉంటారు సేనానులు.
“ఎటు పక్కగా వెళ్లారో తెలిసిందా?”
“దక్షిణ దిక్కుగా ప్రభూ!”
“కొండవీటి స్థావరానికి వెళ్లి ఉంటారు. ఫరవాలేదు. నేను త్వరలో వెళ్లి
కుమారుని ఊరడించి సర్ది చెప్పి వచ్చెదను. మీరు నిశ్చింతగా ఉండండి.”
“సేనాధిపతి దామెర తిమ్మభూపతి తమ దర్శనార్ధం వచ్చారు ప్రభూ!” కొలువు తీరి
ఉన్న కపిలేంద్రుని వద్దకు వచ్చి చెప్పాడు సేవకుడు.
ఉన్న కపిలేంద్రుని వద్దకు వచ్చి చెప్పాడు సేవకుడు.
హంవీరుడు అలిగి వెళ్లిపోయి పది దినములయింది. సైన్యంలో కొంత భాగమును..
రాత్రికి రాత్రి సేకరించగలిగినంత మందిని తోడ్కొని వెళ్లాడు. కృష్ణాష్టమి సంబరాలలో
ఉన్నారు కనుక ఎక్కువ మందిని.. సేకరించలేక పోయాడు.
రాత్రికి రాత్రి సేకరించగలిగినంత మందిని తోడ్కొని వెళ్లాడు. కృష్ణాష్టమి సంబరాలలో
ఉన్నారు కనుక ఎక్కువ మందిని.. సేకరించలేక పోయాడు.
కపిలేంద్రుడు పెద్ద కుమారుని వద్దకు వెళ్లుటకు సంసిద్ధమవుతున్నాడు.
పురుషోత్తమునికి, కోట పరిరక్షణ బాధ్యత అప్పగించి, సభలో అందరికీ వారి వారి
పనులను నిర్దేశించడానికి సభనేర్పాటు చేశాడు.
పనులను నిర్దేశించడానికి సభనేర్పాటు చేశాడు.
సేనాధిపతుల నందరినీ ఆప్రమత్తులై ఉండాలని ఆదేశమిచ్చాడు.
“తిమ్మనాయకుల వారిని లోనికి తోడ్కొని రండి.” ఆనతిచ్చాడు ప్రభువు.
దామెర తిమ్మనాయకుడు తెలుగు వాడు.
కపిలేంద్ర గజపతికి, హం వీరుని వలెనే యుద్ధములయందు కుడి భుజమై విజయానికి
కారకుడైన వాడు.
కారకుడైన వాడు.
తెనుగు కవులు అతడి మీద చాటువులు కూడా అల్లారు.. అతని పరాక్రమమును
వర్ణిస్తూ..
“ప్రభూ! బహమనీ సుల్తానులను ఓడించడానికిదే మంచి సమయం. అచ్చట కరవు తో
ప్రజలు అల్లల్లాడి పోతున్నారనీ, సైనిక బలం తగ్గిందనీ, బలహీనంగా ఉందనీ వార్తలు
వచ్చాయి. హంవీర కుమారుడు దక్షిణానికి సైన్యాన్ని తీసుకుని వెళ్లినా మన దగ్గర
గజ బలం, అశ్వబలం బాగా ఉంది.”
ప్రజలు అల్లల్లాడి పోతున్నారనీ, సైనిక బలం తగ్గిందనీ, బలహీనంగా ఉందనీ వార్తలు
వచ్చాయి. హంవీర కుమారుడు దక్షిణానికి సైన్యాన్ని తీసుకుని వెళ్లినా మన దగ్గర
గజ బలం, అశ్వబలం బాగా ఉంది.”
కపిలేంద్రుడు నిమేష మాత్రం ఆలోచించాడు.
తిమ్మనాయకుడు ఇంతవరకూ మంచి సలహాలే ఇచ్చాడు.
గోదావరీ, కృష్ణాతీరాలను స్వాధీన పరచుకున్నాము కదా.. త్రిలింగం కూడా మన
ఏలుబడిలోకి రావాలి. అవశ్యం మనం బహమనీ సుల్తానుల మీదికి తళ్లు సాగిద్దాం.
ఈ విషయం ఎక్కడా పొక్కనీయ వద్దు. దక్షిణ దిశకే, తీరానికే వెళ్తున్నామనే చెప్పండి.”
ఏలుబడిలోకి రావాలి. అవశ్యం మనం బహమనీ సుల్తానుల మీదికి తళ్లు సాగిద్దాం.
ఈ విషయం ఎక్కడా పొక్కనీయ వద్దు. దక్షిణ దిశకే, తీరానికే వెళ్తున్నామనే చెప్పండి.”
“మరి.. హంవీర కుమారుడు అలిగి వెళ్లి పోయారు కదా.. ఏ ఉపద్రవం వస్తుందో!
మీరొక్కమారు వెళ్లి వస్తే బాగుంటుందేమో ప్రభూ!” మాధవుడు నెమ్మదిగా అన్నాడు.
మీరొక్కమారు వెళ్లి వస్తే బాగుంటుందేమో ప్రభూ!” మాధవుడు నెమ్మదిగా అన్నాడు.
“ఫరవాలేదు మాధవ మంత్రీ.. ఇంకా చాలా సమయముంది. కుమారుని కూడా
మాకు తోడుగా యుద్ధానికి రమ్మని కబురు చేద్దాము.. మా మాట కాదనరు. .
వాయు వేగంతో వెళ్లగలిగే అశ్వాలని తీసుకుని ఇరువురు చారులను, కుమారునికి
పత్రం రాసి పంపుతాను. బహమనీ సుల్తానుల మదమణచి, మన రాజ్యం స్థాపించాలి
అక్కడ. తిమ్మనాయకుల సలహా తీసుకుందాము.”
మాకు తోడుగా యుద్ధానికి రమ్మని కబురు చేద్దాము.. మా మాట కాదనరు. .
వాయు వేగంతో వెళ్లగలిగే అశ్వాలని తీసుకుని ఇరువురు చారులను, కుమారునికి
పత్రం రాసి పంపుతాను. బహమనీ సుల్తానుల మదమణచి, మన రాజ్యం స్థాపించాలి
అక్కడ. తిమ్మనాయకుల సలహా తీసుకుందాము.”
తండ్రిగారి లేఖనందుకున్న హంవీరుడు తన సైన్యాలని తీసుకుని మధ్య మార్గమున
తండ్రిగారితో చేరాడు.
తండ్రిగారితో చేరాడు.
స్వభావ సిద్ధంగా అతనికి రణమందున్న అభిలాష, సింహాసనం సంగతి
చూసుకోవడాని కింకా సమయముందిలే అన్న ధీమా.. హంవీరుని బహమనీలపై
యుద్ధానికి సన్నద్ధం చేశాయి.
చూసుకోవడాని కింకా సమయముందిలే అన్న ధీమా.. హంవీరుని బహమనీలపై
యుద్ధానికి సన్నద్ధం చేశాయి.
కపిలేంద్రదేవుని సైన్యం వాయవ్య దిశగా సాగింది.
తిమ్మ భూపతి సేకరించిన వార్త నిజమే.. బహమనీ సుల్తాను అహమద్ షా
అస్తవ్యస్త స్థితిలో ఉన్నాడు. తాత ఫిరోజ్ షా వేల సంఖ్యలో హిందువులని
హతమార్చాడు. దాంతో సైనికులు గణనీయంగా తగ్గి పోయారు. దానికి తోడు
కరవు.. ప్రజలు తిండిలేక కొట్టుకుంటున్నారు.
అస్తవ్యస్త స్థితిలో ఉన్నాడు. తాత ఫిరోజ్ షా వేల సంఖ్యలో హిందువులని
హతమార్చాడు. దాంతో సైనికులు గణనీయంగా తగ్గి పోయారు. దానికి తోడు
కరవు.. ప్రజలు తిండిలేక కొట్టుకుంటున్నారు.
అదే సమయంలో రాజధాని గుల్బర్గా నుంచి బీదర్ కు మార్చారు.
బహమనీ సుల్తానుతో స్నేహంగా ఉంటున్న దేవరకొండ రాజు, ఓరుగల్లు వెలమ
దొరలు ఓఢ్ర దేశాధీశునికి సహాయ పడ్డారు.
దొరలు ఓఢ్ర దేశాధీశునికి సహాయ పడ్డారు.
ఇంతటి గందరగోళంలో బహమనీ సుల్తాన్ లొంగిపోయి కప్పం కట్టటానికి
ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్నాడు.
విజయోత్సాహంతో దేవరకొండ, ఓరుగల్లు రాజ్యాలను కూడా కలుపుకుని,
ఓఢ్ర జండా నెగుర వేశాడు కపిలేంద్ర గజపతి.
ఓఢ్ర జండా నెగుర వేశాడు కపిలేంద్ర గజపతి.
విజయాలన్నిటిలో తిమ్మ భూపతి పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.
గజపతులు సంపాదించిన రాజ్యాలన్నింటిలోనూ అతని ప్రాధాన్యతను గుర్తించిన
కవులెవరో చాటువులల్లి, అగ్రహారాలు తాము సంపాదించుకున్నారు.
కవులెవరో చాటువులల్లి, అగ్రహారాలు తాము సంపాదించుకున్నారు.
తిమ్మభూపతిని ప్రస్తుతించినా ఆ చాటువుల్లో గజపతుల తళ్లన్నీ వివరించారు.
* సీ. కటకంబు లోపలి గజవాడ బెజవాడ
యొద్ది బండారల్లు యోరుగల్లు
తోటకూరంగళ్ళు తొండమారయగుళ్ళు
పెరటి బచ్చలితోట బెడదకోట
వీర పుంగవులకు వేటలు మాడెలు
మణికి విహారంబు మాహురంబు
గజయూధముల గట్టు గంబాలు గంబాలు
పట్టణంబు గుర్రాల పల్లె ఢిల్లి
తే.గీ. ఇట్టి గజరాజు శౌర్యంబు లెన్ని చూడ
కొలది మీరిన దేవర కొండ కొండ
నీదు కోర్గంటి సింహంబు నిఖిల బిరుదు
దిశలముల సూపు దామెర తిమ్మ భూప.
*(అజ్ఞాత కవి విరచితము)
ఆ విజయ పరంపర ఒక దశాబ్దం పాటు కొన సాగుతూనే ఉంది.
త్రిలింగదేశం (తెలంగాణ) తరువాత, విజయనగరం నరపతులు కూడా దాసోహ మన్నారు.
కపిలేంద్ర దేవుని ప్రశస్తి ఢిల్లీ వరకూ పాకింది. హంపి (రాయలసీమ), ధారా(కర్ణాటక),
కలుబరుగ (మహారాష్ట్ర), ఢిల్లీ లను వణికించేశారు గజపతులు.
కపిలేంద్ర దేవుని ప్రశస్తి ఢిల్లీ వరకూ పాకింది. హంపి (రాయలసీమ), ధారా(కర్ణాటక),
కలుబరుగ (మహారాష్ట్ర), ఢిల్లీ లను వణికించేశారు గజపతులు.
ఈ విజయాలన్నింటినీ కపిలేశ్వరుని తామ్రశాసనంలో నిక్షిప్త పరచారు పురుషోత్తమ,
మాధవులు.
మాధవులు.
కపిలేశ్వరునికి “నవకోటి కర్ణాటేశ్వరా” అను బిరుదు, “కలుబరుగేశ్వరా”కి కలిసింది.
తన ఘన విజయాలకి కారకుడైన మనుమడు, హంవీరుని కుమారుడు నైన దక్షిణ
కపిలేశ్వర కుమార మహాపాత్రుని, దక్షిణాన జయించిన ప్రాంతాలకి పరీక్షగా నియమించాడు
కపిలేంద్రుడు.
కపిలేశ్వర కుమార మహాపాత్రుని, దక్షిణాన జయించిన ప్రాంతాలకి పరీక్షగా నియమించాడు
కపిలేంద్రుడు.
అప్పటికి హంవీరుడు, దక్షిణ కపిలేశ్వరుడు సంతుష్టి చెందినట్లే..
…………………………
39
కపిలేంద్ర దేవుడి రాజ్యపాలనలో అధిక భాగం రాజ్య విస్తరణ, సరిహద్దుల్లో
శత్రువులని ఆణచడంలో గడిచి పోతోంది.
శత్రువులని ఆణచడంలో గడిచి పోతోంది.
కపిలేంద్ర గజపతి మహారాజు దండయాత్రలు తెరలు తెరలుగా, సముద్రంలో అలలవలే
సాగుతుండడంతో వాటిని గజపతుల తళ్లు అని పిలువ సాగారు. సూర్య వంశీయుడైన
కపిలేంద్రుడు, గజపతిగా పేరు పొందాడు.. గజబలంతో యుద్ధవిజయాలు
దక్కుతుండడంతో. అతని వంశమే గజపతుల వంశంగా పేరు పొందింది.
సాగుతుండడంతో వాటిని గజపతుల తళ్లు అని పిలువ సాగారు. సూర్య వంశీయుడైన
కపిలేంద్రుడు, గజపతిగా పేరు పొందాడు.. గజబలంతో యుద్ధవిజయాలు
దక్కుతుండడంతో. అతని వంశమే గజపతుల వంశంగా పేరు పొందింది.
గజపతుల తళ్ళు సాగినంతకాలం, దేశం యుద్ధవాతావరణం లోనే ఉంది.
ఆలయాలలో అర్చనలు సైతం ఆగిపోయాయి, ప్రజలు అల్లల్లాడి పోయారు.
ఆలయాలలో అర్చనలు సైతం ఆగిపోయాయి, ప్రజలు అల్లల్లాడి పోయారు.
కళింగంలో పురుషోత్తమదేవుడు, మాధవుడు మాత్రం రాజ్యాన్ని ప్రజారంజితంగా
పాలిస్తున్నారు.. అంతః కలహాలు లేనందు వల్ల.
పాలిస్తున్నారు.. అంతః కలహాలు లేనందు వల్ల.
కపిలేంద్ర దేవుడు గంగానది నుంచి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని స్థాపించి
సార్వభౌముడయ్యాడు. “గజపతి గాడేశ్వ నవకోటి కర్ణాట, కలుబరుగేశ్వర”
అను బిరుదులు సంపాదించాడు.
సార్వభౌముడయ్యాడు. “గజపతి గాడేశ్వ నవకోటి కర్ణాట, కలుబరుగేశ్వర”
అను బిరుదులు సంపాదించాడు.
అన్ని దేశాలలోనూ, తగు వారిని పరీక్షలుగా నిలబెట్టి, కటకానికి వచ్చి, సుస్థిర పాలన
కొనసాగిస్తున్నాడు.
కొనసాగిస్తున్నాడు.
కపిలేంద్రుడు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తాడు. అతని పాలనలో పూరి జగన్నాధుని
ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో, భక్త జన సందోహంతో కళకళలాడ సాగింది.
ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో, భక్త జన సందోహంతో కళకళలాడ సాగింది.
జగన్నాధ రథయాత్ర వైభవాన్ని గురించి చెప్పనే అక్కరలేదు. పద్మావతీ,
పురుషోత్తముల వివాహ సందర్భంగా లోక విదితం ఆయింది.
పురుషోత్తముల వివాహ సందర్భంగా లోక విదితం ఆయింది.
కళింగ సామ్రాజ్యం, సంగీత, నాట్య సాహిత్యాలకి కేంద్రంగా విలసిల్లింది.
ఒడిస్సి నాట్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఒడిస్సి నాట్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఉత్తరాన ఢిల్లీ సుల్తానులు, ఈశాన్యాన జానుపూర్ సుల్తాను, దక్షిణాన బహమనీ
సుల్తానుల దండయాత్రలు, మతమార్పిడి బెదిరింపుల మధ్య మహారాజు వైదిక మత
ఉద్ధరణకై కృషి చేస్తున్నాడు.
సుల్తానుల దండయాత్రలు, మతమార్పిడి బెదిరింపుల మధ్య మహారాజు వైదిక మత
ఉద్ధరణకై కృషి చేస్తున్నాడు.
వైష్ణవ మతాచరణ చేస్తున్నప్పటికీ, భువనేశ్వర్‍లో కపిలేశ్వరుని ఆలయం
నిర్మించాడు.
నిర్మించాడు.
శైవులను కూడా సమానంగా గౌరవిస్తున్నాడు.
అంతే కాదు..
సాహిత్య గోష్ఠులను జరుపుతూ కవులకు ప్రోత్సాహం ఇస్తున్నాడు.
ఈ సాహిత్య గోష్ఠులు మాధవుని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.
“మాధవ మంత్రీ! ఈ రోజు మన కవితా గోష్టిలో రెండు విశేషాలున్నాయి.”
కపిలేంద్ర దేవుడు, సభ ప్రారంభిస్తూ అన్నాడు!”
కపిలేంద్ర దేవుడు, సభ ప్రారంభిస్తూ అన్నాడు!”
“అవశ్యం ప్రభూ!” సభ నిర్వహిస్తున్న మాధవుడు మహారాజుకి
అభివాదం చేశాడు.
అభివాదం చేశాడు.
భోజరాజు సభని తలపింప చేస్తున్న గజపతుల సాహిత్య గోష్ఠి
కన్నుల పండువగా, వీనుల విందుగా సాగుతోంది.
కన్నుల పండువగా, వీనుల విందుగా సాగుతోంది.
“మన సభకి సరళ దాసుగారు వస్తున్నారు. వారు మహా భారతం
ఒడియా భాషలో రచించారు. వారిని సత్కరిస్తున్నాము.”
ఒడియా భాషలో రచించారు. వారిని సత్కరిస్తున్నాము.”
“ఇంకోక విశేషమేమి ప్రభూ?”
“నేను ‘పరశురామ విజయం’ అను గ్రంధాన్ని సంస్కృతంలో రాశాను..
ఒక చిన్న ప్రయత్నం చేశాను. అది వారి చేత ఆవిష్కరింప చేద్దామని..”
ఒక చిన్న ప్రయత్నం చేశాను. అది వారి చేత ఆవిష్కరింప చేద్దామని..”
“ప్రభూ! నిజమా? తమరికి సమయం ఉండేదే అతి తక్కువ, ఇన్ని
పోరుల మధ్య ఈ విధమైన సాహిత్య సేవ ఎంతో ఎన్న దగినది
ప్రభూ! చాలా ఆనందంగా ఉంది.” మాధవుడు సంతోషంగా ఏర్పాట్లు
చేయ సాగాడు.
పోరుల మధ్య ఈ విధమైన సాహిత్య సేవ ఎంతో ఎన్న దగినది
ప్రభూ! చాలా ఆనందంగా ఉంది.” మాధవుడు సంతోషంగా ఏర్పాట్లు
చేయ సాగాడు.
“అంతే కాదు మాధవ మంత్రీ.. సరస్వతీ వరప్రసాదులైన మహాకవి
సరళదాసుగారిచే ఆవిష్కరింపబడటం కూడా నా కావ్యానికి దక్కిన అదృష్టం.”
సరళదాసుగారిచే ఆవిష్కరింపబడటం కూడా నా కావ్యానికి దక్కిన అదృష్టం.”
“నిజమే ప్రభూ! దాసుగారు మహాభారతాన్ని ఒడియాలో రాశారని
తెలుసు.. కవిత్రయం తెలుగులోనూ, పంపకవి కన్నడంలోనూ
రాసినట్లుగా.. ఇతిహాసాన్ని రచించారనే కదా సరస్వతీ వరప్రసాది
అంటున్నారు?” మాధవుడు అడిగాడు.
తెలుసు.. కవిత్రయం తెలుగులోనూ, పంపకవి కన్నడంలోనూ
రాసినట్లుగా.. ఇతిహాసాన్ని రచించారనే కదా సరస్వతీ వరప్రసాది
అంటున్నారు?” మాధవుడు అడిగాడు.
“సభికులందరికీ తెలియవలసిన విశేషమొకటి ఉంది, కవీశ్వరుల జీవితంలో.”
“ఏమది ప్రభూ?” సభలోని కవి ఒకరు లేచి అడిగాడు.
“సరళ దాసు కవి, ఒక రైతు బిడ్డడు. ఏ గురువు వద్దా చదువు
నేర్చుకోలేదు. అతడి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధేశ్వర పరిదుడు.
పొలంలో దున్ను కుంటూ., తనకి వచ్చిన గేయాలేవో పాడుకుంటూ
పనులు చేసుకుంటున్నాడు. ఆ పాటలను సరస్వతీ దేవి స్వయంగా
విని, సిద్ధేశ్వరుడికి వరం ఇచ్చింది.. పద్యాలు రాయగల శక్తినిచ్చింది.
కాళిదాసు కవికి కాళికాదేవి ప్రత్యక్షమై ఇచ్చినట్లుగానే. అప్పటి
నుంచీ వారికి కవితాఝరి వరప్రసాద మయింది. యుక్త వయసులో
ఆ మహాకవి మన సైన్యంలో సైనికాధికారిగా కూడా ఉన్నారు.
సరళా దేవి వరప్రసాది కనుకనే అతడిని సరళ దాసు అని
పిలుస్తున్నారు.”
నేర్చుకోలేదు. అతడి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధేశ్వర పరిదుడు.
పొలంలో దున్ను కుంటూ., తనకి వచ్చిన గేయాలేవో పాడుకుంటూ
పనులు చేసుకుంటున్నాడు. ఆ పాటలను సరస్వతీ దేవి స్వయంగా
విని, సిద్ధేశ్వరుడికి వరం ఇచ్చింది.. పద్యాలు రాయగల శక్తినిచ్చింది.
కాళిదాసు కవికి కాళికాదేవి ప్రత్యక్షమై ఇచ్చినట్లుగానే. అప్పటి
నుంచీ వారికి కవితాఝరి వరప్రసాద మయింది. యుక్త వయసులో
ఆ మహాకవి మన సైన్యంలో సైనికాధికారిగా కూడా ఉన్నారు.
సరళా దేవి వరప్రసాది కనుకనే అతడిని సరళ దాసు అని
పిలుస్తున్నారు.”
తన సైన్యంలో పని చేసిన వాడయినా, తక్కువ కులం వాడయినా..
అతడి విద్వత్తును గుర్తించి తగిన గౌరవాన్ని అందిస్తున్నాడు
కపిలేంద్ర దేవుడు.
అతడి విద్వత్తును గుర్తించి తగిన గౌరవాన్ని అందిస్తున్నాడు
కపిలేంద్ర దేవుడు.
సభ లోని వారంతా లేచి నిలబడి, కరతాళ ధ్వనులు చేస్తుండగా
సరళ దాసుని తీసుకుని వచ్చారు ద్వారపాలకులు.
సరళ దాసుని తీసుకుని వచ్చారు ద్వారపాలకులు.
కవిగారికి సముచిత స్థానాన్నిచ్చి, సత్కరించారు మాధవుడు,
యువరాజు పురుషోత్తమ దేవుడు.
యువరాజు పురుషోత్తమ దేవుడు.
సరళ మైన భాషలో గ్రామీణ ప్రజలకి కూడా అర్ధమయేలా సరళ దాసు
కావ్యాలు నడుస్తాయని, సభలోని పండితులు వివరించారు.
కావ్యాలు నడుస్తాయని, సభలోని పండితులు వివరించారు.
కపిలేంద్ర దేవుని కావ్యం, పురుషోత్తమ దేవుని అభినవ గీత గోవిందం
కూడా ఆవిష్కరించి, సాహిత్య సభకి నిండుతనం చేకూర్చాడు,
సరళ దాస కవి.
కూడా ఆవిష్కరించి, సాహిత్య సభకి నిండుతనం చేకూర్చాడు,
సరళ దాస కవి.
సభ లో నర్తకీమణులు వచ్చి ఒడిస్సీ నృత్యంలో సరళదాస
భారతంలోని ఒక ఘట్టాన్ని కన్నుల విందుగా ప్రదర్శించారు.
భారతంలోని ఒక ఘట్టాన్ని కన్నుల విందుగా ప్రదర్శించారు.
సరస్వతీ దేవి అణువణువునా ప్రత్యక్షమయిందక్కడ.
సభ అనంతరం ఆంతరంగికులతో మహారాజు సమావేశమయ్యారు.
మాధవుడు, పురుషోత్తముడు, మహామంత్రి గోవింద మహాపాత్రుడు
దేశ పరిస్థితులను విశ్లేషిస్తున్నారు.
దేశ పరిస్థితులను విశ్లేషిస్తున్నారు.
కం. అంతా బాగేనంటే
వింతే కాదా, రవంత విధి తన యునికిన్
సుంతైనా చూపవలెన్
సంతాపము నొసగ తాను జవముగ రాగా.
“ప్రభూ! కృష్ణా తీరం నుంచి వేగులు వచ్చారు. మిమ్ములను
అత్యవసరంగా కలువవలెనట.”
అత్యవసరంగా కలువవలెనట.”
అనుమతి తీసుకుని సమావేశంలో ఉన్న కపిలేంద్రుని వద్దకు
వచ్చారు ద్వార పాలకులు.
వచ్చారు ద్వార పాలకులు.
“ప్రభూ! హంవీర కుమారులు తిరుగుబాటుకి ప్రణాలికలు వేస్తున్నారని
నమ్మకంగా తెలిసింది. వారి కుమారుడు దక్షిణ కపిలేశ్వరునితో కలిసి
కృష్ణా తీరాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించబోతారుట.” వేగులు
భయపడుతూనే చెప్పారు. మహారాజు గారికి కుమారులాయె మరి.
కోపం వస్తే.. కొరడా దెబ్బలే.
నమ్మకంగా తెలిసింది. వారి కుమారుడు దక్షిణ కపిలేశ్వరునితో కలిసి
కృష్ణా తీరాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించబోతారుట.” వేగులు
భయపడుతూనే చెప్పారు. మహారాజు గారికి కుమారులాయె మరి.
కోపం వస్తే.. కొరడా దెబ్బలే.
ఉలిక్కిపడి చూశారు పురుషోత్తమ మాధవులు.
కపిలేంద్ర దేవుడు మౌనంగా ఆలోచిస్తూ ఉండి పోయాడు.
ఎప్పుడో ఈ విధంగా జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాడు.
కానీ ఇంత త్వరితంగా అనుకోలేదు. కనీసం కొన్ని సంవత్సరాలైనా
జీవితంలో ప్రశాంతంగా గడప వచ్చని అనుకున్నాడు.
కానీ ఇంత త్వరితంగా అనుకోలేదు. కనీసం కొన్ని సంవత్సరాలైనా
జీవితంలో ప్రశాంతంగా గడప వచ్చని అనుకున్నాడు.
“సమయానికి వచ్చి హెచ్చరికలు చేసినందుకు ధన్యవాదాలు.”
వేగులని పంపి వేశాడు.
వేగులని పంపి వేశాడు.
“ప్రభూ! ఏమి చేయ దలచుకున్నారు?” మాధవుడు సన్నగా
అడిగాడు.
అడిగాడు.
ఒక్క సారిగా వయోవృద్ధుడై పోయినట్లు, నీరసంగా నిస్సహాయంగా
చూశాడు మహారాజు. “ఏదోఒకటి చేయవలెను మంత్రీ.. అదే ఆలోచిస్తున్నా.”
చూశాడు మహారాజు. “ఏదోఒకటి చేయవలెను మంత్రీ.. అదే ఆలోచిస్తున్నా.”
“ఏదయినా ఇంక యుద్ధము వలదు మహారాజా! తమరు నిరంతర
రణములతో డస్సి పోయి యున్నారు. సామరస్యమున పరిష్కారం
ఆలోచించండి ప్రభూ! అన్నదమ్ముల మధ్య ఆ ముష్కురుల వలే
మనం కూడనూ..” ఆపేశాడు మాధవుడు.
రణములతో డస్సి పోయి యున్నారు. సామరస్యమున పరిష్కారం
ఆలోచించండి ప్రభూ! అన్నదమ్ముల మధ్య ఆ ముష్కురుల వలే
మనం కూడనూ..” ఆపేశాడు మాధవుడు.
అంతటి మహరాజుకి తాను సలహా ఇవ్వటమా!
ఒక నిశ్చయమునకు వచ్చి, సింహాసనము మీదినుంచి లేచాడు
కపిలేంద్రుడు.
కపిలేంద్రుడు.
“పురోహితుల వారికి కబురు చెయ్యండి. అత్యవసరంగా మమ్మల్ని
కలవమని.” తన మందిరానికి వెళ్లి పోయాడు. మరొక్క మాట చెప్పకుండా.
కలవమని.” తన మందిరానికి వెళ్లి పోయాడు. మరొక్క మాట చెప్పకుండా.
కపిలేంద్ర దేవుడు, పురుషోత్తముని తల్లి, పార్వతీ దేవి మందిరంలో
సమావేశమయ్యాడు.
సమావేశమయ్యాడు.
“అతి త్వరలో పురుషోత్తమునికి రాజ్యం అప్పగించి కృష్ణాతీరానికి
పయనమవుతాను. అచ్చట హంవీర రాకుమారునితో అన్ని విషయాలూ
విశదంగా చర్చించి వచ్చెదను.”
పయనమవుతాను. అచ్చట హంవీర రాకుమారునితో అన్ని విషయాలూ
విశదంగా చర్చించి వచ్చెదను.”
పార్వతీ దేవి చిరకాల వాంచ నెరవేర బోతోంది. ఆవిడ సంతోషానికి
అవధు ల్లేవు.
అవధు ల్లేవు.
“అన్ని విద్యలయందు నిష్ణాతుడు, స్థిర చిత్తుడు, తొందరపాటు లేని
వాడు, కవి, పండితుడు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకునేవాడు
అయిన పురుషోత్తముడే ఓఢ్ర చక్రవర్తి.”
వాడు, కవి, పండితుడు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకునేవాడు
అయిన పురుషోత్తముడే ఓఢ్ర చక్రవర్తి.”
“ప్రభూ! ఈ వయసులో మీరు ప్రయాణం చెయ్యడం అంత అవసరమా?
హంవీర రాకుమారుడు ఇచ్చటకి రానున్నారు కదా! అప్పుడు
విడమరచి చెప్ప వచ్చునేమో ఆలోచించండి.” మాధవుడు
అనునయించ బోయాడు.
హంవీర రాకుమారుడు ఇచ్చటకి రానున్నారు కదా! అప్పుడు
విడమరచి చెప్ప వచ్చునేమో ఆలోచించండి.” మాధవుడు
అనునయించ బోయాడు.
“అంత వ్యవధిలేదు మాధవా! పురుషోత్తమ చక్రవర్తికి మీరే అండగా
ఉండాలి. భవిష్యత్తు ఊహాతీతమే. నేను చెయ్యగలిగినది చేస్తాను.
ఏది ఏమయినా, నా తరువాత పురుషోత్తముడే రాజ్యపాలన
సాగించవలె. ఆ పిదప, ప్రతాపరుద్రుడు చక్రవర్తి కావాలి. అదే నా
కోరిక. అందుకే ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను.”
పురోహితుని పట్టాభిషేకానికి ప్రయత్నాలు చెయ్యమని చెప్పి,
కపిలేంద్రుడు నిష్క్రమించాడు.
ఉండాలి. భవిష్యత్తు ఊహాతీతమే. నేను చెయ్యగలిగినది చేస్తాను.
ఏది ఏమయినా, నా తరువాత పురుషోత్తముడే రాజ్యపాలన
సాగించవలె. ఆ పిదప, ప్రతాపరుద్రుడు చక్రవర్తి కావాలి. అదే నా
కోరిక. అందుకే ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను.”
పురోహితుని పట్టాభిషేకానికి ప్రయత్నాలు చెయ్యమని చెప్పి,
కపిలేంద్రుడు నిష్క్రమించాడు.
పురుషోత్తముడు మౌనంగా ఉండిపోయాడు.
మాధవునికి మనసంతా గుబులుగానే ఉంది.
తురగవల్గన రగడః-
అన్నదమ్ము లైన కాని అవని కొరకు పోరు టేను
అన్నదమ్ము లైన కాని అవని కొరకు పోరు టేను
చిన్న సరుదు బాటు కూడ సేయ వలను కాద యేని
ఎన్న యమాయకులు జనులు ఎప్పటికిని వగచగాను
పన్నుగాను యోచనంత బాగ సేయ లేక గాని
ఇలను యిందుకేన సృష్టి ఇంత చేసె దైవమదే
కలగ మారి కరిగి పోగ కనుల ముందు సర్వమదే
అలసి సొలసి ఉస్సు రనుచు యంత రొష్టు పడను కదే
కలసి మెలసి కలత లేక గడప రాద రోజులదే!
మాధవుడు చింతిస్తూ ఇంటికి సాగాడు.
సరిగ్గా వారం నాటికి పురుషోత్తముడిని రాజును చేసి కపిలేంద్ర
దేవుడు కృష్ణా
తీరానికి తరలి వెళ్లాడు, తగినంత సైనిక బలంతో.
దేవుడు కృష్ణా
తీరానికి తరలి వెళ్లాడు, తగినంత సైనిక బలంతో.
………………….
40
కపిలేంద్రుడు రధము మీద పయనమవుతున్నంత సేపూ ఆలోచిస్తూనే
ఉన్నాడు. అంతవరకూ ఎన్నో యుద్ధములకు ఉత్సాహంగా వెళ్లాడు.
కానీ ఇంతటి నిర్వేదం ఎన్నడూ కలగలేదు.
కం. అరివీర భయంకరుడై
యరుల గడగడమనిపించ యల్పమయిననూ
సరమమెరుగని కపిలుడే
కొరగానక చనగనేమి కుందుని మహిమన్.
మహారాజు గారి నిరుత్సాహం చూసి, సేనలు కూడా నెమ్మదిగా
నడుస్తున్నాయి.
తన సువిశాల సామ్రాజ్యం లోంచి వెళ్తుంటే కపిలేంద్ర దేవుని
హృదయం అంత వ్యాకులిత స్థితిలోనూ ఉప్పొంగుతోంది.
కనులారా కాంచుతూ ముందుకు సాగుతున్నాడు.
ఒక్కొక్క దేశం వెనక్కి వెళ్తుంటే, ఆ దేశాన్ని స్వాధీనం
చేసుకోవడానికి ఎంత సమరం జరిపాడో, ఎందరు ప్రాణాలు
కోల్పోయారో.. ఎంత మంది గాయపడ్డారో గుర్తుకొచ్చింది.
అదంతా అవసరమా? తన రాజ్య పరి రక్షణకై చేశాడంటే
అర్ధం ఉంది. దండయాత్రలు చేసి, ఇతర రాజ్యాలను
ఆక్రమించుకోవడం అక్రమం కాదా?
కానే కాదు.. అశ్వమేధయాగం పేరుతో దండయాత్రలు చేసి
రాజ్యాలను కలుపుకోవడం పురాణ కాలం నుంచీ ఉంది. తను చేసింది
తప్పే కాదు.
మరి ఇప్పుడెందుకీ ఆందోళన?
అంతే మరి తన దాకా వస్తే కానీ తెలియదు.
ఇప్పుడు తన కుటుంబంలోనే చిచ్చు రగులుతోంది.
పురుషోత్తముడిని రాజును చెయ్యడం అనుచితమేమో! కానీ..
అతడే సరైన వారసుడని తన అంతరాత్మ చెప్తోంది. ఏమైతే
అది అవనీ. అంతా విధి లిఖితం.
విధి.. కపిలేంద్ర దేవుడు భయపడినట్లే రాసి నట్లుంది.
“స్వాగతం తండ్రీ! మీ రాకతో మా గృహం పావన మయింది.”
హంవీరుడు స్వాగతం పలికాడు కృష్ణాతీరాన కొండపల్లి వద్ద.
అలిగి వచ్చేసినా, తండ్రికి బహమనీ సుల్తానుల దాడిని తిప్పి
కొట్టడంలో సహాయ పడ్డాడు హంవీరుడు. ఆ సమరం సమసిన
వెంటనే కృష్ణా తీరానికి వచ్చేశాడు.
వచ్చేసినవాడు వెంటనే తన భవిష్యత్ ప్రణాలికలు
వేసుకుంటున్నాడు.
మహారాజు రాక మునుపే, పురుషోత్తమునికి జరిగిన పట్టాభిషేకం
గురించి విన్నాడు. విని కూడా, చలించక తండ్రికి స్వాగతం పలికాడు.
హంవీరుని చూడగానే ఒక్క సారి పుత్రప్రేమ పెల్లుబికింది
కపిలేంద్రునిలో. తప్పుచేశానా అనుకున్నాడు. కానీ.. హంవీరునిలో
ఉన్న ఆవేశం పరిపాలనకి సహకరించదని సర్ది చెప్పుకున్నాడు.
హంవీరుని సరసన కూర్చుండ బెట్టుకుని, సంగతులన్నీ
వివరించాడు. సామ్రాజ్య పరిరక్షణ చేయగల నైపుణ్యం హంవీర
రాకుమారుని కున్నదనీ, పరిపాలనా సామర్ధ్యం పురుషోత్తమున
కున్నదనీ, సంయమనంతో అన్నదమ్ములందరూ గజపతుల
వంశ ప్రతిష్ఠ నిలపాలనీ.. కొన్ని తరాలు తమ వంశీయులు
ఏలికలై చరిత్ర కెక్కాలని కోరాడు.
“తప్పక చేసెదము తండ్రీ! మీరు భోజనం చేసి విశ్రాంతి
తీసుకోండి.” కపిలేంద్రుని అతిథి మందిరానికి పంపి, తాను
ఆంతరంగికులతో సమావేశ మయ్యాడు.
“సీ. భగ్గుమనే హృది భగభగ మండగా
బలమునంతయును సేకరణ సేయ
గడగడ మనుచును హడలుచు నిలచిరి
హంవీర మంత్రాంగ యంత్ర మంత
జనకుడయిన నేమి జతనము లేకనే
న్యాయము సేయక నడచునాడు
భువనమందంతయు భోగ భాగ్యము లేక
భయభ్రాంతులన్ నిండి భంగపడదె
ఆ.వె. చూచి గమ్మునుండ శోటీర్యమే లేద
చేవ లేక నేను చితికి చితికి
హీను డనయి బతుకు యీడ్వ లేను నిజము
తళ్లు జరిపి గెలువ తరుణ మిదియె.”
హంవీరుని ఆగ్రహానికి సభాస్థలి వణికినట్లయి పోయింది.
“బహమనీ సుల్తానుల, దేవగిరి రాజులు సహకారం తీసుకుని
మనం కటకం మీదికి దండెత్తుదాము. ఆ కపట సోదరుని గద్దె
దించే వరకూ నాకు విశ్రాంతి లేదు.”
“వారు మన చేతిలో ఓటమి చెందిన వారు ప్రభూ!” సైన్యాధిపతి
అన్నాడు.
“అందుకే. మన మాట వింటారు. పత్రాలు వ్రాయించండి. చారులను
పంపుదాము. అంతే కాదు, గాంగేయుల సంతతి, వారి బంధువులు
ఎచటనైన నున్న వారిని కూడ వెతకండి. శతృవులనందరినీ
సమ కూర్చి నలువైపులా దండెత్తుదాము.” హంవీరుడు మరిన్ని
కీలక నిర్ణయాలను తీసుకుని, తన మందిరానికి వెళ్లి పోయాడు.
సమావేశ నిర్ణయాలు వేగుల ద్వారా విన్న కపిలేంద్రుడు
విలవిల లాడుతూ అప స్మారకం లోనికి వెళ్లి, నాలుగు రోజుల
అనంతరం మరణించాడు.
గంగా తీరం నుండి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని విస్తరించిన
గజపతి సామ్రాజ్య ఆది పురుషుడు నేల కూలాడు. ఎంత వారయినా
చేర వలసినది నేల మీదికే.
సీ. మణుల హారములన్ని మాలలుగ మెడలో
మాణిక్య మకుటముల్ మస్తకమున
చీనాంబరములెన్నొ చెలువము ధరియించి
దర్పమునొలికిస్తు తరల నెపుడు
పంచభక్ష్య ములన్ని ప్రతిరోజు భక్షించి
తేనుపు లెన్నియో తేర్చగాను
మందిరము లనెంతొ సుందరముగ కట్టి
ఆడంబరమునందు నధివసించి
ఆ.వె. రాచరికపు హొయలు రవళింప నంతనూ
ఎదురు లేదు యనుచు ఎన్నటికిని
మదిని తలచి యెంత మదియించి యున్ననూ
యవని యొడికె చేర యదియె విధిగ.
హుటాహుటీ వార్త కటకానికి చేరవేశారు హంవీర, దక్షిణ
కపిలేంద్రులు. అన్నదమ్ములందరికీ, పరీక్షలుగా ఉన్న వారి
సామంత రాజ్యాలకి కబురందించారు.
పురుషోత్తమునికి వార్త చేరే సరికి వారం గడిచి పోయింది.
ఇప్పుడు వెళ్లినా లాభం ఉండదు. మహానది తీరమునకు తల్లితో
సహా వెళ్లి కర్మ కాండలు చేశాడు.
కటకానికి తిరిగి వచ్చిన మరునాడు..
తెలతెల వారుతుండగా, మాధవుడు పరుగున వచ్చాడు, తటాకం
వద్ద అర్ఘ్యమిడుస్తున్న పురుషోత్తముని వద్దకు.
“వేగులు వార్త తెచ్చారు మహరాజా! హంవీరుడు, రాజులందరినీ
కూడగట్టుకుని దండెత్తి వస్తున్నాడట. కృష్ణా, గోదావరీ, నాగావళీ
తీరాలన్నీ పర రాజుల పాలు చేసి. కళింగ సింహాసనమాక్రమించడమే
అతడి ధ్యేయమట.”
పురుషోత్తముడు, ఒడ్డునకు వచ్చి, పొడి వస్త్రములు ధరించి, చెట్టు
నీడను గట్టు మీద కూర్చున్నాడు.
“సమయం లేదు మహారాజా! వారందరూ వస్తే ప్రాణాలకే ప్రమాదం.
మనం తప్పించుకోవడమే సమంజసం. నమ్మకమైన వారిని తీసుకుని
మనం పక్క దారులవెంట దక్షిణ దిశగా వెళ్దాం. అక్కడ మనకి
మిత్రులున్నారు కృష్ణా తీరాన.” మాధవుడు ఆందోళనగా రెట్టించాడు.
“అంతేనా మాధవా?”
“అవును మహారాజా! జగన్నాధ బలభద్రులు ఆదుకుంటే గెలవ
గలమేమో కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మందిరాలన్నీ ఖాళీ
చేసి, వెళ్లి పోదాం. అనువు గాని చోట ఆధిపత్యం పనికి రాదు. మనకు
ప్రజల అండ ఉంది. సైన్యాలను సమకూర్చుకుని, తిరిగి వచ్చి,
సింహాసనం చేజిక్కించుకుందాం. కపిలేంద్ర దేవుల వారి ఆశ నెర
వేరుద్దాం.”
“దారిలో ఎదురు పడితే..” పురుషోత్తమునికి హంవీరుని శక్తి బాగుగా
తెలుసు.
“చాలా ప్రదేశాలలో రహస్య మార్గాలు చేయించాను. అక్కడక్కడ
ఎవరైనా ఎదురైనా మనం ఎదుర్కోవచ్చును. వారికి మన పయనం
ఊహాతీతమే కదా? హంవీర కుమారుడు, తనయునితో కలిసి ఉత్తర
దిక్కున విడిది చేశారు. విష్ణు కుండినులు, శిలా వంశీయులు, మత్సర
వంశీయులందరినీ కూడగట్టి తిరుగు బాటు చెయ్యాలని ప్రణాలిక
వేస్తున్నారు. అందుకని దక్షిణ దిక్కున వారి నుంచి మనకు భయం
లేదు. ఇంకెవరైనా దాడి చేసినా మన సైన్యం సామర్ధ్యం
తక్కువేమీ కాదు.”
“సరే.. అదే విధంగా చేద్దాము. అనుకూల పరిస్థితులు ఆసన్న
మయే వరకూ అజ్ఞాత వాసం చేద్దాము.” పురుషోత్తముడు లేచాడు.
“పారిపోవడం పిరికి వారి లక్షణమే.. అయిననూ సముద్రంలో అలల
వలే, వెనక్కి తగ్గుట విజృంభించుటకే మహారాజా! మనం మళ్లీ తళ్లు
కొనసాగించి సింహాసనం దక్కించు కుందాము.” వ్యాకులిత
మనస్కుడైన పురుషోత్తమునికి ధైర్యం చెప్పాడు మాధవుడు.
అనుకున్నట్లుగానే, మార్గ మధ్యమున శతృదాడి తప్పలేదు.
సుశిక్షితులైన సైనికుల సహాయంతో, దాడిని తిప్పి కొట్టి తాము
అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు, పురుషోత్తమ మాధవులు భార్యా
బిడ్డలతో, బంధుమిత్ర సపరివారంగా.
హంవీరుడు అడ్డులేకుండా, కళింగ సింపాసనాన్ని ఆక్రమించి, నిరాటంకంగా
రాజ్యపాలన సాగిస్తున్నాడు.
కానీ.. ప్రజలు సంతృప్తిగా కాలం గడపటం లేదు. మహారాజు దృష్టి
అంతా రాజ్యాన్ని రక్షించుకోవడం తో, విస్తరించు కోవడం తోనే గడిచి
పోతోంది.
కపిలేంద్ర వర్మ దండయాత్రలకు వెళ్లినప్పుడు, పురుషోత్తముడు
ప్రజాపాలన చేసే వాడు. ఇప్పుడు మొత్తం మంత్రుల ఆధీనంలో
సాగుతోంది.
ఒకరి మాట మీద ఒకరికి గౌరవం లేదు. ఒకరు చెప్పినది ఇంకొకరు
కాదంటారు. రాజులేని రాజ్యంలాగ.
కపిలేంద్రుడు సమరాలు తగ్గించి, పాలన మీద దృష్టి పెట్టిన
రోజుల్లోనే, కృష్ణా తీరంలో కొండల వెనుక ఒక పట్టణాన్ని మాధవుడు
ముందుచూపుతో కట్టించి, జనావాస కేంద్రం కింద చేశాడు.
దక్షిణాన ఉన్న గజపతుల రాజ్యాలన్నింటికీ మధ్యలో.. అది
కొండవీడా, రాయల రాజ్యమా, గుంటూరా అనే సందిగ్ధంలో ఉండే
ప్రాంతం. అన్ని సదుపాయాలతో రాచ మందిరం దగ్గరనుంచీ
కట్టించి ఉంచాడు.
కపిలేంద్ర గజపతి కొండపల్లి, కొండవీడు మొదలైన కృష్ణా తీర
ప్రాంతాలన్నీ ఆక్రమించినప్పటి నుంచే ఆ ప్రయత్నం మొదలు పెట్టాడు,
భవిష్యత్తుని ఊహించి.
హంవీరుని ఏలుబడి కిందనే ఉన్ననూ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందని
ప్రాంతంగా ఉండి పోయింది.
దక్షిణాన ఉన్న రాజ్యాలన్నింటినీ సామంతరాజుల, పరీక్షల
పర్యవేక్షణకి పూర్తిగా వదిలెయ్యడంతో అంతా అస్తవ్యస్తంగా
అయిపోయింది.
ప్రజలవద్ద నుండి సుంకాలు వసూలు చెయ్యడంలో నున్న శ్రద్ధ,
పాడిపంటల అభివృద్ధిలో కనబర్చుటలేదెవ్వరూ. అతివృష్టి
అనావృష్టిలతో అల్లకల్లోలం అయిపోతున్నారు ప్రజలంతా.
అరాచకం ప్రబలిపోతోంది.
పురుషోత్తముడు ఒక పద్ధతిలో తన సైన్యాన్ని అభివృద్ధి
చేస్తున్నాడు. యువకులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరుతున్నారు.
నెమ్మదిగా కోరుకొండ వరకూ పురుషోత్తముడే రాజు కావాలని ప్రజ
అనుకునేట్లు ప్రచారం సాగిస్తున్నాడు. అధిక సుంకాల బారి నుంచి
అతడే తమని కాపాడుతాడని అందరూ భావించేలాగ జనంలో
ప్రాచుర్యం తీసుకొచ్చాడు.
తాము ఏలవలసినది ఏదీ లేకపోవడంతో పూర్తిగా సంచారము
మీదనే దృష్టి కేంద్రీకరించి అశ్వ, గజ, సైన్య సమీకరణలో ప్రతీ క్షణం
గడుపుతున్నారు పురుషోత్తమ మాధవులు. కలిసి కొన్ని సార్లు,
విడి విడిగా ఇరు దిక్కులా కొన్ని సార్లు.
అటువంటి యాత్రలోనే, కొంత సైన్యంతో కృష్ణా తీరంలోని ఒక పట్టణ
వీధుల్లో మాధవుని కంట పడింది.. ఒక హృదయ విదారకమైన దృశ్యం.
ఆ ప్రాంతం ఆ సమయంలో ఎవరి అధికారంలో ఉందో అయోమయమే!
బహమనీ సుల్తానులయి ఉండవచ్చు. కళింగాన్ని ఆక్రమించుకోవాలనే
తపనలో మిగిలిన ప్రాంతాలని స్థానిక ఏలుబడులకి వదిలేశాడు
హంవీరుడు.
………………………….
41
పాలకులు ఎవరైనా సుంకాలు మాత్రం క్రమం తప్పకుండా
వసూలు చెయ్యడంలో నిష్ణాతులయ్యారు.
అది, కృష్ణా తీర ప్రాంతాలలోని బొడ్డుపల్లి గ్రామం.
మాధవుడు కొద్దిపాటి సైన్యంతో దక్షిణ దిశగా వెళ్తున్నాడు,
సైన్యాన్ని వృద్ధి చెయ్యడానికి. నల్లమల అడవుల్లో గజాలు
సమృద్ధిగా ఉన్న వార్త తెలిసింది. ఆ ఏనుగులని మచ్చిక
చేసుకుని, గజ బలగం పెంపొందించటం కూడా అతని ముఖ్యోద్దేశం..
ఇంక హంవీరునితో సమరానికి సర్వ సన్నద్ధమయినట్లే. కపిలేంద్ర
దేవుడు స్వర్గానికేగి నాలుగు సంవత్సరాలు దాటింది.
గ్రామంలోని ప్రధాన రహదారిలో కనిపించిందా దృశ్యం.
ఒక వృద్ధుని కాళ్లకీ, చేతులకీ సంకెళ్లు వేశారు. భుజాల మీద
ఊరి వాకిట్లో వేళాడవలసిన నల్ల ఇనుపగుండు ఎక్కించారు. చేతిలో
వెదురు కర్ర. మెడలో పల్లేరు పూల దండ వేళాడుతోంది.
ఎండ మండిపోతోంది. వృద్ధుని వెనుక నున్న సైనికులిరువురు,
కర్కశంగా అదిలిస్తున్నారు.
కాళ్లకున్న సంకెళ్లు నడకని నిరోధిస్తుంటే, మెళ్లోని బొగడదండ
గుచ్చుకుంటుంటే, భుజాల మీద బరువుతో నడుం వంగిపోయి,
మండుటెండలో చెమటలు కక్కుతూ ఆ వృద్ధుడు నడుస్తున్నాడు.
నోటినున్న పళ్లు ఊడినా, స్పష్టత చెడని పలుకులతో,
కంచుకంఠంతో పద్యం రాగయుక్తంగా చదువుతున్నాడు.
*సీ. “కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా
పురవీధి నెదురెండ బొగడ దండ
ఆంధ్ర నైషధ కర్త యంఘ్రియుగ్మంబున
దగిలి యుండెను కదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
వియ్యమొందెను కదా వెదురుగొడియ
సార్వభౌముని భుజస్కంధ మెక్కెను గదా
నగరి వాకిటనుండు నల్లగుండు
తే.గీ. కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షలు దినిపోయె దిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతుడంకంబు లేడు నూర్లు?”
(* శ్రీనాధ మహాకవి విరచితము..)
హృదయం కదిలించేలాఉందా పద్యం. తన నిస్సహాయ స్థితిని
చెప్తూనే, తనెవరో, తన గొప్పదనమేంటో తెలియజేస్తోంది.
మాధవుడు అశ్వం దిగి, పరుగున వృద్ధుని ముందుకు వెళ్లాడు.
తను భయపడినట్లే అయింది.
అతడు కవి సార్వభౌముడు శ్రీనాధుడే.
సీ. పండువెన్నెల లోన మెండైన భామినీ
నాట్యాల కనిన శ్రీ నాధు డతడె
మండుటెండ నిలిచి మలమల మాడుతూ
చెమటను కన్నీట చేర్చి నిలిచె
పటిక బెల్లము వంటి పలుకుల నొసగిన
కవిసార్వ భౌముని కంఠ మదియె
బొగడ పూదండయే బిగిసి పట్టుకొనగ
కంబుక మదియేను కంది పోయె
ఆ.వె. నల్ల గుండు బరువు నడుమును వంచగా
చరణములు తడబడె సంకెల పడి
తెనుఁగు సాహిత్యమును తేరుపై నెక్కించి
వెలిగి నతడె నొరిగె వెతను నేడు.
అయ్యయ్యో.. ఎం కష్ట మొచ్చింది?
మాధవుడు మారు ఆలోచించలేదు. సైనికులకు సైగ చేసి
నల్లగుండు దింపి, బొగడ దండని తెంపి వేశాడు. కాళ్లకున్న
సంకెలలను తెంచి వేశాడు.
శ్రీనాధులవారు వణికి పోతున్నారు. తొంభై సంవత్సరాల
వృద్ధుడనైనా కనికరం లేక ఇంతటి దారుణ మైన శిక్ష వేయడానికి
ఏం చేశారు? ఏం జరిగింది?
ఆ శిక్షను అమలు జరుపుతున్న వారు పరుగున వచ్చారు.
“సామీ! మీరిలా చేస్తే మాకు పడతాయి శిచ్చలు. మేం రాజాజ్ఞ
పాటిస్తన్నాం.”
“ఎందుకింత కఠినంగా చేస్తున్నారు?” తన దగ్గరున్న రాజముద్రికని
చూపిస్తూ ఆడిగాడు.
“ప్రభూ! సామి వారు ఏడునూర్ల టంకాలు సుంకం చెల్లించాలి.
వారి దగ్గర రొక్కం లేదు. ఏ శిచ్చయినా ఏసుకోండన్నారు. అందుకని
సైన్యాధికారి ఈ శిక్ష ఏశారు. ఇప్పుడు మీరు ఇడిపించి తీసికెల్తే
మమ్మల్ని కొరతేస్తారు.”
“సరే! నేను చెల్లిస్తాలే సుంకం. జమ చేసుకోండి.”
“గురువుగారూ! ఏమిటీ ఘోరం? తమరు ఈ స్థితిలో.. సాక్షాత్
సరస్వతీ స్వరూపులే..”
శ్రీనాధుడు చూసిన చూపుకి మాధవుని గుండె కదిలి బైటికి
వచ్చినంత పనయింది. మాధవుడు తన ఇంటికి తీసుకుని వెళ్లాడు
మహాకవిని.
“ఎవరు నాయనా నువ్వు?”
మాధవుడు తానెవరో.. ఇది వరకు తాము కలిసిన వైనం
చెప్పుకొచ్చాడు.
“జ్ఞాపకం రావట్లేదు నాయనా! నేల తల్లిని నమ్ముకుంటే నాలుగు
వేళ్లూ నోట్లో కెళ్తాయని, భూమి కౌలుకు తీసుకుని, వ్యవసాయం
మొదలు పెట్టాను.. అవపాన దశలో. సాహిత్యాన్ని, కవిత్వాన్నీ
ఆదరించే వారే కరవైపోయారు. నన్నాదరించిన వీరారెడ్డి, మైలార ప్రభువు,
రాయలు, విస్సన్న మంత్రి.. అందరూ స్వర్గస్థులయ్యారు.
* సీ. కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
తే.గీ. భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.
(* శ్రీనాధ మహాకవి విరచితము.)
అంతే నాయనా! ఎన్ని భోగములనుభవించాను. చివరికి ఈ స్థితిలో..
ఎక్కడో, ఎవరి వద్దో.. ఈ విధంగా” శ్రీనాధుడు రొప్పుతూ ఆపేశాడు.
“గురువుగారూ! నావంటి అభిమానులింకా ఉన్నారు. మిమ్మల్ని
కళ్లలో పెట్టి చూసుకుంటాను. నా వద్దనే ఉండండి. మీకు ఏలోటు
రానియ్యను. మీరు పరమ శివుని భక్తులు. మీకు నేను చెప్పగల
వాడను కాను. అంతా ఆ చిదానంద స్వరూపమే కదా! ఆదిశంకరులు
తమ నిర్వాణషట్కంలో సెలవిచ్చినదదే కదా!
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం
సీ. పుణ్యమనేది నెపుడు నాకు లేదుగ
పాపమనేది నా వద్ద లేదు
సుఖ దుఃఖములనేను చొరగొననెపుడును
మంత్ర తీర్ధము లను మాట లేదు
వేదము యనగనే పేర్మియు కనరాదు
యజ్ఞ యాగములును యవియు లేవు
అనుభవమ్మన నాకు అసలు తెలియదుగ
అనుభవించే వాడ నైన కాదు
తే.గీ. నే చిదానంద రూపుడ నే శివోహ
మంటు మనన సేయవలెను మనసు దీర
నిత్యము నిరతము నెపుడు సత్యముగనె
సాధన శివోహమనెపుడు స్మరణ సేయి!
ఆ పరమాత్ముని ధ్యానంలో సమయం గడపండి. మిమ్మల్ని
సేవించుకునే భాగ్యం కలిగినందుకు నేను ధన్యుడను.”
ఎన్నెన్నో భోగాలననుభవించి నింగినేలు దివాకరుని ప్రకాశముతో
జీవితం గడిపిన కవిసార్వభౌముడు, చివరి రోజులలో పడరాని
కష్టాలు పడి, పరమశివుని ధ్యానంలో తనువు విడిచాడు.
శ్రీనాధులవారిని మరల కలుసుకోవాలని ఎంతగానో ఆశపడ్డ
మాధవునికి చివరి చూపు దక్కింది.
ఒకరకంగా మాధవుని ఆశ నెరవేరింది.
శ్రీనాధ మహాకవి కూడా మండుటెండలో రహదారి నడుమ,
దిక్కులేని వాని వలె, కాకుండా, నీడ పట్టున పరమేశ్వరుని
ధ్యానిస్తూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు.
తెలుగు సాహిత్యాకాశం లోని ఒక ధృవతార, నింగికెగసింది
నిశ్సబ్దంగా.
పురుషోత్తమ దేవుడు, మాధవుడు తమ బలాన్ని పెంపొందించుకుని
ఎట్టకేలకు, హంవీరుని జయించి, కళింగ సింహాసనాన్ని ఆక్రమించాడు.
కళింగ సింహాసనం కోసం రాజ్యాన్ని ఛిన్నా భిన్నం చేసినందుకు,
హంవీరుడు ఓడిపోక తప్పలేదు.కటకం కోటలో ఆనందోత్సాహాలు
వెల్లి విరిశాయి.
కళింగ ప్రజలు మంచిరోజుల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు.
వారి కోరిక ప్రకారమే, రాజ్యం సుభిక్షంగా తయారయింది.
ప్రతాపరుద్ర గజపతికి యువరాజుగా పట్టాభిషేకం జరిపారు.
కపిలేంద్రుని కోరిక నెరవేరినట్లే.
మాధవుడు మంత్రిగా, ఆంత రంగికునిగా మహరాజు వెనువెంట
ఉండి పరిపాలన ప్రజారంజకంగా ఉండేటట్లు తన వంతు
సహకారాన్ని అందించారు.
హంవీరుడు, కుమారునితో కలిసి కిమిడి సంస్థానాన్ని పాలిస్తూ
ఉండిపోయాడు.
పురుషోత్తమదేవుని పరిపాలనలో, సాహిత్యం, సంగీతం అభివృద్ధి
చెందాయి బాగా.
గజపతుల యుగంలో పురుషోత్తమదేవుడు ఏలిన కాలం అత్యున్నతమైనది
అని చెప్పవచ్చు.
మాధవుడు తానెవరో ఎవరికీ తెలియకుండా, అజ్ఞాత కులశీలుని
లాగానే, నంద పుత్రుని వలే, మహారాజుకి ఆప్త మిత్రుని వలే ఉండిపోయాడు.
*---------------------------*
సమాప్తం.
1 వ్యాఖ్యలు:
అద్భుతంగా ఉంది భానుమతి గారూ..ఎన్నాళ్ళో అయింది ఇంత మంచి సాహిత్యం చదివి. చారిత్రాత్మకమైన ధారావాహికం ఎప్పుడో చదువుకున్న రోజుల్లో చదివాను. పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి. ఇంతకన్నా చెప్పడానికి మీలా కవియిత్రిని కాను. మీలాంటి ప్రతిభావంతులు నా స్నేహితులవడం నిజంగా అదృష్టం. తదుపరి రచన కోసం ఎదురు చూస్తున్నాను.
Post a Comment