శ్రీమతి_పద్మాదాశరథి_స్మారక_ద్వితీయ_నవలల_పోటీ లో ప్రథమ బహుమతి పొందిన నవల.
“అనుబంధం”
మంథా భానుమతి
ఎపిసోడ్- 1
(హామీ- ఈ రచన నా స్వీయ సృజన. ఇంతకు ముందు ఏ మాధ్యమంలోనూ ప్రచురితం కాలేదు)
బంధం
“సత్యా! లే లే! ఇప్పపూలేరటానికి అడవి లోనికి వస్తానని లేపమన్నావు కదా! మన వాళ్లందరూ తయారై బయల్దేర బోతున్నారు.” మనవరాలు నిద్రపోతున్న మంచం దగ్గరకు వెళ్లి నులకమంచం కుదిపింది గౌరమ్మ.
గౌరమ్మ స్నానం చేసేసి, ఎర్రంచు పచ్చ చీర కాళ్లలో అడ్డం పడకుండా మడమల పైకి కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ, మూడు సంచుల్లోకి కావలసినవన్నీ సర్ది పెట్టింది... కాళ్లకున్న కడియాలు, గొలుసులు చప్పుడు చేస్తున్నాయి. మణికట్టు నుంచీ దాదాపు మోచేతులవరకూ ఉన్న గాజులు కూడా లయ తప్పకుండా గలగల మంటున్నాయి.
మట్టెల బరువుకి కాలి వేళ్లు కాస్త వంగిపోయాయి. మెడలో నల్ల పూసల దండ, దాని కింద బరువైన సూత్రం గొలుసు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నుదుటి మీద గుండ్రని కుంకుమ బొట్టు మెరుస్తోంది.
ఇంటి చుట్టూ ఉన్న చెట్ల మీద రకరకాల పక్షులు రెక్కలు విదిలిస్తూ, సప్త స్వరాల్లోనూ వీనుల విందుగా కూతలు పెడుతూ వాటి పిల్లల్ని లేపుతున్నాయి, తాము ఆహార సేకరణకి వెళ్లాలని చెప్తున్నట్లుగా!
అమ్మమ్మ కేకలకి ఒక్క ఉదుట్న లేచింది సత్య. రెండు అంగల్లో తలుపు తీసి పెరట్లోకి వెళ్లి, గూట్లో డబ్బాలో ఉన్న పళ్లపొడి తీసుకుని గోలెం దగ్గరకి నడచింది. గోలెం నిండా నీళ్లు నింపి ఉన్నాయి.
మంచు తెరల్లోంచి ఆకాశం, మధ్య మధ్యలో ఎర్రగా కనిపిస్తోంది, రాబోతున్న సూరీడుకి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలుకుతున్నట్లుగా! చీకటి తొలగి పోతుండగా, అక్కడక్కడ నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నాయి. తల పైకెత్తి ఆకాశం కేసి చూసింది సత్య.
హాయిగా, గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, సంభ్రమంగా చుట్టూ చూసింది. చల్లని గాలి ఆహ్లాదపరుస్తూ, మంచు పొగని తొలగిస్తూ ఉంటే, కొంచెం దూరంలో చిన్న లోయ, వెనుక కొండ… కొండమీద పచ్చని చెట్లు తలలూపుతూ మబ్బుల్ని అందుకోవటానికి ప్రయత్నిస్తూ… కాసేపు అలా నిలబడిపోయింది సత్య. కాళ్లు కదలనంటున్నాయి. ఈ క్షణం శాశ్వతం అయిపోతే ఎంత బాగుంటుంది… ఇట్టాంటి ప్రకృతి తల్లి ఒడిలో పుట్టడానికి ఎంత పుణ్యం చేసుకున్నానో, ఎన్ని జన్మల బంధమో అనుకుంది.
“ఎంత సేపు… తొందరగా వచ్చెయ్యాలి సత్యా! మనం ఎనక పడిపోతాం.” గౌరమ్మ మళ్లీ గట్టిగా కేక పెట్టింది.
“వచ్చేస్తున్నా! ఎదురుగా లేత వెలుగులో కనిపిస్తున్న కొండ నుంచి ఒక క్రమంలో దిగుతున్నట్లుగా… తీరుగా ఉన్న పోడూ పంటలని చూస్తూ, గోలెం లో నుంచి చెంబుతో నీళ్ళు తీసుకుని గబగబా మొహం కడుక్కుని, స్నానాల గదిలోకి వెళ్లి, తీరుగా చక్కగా తయారై వచ్చింది సత్య.
“నడు నడు…” మనవరాలిని మురిపెంగా చూసుకుంటూ తలుపుకి తాళం వేసి ముందుకు నడిచింది గౌరమ్మ.
“అమ్మమ్మా! తాత ఎప్పుడు వస్తారు?”
“ఈ దినమే రావాలి… వెళ్లిన పనై పోతే! పట్నంలో పని ఒక పట్టున అవుతుందా? అందులో, మన పల్లెలకు మంచి రోడ్లు వేయించమని, మన భూములని… ఎవరూ ఆక్రమించకుండా చూడాలని అర్జీ పెట్టారు. అదేం చిన్నా చితకా పనా… పెద్ద పెద్దోళ్లని కలవాల, అవుసరమైన సమాచారం అందియ్యాల…”
“ఏం సమాచారం అమ్మమ్మా?”
“అదే… రోడ్లు వెయ్యాలంటే మాటలా? ఇటూ అటూ ఉన్న స్థలాల్లో ఏవి ప్రభుత్వం వాళ్లవో, ఏవి మనోళ్లవో… అట్టాంటి విశేషాలే…”
“అంటే రోడ్లు పక్కనున్న చెట్లన్నీ కొట్టేస్తారా?” భయంగా అడిగింది సత్య.
“మరి తప్పదు కదా ఈ సందుల్లో, రాళ్లు రప్పల్లో ఎన్నాళ్లు తిరుగుతాం…”
“ఏదో ఉపాయం చూడాలి అమ్మమ్మా… చెట్లు కొట్టటానికి నేనైతే ఒప్పుకోను. వన సంరక్షణ సంఘంలో చేరాను. అడవిలో పుట్టినందుకు ఆ మాత్రం చొరవ తీసుకోకపోతే ఎలాగ?”
అమ్మమ్మతో మాట్లాడుతూనే కుర్తీ సరి చేసుకుని, చున్నీ చెవుల చుట్టూ తిప్పి భుజాల మీద నుంచి దింపి ముడి వేసింది. బళ్లో పరుగు పందాల్లో వేసుకునే షూస్ వేసుకుని, నాలుగు అంగల్లో అమ్మమ్మని దాటేసింది.
“మరి… ఏం చేస్తావు పిల్లాా? మనవేం చెయ్యగలం? అరకులో అయితే పట్నం వోళ్లు వచ్చి స్థలాలు కొనేసుకుంటున్నారట. ఊళ్లు బాగా మారిపోయాయి.”
“చూద్దాం. మన గూడేల్లోకి రానియ్యకూడదు.”
“నడువమంటే పరుగందుకున్నావే! కాస్త జోరు తగ్గించు. ఒక్కదానివే అలా పోతే ఏ జంతువో ఎదురు పడుతుందీ అడివిలో. నన్ను చూసుకుంటూ నడవాలి.” హెచ్చరించింది గౌరమ్మ, మనవరాలు అక్కడే పుట్టి, తన దగ్గరే పెరిగిందని మర్చి పోతుంటుంది.
“అల్లగే అమ్మమ్మా ఈ సన్నటి దార్లో, గుట్టల్లో పరుగేంటి? ఈ చెట్లు, లోయ, కొండలూ చూస్తుంటే ఆగలేక పోతున్నా… ఎంత బాగుందో! మంచు తెర కప్పుకున్న చెట్లు… ఎంత చూసినా తనివి తీరదు.”
సత్య చుట్టుపక్కల అంతా పరికిస్తూ, చెవుల్ని కప్పేలా చున్నీ తల పైకి లాక్కుంది… కొద్దిగా వణుకుతూ!
“చలేస్తోందా? మాకైతే మామూలే కానీ, మీరు తట్టుకోలేరు. ఊలు చొక్కా ఏసుకుని రావలసిందే పిల్లా.” సత్యని గాభరాగా చూస్తూ అంది గౌరమ్మ. ‘ఉన్న నాల్గు రోజులూ జాగ్రత్తగా చూసుకోవాలి’ అనుకుంటూ…
“కాసేపు నడుస్తే చలి పోతుందిలే. బెంగ పడమాకు.” కొంచెం పెద్దగా ఉన్న గులకరాళ్లు పక్కకి తన్నుకుంటూ నడవ సాగింది సత్య.
“ఎదర చాలా పనుంది… ఎగరకు. ఆయాస మొస్తుంది! అలసి పోతావు. మామూలుగా నడు.” కుడి చేతిలో ఉన్న బరువు సంచీలు ఎడం చేతికి మార్చుకుంటూ అంది గౌరమ్మ.
“అయ్యో… బాక్ పాక్ తేవలసింది. వీపుకి కట్టుకుంటే బరువనిపించదు. వెనక్కి వెళ్లి తేనా?” అమ్మమ్మ చేతిలోంచి సంచీ అందుకుంటూ అంది సత్య.
“వద్దులే… ఇప్పటికే ఆలీసమై పోయింది. కాసేపు నువ్వు, కాసేపు నేను మోసుకొద్దాం. ఆకలైతే తింటానికి కాసిని పళ్లు, చెక్కలు, నీళ్లు తెచ్చాను. పద పద…”
…………..
తూరుపు కనుమల్లోని అరకులోయలో ఉత్తర ప్రాంతంలో ఉన్న కొండజాతి వాళ్ల ఊరు, ‘కొండపాలెం’. చుట్టూ దట్టమైన అడవి. గుట్టలూ, లోయలూ రకరకాల చెట్లతో నిండి పోయి కాకులు దూరలేని కారడవిలాగ ఉంది. ఎటుపక్కకెళ్లినా ఐదారు కిలో మీటర్లు నడిస్తే తప్ప ఇంకో బోయపల్లె కనిపించదు. ఆ ఊర్లోనే, చుట్టు ప్రక్కల గ్రామాలు ఐదింటిని కలుపుతూ పంచాయితీ కేంద్రం ఉంది. పేరుకు పంచాయితీ కానీ, అది చేసిన పెద్ద పనులేమీ కనిపించలేదు సత్యకి.
మూడు వీధుల ఊరు. చిన్న చిన్నవైనా చాలా వరకూ కాంక్రీటు ఇళ్లే. పైన రేకులతో కప్పి ఉన్నాయి. అక్కడక్కడ తాటాకు ఇళ్లు కూడా ఉన్నాయి. ప్రతీ ఇంటికీ వెనుక కాస్త పెరడు, మొక్కలు ఉన్నాయి. ఇంటి ముందు చిన్న వరండా… ఇంటి బయట చిన్న అరుగులు... అరుగుల మీద రకరకాల గింజలు ఆరబెట్టి ఉన్నాయి.
సత్య పట్నం లో ఆడపిల్లల హాస్టల్ లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటరు నుంచీ హాస్టల్లోనే… గిరిజన సంక్షేమ హాస్టల్. అంతా ఫ్రీనే.
పదో తరగతి వరకు అమ్మమ్మ దగ్గరే ఉండి చదివింది. ఇంటర్లో చదువు, పరీక్షలు అంటూ రాలేక పోయింది. సత్య వాళ్ల నాన్న రామయ్య సాలూరు మున్సిపాలిటీ ఆఫీస్ లో అటెండరు. పదో తరగతి పాసవలేకపోయాడు. రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం వచ్చింది.
గౌరమ్మ, అల్లుడు గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని పల్లెలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. గౌరమ్మ పెనిమిటి అప్పలసామి, ఆ ఊరి పెద్ద... అందరికీ చిన్న చిన్న అవసరాలు అవీ తీరుస్తుంటాడు. పంచాయితీ కమిటీ మెంబరు. చదువు అయిదో క్లాసు వరకు అయినా జీవితాన్ని బాగా చదివిన వాడు. రోజూ రేడియో వింటూ రాజకీయ పరిణామాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఊర్లో ఉన్న బళ్లో వయోజన విద్యా కార్యక్రమం పెట్టించి, ముందుగా తనే చేరి, పరీక్షలకి కట్టకపోయినా, పేపరు చదివి అర్ధం చేసుకునే వరకూ తెలుగు నేర్చుకున్నాడు. పల్లెలో ఇళ్లలో ఒరియా మాట్లాడినా, అందరూ కలిసినప్పుడు తెలుగే మాట్లాడాలని నియమం పెట్టాడు.
అందుకే కొండపాలెం కాస్త నాగరికత నేర్చుకుంది.
“ప్రపంచకంతో మనవూ నడవాల్రా! మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం… తెలుగు రాదంటే ఎలా?” ప్రతీ నెలా మొదటి ఆదివారం పాలెంలో అందరినీ పంచాయితీ ఆఫీసు దగ్గర చేర్చి మాట్లాడిస్తూ ఉంటాడు. పిల్లల చేత ఆటలు ఆడిస్తూ పోటీలు పెట్టిస్తూ ఉంటాడు. అందరూ అప్పన్నని, పెద్దాయన అంటూ గౌరవిస్తుంటారు.
కూతురు గురించి బెంగ లేదు… అల్లుడికి మంచి ఉద్యోగం. భార్యా పిల్లల్ని బాగా చూసుకుంటాడు. సత్య తరువాత ఒక అబ్బాయి. పదో క్లాసు చదువుతున్నాడు.
గౌరమ్మ కూడా ఊర్లో అందరితో కలివిడిగా ఉంటుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా పెద్దాయన, పెద్దమ్మ దగ్గరకు వస్తారు.
…………
“ఇంకా ఎంత దూరం అమ్మమ్మా? సత్యకి పొద్దున్నే టీ తాగటం అలవాటు హాస్టల్లో… ఆ సంగతి గౌరమ్మ మరచిపోయింది.
“వచ్చేశాం. పది అడుగులు… టీ తాగలేదు కదా! నీరసంగా ఉందా? ఆ సంగతే మర్చిపోయాను తల్లీ! ఇంట్లో పొడి కూడా ఉంది.”
“ఫర్లేదమ్మమ్మా. ఇంటికెళ్లాక తాగుతాలే.” అమ్మమ్మ భుజం మీద చేతులు వేసి ఊరడించింది సత్య.
పదడుగులంది కానీ వంద అడుగులైనా ఏమీ మార్పు లేదు. అవే కొండలు… అదే లోయ. ఆకాశాన్నంటే అవే చెట్లు.
‘అమ్మమ్మకి ఎంత దూరమైనా పదడుగులే’ అనుకుంది.
అంతలో… మూడు పక్కల్నుంచీ పదిమంది ఆడవాళ్లు, పది మంది పిల్లలు వచ్చి కలిశారు. రకరకాల వయసుల వాళ్లు. అందరూ హూషారుగా ఉన్నారు.
చీర కట్టు కోయజాతి దైనా, అందరూ రవికలు తొడుక్కున్నారు. చూసి నేర్చుకున్నది కొంత అయితే… ‘నాంది’ వంటి సహకార, సేవా సంస్థల స్త్రీలు వచ్చి నేర్పించిన నాగరికత ప్రభావం కొంత. అందులో అప్పన్న, గౌరమ్మల ప్రోత్సాహం చాలా ఉంది.
అందరికీ భాషలో కూడా మార్పు వచ్చింది.
సందడి మొదలైంది. పరుగులు… ఒకరినొకరు పట్టుకునే ఆటలు. ఇద్దరు తాడు తెచ్చుకుని తల మీద నుంచి, కాళ్ల కింది నుంచి తిప్పుతూ గెంతు తున్నారు.
“బలే… స్కిప్పింగ్. నాకొకసారి తాడివ్వవా? నీ పేరేంటి?” సత్య ఒక పిల్లని అడిగింది.
“తీసుకో అక్కా! నా పేరు ముత్యాలు. నేను మూడో తరగతి చదువుతున్నా. మా ఊర్లోనే… మా బళ్లో ఐదో తరగతి వరకూ ఉంది.” వెయ్య బోయే ప్రశ్నలకి కూడా, కళ్లు పెద్దవి చేసి అటూ ఇటూ తిప్పుతూ సమాధానం చెప్పేసింది ముత్యాలు.
తమ గుంపులోకి పట్నం పిల్ల వచ్చి చేరిందంటే అబ్బురమే మరి. పైగా మంచి చుడిదార్ వేసుకుంది.
“కానీ… ఇది స్కూల్లో చేరినప్పుడు వాణిశ్రీ అని పేరు మార్చుకుందక్కా!” ఇంకో పిల్ల వచ్చి రహస్యం బైట పెట్టేసింది.
“అదేంటీ? ఎందుకూ…”
“అవునక్కా… నాకు సినిమా యాక్టరు వాణిశ్రీ, మా పరికిణీ లాంటిది కట్టుకుని చేసిన డాన్సులంటే ఇష్టం.” ముత్యాలు కొంచెం సిగ్గు పడుతూ చెప్పింది.
సత్య తాడు ఎగరేసి గెంతుతూ, పకపకా నవ్వింది. కల్లా కపటం లేని అమాయకత్వం.
“సినిమాలు చూస్తారా మీరు? నాకు ఎక్కడా సినిమా హాల్ కనిపించలేదే? మండలం ఆఫీస్ ఉన్న ఊర్లో తప్ప…” సత్య ఉన్నప్పుడు సినిమా చూడాలంటే టౌనుకెళ్లాల్సిందే.
“టౌనులో హాలు వాళ్లే, డేరా కట్టి మూడు నాలుగు రోజులు వరుసగా మూడు సినిమాలు వేస్తారక్కా. ఎప్పుడన్నా అమ్మా, నాయన టౌనుకి తీసికెళ్తే మాత్రం తప్పకుండా సినిమా చూసేత్తాం. ఇంట్లో ఫైటింగ్ చేసేసి.” చేతులు తిప్పేస్తూ ముత్యాలు ఉత్సాహంగా అంది.
“అబ్బో… ఇంగ్లీషు మాటలు ఈజీగా వాడేస్తున్నారే?” సత్య ఆశ్చర్యంగా చూసింది.
“స్కూల్లో నేర్పిస్తున్నారక్కా. టివి లో కూడా తెలుగులో ఇంగ్లీసు బాగా కలిపేస్తారు కదా! ఇప్పుడు మేం కూడా కొన్ని తెలుగు మాటలు మర్చే పోయాం. ఇంక మన కోయ భాష ఐతే అపురూపం అయిపోయింది. ఎవరూ మాట్లాడరు. ఇంట్లో పెద్దవాళ్లు తప్ప.”
“మనం కొండ దాటేశామక్కా… పెద్ద పెద్ద చెట్లున్న అడవి లోకి వచ్చేశాం. ఇక్కడే మనం పూలు కలెక్ట్ చెయ్యాలి. నా పేరు వరం. నేను ఐదు చదువుతున్నా.” కొంచెం పొడవుగా ఉన్న పిల్ల సత్య పక్కకి వచ్చి గెంతుతూ చెప్పింది.
సత్య అక్కడ ఉన్నప్పుడు పూలు సేకరించడానికి వెళ్లే వారు కాదు గౌరమ్మ వాళ్లు. తరువాత తోచక తను కూడా మొదలు పెట్టింది. పైగా సత్య చదువు మీదే ఎక్కువ దృష్టి పెట్టేది.
ఒక్కసారిగా చల్లటి గాలి వీచింది. సత్య ఎదురుగా ఉన్న చెట్లు జలజలా పూలు రాల్చాయి. ముందుగా వచ్చిన వాళ్లు చెట్ల కింద తుడిచి శుభ్రం చేసినట్లున్నారు. అక్కడంతా చక్కని పరిమళం పరచుకుంది. అదంతా మాహువా పూల మహత్యం అనుకుంది సత్య... ఇప్ప పూలని మాహువా అని కూడా అంటారు చాలా చోట్ల.
ముఖ్యంగా మధ్య భారతంలో… తెలంగాణా అడవుల్లో, ఛత్తీస్ గడ్, నల్లమలై అరణ్యాలలో ఎక్కువగా వస్తాయి ఇప్పచెట్లు. ఉత్తర అరకు లోయలో చాలా తక్కువగా, ఒకటి రెండు ప్రదేశాల్లో తప్ప ఇప్పపూల, ఇప్ప కాయల దిగుబడి లేదు. కొండపాలెం దగ్గర మాత్రం బాగా వస్తాయి.
ఒక్కసారి పిల్లలందరూ సైగ చేసుకుని, చెట్లకి దూరంగా వెళ్లి… ఒకరినొకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ థింసా నృత్యం చేయసాగారు. అక్కడ నేల సమతలంగా, విశాలంగా ఉంది. ఇద్దరు అమ్మాయిలు నోటితోనే బూరా ఊదసాగారు.
ఒక పెద్దామె, సంచిలోంచి చిన్న డప్పు తీసి వాయించ సాగింది.
ముత్యాలు, వింతగా చూస్తున్న సత్యని లాక్కెళ్లింది. సత్య బూట్లు విప్పేసి వెళ్లింది… వాటితో సరిగ్గా అడుగులు పడవని చెప్పింది ముత్యాలు.
లయ బద్ధంగా అడుగులు వేస్తూ తిరుగుతూ పాడుతూ… కొండ ప్రతిధ్వనించే లాగ సందడి చేస్తున్నారు. చాలా రోజులైనా సత్య సులభంగానే వాళ్లతో కలిసి పోయింది. చిన్నప్పుడు అమ్మమ్మ చేయిస్తూ ఉండేది.
ఆ ఉదయ కాంతిలో… రాలి పడుతున్న పచ్చని ఇప్పపూలు ఎరుపు రంగుని అద్దుకున్నట్లు మెరుస్తూ… కింద పడగానే పచ్చగా మారి పోతున్నాయి.
రంగు రంగుల పరికిణీలు, ఓణీలు, మడమ పైకి కట్టిన చీరలతో పెద్ద వాళ్ళు కూడా పిల్లలతో చేరి నాట్యం చేయసాగారు.
కాసేపు వాళ్ల ఆనంద తాండవం గమనించిన గౌరమ్మ, పెద్ద గొంతుతో అందరినీ హెచ్చరించింది.
“ఇంక ఆపి పనిలోకి దిగండి. తొమ్మిది లోపు పట్నం దొరలు వచ్చేస్తారు. మనం ఆలోపు వెళ్లి తీరుగా వేరు చేసుకోవాల. సగం ఆరబెట్టుకోవాలి. సగం దొరలకి ఇవ్వాలి పదండి…”
అందరూ మంత్రం వేసినట్లు ఆపేసి తమ సంచిలోకి పూలు చేరుస్తూ సర్ద సాగారు… ఏకాగ్రతతో! అక్కడ ఉన్నవి ఐదే చెట్లు. కానీ నేలంతా పరచినట్లుగా పూలు రాలాయి.
సత్య వాళ్లందరినీ గమనిస్తూ ఒక చెట్టు మొదట్లో ఉన్న వేరు మీద కూర్చోడానికి వెళ్లబోయింది. వేరు అన్న మాటే కానీ చిన్న బెంచీ అంత వెడల్పుగా ఉంది. అది ఇప్పచెట్టు కాదు. రావి చెట్టేమో అనుకుంది. గౌరమ్మ కూడా పూలు ఏరడం లేదు. అందరి పనినీ పర్యవేక్షిస్తోంది.
అంతలో సత్య కాల్లో, బూటు పైన పెద్ద ముల్లు లోపలికంటా గుచ్చుకుని పోయింది.
“అమ్మా!” గట్టిగా అరిచింది సత్య. ఆ హడావుడిలో ఎవరో వచ్చి వంగుని సత్య కాలు పట్టుకుని జాగ్రత్తగా ముల్లు తీశారు. అప్పుడు చూసింది ఎవరా అని! తన కాలు పట్టుకున్నావిడ, సత్య ఎంతగానో ఆరాధించే జానకీ టీచర్.
“టీచర్ మీరా?” చటుక్కున కాలు వెనక్కి లాక్కుని టీచర్ కాళ్లకు నమస్కారం పెట్టింది.
“టీచర్… పాము…” గట్టిగా అరచింది వరం.
సత్య కాళ్ల దగ్గరకి వస్తోంది పొడవాటి పాము, మెలికలు తిరుగుతూ!
*...............*
ఎపిసోడ్- 2
(హామీ- ఈ రచన నా స్వీయ సృజన. ఇంతకు ముందు ఏ మాధ్యమంలోనూ ప్రచురితం కాలేదు)
ఆత్మీయబంధం
అంతా ఒక్కసారిగా స్తంభించి పోయినట్లు అయిపోయింది.
జానకి తెల్లబోయి చూస్తోంది.
పాము వేగం పెంచింది. సత్యని కదలకుండా ఉండమని చెప్తూ, జానకి అటు ఇటూ చూసింది… ఏం చెయ్యాలా అనుకుంటూ!
అంతలో గౌరమ్మ చప్పుడు చెయ్యకుండా వెనుక నుంచి ఒక దుప్పటి, పాము తల మీదకు విసిరి, ఒడుపుగా పైకి లేపి పట్టుకుంది. ఆ దుప్పటి అలాగే జాగ్రత్తగా తీసుకెళ్లి తుప్పల్లోకి విసిరేసింది.
పాము బయటకు వచ్చి జరజర పాకుతూ అందరికీ దూరంగా వెళ్లి పోయింది.
“మనకెంత భయమో, మనల్ని చూస్తే పాముకి కూడా అంతే భయం.” గౌరమ్మ తుప్పల్లోకి వెళ్లి దుప్పటీ దులిపి తీసుకొచ్చింది.
“ఇంకేం ఫరవాలేదు. వెళ్లి పని పూర్తి చెయ్యండి.” అందర్నీ ఆదేశించింది.
జానకి, సత్యని లేపి దగ్గరగా హత్తుకుని చిరునవ్వు నవ్వింది.
సత్య లేచి చుట్టూ చూసింది ఆశ్చర్యంగా! అక్కడ ఉన్న పిల్లలు అందరూ సత్య చేసినట్లు వంగుని టీచరుగారి కాళ్లకు దండాలు పెడుతున్నారు.
“మీకే కాదక్కా! మాకు కూడా టిచర్, జానకి మేడమ్.” ముత్యాలు నవ్వుతూ అంది. ఆ పిల్ల ఎప్పుడూ నవ్వుతున్నట్లే ఉంటుంది..
“టీచర్… మీరు, ఇప్పపువ్వు లేరడానికి వచ్చారా…”
“నువ్వు పట్నం వెళ్లాక, టీచర్ మాతో పువ్వులేరటానికి వస్తున్నారక్కా! నువ్వు ఉన్నప్పుడు అంత ఎక్కువ వచ్చేవి కాదు. ఇప్పుడు, చెట్లు బాగా వచ్చి పంట పెరిగింది” వరం వివరించింది.
“అవును సత్యా! స్కూలు ఒక స్థాయికి వచ్చింది. నువ్వు ఉన్నప్పుడే ఇద్దరు టీచర్లని వేశారు కదా. కాస్త కాలక్షేపం గా ఉంటుందని వస్తున్నాను.” జానకీ టీచర్ మాటలు విని, సత్య టీచర్ గారి చేతులు పట్టుకుని ఊపేసింది.
“మాతో రాలేదు కదా… మీరు ఎలా వచ్చారు? ఎంత సేపయింది? మీరు చాలా గ్రేట్ టీచర్! మీ కల నిజమైంది.”
“టీచరుగారు మోపెడ్ మీద వచ్చారక్కా! ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెలో ఉంటారు.” వరం వంగుని సత్య కాలు పరిశీలిస్తూ అంది.
“ఏం పర్లేదు వరం… పై పొరల్లోనే దిగినట్లుంది.” తన దగ్గరున్న సంచిలోంచి తీసి సత్య కాలికి బాండేజ్ కట్టింది జానకి. ఫస్ట్ ఎయిడ్ కి కావలసిన వస్తువులు తన సంచీలో పెట్టుకుంటుంది ఎప్పుడూ... ఉపాధ్యాయురాలు కదా!
సత్యకి ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చింది. హడావుడిలో మర్చిపోయింది… అరెరే! తను కూడా ఏరాలి కదూ! అయితే… ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పూలన్నీ ఐపోయాయి..
ఏం చేయాలో తోచక అటూ ఇటూ చూస్తోంది… అసలు అమ్మమ్మ తెచ్చిన సంచీ ఏమైంది? తన మూలంగా ఇవేళ ఎంత నష్టం వచ్చిందో! అమ్మమ్మ ఏమీ అనదు కానీ… సత్యకి గాభరా వేసింది.
గౌరమ్మ ఇంకో గుంపు దగ్గరకు వెళ్లింది. అక్కడ పెద్ద వాళ్లందరూ గుండ్రంగా కూర్చుని తాము తీసుకొచ్చిన డబ్బాలు బయటికి తీశారు.
అలాగే మూటగా కట్టిన బాదం ఆకులు విప్పి, తలా ఒకటి ఇచ్చారు. గౌరమ్మ కూడా తాను తెచ్చిన తినుబండారాలు ఇచ్చింది.
వరం, ఇంకో ఇద్దరు అమ్మాయిలని పిలిచి అందరికీ కొంచెం కొంచెం సర్దింది. హాయిగా కబుర్లతో, పాటలతో ఫలారాలు కానిచ్చారు. రెండేసి ఆకుల నిండా వచ్చాయి ఒక్కోరికి. తినేశాక ఆకులన్నీ, గొయ్యి తవ్వి అందులో వేసి మట్టి వేసేశారు, గౌరమ్మ పర్యవేక్షణలో.
“ఇంక బయల్దేరుదాం. షావుకార్లకి ఇచ్చేవి ఇచ్చి మనం కొన్ని తీసుకుని వాడుకుందాం.” చకచకా అన్నీ సర్దేశారు.
సత్య ఒక పక్కగా నిలుచుంది. తను ఒక్క పువ్వు కూడా ఏరలేదు. వచ్చిన పనే మర్చి పోయింది. గౌరమ్మ అదేమీ పట్టనట్టు ఎర్ర చీర కట్టుకున్నామెతో మాట్లాడుతోంది… పూర్తి కోయ భాషతో.
సత్యకి ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. పూర్తిగా ఒరియా మాటలు… ఒకటీ రెండూ తెలుగు పదాలు కలిసి నట్లున్నాయి.
“అక్కా!” ముత్యాలు గట్టిగా పిలిచింది.
వరం, ముత్యాలు కలిసి, చెరొక సంచీ ఇచ్చారు, ఆశ్చర్యంగా చూస్తున్న సత్యకి
“నీకూ, అమ్మమ్మకీ కూడా మేమే ఏరేసామక్కా! ఎప్పుడూ అమ్మమ్మకి ఏరుతాము. ఇవేళ నీ సంచీ కూడా నింపేశాం. నీకు కొత్త కదా, ఏరడం తెలీదుగా… అందుకని.” ముత్యాలు పళ్లన్నీ బైటపెట్టి చేతులు తిప్పుతూ అంది.
సత్య ముత్యాలు చెయ్యి పట్టుకుని ఊపేసింది. ఎంత మంచి పిల్లలు…
“వాణిశ్రీ! బలే మంచి పని చేశావే… అమ్మమ్మకి ఏం చెప్పాలా అని భయపడి పోయాననుకో. చాలా మంచి పిల్లలే మీరు. మరి ఆ పిల్లలందరూ ఏమీ అనుకోరా? వాళ్లకి వచ్చేవి తగ్గి పోయాయి కదా!” దూరంగా, చెట్లలో దాగుడుమూతలాడుతూ హుషారుగా గెంతుతున్న పిల్లల్ని చూపిస్తూ అడిగింది సత్య.
“ఏమనుకోరక్కా… అందరం ఒకే మాట మీద ఉంటాం. అయితే… ఒక సాయం చేస్తావా…” వరం మొహమాటంగా ఆగిపోయింది.
“చెప్పు చెప్పు. ఏం కావాలి?”
“ఏం లేదక్కా… నువ్వు ఇక్కడున్నన్నాళ్లూ మాతో ఉండాలి. మాకు ఇంగ్లీషు నేర్పించాలి.”
“ఓస్… అంతే కదా? తప్పకుండా నేర్పిస్తా. నేను బొమ్మల పుస్తకాలు కూడా తెచ్చా… ఎవరికైనా పనికొస్తాయని. మరి మనం థింసా డాన్స్ ప్రాక్టీస్ చేద్దామా?”
“అంతేనా… ఇవేళంతా పూలు సరిదే పని ఉంటుంది. రేపు పొద్దున్నే కలుద్దామక్కా!”
తిరిగి వచ్చేటప్పుడు ఇల్లు తొందరగా వచ్చేసినట్లు అనిపించింది. “అందరం కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం కదా… అలసట తెలీ లేదు.” గౌరమ్మ కొద్దిగా ఆయాస పడుతూ అంది.
………..
ఇప్పపువ్వుల సంచీలు తలుపు పక్కన పెట్టి, అప్పటి వరకూ చూసిన థింసా నాట్యం చేస్తూ అమ్మమ్మ రెండు చేతులూ పట్టుకుని గుండ్రంగా తిరగసాగింది సత్య, పాట పాడుతూ!
“అమ్మల గన్న అమ్మవి నీవే ఆదిపరాశక్తి వి నీవమ్మా
జగముల నేలే మా జగదాంబా దారిచూపి మమ్మాదుకోవే
కంచిలోన కామాక్షివి నీవు మథురలోని మీనాక్షివి నీవు
కాశీలో విశాలాక్షివి నీవే కలియుగమందున కనక దుర్గవే…”
“చాలా బాగుంది తల్లీ! మనం డాన్సులు ఆడుకుంటూంటే పనెట్లా… పూలేరుకొస్తే సరిపోలా. అవన్నీ సరుదు కోవాల”
“మరి నాకు పాటలన్నీ నేర్పిస్తావా?”
“అల్లగల్లాగే…” చీరకట్టులోంచి తాళాల గుత్తి తీసి తలుపు తెరిచింది గౌరమ్మ.
ఇంట్లోకి వస్తూనే రెండు పెద్ద పెద్ద తాటాకు చాపలు తెచ్చి ఇంటి ముందు పంచలో పరచింది. రెండింటి మీదా సంచుల్లో ఉన్న ఇప్ప పువ్వులు కుమ్మరించింది.
అమ్మమ్మ పూలన్నీ పల్చగా చాప మీద పరుస్తుంటే తాను కూడా ఇంకో చాప మీద అంతే పల్చగా సర్దింది సత్య.
మరో రెండు చాపల మీద పట్టేన్ని పూలు కుప్పలా ఉన్నాయి. పక్కనే ఉన్న నులక మంచం పరిచి, దాని మీద దుప్పటి వేసి ఆ పూలు కూడా సర్ది, కొంగు దులుపుకుంటూ ఇంట్లోకి నడిచింది గౌరమ్మ.
“దా దా… ఇవేళ నీకు ఇప్పపూలు లడ్డూలు, యేపుడు చేసి పెడ్తా!”
“మరి అన్ని పూలు ఆరబెట్టేశాం కద అమ్మమ్మా!”
“ఈ పచ్చి పూలు పులుసుకి బాగుంటాయి. ఇప్పుడు ఎండబెట్టిన పూలు వాడుకుందాం.” పొడవాటి తాటాకు బుట్ట తెచ్చి మూత తీసింది గౌరమ్మ.
“బుట్ట నిండా బ్రౌన్ రంగులో పూలు కిటికీలోంచి పడుతున్న ఎండలో మెరుస్తూ కనిపించాయి.”
చకచకా పనులు చేస్తున్న అమ్మమ్మని చూస్తూ ఏం సాయం చేద్దామా అని చూస్తోంది సత్య.
“లేవగానే పరిగెట్టేశాం… పూజ సెయ్యనే లేదు. నువ్వు దేముడి మూల సర్దు. నే వచ్చి దీపం పెట్టేస్తాను.” గౌరమ్మ సత్యకి పురమాయించింది.
సత్య హుషారుగా లేచి, స్నానం చేసి, అమ్మమ్మ లాగ చీర కట్టుకుని వచ్చింది. దేముడి దగ్గర అంతా శుభ్రం చేసింది. కుండలని అలంకరించి చేసిన అమ్మవారి ఘటాలకు పసుపు కుంకుమ పెట్టి పూలు కోసుకుని వచ్చింది.
“అమ్మలూ పూలు దేముడి వరకే మనం పెట్టుకోకూడదు. గంగాలమ్మ పండగలో అమ్మవారికి అలంకరించాకే మనం పెట్టుకోవాలి.” గౌరమ్మ హెచ్చరించింది.
“అదెందుకు అమ్మమ్మా?”
“వర్షాల కోసం అమ్మవారికి మొక్కుతాం కదా! వానలు పడ్డాక అందరం గంగాలమ్మ పండుగ చేసి, పువ్వులతో పూజ చేశాక పెట్టుకుంటాం. అది మన ఆచారం.”
“అలాగే… అమ్మవారికి, దేముళ్ల ఫోటోలకి పెడతాను.”
సత్య శ్రద్ధగా దేముడి మూలని అలంకరించింది. దీపం కుందుల్లో నూనె వత్తులు వేసి, పళ్లెంలో పూలు పెట్టింది.
“బాగా చేశావే అమ్మాయి.” గౌరమ్మ మెచ్చుకుంటూ వచ్చి, దీపాలు వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టింది.
ఆలోగా సత్య, అమ్మమ్మకి లడ్డూ చెయ్యటంలో సాయం చేద్దామని, వంటింట్లో స్టౌ వెలిగించి, మూకుడు పెట్టింది. వంటంతా కట్టెల పొయ్యి మీద చేసినా ఫలారాలకి కిరోసీన్ స్టౌ వాడతారు.
“మంట తక్కువగా పెట్టి బాగా కలుపుతూ వేయించాలి. ఒక్క పువ్వు కూడా మాడకూడదు. రేకులు పల్చగా ఉంటయ్యి కదా… తొందరగా వేగిపోతయ్యి.!” గౌరమ్మ హెచ్చరించింది.
“అల్లగే అమ్మమ్మా! కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో చేసినట్లు చేస్తా… జాగ్రత్తగా.” పువ్వుల బుట్ట దగ్గరకి జరుపుకుంది.
“అయ్యేంటే తల్లీ?” గౌరమ్మ వింతగా చూసింది.
“నా చదువులో ఒక పాఠం…” మూకుట్లో ఇప్పపువ్వులు వేసి అట్లకాడ చేతిలోకి తీసుకుంది సత్య.
“నీ చదువులో వంటలు కూడా ఉంటయ్యే?” బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది గౌరమ్మ.
“ఉండు… ఇది అయిపోయాక నీకు నా చదువు ఏంటో చెప్తా… మూకుడు నిండా ఉంటే సరిగ్గా కలపటానికుండదు. సగం సగం వేయిస్తా.” అంటూ సగం పువ్వులు తీసి పళ్లెంలో పోసి, మూకుట్లో ఉన్న పువ్వుల్ని జాగ్రత్తగా కలప సాగింది సత్య.
“నేను కూడా అదే చెప్దామనుకున్నా… మంచి చదువులేనే తల్లీ! మీ తాత వస్తన్నాడంట భోయనం టైముకి, వంట మొదలు పెట్టాల” అంటూ బియ్యం బస్తా దగ్గరకి నడిచింది గౌరమ్మ.
మధ్య హాలుని ఆనుకుని ఉన్న గది, హాలు కంటే పెద్దగా ఉంది. అందులో ఒక పక్కగా సగం పైగా ధాన్యం బస్తాలున్నాయి. తలుపుకి ఎదురుగా ఉన్న చిన్న బస్తాల్లో ఆడించిన బియ్యం ఉన్నాయి. రెండు సోలలు కొలిచి అల్యూమినియం డేయిసాలో పోసింది గౌరమ్మ. వంటింటి వెనుక ఉన్న వరండాలో అలికి ముగ్గు వేసి ఉన్న పొయ్యి వెలిగించింది. అందులో అల్యూమినియమ్ డేగిసా లో నీళ్లు పోసి, ఎడ పొయ్యి పక్కన ఉన్న పెడ పొయ్యి కూడా అంటించి, కొంచెం చిన్న గిన్నెలో పప్పు ఉడకడానికి పెట్టింది.
అమ్మమ్మ చేస్తున్న పనిని చూస్తూ వచ్చే ముందు అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంది.
“అమ్మమ్మ దగ్గర వంట నేర్చుకునే రా. ఇప్పుడు చదువు కోవలసినవేవీ లేవు కదా…”
హాస్టల్ కి వెళ్లినప్పటి నుంచీ సెలవులకి అమ్మ దగ్గరకే వెళ్లటం అలవాటయింది. సత్యా వాళ్ల అమ్మ ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. అదే సత్యకి అలవాటయింది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అన్ని రకాల ఫల వృక్షాలు, పూల మొక్కలు వేశారు ఇద్దరూ.
సత్యకి చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. పట్నం వెళ్లినప్పటి నుంచి, తండ్రితో అటవీ శాఖ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి అక్కడి ఉద్యోగుల సలహాలు తీసుకుంటూ ఉంటుంది.
“నేను అటవీశాఖలో ఆఫీసరుగా చేరతా!” అమ్మమ్మ తాతయ్యలు వెళ్లినప్పుడు, అందరి దగ్గరా శపథం చేసేసింది.
“అసలు మనవే అడవి మనుషులం… ఇంక అందులో ఆఫీసరేటే తల్లీ!” అమ్మమ్మ సందేహం…
“అదికాదమ్మమ్మా అడవులన్నీ గవర్నమెంటువి కదా? ఎవరన్నా వాటి జోలికి వస్తే ఊరుకోనన్నమాట. అడవులతో మన అనుబంధం అట్లాంటిదే కద!”
“అబ్బో! అంతా మన చేతిలో ఉన్నట్లే…” తాత అప్పన్నకి అట్టాంటి విషయాల్లో అనుభవం ఎక్కువ. తమ పల్లెల్లో రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాడు కదా!
“సత్యా!” అమ్మమ్మ కేకకి ఆలోచనల్లోంచి బైట పడింది సత్య.
“పూలేయించటం అయితే, ఆ పక్క డబ్బాలో వేరుసెనగ గుళ్ళున్నాయి. అవి దోరగా వేయించేయి. అదయ్యాక నూపప్పు కూడా. పదును తెలుసా ”
“తెలుసమ్మమ్మా.” అమ్మ నేర్పించింది.
“అబ్బో… పెద్దదానివైతున్నావే!” గౌరమ్మ మురిసి పోతూ అంది. అన్నం వార్చేసి గంజి వేరే గిన్నెలోకి తీసి పెట్టింది. అంతలో పప్పు కూడా ఉడికింది. దాని మీద నీళ్లు గంజి గిన్నెలో కలిపి, కాసిని ఇప్ప పూల రేకులు, పచ్చి మిరపకాయ, ఒలిచిన ఉల్లిపాయలు వేసి, ఉప్పు, మామిడి తొక్కు, పసుపు కలిపి, పొయ్యి ఆర్పేసి, ఆ పొయ్యి మీదే గిన్నె పెట్టింది.
“ఆ వేడికి ఉడికిపోతుంది ఇప్ప పూల పులుసు. నువ్వు వేయించటం అయ్యాక కాస్త పోపు వేయించి కలిపేద్దాం.” గౌరమ్మ, కొంగుతో మొహం, చేతులు తుడుచుకుంటూ అక్కడున్న అరుగు మీద కూలబడింది.
గదిలో గోడలకి తగిలేట్టు అరుగులు కట్టించాడు అప్పన్న. వాటికి ఆనుకునేందుకు వంకీ గోడలు. బూరుగు దూది పరుపుల్లా కుట్టించి వాటి మీద పరిచారు. ఏ సోఫాలకీ తీసిపోవు.
“అమ్మమ్మా! ఒకటి అడగనా? కోప్పడకూడదు మరి.”
సరే అన్నట్లు తల ఆడించింది గౌరమ్మ.
“నేను ఉన్నప్పుడు ఇప్ప పూల పంట కొద్దిగానే వచ్చేది. దాంతో సారాయి కాచే వారు. ఓ సారి పోలీసులు వచ్చి పెద్ద గోల చేశారు కూడా. అంతలాగ కొద్ది కాలంలోనే షావుకార్లు కొనే పాటి ఎలా అయింది?”
“నిజమే. అప్పట్లో మన దగ్గర అంత ఘనం పంట లేదు. ఈ మధ్నే ఇప్పపూల విలువ తెలిసి గిరాకీ బాగా పెరిగింది. దీనికి మీ టీచరుగారిదే పుణ్యం అంతా. వారు ఇక్కడికి రాకముందు వాటి గురించి బాగా చదివారట. ఆదిలాబాద్ అడవుల్లో ఇదే జీవాధారంట. నువ్వున్నప్పుడు వచ్చిన ఇద్దరు టీచర్లు అక్కడి వారే. వాళ్ళు రాగానే చెట్లు తెప్పించి పాతించారు. ఆప్పుడు నువ్వు ఆటల్లో, చదువులో పడి పట్టించుకోలేదు. అవి పెద్దగా అయ్యే వరకు మాకూ తెలీలేదు.”
“అవును… ఇప్పపూలు చాలా మంచివిట ఆరోగ్యానికి. మా బోటనీ క్లాసులో కూడా చెప్పారు. జబ్బులు కూడా నయం చేస్తాయిట.” సత్య పోపు వేయించి పులుసులో వేసింది.
“మనకి తెలీలేదు గానీ మనూళ్లో అన్ని జబ్బులకి మందులిచ్చే ఆచారి డాక్టరుగారు బాగా వాడతారు. ఇప్పపూలు, కాయలు, ఆకులు కూడా.”
“ఆచారి గారు ఎలా ఉన్నారు అమ్మమ్మా? పెద్దాయన అయిపోయుండచ్చు కదా. మనూరు వచ్చేప్పటికి శ్రీకాకుళం ఆయుష్ హాస్పిటల్ నుంచి రిటైరయిపోయారు. పూజలు కూడా చేయిస్తున్నారా?”
“మన ముత్యాలమ్మ పండక్కి ఆయనే కదా! రిటైరయ్యాక వస్తేనేం, ఎంత మంచి మందులిస్తారో! డెభ్బయ్యేళ్లు దగ్గర బడ్డా, ఇప్పటికీ నిటారుగా నడుస్తూ పిల్లకాయల్నేసుకుని అడవిలోకి వెళ్లి మూలికలు ఏరుకుని వస్తారు.”
వేణుగోపాలాచారి గారు ఆ చుట్టు పక్కల పేరు పొందిన వైద్యుడు. శ్రీకాకుళం దగ్గర ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ లో ముప్ఫై ఏళ్లు పని చేసి రిటైరయ్యాక కొండ పాలెం వచ్చారు, అప్పన్న గారి ప్రోద్బలంతో.
“అవునమ్మమ్మా!” సత్య పీట మీంచి లేవబోతు అమ్మా అంటూ కాలు పట్టుకుని కూర్చుండి పోయింది.
గౌరమ్మ చటుక్కున లేచి వచ్చింది.
“అయ్యో… ముల్లు బాగా దిగినట్టుంది. కాలు ఎంత లావు వాచిపోయిందో?” గాభరాగా అంది గౌరమ్మ.
నెమ్మదిగా లేపి మంచం మీద పడుక్కో బెట్టింది.
“కదలకుంటా పడుక్కో… పిండి కట్టు వేస్తాను. రేపటికల్లా తగ్గిపోతుంది.”
“ఆచారి గారి వైద్యమేనా అమ్మమ్మా?” సత్య నవ్వుతూ అంది.
“ఆరు కూడా ఇదే చెప్తారనుకో… ఇట్లాంటి వైద్యాలు మనోళ్లు ఎప్పట్నుంచో చేస్తన్నారు.”
బియ్యప్పిండి ఉడికించి గోరు వెచ్చగా అయాక, వాపు దగ్గర పట్టించి పల్చటి బట్టతో కట్టు కట్టింది గౌరమ్మ. ఆయుర్వేద వైద్యులు ఆచారిగారికే పాఠం చెప్పగలరు గౌరమ్మ వంటి వాళ్లు.
*...................*
ఎపిసోడ్- 3
(హామీ- ఈ రచన నా స్వీయ సృజన. ఇంతకు ముందు ఏ మాధ్యమంలోనూ ప్రచురితం కాలేదు)
‘ఆదర్శం’
ఇప్పపూల సేకరణ నుంచి తన ఇంటికి వెళ్లాక ఆలోచనలో పడింది జానకి. సత్యని చూశాక, తను కొండ పాలెం ఎలా వచ్చిందో… అంతా ఒక రీల్ లాగా గుర్తుకు వచ్చింది…
జానకి బస్సులో కూర్చుని పదో సారి చేతిలో కాగితాన్ని చూసుకుంది. ఎప్పుడెప్పుడు చూద్దామా అని కలలు కన్న కాగితం. మన్యం జిల్లా ‘కొండ పాలెం’ అనే పల్లెలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా నియామకం చేసిన పత్రం.
జానకి అనకాపల్లి దగ్గర్లో ఉన్న చెంచుగూడెం లో పుట్టింది. సంచారం చేసే తెగ వారైనా, ఆ గూడెం వాళ్లు మాత్రం ఒక దగ్గరే ఉండి కూలి పనికి వెళ్తుండే వారు. అడవుల్లో జంతువుల వేట నిషేధించాక, చెట్ల మీద, పొలాల్లోనూ దిగుబడులు లేక… కడుపు నింపుకోవడానికి పట్టణాల దగ్గరకి వలస వచ్చేశారు చాలా మంది తండా వాళ్ళు. ఖాళీ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు.
జానకి తల్లి నరసమ్మ, పట్నం లో ఒక లాయర్ గారింట్లో పనికి కుదిరింది. తండ్రి లాయర్ గారి సిఫారసుతో లారీ కాంట్రాక్టరు గారి దగ్గర చేరాడు. లారీల్లోకి సరుకులు ఎక్కించడం, దించడం… అవసరమైతే క్లీనర్ గా వేరే ఊళ్లకి వెళ్లడం అతని పని.
లాయరు చిట్టి రాజు గారు తమ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో ఒక గది, వంటిల్లు వేసి ఇచ్చారు, పిలిస్తే పలికేట్టుంటారని.
అమ్మ పనికి వెళ్లినప్పుడు జానకి ఇద్దరక్కలు, తనని చూసుకునే వారు. అక్కలకి బడికి వెళ్లాలని ధ్యాసే లేదు. వాళ్లకి చిన్న చిన్న పనులకి వెళ్లడం అలవాటు చేశారు. పదేళ్లు రాగానే కూరగాయల షాపులో అందించే పని పెద్దమ్మాయి, పూల కొట్లో సాయానికి చిన్నమ్మాయి కుదురుకున్నారు.
లాయర్ గారి భార్య గిరిజ, తన ఖాళీ సమయంలో ఆ పిల్లలకు అక్షరాలు రాయడం, అంకెలు నేర్పడం చేస్తూ ఉండేది.
ఎప్పుడైనా అరకు దగ్గర అమ్మమ్మ గారి గూడెం వెళ్లి వచ్చే వారు. అక్కడ కొండలు, అడవి… జానకికి బాగా నచ్చింది. పిల్లలతో ఆటలు, చెట్టుకు కట్టిన ఉయ్యాలలో ఊగడం, ధింసా డాన్సులు… అక్కడే ఉండిపోదామని గోల చేసేది.
“నువ్వు పెద్దయ్యాక వద్దాం. అప్పటికి, ఇక్కడ పరిస్థితులు మారి బాగా బతకచ్చేమో…” నాన్న చెప్పేవాడు. అయితే… అనకాపల్లి వెళ్లడం వల్లనే కుటుంబం ఒక తీరుకు వచ్చింది. అడవిలోనే ఉంటే తిండి గింజల క్కూడా కరువు… మంచిదే అనుకుంది జానకి.
ఒకరోజు అమ్మతో ఇంటి పనికి వచ్చి, పెరట్లో తిరుగుతున్న నాలుగేళ్ల జానకిని చూసింది గిరిజమ్మ. చిట్టి చేతులతో మొక్కలకి గొప్పులు తవ్వుతోంది.
“ఈ అమ్మాయినైనా చదివించు నర్సమ్మా! ఒక్కరైనా పైకి వస్తే తరాలు వృద్ధి లోకి వస్తాయి. ప్రపంచం ఎంతో మారిపోయింది. బడికి పంపుదాం. మా అమ్మాయితో వెళ్లి చదువు కుంటుంది.”
“అదంతా ఎవరు చేస్తారమ్మా?” నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూసింది నర్సమ్మ. చదువంటే మాటలా?
“గుమాస్తా గారికి చెప్తానుండు. బళ్లో ఒక్క మాట చెప్తే సరిపోతుంది. ఫీజులేం ఉండవు. ఇంకా యూనిఫామ్, పుస్తకాలు ఇస్తారు. మధ్యాన్నం భోజనం కూడా పెడతారు.”
సాయంత్రం కోర్టు నుంచి వచ్చిన, లాయర్ గారికి చెప్పింది గిరిజ.
“నిజమే… చేర్పిద్దాం. మొన్నీమధ్యనే రోటరీ క్లబ్ ద్వారా ఆ స్కూలుకి బెంచీలు కూడా ఇచ్చాము. పెద్ద పిల్లల్ని కూడా ప్రైవేటుగా మెట్రిక్ కి కట్టించచ్చు.” చిట్టి రాజుగారు గుమాస్తా పంతులుని పిలిచారు.
“ఏమంటావయ్యా?” సంగతంతా చెప్పారు.
“వీళ్లు గిరిజనులు కదయ్యా! రేషన్ కార్డు, పిల్లల బర్త్ సర్టిఫికేట్లు ఉంటే యస్.టి కింద రిజిస్టర్ చేసి రాయితీలు పొందచ్చు. వాళ్లు చదివినంత కాలం స్కాలర్షిప్ కూడా వస్తుంది.”
“స్కూల్స్ తెరుస్తారేమో కదా… చేయ వలసింది చెయ్యి. ఎవరెవరికో చెయ్యటం కాదు, మన దగ్గర పనిచేసే వాళ్లనీ బాగా చూసుకోవాలి.”
“మీ దయ అమ్మా! బిడ్డ బళ్లో చేరింది.” నర్సమ్మ, అమ్మగారికి చేతులెత్తి మొక్కింది. గుమాస్తా అవసరమైన కాగితాలన్నీ సమకూర్చి జానకిని స్కూల్లో చేర్చాడు.
జానకి స్వతహాగా తెలివైనది. జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏ ప్రైవేట్ స్కూళ్లకీ తీసిపోవు. నెల పరీక్షలు, వారం వారం కొత్త కొత్త ప్రాజక్టులు… స్కూల్ అయిపోయాక అర్ధం కాని పాఠాలను మళ్లీ వివరిస్తారు టీచర్లు. ప్రతీ సంవత్సరం క్లాస్ లీడర్ గా ఉంటూ, పదో తరగతిలో స్కూల్ లీడరుగా ఎన్నికయింది. టీచర్లకి తలలో నాలుకలా ఉండేది.
లాయరుగారి భార్య చొరవ మంచి ఫలితాన్నిచ్చింది. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చి, ఇంటర్, డిగ్రీ మంచి మార్కులతో పాసై, బి.యిడి చేసి, టీచరుగా సెలెక్ట్ అయింది. గిరిజన గూడెం లో చేరమని ఆర్డర్ రాగానే సంతోషించింది, తన కల నెరవేరినందుకు.
“అమ్మా! మీ స్టాప్ వచ్చింది.” కండక్టర్ పిలుపు విని బస్ దిగింది జానకి. చేతిలో ఉన్న సంచీ, జిప్ బాగ్ కాకుండా పైనించి ఒక బస్తా లాంటిది కిందకి దించాడు అక్కడున్న, బస్ క్లీనర్. అందులో వంట సామాన్లు, నెలకి సరిపడా సరుకులు, ఒక బొంత, రెండు దుప్పట్లు, ఒక దిండు కట్టి ఇచ్చింది నర్సమ్మ.
కిందికి దిగాక అటూ ఇటూ చూసింది జానకి. అక్కడున్న గ్రామాల్లో కొండ పాలెం కాస్త సదుపాయాలున్న పల్లె అనుకోవచ్చు. కాస్త తీరుగా ఉన్న రోడ్డు. కిలోమీటరు నడుస్తే కానీ ఊరు రాదు. తండ్రితో పాటు పని చేసే లారీ క్లీనర్ అక్కడి ఊరి పెద్ద పేరు చెప్పాడు.
ఎటుపక్క చూసినా అడవి. చెట్లు బాగా ఎత్తుగా ఉన్నాయి.
అప్పుడే అరకు నుంచి వస్తూ ఊర్లోకి వెళ్తున్న యువకులు నలుగురు రెండు మోపెడ్ ల మీద కనిపించారు. జానకి చెయ్యెత్తి ఆపింది.
“ఎవరు మేడం? ఎవరింటికి?”
గూడేల్లో యువకులు, అరకులో హోటళ్ల లో, విహార స్థలాల్లో, మార్కెట్లలో పని చేస్తూ బట్టలు, మాటలు… ఆధునికంగా కనిపిస్తూ ఉంటారు.
“అప్పలస్వామి గారింటికి వెళ్లాలి.” తన వివరాలన్నీ జానకి చెప్పింది.
“స్కూల్లోకి కొత్త టీచరుగారా? మీరు కనీసం ఒక ఏడాదన్నా పని చేస్తానంటేనే చూపిస్తాం.”
“ఏం లేదు మేడమ్! ఎవరొచ్చినా నెల కంటే ఎక్కువ రోజులు ఉండటం లేదు. కాస్త నిలకడగా ఉండి స్కూల్ ని ఒక షేప్ కి తీసుకు వస్తే చుట్టు పక్కల గూడేలన్నింటికీ ఉపయోగపడుతుందని మా ఆశ. ఇలాగే ఉంటే స్కూలు మూసేయాల్సి వస్తుంది.” ఒక అబ్బాయి అన్నాడు.
“నేను ఇక్కడ ఉండాలనే వచ్చాను. రేపు మాట్లాడుకుందాం. నన్ను ఊర్లోకి తీసుకెళ్తారా?”
అప్పుడే అటుగా వచ్చిన ఆటోని ఆపి సామాను ఎక్కించి జానకిని ఎక్కమన్నారు.
“నా పేరు రఘు మేడమ్. మేము అప్పన్న గారికి చాలా క్లోజ్.. ఇక్కడ ఎవరికి ఏం కావలసినా అప్పన్నగారే చూస్తుంటారు. మిమ్మల్ని వాళ్లింటి దగ్గర దింపుతాము.”
“రేపు ఒక సారి స్కూలు దగ్గరకి రండి, మాట్లాడుకుందాం.” ఊర్లోకి వస్తూనే మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయనుకుంది జానకి.
అప్పన్న గారిల్లు అన్ని ఇళ్ల కంటే పెద్దదిగా ఉంది.
“మన గూడెం పెద్ద మేడమ్. పంచాయతీ బోర్డు మెంబర్ కూడా! కొత్తగా ఎవరు వచ్చినా వీరింటికే వస్తారు. అమ్మగారు బాగా ఆదరిస్తారు.” రఘు చెప్తుండగానే గౌరమ్మ బయటికి వచ్చింది.
“టీచరుగారా! మీరు వస్తారని చెప్పారు. రండి. మీకు రెండిళ్ల అవతలే ఇల్లు చూశారు. ఇల్లు బానే ఉంటుంది.” సామాను ముందు గదిలో పెట్టమంది.
“ఎందుకు అమ్మగారూ! ఇంటి తాళాలుంటే అక్కడే పెట్టేస్తాం.” రఘు అన్నాడు. గౌరమ్మ తాళాలు తీసిచ్చి, తను కూడా వెళ్లింది..
అన్ని ఇళ్లలాగే, ఇంటి ముందు అరుగు, ఒక హాలు, వంటిల్లు. రఘు బృందం, సామాన్లు లోపల పెట్టడమే కాకుండా, బస్తా విప్పి అన్నీ సర్దేశారు. ముందున్న వాళ్లు, ఇల్లు శుభ్రం చేసి ఇచ్చారు. ఒక పక్కగా గోడకి ఆనించి మంచం కూడా ఉంది.
“చాలా బాగుందమ్మా. అసలు ఈ గాలి పీలుస్తుంటేనే హాయిగా ఉంది.” అరుగు మీద కూర్చుని అంది జానకి.
“ఇంత చిన్నపిల్లలా ఉన్నావు, టీచరువా?” ఆశ్చర్యంగా అడిగింది గౌరమ్మ.
“టీచరుగారికి ఇదే మొదటి పోస్టింగంటమ్మా. టీచర్! మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ కిరసనాయిలు లేదు. కొనుక్కు రమ్మంటారా?”
“ఆడగాలా రఘూ? తెచ్చేయండి. ఈ పూటకి మనింట్లోనే భోయనం. కాసేపట్లో ఈయనొస్తాడు. మీరు కూడా తింటానంటే చెప్పండి, కాసింత జొన్నన్నం వండేస్తా.” గౌరమ్మ నవ్వుతూ అంది.
“భలే వారమ్మా! అమ్మా వాళ్లు చూస్తుంటారు. మేము రేపు వస్తాం టీచర్. మిమ్మల్ని స్కూల్ కి తీసుకెళ్తాం. రైటరుగారికి కూడా చెప్పాలి. మీ పని అయ్యాక మేం డ్యూటీ కి వెళ్తాం. మాకు రేపు పొద్దున్న ఆఫ్.” రఘు స్నేహితులతో వెళ్లిపోయాడు.
అప్పన్న ఆ రాత్రికి రాలేదు. రావట్లేదని ఫోన్ చేశాడు.
“పట్నం వెళ్తే ఒకో సారి అమ్మాయింట్లో ఉండిపోతారు. మనం తినేసి పడుక్కుందాం. ఈ పూటకి మా ఇంట్లో పడుక్కోమ్మా!” గౌరమ్మ మాటలకి తలూపింది జానకి.
జానకి పొద్దున్నే లేచి తన ఇంటికి వెళ్లి సామాన్లన్నీ సర్దుకుంది. గౌరమ్మ తన పాల వాడిక అతనికే జానకికి కూడా పొయ్యమని చెప్పింది.
పదడుగులలో వీధిలో ఉన్న బోర్వెల్ నుంచి నీళ్లు తెచ్చుకుని, పెరట్లో ఉన్న గోలెంలో నింపుకుంది.
గౌరమ్మ ఎంత చెప్పినా వినకుండా జానకి తనకు వంట చేసుకుంది. అన్నట్లుగానే పొద్దున్న పది గంటలకి వచ్చేశారు రఘు, అతని మిత్రుడు. వాళ్ల వెనుకే కళ్ళజోడు సవరించుకుంటూ యాభై ఏళ్ల పెద్దాయన వచ్చాడు.
“టీచర్ గారూ! ఇతనే మీ స్కూల్లో ఆఫీసు నడిపే ఏకైక వీరుడు. ఎవరున్నా లేక పోయినా తొమ్మిదిన్నరకల్లా వచ్చేస్తాడు. గవర్నమెంట్ లో యుడిసి కాడర్. ఏ పని కావలసినా చేసేస్తాడు.”
“అవసరమైతే పట్నంలో ఆఫీసుకి కూడా వెళ్తాను టీచర్ గారూ! నా పేరు గురుమూర్తి.” జానకికి నమస్కారం పెట్టాడు.
“సరే… పదండి. నా జాయినింగ్ రిపోర్ట్…”
“హెడ్ మాస్టర్ ఎవరూ లేరమ్మా.ఎవరు వచ్చినా నెల కూడా చెయ్యకుండా వెళ్లిపోతున్నారు. మీ జాయినింగ్ రిపోర్ట్ నేను వెళ్లి ఇచ్చి వస్తాను. మొదటి పోస్టింగ్ కదా!”
“ధన్యవాదాలు మూర్తిగారూ! మనం ఇక్కడి పరిస్థితిని మార్చాలి.”
నలుగురూ పాఠశాల కేసి నడిచారు. పదినిముషాల కంటే తక్కువే పట్టింది. జానకి ఉంటున్న ఇల్లు కంటే కొంచెం పెద్ద డాబా ఇల్లు. వరండా పైన పిట్టగోడకి కట్టి పెద్ద బోర్డు, “ప్రభుత్వ పాఠశాల” మాత్రం శుభ్రంగా తుడిచి నట్లుంది.
ముందు వరండా, వెనుక రెండు గదులు. చుట్టూ ఖాళీ స్థలం ఉంది. పెద్ద పెద్ద వేప చెట్లు, రావి చెట్లు రెండేసి ఉన్నాయి. అంతా ముళ్ల తుప్పలతో నిండి పోయి, నడవటం కష్టంగా ఉంది.
“మీరు వస్తున్నారని, ఇందాక పిల్లలు తుడిచారమ్మా!” మూర్తిగారి మాట పూర్తవకుండానే, పది మంది పిల్లలు, ఆరు నుంచి పదేళ్ల లోపు వాళ్లు వచ్చేశారు.
“గుడ్ మార్నింగ్ టీచర్” సెల్యూట్ చేశారు.
“ఇంత మందేనా?” జానకి ఆశ్చర్యపోియింది.
“మొత్తం నలభైమందమ్మా. మిగిలిన వాళ్లు పన్లకి వెళ్తారు.”
“ఇప్పటి నుంచీ ఈ బడి బాగోగులు మనిద్దరివీ. ఇదిగో నా జాయినింగ్ రిపోర్ట్.” స్కూల్ పేరు, డియివో గారి అడ్రస్ రాసి ఉన్న పొడవాటి కవర్ ఇచ్చింది. అది చూస్తేనే జానకి పనితీరు అర్థమైపోతుంది.
“ఇది మొదటి పోస్ంగేనామ్మా?” గురుమూర్తికి నమ్మశక్యంగా లేదు. అంత వరకూ ఎవరు వచ్చినా అతనే జాయినింగ్ రిపోర్ట్ రాసి ఇవ్వాల్సి వచ్చేది.
“అవును మూర్తిగారూ! నేను లాయర్ చిట్టి రాజు గారింట్లో పెరిగాను. మా అమ్మ అక్కడ పని చేస్తుంది. సెలవుల్లో, తీరిక సమయాల్లో, వారి ఆఫీసులో పని చేసేదాన్ని. ప్రొసీజర్స్ అన్నీ తెలుసు.” మూర్తి అర్థం చేసుకున్నట్లు తలూపాడు.
వరండా మెట్లెక్కి మూర్తిని తాళం అడిగి తీసి తలుపు నెట్టింది. తలుపు ఢామ్మని బందులు ఊడి కింద పడిపోయింది.
జానకి అసంకల్పితంగా అడుగులు వెనక్కి వేసింది. అందరూ ఆదుర్ధాగా తలుపు దగ్గరకు వచ్చారు. ఏం ఫరవాలేదన్నట్లు సైగ చేసింది.
“వదులుగా ఉన్నాయమ్మా రిపేర్ చేయిద్దామనుకుంటున్నా కానీ వడ్రంగి దొరకట్లేదు. ఇంత తొందరగా ఊడతాయని…”
“నేనే కాస్త గట్టిగా తోసినట్లున్నాను…” జానకి చీర దులుపుకుంటూ అంది.
రఘు తలుపు పక్కకి తీసి లోపలికి త్రోవ చేశాడు.
లోపల కాస్త శుభ్రంగానే ఉంది. పక్క పక్క గదులు రెండు. ముందు హాల్లో మూర్తిగారి బల్ల, కుర్చీ, పక్కగా ఒక చెక్క బీరువా ఉన్నాయి. గోడకి ఆనించి నాలుగు ఫోల్డింగ్ ఇనప కుర్చీలు ఉన్నాయి. అన్నీ విప్పదీసి వేసి కూర్చున్నారు.
“ప్రస్తుతం నేనొక్కదాన్నే కనుక, స్కూల్ నిర్వహణ కూడా నేనే చూసుకోవాలి. చీపుర్లు, గునపం లాంటి పనిముట్లుంటే తెప్పించండి మూర్తిగారూ!” జానకి పిల్లల్ని పిలిచి ఏ క్లాసులో కనుక్కుంది. ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నారు. ఐదో క్లాస్ పిల్లలెవరూ రాలేదు. నాలుగో క్లాసులో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు ఉన్నారు... క్లాసుకి ఇద్దరు చొప్పున మిగిలిన క్లాసుల్లో ఉన్నారు.
అందరినీ వరండాలోనే క్లాసుల వారీగా కొద్ది కొద్ది దూరంలో కూర్చోపెట్టి, పుస్తకాలు తియ్యమంది. రాత పుస్తకాల్లో, తాము చివరగా చదివిన పాఠాల చివర ఉండే ప్రశ్నలు, వాటికి జవాబులు రాయమంది.
అంతలో చీపుర్లు, మొక్కలు తవ్వే పరికరాలు వచ్చాయి. కొంగు దోపి చీపురు తీసుకుని వాకిలి ఊడవటం మొదలు పెట్టింది. మూర్తి గంప తీసుకుని తుక్కులు ఏరుతున్నాడు. రఘు, ఫ్రెండు గునపం తో తుప్పలు తవ్వి తీస్తున్నారు.
“అయ్యో… మీరందరూ ఎందుకు…”
“అదేంటి టీచర్? ఇది మన బడి. ఆఫ్ ఉన్న రోజు మా ఫ్రెండ్స్ ని వచ్చి చెయ్యమంటాను. ఇంతకాలం శ్రద్ధ తీసుకునే టీచర్లు లేక పట్టించుకోలేదు.”
“మూర్తిగారూ రేపటి నుంచి పొద్దున్నే బయల్దేరి, ఇవేళ బడికి రాని పిల్లల ఇళ్లకి వెళ్దాము. స్కూలుకి వచ్చేట్లు మోటివేట్ చేద్దాం. మధ్యాన్న భోజనాలు ఇస్తున్నారా?”
“అంటే… కాంట్రాక్టర్ సెలవులో ఉన్నాడు. పిలిపిస్తా…”
“డబ్బులు ఇస్తున్నారు కదా సరుకులు తెచ్చుకుని, వండి తీసుకొస్తున్నాడా?” జానకికి అక్కడ తీరు ఎంత అస్తవ్యస్తంగా ఉందో తెలిసి పోయింది. వచ్చిన డబ్బు స్వాహా అయి పోతోంది.
“రేపట్నుంచీ దాని సంగతి కూడా చూడాలి. రఘుగారూ?” జానకి పిలిచింది.
“అర్ధమయింది టీచర్… స్కూల్లోనే వండిద్దాం.” రఘు, గురుమూర్తి కేసి చూసాడు. అతను కాస్త వణుకుతూ తలూపాడు.
పిల్లలు తమ పుస్తకాలు తీసుకొచ్చి చూపించారు. మరీ అనుకున్నంత చెత్తగా రాయలేదు. కొన్ని తప్పులున్నా, అందరికీ అక్షరాలు రాయడం, ప్రశ్నలకి సమాధానం రాయడం బానే వచ్చింది.
“రోజూ నేనే రెండేసి గంటలు కూర్చోపెట్టి చదివిస్తున్నా మేడమ్!” గురుమూర్తిని మెచ్చుకున్నట్లు చూసింది జానకి.
అంతే… అప్పట్నుంచీ స్కూలు స్థితి మారిపోయింది. మూడు నెలల్లో పిల్లల సంఖ్య యాభైకి చేరింది. అప్పన్న గారి దగ్గరకు వెళ్లి, ఆయన చొరవ తీసుకునేలా చేసింది. తాగునీరు, బాత్రూములు, బెంచీలు, బ్లాక్ బోర్డ్… అన్నీ అమర్చుకున్నారు. గురుమూర్తి కూడా శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు.
ఇద్దరు టీచర్లని వేశారు. జానకిని ఆదర్శంగా తీసుకోమని ఊరి పెద్దగా వాళ్లకి చెప్పాడు అప్పన్న. క్రమంగా పక్క ఊళ్ల స్కూళ్లని కలిపి ఉన్నత పాఠశాల చేశారు.
*......................*
ఎపిసోడ్- 4
థింసా
“సత్యా! సత్యా!” సూర్యోదయం అయిన కాసేపటికే వీధి లోంచి వస్తున్న పిలుపులు విని సత్య, గౌరమ్మ బయటికి వచ్చారు. అప్పటికే ఇద్దరివీ స్నానం, పూజ అయిపోయాయి.
సత్య కాలు వాపు పూర్తిగా తీసేసింది. నొప్పి కూడా బాగా తగ్గింది.
జానకీ, ముత్యాలు బైట తీరుగా పెంచిన పూల మొక్కలు చూస్తూ నిలుచున్నారు. మందారాలు ఆకు ఆకుకీ ఒక్కో పువ్వు లాగ పూశాయి. చామంతులు, కనకాంబరాలు చెప్పనే అక్కర్లేదు.
“టీచర్! మీరా… రండి రండి.” ఆశ్చర్యానందాలతో లోపలికి తీసుకెళ్లింది సత్య. టీచరుగారు తమ ఇంటికి వచ్చారంటే అంతే… మరి… మాటలా!
“కాలు ఎలా ఉంది సత్యా?” జానకి వంగుని కాలు చూస్తూ అడిగింది.
“బాగుంది టీచర్. అమ్మమ్మ వైద్యానికి దెబ్బకి తగ్గి పోయింది.”
“తాతగారు లేరా?”
“పొద్దున్నే పొలం వెళ్లి పోయారు. కూర్చోండమ్మా! కాస్త వేడిగా టీ తాగుతారా, లేదంటే అరకు కాఫీ పవుడ్రు కూడా ఉంది, డికాక్షన్ వేసేస్తా.” గౌరమ్మ లోపలికి వెళ్లింది.
“మనోళ్లందరూ వస్తన్నారక్కా! ధింసా డాన్స్ చేద్దామని… సెలవులై పోతే నువ్వెళ్లి పోతావు కదా! మీ ఇంట్లో చాలా పెద్ద గ్రౌండే ఉందే.” ముత్యాలు వీధి గుమ్మం దగ్గరికి వెళ్లి అంతా తిరిగి చూస్తూ అంది.
అంతలో బిలబిల మంటూ అందరూ వచ్చేశారు.
మొత్తం పదిమంది. సత్య, జానకీ కూడా వారితో చేరారు. గుండ్రంగా ఒకరి పక్కన ఒకరు నిల్చుని, వీపు వెనుక నుంచి పక్క వాళ్ల నడుం మీద చేతులు వేశారు. చీరలు మోకాళ్ల కిందికి వచ్చేలా, వాళ్ల సాంప్రదాయం ప్రకారం కట్టారు.
గౌరమ్మ, వాళ్ల మాటలు విని లోపల్నుంచి వస్తూ డప్పు తీసుకు వచ్చి, పక్కగా నిల్చుని వాయించడం మొదలు పెట్టింది.
“నిన్ననే పూలేరుకుని వచ్చాం కదా… ‘పోతర్ తోలా’ (ఆకులు ఏరడం) దింసా చేద్దామక్కా!” వరం సూచించింది, ఏ రకం డాన్స్ చెయ్యాలా అని ఆలోచించే లోపలే.
“అవునవును. మన పనే ఆకులు, పువ్వులు ఏరటం కదా… మంచి సలహా!. దాంతోనే మొదలు పెడదాం.” గౌరమ్మ అందరినీ ముందు వెనుక రెండు వరసల్లో నిలబెట్టింది. ముందున్నవారి భుజాల మీద వెనుక వాళ్లు చేతులు వేశారు.
అందరూ తలలు పక్కలకి కదుపుతూ, అడుగులు వెనక్కీ ముందుకూ వేస్తూ… ముందు వాళ్లు ఆకులు ఏరుతున్నట్లు అభినయిస్తూ పది నిముషాలు నృత్యం చేశారు. ఒక్కరు కూడా లయ తప్పలేదు. ఎవరికీ ఎవరూ అడ్డు రాలేదు.
మధ్యలో ఇద్దరిద్దరు బైటికి వస్తూ ముందు వెనుకలకి మారారు.
సత్య ఆయాస పడుతూ ఒక పక్కగా నిలిచి పోయింది. చదువు మీద దృష్టి పెడ్తూ, ఏ వ్యాయామం చెయ్యటం లేదు. హాస్టల్ లో ఉండటం వలన నడక కూడా బాగా తగ్గి పోయింది.
“అప్పుడే అలసి పోయావా… ఇంకా ‘బోడా దింసా’ నేర్పిద్దామనుకున్నా!” ముత్యాలు కిసుక్కున నవ్వింది.
అందరూ ఆయాస పడుతూ అరుగుల మీద కూలబడ్డారు.
“అబ్బో…’బోడా దింసా’. నీకు నేర్పించేంతగా వచ్చేసిందే?” గౌరమ్మ డప్పు కొడ్తూ అడిగింది.
“అంటే… ఇప్పుడు నేర్చుకుందామనీ” ముత్యాలు సిగ్గు పడిపోయింది.
“అదేం థింసా అమ్మమ్మా? నాకు పేర్లు సరిగ్గా తెలీవు.”
“బోడా దింసా చాలా పెద్ద నృత్యం.గ్రామ దేవతలను పూజిస్తూ చేస్తారు. పెద్ద వాయిద్య హోరుతో నృత్యం ప్రారంభమవుతుంది. కుడివైపు మగవాళ్ళు, ఎడమవైపు ఆడవాళ్ళు ఒక పెద్ద వరుసలో బారులు తీరి, వీపు వెనుక నుంచి చేతులు పోనిచ్చి ఒకరి నడుమును ఇంకొకరు పట్టుకొంటారు. కుడి వరుస లోని చివరగా వున్న నెమలి ఈకల పింఛాన్ని పట్టుకొన్న కథా నాయకుడు, ఎడమ వరుసలోని చివరికొసలో వున్న కథానాయకి తాళం తప్పకుండా అడుగులు వేస్తూ ముందుకు వచ్చి కలుసుకొంటారు. అప్పుడు మిగిలిన వాళ్లంతా పాముల్లా మెలికలు తిరుగుతూ, గుండ్రంగా తిరుగుతూ మధ్య మధ్యలో హుయ్, హేయ్ అంటూ అరుస్తూ తిరిగి మళ్ళీ తమ తమ వరుసలలో చేరిపోతారు. జనవరి నెలలో సంక్రాంతికి ఈ నృత్యం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. మనోళ్లందరికీ చాలా ఇష్టం ఈ డాన్సంటే.”
“బాగా చెప్పారు అమ్మమ్మా. ఇలా చెప్పటం మాకు రాదు. చేసేస్తాం కానీ!” వరం గౌరమ్మ చేతులు పట్టుకుని ఊపింది.
సత్య లోపలికి వెళ్లి, అరటి ఆకు ముక్కల్లో ఇప్పపూల లడ్డూలు, వేయించి ఉప్పు కారం వేసిన అటుకులు తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ తినేసి, ఆకులు అక్కడున్న గోతిలో పడేసి చేతులు కడుక్కుని వచ్చారు.
“ఏమ్మా! అందరూ బాగున్నారా? టీచరుగారూ! బడి ఎట్లా నడుస్తోంది? సత్యా! మనోళ్లందరికీ మంచినీళ్లట్టుకురామ్మా.” అందరినీ ఒకే సారి పలకరిస్తూ వచ్చాడు అప్పన్న. అతని వెనుకే పది మంది కుర్రాళ్లు, ఇరవై ఐదేళ్ల లోపు వాళ్లు వచ్చారు. అందరూ సర్దుకుని అరుగుల మీద కూర్తున్నారు.
ఇంటి ముందున్న స్థలంలో గుండ్రంగా సిమెంటు బెంచీల్లాగా అరుగులు కట్టించాడు అప్పన్న. చిన్న చిన్న సమావేశాలు ఇంట్లోనే నిర్వహిస్తూంటాడు.
“బాగున్నామండీ. ఈ సారి జెండా పండుగ కి మీరు తప్పకుండా రావాలి. గుర్తు చేస్తాను. పదో తరగతి పరీక్షల్లో అందరూ పాసయ్యారు.” జానకి లేచి జవాబిచ్చింది.
“ఫర్లేదమ్మా. కూర్చో… నువ్వు తల్చుకుంటే పాసవక ఏం చేస్తారు.”
అంతలో ముత్యాలు వెళ్లి జానకి చెవిలో ఏదో చెప్పింది.
“ఏంటో అంటాంది గడుగ్గాయి…” అప్పన్న నీళ్లు గడగడా తాగి అన్నాడు.
“ఇప్పటి వరకూ ధింసా డాన్సు చేశాము. ఈ అబ్బాయిలందరూ వచ్చారు కదా బోడా దింసా చేద్దామా అంటోంది. సరిపోయే అబ్బాయిలు కూడా ఉన్నారు కదా అని.”
“నిజమే. చాలా రోజులయింది. చెయ్యండి. చూస్తాను. అసలే ఈ అడవిలో గవర్నమెంటోళ్ల గోలతో బుర్ర వేడెక్కి పోయింది.” అప్పన్న అనుమతి ఇచ్చాడు.
“మరి హీరో, హీరోయిన్ మీరు, అమ్మమ్మగారు వెయ్యాలి.”
“మేమా!” అంటూ గౌరమ్మ ఇంట్లోకి వెళ్లబోయింది.
“మేం ధింసా చెయ్యకుండానే ఈ వయసొచ్చిందా… అట్టాగే పద పద.” అప్పన్న లేచాడు.
అందరూ రెండు వరుసల్లో సర్దుకున్నారు. కుడి వరుస చివర్లో అప్పన్న తయారుగా నిల్చున్నాడు. వరం తన సంచిలోంచి నెమలి పింఛాన్ని తీసి ఆయన చేతికి ఇచ్చింది.
గౌరమ్మకి కూడా హుషారు వచ్చింది. చురుకుగా ఎడమ వరుస చివరికి కదిలింది. పక్కనున్న అమ్మాయి ఆవిడ నడుం పట్టుకుంది.
ఒక అబ్బాయి, అమ్మాయి డప్పు, కొమ్ము బూరా వాయించడం మొదలు పెట్టారు.
లయ బద్ధంగా అందరూ అడుగులు వేస్తుండగా అప్పన్న, గౌరమ్మ ముందుకి వచ్చారు. మిగిలిన అందరూ మెలికలు తిరుగుతూ రకరకాల విన్యాసాలు చేశారు. కుర్రాళ్లతో సమానంగా పెద్దవాళ్లు కూడా అడుగులు వేశారు.
రోజంతా తిరుగుతూ ఏదో పని చేస్తూ ఉండే గిరిజనులకి వయసు వచ్చినా కూడా హుషారు తగ్గదు.
దాదాపు అరగంట సేపు… ఎలా గడిచిందో తెలియలేదు.
నృత్యం అవగానే అందరూ ఆయాస పడుతూ కూర్చుండి పోయారు, చెమటలు కక్కుతూ. బుల్లి బుల్లి కుండల్లో అందరికీ నీళ్లు ఇచ్చారు సత్య, వరం కలిసి. అవన్నీ తయారుగా ఉంటాయి అప్పన్నగారి ఇంట్లో.
అప్పన్నగారు ఇంటికి రాగానే తనకి కుడి భుజంలా ఉండే రఘునాథ్ కి సైగ చేశాడు. అతను వెళ్లి ఊర్లో ఉన్న ఒక్క పాక హోటల్ లో ఇరవై మందికి భోజనాలు చెప్పి వచ్చాడు.
మొక్కజొన్న రొట్టెలు, వంకాయ-బంగాళాదుంప కలిపిన కూర, ఇప్పపూల పులుసు తో వేడి వేడి అన్నం వార్చి తీసుకొచ్చాడు హోటలతను. వడ్డించడానికి ఇద్దరు సహాయకులతో.
మూడు గంటలు ఎలా గడిచి పోయాయో ఎవరికీ తెలియలేదు.
“ధింసా నృత్యం ఎవరు పుట్టించారు తాతగారూ భరతనాట్యంకి భరతముని లాగా, ఎవరైనా ఉన్నారా?” సత్య అందరూ టీలు తాగాక అడిగింది.
“అబ్బో… చాలా గొడవలైతున్నాయి దాని గురించి. ‘మీకేం సంబంధం లేదు, ఆ డాన్సు మాదే అంటున్నారు, ఒడిస్సా వోళ్లు.’ వాళ్లు డేంసా అంటారు. పైగా పేటెంటు తీసుకుంటారుట. కానీ వాళ్ల నాట్యానికీ, ధింసాకీ చాలా తేడా ఉంది.”
“దగ్గర దగ్గర దేశాలే కదా, ఎక్కడైనా ఎవరైనా మొదలు పెట్టి ఉండచ్చు కదా తాతయ్యా.”
“నిజమేనమ్మా. అప్పట్లో రాజులు యుద్ధాలు చేసినా ప్రజలు స్నేహంగానే ఉండేవారు. ఇప్పుడు ప్రజలకెక్కిస్తున్నారు ముందుగా. అందుకే రోజూ ఏదో గోల తప్పట్లేదు. థింసా అంటే అర్ధం ఎవరికైనా తెలుసా?” చుట్టూ పరికించి చూశాడు అప్పన్న అందరినీ.
“థింసా అంటే దింసా…” ముత్యాలు రెండు మాటలూ విడివిడిగా అని కళ్లు పెద్దవి చేసింది, ఎవరూ పలక్క పోయే సరికి సిగ్గుగా తల వంచుకుంది.
అప్పన్న గట్టిగా నవ్వాడు. ముత్యాలు చురుకుతనం వచ్చినప్పట్నుంచీ చూస్తున్నాడు.
“టీచరమ్మా మంచి ట్రైనింగిస్తే పైకొస్తదీ అమ్మాయి. మీకు చెప్పక్కర్లేదనుకో! మీరు వీళ్లందరికీ వివరాలు చెప్పండి. మీరైతే బాగా చెప్తారు.” అప్పన్నకి రాజకీయాల్లో తిరిగి ఎవరిచేత మాట్లాడించాలో బాగా తెలుసు.
“థింసా అంటే అభినయం. చేతులు, కాళ్లు, తల తిప్పుతూ తాళం తప్పకుండా చేసే యాక్షన్. అంటే డాన్స్ అన్నమాట. సరైన పదం థింసా. అంటే వత్తు త ఉండాలి. కానీ వాడుకలో దింసా, ధింసాలా మారి పోయింది. మన మన్యంలో థింసా అంటాము. మనం రోజు వారీ చేసే పనులనే డాన్స్ రూపంలో చూపిస్తూంటాము.”
అందరూ చప్పట్లు కొట్టారు.
“అంతే కాదు… మన ఏజన్సీ లోనే హుకుంపేట మండలంలో ‘చత్రాయిపుట్టు’ పల్లె థింసాకి పుట్టిల్లుగా చెప్తారు. మొదటి నుంచీ అక్కడి గిరిజన మహిళలే దేశ వ్యాప్తంగా థింసా నాట్యం చేసే వారని చెప్తారు. పూర్వం దేవతా మూర్తులు కూడా ఈ నాట్యం ఆడే వారని, చట్రాయిపుట్టు దగ్గర్లో ఉన్న సీతమ్మ కొండమీద డాన్స్ పోజులో ఉన్న శిల్పాలని చూపిస్తూంటారు.
పగలంతా అడవికి వెళ్లి కష్టపడి పని చేసి, సాయంత్రం అలసట తీరేలాగ, థింసా డాన్స్ తో సరదాగా గడుపుతారని 1970 నుంచీ మన దేశంలో ప్రాచుర్యం పొందింది.”
“నిజంగా అమ్మాయ్! ఈ సంగతి నాక్కూడా తెలీదనుకో. బాగా వివరాలు చెప్పావు.”
“ఇప్పుడు దేశంలో అన్ని చోట్ల నుంచీ పిలుస్తున్నారు. తెలుగు యూనివర్సిటీ లో జానపద నృత్యం కూడా నాట్య విభాగంలో ఒక పేపర్ పెడుతున్నారు. పోను పోను బాగా ఆదరణ వస్తుందనిపిస్తుంది.”
“ఏం వచ్చినా ఏం లాభం తల్లీ మనోళ్లకి ఏవన్నా లాభమా? ఇక్కడి కొచ్చి నేర్చుకుని వాళ్లే డబ్బులకి నేర్పుతారు. మనోళ్ల బతుకులు మాత్రం ఇట్టాగే ఉంటయ్యి.”
“ఇప్పుడు కొంచెం ఫరవాలేదుకదా తాతయ్యా! మా హాస్టల్లో చాలా మంది చదువుకుంటున్నారు. పాసయిన వాళ్లకి గవర్న్మెంట్ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి.”
“ఏం చదువుతున్నారు తల్లీ? పట్నం దగ్గరగా ఉన్న మన ఊళ్లు ఫరవాలేదు. ఇక్కడ అందరికీ ఆధార్ కార్డులు, అడ్రస్ లు ఉన్నాయి. అడవుల్లోపల ఎన్ని పల్లెలున్నయ్యో! జనాభాలెక్కల్లో ఉంటారు, ఓట్ల కోసం. ఒక్క సదుపాయం కూడా లేదు. అడవిలో ఏం దొరుకుతే అది తింటమే.”
“మరి ప్రభుత్వం ఆదివాసీలకు ఏవేవో చేసేస్తున్నాం అంటారు?”
“ఏం లేదమ్మా. ఇదిగో ఈ మధ్యనే పేపర్లో వివరంగా రాశారు.”
“ఏం రాశారు తాతయ్యా.”
“మన ప్రాంతాల్లో లక్షల కోట్ల విలువైన ప్రకృతి సంపద ఉంది. అయినా బీద గానే బతుకుతున్నారు. షెడ్యూల్డ్ ఏరియా అధికభాగం అటవీ ప్రాంతం కావడంతో, మెజార్టీ గిరిజనులు అడవిలో జీవిస్తున్నారు. రోజ్‌వుడ్, టేకు, నల్లమద్ది పంట, మేలు రకాల కలప, బాక్సైట్, రంగురాళ్లు వంటి విలువైన ఖనిజాలు ఈ ఏరియాలో ఉన్నాయి. ఇంత విలువైన సంపదను గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఉపయోగించాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను బలహీనం చేసి, అటవీ భూమి, సహజ వనరులను బహుళజాతి, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. అందుకు ఆదివాసీలను వెనుకబడిన వారని చెప్పి మనల్ని పనికి రాని వారిగా చేస్తున్నారు. ఆధునిక పోకడల వైపు ఆదివాసీల జీవనాన్ని మళ్ళిస్తున్నారు. వీరిని అడవి, ప్రకృతి నుండి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు.
మన అడవిలో దొరికే వెదురు, పనస, సీతాఫలాలు, నారింజ, కమల, తేనె, అడ్డాకులు, చింతపండు, సీకాయి, కుంకుడు, కరక్కాయ, చీపుర్లు, మైనం, ఉసిరి, నారమామిడి, నల్ల జీడి... ఇవన్నీ అడవిలో కాలినడకన వెళ్లి సేకరిస్తారు. వాటిని సంతలో మైదాన ప్రాంత వ్యాపారస్తులకు అమ్ముకుని, వచ్చిన డబ్బుతో వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుక్కుంటారు.
ముఖ్యంగా ఈ సంతలకి మహిళలు వస్తారు. మన కట్టు తో, ఇక్కడ దొరికే నగలే ధరిస్తారు. రూపాయి, అర్ధరూపాయి బిళ్ళలు ఆభరణాలుగా అలంకరించుకుంటారు. అడవిలో పండించిన పంటలు ఈ సంతలో ఉంటాయి. సంత కేంద్రాలు స్నేహితులు కలుసుకోవడానికి తోడ్పడతాయి. ఎదుట పడిన స్నేహితుడిని ”జోర్ నేస్తం” అని పిలుచుకుంటారు. ఒకరికొకరు వంగి నమస్కరించుకుంటారు. స్నేహితులు ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతిలో భాగంగా సంతలో దొరికే గిరిజన సాంప్రదాయమైన మడ్డి కల్లు, జీలుగు కల్లు వంటి పానీయాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవి ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా సేవిస్తారు. సాంప్రదాయ ఆటపాటలతో సరదాగా గడుపుతారు. పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి, బంధువులను కలుసుకోవడానికి ఇదే వేదిక. సామాజిక సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి సంతలు గొప్ప వేదికలుగా నిలుస్తాయి.”
“మరి బాగానే ఉంది కదా తాతయ్యా!”
“బాగానే ఉండేది. దానికే దెబ్బ కొడుతున్నారు. మేము ఫైటింగు చేసేది మన హక్కుల కోసమే. చాలా మార్పులు వస్తున్నాయి.”
“ఆ ఫైటింగు చూపిస్తూ ఒక దింసా డాన్సు చేద్దామా?” అమాయకంగా ముత్యాలు అన్న మాటలకి సాలోచనగా జానకి కేసి చూశాడు అప్పన్న.
*............................*
ఎపిసోడ్- 5
ఆసరా
కొండపాలెం చుట్టూ పది గ్రామాలున్నాయి. అప్పలసామి చుట్టుపక్కల ఊళ్లలో బాగా పలుకుబడి ఉన్నవాడు.
అప్పలసామి వంశంలో రెండు తరాలనుంచీ ఒక్కొక్కరే సంతానం, వారు గూడెం పెద్దలు కూడా అవడంతో ఆస్తి బాగా వచ్చింది. గిరిజనుల ఆస్తులు గిరిజనులే కొనుక్కోవాలనే చట్టం ఉండడంతో అమ్మకానికి వచ్చిన భూములను సరైన ధరకు కొని పిల్లల పేర్ల మీద కూడా ఆస్తి పెంచాడు.
మండలం ఆఫీసులో కూడా అతని మాటకు విలువ ఇస్తారు. ఆ సంవత్సరం సర్పంచిగా ఎన్నుకుందామనుకుంటున్నారు. అందరితో కలివిడిగా ఉండి ఏ సమస్య వచ్చినా తీర్చడానికి ప్రయత్నిస్తాడు. దూరాల్లో, కాలి బాటలు మాత్రమే ఉన్న గూడేలకి కంకర రోడ్లైనా వేయించాలని ప్రయత్నిస్తున్నాడు. అందరికీ ఆసరాగా ఉంటాడు.
తనని కలవటానికి ఏ ఊరు నుంచి వచ్చిన వారైనా సరే ముందు వారి మాట వినడానికి ప్రయత్నిస్తాడు. చాలా మంది ప్రజా సేవకులమని చెప్పుకునే వారిలో ఆ గుణం ఉండదు. ముఖ్యంగా డబ్బు ఇవ్వకుండా ఎవరూ, ఏది చెప్పినా వినిపించుకోరు.
జిల్లాలో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, లాయర్లు మొదలైన వారితో పరిచయాలున్నాయి.
“సత్యా!” గట్టిగా కేకపెట్టాడు అప్పన్న.
సత్య తళతళ లాడే పెద్ద ఇత్తడి పళ్లెం నిండా బుల్లి బుల్లి కుండలలో టీ తీసుకొచ్చింది. అప్పటికే తాతయ్య నాలుగు సార్లు పిలిచాడు.
“వచ్చేస్తున్నా తాతయ్యా!” వడిగా నడుస్తూనే జాగ్రత్తగా తీసుకొచ్చింది.
ఇంటి ముందున్న అరుగుల మీద చుట్టు ప్రక్కల గ్రామాల్లోని పెద్దలు, యువకులు ఒక పక్కన కూర్చున్నారు. ఒక పక్కన పంచాయితీ ఆఫీసులో పని చేసే వాళ్లు, ప్రాధమిక, ఉన్నత పాఠశాలల్లో పని చేసే టీచర్లు, అంగన్ వాడీల నిర్వాహకులు కూర్చున్నారు.
అడవుల్లోపలగా ఉండే గూడేల వాళ్లు కూడా కొంత మంది వచ్చారు. కొందరు అమ్మాయిలు కూడా వచ్చారు. అందరికీ వంటలు చేయిస్తున్నాడు అప్పన్న.
ముందు రోజు థింసా నాట్యం తరువాత, రాత్రికి రాత్రే అందరికీ కబుర్లు అంది పోయాయి. అప్పన్న వెంట ఉండే యువకులలో సగం మందికి మోపెడ్లు ఉన్నాయి. ఒకరికొకరు చెప్పుకుని బళ్లమీద వచ్చేశారు. మొత్తం యాభైమంది ఉన్నారు.
“మనకున్న పాత కష్టాలకి తోడు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కొంత వరకూ పిల్లల చదువులు గట్టున పడ్డట్లే…” అప్పన్న చెప్పబోయాడు.
“ఇంకా కొన్ని గూడేల్లో అలాగే ఉందయ్యా. పడవల మీద బడికెళ్లాల్సి వస్తోంది. రోడ్లు లేవు. వానా కాలం వచ్చిందంటే బళ్లు మూసెయ్యాలిసిందే.” మర్రిపాలం గూడెం నుంచి వచ్చిన పెద్దాయన అన్నాడు.
“కొన్ని పల్లెల్లో బళ్లలో టీచర్లే లేరు. ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. ఎన్ని సార్లు జిల్లా ఆఫీసులో చెప్పినా లాభం ఉండట్లేదు.” కొండ అవతల ఉన్న గూడెం పెద్ద మొరబెట్టాడు
“మన జానకమ్మ టీచరు లాంటోళ్లని అన్ని గూడేల్లోనూ వేయించండయ్యా. అప్పుడు కానీ బళ్లు బాగు పడవు.” ముప్ఫై కిలో మీటర్లు దూరంలో ఉన్న గూడెం నుంచి వచ్చినాయన అప్పన్నతో అన్నాడు.
అక్కడున్న పిల్లలందరూ చప్పట్లు కొట్టారు.
“మా గూడెంలో ఐదో తరగతి అయాక చదువు మానేస్తున్నారు.” కొంచెం అంచు చిరిగిన పంచె కట్టుకున్నాయన….
“నేను పదో తరగతి తరువాత మానేసి పన్లోకెళ్తున్నానయ్యా. ఆ పుస్తకాలు దాచుకుని అప్పుడప్పుడు చదూకుంటుంటా.” ఇంకో గూడెం నుంచి వచ్చిన ఇరవై ఏళ్ల యువకుడు…
“మేం కూడా… మానేశామయ్యా.”
“మా గూడెంలో తాగటానికి నీరు లేదండయ్యా! కిలోమీటరు పైగా నడిచి వెళ్లి తెచ్చుకోవాలి. బోరు తవ్వించారు కానీ అది కూడా ఉప్పునీరే. టాంకులు వారానికి ఒక్కసారే వస్తాయి. రెండ్రోజులకో సారైనా… వస్తే బాగుంటుంది.”
అలా… అందరూ వారి సమస్యలని చెప్పటం మొదలు పెట్టారు. అవన్నీ తెలిసినవే అయినా అనుభవించే వాళ్లు చెప్తుంటే అప్పన్నకి చాలా బాధ కలిగింది.
ఈ లోగా, కాస్త నాగరీకత ఉండి పంటలు, కూరగాయలు, పళ్లు, ఆవులూ సమృద్ధిగా ఉండే కొమరాడలో రైతు, సాయిరామ్ కొత్త సమస్య చెప్పాడు.
“సాయీ! నువ్వు అందరి సమస్యలకీ నివారణ చూపించాలి… అట్టాంటిది ఇక్కడి కొచ్చావు ఈ దినం కలుస్తున్నామని అప్పుడే ఎవరు చెప్పారు నీకు?” అప్పన్న ఆప్యాయంగా అడిగాడు.
“నా ఇబ్బంది చెప్పుకుందామని నేనే పొద్దున్న బయల్దేరి వచ్చానయ్యా. అంతలో అందరూ కలుస్తున్నారని చెప్పారు. మరీ మంచిదనుకున్నా.”
“ఏమయింది సాయీ? మళ్లీ ఏనుగులు గోల చేస్తున్నాయా?”
అడవుల్లో గూడేల్లో ఏనుగులు, నక్కలు, ఇంకా ఇతర జంతువులు పెద్ద సమస్యే! పళ్లు, కూరగాయలు చేతి కొచ్చే సమయానికి గుంపులు గుంపులుగా వచ్చి తొక్కి నాశనం చేస్తాయి. అవి రాకుండా మంట పెట్టడం, లోతుగా చుట్టూ కాలువలు తవ్వడం లాంటి ఉపాయాలతో కాపాడు కుంటారు.
“ఏనుగులు కాదయ్యా! ఎప్పుడూ చూడని విధంగా నత్తలు, గంప గుత్తగా దాడికి దిగాయి. నాకు ఏడెకరాల్లో బొప్పాయి, జామ, పోక తోట ఉంది కదా! నాలుగెకరాలు పంట తినేశాయి. మధ్యలో అంతర పంటగా మూడెకరాల్లో వేసిన టమాటో మొక్కలు ఆకుల్తో సహా స్వాహా చేశాయి.”
“నత్తలా?” యువకులు ఆశ్చర్యంగా చూశారు.
“అదే కదా… ఎక్కడనుంచి వస్తున్నాయో తెలియటం లేదు. దగ్గర్లో ఉన్న ‘జంఝావతి’ చెరువు ఈ వరదలకి నిండి పోయింది. అక్కడున్న అడవిలో మొక్కలు, చిన్న చెట్లు కూడా కొట్టుకు పోయాయి. తిండి లేక అక్కడి నుంచే వస్తున్నాయని మా అనుమానం.”
“అన్నన్ని వస్తున్నాయా?”
“మొదట్లో పదీ, ఇరవై వస్తే తీసి పడేసే వాళ్లం. ఇప్పుడు వందల్లో వస్తున్నాయి. పైగా పక్క తోటలకి కూడా పాకుతున్నాయి. ఒక గుల్లలో ఆడనత్త, మగ నత్త కలిసే ఉంటాయి. సంపర్కం జరిగాక విడిపోతాయి. ఒక ఆడనత్త ఏడాదికి ఐదొందల నుంచి వెయ్యి వరకూ నత్తలని ఇస్తాయట. వీటిని ఎలా వదిలంచుకోవాలో తెలీడం లేదు.” సాయితో వచ్చిన రైతు అన్నాడు.
“ఉద్యానవన శాఖ (హార్టి కల్చర్) వాళ్లని అడుగుతే?” సత్య సందేహం వెలిబుచ్చింది.
సత్య, తనకి మొక్కల పెంపకం మీద ఉన్న అభిరుచితో తమ వన సంరక్షణ బృందంతో హార్టీకల్చర్ వాళ్లని కలుసు కుంటూ ఉంటుంది. బోటనీ మేడమ్ స్నేహితురాలు, అందులో డిప్యూటీ డైరెక్టర్. డిపార్ట్మెంట్ సహాయంతో, హాస్టల్ కాంపౌండ్ బైట చెట్లు నాటి, గుండ్రని కంచెలు పెట్టించారు. లోపల కూడా ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు.
“అడిగామమ్మా! మేడంగారు వచ్చి చూశారు కూడా! గడ్డ ఉప్పు ద్రావణంలో గోనె సంచుల్ని వేసి, వాటిని గట్ల మీద ఉంచుతే రావన్నారు. అది చాలా పత్తి పని. గడ్డ ఉప్పు బస్తాల్లో కొనాలి. క్యాబేజి ఆకుల్ని పోగు చేసి వాటి మీద ఆముదం, తవుడు, బెల్లంతో తయారు చేసిన గుళికల్ని పెడ్తే తినడానికి వచ్చి చచ్చి పోతాయన్నారు. అది చాలా ఖరీదు. అయినా చేశాము. పంట చేతికి వచ్చాక, అమ్మడం చాలా కష్టం అవుతోంది. గవర్నమెంటోళ్లు తక్కువ ధర ఇస్తున్నారు. పంట వేస్తే నష్టం తప్ప రూపాయి కూడా మిగల్టం లేదు.” సాయితో వచ్చిన చిన్న రైతు, కండువాతో కళ్లు వత్తుకున్నాడు, కన్నీరు ఆప లేక.
“అందులో అడవి గూడేల వాళ్లంటే అందరికీ అలుసే. అందరం కలిసి మన సమస్యలన్నీ కాగితం మీద రాసి, ఊరేగింపుగా పట్నంలో మనకి సంబంధించిన ఆఫీసుల్లో ఇద్దాాం.” అప్పన్న గంభీరమైన కంఠంతో అన్నాడు.
“చందాలు వసూలు చేసి మూడురోజులు పట్నంలో ఉండగలిగేలా ఏర్పాటు చేసుకోవాలి.” సాయి అన్నాడు.
“నేను, సాయి ముందుగా వెళ్లి పోలీసు డిఐజి గారి అనుమతి తీసుకుంటాము. అబ్బాయిలూ! మీ ఫోన్ నంబర్లు ఒక చిన్న పుస్తకంలో రాసి నా చేతికివ్వండి.” అప్పన్న హుకుం జారీ చేశాడు.
“ఊరేగింపులో, ముత్యాలు చెప్పినట్లు థింసా డాన్స్ చేద్దామా? మన డిమాండ్లు చూపిస్తూ?” సత్య, జానకీ టీచర్ని చూస్తూ అంది.
“వయసులో చిన్న వాళ్లనుకుంటాం కానీ అనుకోకుండా మంచి సలహాలు ఇస్తారు పిల్లలు. అలాగే చేద్దాం!” అప్పన్న అందరినీ చూస్తూ అన్నాడు.
సత్య వచ్చినవారిని అందరినీ తమ పెరట్లోకి తీసుకెళ్లింది. అక్కడంతా రంగు రంగుల ముగ్గులు వేసి ఉన్నాయి.
ఒక చెట్టు కింద వండిన పదార్ధాలన్నీ పేర్చి పెట్టారు. ఒక కుండలో ఇప్ప సారా కూడా ఉంది. అక్కడ ఏ పండుగ అయినా ఇప్ప సారా ఉండి తీరాలి.
థింసా నాట్యం చెయ్యడానికి గీతలు గీసి పెట్టారు. చెట్టు కింద పెద్ద పెద్ద తాళ్లు రంగు కాగితాలతో అలంకరించి ఉన్నాయి.
“ఇదంతా ఏంటయ్యగారూ?” అమ్మాయిలు అడిగారు.
“మనం ఈ గొడవల్లో పడి పండుగలు సరిగ్గా చేసుకోవట్లేదమ్మాయి! అందరూ కలవడమే తక్కువై పోతోంది. ఇప్పుడు ఇటుకల పండగ రోజులు. ఇదివరకు మగవాళ్లు వేటకెళ్తే, ఆడవాళ్లు గూడెం మొగలో ఎవరినీ రానియ్యకుండా తాళ్లు కట్టి తాచేరు (సుంకం లాంటిది) వసూలు చేసే వారు. ఇప్పుడు జంతువులు తగ్గిపోయాయి, వేట క్కూడా నిషేధం వచ్చింది. వేట లేకపోయినా సరదాగా పండుగ చేసుకోవచ్చు కదా… అందుకే ఇవేళ మొదలెట్టి వారం రోజులు చేద్దాము.”
“సరిగ్గా తినటానికే డబ్బులు సరిపోట్లేదయ్యా. ఇంక తాచేర్లు కూడానా?” అంచులు చిరిగిన పంచాయన వాపోయాడు.
“అవునయ్యా మేము నాలుగు రోజుల్నించీ ఇప్పపూల వంటలతోనే కడుపు నింపుకుంటున్నాము.”
“ముందుగా మనం భోంచేద్దాము రండి. తరువాత చేయబోయే పనులు మాట్లాడుకుందాము.”
అందరూ బోర్ దగ్గరున్న గోలెంలో నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కున్నారు. కొందరు దూరంగా వెళ్లి మొహాలు కూడా కడుక్కున్నారు.
“అమ్మో అడవి మాంసం కూర…” ఒకే సారి నాలుగైదు కంఠాలు వినిపించాయి.
“ఈ రోజు మాంసం వండలేదయ్యా… పొద్దున్నే పూజచేశారు తాతయ్య.” సత్య జవాబిచ్చింది.
“మాంసం అంటే మాంసం కాదమ్మా… వెదురు కొమ్ముల కూరనే మాంసం కూర అంటాము. మరచి పోయావా?” గౌరమ్మ సవరించింది, కూర గిన్నెల్లో గరిటలు వేస్తూ.
“అవును కదా అమ్మమ్మా! మాంసం అంటే వేటకెళ్లి తెచ్చిందే అనుకున్నా.”
“ఇప్పుడు అడవిలోకి వెళ్లి అన్నన్ని వెదుర్లెవరు తెచ్చారయ్యా? చాన్నాళ్లయింది. తెచ్చేవాళ్లెరూ లేక ఇంట్లో వండటం లేదు.” సాయి అన్నాడు.
“మా సైన్యం ఉన్నారు కదా… వెదుర్లు కోసుకొచ్చి, పేళ్లు తీసి కొమ్ములు సన్నగా కోసిచ్చారు.” అప్పన్న అందరూ సరిగ్గా వేసుకున్నారా లేదా అని చూస్తూ, అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు.
(ఎలుగుబంట్లు తిరిగే అడవిలోకి వెళ్లి, లేత వెదురు బొంగులు కోసి, వాటిపైనున్న పేళ్లుతీసి లోపల గుంజు లాంటి కొమ్ముల్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఆ ముక్కలు ఉడికించి, కావలసిన మసాలాలు వేసి వండుతారు.)
తెల్లగా పొడి పొడిలాడుతున్న వరి అన్నంలోకి కారం కారంగా కూర కలుపుకుని కడుపునిండా తిన్నారు అందరూ. కందులు వేయించి పప్పు చేసి, ఉడికించి టమోటాలు వేసి పప్పుచారు కాచింది గౌరమ్మ.
. అన్నాలు తింటుండగానే, వాళ్ల దగ్గరున్న మంచినీళ్లు తాగే కుండల్లో ఇప్పసారా పోశాడు రఘు. కొంచెం కొంచెగా అది తాగుతూ అందరూ లేచారు.
మూడు ఆకులు, పళ్లాల్లో పెట్టి, అన్నం కూరా వేసి తెచ్చింది సత్య, తనకీ, తాతయ్యకీ, అమ్మమ్మకీ.
ముగ్గురూ, ఒక అరుగు మీద కూర్చుని తిన్నారు. చేతులు కడుక్కుని తుడుచుకుంటూ రావి చెట్టుకింద అరుగు మీద కూర్చున్నారు.
“అప్పలసామిగారూ!” వీధి వాకిట్లోంచి పిలుపు వినిపించింది.
“రండి రండి డాక్టరుగారూ! మీ కోసమే చూస్తున్నా!” అప్పన్న వెళ్లి చెయ్యి పట్టుకుని తీసుకు వచ్చాడు ఆచారిగారిని.
ఆచారిగారు బైట ఎక్కడా భోజనం చెయ్యరు. అందుకే అప్పన్న అందరి భోజనాలు అయిపోయే సమయం చెప్పాడు.
అక్కడ అన్ని గూడేల వాళ్లూ ఆచారిగారి దగ్గరకే వెళ్తారు వైద్యానికి. ఆయనిచ్చిన మందులకి నాలుగైదు రోజుల్లో తగ్గి పోతుంది, మామూలుగా వచ్చే ఏ జబ్బైనా. మరీ తనకి లొంగకపోతే పట్నంలో ఆసుపత్రికి పంపిస్తారు.
రఘు బృందం ఆయనతో మూలికలు, చెట్ల సేకరణకి వెళ్తుంటారు. అవన్నీ నూరి జాగ్రత్త పరచటానికి రాజు అని ఒక కాంపౌడరున్నాడు. రాజు, ఆచారిగారి ఆసుపత్రిలో పనిచేశాడు. రిటై రయాక అతన్ని తీసుకొచ్చేశారు.
ఆచారిగారికి ఇద్దరబ్బాయిలు. ఒకబ్బాయి హైదరాబాద్లో, ఇంకొకతను ముంబాయిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.
ముత్యాలు పరిగెట్టుకుంటూ వచ్చింది.
“డాట్రుగారూ… మా అమ్మకి బాగా దగ్గు వచ్చిందండీ! బోలెడు తుమ్ములు కూడా. అస్సలు పడుకోలేక పోతోంది. మీ దగ్గరకి వద్దామనుకుంటోంది.”
“ముత్యాలూ ఇప్పుడు కాదు… సాయంత్రం వారింటికి వెళ్లు. మందిస్తారు.” సత్య హెచ్చరించింది. ముత్యాలు తల దించుకుని వెళ్లబోయింది.
“ఫర్లేదమ్మా… అక్కడ ముళ్ల చెట్టుంది చూడు ముత్యాలూ! తెల్లని గుండ్రని పూలున్నాయి, దాని పేరు తెల్ల తుమ్మ. ఒక కొమ్మ విరిచి ఆకులు తీసేసి, మెత్తగా నూరి ఆ గుండతో టీ లాగ కాచి ఇవ్వండి. తగ్గి పోతుంది. జాగ్రత్తగా తియ్యండి, ముళ్లు గుచ్చుకుంటాయి.” ఆచారిగారు అప్పన్న పక్కన కూర్చుని అన్నారు.
రఘు, తన స్నేహితుడిని తీసుకెళ్లి, ముళ్లు తొలగించుకుని, రెండు కొమ్మలు విరిచి ఇచ్చాడు.
ముత్యాలు వంగి ఆచారిగారికి దణ్ణం పెట్టి గౌరమ్మ దగ్గరకెళ్లి కూర్చుంది. గౌరమ్మ తుమ్మ కొమ్మల్ని కత్తితో చిన్న చిన్న ముక్కలు చేయ సాగింది. ఊరికే కూర్చోదు ఎప్పుడూ!
“చెప్పండి అప్పన్న గారూ! ఈ సమావేశంలో ఏం తేల్చారు?”
“రండి… మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం. ఇక్కడ పిల్లలు కాసేపు థింసా నాట్యం చేసుకుంటారుట.” ఆచారిగారిని ఇంట్లోకి తీసుకెళ్లాడు అప్పన్న. కొందరు సాయి లాంటి పెద్దలు కూడా వెళ్లారు.
“మన మండలాల్లో చాలా నయం అప్పన్న గారూ కొన్ని చోట్లయితే సర్పంచ్ లే ఏ పనీ కానియ్యరు. ముఖ్యంగా రోడ్లు వెయ్యనియ్యరు. అన్నీ అందిస్తే పిల్లలు చదువులంటూ పన్లోకి రారని… వాళ్ల మాటలు వినరనీ…” సాయి తాము చర్చించినదంతా డాక్టరుగారికి చెప్పాక అన్నాడు.
“అది నిజమే… ఈ మధ్యన మనోళ్ల పేరుమీద లేని పొలాలన్నీ గవర్న్మెంటువని చెప్పి, రియలెస్టేట్ వాళ్లు స్వాహా చేసి, పెద్ద కంపనీలకి ధారపోద్దామని చూస్తున్నారు. ఆదివాసీల పొలాలు కూడా చవగ్గా కొట్టేద్దామని చూస్తున్నారు… వాళ్లని మాయజేసి…” ఆచారిగారు అన్న మాటలకి తలూపారు అందరూ.
“మన దగ్గర అంతంత డబ్బూ లేదు, తెలిసిన రాజకీయ నాయకులూ లేరు.”
“తెలిసినా ఏం లాభం అప్పన్న గారూ! డబ్బు లేందే ఏ పనీ కాదు.”
“మన ప్రయత్నం మనం చేద్దాం. రేపు కూర్చుని ప్రణాలిక సిద్ధం చేసుకుందాం. పిల్లలేం చేస్తున్నారో చూద్దాం పదండి…” అప్పన్న పెరట్లోకి దారి తీశాడు.
పెరట్లో కోలాహలంగా ఉంది. అందరినీ వరం, రఘు వరుసల్లో నిలబెడ్తున్నారు.
“బాగ్ దింసా అభ్యాసం చేద్దాం. కాకపోతే బెబ్బులి బదులు ఏనుగులు వస్తున్నట్లూ చూపిద్దాం.”
బాగ్ దింసా నృత్యం పెద్దపులి వస్తే ఏం చెయ్యాలో సూచిస్తుంది. బృందంలో సగం మంది ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా మూగుతారు. తలను పై కెత్తుతూ ముని వేళ్ళ మీద నిలిచి వుంటారు. మిగతా సగం మంది చకచకా చుట్టు తిరుగుతూ లోపల ప్రవేశించి, పాము చుట్ట ఆకారంలో అంతా పరుచు కుంటారు. ఇలా అనేక సార్లు చేస్తారు.
అప్పన్న బృందం చూస్తుంటే, వాళ్లని కూడా తమ నాట్యం లో పాల్గొనమని బలవంతం పెట్టారు పిల్లలు.
అందరూ చేస్తుంటే… కన్నుల పండుగలా ఉంది.
అంతలో, అక్కడ స్కూల్లో పనిచేసే అటెండరు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అందరూ డాన్సు ఆపేశారు.
“మన బడి దగ్గరకి, వీరాదాస్ అని పట్నంలో పెద్ద రియలెస్టేట్ వ్యాపారి అంట… వచ్చాడు. మిమ్మల్ని పిలుచుకు రమ్మంటున్నాడు అప్పన్న గారూ!”
*..............*
ఎపిసోడ్- 6
ప్రతిజ్ఞ
“వీరాదాసా? ఆయనెందుకు వచ్చాడో?” ఆచారిగారు ఆందోళనగా అడిగారు.
“మీకు ఆయన తెలుసా డాక్టరుగారూ?” సాయి అడిగాడు.
“బాగా పేరున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ చుట్టుపక్కల అతన్ని తెలీని వాళ్లు ఎవరూ లేరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, ప్రభుత్వ ఉద్యోగులతో వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పుకుంటారు. నేను పనిచేసిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం, పెద్ద మాల్ కోసం తీసుకోవడానికి ఇతనే ప్రయత్నించాడని విన్నాను. చుట్టుపక్కల బజార్లో షాపులు తీసుకున్నాక మాల్ వాళ్లు… ఇది కూడా కలిస్తే బాగుంటుందని, ఇతన్ని నియోగించారుట.”
“ఏమయింది తీసుకున్నారా?”
“నేనున్నంత వరకు తీసుకోలేదు. మాల్ కట్టడం మాత్రం మొదలు పెట్టారు. అక్కడ నుంచి నేను వచ్చేశాక వేరే చోట ఇంకా పెద్ద ఆసుపత్రి కడతామని, అద్దె భవనంలోకి మార్చి మాల్ పూర్తి చేశారు. వీరాదాసు ఏ స్థలం సేకరణ మొదలు పెట్టినా ఎలాగో సాధిస్తాడని పేరు.” ఆచారి గారు అన్నారు.
“ఇక్కడేం పనో?” అప్పన్న సాలోచనగా చూశాడు.
“ఇక్కడేమైనా ప్రభుత్వ భూములున్నాయా? వాటిలో ఏమైనా ప్రారంభించే ఆలోచన ఉందేమో?” రఘు తన అనుమానం చెప్పాడు.
“చాలానే ఉన్నాయి. మన పాఠశాల వెనుక ఉన్న మైదానం ప్రభుత్వ భూమే... ఆ మధ్యన మన్యంలో గనుల తవ్వకాలు మొదలెడతారని వార్త వచ్చింది. దానికోసం వచ్చారేమో కనుక్కుందాం పదండి.” అప్పన్న దారి తీశాడు.
“మేము అమ్మాయిలు కూడా రావచ్చా తాతయ్యా? మా టీచర్…” జానకిని చూపిస్తూ సత్య అడిగింది.
“అందరూ వద్దు, ముగ్గురు రండి. టీచరుగారూ! మీరు రావాలి. రఘూ! మన వాళ్లందరినీ బయల్దేరమను.”
ఇదిగో అదిగో అని ఇరవై మంది బయల్దేరారు. ముందర అప్పన్న నడుస్తుండగా అందరూ అనుసరించారు.
పదేళ్లలో స్కూలు బిల్డింగ్ బాగా పెద్దది అయింది… రెండంతస్థుల భవనం. అన్ని క్లాసులకీ తలొక గది. చుట్టూ ప్రహరీ. ప్రహరీ ముందు, వెనుక చెట్లు బాగా పెంచారు. హెడ్ మాస్టర్, పది మంది టీచర్లతో బాగా నడిపిస్తున్నాడు.
మధ్యాన్న భోజనం తయారు చెయ్యడానికి వేరే షెడ్, దానికి చుట్టూ వరండా. పిల్లలు అక్కడ కూర్చుంటే వాళ్ల పళ్లాల్లో తెచ్చి వేస్తారు. బిల్డింగ్ వెనుక కూడా పెద్ద గేటుంది. దాని వెనుక ఆట స్థలం. బాట్మెంటన్ కోర్టు, క్రికెట్ ఆడే గ్రౌండ్… ఏ ప్రైవేట్ స్కూల్ కీ తీసిపోనట్లుంది.
“నేను వెళ్లాక ఇంకొక అంతస్తు కట్టారా టీచర్?” సత్య అంతా తిరిగి చూస్తూ సంతోషంగా అడిగింది.
“అవును సత్యా! మీ తాతయ్యగారు బాగా కల్పించుకుంటున్నారు. మా లాయర్ గారు, రోటరీ క్లబ్ వాళ్లు దత్తత తీసుకునేలా, ఎంతో కష్టపడి ఏర్పాటు చేశారు. ఇంక దేనికీ వెతుక్కోనక్కరలేదు.”
సత్య, టీచరుగారి చెయ్యి పట్టుకుని ఊపేసింది. ఆవిడ పడిన కష్టం కళ్లారా చూసింది. మొదట్లో తను కూడా కొంత పాలు పంచుకుంది మరి.
బడి బయట ఐదు కార్లు ఆగి ఉన్నాయి. ఒక కారు మీద ప్రభుత్వ రాజకీయ పార్టీ జండా ఉంది.పెద్ద పని మీదే వచ్చినట్లున్నారు
అందరూ స్కూల్ లోపలికి వెళ్లి, వెనుక గేటు దగ్గర హడావుడి చూసి అక్కడికి నడిచారు.
“సినిమా షూటింగమో?” ముత్యాలు హుషారుగా అంది. సత్య వెనకాల దాక్కుని వచ్చింది. జానకి మాట్లాడద్దని సైగ చేసింది.
పది మంది పైగా ఉన్నారు. రెండు గొడుగుల కింద కుర్చీల్లో కూర్చుని కాగితాలు చూస్తున ఇద్దరు పెద్ద మనుషులు కనిపించారు. మిగిలిన వాళ్లు చుట్టూ పరికిస్తున్నారు.
“రండి రండి అప్పలసామి గారూ! మీ కోసమే చూస్తున్నాం. నా పేరు వీరాదాసు.” అప్పన్నకి తన పక్కనే కుర్చీ చూపించాడు.
“నమస్కారం. మీ గురించి విన్నాను. మా ఊరికి పని మీద వచ్చినట్లున్నారే? ఎక్కడో జనావాసానికి దూరంగా బ్రతుకుతున్నాం. ఇక్కడ ఇంకా స్వచ్ఛమైన గాలి దొరుకుతోంది. తమరికి మా మీద దయ కలిగినట్లుంది…”
“గాలి దేముంది సార్? ఎక్కడికైనా దూరిపోతుంది. అభివృద్ధి ఉంది చూశారూ… అది మనం చేస్తేనే జరుగుతుంది. ఇక్కడ ఇన్నిన్ని ఎకరాలు పాండవబీడు… ఖాళీగా పడుంది. ఇదంతా మనం చేతిలోకి తీసుకున్నామంటే ఈ ప్రాంతం ప్రపంచమంతా మారుమోగి పోతుంది.” వీరాదాసు గర్వంగా చూశాడు.
“ఇప్పుడిక్కడ ఏం చేద్దామని సార్? అటవీ శాఖ వారి చట్టం, అడవుల రక్షణ కోసం… ఏ కట్టడాలనైనా నిషేధించింది కదా! రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సౌకర్యం లేదే? ఇది విహార యాత్రా స్థలం కూడా కాదు!” అప్పన్న కనుచూపు మేర పచ్చగా గడ్డి మొక్కలు పరచుకున్న మైదానాన్ని, చుట్టూ తలలూపుతున్న చెట్లతో తమకు ఎదురే లేనట్లు ఠీవిగా నిల్తున్న కొండలనీ బాధగా చూస్తూ అన్నాడు.
‘ఇతనికి చాలా తెలుసు. జాగ్రత్తగా ఉండాలి.’ అనుకున్నాడు వీరాదాసు.
“మీకు తెలవందేముంది అప్పలసామి గారూ? ఇదంతా ఖనిజాలతో కూడిన లేటరైట్ భూమి అని తెలిసిందే కదా! తవ్వకాలకి ప్రభుత్వ గనుల శాఖ అనుమతి కూడా ఇచ్చింది…” వీరాదాసు తన చేతిలో ఉన్న కాగితం చూపించబోయాడు.
“లేటరైట్ అంటే ఏంటి? తవ్వకాలేంటి… ఇదంతా అడవి కదా బాబయ్యా!” సాయితో వచ్చిన రైతు అడిగాడు.
“అడవే… కానీ ఇక్కడి భూమిలో, రాళ్లలో… ఇనుము, అల్యూమినియమ్ వంటి అనేక లోహాల ఖనిజ మిశ్రమాలున్నాయని తెలిసింది. అందుకే చెట్లు ఏమీ మొలవ్వు. అవి తవ్వి తీస్తే రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అతి త్వరలో ఇక్కడ పెద్ద పెద్ద గనులు రాబోతున్నాయి…” వీరాదాసు కంఠంలో గర్వం తొంగి చూసింది, అదంతా తన ప్రతిభే అన్నట్లు.
“గనులు తవ్వకం ప్రభుత్వం చూసుకుంటుంది కదా! ఆ లావాదేవీలతో మనకేం సంబంధం?” రఘు అడిగాడు. అవునన్నట్లు అప్పన్న తలూపాడు.
అప్పన్నకి చాలానే సందేహాలున్నట్లున్నాయి. ఒప్పించడం కష్టమే అనుకున్నాడు వీరాదాసు. అయినా ఇటువంటి వాళ్లని చాలా మందినే చూశాడతను.
“గనులు వస్తే, ఉద్యోగులు, వారితో కుటుంబాలు… అనేక వ్యాపారాలు వస్తాయి. వారందరికీ నివాసాలు కావాలి కదా! ఆ పనులన్నీ మనమే చెయ్యాలి. అందుకే ఇక్కడ భూమి సేకరణ మొదలు పెట్టమన్నారు.” వీరాసామి అసహనంగా తల తిప్పి అటూ ఇటూ చూశాడు, ఎవరైనా తన తరపు మాట్లాడతారేమో నని.
ఎవరూ కదల్లేదు. అందరికీ అప్పలసామి సంగతి తెలు.
“ఎవరు సేకరించమన్నారు? అసలు ఆ గనుల తవ్వకానికి లీజ్ సమయం అయిపోయిందని… తరువాత ఆలోచిస్తామన్నారుట కదా ఆ డిపార్ట్మెంటోళ్లు! ఇప్పడింక భూములు కొనుగోళ్లు ఎందుకు?”
“తాత్కాలికంగా ఆగినా, ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. అంత లోహ సంపద ఉందిక్కడ, మనం సేకరించి పెట్టుకుంటే వెంటనే టౌన్షిప్ ప్రారంభించ వచ్చు.”
“విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లాగా చేస్తారా?” సత్యకి అక్కడి రోడ్లు, భవనాలు, సందడి గుర్తుకు వచ్చాయి. ఇంటర్ చదివేటప్పుడు కాలేజి వాళ్లు తీసుకెళ్లి చూపించారు. ఇక్కడ కూడా అలా చేస్తే… అడవి లోకి మాత్రం వెళ్లకుండా ఉంటారా? అప్పుడు చెట్లూ, పర్యావరణం… కడుపులోంచీ బాధ తన్నుకు వచ్చింది,
“ఇంత ప్రశాంతమైన పరిసరాలని పాడుచేస్తారంటే…” ఏదో అనబోయింది. జానకి చెయ్యి పట్టుకుని ఆపింది.
“పెద్దవాళ్లు చూసుకుంటారు. మనం మాట్లాడకూడదు.” పక్కకి తీసుకెళ్లింది.
అందరూ, ముగ్గురు ముగ్గురు చేరి విడి విడిగా మంతనాలు చేస్తున్నారు. వాతావరణం చాలా వేడి వేడిగా ఉంది.
“అది కాదు టీచర్! ఇక్కడ మట్టి పూజ కూడా చేశారుట కదా! మన గిరిజనుల పేరు మీద తవ్వకాలకి అనుమతులు సంపాదించారుట, ఈ వీరాదాసు గారి తాలూకు పెద్దోళ్లు. అయితే… గడువు లోపు మొదలెట్టలేదని ఆపేశారుట. అప్పటి యమ్మెల్యే, గూడెం నాయకులు గోల గోల చేస్తే సద్దు మణిగారట.” రఘు, వీరాదాసు మనిషి దగ్గరకు వెళ్లి తెలుసుకుని చెప్పాడు.
“పదిహేనేళ్ల క్రితమే మనూళ్లలో చెట్లు లేని మైదానాల్లో మట్టి నమూనాలు తీసుకుని పరీక్షలు చేశారుట. టన్నుల కొద్దీ బాక్సైట్ ఖనిజం ఉందని తెలిసిందిట. కొన్ని మండలాల్లో తవ్వకం మొదలెట్టారుట కూడా.” సమాచారం సేకరించుకొచ్చాడు సాయి.
“అప్పటి మంత్రిగారికి మైనింగ్ మాఫియాకి బేరాలు కుదరక ఆపేశారుట. ఎన్ని అవరోధాలు కల్పించాలో అన్నీ చేశారుట. ఇప్పుడు ప్రభుత్వం మారాక తవ్వకానికి మళ్లీ అనుమతికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లున్నారు.” రఘు విచారంగా అన్నాడు.
“మీరేమన్నా చెప్పండి, మేము వప్పుకోము. అనుమతి పత్రాలు చూపించినా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటాము. పత్రాలు లేకపోతే మట్టిని ముట్టుకోనియ్యము.” అప్పన్న గట్టిగా చెప్పాడు.
“అది కాదు అప్పన్నగారూ రాత్రికి మాట్లాడుకుందాం. మేము అడవిలో గెస్ట్ హౌస్ లో బస చేస్తున్నాం. మీరు, పెద్దలు కొందరు వస్తే…” వీరాదాసు ఏదో చెప్పబోయాడు. మందు పార్టీ ఉపాయం పనిచేసేలా లేదు.
“రాత్రి ఎందుకు? ఇక్కడ ఉన్న పది గూడేల వాళ్లూ వస్తాం… రేపు పొద్దున్న కలుద్దాము.”
“అంటే… మైనింగ్ యజమానులు, రైతులకి అన్యాయం జరగదని చెప్పమన్నారు. ప్రభుత్వం కంటే ఎక్కువ ధర ఇస్తారు. ఎలాగా ఇక్కడి ఆదివాసీలకి లాభాలేం రావట్లేదు కదా?”
“రైతులు వాళ్ల పంటల మీద ఆధారపడింది తక్కువే. అడవుల్లో కాయలు కసర్లు తెచ్చుకుని బతుకుతున్నారు. సరే… రేపు పది గంటలకి ఇక్కడికి వచ్చెయ్యండి. మాట్లాడుకుందాం. రాత్రికి మా అడవిలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ హాయిగా పడుక్కోండి.”
కొండపాలెంకీ, పట్టణానికీ మధ్యలో… ఐదు కిలోమీటర్లలో విశ్రాంత గృహం ఉంది. అటవీ శాఖ వాళ్లు చాలా బాగా నిర్వహిస్తారు. అక్కడి కాపలాదారు వంట కూడా చేస్తాడు. బైట వరండాలో కూర్చుంటే అడవిలో ఉన్నట్లే ఉంటుంది. లేళ్లు, ఉడతలూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నక్కలు కూడా వస్తాయి. పెద్ద జంతువులు రాకుండా ముళ్లతీగల ప్రాకారం ఉంది.
వీరాదాసుతో వచ్చిన వాళ్లు పట్నం వెళ్లిపోతామన్నారు. గెస్ట్ హౌస్ అందరికీ సరిపోదు. రెండే గదులు. వచ్చేటప్పుడే దారిలో నలుగురికి వంట చేయమని చెప్పి వచ్చారు. కొండపాలెం భూమి అంత సులభంగా రాదని వ్యాపారులకి తెలుసు. పైగా ప్రభుత్వ భూమే అయినా కూడా, అక్కడ ఇంకొక చిక్కు కూడా ఉంది. అదెలా విడదీయాలా అని దాసు బృందం రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు.
ప్రభుత్వంతో ఇబ్బంది లేదు. ఎవరికి కావలసినది వారికి ఇచ్చేస్తే అనుమతి సులువుగానే వచ్చేస్తుంది. అక్కడి గిరిజనులతోనే సమస్య. వారిని సముదాయించడం చాలా కష్టం. అందులో అప్పన్న వంటి వారు అండగా ఉండటంతో మరింత గొడవ అయే అవకాశం ఉంది. ఇటువంటి లావా దేవీల్లో బోలెడు అనుభవం ఉన్న వీరాదాసుకే కొరుకుడు పడటం లేదు.
అప్పన్న రాత్రికి రాత్రే, తమ మండలం లోని ఊర్లలో యువకులకి, చురుకుగా ఉండే పెద్దలకి కబురు అందించాడు. రఘు బృందం తమ మోటారు బళ్లేసుకుని తిరిగి అందరినీ బడి దగ్గరకి చేర్చారు. వందమంది పైన ఉన్నారు. తొమ్మిదింటి కల్లా వచ్చేశారు.
వచ్చిన వారందరికీ, స్కూల్లో వంటింట్లోనే వేడి వేడి ఉప్మా, టీ తయారు చేయించారు.
ఫలారాలు చేశాక అప్పలసామి, అందరికీ జరగబోయే సమావేశం గురించి చెప్పాడు. కొన్ని గూడేల వాళ్లు ఇదివరకే విన్నారు. వీరాదాసు అంతకు ముందే విడివిడిగా ఊర్లకి వెళ్లి, ఫోటోలు చూపించి వివరించాడు.
“ఏం చేద్దామంటారయ్యా ఎక్కడా ఎదుగు బొదుగూ లేని బతుకులై పోయాయి కదా! ఇట్టాంటి వేనా వస్తే చేతినిండా పనులు దొరికి, కడుపు నిండా తింటామేమో అని ఆశగా ఉంది.” అడవి లోపల ఉండే గూడెం నాయకుడు అన్నాడు.
“నమస్కారం అప్పలసామిగారూ!” వీరాదాసు ఉత్సాహంగా ప్రవేశించాడు. ఎవరో అక్కడి సంగతులు అప్పడే చేరేసినట్లున్నారు.
“నమస్తే రండి రండి… ఇప్పడే మీ గురించే చెప్తున్నాను. ఫలారం చేస్తారా?”
“చేశాము సార్! మేము త్వరగా వెళ్లాలి. నిన్న అనుకున్నది చెప్దామని… ఈ ప్రభుత్వ భూమితో ఇబ్బంది లేదు. దానికి అన్ని అనుమతులూ వచ్చినట్లే. కాకపోతే అది సరిపోదు. దగ్గర్లో ఉన్న గూడెంల జాగా కూడా కావలసి ఉంటుంది. మీరు ఊహించిన దాని కంటే ఎక్కువే ఇస్తారు. దీనిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భవనాలు కూడా…” తను అనుకున్న చిక్కు కూడా విప్పదీశాడు వీరాసామి.
“అంటే మా స్కూలు బిల్డింగు పడగొట్టేస్తారా?” రఘు అడిగాడు.
“మార్పుల్లేకుండా బాగు పడటం ఎలాగ? మనం ఊహించనంత కొత్తగా తయారవుతుంది ఇక్కడ…”
“అంటే మరో కాంక్రీటు జంగిల్ తయారవుతుందన్నమాట.”
“సాధ్యమైనంత వరకూ చెట్లని కొట్టేయకుండా… కొట్టేసినా, వాటిని వేరే చోట పాతేలాగ చేద్దాం. జపాను వంటి దేశాల్లో అపార్ట్మెంట్లలోనే బాల్కనీలు, డాబాలు అడవుల్లా చేస్తున్నారు.” వీరాసామి ఫోటోలు చూపించాడు.
“ఫోటోలు చూట్టానికి బానే ఉన్నాయి. అంత అంకిత భావంతో చెయ్యాలి కదా! అదీకాక, కొన్ని ఫలసాయాన్నిచ్చే తోటలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, కాఫీ తోటలు… బాగా ఆదాయం వస్తుంది. అందులో మన్యం కాఫీకి బాగా గిరాకీ ఉంది.” అడిగాడు రఘు.
“కాఫీ మొక్కలదేముంది… చెట్ల కింద, రోడ్డు పక్కన కూడా మొలిచి, గింజలిస్తాయి. మొత్తం మన్యంలో ఎక్కడా వదలకుండా వేయించేద్దాం. ప్రతీ ఒక్కరూ శ్రద్ధ తీసుకుంటే అదేం పెద్ద పని కాదు. పెట్టుబడికి గనుల యజమానులే డబ్బిస్తారు.” వీరాదాసు మాటలకి అందరూ సర్దుకున్నట్లే కనిపించారు.
కానీ అప్పన్నకి తెలుసు… అవన్నీ వట్టి మాటలే అని. అయితే… సరైన ఆదాయం లేక చాలా మంది వలస వెళ్లిపోతున్నారు. గూడేల్లో సగానికి సగం ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. కాస్త తిండికి, బట్టకీ ఫరవాలేదనుకునే తనలాంటి వాళ్లు గూడానికి ఒకళ్లు కూడా ఉన్నారో లేదో.
వీరాదాసుకి తన మాట వినేట్లే కనిపించారు అక్కడ. అంతలో బాంబులాంటి ప్రశ్న అడిగాడు రఘు.
“మా గూడేలు తీసుకుంటే, అందరూ ఎక్కడ ఉండాలి? ఇళ్లు కట్టించి ఇస్తారా? మీ ప్రాజక్ట్ వచ్చే వరకూ మాకు తిండి ఎలాగ?”
“గనుల్లో ఉద్యోగాలిస్తారు కదా?”
“అప్పటి వరకూ? అసలు మా అడవులు తీసుకోవడం మాకిష్టం లేదు. ప్రభుత్వానికి చెప్పి కొత్త పనులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము. రోడ్లు బాగు చేయించి, నీటి సదుపాయం చేయిస్తే, పట్నం వెళ్లి పనులు చేసుకుని ఇళ్లకి వచ్చేస్తుండచ్చు. సహజ వనరులు పెంచాలి. మమ్మల్ని కూడా సంప్రదింపులకి పిలవాలి మీరు” ఆచారిగారు గంభీరంగా అన్నారు.
“తప్పకుండా డాక్టరుగారూ! ఒక హాస్పిటల్ కూడా కట్టిద్దాము. అందులో ఆయుర్వేద విభాగం కూడా ఉండేలాగ…”
వీరాదాసు ప్రతిజ్ఞలకి, వాగ్దానాలకి హద్దు లేదనిపించింది అప్పన్నకి.
అందరూ అతని మాయలో పడ్డట్లున్నారు.
“సరే దాసుగారూ! ముందుగా అన్ని కాగితాలూ పక్కాగా చూపించండి. గనులు తవ్వకానికి, మా వాళ్ల పొలాలు, స్థలాలు అమ్మడానికి … గిరిజనుల పేరు మీదే అయినా అనుమతులు కావాలి. రెండూ కూడా అంత సులభమైన పని కాదు. చెప్పకుండా, చాటుగా ఏ పనైనా చేస్తామంటే మేం వప్పుకోము. జాగా ఇచ్చిన వారందరికీ అడవి లోనే ప్రభుత్వ భూముల్లో, ఇళ్లు కట్టించి ఇవ్వాలి. లేదంటే గిరిజనులంతా కలసి సమ్మె చేస్తాం.”
అక్రమంగా తవ్వి ఖనిజాలు తీసుకుపోవడానికి సహకరించిన వీరాదాసు గతుక్కు మన్నాడు… అయినా బైటపడే రకం కాదు.
“అలాగే అప్పలసామిగారూ! ఆలిశ్యమైనా అంతా సరిగ్గా ఉన్నాకనే మొదలు పెడదాము.”
“నాకు నచ్చలేదు తాతయ్యా! ఆచారి డాక్టరుగారు చెప్పినట్లు మనకి కావలసినవి మనమే ప్రభుత్వంలో ప్రయత్నించి తెచ్చుకోవాలి. అడవుల జోలికి రియల్ ఎస్టేట్ వాళ్లు రావడమేంటి?” వీరాదాసు బృందం వెళ్లాక సత్య నిలదీసింది.
“నువ్వు ఫారెస్ట్ ఆఫీసరో, వన సంరక్షణ అధికారో అయ్యాక ప్రయత్నిద్దాం లేమ్మా!”
“అలాగే అవుతాను. తప్పకుండా మనవాళ్లకి సాయం చేస్తాను. ఇదే నా అభిలాష. ప్రతిజ్ఞ,”
*......................*
ఎపిసోడ్- 7
‘లక్ష్యం’
“సత్యా! అక్కడే ఆగిపోయావేం రారా… నీ లక్ష్యం ఎంతవరకూ వచ్చిందీ? అప్పటి ప్రతిజ్ఞ తరువాత మళ్లీ రానేలేదు. నాలుగేళ్లు పైనే అయింది కదూ?” కొండపాలెం పాఠశాలలో టీచర్ల గది గుమ్మంలోనే ఆగిపోయిన సత్యని, జానకి ఆదరంగా పిలిచింది.
“అవును టీచర్! పూర్తిగా చదువు మీదనే దృష్టి పెట్టాను. అనుకున్నది సాధించాలంటే కష్టపడాలి కదా!”
“చాలా సంతోషం సత్యా! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది నాకు.”
“థాంక్యూ టీచర్. నాక్కూడా సంతోషంగా ఉంది. మన బడిని అలాగే ఉంచినందుకు. ఆ వీరాదాసుగారు మళ్లీ రాలేదా? వెనుక మైదానం కూడా అలాగే ఉంది…” వరండాలోకి వెళ్ళి అంతా పరీక్షగా చూసి వచ్చింది సత్య.
“రాకేం… మూడు సార్లు ఎవరెవర్నో తీసుకుని వచ్చారు. అంత సులభమా గనులు తవ్వకానికి జిఓలు, గ్రాంట్లు తేవడం. అప్పుడు అనుమతి తేకుండా మాఫియా వాళ్లు మాయజేసి తవ్వుకుందామనుకున్నారు. మన వాళ్లు పడనియ్యలేదు. ఈ లోపు, అరకు దగ్గర, లంబసింగిలోనూ రియలెస్టేట్ పుంజుకుంది. వీరాదాసు బిజీ అయిపోయారు.”
“మంచిదే అయింది. మనం కావలసిన పనులన్నీ ప్రభుత్వంతో డైరెక్ట్ గా కలిసి చేయించుకుందాము. మా వన సంరక్షణ సంఘం వాళ్ల సహాయం తీసుకుందాము.” సత్య తేలిగ్గా అంది.
“బాగానే ఉంది. నీ ధ్యేయం ఎంతవరకూ వచ్చింది? అదే… ఫారెస్ట్ ఆఫీసర్ పరీక్షలు రాయడం, ట్రైనింగ్… దాని సంగతేం చేశావు? అసలు నీ చదువు ఎంత వరకూ వచ్చింది?” జానకి నిలదీసింది, అప్పన్నద్వారా తెలుస్తూనే ఉన్నా!
“యమ్మెస్సీ బోటనీ చేశాను టీచర్, యూనివర్సిటీ సెకండ్ వచ్చాను. ఏపి పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకి పిలుపు కోసం చూస్తున్నాను. ప్రభుత్వం మారడంతో ఆలిశ్యమవుతోందనుకుంటాను. చాలా పోటీ ఉంటుంది. ఆ పరీక్షలో నెగ్గాలనే మొదట్నుంచీ సాధన చేస్తున్నాను, కానీ సరిపోదేమో అనిపిస్తోంది.”
“అవును. చాలా పోటీ ఉంటుంది. కనీసం ఒక ఏడాది దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. హైద్రాబాద్ వెళ్లి, అక్కడ ట్రైనింగ్ సెంటర్ లో చేరుతే బాగుంటుంది. మా లాయర్ గారి అమ్మాయి వాళ్లకీ ఉంది సెంటర్. బాగా తయారు చేస్తారని పేరు. అమ్మాయిలకి హాస్టల్ కూడా ఉంది. మేమిద్దరం కలిసి స్కూల్లో చదువు కున్నాం. వెళ్లి చేరమని నా సలహా.”
“హైద్రాబాదా? అక్కడ తెలిసిన వారెవరూ లేరు. అమ్మ వాళ్లు పంపుతారో లేదో?” సత్య సందేహంగా అంది.
“భలే దానివే! మీ ఇంట్లో వాళ్లకి చిన్నప్పట్నుంచీ చెప్తూనే ఉన్నావు కదా? ఇప్పుడు దీనికే వెనుకాడితే సెలెక్టయాక, ఎక్కడో నాగాలాండ్ లో ట్రైనింగంటారు, అదయ్యాక ఏ అడవుల్లోనో పోస్టింగ్… అవన్నీ ఎలా చేస్తావు?” జానకి నవ్వుతూ తన సొరుగు లోంచి ఫైల్ తీసింది.
“అదికాదు టీచర్ హైద్రాబాద్ అంటే… ఎప్పుడూ ఏదో గొడవ అవుతూంటుంది కదా… నాకే బెదురుగా ఉంది.”
“ఈ సంగతి మీ తాతగారికి చెప్పు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సంతోషిస్తారు. ముందు ఇలా కూర్చో… నీ కోసం కొంత సమాచారం సేకరించి పెట్టాను. అయినా హైద్రాబాద్ లో ఏం గొడవల్లేవు. అప్పుడంటే విడిపోవడానికి హంగామా చేశారు.” సత్యని బల్ల దగ్గర కూర్చోబెట్టి ఫైల్ లో కాగితాలు బయటికి తీసింది.
“ఇవన్నీ… నువ్వు సర్వీస్ కమీషన్ పరీక్షకి ఎలా తయారవాలో తెలిపే పేపర్లు. వరుసగా కూర్చి పెట్టాను. నేను కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్ లో చేర్పిస్తాను. ఇదంతా మీ తాతగారి సలహా, సహాయం తోనే చేశాను. రెండు రోజుల్లో బయలు దేరదాం. రైలు టికెట్లు తెప్పించేశాను. తిన్నగా మా శిరీష ఇంటికి… అదే మా లాయర్ గారి అమ్మాయి… వెళ్లి పోదాం. బట్టలు, నీకు కావాల్సిన పుస్తకాలు సర్దుకుని తయారుగా ఉండాలి రేపటికల్లా!”
సత్య ఆశ్చర్యంగా కాగితాలన్నీ తిరగేసి చూసింది. అరగంట పట్టింది.
“టీచర్… ఇదంతా మీరు, నా కోసం చేశారా?”
“మరి… మనిద్దరి అనుబంధం అట్లాంటిది. నీకు గుర్తుందా నేను ఇక్కడ టీచరుగా చేరిన మొదటి రోజు… నువ్వు నాలుగో తరగతి చదువుతున్నావు. మొదటి రోజు దూరంగా తిరిగావు. మీ ఇంట్లోనే దిగాను కానీ నువ్వు కనిపించలేదు. నేను స్కూలుకెళ్లాక మీ తాతగారితో ఊర్నించి వచ్చావు.”
“అంటే, మీరు కూడా అందరి టీచర్లలాగా వెళ్లిపోతారేమో అని, ఆశ పెంచుకోవడం ఎందుకని దూరంగా ఉన్నాను. పైగా… మా తాతగారు ఇక్కడ చదువు సాగటం లేదని అమ్మా వాళ్ల దగ్గ దింపేయడానికి ఏర్పాట్లు చేసి వచ్చారు.”
“అంతే… ఆ తరువాత నుంచీ నా తోనే ఉన్నావు. పిల్లల్ని బడికి పంపమని చెప్పటానికి వాళ్ల ఇళ్లకి, సాయంత్రం వెళ్తే నావెంటే ఉండే దానివి. చిన్ని చిన్ని చేతులతో మొక్కలకి పాదులు చెయ్యడం, తుక్కులు ఎత్తడం, మీ తోటి పిల్లలని కూాడబెట్టి, బడి శుభ్రం చెయ్యడం… ఇవన్నీ ఎలా మర్చి పోతాను?”
సత్య తల వంచుకుంది. కళ్లలోంచి జలజలా నీళ్లు కారాయి.
“ఏమ్మా కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి, దురద కూడా ఉందా ఇదిగో ఈ చూర్ణం రెప్పల మీద పెట్టి అరగంట సేపు కళ్లు మూసుకో!” ఆచారిగారు లోపలికి రావడం చూడలేదు జానకీ, సత్యా.
“డాక్టర్ గారూ! మీరు ఇక్కడ…” సత్య లేచి నిలబడింది.
“రోజూ ఈ సమయానికి వస్తారు డాక్టర్ గారు… పిల్లలకి ఏదయినా సమస్య ఉంటే వెంటనే మందిస్తారు. దాంతో తప్పించుకోవడానికి లేక ఎవరూ స్కూలు మానడం లేదు.” జానకి నవ్వుతూ అంది.
“కాసేపు పిల్లలతో గడపడానికి మంచి అవకాశమమ్మా! వాళ్ల అమాయకమైన ప్రశ్నలు వింటుంటే హాయిగా ఉంటుంది. పన్లో పని ఆరోగ్యం గురించి, వాళ్ల భవిష్యత్ కార్య కలాపాల గురించి చర్చిస్తూంటాను. అన్నట్లు నీ కళ్లు బాగానే ఉన్నాయా?”
“అవి ఆనంద భాష్పాలండీ! మన స్కూలునీ, టీచర్ గారినీ చూడగానే ఆవేశం వచ్చేసింది. ఇమోషనల్ అయిపోయాను. క్షమించండి. పట్నవాస ప్రభావం… ఆంగ్ల పదాలు వచ్చేస్తున్నాయి.” నవ్వుతూ అంది సత్య.
ఆచారిగారు తెలుగులోనే మాట్లాడమని అందరికీ బోధిస్తూంటారు. పెద్ద వాళ్లు తప్ప పాలెంలో వాళ్ల కొండభాష ఎవరూ మాట్లాడట్లేదు.
“ఫరవాలేదమ్మా! పెద్ద చదువులు చదువుతున్నప్పుడు తప్పదు. పోటీ పరీక్షలకి తయారవుతున్నావా? ఇక్కడ అందరం నువ్వు ఆఫీసరుగా ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాం. నీకు బలానికి ఒక లేహ్యం ఇస్తాను, తప్పకుండా వాడు. అలసట అనిపించకుండా చదువుకో గలుగుతావు. ఇది అయిపోయాక మళ్లీ పంపుతాను.” ఆచారిగారు తన సంచీలోంచి ఒక పెద్ద సీసా తీసి ఇచ్చారు.
సత్యకి ఆనందంతో పాటు కొద్దిగా భయం వేసింది. తాను ఇంత మంది ఆశలు నెరవేర్చ గలుగుతానా? లేచి ఆచారిగారికి, టీచర్ గారికి వంగి కాళ్లకి నమస్కారం పెట్టింది.
“ఏం ఆదుర్దా పడద్దమ్మా సత్యా! నీ జాతకం వేసి చూశాను. గ్రహాలన్నీ మంచి దశలో ఉన్నాయి. శక్తి వంచన లేకుండా ప్రయత్నం చెయ్యి. తప్పకుండా సాధిస్తావు.” ఆచారిగారు చేయెత్తి ఆశీర్వదిస్తూ అన్నారు.
“ఇక్కడ అందరూ నిన్ను చూపించి, పిల్లలు అందరికీ ప్రోత్సాహమిస్తూంటారు. పదో క్లాసు దగ్గర్నుంచీ మంచి రాంకులతో పాసవుతున్నావని.” జానకి, సత్య తల నిమురుతూ అంది.
సత్య రెట్టించిన ఉత్సాహంతో లేచింది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ లో స్లీపర్ కంపార్ట్మెంట్లో ఎదురెదురుగా కూర్చున్నారు సత్య, జానకి. రెండు రోజులు ముందు వచ్చి యూనివర్సిటీలో తన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుంది సత్య. తన ప్రొఫెసర్స్ అందరికీ జానకిని పరిచయం చేసింది, తొలి గురువుగా.
జానకి మొదటి సారి ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చింది. కాంపస్… అక్కడి వాతావరణం చూసి కొంచెం విచారం, ఎక్కువ ఆనందం కలిగాయి. తను అక్కడ చదవలేక పోయినందుకు విచారం, సత్యని అందరూ పొగడుతుంటే సంతోషం కలిగాయి.
“ఇప్పుడైనా మీరు చదువుకోవచ్చు టీచర్. విద్యకి వయసుతో సంబంధం లేదు. పైగా టీచర్స్ కోటా కూడా ఉంటుంది.” యూనివర్సిటీలో తిరుగుతుంటే జానకి ఆలోచనల ఆటుపోట్లని గమనించిన సత్య అంది.
“నా లక్ష్యం నేను సాధించాను సత్యా! మన పల్లెలలో ఒక చోట అయినా పిల్లలకి చదువు మీద ఆసక్తి కలిగించాలని, పెద్ద భవనంతో మంచి స్కూల్ వచ్చేలాగ చెయ్యాలని నా ఆశయం. నేను ఉన్న పరిస్థితులలో అది చాలా అసాధ్యమైన పనే కానీ, అదృష్టం కొద్దీ లాయరు గారి అండ దొరికింది. కొండపాలెంలో పోస్టింగ్, మీ తాతగారు అక్కడ ఉండటం… అనుకున్నది సాధించ గలిగాను. అంతా మా గిరిజమ్మగారి చలవ.” జానకి రెండు చేతులూ పైకి చూపించి దణ్ణం పెట్టింది.
“ఇప్పుడు నేను కూడా వారి అమ్మాయి సహాయం పొందబోతున్నాను . ఇది మీ చలవే టీచర్. మీకున్న మంచి పేరు వల్లనే సాధ్యమయింది.”
నిజమే! లాయరుగారి అమ్మాయికి సత్య గురించి చెప్పాక వెంటనే ఒప్పుకుని వచ్చెయ్యమంది.
సరిగ్గా రైలు బయలు దేరే ముందు వాళ్లిద్దరికీ ఒక షాక్ తగిలింది. సత్య పక్కనున్న సీట్లోకి యాభై దాటిన జంట వచ్చి కూర్చున్నారు. సామాన్లు సర్దుకుని స్థిర పడ్డాక, చూస్తే, ఎక్కడో చూసినట్లన్పించింది అతన్ని. కొద్ది క్షణాల్లోనే జానకి గుర్తు పట్టింది. వేసుకున్న డ్రస్ వేరుగా ఉండటం వల్ల చటుక్కున గుర్తు రాలేదు. ముందు చూసినప్పుడు తెల్లగా మెరిసిపోతున్న పంచ, లాల్చీ… ఇప్పుడు పాంటు, షర్టు. అప్పుడు నుదుటి మీద బొట్టు. ఇప్పుడు ఏమీ లేదు.
“నమస్కారం వీరాదాసు గారూ! బాగున్నారా?” జానకి పలకరించింది. అప్పుడు సత్యకి తెలిసి తను కూడా నమస్కారం పెట్టింది.
“మీరు…” సందేహ పడుతూ అడిగాడు వీరాదాసు.
“మన్యంలో కొండపాలెం స్కూలు టీచర్ నండి. ఈ అమ్మాయి అప్పలసామిగారి మనుమరాలు.” జానకి పరిచయం చేసుకుంది. ఆయన ఎంత మందినో కలుసుకుంటూ ఉంటాడు… మేమెక్కడ అనుకుంటూ ఉండగానే…
“మీరా అమ్మా! తాతగారు బాగున్నారా? అనుకున్నది సాధించగల గట్టి స్వభావం. మీ అందరి సహకారం కూడా మెచ్చుకో తగ్గదే!” భార్యకి పరిచయం చేశాడు.
జానకి ఆశ్చర్యంగా చూసింది. అప్పట్లో అప్పన్న గారికి వ్యతిరేకంగా ఎంత ప్రయత్నించాడో చూసి, ఇప్పుడు పొగడుతుంటే…
“అవునమ్మా వారు తను నమ్మినది ఆచరించడానికి చూశారు. నేను, గనులు వస్తే అక్కడ స్థలాలు అమ్మి వ్యాపారం చేద్దామని, డబ్బు కోసం చూశాను. అప్పలసామి గారి వంటి వారుండబట్టే దేశం ఇంకా పచ్చగా ఉంది.”
“ఇప్పుడు ఖనిజాలని వదిలేశారా సార్? ఎవరూ కనిపించడం లేదు.” జానకి కుతూహలంగా అడిగింది. సత్య జాగ్రత్తగా వింటోంది.
“అవునమ్మా… అన్ని చోట్లా ఆదివాసీలు తిరగబడ్డారు. గిరిజన సంక్షేమ యాక్ట్ కూడా అంతా స్ట్రిట్ చేసింది. అందరూ బుద్ధిగా ఫాలో అవుతున్నారు. మా పిల్లలు కూడా అడవుల జోలికి వెళ్లకుండా గేటెడ్ కమ్యూనిటీల మీద దృష్టి పెట్టమంటున్నారు. వాళ్ల దగ్గరే కావలసిన పనులు చేసే కాంట్రాక్టర్ గా చేస్తున్నాను. ఇందులో ఏ కిరికిరీ లేదు. అంతా లీగల్ గా జరిగి పోతుంది. ఏమైనా సమస్యలుంటే బిల్డర్లు చూసుకుంటారు.” వీరాదాసు గట్టిగా ఊపిరి పీల్చి అన్నాడు.
“చాలా సంతోషమండీ! కానీ ఇంకా అడవుల్లో జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడేది దొరుకుతే అక్కడ దాన్ని తరలించడం… కొన్ని చోట్ల దొంగతనంగా, కొన్ని చోట్ల మా వాళ్లని భయపెట్టి. లేదా వాళ్లకి డబ్బులిచ్చో, మందు పోసో బుట్టలో వేస్తున్నారు.”
“నిజమేనమ్మా. పిల్లలు పెద్దయ్యాక ఈయన మానేశాడు కానీ అంతకు ముందు రోజూ పడాలిసిందే. ఆరోగ్యం కూడా దెబ్బతింది.” వీరాదాసు భార్య అంది.
“పిల్లలేం చేస్తున్నారమ్మా?” అందరికీ అలాంటి పిల్లలుంటే బాగుండును అనుకుంటూ అడిగింది జానకి.
“ఇద్దరమ్మాయిలు. ఇద్దరూ డాక్టర్ కోర్సు… పెద్దమ్మాయి ఫైనలియరు. చిన్నమ్మాయి మూడో ఏడు.” గర్వంగా చెప్పింది ఆవిడ.
“ఇప్పడేం ప్రాజెక్టులు చేస్తున్నారు? అందులో మీరేం చేస్తారు?” సత్య అడిగింది.
“కొత్త కమ్యూనిటీలకి స్థల సేకరణ, అందులో లావాదేవీలు. మొత్తం అంతా క్లియర్ గా ఉందా అని చూసి, బేరాలు చెయ్యడం. అలాగే కట్టడం మొదలు పెట్టాక, అడ్వర్టైజ్మెంట్లు, కొనుక్కోవాలనుకునే వాళ్లకి విడమర్చి చెప్తుండటం… లోన్లకి ఆటంకాలు లేకుండా చూట్టం. మొత్తం అంతా మనవే… సియిఓ లాగ అనుకోండి.”
“షుమారుగా జీతం ఎంత ఉంటుందండీ… మీకు అభ్యంతరం లేకపోతేనే!” సత్య నెమ్మదిగా అడిగింది.
“ఎంత కష్టపడితే అంత. పెర్సెంటేజ్ లెక్కన ఉంటుందమ్మా. ఇప్పుడు ఎన్నో కట్టడాలు… ప్రతీ వాళ్లూ ఉద్యోగంలో చేరగానే ఇయమ్మైలున్నాయని ఫ్లాట్లు కొనేయడాలు. మా వంటి వాళ్లకి ఏం లోటు లేదమ్మా. తాతగారిని అడిగానని చెప్పండి.”
తెచ్చుకున్న ఫలారాలు తినేసి, నలుగురూ పక్కలు వేసుకున్నారు.
సత్యని శిరీషా అకాడమీలో చేర్పించి జానకి కొండపాలెం వెళ్లి పోయింది. వెళ్లేముందు ఒక మాట చెప్పింది.
“ఇది గిరిజన సంక్షేమ హాస్టల్ కాదు. నువ్వు యస్.టి అని ఇక్కడ ఎవరికీ తెలియ నీయకు. శిరీష కూడా అదే చెప్పమంది. మనం కోటాలో సులువుగా పాసై పోతామని, జాబ్ కూడా ఈజీగా వస్తుందనీ… కొందరు చులకనగా చూసే ప్రమాదం ఉంది.” సత్య అలాగే అని తలూపింది.
అకాడమీ జుబిలీ హిల్స్ లో ఉంది. అమ్మాయిల హాస్టల్ ఆ బిల్డింగ్ లోనే రెండవ అంతస్థులో ఉంది. ఇరవై మందే ఉన్నారు. సివిల్స్ అన్నింటికీ అక్కడ కోచింగ్ ఇస్తారు. ఫారెస్ట్ సర్వీస్ కి ప్రయత్నిస్తున్నవాళ్లు ముగ్గురే ఉన్నారు. సాధారణంగా, అమ్మాయిలు, వాళ్ల పెద్దవాళ్లు కూడా ఇష్టపడరు.
ప్రతీ కోర్సుకీ క్షుణ్ణంగా, సమాచారం వదలకుండా తయారు చేస్తారు. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు ఇంచు మించు అన్నింటికీ ఒకలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కలుపుతూ, వివిధ రకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటారు. ఖరీదు ఎక్కువే కానీ ఫలితాలు కూడా ఎక్కువ గానే ఉంటాయి. రోజూ నాలుగింటికి లేపేసి, టీ తాగాక రెండు గంటలు పరుగు లాంటి నడక, వ్యాయామం ఉంటాయి. స్నానం, బ్రేక్ఫాస్ట్ అయాక రెండు గంటలు వాళ్ల సబ్జెక్ట్లు చదువు కోవాలి. అక్కడే… ముఖ్యమైన పుస్తకాల లైబ్రరీ కూడా ఉంది. తరువాత నుంచీ క్లాసులు, చర్చలు… మాక్ పరీక్షలు. అంతకు ముందు జరిగిన పరీక్షలలో ప్రశ్నలు సేకరించి వాటి ఆధారంగా ప్రశ్నా పత్రాలు తయారు చేస్తారు.
పరీక్షలకి వెళ్లిన విద్యార్థులని ఒక్కొక్కరిని కనీసం ఒక్క ప్రశ్న గుర్తు పెట్టుకోమని చెప్తారు. ప్రశ్న పత్రాలు బైట దొరకవు కనుక.
స్వతహాగా తెలివైన సత్య, కోచింగ్ తోడవగా రాత పరీక్ష పాసై పోయింది. తరువాత ఇరవై అయిదు కిలో మీటర్ల నడక పరీక్ష కూడా పాసయి… ఇంటర్వ్యూకి తయారవుతోంది.
*..............*
ఎపిసోడ్- 8
కృషి ఉంటే…
“అడవిలో పుట్టి పెరిగిన నాకు చిన్నప్పటి నుంచీ కొండలు, లోయలు, చెట్లు అంటే చాలాఇష్టం. ప్రకృతి అందాలు చూస్తూ ఎన్ని రోజులైనా అక్కడ గడిపేయ గలను. అడవితో నాకు జన్మ జన్మల అనుబంధం అనిపిస్తుంది. అటవీ సంపదని దోచుకోవాలనుకునే వాళ్లని, ఏ అనుమతులూ లేకుండా తరలించే వాళ్లని కూడా చూస్తూ పెరిగాను. అందుకే ఊహ తెలిసి నప్పటి నుంచీ అటవీ శాఖలో ఉద్యోగం చెయ్యాలనే ఆశయంతో పెరిగాను.” ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యులొకరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది సత్య.
“మరి… అవన్నీ అడ్డుకోగలరా?”
“నా ప్రయత్నం నేను చేస్తాను సార్! అంతే కాదు… వంట చెరకు వంటి అవసరాలకి మా వాళ్లు చెట్లు కొట్టేస్తుంటే, కొత్తవి పాతాలని నేను, మా స్నేహితులు పాతిస్తుండే వాళ్లం. చెయ్యాలే కానీ ఎంతో ఉంది సార్…”
సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకీ సంతృప్తి కరంగా సమాధానాలు ఇచ్చింది సత్య.
“ఇంక మీరు వెళ్లచ్చమ్మా. మీకు త్వరలో ఆర్డర్ వస్తుంది.”
సత్య బైటికి వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. ఎన్నో సంవత్సరాల కల… నిజమవబోతోంది. ట్రైనింగ్ కి వెళ్లే లోపుగా కొండపాలెం వెళ్లాలి. దారిలో అమ్మా నాన్నలని చూడాలి. వాళ్ల ప్రోత్సాహమే లేకపోతే ఇదంతా సాధించ గలిగేదా?
జానకీ టీచర్ గారికి ఫోన్ చేసి చెప్పింది.
“చాలా సంతోషం సత్యా! కృషి ఉంటే సాధించలేనిది లేదని నిరూపించావు. మొదటి ప్రయత్నంలోనే పోస్టింగ్ తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. అభినందనలు… ఎదురు చూస్తున్నాం.”
“అమ్మో అంత దూరంలోనా? పైగా రెండేళ్లు…” గౌరమ్మ గోల పెట్టింది.
“అదేంటమ్మమ్మా మనింటి పక్కన అడవిలో ఉంటుందా ట్రైనింగు? దేశంలో అన్ని చోట్ల నుంచీ వస్తారు నా లాంటి వాళ్లు. మా యూనివర్సిటీ కంటే పెద్దగా ఉంటుంది అక్కడ. బోలెడు అడవులకి తీసుకెళ్తారు.”
సత్య, ఫోటోలు చూపించి వివరించింది.
“భలే దానివే! మనవరాలేమన్నా చిన్నా చితకా ఆఫీసరనుకున్నావా? కొన్నాళ్లయ్యాక ఏ అడవిలో ఉన్నా, ఆ అడవినేలుతుంది.” అప్పన్న నచ్చచెప్పాడు.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న మేఘాలయ రాష్ట్రంలో రెండేళ్ల శిక్షణతో సత్యకి అటవీ శాఖలో ఉద్యోగం ప్రారంభమయింది. గౌహతి, షిల్లాంగ్ రహదారిమీద ఉన్న బర్నిహాట్ లో స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కాలేజ్ లో శిక్షణ. అక్కడికి వెళ్లి చూడగానే బర్నిహాట్ చాలా అందమైన నగరం అనుకుంది సత్య..
అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోటీ పరీక్షల్లో నెగ్గిన అభ్యర్ధుల ట్రైనింగ్ కోసం బర్నిహాట్ లో స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కాలేజ్ ని 1976 సం. లో ప్రారంభించారు. సత్య వాళ్లు ఉండే హస్టల్, అకాడమిక్ భవనం, ఆటలాడే మైదానం ఒక లోయలో ఉన్నాయి. ప్రిన్సిపాల్ లాడ్జ్, అధ్యాపకుల గృహాలు ఎదురుగా కొండ మీదున్నాయి. అడవుల్లో పెరిగిన సత్యకే అంత అద్భుతమైన సుందర ప్రకృతిని చూసి ఒడలు పులకరించింది.
శిక్షణ మొదలైన రోజు సత్య ఎప్పటికీ మర్చిపోలేదు. పరిచయాలయాక చూస్తే ఒక్క తెలుగు అమ్మాయి కానీ, అబ్బాయి కానీ కనిపించలేదు. అందరికీ కామన్ ఇంగ్లీషే! టీచర్ గారికి, శిరీష మేడమ్ కి ధన్యవాదాలు తెలుపుకుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడటం కూడా మేడమ్ దగ్గరే నేర్చుకుంది. అంతే కాదు, చేసినప్పుడు కఠినంగా అనిపించినా, పొద్దున్న పరుగులు, సాయంత్రం ఆటలు కూడా ఎంతో ఉపయోగ పడ్డాయి.
చాలా కోచింగులలో పరీక్షలకి మాత్రమే శిక్షణ ఇస్తారు. శిరీష మేడమ్ సెంటర్ అందుకే ప్రత్యేకంగా నిలిచింది. గౌహతి, షిల్లాంగ్ హైవే మీద పొద్దున్నే చేయాల్సిన పరుగు సులభంగా చేసేయ గలిగింది. జెనెటిక్ గా కూడా గిరిజనులకి బలం ఎక్కువే ఉంటుంది.
బర్నిహాట్ శిక్షణలో సిల్వికల్చర్, ఫారెస్ట్ బోటనీ, ఎంటమాలజీ, టాక్సోనమీ, ఫారెస్ట్ మేనేజ్ మెంట్, వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ వంటి పాఠ్యాంశాలలో కూడా సంపూర్ణంగా అవగాహన కల్పించారు. తరగతి గదులే కాకుండా అనేక అటవీ ప్రదేశాలకి కూడా తీసుకెళ్లేవారు. ఆ విహారాలు అటవీ ఉత్పత్తులను ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేయడంలో సహాయపడటానికి ఉపయోగించేవి.
కఠినమైన వ్యాయామాల తరువాత, ఫలహారాలు తిని క్లాసుకు వెళ్తే హాయిగా నిద్ర వచ్చేది. ఒకోసారి గురక శబ్దం కూడా వినిపించేది. అందరూ జోక్స్ వేసుకుని నవ్వుకుని క్లాసు కొనసాగించేవారు. రాత్రి భోజనాలయ్యాక ఆటపాటలతో సరదాగా గడిచేది.
అడవుల్లో క్రూర మృగాల నుంచి రక్షించుకోవడం శిక్షణలో ఒక భాగం. అంతే కాదు అటవీ మృగాల రక్షణ కూడా రేంజ్ ఆఫీసర్ల బాధ్యతే అని చెప్పారు. సత్య ట్రైనింగ్ అయిపోయి, కొండపాలెం వచ్చింది. ముందురోజే అమ్మా నాన్నలను కూడా రమ్మంది… నల్లమలై అడవులలో ఇచ్చారు మొదటి పోస్టింగ్. వారం రోజుల్లో చేరాలి.
పొద్దున్నే ఇంటి ముందు టాక్సీ ఆగింది. ఖాకీ యూనిఫామ్ వేసుకుని గుమ్మంలోకి వచ్చి సెల్యూట్ కొట్టింది సత్య. పోలీస్ సూపరింటెండెంట్ దుస్తులే, కానీ మూడు నక్షత్రాలే ఉన్నాయి. గీతలు లేవు. అదే పోలీస్ ఆఫీసర్ కీ, ఫారెస్ట్ ఆఫీసర్ కీ ఉన్న తేడా. ఇప్పటికే నాలుగు సార్లు ఇంట్లోకీ బైటికీ తిరిగిన గౌరమ్మ తెల్లబోయింది. భయం భయంగా చూసింది.
“నేనే అమ్మమ్మా! వంగి కాళ్లకు నమస్కారం చేసింది. అంటీ అంటనట్టు భుజాలు పట్టుకుని తడబడుతూ నిలుచుంది గౌరమ్మ. లేచి, అమ్మమ్మని గట్టిగా హత్తుకొని పకపకా నవ్వింది సత్య.
“నాదీ పోలీసు పనే… అడవుల్లో ఎవరైనా వేషాలేస్తే లాఠీ చూపించి, కొరడాతో తగిలిస్తా! లేళ్లనీ, కుందేళ్లనీ, నెమళ్లనీ… ఇంకా ఏ జంతువుల జోలికి వచ్చినా సంకెళ్లు వేసి, పోలీసులకి అప్పచెప్తా… చెట్లని మన పిల్లల్లాగా చూసుకోవడం, అనుమతి ఉంటేనే కొమ్మలనైనా తీసికోనియ్యడం…” సత్య వీపు నిమురుతూ దూరంగా జరిపి కళ్లారా చూసుకుంది గౌరమ్మ.
“మనవరాలికి దిష్టి తగులుతుంది. లోపలికి రామ్మా!” సత్య తల్లీ తండ్రీ చెరో చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ల బోయారు. అంతలో పెద్ద కలకలం…
జానకీ, ముత్యాలూ… మొత్తం కొండ పాలెం బడి పిల్లలు, టీచర్లు వచ్చేశారు. కాస్త వంగిపోయిన గురుమూర్తిగారు చేతిలో పూల దండ జానకి చేతికి ఇచ్చారు. జానకీ, ఇంకో టీచరూ కలిసి సత్య మెళ్లో వేశారు. ముత్యాలు వెనుకకు వెళ్లి సర్దింది. ఇప్పుడు సత్య అంత పొడవు ఉంది. అందరూ ఊరంతా వినిపించేలా చప్పట్లు కొట్టారు.
సత్య ఒక్కొక్కరి దగ్గరకీ వెళ్లి పలకరించింది.
“అక్కా పెద్ద పెద్ద అడవుల్లో తిరుగుతావా? భయం వెయ్యదా? రాత్రి కూడా ఉండి పోవాలా పులి వస్తే ఎలా?” ముత్యాలు కళ్లు పెద్దవి చేసి అడిగింది.
“తిరగాలి. నా పనే అది కదా! మాకు ట్రైనింగ్ లో అంతా నేర్పించారు. నేనొక్కదాన్నే కాదు కదా! పది మంది వరకూ వెళ్తాము. కర్రలు, అడ్డం వచ్చిన తుప్పలని తీసెయ్యడానికి కొడవళ్లు, గునపాలు… అవసరమైనవి అన్నీ తీసుకెళ్తాము.”
“రాత్రి ఎక్కడుంటారు చెట్లమీదా? మరి ఆకలేస్తే…”
ప్రశ్నల పరంపర ఆపి అందరినీ అరుగుల మీద కూర్చోపెట్టి, తాగటానికి మజ్జిగ తెచ్చారు గౌరమ్మా, సత్యా వాళ్ల అమ్మ ఉషా.
“రాత్రి డేరాలు వేసుకుంటాము. వంటకి కావలసిన సరుకులు తీసుకెళ్తాము. కట్టెలతో మంట పెట్టి వంట చేసుకుంటాము. ఎలాగా రాత్రి జంతువులు రాకుండా మంట వెలిగించాలి. ఒకే పెద్దగిన్నలో అన్నీ కలపి వండేస్తాము. కాంప్ లాగా, ఎక్కువ మంది వెళ్తే అంతా పక్కా ఉంటుంది, వంట వాళ్లతో సహా. ఒకోసారి అక్కడ దొరికిన పళ్లు కాయల్తో కడుపు నింపు కోవలసి వస్తుంది.”
అందరూ “అమ్మో…” అని ఏక కంఠంతో అరిచారు.
“చెట్లు ఎక్కుతారా ముళ్లు గీసుకుపోవా…”
ఈలోగా ముత్యాలు ఒక చీటీ తీసుకుని జానకీ టీచరుకిచ్చింది. జానకి విప్పిచూసి నవ్వుకుంటూ సత్యని పిలిచి ఇచ్చింది. చీటీలో తమ తమ సందేహాలు రాశారు పిల్లలు.
సత్య మధ్యలో నిల్చుని అందరి సందేహాలకీ జవాబులు చెప్పింది.
“దళసరి పాంట్, షర్ట్, స్వెటర్లూ, కోట్లూ, బూట్లూ… అన్నీ ఉంటాయి. చెట్లు ఎక్కి, చుట్టూ చూసుకుంటూ ఉండాలి. దారి అస్సలు బాగా లేకపోతే చెట్టుకీ చెట్టుకీ తాడు కట్టి జారుకుంటూ వెళ్లాలి. మరి మన అడవులన్నీ కళకళలాడుతూ ఉండాలంటే కష్ట పడాలి కదా. మీలో ఎంత మంది ఫారెస్ట్ లో పని చేస్తారు?”
సగం మంది పైగా చేతులు ఎత్తారు.
“వెరీ గుడ్. బాగా కష్ట పడాలి మరి. పదో క్లాసులో మంచి మార్కులు, రాంక్ తెచ్చుకోవాలి. అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారు.”
“మా స్కూల్ కి వచ్చి చూడండక్కా! ఏమన్నా మార్పులు చెయ్యాలంటే చెప్తే మా హెచమ్ చేసేస్తారు.” ముత్యాలు ముందుకొచ్చి అంది. ఇప్పుడు తను స్కూల్ లీడర్.
“తప్పకుండా వస్తాను. ఇప్పుడు సీజన్ కదా ఇప్పపూలు ఏరటానికి వెళ్దామా? ఇప్పుడు వస్తున్నాయా? వెళ్తున్నారా ఇదివరకట్లా?”
“రెండ్రోజులుంటావు కదా… ఎల్లుండి వెళ్తున్నామక్కా! సరిగ్గా సమయానికి వచ్చారు మీరు. థింసా కూడా చేద్దాము. వరం వాళ్లు కూడా పట్నం నించి వస్తున్నారు. వాళ్ల బాచ్ అంతా డిగ్రీ ఫైనల్ ఇయర్ కొచ్చారు.”
“ఇంక పదండి. స్కూల్ టైమయింది.” టీచర్లందరూ హెచ్చరించి పిల్లల్ని బయల్దేర దీశారు. జానకి మాత్రం ఆగి పోయింది.
“నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సత్యా! దీని వెనుక ఎంత కృషి, పట్టుదలా ఉన్నాయో దగ్గరగా చూసిన దాన్ని కదా! నువ్వు వస్తానంటే కలిసి వెళ్దాము స్కూల్ కి.”
“అలాగే టీచర్. బట్టలు మార్చుకుని వస్తాను.”
“ఇది మన స్కూలేనా ఎంత బాగుందో! చెట్లన్నీ బాగా పెరిగి పోయాయే? తోట అద్భుతం. ఈ పక్కనున్న భవనం ఏమిటి? రోడ్లు కూడా వేసినట్లున్నారు. పల్లె చాలా శుభ్రంగా ఉంది.” సత్య అంతా తిరిగి చూస్తూ అంది.
“అంతా మీ తాతగారి కృషి. పిల్లలందరికీ మేం శిక్షణ ఇచ్చాం. రోజూ సాయంత్రం ఇళ్లకి వెళ్లి పెద్దలకి కూడా పాఠాలు చెప్తున్నాం.” జానకి అంటుండగానే హెచెమ్ నలుగురు టీచర్లతో వచ్చారు.
“అవునమ్మా నువ్వే మాకందరికీ స్ఫూర్తి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మన స్కూల్ కి అవార్డ్ ఇచ్చింది.” హెచెమ్ సత్యని క్లాసులన్నింటికీ తీసుకెళ్లి పరిచయం చేశారు. వెనుక మైదానం రూపే మారిపోయింది. అన్ని ఆటలకీ సదుపాయం చేశారు.
అంతలో స్కూల్ పక్కన ఉన్న భవనం లోంచి ఆచారిగారు వచ్చారు.
“ఇది మన ఆసుపత్రి సత్యా! ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించింది. ఒక డాక్టర్, నర్స్ ఉన్నారు. నేను వాలంటరీ సర్వీస్ చేస్తున్నాను.”
ఇది నా ఊరు… సత్య మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది.
“సత్యా లే… అందరూ బయల్దేరి పోతున్నారు.”
సత్య ఉలిక్కి పడి లేచింది. ఏడేళ్ల క్రితం అమ్మమ్మ పిలిచినట్లే అనిపించింది. గౌరమ్మ గొంతులో ఝంకారం తగ్గింది కానీ ఉత్సాహం అలాగే ఉంది.
సత్య గబగబా లేచి తయారయింది. జీన్స్, షర్ట్ వేసుకుందామా అని ఒక క్షణం ఆలోచించింది. కానీ… అమ్మమ్మ లాగే చీర కట్టుకుంది. ఈ సారి అమ్మ కూడా… ముగ్గురూ వయసు తేడా తప్ప ఒక్క లాగే ఉన్నారు.
ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగానే మధ్య మధ్యలో అందరూ ఎదురయ్యారు. సత్యకి చాలా మంది కొత్తవాళ్లు కనిపించారు. “అక్కా!” అంటూ వరం, నలుగురు అమ్మాయిలతో వచ్చింది. అరవై మంది పైగా వచ్చారు, ఇప్పపూలేరటానికి.
అడవిలోకి వెళ్లే కాలిబాట పక్కన రకరకాల చెట్లు. తను చూసినప్పటి కంటే పచ్చదనం బాగా పెరిగిందనిపించింది సత్యకి.
“అవునక్కా కొత్తగా చెట్లు పాతించారు మీ అటవీశాఖ వాళ్లే… పాత చెట్లకి కూడా కొలతలు చేసి, గుండ్రంగా ఎరుపు తెలుపు రంగులు వేశారు.” వరం చూపించింది. వరం డిగ్రీ తరువాత ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ లో చేరడానికి తయారవుతోంది.
అడవిలోకి చేరగానే సత్య అలా నిలబడి పోయింది. రెండెకరాలు పైగా… ఇప్పచెట్లు పచ్చని పూలని రాలుస్తూ, కొమ్మలూపుతూ స్వాగతం పలుకుతున్నాయి.
“చాలా చెట్లు పాతించి ఇప్ప పంట దిగుబడి చాలా పెంచారక్కా.” ముత్యాలు సైగ చెయ్యగానే అందరూ గుండ్రంగా నిలబడి, రెండు చేతుల్తో ఇరు పక్కలా వెనుక నించి పక్క వాళ్లని పట్టుకుని మొదలు పెట్టారు, థింసా నాట్యం.
ఇద్దరు డప్పు వాయిస్తుంటే ఇద్దరు కొమ్ము బూరా ఊదసాగారు. సత్య పాట అందుకుంది.
“అమ్మల గన్న అమ్మవి నీవే ఆది పరాశక్తివి నీవమ్మా
జగముల నేలే మా జగదాంబా దారిచూపి మమ్మాదుకోవే…”
*............................*