Tuesday, December 28, 2010

ఆహ్లాదంగా ఆనందంగా సుందర వనంలోరచయిత్రులు..

Posted by Mantha Bhanumathi on Tuesday, December 28, 2010 with 3 comments




అబ్బో! ఎప్పట్నుంచో అనుకుంటున్నాం వనభోజనానికి వెళ్దామని. కార్తీక మాసం వానలతో వరదలతో అలా గడిచిపోయింది. "ఆలస్యం అయినా ఫర్లేదు.. అసలు మానద్దు" అనే సామెతలాగా (మీరు ఊహించినట్లు ఇది ఇంగ్లీష్ నుంచి కాపి కొట్టిందే). మొన్న ఆదివారం ప్రగతి రిజార్ట్స్ కి వెళ్లాలని అనుకున్నాం. ఇరవై రెండు మంది అనుకున్నది పన్నెండు మంది వచ్చారు.

పొద్దున్నే తొమ్మిదికి బయలుదేరాలని.. కొంచెం అటు ఇటుగా అరగంట లేటుగా బయల్దేరారు త్యాగరాయ గానసభ దగ్గిర పొత్తూరి విజయలక్ష్మిగారి ఆధ్వర్యంలో, వాసా ప్రభావతి, ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, గంటి భానుమతి, శ్రీవల్లి రాధిక, ఉంగుటూరి శ్రీలక్ష్మి బస్ ఎక్కారు. మధ్యలో జెయన్టియు దగ్గిర నేను, శాంతసుందరి, వారణాసి నాగలక్ష్మి, సోమరాజు సుశీల, తురగా జానకీరాణి ఎక్కాము.

"ఆకలేస్తే ఎవర్ని అడగాలి" శ్రీవల్లి రాధిక సందేహం. "బస్సేక్కించే వరకే నేను.. ఆ తరువాత అంతా మంథాదే బాధ్యతా." పొత్తూరి నొక్కి చెప్పేశారు. "అసలు మీకు ఆ సమస్యే ఉండదు. డొక్కా సీతమ్మగారి వారసులం మేము" అంటూ అందరికి చాక్లెట్లు పంచాను.


"ఇంకా రాదేవిటి.." అంటూ ఎవరో దీర్ఘాలు "అదిగో అల్లదిగో.. " అంటూ నేను చెప్పిన అరగంటకి, పదకొండున్నరకి ప్రగతికి చేరాం.

అక్కడ ఆహ్వానించడానికి రామకృష్ణగారు (ప్రగతిలో ఒక డైరెక్టర్), ఉన్నారు. వెళ్తూనే చల్లని పానీయం ఇచ్చి పావుగంటలో అల్పాహారం ఇస్తాం.. ఈలోగా కొంత వ్యాహ్యాళి చెయ్యండి అన్నారు. అలాగే కమ్మని సాండ్విచ్ లు, ఫ్రెంచ్ ఫ్రైలు, కాఫీ ఇచ్చారు. మేము కొంచెం ఆయాసం తీర్చుకుంటూ ఉండగానే ప్రగతి చైర్మన్ రావుగారు, భార్య, ఇంకొక డైరెక్టర్ రజని, కొంతమంది స్టాఫ్ శ్రీనివాస్, ప్రవీణ్ వచ్చారు. రావుగారు గంటన్నరసేపు ఆయుర్వేదా మొక్కలు, వృక్షాలు.. వాటి పెంపకాలు.. ప్రగతి ఆశయాలు, వృద్ధాశ్రమాలు.. వంటివి అన్నీ వివరిస్తూనే ఉన్నారు.. భోజనం తయార్ అన్నారు.


రావుగారు వెళ్ళగానే (వినీ వినీ.. గంటన్నర క్రితం తిన్నవే అరిగిపోయాయి.) పళ్ళాలు తీసేసుకున్నాం. నేను రెండు పదార్ధాలలో అల్లం-వెల్లుల్లి, ఉల్లి వాడద్దంటే అన్నింటిలోను మానేసి.. (మరీ వాటి ధరలెలా ఉన్నాయ్? ఆనందంగా మానేసారు) జైన్ వంటకాలు చేసారు. చెప్పద్దు.. చాలా బాగున్నాయి.. సాత్వికాహారం. పైగా మాలో నాగలక్ష్మి, శ్రీవల్లి రాధిక తప్ప అందరం బామ్మలం/అమ్మమ్మలం . హాయిగా ఉంది.


ఒక గంటసేపు సాహిత్య చర్చలు అయ్యాక.. (అవేమిటో అడగద్దు.. వంటలు గుర్తున్నట్లుగా సాహిత్యం గుర్తుండదు, అదేమిటో! కొంచం అందర్నీ అడిగి మళ్లీ రాస్తాను. ) మళ్లీ వనంలో విహారం. అందరు తెగ మెచ్చుకున్నారు.. వనాన్ని , నన్ను కూడా.. నేనే లెండి అక్కడికి వెళ్దామని ఏర్పాట్లు చేసింది. చెట్లు ఉన్నాయా.. ఒక్క దోమ కానీ, ఈగ కానీ నుసాము కానీ లేవు. అంతా మెడిసినల్ వృక్షాల ప్రభావంట.


మళ్లీ బగ్గిలు(చిన్న బాటరీ కార్లు) బస్సు ఎక్కి, నర్సరికి వెళ్ళాం. అక్కడ బస్సు దిగుతూనే అందరం ఆనంద పడిపోయాం. ప్రతి చెట్టునుంచి సువాసన.. నిమ్మగడ్డి, సబ్జా, పుదినా తులసి, కర్పూర తులసి, కృష్ణ తులసి.. ఏదో లోకం లోకి వెళ్ళిపోయాం.. ఆ వాసనలు పీల్చి, ఇంకోసారి రావుగారి వెంచర్ అంతా చూసి, అక్కడే నివాసముంటున్నసోమరాజు సుశీల గారికి స్నేహితులు, మధుసూదనరావుగారి ఇంటికి వెళ్ళాం. అదొక పెద్ద విల్లా.. ఒక మినీ ప్రగతిలా ఉంది. చూడగానే అక్కడ ఇళ్ళు కట్టేసుకుందామని ఆవేశం వచ్చేసింది.


కమ్మని కబుర్లు అయ్యాక నవగ్రహవనం చేరాం. అక్కడే మాకు కుర్చీలు ఏర్పాటు చేసారు. నవగ్రహాలకి ఇష్టులైన వ్రుక్షాలున్నాయి. వాటికింద, మళ్లీ బోండాలు , మిరపకాయ బజ్జీలు తిని, కాఫీ, హెర్బల్ టి తాగి బస్సు దగ్గరికి వచ్చాం. మరీ అతిథులకి పళ్ళు ఇవ్వాలికదా వీడ్కోలుతో.. అందరికి అప్పుడే తోటలోంచి కోసిన జామకాయలు, కృష్ణతులసి మొక్కలు ఇచ్చారు రజనిగారు.

అంత తిరిగినా అస్సలు అలిసిపోకుండా ఇళ్ళకి చేరాం. కాకపొతే పాటలు పాడుకోలేకపోయాం.. ఇంద్రగంటి, శీలా గార్లు అద్భుతంగా పాడతారు. వచ్చేసారికి అవి..

3 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి said...

భానుమతిగారు,చక్కగా వుంది మీ వివరణాత్మకమైన వ్యాసం.నేను ప్రగతి రిసార్ట్స్ చూసాననుకోండి.కాని మీ ద్వారా మరోమారు జ్ఞాపకాలను తడిమి సంబరపరచింది.

గీతిక బి said...

చాలా బాగుంది మీ మాటల్లో మీ విహార యాత్ర...

Unknown said...

chala bagundhi