Monday, October 30, 2017

అంతా ప్రేమమయం- 13

Posted by Mantha Bhanumathi on Monday, October 30, 2017 with No comments
                                 అంతా ప్రేమమయం- 13


   సంతోష్ నీరసంగా తమ గదికి వెళ్లాడు. దార్లోనే ట్రావెల్ ఆఫీసుకి వెళ్లి టికెట్లు తీసుకున్నాడు. ఇంకో గంటలో బస్ ఉంది. అది కొంత నయం.
  సరస్వతి రూంలో పడుకుంది. తనకి ఏదో కారణం చెప్పి ఇవేళే వెల్లిపోతున్నాం అని చెప్పాలి.
  ఈ న్యూస్ సరస్వతికి ఎలా చెప్పాలి? అసలు తను హాస్టల్లో చేర్చద్దు అంది. ఉజ్వల ధోరణి బాగాలేదు అని శతవిధాల చెప్తూనే ఉంది. వినకుండా గారం చేసి కూతురు ఆడించినట్టల్లా ఆడాడు.
  బాబా మందిరం కేసి తిరిగి నమస్కారం చేసి మొక్కుకున్నాడు, కూతురు క్షేమంగా ఇంటికి రావాలని.
  కాళ్లు మొరాయిస్తున్నాయి, తన గదిలోకి వెళ్లడానికి. గట్టిగా ఊపిరి పీల్చి సరస్వతిని లేపాడు. “లే.. బట్టలన్నీ సర్దు మనం వెంటనే హైద్రాబాద్ వెళ్లాలి.”
  “ఆఫీసులో వచ్చెయ్యమన్నారా? రేపు నాసిక్ వెళ్దామనుకున్నాం కదా! ఎప్పుడూ ఇంతే. రాకరాక వస్తే..” సరస్వతి మొదలు పెట్టింది. ఐతేనేం ఉపాయం తనే చెప్పింది.
  “అవును సరూ! అర్జ్ంట్. మళ్లీ ఇంకో సారి వద్దాం.”
  “ఏం చేస్తాంలే.. ఎలాగో సెలవు దొరికిందనుకుంటే.. మామూలేగా.” ఏ మాటకామాటే చెప్పాలి. పది నిముషాల్లో సర్దేసి తయారై పోయింది సరస్వతి.
  బస్ లో కూర్చుని వెనక్కి వాలి ఆలోచిస్తున్నాడు సంతోష్. మెదడు చాలా చెడ్డది. ఎప్పుడూ జరుగ కూడనివి జరిగాయేమోనని ఆలోచిస్తూంటుంది. ఏమైపోయింది ఉజ్జీ? అసలు బతికుందా.. లేక ఎవరైనా.. కళ్లు గట్టిగా మూసుకున్నాడు. కణతలు గట్టిగా నొక్కుకున్నాడు.
  తనకి తెలిసి ఉజ్వల వెళ్లే వాళ్లెవరూ లేరు. సరు వాళ్లక్క ఫామిలీ క్లోజ్ గా ఉంటారు. వాళ్లు కాలేజ్ ఉన్న ఊర్లోనే ఉన్నారు. అక్కడికి వెళ్తే తనకెందుకు ఫోన్ చెస్తారు?
 పరీక్షలకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఇంతకీ రేపు సరూని తీసుకెళ్లాలా వద్దా? తీసుకెళ్తే ఒక బాధ, తీసుకెళ్లకపోతే ఇంకొక బాధ. ఇద్దరం వెళ్లడమే మంచిది. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదనేది అమ్మ. దాచి పెడ్తే ఇంకా ఏడవాల్సి వస్తుందేమో!
  “భగవంతుడా! ఎవరం కూడా ఏడవాలిసిన అవసరం రాకుండా చూడు.” దాదాపు పదో సారి దేవుడిని ప్రార్ధించాడు.
                                    ………………..
  కాలేజ్ ఆడిటోరియంలో సమావేశమయ్యారు భాస్కర్రావు, ఆది, ఆణు, ప్రవీణ్.. ఇంకా డ్రామాలో వేషం వేసే పదిమంది పిల్లలు. భాస్కర్ తల పట్టుకుని కూర్చున్నాడు. ఇంకా మంజుల రాలేదు. అసలు ఆ కాలేజ్ లో డ్రామా వెయ్యడం అదే మొదటి సారి.. అదీ వెంకట్ అభ్యంతర పెట్టడు కనుక.
  రెసిడెన్షియల్ కాలేజ్ లో ఆటలు, పాటలు, డ్రామాలు వంటి కార్యక్రమాలు పెడ్తే బోలెడు సమయం వృధా అయిపోతుంది కదా అని ఆలోచిస్తారు. ‘ఈ వేషాల కోసమా, మేం ఇంత డబ్బు ఖర్చు పెట్టి పిల్లల్ని ఇక్కడ చేర్పించింది..’ అంటూ తల్లిదండ్రులు నానా గోలా చేస్తారు. అలా ఉంటుంది యమ్సెట్ ఫీవర్.
  “ఈ బాచ్ వాళ్లు చాలా చురుకుగా ఉన్నారు. అందుకే ధైర్యం చేశాడు భాస్కర్. తన ఇంగ్లీష్ పోర్షన్ అయిపోయింది. రెండు సార్లు రివిజన్ కూడా అయింది. అతని క్లాస్ లోనే రిహార్సల్స్ వేస్తాము. అదీ పదిరోజులు మాత్రమే..” అని మానేజ్ మెంట్ దగ్గర పెర్మిషన్ తీసుకున్నాడు వెంకట్.
  పిల్లలందరికీ వాళ్ల పోర్షన్ కాగితాలిచ్చేసి, చదువు బోర్ కొట్టినప్పుడు బట్టీ కొట్టండి అని చెప్పాడు భాస్కర్.
  ఎంతో అనుభవం ఉన్న నటుల్లాగా రెండ్రోజుల్లో బట్టీ కొట్టేసి తయారైపోయారు. అమ్మాయిల వేషాలక్కూడా ఆ క్లాసులో మగ పిల్లల్నే తీసుకున్నారు.
  చాలా మందికి ఇంకా గడ్డం మీసం రాలేదు. చాలా సులువై పోయింది. భాస్కర్ కి  ఆశ్చర్యం వేసింది. ఇప్పటి పిల్లల ఎక్స్ పోజరే వేరు కదా!
  తమ చిన్నప్పుడు రెండు నెలలు పైగా రిహార్సల్ చేయించే వారు. ఇప్పుడు రెండ్రోజుల్లో రెడీ అయిపోయారు. ఒక వారం ప్రాక్టీస్ చేయిస్తే జె.వి. సోమయాజులు గారినే మించి నటించే లాగున్నారు.
  ముఖ్యంగా బంటీ.. తనదే మైన్ రోల్. ఆ ఉచ్ఛారణ, మాడ్యులేషన్.. సూపర్బ్. ఆ అబ్బాయి ఇంగ్లీష్ చూసి ముందు ఇంగ్లీషులో వేయిద్దామనుకున్నాడు. కానీ మిగిలిన పిల్లలు పాత యురోపియన్ ఇంగ్లీష్ మాట్లాడలేక పోయారు. అయినా తన దగ్గర తెలుగు స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఈ మంజుల ఎలా ఉంటుందో!
  వాళ్ల క్లాస్ కి తను వెళ్లడు. యాక్టర్లందరూ తలలు వేళాడేసి కూర్చున్నారు. వాళ్ల ఉత్సాహం అంతా నీరు కారిపోయింది.
  “గుడీవినింగ్ సార్.” భాస్కర్ తలెత్తాడు. ఒక్క క్షణం తన కళ్లని తనే నమ్మలేకపోయాడు. బంటీకి ఆడ వేషం వేస్తే ఎలా ఉంటాడో అలా ఉంది మంజుల. పోలికలు వేరైనా, అదే పెర్సనాలిటీ. బంటీ మొహం చూసి తను ఆ రోల్ కి సెలెక్ట్ చేశాడు. మంజుల ఇంకా బాగా సరిపోతుందేమో అనిపించింది.  అబ్బాయిలా నటించ గలదా?
  “దామ్మా! నువ్వు డ్రామాలు బాగా వేస్తావుట కదా!”
  “అవును సార్. రాష్ట్ర స్థాయిలో బహుమతులు వచ్చాయి.”
  మంజుల తెలుగు ఉచ్ఛారణకి ఆశ్చర్య పోయాడు భాస్కర్.
  “ఏ ఊరు మీది?”
  “ఏలూరు సార్. మా ఇంటి పేరు ‘బందా’ వారు.”
  “అలా చెప్పు.” ఒక్క సారిగా ఎక్కడ లేని ధైర్యం వచ్చింది భాస్కర్ కి. బంటీ కిచ్చిన కాగితాలు మంజుల కిచ్చి, గంట సేపట్లో ఎంత నేర్చుకోగలుగుతే అంత నేర్చుకుని రమ్మన్నాడు. కథంతా వివరించి, సీన్లు ఎన్ని ఉంటాయో స్క్రీన్ ప్లే చూపించి వివరించాడు. ఈ లోగా మిగిలిన పిల్లల చేత రిహార్సల్ వేయించాడు.
  మంజుల తర్వాత ప్రవీణ్ ది పెద్ద రోల్. అతనే కొంచెం కష్ట పడాల్సి వచ్చింది. ఎందుకంటే అతని మాతృ భాష కన్నడం. అందుకని, తెలుగు డైలాగులు కన్నడంలో రాసుకుని తయారవ వలసి వచ్చింది.
  “ఇంక మూడ్రోజులే ఉంది. ఫోర్టీన్త్ న పదకొండింటికే ఫంక్షన్. మన డ్రామా పన్నెండుకి మొదలవుతుంది. పొద్దుట్నుంచీ మేకప్ లూ అవీ.. అందుకని మనం ఈ మూడ్రోజులూ పొద్దున్న సాయంత్రం కూడా రిహార్సల్ చెయ్యాలి. మీ స్డడీ టైమ్ అడ్జస్ట్ చేసుకోండి. చదువు ఏ మాత్రం దెబ్బ తినకూడదు.” అందరినీ హెచ్చరించాడు భాస్కర్.
  మొదటి సీనే మంజులది. బాక్ గ్రౌండ్ లో భాస్కర్ చెప్తుంటే ప్రవేశిస్తుంది. ఇంక అక్కడి నుంచీ మంజుల పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు తిరుగు తుంటాయి.
  ఇచ్చిన ఒక గంటలో ఎలా ప్రిపేరయిందో కానీ.. రిహార్సల్స్ మొదలయినప్పటి నుంచీ, మంజులని కాక, ఆ అమ్మాయి వేసే రోల్ నే చూడ సాగాడు భాస్కర్.
  మొత్తం డ్రామాలో నాలుగు సీన్లలో ఉంది మంజుల. రెండు  సీన్లు రిహార్సల్స్ చెయ్య గలిగారు. మంజుల చేసే పద్ధతి చూసి మిగిలిన వాళ్లకి కూడా ఊపు వచ్చింది. అప్పటికే వాళ్లు ప్రిపేరయి ఉన్నారు కూడా.
  చిన్న చిన్న మార్పులు మంజులే చేసింది.రెండు సీన్లు అయ్యాక మంజుల అంది, “సార్! మిగిలిన రెండు సీన్లూ రేప్పొద్దున్నకి తయారై పోతాను.
  రిహార్సల్స్ అవుతున్నంత సేపూ మంజులకి వేరే దృష్టి లేదు. అంతలా లీనమైపోయింది.
  “సరేనమ్మా! మిగిలిన పాత్రల వాళ్లవి కూడా ఏమైనా మార్పులుంటే చెప్పమ్మా. సంభాషణలు పలకడంలో, నిల్చోవడంలో.. ఆడియన్స్ కి ఎదురుగా ఎవరుండాలీ, ఏ పక్కగా ఎవరుండాలీ వంటి వాటిల్లో కొంచెం సహాయం చెయ్యి.
  భాస్కర్‍కి మంజులని చూస్తే ఎంతో ముచ్చటేసింది. ఈ గండం గట్టెక్కెంచడానికి దేముడిచ్చిన వరం అనుకున్నాడు. గట్టెక్కించడమే కాదు.. కొండెక్కించేలాగుంది.
  “సంతోషంగా సార్” అంది. ఆ పిల్లకి సహజంగా, వంశ పారంపర్యంగా అబ్బిన కళ అది. మన దేశంలో కూడా ‘ఓపెరా’ ల లాగా నాటకాలతో జీవనం సాగించ గలుగుతే, ఇతర విద్యలు అనవసరం అటువంటి వాళ్లకి.
  మంజుల వెంటనే రంగం లోకి దిగిపోయింది. ప్రవీణ్‍కి చాలా సూచనలిచ్చింది. ఎక్కువ సమయం అతని మీదే వెచ్చించింది. ప్రవీణ్ కూడా “అమ్మాయి చెప్పడం ఏమిటి, నేను వినడం ఏమిటి” అనుకోకుండా, అన్నీ రాసుకుని, తెలియనివి ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకున్నాడు.
  మిగిగ్లిన వాళ్లవి చిన్న రోల్స్. తర్వాత ఆర్ణవ్‍ది మంచి పాత్ర. వాడు ఇంకా పెద్ద కళ్లతో పాల బుగ్గలతో అమ్మాయిలాగే ఉంటాడు. కానీ వాడికి రెండు మూడు తప్ప పెద్ద డైలాగులేవు. అంతా యాక్షనే.
  అసలందరూ టివీల ప్రభావమో ఏమో కానీ, ఇలా చెప్తే అలా అందేసుకుంటున్నారు.

  మొత్తానికి రిహార్సల్ అంతా అయే సరికి మూడు గంటలు పట్టింది. మరునాడు పొద్దున్న పదిగంటలకి కలుద్దామనుకున్నారు. ఆది వాళ్లకి అప్పుడు భాస్కర్రావు క్లాసే. మంజుల కూడా వచ్చెయ్యగలనంది. తనకి తెలుగు క్లాసుట. తెలుగులో ఆ పిల్ల లెక్చరర్‍ని పక్కన కూర్చో పెట్టి పాఠాలు చెప్పగలదు.
  “అందరూ మీ స్టడీ అవర్స్ ని కవర్ చేసుకోవాలి. నాకు మాట తేకూడదు.”
  “తేం సార్.” మరు నిముషంలో హాల్ ఖాళీ అయింది.
  భాస్కర్ వెళ్దామనుకుంటుండగా వెంకట్ వచ్చాడు.
  “రిహార్సల్ ఎలా ఉంది? బంటీని పిలిపించాలా?” నవ్వుతూ అడిగాడు.
  భాస్కర్‍కి కళ్లలో నీళ్లు తిరిగాయి, ఆనందంతో. “థాంక్యూ సర్. మంజుల ఈజ్ అవుట్‍స్టాండింగ్. అసలు ప్రోగ్రామ్ రూపమే మారి పోయింది. మొదట్లో మీ మీద కోపం వచ్చిన మాట నిజం. కానీ ఇప్పుడు బంటీ లేకపోవడమే మంచిదనిపిస్తోంది.”
  “నాకు అనుకోకుండా మిమ్మల్ని చూస్తూనే స్ట్రైక్ అయింది. ఈ అమ్మాయి వేసిన డ్రామాకి స్టేట్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చింది. లక్కిగా నేను వెళ్లాను. తను మన కాలేజ్ లో జాయిన్ అయినప్పుడే అనుకున్నాను.. ఏదో మోనో యాక్షన్ అయినా చేయించాలని. తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు మీ మూలంగా ఛాన్స్ వచ్చింది. ఇలాంటి రిక్రియేషన్స్ హెల్ప్ చేస్తాయని నా నమ్మకం.” వెంకట్ అన్నాడు.
  “ష్యూర్ సర్. డెఫినిట్‍గా హెల్ప్ చేస్తాయి.”

  ఉలిక్కిపడి లేచింది ఉజ్వల. ఎదురుగా గడియారం ఎనిమిది చూపిస్తోంది. ఇంట్లో అలికిడి లేదు. ఊర్మిళ ఇంకా లేవలేదు.
  తొమ్మిదికల్లా స్టూడియోలో ఉండాలి. ఫిబ్రవరి పదకొండు తన లైఫ్‍లో చాలా ఇంపార్టెంట్ డే. ఇవేళే తను ఆదిత్యని కలవబోతోంది. పర్సనల్‍గా. అది కూడా కొన్ని గంటలు ఫ్రీగా మాట్లాడుతూ.
  ఒక్క ఉదుట్న బాత్రూంలో దూరింది. స్నానంతో సహా అన్నీ వెంట వెంటనే కానిచ్చేసింది.
  “ఊర్మీ! లే లే. టైమయిపోతోంది. ఫాస్ట్..”
  “అబ్బ ఉండవే! పడిగాపులు పడ్డవేగా. నిన్న చూడు ఎంత టైర్ అయిపోయామో. మెల్లిగా వెళ్దాం.”
  “సరే, నువ్వు తర్వాత రా. నే వెళ్తున్నా.”
  “హేయ్.. హౌ డేర్ యు? ఇంత చేస్తున్న నన్ను వదిలి నువ్వెళ్తావా? ఊర్మిళ ఒళ్లు విరిచుకుంటూ లేచి తీరుబడిగా తయారయింది.. ఊజ్వల అసహనంగా పచార్లు చేస్తుంటే.
  “టిఫిన్ పాక్ చేసి తీసుకుపోదాం. తినడానికి నో టైమ్. ఆక్కడ కూడా ఎక్కడికైనా వెళ్లడాన్కి టైమ్ ఉండకపోవచ్చు.” ఊర్మిళకి నవ్వొచ్చింది.
  “ఎంత ఆత్రం” అనుకుంది. “అక్కడ వాళ్లెవరూ పన్నెండు వరకూ రానేరారు” అంటూ రెండేసి బాక్సుల్లో ఉప్మా, పెరుగన్నం స్పూన్లతో సహా పెట్టింది.
  స్టూడెయోలోకి స్కూటీ వెళ్తుంటే సరిగ్గా తొమ్మిదయింది. అప్పటికే వాణి, ఇంకొక అమ్మాయి వచ్చేసి ఉన్నారు. అంతా హడావుడిగా ఉంది. లోపలైతే చెప్పక్కర్లేదు. లైట్లన్నీ వేసేసి ఎవరి పన్లు వాళ్లు చేసుకు పోతున్నారు. మధ్య మధ్య ప్రొడక్షన్ మానేజర్ కేకలు. ఊర్మిళని తినేసేలా చూసి,స్కూటీ పార్క్ చేసి లోపలికి నడిచింది ఉజ్వల.
  “ఉజ్జీ! సారీనే.. టైమ్ కి వచ్చాం కదా!” ఊర్మిళ వెనకాలే వస్తుంటే తలెగరేసి వాణి పక్కనే కూచుంది.
  “ఇంత ఎర్లీగా వచ్చేశారే అందరూ?”
  “నైన్ థర్టీకి ఆదిత్య వస్తున్నాడట. వెంటనే ప్రోగ్రామ్ స్టార్త్.” అప్పజెప్పినట్లు చెప్పేసి, కాలూపుతూ కూర్చుంది వాణి.
  ఈ పిల్ల ఇంత నిశ్చింతగా ఎలా కూర్చుందో అనుకుంది ఉజ్వల. ఉజ్వలకైతే కాళ్లలోంచీ వణుకు మొదలయింది. అరచేతుల్లో చెమటలు. ‘స్టే కూల్’ అని మనసులో అనుకుంటూ కూర్చుంది.
  ఊర్మిళ బిక్కమొహం వేసుకుని పక్కకి వచ్చి “సారీ.. సారీ. లెంపలేసుకుంటున్నాగా!” అంది.
  “ఇట్ సాల్రైట్. కూర్చో.” అంది. ‘ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నానేంటీ.. అసలు ఊర్మి వల్లే కదా ఈ ఛాన్స్ వచ్చింది’ అనుకుంటూ ఊర్మిళ చెయ్యి పట్టుకుని నొక్కింది.
  “రండి మేడం.” ఎవరో పిలిచారు. గుండె దడదడలాడుతుండగా లోపలికి నడిచింది ఉజ్వల.
  వాణీ, వీణా (ఇంకో అమ్మాయి.. అప్పుడే పరిచయం అయింది.) గుసగుస లాడుతూ వెనుక వచ్చారు. ఎందుకో గానీ వాళ్లిద్దరూ ఉజ్వలని తమతో కలుపుకోలేదు. మొదట్నుంచీ శతృవుని చూసినట్లే చూస్తున్నారు. ఊర్మిళ కూడా లేచి మొహమాటంగా చూస్తూ ఫాలో అయింది.
  “ఇట్రండి మేడమ్” అంటూ ఇంకా లోపలికి.. రికార్డింగ్ రూమ్ వెనక్కి తీసుకెళ్లారు. ఊర్మిళ కూడా వెళ్తుంటే ఎవరూ అడ్డు చెప్పలేదు. అక్కడ పెద్ద అద్దాలు గోడకి అతికించి ఉన్నాయి. ముగ్గురమ్మాయిల్నీ కూర్చో పెట్టి లైట్ గా మేకప్ చేశారు. ఉజ్వల బాత్రూమ్ లోకి వెళ్లి కొత్త డ్రెస్ వేసుకుని వచ్చింది.
  “అబ్బ.. హీరోయిన్ లాగ్ ఉంది.. అందుకే కుళ్లి పోతున్నారు వాళ్లిద్దరూ..” అనుకుంది ఊర్మిళ.
  ఉజ్వలకి గర్వంగా అనిపించింది.. ఊర్మి బొటన వేలెత్తి థమ్సప్ సైన్ చూపిస్తుంటే.
  అందరూ మళ్ళీ స్టూడియోలోకి వచ్చారు. ముందు రోజుకీ ఆ వేళ్టికీ పోలికే లేదు. అంతా హార్ట్ షేప్ బుడగలతో, పువ్వులతో అలంకరించారు. గుండ్రంగా వేదిక. దాని మీద ఒక మహారాజా కుర్చీ. దానికెదురుగా కొంచెం చిన్న కుర్చీ (మహారాణీ?) ఉన్నాయి.స్టూడియో అంతా వాక్యూమ్ క్లీనింగ్ చేసి ఫ్రెషనర్ జల్లారు. కామెరా మన్ లైట్లు సరి జూసుకుంటున్నాడు.
  ఎక్కడి నుంచి వచ్చారో కానీ బిలబిలా పదిమంది అమ్మాయిలు వచ్చి ఆడియన్స్ లో కూర్చున్నారు. ఊర్మిళని కూడా వాళ్లతో కూర్చోమన్నారు.ఉజ్వల, వీణి, వీణలని వేరుగా ఒక దగ్గర కూర్చోపెట్టారు. ప్రొడక్షన్ మానేజర్, అతని అసిస్టెంట్ చైతన్య, పదోసారి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదాని చూసుకున్నారు.
  
  ఇంతలో బైట ఒక్క సారిగా కలకలం మొదలయ్యింది.. అడుగుల చప్పుళ్లు, మాటలు.. గబగబా నడుస్తూ హీరో ఆదిత్య లోపలికి వచ్చాడు. అందరూ లేచి నిలుచున్నారు. చెయ్యూపుతూ, పళ్లు మెరెసేలా నవ్వుతూ, మేకప్ రూమ్ లో కెళ్లి పోయాడు ఆదిత్య.
  తన ముందు నుంచి ఆదిత్య వెళ్లి పోయాక, ఆ గాలిని దీర్ఘంగా పీల్చి, అంతు లేని ఉద్వేగానికి లోనయ్యింది ఉజ్వల. “ఈ క్షణం కోసమే అంత రిస్క్ తీసుకుంది.. అమ్మో వద్దొద్దు. దాన్ని గురించి ఆలోచిస్తే ఇప్పుడేం చెయ్యలేను. ఏమవుతుందో రేపు చూసుకుందాం” మూతి బిగించి కళ్లు గట్టిగా మూసి తెరిచింది.
  పక్కన కూర్చున్న వాళ్లిద్దరూ ఎంత ఆరామ్ ఉన్నారో! తను కూడా అలా ఉండ గలుగుతే ఎంత బాగుండును? అందరిలో ఉత్సాహం నింపుతూ, హీరో ఆదిత్య మేకప్ రూం లోంచి బైటికి వచ్చి, మహారాజా కుర్చీలో కూర్చున్నాడు.
  “ఏం ఠీవి? మేకప్ ఎక్కువ లేకపోయినా మహారాజు లాగే ఉన్నాడు” అనుకుంది ఉజ్వల.
   “మిస్. వాణి!” పిలుపు వినపడింది. నిరుత్సాహంగా వెనక్కి వాలింది ఉజ్వల. తర్వాత వీణని పిలిచారు. అసలు వాళ్లెం అడుగుతున్నారో, ఏం చేస్తున్నారో.. ఏదీ ఉజ్వల మనసుకెక్కలేదు.
  “మిస్. ఉజ్వలా!” ఎప్పటికో పిలిచారు..

  అప్పుడు టైమ్ పదకొండున్నర.
.......................

0 వ్యాఖ్యలు: