Wednesday, August 23, 2017

"అంతా ప్రేమమయం" 1—11. ధారా వాహిక.

Posted by Mantha Bhanumathi on Wednesday, August 23, 2017 with 1 comment
                                                        అంతా ప్రేమమయం - 1-11

                                     “అంతా ప్రేమమయం”

                                        1

ఉదయభానుడు తన శతకోటి కిరణాలతో ప్రపంచాన్ని మేలుకొలిపి ఆశీర్వదించడానికి నెమ్మ్దదిగా ఆకాశంలోకి ప్రవేశిస్తున్నాడు. అశోక వృక్షాల్లోంచి కిటికీ అద్దాల్లోని రంగుల డిజైన్లని ఛేదించుకుని, చిత్రకారుడి కుంచెకి అందలేని వింత సొబగులతో గది అంతా పరుచుకున్నాయి సూర్య కాంతులు.
  వెంకట్ కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరగా వెళ్లాడు. ఈ అపురూపమైన ఘడియకోసమే తూరుపు వైపున్న గది తీసుకున్నాడతను. తన గది నుంచి కొంచెం ముందుకి వెళ్లి కొద్దిగా ఎడం పక్కకి తిరుగుతే, పెద్ద గేటు.. తన కుర్చీలోంచి చూస్తే గేట్లోంచి వచ్చే పోయే వాళ్లందరూ కనిపిస్తారు. పెద్ద ఫ్రెంచ్ విండో తన సీటుకి కుడి పక్కన ఉంది. అందులోనుంచే ప్రభాత సోయగాలు కన్నులకి ఆహ్లాదం కలిగించేది.
 “గుడ్ మార్నింగ్ సర్!” వైస్ ప్రిన్సిపాల్ శంకర్ లోపలికి వస్తూ విష్ చేశాడు. వెంకట్ తలతిప్పి కొద్దిగా వంచి నవ్వాడు.
  కటికీ కేసి తలతిప్పి చూసే సరికి, సూర్యుడు చెట్ల మీంచి పైకెళ్లి పోతున్నాడు.. ‘బోలెడు పన్లున్నాయి నీ దగ్గరే కూర్చుంటే ఎలా’ అన్నట్లుగా. గదిలో డిజైన్లన్నీ ఎవరో కడిగేసినట్లుగా మాయం ఐపోయాయి. అప్పుడ టైము ఆరున్నరయింది.
  “అంతా నార్మల్ గా ఉందా?” శంకర్ చేతిలోనుంచి అటెండెన్స్ రిజిస్టర్ అందుకుంటూ అడిగాడు.
  “ఎస్సర్.. ఒక్క ఆల్జీబ్రా లెక్చరెర్ రాలేదు ఏదో ఎమర్జెన్సీట.” చెప్పాడు శంకర్.
  “ఎవరు? హరిశ్చంద్ర ప్రసాదేనా? అతనికి తప్పు పేరు పెట్టారయ్యా. అన్నీ అబద్ధాలే. నెలకి నాలుగు సార్లు కొంపలు మునిగి పోతుంటాయి. రిప్లేస్ చేద్దామంటే మానేజ్ మెంట్ కాండిడేటయిపోయాడు. ఎలాగో మానేజ్ చెయ్యమంటాడు సెక్రెటరీ. అదీ కాక క్లాస్ తీసుకున్నప్పుడు పిల్లల్ని మెస్మరైజ్ చేస్తుంటాడు. సర్లే.. వాట్ కెన్నాట్ బి క్యూర్డ్  మస్ట్ బి ఎన్డ్యూర్డ్. క్లాసులెప్పుడున్నాయో చెప్పు మనిద్దరం షేర్ చేద్దాం.” వెంకట్ తన కుర్చీలో కూర్చుంటూ వాపోయాడు.
  అప్పుడొకళ్లూ అప్పుడొకళ్లూ కుర్రాళ్లు పరుగెత్తుకుంటూ క్లాసులకెళ్తున్నారు. వెంకట్ చూసీ చూడనట్లు వదిలేసి తన పని చూసుకుంటున్నాడు.
  శంకర్ తన సీట్లో కూర్చుని, ఆ రోజు చెయ్యవలసిన పనుల లిస్ట్ చూసుకుంటున్నాడు.
  ఒక జిల్లా కేంద్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అది.ఊరు చివరగా కొండలనానుకుని రెండు పెద్ద భవనాలు కట్టారు. ఒకటి ఆడపిల్లలకి, ఒకటి మగపిల్లలకి. రెండు భవనాలకీ మధ్య పెద్ద గోడ.
  భవనంలో సగం భాగం కాలేజ్, సగం హాస్టల్.
  పొద్దున్న ఆరు గంటలనుంచే ట్యుటోరియల్స్ ఉంటాయి. ఎనిమిదింటికి బ్రేక్ ఫాస్ట్. ఇళ్ల నుంచి వచ్చే వాళ్లకి కూడా అక్కడే భోజన ఫలహారాలు.తొమ్మిది నుంచీ ఒంటిగంట వరకూ క్లాసులుంటాయి. ఒక గంట లంచ్ విరామం. సాయంత్రం నాలుగు నుంచీ ఆరు వరకూ ఎమ్సెట్ కోచింగ్. ఆరు నుంచీ ఏడు వరకూ డిన్నర్. కాసేపు ఊపిరి తీసుకున్నట్లుగా ఉంటే.. రాత్రి పది వరకూ హోంవర్క్.. చదువులు. అప్పుడు ఇళ్లనుంచి వచ్చే వాళ్లని తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తారు. అందుకే చాలా మంది హాస్టల్ లోనే ఉంచేస్తారు.
  ఇంటర్ రిజల్ట్స్ కీ, ఎమ్సెట్ రిజల్ట్స్ కీ రాష్ట్రంలోనే ప్రధమ స్థానాన్ని ఆక్రమించిందా కళాశాల. ప్రతీ జిల్లా కేంద్రంలోనూ ఒక బ్రాంచ్. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు ముగ్గురు దాని వ్యవస్థాపకులు. ముఖ్యంగా చంద్రశేఖరంగారు.. చురుకుగా అన్ని వ్యవహారాలూ చూస్తుంటారు. ప్రతీ విద్యార్ధి యోగక్షేమాలూ పేరు పేరునా కనుక్కోవడం ఆ కళాశాలల ప్రత్యేకత.
  ప్రతీ విద్యార్ధికీ ఒక ఫైలు. వారం వారం ప్రోగ్రెస్ అందులో ఫీడ్ చేసి మంత్లీ రిపోర్ట్ లు తయారు చెయ్యడానికి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లుంటారు. ఆ రిపోర్ట్ లు ప్రిన్సిపాల్ పరిశీలించిన తరువాత, స్వయంగా చంద్రశేఖరంగారు చూసి, అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్ తో చర్చిస్తుంటారు.
  వెంకట్ ప్రిన్సిపాల్ గా ఉన్న కాలేజ్ ని అందరూ ‘ఫాదర్’ అని పిలుస్తారు, ఆ చైన్ లో మొట్టమొదటగా స్థాపించబడిందని. ఒక ఇరుకు సందులో, ఒక ఇంటి మేడమీద ప్రారంభించబడ్డ ట్యుయోరియల్ కాలేజ్ .. రాష్ట్ర మంతా మఱ్ఱిచెట్టు ఊడల్లా విస్తరించింది. ట్యుటోరియల్ ని రెసిడెన్షియల్ కాలేజ్ గా మార్చి విశాలమైన భవనాలు కట్టారు అన్ని ముఖ్యపట్టణాలలోనూ.
  వెంకట్ కి నలభై ఐదేళ్లుంటాయి. యమ్మెస్సీ అవగానే ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం వచ్చింది. పదిహేనేళ్లు పనిచేశాక చంద్రశేఖరం అతన్ని పట్టుకున్నాడు. రాష్ట్రంలో ఉన్న ఇంచుమించు అన్ని కలాశాలల్లోని లెక్చరర్ల వివరాలూ చంద్రశేఖరం సేకరిస్తుంటాడు. అలాగ.. స్టూడెంట్స్ లో మంచి పేరు తెచ్చుకున్న వెంకట్ ని, పది రెట్లు జీతం ఇస్తానని చెప్పి తీసుకొచ్చి, ప్రతిష్ఠాత్మక కాలేజ్, ‘ఫాదర్’ లో వేశాడు. వెంకట్ చేరినప్పట్నుంచీ కళాశాల ఖ్యాతి మరింత పెరిగింది.

  తెల్లవారుఝామునే నాలుగింటికి లేచి సతమతమైపోతోంది రమ. లేవగానే మొదటి కఠిన మైన కార్యక్రమం, ఆదిత్యని లేపడం. పది నిముషాలు పాటుపడి, ఫ్రిజ్ లో నీళ్లు మొహం మీద చిలకరిస్తే, “మమ్మీ” అంటూ గావుకేకలేస్తూ లేస్తాడు.
  “అమ్మో.. ఫోర్ థర్టీ..” అని అరిచి మంచం మీది నుంచి బాత్రూంలోకి ఒక్క గెంతు లో ఉరికి, జెట్ స్పీడులో స్నానం వగైరాలన్నీ ముగించుకుని వంటింట్లో తల్లి ముందు వాల్తాడు. అప్పటి రమ ఏ ఉప్మానో తయారు చేసి, పాలు రెడీగా ఉంచితే, మూడు స్పూన్లతో ఉప్మానీ, రెండు గుక్కల్లో పాలనీ గొంతులో వేసి.. బాగ్ తో సహా మెట్ల మీది నుంచి దూకుతూ అపార్ట్మెంట్ గేటు దగ్గరకి పరుగెడతాడు.
  అక్కడ స్కూటర్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్న శ్రీరామ్ కొడుకు నెక్కించుకుని బస్టాప్ దగ్గర దింపుతాడు.
  బస్సు ఐదింటికల్లా బయలు దేరుతుంది. వరుసగా అన్ని సెంటర్లలోనూ ఆగి కాలేజ్ దగ్గరకి వచ్చే సరికి పావు తక్కువ ఆరవుతుంది. కాలేజ్ గేటు దగ్గర బస్సు దిగి ‘అమ్మయ్య’ అనుకుంటారు పిల్లలందరూ. ఆ వేళ్టికి టెన్షన్ తీరిందన్నమాట. అప్పటి నుంచీ ప్రారంభమైన అవిశ్రాంత పోరాటం రాత్రి పదింటికి కానీ అవదు.
  రమ, శ్రీరామ్ వంటి తల్లిదండ్రులు ఆ రోజుకి నిశ్చింతగా ఉంటారు. దాదాపు రోజూ అదే తంతు.

  వెంకట్ ఫస్ట్ ఇంటర్ క్లాస్ లోకి అడుగు పెడుతుండగానే పిల్లలందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పారు. వెంకట్ కుర్చీని బల్ల ముందుకి జరిపి కూర్చున్నాడు.
  వెంకట్, ఐదడుగుల నాలుగంగుళాల పొడవుతో, సన్నగా ఉండి కుర్చీలో చక్కగా ఇమిడి పోతాడు.
  ఎప్పుడూ తెల్లని ఇస్త్రీ పైజామా లాల్చీ, కనుబొమ్మల మధ్య కనీ కనిపించకుండా చిన్న బొట్టు.. పెదవుల మీద చెరగని చిరునవ్వు అతని ప్రత్యేకతలు. పిల్లలందరూ కూర్చున్నాక అటెండెన్స్ రిజిస్టర్ తీశాడు. అభిలాష్. అభినవ్, ఆదిత్య, అరుణ్, అక్షయ్.. ఆయుష్..
  “ఏంటయ్యా! అ ఆలతో తప్పితే పేరు మొదలవడానికి ఇంకేం పనికి రావా? ఓ ఇక్కడొక శ్రీనివాసుడున్నాడు.”
  అటెండెన్స్ అయాక ఆదిత్య లేచాడు. “సార్! ఇవేళ నలుగురివి బ్ర్త్ డేలున్నాయి. కేక్ కోయిస్తారా?”
  ప్రిన్సిపాల్ బ్ర్త్ డే కేక్ కోయించడమంటే మాటలా? ఫాదర్ లో పిల్లల పుట్టినరోజులన్నీ గుర్తు పెట్టుకుని క్లాస్ లో కేక్ కోయించడం ఒక ఆనవాయితీ. వాటికై ఆదిలోనే ఫీజు వసూలు చేస్తారు. ఐతేనేం.. అదొక ప్రత్యేకత.
  “విత్ ప్లెజర్. ఏడీ తిరుపతి?”
  తిరుపతి క్లాస్ అటెండర్.
  “రెడీ సార్.”తిరుపతి పెద్ద కేక్ తో తయారు.
  “పదహారు బుల్లి బుల్లి కొవ్వొత్తులు ఠీవిగా నించున్న, క్రికెట్ బాట్ ఆకారంలో ఉన్న కేక్ ని చూడగానే పిల్లలందరూ రిథిమిక్ గా చప్పట్లు కొట్టడం మొదలెట్టారు.
  పదహారేళ్ల వయసొచ్చిన అభిషేక్, ఆర్ణవ్, అమృత్, ఆరూష్ లు సగం సిగ్గుతో, సగం ఆనందంతో మార్చ్ చేస్తూ ముందుకు వచ్చారు. అందరి బుగ్గలూ ఎర్రగా, కళ్లల్లో ఉత్సాహం. ఆ వేళ్టికి వాళ్లే హీరోలు మరి.
  వెంకట్ లేచి నలుగురి చేతా కేక్ కోయించాడు. అందరూ ప్రిన్సిపాల్ కి ముందుగా పెట్టి, ఒకరికొకరు తినిపించుకున్నారు. తిరుపతి తయారుగా ఉంచుకున్న డిస్పోజబుల్ కాగితం ప్లేట్లలో అందరికీ కేక్ ఇచ్చాడు.
  తినడం అయి చేతులు కడుక్కునే సరికి సగం పీరియడ్ అయిపోయింది. తినడం అయాక ఆల్జీబ్రా ఎంతవరకూ అయిందో కనుక్కున్నాడు వెంకట్. క్లాసులెంత ఎగ్గొట్టినా పోర్షన్ బాగానే కవర్ చేశాడు హరిశ్చంద్ర. ట్యుటోరియల్, క్లాసులూ కలిపి పాఠాలు బాగా అర్ధమవుతున్నాయని చెప్పారు పిల్లలు.
  మిగిలిన అరగంటలో ఆల్జీబ్రాని అరటిపండు ఒలిచినంత సులభంగా చెప్పి లేచాడు వెంకట్, బెల్లవగానే.
  “సార్!” అన్నారు పిల్లలంతా ఒకే సారి.
  వెంకట్ పిల్లలకేసి చూశాడు.
  “రోజూ మీరే రాకూడదా సార్?”
  “అప్పుడప్పుడు వస్తుంటాగా! మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండండి. డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తా.” వెంకట్ క్లాస్ లోంచి బైటికి నడిచాడు.
                                   …………………
  ఆదిత్య(ఆది), అభిషేక్(అభి), ఆర్ణవ్(అణు), అమృత్(అము), ఆరూష్(ఆరూ).. అందరూ ఒక స్కూల్ నుంచే వచ్చారు. ఎల్ కేజీ నుంచీ ఒకటే బెంచ్. అందులో నలుగురివి ఒకే రోజు బర్త్ డేలు.
  మొదట్లో తెలీకుండానే కోపం తెచ్చేసుకునేవారు. ఒకళ్ల బర్త్ డేని ఒకళ్లు లాగేసుకుంటున్నంత బాధవేసేది. నెమ్మదిగా అలవాటై పోయి ఆరో క్లాసు నుంచీ ప్రాణస్నేహితులైపోయారు. ఆ తరువాత అందరూ వాళ్ల బర్త్ డేరోజు కలుసుకుంటూ వచ్చారు. ఆదిత్య అందరికంటే ఒక నెల చిన్న. ఆయినా కూడా వాడే లీడరు.
  ‘ఫాదర్’ లో చేరినరోజు, ఆకాలేజ్ అస్సలు నచ్చలేదు, అఆలు ఐదుగురికీ. స్కూల్లో వాళ్ల గాంగుకి ఆపేరు పెట్టారు. అక్కడ కొంచెం వేరే అచ్చు హల్లులతో మొదలయ్యే పేర్లుండేవి.
  “ఎక్కడా ఆడుకోడానికి గ్రౌండే లేదురా!” ఆదిత్య మాటలకి అందరూ క్లాసులో కిటికీల దగ్గరకి వెళ్లి చూశారు.
  “నిజమేరా. ఓ పక్క కొండలు. మరో పక్క అమ్మాయిల కాలేజి.మిగిలిన రెండు సైడ్లూ  జైలు గోడల్లాంటి గోడలు. ఇంక క్రికెట్, ఫుట్ బాల్ ఎక్కడాడతాం?” ఆణు విచారంగా అన్నాడు. స్కూల్లో క్రికెట్ టీమ్ కి వాడే కెప్టెన్.
  “టైమ్ టేబిల్ చూడలేదారా? అసలు ఆటలకి టైమెక్కడుంది?” అన్నాడు అభి. వాడు పుస్తకాల పురుగు. ఇంతలావు మయోపియా కళ్లద్దాలతో.. ఎప్పుడూ చేతిలో పుస్తకంతో ప్రొఫెసర్ లా పోజులిస్తుంటాడు.
  “ఇట్రండ్రా!” అమూ, అరూలు పిలిచారు.
  అక్కడ కిటికీలోంచి చూస్తే అమ్మాయిలు నడుస్తూ కనిపించారు. అమ్మాయిల కాలేజ్ అటుపక్కుంది.

  “నమస్కారం” అంటూ చేతివేళ్ల కొసలు ఎదుటివారి వైపుకి పెట్టి జోడించి ఒక పెద్దాయన క్లాసులోకి వచ్చారు. మాసిపోయిన రంగున్న పాంటు, చిన్న గళ్లున్న బుష్ షర్టు. కొద్దిగా ముందుకి వంగి నడుస్తూ, ముందు బెంచీ దగ్గర నిలుచున్నారు. పిల్లలందరూ గబగబా సర్దుకుని లేచి నిల్చుని నమస్కరించారు.
  “నా పేరు అప్పలాచారి. సంస్కృతం చెప్తాను. నాకు ఈ నించోడాలూ, గుడ్ మార్నింగ్ చెప్పడాలూ ఇష్టం ఉండవు. అతివినయం ధూర్తలక్షణం.” అప్పలాచారి ముందు బెంచీ ఎక్కి కూర్చుని అన్నాడు.
  ఎందుకో కానీ ముందు బెంచీ వదిలేశారు పిల్లలు.
  “మీరు సంస్కృతం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు. మార్కులొస్తాయని. సంస్కృతంలో అఆఇఈ లేనా వచ్చా ఎవరికైనా?”
  ఎవరూ నోరెత్తలేదు.
  “నాకు తెలుసు. సంస్కృతం ఇంగ్లీషులో రాసేడుస్తారు. మేం దిద్దేడవాలి.” చేతి రుమాలుతో మూతి తుడుచుకుంటూ అన్నాడు. అయినా తుంపర్లు పడుతూనే ఉన్నాయి.
  “మీకు పాఠాలు చెప్పడానికి ఇద్దరొస్తాం.”
  “ఇద్దరేనా సార్?” మళ్లీ కోరస్.
  “నా తలకాయ. సంస్కృతం చెప్పడానికి ఇద్దరం. నా క్లాసులో మాత్రం నేనేదంటే అదనాలి. నేనేం చేస్తే అది చెయ్యాలి. ఒక నోట్సుతప్పకుండా పెట్టాలి.” అప్పలాచారి ఆగి ఆగి అంతా చెప్పే సరికి బెల్లయింది.
  “చాలా థాంక్స్ రా!” ఆదిత్యకి నలుగురూ చెప్పారు. అందరూ వింతగా చూస్తుంటే, అము అన్నాడు..
  “ముందు బెంచీ వదిలేసి కూర్చుందామని వాడే అన్నాడు.” అందరూ చప్పట్లు కొట్టారు.   
  చప్పట్లు కొడుతుంటే వచ్చారు ప్రిన్సిపాల్ వెంకట్.
  “థాంక్యూ ఫర్ ది వెల్కమ్ క్లాప్స్.”
  దొంగ చూపులుచూస్తూ ఇంకా నించునే ఉన్నారు.
  “కూర్చోండి. మీ అందరికీ పరిచయాలయ్యాయా?”
  తలలు అడ్డంగా తిప్పారు.
  “ఇప్పుడు అయిస్ బ్రేకింగ్. అంటే ఒకళ్లనొకళ్లు పరిచయం చేసుకోవడం.” వెంకట్ నవ్వుతూ అన్నాడు.
  తిరుపతి వెనకాలే ఒక సంచీ పుచ్చుకుని రెడీగా ఉన్నాడు. జిప్ ఉన్న గుడ్డ సంచీ. అడ్మిషన్ కి వచ్చినప్పుడే చెప్పారు, ఎవరూ ప్లాస్టిక్ సంచీలు వాడకూడదని. అందరూ స్కూల్ బాగ్ లు తెచ్చుకోవలసిందే.
  కాంపౌండ్ లో ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు కనిపించడానికి వీల్లేదు. ప్రాక్టికల్ గా ‘ఎన్విరాన్ మెంటల్' ఫ్రెండ్లీగా ఎంలా ఉండాలో నేర్పించాలని వెంకట్ ఉద్దేశం. తిరుపతి కేసి తిరిగి తలూపాడు.
  బాగ్ లో ఉన్న అంగుళం పొడవున్న పేపర్ రోల్స్ ని బల్ల మీద పోశాడు తిరుపతి. ఏమిటా అని అందరూ కుతూహలంగా చూశారు.
  “వీటిలో మీ క్లాసులో ఉన్న పిల్లల పేర్లున్నాయి. ఒక్కొక్కళ్లూ వచ్చి ఒక్కో రోల్ తీసుకోండి.అందు ఉన్న పేరు గలవాళ్లని వెతుక్కుని, వాళ్ల దగ్గరికి వెళ్లి, వాళ్ల గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి చెప్పాలి. అంటే, మీకొచ్చిన కాగితంలో ఎవరి పేరుంటే వాళ్ల గురించి మీకు పూర్తిగా తెలియాలన్నమాట. ఎవరు బాగా చెప్తే వాళ్లకి మంచి ప్రైజ్.” అన్నాడు వెంకట్.
  దాంతో కుర్రాళ్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదేదో కొత్తాట.. బాగుందే! అందరూ కాగితాలు విప్పి పేర్లు చూసుకున్నారు. ఇంక ఒకళ్ల నొకళ్లు వెతుక్కోడం.. ఎదురెదురుగా కూర్చుని వివరాలు రాసుకోవడం.. అంతా కొత్త కొత్తగా ఉంది. అరగంటయ్యాక, అందరికంటే ముందు ఆదిత్య వచ్చాడు బల్ల దగ్గరకి.
  ఆదిత్యకి అక్షయ్ గురించి చెప్పమని వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే ఆయుష్ వచ్చాడు, ఆదిత్య వివరాలు తీసుకోడానికి.
  అక్షయ్ గురించి మూడు నిముషాల్లో అన్ని వివరాలూ చెప్పాడు ఆదిత్య. అక్షయ్ పక్క ఊళ్లోనుంచి వచ్చి చేరాడు. హాస్టల్లో ఉంటాడు. ఫాదర్ లాండ్ లార్డ్. ఇలా అందరి గురించీ తెలుసుకోడానికి రెండు గంటలు పట్టింది.
  అందరి కంటే బంటీ బాగా చెప్పాడు. వాడికి బహుమతిగా మంచి లెటర్ ప్యాడ్ ఇచ్చారు ప్రిన్సిపాల్.
  వెంకట్ వెళ్తుంటే, “థాంక్యూ సర్!” అందరూ మనస్ఫూర్తిగా విష్ చేశారు.* (1)

  కాలేజీలో ప్లే గ్రౌండ్ లేకపోతేనేం.. ప్రతీ ఆదివారం పొద్దున్న పరీక్షయ్యాక మధ్యాన్నం అందరూ మునిసిపల్ గ్రౌండ్ కి చేరతారు క్రికెట్ ఆట్టానికి.
  అందరిలో వయసులో చిన్న లెక్చరర్స్ రమేష్, సంపత్ లు కూడా గ్రౌండ్ కి వెళ్లి ఆడినంత సేపు ఆడి, కూర్చుని సూపర్ వైజ్ చేస్తుంటారు. ప్రతీ ఒక్క స్టూడెంట్ అందుకే ఆదివారం కోసం ఎదురు చూస్తుంటారు. రంజీ ట్రోఫీ లెవెల్లో క్రికెట్ మాచ్ నడుస్తూంటుంది.
  అణూ ఆటెమేటిగ్గా వాళ్ల టీమ్ కి కెప్టెన్ ఐపోయాడు. వాళ్ల క్లాసులో అందరూ సిబియస్సీ వాళ్లే. వాళ్లంతా ఒక జట్టు. వాళ్లకి సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్.
  అపోజిషన్ వాళ్లు తెలుగు సెకండ్ లేంగ్వేజ్ వాళ్లు. టెంత్ స్టేట్ సిలబస్ వాళ్లది. ప్రవీణ్ వాళ్ల జట్టు కెప్టెన్. కొంత మంది బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ ఆడుతుంటారు. కానీ ఎక్కువ మంది క్రికెట్ మాచ్ చూసేవాళ్లే.
  ఆదిత్య క్రికెట్ టీమ్ లో ఉన్నాడు. ఆము, ఆరు ఫుట్ బాల్ ఆడతారు. అభి మాత్రం నీడ ఉన్నచోట కూర్చుని నవలో, జనరల్ నాలెడ్జ్ బుక్కో చదువుతూ కూర్చుంటాడు. చిన్నప్పటి నుంచీ వాడ్ని ఎంత ప్రయత్నించినా, రన్నింగ్ రేస్ లో కూడా పాల్గొనేట్లు చెయ్యలేక పోయాడు ఆదిత్య. “నా వల్ల కాదురా” అని వదిలేశాడు.
  గ్రౌండుకి కొంచెం దూరంలో గుడిసెలున్నాయి. ఆ గుడిసెల్లోనే ఉంటాడు ‘సుభానీ’. పిల్లలందరూ వచ్చి కొద్ది సేపటికి, “సుభానీ” అని అరవగానే బండి తోసుకుంటూ వచ్చేస్తాడు. ‘ఛుక్' అని చప్పుడు చేసుకుంటూ గోళీ సోడా కొట్టేసి అందరికీ అందిస్తాడు. అదన్నమాట, క్రికెట్ మాచ్ లో డ్రింక్స్ బ్రేక్.
  ఎవరి దగ్గరైనా డబ్బు లేకపోతే అందరూ కలిసి పోగు చేస్తారు. ఎవరూ దాహంతో వెనక్కి వెళ్లిపోవడానికి వీల్లేదు. కామెంట్రీ బంటీ ఇస్తుంటాడు. వాణ్ణి అందులో ఎవరూ మించలేరు. ఆణు వాళ్ల టీమ్ లో అందరూ మంచి ప్లేయర్సు. ప్రవీణ్ టీమ్ లో ఆరుగురు మాత్రం బాగా ఆడతారు. మిగిలిన వాళ్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ.. దానికి అంత టైమ్ ఎక్కడిదీ?
  చాలా రెసిడెన్షియల్ కాలేజీల్లో ఈ మాత్రం ఆటలు కూడా ఉండవు. ఇంకా ఇది నయం. ఆదివారం సాయంత్రం ఇళ్లకీ, హాస్టల్ కీ వెళ్లగానే ఆవురావురు మంటూ అన్నాలు తినేసి పడుకుంటారు. అయితేనేం.. రెండింటికల్లా లేచి రివిజన్ చేసుకుని వచ్చేవారం పాఠాలు వినడానికి ఫిజికల్ గా మెంటల్ గా కూడా తయారుగా ఉంటారు.
  అణూ, వాళ్ల నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయినా కూడా పట్టుబట్టి ఈ కాలేజ్ లో చేరాడందుకే. ’ఆదీ’ వాళ్లనీ వదిలిపెట్టి వెళ్లడమే.. ఇంపాజిబుల్.
  ఇంటర్లో చేరిన ఆర్నెల్లకి, ఒక ఆదివారం అందరూ గ్రౌండ్ కి వెళ్లారు మామూలుగా.
  ఆరోజెందుకో సంపత్ సార్ రాలేదు. సంపత్ సార్ వస్తే హుషారుగా ఉంటుంది. కానీ రమేష్ సార్ బాగా ఆడతారు.
  ఆదిత్యకి బాగా జలుబుగా ఉంది. దగ్గు మందేసుకున్నాడేమో నిద్దర నిద్దరగా కూడా ఉంది.
  “నేనాడన్రా! అంపైర్ గా ఉంటా.” ముందర సరే అన్నాడు ఆణూ. కానీ టీమ్ లో పది మందే ఉన్నారు. ఇంక ఎవరూ రామన్నారు. అవతల టీమ్ అసలే ఛాలెంజ్ విసిరింది. ఆర్నెల్లలో బాగా పుంజుకున్నారు. పైగా రమేష్ సార్ కూడా ఆ టీమ్ లో చేరారు.
  “తప్పదురా! నువ్వు చివర్లో బాటింగ్ చేద్దువు గాని. ఫీల్డింగ్ ముందు ఉండి చెయ్యచ్చు.” అన్నాడు ఆణూ. ఆది అయిష్టంగానే ఆటలోకి వెళ్లాడు.
  టాస్ వాళ్లకే వచ్చింది. ఆణూ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి హాఫ్ బానే నడిచింది. బ్రేక్ టైముకు నూటాభై పరుగులు చేశారు ప్రవీణ్ టీమ్.
  సోడా బ్రేక్ అయ్యాక ఆణూ టీమ్ బాటింగ్ మొదలుపెట్టారు. ఆణూ యాభై పరుగులు చేశాడు. మధ్యాహ్నం ఎండ తీక్షణంగా ఉండటంతో, టోపీ పెట్టుకున్నా కళ్లల్లో పడుతోంది చుర్రుమంటూ. దాంతో వరుసగా వికెట్లు పడిపోవడం మొదలయ్యాయి. దాంతో ఆదికి వెళ్లక తప్పలేదు.
  నీరసంగా, తలనొప్పిగా ఉన్నా ఎలాగో ఇరవై పరుగులు చేశాడు ఆదిత్య. ఇంక నాలుగే పరుగుల్తో గెలుస్తారు. ప్రవీణ్ బౌలింగ్ చేస్తున్నాడు. బాట్ పొజిషన్ లోకి తీసుకుని కొట్టబోతుండగా వేగంగా పక్కనుంచి దూసుకు వచ్చి కాలుకు తగిలింది క్రికెట్ బాల్.
  బంటీ కామెంట్రీ ఆగి పోయింది. ఒక్క సారిగా కుప్పకూలిపోటాడు ఆదిత్య.
                                     ………………...
                                                 2
    అందరికంటే ముందుగా రమేష్ సార్ రియాక్టయాడు. తను ఫీల్డింగ్ చేస్తున్న చోటు నించి వచ్చి ఆదిని లేపాడు. గబగబా సీసాలోంచి నీళ్లుతీసి చిలకరించి తెలివి ఉందాలేదా అని చూశాడు.
  ఫరవాలేదు. మాట్లాడుతున్నాడని నిర్ధారించుకుని, వెంటనే హాస్పిటల్ కి అంబులెన్స్ పంపించమని ఫోన్ చేశాడు. ఇంతలో, అణు తన సెల్ లోంచి శ్రీరామ్ కి ఫోన్ చేసాడు. అంబులెన్స్ వస్తే కానీ ఆదిని కదపద్దని చెప్పాడు. ఇరవై నిముషాల్లో అంబులెన్స్, శ్రీరామ్, రమ వచ్చేశారు,
  “థాంక్ గాడ్. కాలికే దెబ్బ తగిలింది. ఏం ఫరవాలేదు రమా!” రమకి ధైర్యం చెప్పాడు శ్రీరామ్.
  శ్రీరామ్, రమలకి ఆది ఒక్కడే. అందుకే, హాస్టల్లో చేరతానన్నా వద్దని ఇంటి దగ్గర్నుంచే పంపుతున్నారు. నిజానికి హాస్టల్లో ఉంచుతే తెల్లవారు ఝామున నాలుగింటికి లేచే పని తప్పుతుంది రమకి. “ఇంటర్ అయ్యాక ఎలాగో హాస్టలేగా.. ఈ రెండేళ్లైనా మన దగ్గరుంచుకుందాం” అందామె.
  “ఎలా జరిగింది నాన్నా! బాగా ఆడతావు కదా” అనునయంగా అడిగాడు శ్రీరామ్.
  “కొంచెం వీక్ గా అనిపించింది డాడీ. రిఫ్లక్స్ సరిగ్గా లేదు. నేను కదిలే లోపుగా బాల్ వచ్చి తగిలింది.”
  ఆణు గిలిటీగా తలతిప్పుకున్నాడు. తను బలవంత పెట్టకపోతే ఇలా అయ్యేది కాదు. వెధవ గేమ్. వర్ల్డ్ కప్ లాగ ఫీలయిపోయాం. పదో సారి తిట్టుకున్నాడు.
  రమేష్ ఫోన్ చేశాడో ఏమో, వెంకట్ వచ్చి అంబులెన్స్ వాళ్లతో మాట్లాడాడు. అదిని స్ట్రె చర్ మీదికెక్కించారు.
  పిల్లలు చాలా మంది ఎక్కడివాళ్లక్కడికెళ్లిపోయారు, ఒక్క క్రికెట్ ఆడిన వాళ్లు తప్ప. వాళ్లు బస్సుల్లోనూ ఆటోల్లోనూ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆది కోసం అందరూ ఆతృతగా బయట నిలుచున్నారు.
  వెంకట్, శ్రీరామ్ దగ్గరకొచ్చి, “సారీ సర్! ఈ ఆటలకి ఎంకరేజ్ చేసి తప్పు చేశానేమో” అన్నాడు.
  “డోంట్ వర్రీ. స్పోర్ట్స్ లో ఇటువంటివి కామనే. ఒకసారి యాక్సిడెంట్ అయిందని స్కూటర్ ఎక్కడం మానేస్తామా! ఇదీ అంతే.” శ్రీరామ్ స్పోర్టివ్ నెస్ ని వెంకట్ మెచ్చుకున్నాడు. రమ మాత్రం చాలా అసహనంగా ఉంది.
  “పరీక్షలు ఇంక రెండు నెలల్లో ఉన్నాయి. ఎలాగా?”
  “క్లాసుల సంగతి మేం చూసుకుంటామమ్మా. ఆది ఏమీ మిస్ అవకుండా చూసే బాధ్యత నాది. కావాలంటే ఇంటికొచ్చి చెప్తాం.” వెంకట్ అన్నంత పనీ చేసే రకం.
  “కాళ్లలో బలం చేతుల్లోకెళ్లి బాగా రాస్తాడులే.” శ్రీరామ్ మాటలకి అందరూ నవ్వారు. వాతావరణం కొంత తేలిక పడింది.
  “పేషంట్ పేరెంట్స్ ని డాక్టర్ గారు రమ్మంటున్నారు.” నర్స్ వచ్చి చెప్పింది.
  శ్రీరామ్, రమ లోపలికి వెళ్లారు.
  వెనుకే వెంకట్.
  “ఎక్స్ రే తీశాము. ఎముక ఫ్రాక్చరైంది. సర్జరీ చెయ్యాలి. సర్దరీ చేస్తే రెండు నెలల లోపు నడవగలుగుతాడు.”
  “చెయ్యక పోతే” రమ ఆతృతగా అడిగింది. తనకి ఆపరేషన్లంటే భయం.
  “చెయ్యకపోయినా అతుక్కుంటుంటుంది. ఆర్నెలలు బెడ్ మీదుండాలి. కాలు అస్సలు కదపకూడదు. ఆరేషన్ చేస్తే రెండు నెలల్లోగా క్రచెస్ సహాయంతో నడవగలుగుతాడు.”
  “ఐతే సర్జరీ చెయ్యండి డాక్టర్. ఎప్పుడు చేస్తారు?” శ్రీరామ్ మాటలకి డాక్టర్ తన షెడ్యూల్ చూశాడు.
  “ఎల్లుండి చేసేద్దాం. ఎర్లియర్ ది బెటర్ కదా! అప్పటి వరకూ కాలు కదపకుండా చూసుకోండి. టెంపరరీ కాస్ట్ వేస్తాం”.
  డాక్టర్ వెళ్లగానే నర్సు, శ్రీరామ్ ని ఫ్రంట్ డెస్క్ దగ్గరకు తీసుకెళ్లింది. డబ్బు కట్టడానికి. ఆణు, రమేష్ సార్, ప్రవీణ్.. అందరూ ఆది దగ్గరకు వెళ్లారు. అప్పటికే ఆది మొహం వాడిపోయింది. బాధని ఆపుకుంటున్నట్లుగా మొహం బిగించి పెట్టాడు. పిల్లలంతా విచారంగా నిలుచున్నారు. శ్రీరామ్ వస్తూనే అందరినీ హుషారు చేశాడు.
  “ఏంటంతా డల్ గా ఉన్నారు? వాట్ మై బాయ్! పెద్ద స్పోర్ట్స్ మన్ అవుతావా? యునో.. సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ ఏదో విరక్కొట్టుకుంటూనే ఉంటాట్ట. పుల్లెల గోపీచంద్ కయితే ఎన్ని సర్జరీలయ్యాయో లెక్కే లేదుట. సర్జరీ అయినప్పుడల్లా రెట్టించిన ఉత్సాహంతో లేచి ఆడుతుంటానని అతనే ఎక్కడో చెప్పాడు.” శ్రీరామ్ మాట్లాడుతుంటే రమేష్, వెంకట్ ఆరాధనగా చూశారతని కేసి.
  ఆపరేషన్ అయిన రెండు వారాలకల్లా క్రచెస్ సహాయంతో కాలేజ్ కొచ్చాడు ఆది. బస్సు వాళ్లింటి దగ్గరకెళ్లి ఎక్కించుకునేలా చేశాడు వెంకట్.
  ఆది హాస్పిటల్ లో ఉండగా, పిల్లలు స్వయంగా తయారు చేసిన, “గెట్ వెల్ సూన్" కార్డు పంపించారు. మధ్యలో చంద్రశేఖరం కూడా వచ్చి చూశాడు.
  ఆది ఇంటికొచ్చినప్పట్నుంచీ శ్రీరామ్ ఒక వారం సెలవు పెట్టాడు. అతను బాంక్ లో పని చేస్తాడు. రమ ఇలాంటప్పుడు డీలా పడుపోతుంటుంది. ఆది పనులన్నీ చూసుకోవడమే కాకుండా, అతని చదువుకి కూడా ఏర్పాట్లు చేశాడు శ్రీరామ్.
  క్రచెస్ తీసుకొచ్చాక, ఫిజియో థెరపిస్ట్ దగ్గర, ఎలా వాడాలో ముందుగా తను నేర్చుకుని, ఆదికి నేర్పించాడు. తాము వెజిటేరియన్స్ అయినా ఒక స్నేహితుడిని అడిగి వాళ్లింటినుంచి రోజూ బోన్ సూప్ తీసుకొచ్చి తాగించే వాడు.
  కాలేజ్ కొచ్చిన రోజున, తనుకూడా ఆదితో వచ్చి క్రచెస్ తో ఎలా నడుస్తున్నాడో గమనించాడు. “ఆమ్ పిట్ ఆనించ కూడదు. చేతుల మీంచే ఫుల్ సప్పోర్ట్ తీసుకోవాలి.” శ్రీరామ్ వార్నింగ్ కి ఆది చలాకీగా వెనక్కి తిరిగి నవ్వాడు.

  హైద్రాబాద్ లో, కుకట్ పల్లిలో, వీకర్ సెక్షన్స్ కోసం, ప్రభుత్వం కట్టించిన సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ లో ఒక మూలగా ఉన్న ఫ్లాట్. బాల్కనీలో ఆడుకుంటున్న పదేళ్ల కవిత ఒక్క సారి గట్టిగా అరిచింది.
  “అమ్మా! అక్క వత్తందే..”
  జల్దీ వంటచేసి పన్లోకి వెళ్లాలని హడావుడి పడుతున్న యాదమ్మ పరుగెత్తుతున్నట్లుగా బాల్కనీలోకి వచ్చింది.
  రెండు రెండు మెట్లు ఒకోసారి ఎక్కుతూ, నిముషంలో మూడో అంతస్థులోకొచ్చింది గౌరి. గౌరిని చూసి గుర్తు పట్టలేనట్లయిపోయింది యాదమ్మకి.
  “ఏందమ్మా! యాద్ మరచినవా?” బాగ్ కింద పెట్టి నవ్వుతూ పలకరించింది గౌరి.
  “లేదు బిడ్డా! మంచిగున్నవా” పైనుంచి కిందికి చూసి లోపలి కెళ్లింది యాదమ్మ.
  “జరంత చాయ్ పోస్తవానె..” వెనుకే వెళ్లిన గౌరి అడిగింది. బస్సు వెళ్లి పోతుందేమో అనుకుంటూ, ‘ఉండు బిడ్డా’ అని గౌరిని పరిశీలిస్తూనే చాయ్ కి నీళ్లు పెట్టింది.
  అన్నం వార్చి గంజి వేరే గిన్నెలోకి తీసింది.
  ఎక్కడిదో మరి, లేత పచ్చ రంగు మీద ముదురు పచ్చ పువ్వులున్న సర్వార్ కమీజ్ మీద పల్చని చున్నీ వేసుకుంది. తనైతే అన్నీ లంగా, జాకెట్టు, వోణీలే ఇచ్చింది.
  నడుం వరకే ఉన్న జుట్టుని పోనీ టైల్లా కట్టింది. ఇది వరకైతే, నూనే రాసి దువ్వి జడేస్తే నిగనిగ లాడుతూ మడిస్తేనే నడుం దాటేవి రెండు జళ్లూ.
  గౌరిని చూస్తూనే, చాయ్ పెట్టిచ్చి, గంజిలో ఉప్పేసుకుని, గౌరి పక్కనే గొంతుక్కూర్చుంది యాదమ్మ.
 “ఏందట్ట చూస్తున్నవ్.. కొత్త గున్ననా?” అడిగింది గౌరి. గంజి ఊదుకుని తాగుతూ తలూపింది యాదమ్మ.
  “నా బర్త్ డేకి మా దోస్తులిచ్చిన్రు.. అదేనే నే పుట్టిన్దినానికి”
   
  “అట్టనా బాగుంది. ఎన్ని దినాలుంటవ్ గౌరీ?”
  “నాలుగు దినాలుంట. ఆడ సంకురాత్తరి పండగ చాల గొప్పగా చేస్తరు. అందుకే హాస్టలు బంద్ చేసి ఇంటికంపిన్రు.”
  “మంచిది బేటా. పన్లోకి పోయొస్తా. నాయనొచ్చే పాలికి లేటైతదేమో. అన్నం తక్వైతే కాసింత వార్చుకో. పాలకూర టమాట చేసినా. మంచిగ తిని పండుకో.” యాదమ్మ బైటికెళ్లి పోయింది.
  యాదమ్మ మస్తాన్ లకి ఇద్దరమ్మాయిలు. యాదమ్మ అమీర్ పేటలో నాలుగిళ్లలో పని చేస్తుంది. ఒక ఇంట్లో సాయంత్రం నాలుగింటి వరకూ ఉండి రెండేళ్ల పిల్లాడిని చూసుకుంటుంది. అంతా కలిపి నాలుగు వేల వరకూ సంపాదిస్తుంది. మస్తాన్ బిల్డింగులు కట్టే చోట కూలి పనికి పోతాడు. నెలకో మూడువేలు సంపాదిస్తాడు, కానీ వెయ్యి వరకూ తాగుడికి పోస్తాడు.
  యాదమ్మ కొట్లాడుతుంది. “ఆ కాసింత లేకపోతే మల్లీ పన్లోకి పోలేనే..” అంటాడు దీనంగా. చుట్టుముట్టి చాలా మందికంటే వీడే నయం అని యాదమ్మ మాట్లాడదు.
  “ఇద్దరాడపిల్లలేనే.. కొడుకు కావాల్నే..” అత్త మామలు ఎంత మొత్తుకున్నా వినకుండా యాదమ్మ రెండో కూతురు పుట్టగానే ఆపరేషన్ చేయించుకుంది.

  యాదమ్మ చిన్నప్పుడు బేగంపేటలో గుడిసె ఉండేది. అది తండ్రి తనకిచ్చాడు. గవర్నమెంటాళ్లు ఆగుడిసె లాక్కుని ఊరికి దూరంగా అపార్టుమెంటిచ్చారు.
  ఇల్లైతే బాగుంది కానీ, బస్సుల పడిపోవాల పనికి. బస్ పాసుకి మరింత ఖర్చు. అమ్మగార్లందరూ కలిసి పాసు కొనిస్తారు కనుక కొంత నయం. మైన్ రోడ్డు వరకూ నడిచి అక్కడ బస్సెక్కి పనికి వెళ్తుంది. మస్తాన్ పొద్దున్న ఆరింటికి వెళ్తే మళ్లీ రాత్రి ఏడింటికే ఇంటి మొహం చూసేది.
  గౌరి చిన్నతనం నుంచీ చురుకైన పిల్ల. బేగంపేటలో ఉండగానే ఎట్లయినా మంచి స్కూల్ల వెయ్యాలని యాదమ్మకి.. తను పనిచేసే అమ్మగారొకరి సాయంతో అమీర్ పేటలో గవర్న్మెంటు స్కూల్లో చేర్పించింది.
  “ఆడ శాన బాగ సెప్తరంట. గౌరిని పెద్ద సదువులు సదివించాలె.” గౌరిని స్కూల్లో చేర్పించి రాగానే యాదమ్మ అంది.
  అలాగే గౌరి కూడా యాదమ్మ ఆశల్ని వమ్ము చేయకుండా, ప్రతీ ఏడూ ఫస్టు వచ్చేది. ఏడో క్లాసులో ఉండగా రెండేళ్లు సత్యం కంప్యూటర్స్ వాళ్లు కండక్ట్ చేసే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కి సెలెక్ట్ అయి ఇంగ్లీషు నేర్చుకుంది.
  గౌరి గడగడా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మురిపెంగా చూస్తారు మస్తాన్, యాదమ్మలు. తొమ్మిది పది క్లాసుల్లో స్పెషల్ కోచింగ్ ఇచ్చారు స్కూలు వాళ్లు.
  స్కూలు పక్కనే ఉన్న కోచింగ్ సెంటరు వాళ్లు ఫ్రీగా క్లాసుల్లోకి రానిచ్చేవారు. గౌరి క్లాసు టీచర్ కి బాగా తెలిసున్నవాళ్లే.. రాత్రి ఎంతాలిశ్యమైనా, మస్తాన్ స్కూలు దగ్గరే కాచుక్కూర్చుని ఇంటికి తీసుకెళ్లేవాడు.
  అందరి ఆశలూ తీరేలాగ గౌరికి టెంత్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇంక స్కూల్లో ఇండ్లలో ఒకటే ఉత్సాహం. ఆస్కూల్లో ఇదే మొదటిసారి స్టేట్ ఫస్ట్ రావడం. క్లాసు టీచరైతే గౌరిని కౌగలించుకుని గిరగిరా తిప్పేసింది. స్కూల్లో ప్రతీరోజూ ఎవరో రావడం, గౌరితో మాట్లాడ్డం. ఎవరు ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా గౌరి సమాధానం చెప్పడం చూస్తే అందరికీ ముచ్చటేసేది.
  ఏ పేపర్లో చూసినా గౌరి ఫొటోలే. పక్కనే ఠీవిగా మస్తాను, ఒకింత ఒదిగి పోయి యాదమ్మ.
  రిజల్ట్ వచ్చిన నాలుగో రోజున ఇంటి ముందు పెద్ద కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగారు, వెంకట్, చంద్రశేఖరం గారు. వెనుకే ఈ టివీ వాళ్లు.
  కూర్చోవడానికి సరైన కుర్చీ కూడా లేదు. టీవీవాళ్లు ఇంటినీ పరిసరాలనీ చకచకా ఫొటోలు తీసేస్తున్నారు.
  “మీ అమ్మాయిని మా కాలేజ్ లో చేర్పించమని అడగడానికొచ్చానమ్మా..” చంద్రశేఖరంగారన్నారు యాదమ్మతో.
  “ఏడ బాబూ?” యాదమ్మ సందేహం.
  అప్పుడు వివరించి చెప్పాడు వెంకట్, ‘ఫాదర్’ ఇన్స్టిట్యూట్ గురించి.
  అతను చెప్తుంటే కళ్లువిప్పార్చి వింది గౌరి. అ కాలేజ్ గురించి ట్యూషన్ లో చాలా సార్లు మాట్లాడుకున్నారు. ఎంత డబ్బు కట్టినా అందులో అడ్మిషన్ దొరకడం కష్టం. అలాంటిది, స్వయంగా కరస్పాండెంట్ వచ్చి.. కానీ యాభైవేలు పైనే ఉంటుంది ఫీజు.
  అది కాక పుస్తకాలు. అదే అంది గౌరి చంద్రశేఖరం గారితో.. “వియి కెన్నాట్ ఎఫర్డ్ సార్.”
  “హాస్టల్ తో సహా అన్ని ఖర్చులూ మావేనమ్మా. నువ్వు ఊ అంటే చాలు.”
  వెంకట్ కి గౌరిని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. అమాయకమైన ముఖం. తెలివీ విజ్ఞానంతో మిలమిల మెరిసే పెద్ద కళ్లూ. ఈ అమ్మాయికి, ఈ పరిసరాల్లో పెరిగినా ఇంత విద్య అబ్బిందంటే మిరాకిలే. ఎంత కష్టపడ్డా, ఎంత ఖర్చు పెట్టినా రాని రాంకు.. “సరస్వతీ దేవి ముద్దు బిడ్డే..” అనుకున్నాడు.
  “వామ్మో.. అంత దూరం అమ్మాయినెట్టా పంపేదయ్యా?” మస్తాన్ విచారంగా అన్నాడు. పైకి చెప్పక పోయినా కూతుర్ని వదిలి ఒక్క రోజు కూడా ఉండలేడు.
  “మాస్వంత కూతుర్లా చూసుకుంటాం. హాస్టల్లో అందరూ అమ్మాయిలే. ఏం భయం లేదు.” చంద్రశేఖరంగారు నచ్చచెప్పారు.
  గౌరికి అంతా కలలా అనిపించింది. ‘ఫాదర్' లో చదువుతే తప్పకుండా తన గోల్ చేరుకోగలదు. అమ్మా, నాయనా ఏమంటారో.. వాళ్లు వద్దంటే తను వెళ్లలేదు. రాత్రి పన్నెండింటికి చాయ్ పెట్టిచ్చి చదువుకో బిడ్డా అనే తల్లి, ఏ టైములో ఎక్కడికెళ్లినా కూడా వచ్చి కాచుకునే నాయన.. వాళ్ల కిష్టం లేకుండా వెళ్లదు. ఆశగా చూసింది తల్లి కేసి.
  యాదమ్మ ఎంత అమాయకంగా కనిపించినా కూతురి మనసునిట్టే పట్టేస్తుంది.
  “ఆళ్లు అంతా అడుగుతున్రు కదా.. అంపిస్తే పోలే.” మస్తాన్ తో అంది.
  ఆ ఒక్క మాట చాలు, వెంకట్ అల్లుకుపోవడానికి.
  వాళ్ల కర్ధమయే భాషలోనే, తమ కాలేజ్ గురించి, అక్కడ పిల్లలకి తీసుకునే జాగ్రత్తల గురించి చెప్పి, “అమ్మాయి గురించి పూర్తిగా బాధ్యత మాదే. మీ అమ్మాయిని పువ్వులా అప్ప చెప్తాం కదా!” అన్నాడు ఆఖరుగా.
  ఆ విధంగా గౌరి ‘ఫాదర్' లో ఆడపిల్లల హాస్టల్లో చేరింది. ఉన్న రెండు లంగా జాకెట్లకి తోడు, అమ్మగార్లిచ్చిన గిఫ్టు పైసల్తో మరో రెండు జతలు కుట్టించింది యాదమ్మ.
  గౌరి హాస్టల్ కి వెళ్లే రోజున ఆ కాలనీ అంతా హడావుడే. అందరూ బస్ వరకూ వచ్చి దింపారు. తమ కష్టార్జితం లోంచి, తలా కొంచెం వేసుకుని, “ఖర్సులకుంచుకో బిడ్డా” అని ఇచ్చారు. గౌరి తరువాత లెక్కపెట్టి చూస్తే రెండువేలున్నాయి. గౌరి కళ్లు తడయ్యాయి.
  తల్లిదండ్రుల కాళ్లకి దణ్ణం పెట్టి, పొద్దుటినుంచీ తన వెనుకే తిరుగుతున్న కవితని ముద్దు పెట్టుకుని, “బాగా చదువుకోవాలె” అని జాగ్రత్తలు చెప్పింది. కనిపించినంత మేర అందరికీ టాటా చెప్తూ, ‘ఫాదర్'కి వెళ్లింది గౌరి.*

  గౌరి హాస్టల్లో చేరిన మొదటి రోజు ఏదో వింతలోకంలోకి వచ్చినట్లనిపించింది. ‘ఫాదర్' లో మిడీలు, ఫ్రాకులు వేసుకోనియ్యరు కనుక అందరూ చుడీదార్ లు సల్వార్ కమీజులు వేసుకుని రంగు రంగుల సీతాకోక చిలుకల్లా తిరుగుతున్నారు.
  వెంకట్, గౌరిని లేడీస్ హాస్టల్ వార్డెన్ కి అప్పచెప్పి వెళ్లిపోయాడు. వార్డెన్ గౌరికి తన గది చూపించి వెళ్లింది.
  ఆ బిల్డింగ్ మొత్తం మీద చీప్ లంగా ఓణీతో, రెండు జళ్లతో వచ్చింది గౌరి ఒక్కతే. గౌరి రూమ్ లోకి రాగానే ఆమెను ఎగాదిగా చూసి తల తిప్పుకుని పక్కకు తిరిగిపోయింది రూమ్మేట్ సుష్మ.
  “ఇలాంటి వాళ్లు ఇంత కాస్ట్లీ కాలేజీల్లో ఎలా చేరతారో! అయినా ఇంక వేరే రూముల్లేనట్లు నాకే తెచ్చి పడేశారీ వార్డెన్.” అని తిట్టుకుంటూ మౌనంగా తన సామాన్లు సర్దుకుంచున్న గౌరిని చూసింది సుష్మ.
  సుష్మ సిబియస్సీలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఇంకా ఆ యూఫోరియా నుంచి తేరుకోలేదు. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. ఎలాగైనా కూతుర్ని డాక్టర్ని చెయ్యాలనేది వాళ్ల తాపత్రయం.
  గౌరి ఇంగ్లీష్ లో మాట్లాడ్డం విన్న చంద్రశేఖరం, గౌరిని సిబియస్సీ బాచ్ లో వెయ్యమని చెప్పారు. సిబియస్సీ బాచ్ లో సంస్కృతం సెకండ్ లాంగ్వేజే కాకుండా ఆల్ ఇండియా ఎంట్రెన్స్ లకి కోచ్ చేస్తారు.
  క్లాసులు ప్రారంభించగానే వెంకట్ వచ్చి గౌరిని అందరికీ పరిచయం చేశాడు. టెంత్ క్లాస్ గురించి అంత పట్టించుకోని ఆ పిల్లలకి అప్పుడు గుర్తుకొచ్చింది గౌరి మొహం. పేపర్లో వచ్చిందని గుసగుసలాడుకున్నారు. నదురు బెదురు లేకుండా గౌరి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తన బాక్ గ్రౌండ్ ని ఫ్రాంక్ గా చెప్పి, “అందరూ కోపరేటే చేస్తే డాక్టర్ కావాలన్నది తన ఆశయం అని చెప్పింది. తరువాత సుష్మ, గౌరి బెస్ట్ ఫ్రెండ్స్ ఐపోయారు.
  
  పబ్లిగ్ ఎగ్జామ్ మొదటి రోజు పిల్లలందరికీ జ్వరం వచ్చిన ఫీలింగ్. ‘ఫాదర్' లో చదివే పిల్లలందరికీ కాన్వెంట్ లో సెంటరిచ్చారు. గౌరి నలుపు కొంచెం తగ్గి చామనచాయకి వచ్చింది. నీడ పట్టున ఉండి చదువకోవడం, మంచి ఆహారం తినడం వల్ల మంచి కళ వచ్చింది.
  సుష్మ, గౌరి బస్ దిగుతున్నప్పుడే ఆది, అణు బస్ దిగారు. ఆది ఇంకా క్రచెస్ లోనే ఉన్నాడు. నలుగురూ ఎప్పుడూ పలుకరించుకోకపోయినా ఒకళ్లకొకళ్లు బాగానే తెలుసు. ఎదురు పడగానే ఎప్పటినుంచే తెలిసున్న వాళ్లలాగ ‘ఆల్ ది బెస్ట్' లు చెప్పుకున్నారు.
  హాల్ టికెట్స్ తీసుకెళ్లి తాము పరీక్షరాయబోయే రూమ్ ఎక్కడో చూసొచ్చాడు ఆణు. మొహం వేళాడేసి వస్తున్న ఆణుని చూసి “ఏమయిందిరా” అడిగాడు ఆది.
  “రెండో అంతస్థురా. కిందికి మార్చడానికి ఒప్పుకోవట్లేదు. నంబర్లు వేసేశార్ట. పోనీ ముందు పంపించమంటే అదీ ఒప్పుకోవట్లేదు.
  “మీరెళ్లండి. నేను మెల్లిగా ఎక్కుతా. మొదలయ్యాక అరగంట వరకూ అలౌ చేస్తారు కదా!”
  అంతలో ప్రవీణ్ వచ్చి ఏం జరుగుతోందో కనుక్కున్నాడు.
  “నో ప్రాబ్లం.” అంటూ ఆరడుగులూ వంద కిలోలూ ఉన్న ప్రవీణ్, ఆదిని ఒక్కసారి లేపి ఎత్తుకుని, రెండో అంస్థులో దింపాడు, అందరూ క్లాప్స్ కొడ్తుండగా.*
  మూడంతస్థులూ దిగి ఆపసోపాలు పడ్తూ, పేపర్ల కట్ట పట్టుకుని ప్రిన్సిపాల్ ఆఫీసుకు వెళ్లాడు భాస్కర్రావు. పొద్దున్న ఏడింటికల్లా ఇంట్లో బయల్దేరాడు. పన్నెండవుతోంది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్.. ఎలా ఉందో చూద్దామని పెందరాళే వచ్చాడు.
  ఏం లాభం.. తనకు ఇన్విజిలేషన్ వేసిన కాలేజ్ లో, పేపర్లిచ్చాక అరగంట వరకూ క్వశ్చన్ పేపరు చూడ్డానికి కుదరలేదు. అనవసరంగా ముందుగా వచ్చానని పదోసారి తిట్టుకున్నాడు. కడుపులో ఏదైనా పడ్తే కానీ కాళ్లూ చేతులూ ఆడేట్లు లేవు.
  భాస్కర్రావు, ‘ఫాదర్' రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్. యమ్మేలో గోల్డ్ మెడలిస్ట్. వెంటనే యమ్ ఫిల్ చేశాడు. యమ్ ఫిల్ అయ్యాక, ట్యుటోరియల్ కాలేజీగా ఉన్నప్పుడే ఫాదర్ లో చేరాడు.
  పాఠాలు అద్భుతంగా చెప్పడమే కాకుండా, పిల్లల్ని పరీక్షలకి ఎలా తయారు చెయ్యాలో, ఎలా రాస్తే మార్కులు పడతాయో, ఏ ప్రశ్నలు ముందురాయాలో, ఏవి వెనుక రాయాలో వంటి చిట్కాలు నేర్పించడంలో దిట్ట.
  అతనితో ఒకటే చిక్కు.. ఆకలేస్తే ఐదునిముషాలు కూడా ఆగలేడు. ప్రతీ గంటకీ ఆకలేస్తుంటుంది.
  ఇటువంటప్పుడే అమ్మ గుర్తుకొస్తుంటుంది. “ఆకలిని కనిపెట్టి కడుపు నింపడంలో అమ్మల్ని మించినవాళ్లు లేరు.” పేపర్లు లెక్కపెట్టి అప్పచెప్తూ అనుకున్నాడు భాస్కర్రావు.
  లేకలేక ఎన్నోఏళ్లకి పుట్టాడు భాస్కర్రావు తల్లిదండ్రులకి, ఇంక పిల్లలు పుట్టరని ఆశ వదిలేసుకున్న తర్వాత. అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ల ప్రేమనంతా మనవడి కడుపు నింపడంలో చూపించే వారు.
  “వెర్రినాగన్న.. ఎంత ఆకలిమీదున్నాడో..” కామిక్ తింటూ నాలుగు దోశలు తిన్న మనవడికి ఐదో దోశ తినిపించే అమ్మ, ఆ తరువాత స్కూలుకి, కాలేజ్ కి రెండు టిఫిన్ బాక్సులు కట్టిచ్చేది.
  అలాగ.. భాస్కర్రావుకి, కాలేజ్ చదువులయి, ఉద్యోగంచేరేటప్పటికే, నలభై ఏళ్ల వాళ్లకుండే పర్సనాలిటీ, బొజ్జ వచ్చేశాయి.
  ఇంటర్ వ్యూలో పాతిక సంవత్సరాలంటే ఎవరూ నమ్మలేదు. అతను ఇచ్చిన సర్టిఫికేట్స్, డిమాన్స్ట్రేషన్ లెక్చర్, ఉద్యోగం వచ్చేలా చేశాయి.
  కష్టపడి వెతికి అలాంటి అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లై పదేళ్లైనా ఇంకా పిల్లలు లేరు.
  “అంతా వాళ్ల నాన్న లాగే. ఇంకో రెండేళ్లకి కానీ బుజ్జిగాడు ఇంట్లోకి రాడు.” వాళ్లమ్మ అంటుంది.
  భాస్కర్రావుకీ, వాళ్లావిడ పద్మకీ తిండి మీద తప్ప ఇంక దేని మీదా ధ్యాస ఉండదు.
  అతనికి పెద్దగా క్లాసులకి ప్రిపేరవాల్సిన పని కూడా ఉండదు. అలా.. ఎప్పుడూ ఆకలేస్తుంటుంది.

  క్రచెస్ తో కూడా చురుగ్గా అడుగులు వేస్తున్న ఆదిని చూసి, జీవితంలో మొదటి సారిగా పెద్దవాళ్లని తిట్టుకున్నాడు భాస్కర్రావు. తనని దాటి ముందుకెళ్లిన ఆది, ఆగి భాస్కర్రావుని విష్ చేశాడు. అదితో పాటు మరో పదిమంది చేరారు. అందరూ పేపర్ పట్టుకుని భాస్కర్రావు దగ్గరికి వచ్చారు.
  ఇప్పుడు వాళ్ల ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పాలి. ఎలా.. కళ్లు తిరిగి పోతున్నాయే! స్కూటర్ దగ్గరకి వెళ్లి ఒక బిస్కట్ పాకెట్ తింటే కానీ నోట్లోంచి మాట రాదు. భాస్కర్రావుకి ఏం చెయ్యాలో తోచలేదు.
  “సార్! చాలా బాగా రాశాం. చూడండి.” అంటూ పేపర్ చూపిస్తున్నాడు. బంటీ నవ్వుతూ చూస్తున్నాడు. వాడైతే పేపర్ క్లియర్.
  “ముందు సార్ కి నోరు తీపి చేద్దాం. ఇంత బాగా రాయడానికి ఎవరు రెస్పాన్సిబుల్..” ఆది కాడ్బరీస్ చాకొలెట్ ఇచ్చాడు.
  హమ్మయ్య అనుకుంటూ చాకొలెట్ తింటూ అందరికీ ఆన్సర్లు చెప్పి, స్కూటర్ దగ్గరికి వెళ్లి సీసాడు మంచి నీళ్లు తాగాడు భాస్కర్రావు. ఆదికేసి థాంక్స్ అన్నట్లుగా ఒక చూపు విసిరి, స్కూటర్ స్టార్ట్ చేశాడు.
                                                  3
  చిన్నప్పటి నుంచీ అందరూ చూసే చూపులకి అలవాటు పడిపోయాడు భాస్కర్రావు.
  స్కూల్లో బెంచ్ లో ఇరుక్కుని కూర్చోవలసి వచ్చేది.
  బస్ లో ఇద్దరి సీటు కానీ సరిపోదు. డబల్ సీటర్ అని వెక్కిరిస్తూ పక్కన నిల్చునే వారు. మోటూ, బొండం.. ఎన్నో నిక్ నేములు.
  నెల క్రితం ఆదిత్య వాళ్ల క్లాసులో ఒక సంఘటన జరిగింది. ఇంటర్ ఫస్టియర్ క్లాసు మొదటి అంతస్థులో చివరగా ఉంటుంది. గదిలోకి ఒకటే తలుపు. తలుపుకి రెండు రెక్కలు. ఒక రెక్క వేసేశారెవరో.
  పైన గడియ పెట్టారు. అది ఎంతకీ రాలేదు. భాస్కర్రావు ఎంత ప్రయత్నించినా క్లాసులోకి వెళ్లలేక పోయాడు. క్లాసు టైమయిపోతోంది.
  ఎవరో వెళ్లి తిరుపతిని పిలుచుకొచ్చారు.  వాడు ఒక నూనె చుక్క గడియలో వేసి తీసేశాడు. తీసి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
  క్లాసులోకి వెళ్లాక పదినిముషాలకు కానీ పిల్లల్ని కంట్రోల్ చెయ్యలేకపోయాడు భాస్కర్రావు.
  “సెవెన్ స్టేజెస్ ఆఫ్ లైఫ్" అంటూ పాఠం మొదలుపెట్టాడు.
  “ఇన్ఫేంట్" అని అనగానే,
  “పుట్టగానే అందరూ ఒకలాగే ఉంటారు కదా సార్!” ఒకకోణంగి.
  “స్కూల్ బాయ్" గురించి చెప్తుంటే, “మీ ఎక్స్పీరియన్స్ లేమిటి సర్?” తన అనుభవాలు కొన్ని చెప్పి నవ్వించాడు. ఇంక లవర్ దగ్గరకి వచ్చే సరికి అందరికీ హుషారొచ్చింది.
  పాఠం ముందుకి కదలనివ్వలేదు. “ఇక్కడంతా సాడ్ పోయెమ్ రా.. చెప్పనివ్వండి.”
  “నో సాడ్ లౌ సార్. వుయి వాంట్ హాపీ స్టోరీ” అందరూ చిన్నగా పాట మొదలుపెట్టారు.
  “ప్రిన్సిపాల్" ఎవరో గుసగుసలాడారు.
  అంతే గప్ చుప్. చేతులు వెనక్కి పెట్టుకుని నడుస్తూ వచ్చాడు వెంకట్.
  “వాట్ హాపెన్డ్?”
  భాస్కర్రావు వచ్చి చెప్పాడు.
  “ఎవరైనా కావలసి చేశారా? సగం తలుపు ఎందుకు వెయ్యవలసి వచ్చింది?” క్లాసులోకి వచ్చి అడిగాడు.
  అందరూ లేచి నిలుచున్నారు. ఎవరూ మాట్లాడలేదు.
  ఒకసారి తలుపు దగ్గరికి వెళ్లి పరీక్ష చేశాడు.
  “తలుపుకి ఉన్నగడియ తీసెయ్యి. రెండు రెక్కలూ కలిపి వెయ్యగలిగితే చాలు. సగం తలుపు వేసే పనే లేదు.”
  క్లాసంతా కలియజూసి “జాగ్రత్తగా చదువుకోండి” అని వెళ్లిపోయాడు.ఆది, ఆణు ఒకళ్లకేసి ఒకళ్లు చూసుకుంటుంటే భాస్కర్రావు చూశాడు. గడియ రాకుండా వాళ్లే ఏదో చేసి ఉంటారని గ్రహించాడు. ఏం మాట్లాడకుండా బెల్ అవగానే బైటికెళ్లిపోయాడు.
  
  అప్పట్నుంచీ ఆలోచిస్తూనే ఉన్నాడు భాస్కర్రావు. అతని ముందు రెండే మార్గాలున్నాయి. ఎప్పట్లాగే తనని కాదులే అని దులిపేసుకుని మామూలుగా ఉండడం. ఇంకొకటి.. తన జీవన విధానం మార్చుకోవడం. రెండో పద్ధతికి పద్మ సహకరించాలి. ఇద్దరూ అనుకుని కలిసి చేస్తే ఏదీ అసంభవం కాదు.
  మరీ పరీక్ష రోజున అలా జరగడం బాధనిపించింది. ఇంటికి వెళ్తూనే దివాన్ మీద పడిపోయాడు. పద్మ పడుతూ లేస్తూ వచ్చింది. పద్మని చూస్తుంటే కొత్తగా అనిపించింది. ఎప్పుడూ వేరే దృష్టితో చూడలేదు. నిశితంగా చూస్తుంటే, నడవడానికి ఎంత కష్టపడుతోందో అనిపించింది.
  “పద్మా! ఒక గ్లాసు నీళ్లియ్యి.”
  “ఇప్పుడు నీళ్లెందుకు? అన్నం తినేద్దాం రండి”. పద్మకేసి జాలిగా చూశాడు.
  అమ్మమ్మలా, నాన్నమ్మలా, అమ్మలా.. ఎంత సేపూ తినడం తప్ప వేరే ధ్యాస లేదు.
  “రెండు గ్లాసులు తీసుకురా. ఒకటి నాకు, ఒకటి నీకు.” భాస్కరం స్వరంలోని మార్పుకి ఆలోచిస్తూ లోపలికి వెళ్లి రెండుగ్లాసుల్లో నీళ్లు తీసుకొచ్చి సోపాలో కూర్చుంది.
  తనకి ఊహ తెలిసినప్పట్నుంచీ జరిగిన సంగతులన్నీ ఒకొక్కటీ వివరించాడు. వింటున్న పద్మకి తన కథ కూడా ఇంచుమించు అలాగే అనిపించింది.
  “ఈ సెడెంటరీ లైప్ లో పాతికేళ్లకే మనం యాభై ఏళ్ల వాళ్లలా బతుకుతున్నాం. ఇది మారుద్దామంటావా?” ఆశగా అడిగాడు.
  పద్మకీ అందరిలాగా ఉండాలని ఉంటుంది. భాస్కరం కూడా భోజన ప్రియుడవడంతో, రకరకాల వంటలు వండడం, తినడం జీవిత లక్ష్యం అనుకంది. తనకి భాస్కరం అంటే చాలా ఇష్టం. ఎంతో మంది తనని లావుగా ఉన్నావని హేళన చేసి నచ్చలేదంటే, అతను ఏరికోరి చేసుకున్నాడు. అతనెలా చెప్తే అలాగే చేస్తుంది.
  “అయితే సాయంత్రమే డాక్టర్ దగ్గరకెళ్దామా?” మెరుస్తున్న కళ్లతో తలూపింది. ఈ ఉత్సాహంతో వాళ్లు మధ్యాహ్నం భోజనం సంగతే మరచిపోయారు. ఎందుకో మరి ఆకలి కూడా వెయ్యలేదు. ఇద్దరూ ఆటోలో డాక్టర్ శివరాం దగ్గరకెళ్లారు.

  “మమ్మీ! ఫైవ్ మినిట్స్ లో బ్రేక్ ఫాస్ట్ కావాలి.” ఉజ్వల జుట్టు వెనక్కి పడేలా తలెగరేస్తూ వచ్చింది.
  “పోలేరమ్మ జాతరలో పూనకం వచ్చినవాళ్లలా ఆ జుట్టేమిటే? శుభ్రంగా జడేసుకోకుండా.. ఆ దువ్వెన్నిలా పట్రా.” సరస్వతి అంది ఇడ్లీ కుకర్ దించుతూ.
  “మా...మ్మీ..” క్లినిక్ షాంపూ అడ్వర్టైజ్ మెంట్ లో లాగా జుట్టుని షోగ్గా తిప్పుతూ అంది, “ఇప్పుడు జడేసుకుంటే అందరూ ‘అమ్మమ్మా’ అని పిలుస్తారు. లీవ్ మి ఎలోన్.” షూలేసు కట్టుకుని ఒక్క ఎగురు ఎగిరి వెనక్కి తిరిగింది. ఎదురుకుండా నిలుచున్న కూతుర్నొక్కసారి పైనుంచి కిందికి చూసింది సరస్వతి.
  టైట్ జీన్స్. నడుం వరకే ఉన్న పొట్టి టీషర్ట్. మెళ్లో తల వెంట్రుకంత సన్నటి గొలుసు. చేతులకి వెండి కడియాలు… పదహారేళ్ల పరువాల్ని ప్రదర్శించే తీరులో వెనక్కి విరుచుకుని నించున్న తీరుని చూసి చిరాగ్గా తల తిప్పింది. మామూలుగా చుడీదార్ వేసుకుని, చున్నీతో కప్పుకుని బైటికి వెళ్లచ్చు కదా! చున్నీ వేసుకున్నా మెడకి చుట్టుకుంటుంది. ఏం లాభం? ఎలాగ.. దీనికెలా చెప్పడం?
  “ఈ వెర్రి డ్రస్ ఎలా నచ్చింది? ఎక్కడన్నా ఆడపిల్ల లక్షణాలున్నాయా? అందుకేనా నిన్న షాపింగ్ కి నేను కూడా వస్తానంటే వద్దన్నావు.”
  “వ్హాట్.. డామేజింగ్ స్టేట్మెంట్. ఆడపిల్ల లక్షణాలా? చూడు.. థర్టీటూ, ట్వెంటీటూ, థర్టీటూ..” నడుం తిప్పుతూ అంది ఉజ్వల తలెగరేసి.
  “ఆపు తల్లీ.. నేను వినలేను.” చెవులు మూసుకుంది సరస్వతి. ఎంత బరితెగించి పోయారీ పిల్లలు..
  ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..’ ఎక్కడ్నుంచి వస్తోందా అని తల అటూ ఇటూ తిప్పి చూసింది సరస్వతి.
  మమ్మీ కన్ఫ్యూజన్ కి పకపకా నవ్వుతూ టీ షర్ట్ లోపల వేళ్లాడుతున్న సెల్ ఫోన్ తీసి ‘హలో’ అంది ఉజ్వల.
  “ఐ సీ.. వుయ్ విల్ బి దేర్ ఇన్ ఫైవ్ మినిట్స్. సారీ మమ్మీ! ఫ్రెండ్స్ అందరం బరిస్టా దగ్గర బ్రేక్ ఫాస్ట్ కి కలుస్తున్నాం.” అంటూ వెళ్లిపోయింది.

  పొద్దున్నే ఆరింటికల్లా లేచి, ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి, సాంబారు చేసిన సరస్వతి నోట్లోంచి మాటరాక నిలుచుండిపోయింది. కూతురెప్పుడు కావాలంటుందో అని అంత పెందరాళే చేసింది. సంతోష్ పదింటికి కానీ ఆఫీస్ కి వెళ్లడు. తొమ్మిదికల్లా తయారు చేస్తే చాలు.
  టైమ్ చూసింది. ఇంకా ఎనిమిది కూడా కాలేదు.
  “ఎక్కడెక్కడ ఊరేగుతున్నావో చెప్తావా?”
  “ఓకే మామ్. ఐ మాక్స్ లో హారీ పోటర్ ఉంది. లేకపోతే ఏదన్నా తెలుగు మూవీకి వెళ్తాం. ఇదిగో నా సెల్ నంబర్. ఎప్పుడు పిలిచినా పలుకుతా. బట్.. థియేటర్ లో స్విచాఫ్. తెలుసు కదా!” నాలుగంగల్లో రెండంతస్థులూ దిగి, స్కూటీ స్టార్ట్ చేసి చెయ్యూపుతూ వెళ్లిపోయింది.
  సరస్వతి, అపార్ట్ మెంట్ బాల్కనీ లోకి వెళ్లి ఉజ్వలని కనిపించినంత మేర చూసి వెనక్కి వచ్చి నీరసంగా సోఫాలో వాలిపోయింది.
  సంతోష్ పి డబ్ల్యు డి లో అసిస్టెంట్ ఇంజనీర్. పెళ్లైన రెండేళ్లకి ఉజ్వల పుట్టగానే ఇంక పిల్లలు వద్దనుకున్నారు. సరస్వతి, సంతోష్ లిద్దరూ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చినవారే.
  సంతోష్ కి నలుగురు అక్కలు, ఒక తమ్ముడు. సరస్వతికి ఇద్దరు అక్కలు ముగ్గురు తమ్ముళ్లు. ఎప్పుడూ కనీస అవసరాలకే కటకటలాడుతూ పెరిగారు.
 ఒక్క కూతుర్నీ ఏ లోటూ లేకుండా పెంచాలని అనుకోవడం పోరపాటేమో అనిపించింది. అడిగినవన్నీ అమరుస్తుంటే, ‘లేదు’ ‘కాదు’ ‘వద్దు’ అనే పదాలు సహించలేని స్థితికి వచ్చింది ఉజ్వల.
  సంతోష్ కి చేతినిండా డబ్బు కనిపిస్తుంటే, ఎంతో అపురూపమైన కూతుర్ని ఎందుకేడిపించాలీ అనుకుంటాడు. ఇద్దరితో పోరాడలేక అలిసి పోతోంది సరస్వతి.
  ఆడపిల్ల తల్లిగా కొన్ని బాధ్యతలు, జాగ్రత్తలు తీసుకోవాలి కదా! అక్కడికీ కూర్చోపెట్టి చెప్పడానికి ప్రయత్నించింది ‘చాటు’ ఎంత అవసరమో.
  “డ్రెస్ లు, జీన్స్, షర్ట్ లు వేసుకోవచ్చు. కానీ కొంత వదులుగా ఉండాలి. నిలబడ్డంలో, మాట్లాడ్డంలో కాస్త ఒబ్బిడి ఉండాలి. అలా ఉంటే ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటుందీ..” సరస్వతి చెప్తుంటే మధ్యలో ఆపేస్తుంది ఉజ్వల.
  “అబ్బా! మోరల్ లెసన్స్ ఇంక ఆపు మమ్మీ. నేను పూర్తిగా కవర్ చేసుకుంటాను. స్చ్రాప్ లెస్, బ్యాక్ లెస్, టైట్ మిడీస్ ఎప్పుడన్నా వేసుకున్నానా? మా ఫ్రెండ్స్ ని చూస్తే తెలుస్తుంది. ఐనా టెంపుల్ కి వెల్లేప్పుడు లంగా ఓణీ వేసుకుంటున్నాగా!” గట్టిగా కౌగలించుకుని ఒక ముద్దిచ్చేసి వెళ్లి పోతుంది.
  నయం.. చదువులో ఫరవాలేదు. సిబియస్సీలో డెబ్భై ఐదు శాతం వచ్చాయి. ఏం చదవాలన్నది సంతోష్ నిర్ణయించాడు. ఇంజనీరింగ్ చదువుతే ఈజీగా అమెరికా వెళ్లచ్చంటే, “మీ ఇష్టం డాడీ. మీరేం చెప్తే అది.” చదువు విషయంలో మాత్రం పేరెంట్స్ కి పూర్తి స్వేచ్ఛ.
  అన్ని కాలేజీల గురించీ వాకబు చేసి, ‘ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ లో చేర్పించాడు సంతోష్. సరస్వతి మొదట్లో అంత దూరం పంపడానికి ఒప్పుకోలేదు.
  “అక్కడ డ్రెస్ కోడ్ ఉందోయ్. అందరూ సల్వార్ కమీజ్ లు వేసుకోవాలి.చున్నీలు కంపల్సరీ. పైగా మడతలు వేసి పిన్ పెట్టుకోవాలి. ఆడపిల్లల హాస్టల్ వేరు. నైన్టీ పర్సంట్ రిజల్ట్. పొద్దున్న ఆరింటి నుంచీ, రాత్రి పదింటి వరకూ టైట్ షెడ్యూల్.” సంతోష్ మాటలకి కష్టం మీద ఒప్పుకుంది సరస్వతి. ఎంత దెబ్బలాడుకున్నా, ఉజ్వలని చూడకుండా ఒక్క రోజైనా ఉండలేదు.
  “సరూ! టైమవుతోంది. ఏదైనా పెడతావా?” సంతోష్ లేచి తయారై గదిలోంచి బైటికొచ్చాడు.
  నిస్త్రాణగా పడుక్కున్న సరస్వతి లేచి ఇడ్లీలు మైక్రోవేవ్ లో వేడి చేసి పెట్టింది.
 “బాక్స్ లో కూడా ఇడ్లీలే పెడ్తా. ఇవేళ వంట చెయ్యలేదు.”
  “ఏంటోయ్ డల్ గా ఉన్నావు. మా అమ్మ ఏదీ?”
  “పొద్దున్నే వెళ్లి పోయింది. ఇన్నాళ్టికి వచ్చింది కదా! నాదగ్గర కొంచెం సేపైనా కూర్చోవచ్చు కదా. వాళ్ల కాలేజ్ విశేషాలు చెప్తే విననా?” సరస్వతికి కన్నీళ్లొక్కటే తక్కువ.
  “ఈ వారం అయ్యాక మళ్లీ వెళ్లి పోతుంది.”
  సంతోష్ తినడం ఆపేసి సరస్వతి కేసి చూశాడు. తల్లులకీ, టీనేజ్ కూతుళ్లకీ ఎప్పుడూ ఉండే పేచీలే. సరస్వతికి ఉజ్వల తప్ప వేరే ప్రపంచం లేదు. ఉజ్వలకి ప్రపెంచం అతా తెలుసుకోవాలన్న ఉరకలేసే ఉత్సాహం. తనకైతే ఆఫీస్ పనితో అంత అనిపించదు. ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యడం?
  “అంత వర్రీ అవకోయ్. ఉజ్జీ వెళ్లేలోపు ఒక రోజు ఏ రామోజీ ఫిల్మ్ సిటీకో వెళ్దాం. నే చెప్తా కదా!”
  “అవునండీ, మీ రికమెండేషన్తో నా కూతురు నాతో ఒక రోజు గడుపుతుంది..” అంది సరస్వతి కోపంగా.
  
  మ్యూజిక్ కి అనుగుణంగా తలలు, చేతులు ఊపుతూ, కాళ్లతో స్టెప్పులు వేస్తూ గుండ్రటి బల్ల చుట్టూ కూర్చున్నారు ఉజ్వల స్నేహ బృందం.. ముగ్గురమ్మాయిలు, నలుగురబ్బాయిలు. స్కూల్లోయల్. కేజీ నుంచీ కలిసి చదువుకున్నారు. అందరి దగ్గరా సెల్ ఫోన్లు చేతుల్లోనో, మెడల్లోనో జేబుల్లోనో.. ఒకళ్లిద్దరికి తప్ప.
  “రేయ్ రవీ! పోయి కాఫీ తీసుకురారా.. ఏంటలా కూర్చున్నావు?” అంది ఉజ్వల.
  “ఏం లేదు. ఫిజిక్స్ పేపరు తగలేశాట్ట. డిప్రెషన్లోకెళ్లిపోయాడు.” బంటీ అన్నాడు.
  “కమాన్. ఫిజిక్స్ తో పొజిషన్స్ మారతాయా? చీరప్.. చీరప్.” ఉజ్వల మాటలకి అందరూ మ్యూజిక్ కి వంతగా బల్ల మీద వాయించడం మొదలు పెట్టారు.
  “మేమేం సూపర్ గా వెలగబెట్టెయ్య లేదులే. డోంట్ వర్రీ. బెటర్ మెంటుందిగా.” రవి భుజాలు తట్టాడు బంటీ. ఇద్దరూ వెళ్లి కాఫీలు తీసుకొచ్చారు.
  కాఫీ సిప్ చేయబోయిన ఉజ్వలకి నాలుక చుర్రుమని కాలింది.
  “వాటీస్ దిస్? కాఫీనా మోల్టెన్ మెటలా? ఐ కాంట్ బిలీవ్ దిస్..” నాలికని చల్ల బర్చు కోడానికి కుడి చెయ్యిని విసిని కర్రలా ఊపుతూ ఊగింది ఉజ్వల.
  “అబ్బ.. బ్యూటిఫుల్ స్టెప్సే. కారీ ఆన్.”
  “షట్ యువర్ బ్లడీ మౌత్స్.” కాలిన నాలుకతో ఎక్కువ మాట్లాడలేక కళ్లలో నీళ్లు తిరుగుతుండగా కుర్చీలో కూలబడింది ఉజ్వల. తర్వాత చల్లారిన కాఫీ నీళ్లలా ఉన్నా, కాలిన నాలుక్కి రుచి తెలియలేదు.
  కప్పు కాఫీకి యాభై రూపాయల చొప్పున సమర్పించి అందరూ బయట పడ్డారు.
  “ప్రసాద్స్... సీయు ఇన్ టెన్ మినిట్స్..” అనుకుంటూ ప్రసాద్ మల్టిప్లెక్స్ కి బయల్దేరారు.
  “హారీ పోటర్ టికెట్స్ లేవు. నో లక్. ఏం చేద్దాం?” బంటీ నిరుత్సాహంగా అన్నాడు.
  “ముందు ఆకలి దంచేస్తోంది. లెటజ్ హావ్ ఎ బైట్.” ఉజ్వల నీరసంగా..
  “అక్కడ బర్గర్స్ ఉన్నాయి. చలో..” వేణు దారి తీశాడు.
  బర్గర్లు ఒకళ్ల తరువాత ఒకళ్లు కొరుకుతూ తిన్నారు.
  “ఇప్పుడు చెప్పండి. ఏం చేద్దాం?” ఉజ్వల అంది.
  “ఆదిత్య పిక్చర్ ఇవేళే రిలీజ్. ట్రై చేద్దామా?”
  వెంటనే బంటీ వెళ్లి టికెట్లు కొనుక్కొచ్చాడు.
  “ఆదిత్య మూవీనే.. థాంక్యూ.” బంటీ చెయ్యి తీసి ముద్దు పెట్టుకుంది ఉజ్వల. అంతలో కలకలం. అందరూ పక్కకి తప్పుకున్నారు. ఉజ్వల కళ్లు విప్పార్చి చూస్తోంది. చేతులు రెండూ ఊపుతూ హీరో ఆదిత్య లోపలికి వస్తున్నాడు.

  “మదర్ ప్రామిస్. నిజంగా చూశాను హీరో ఆదిత్యని. కావాలంటే ఆటోగ్రాఫ్ ఇదిగో. మా ఫ్రెండ్సందరూ కూడా ఉన్నారు.”ఉజ్వల, సుష్మతో అంటోంది.
  ఉజ్వల, సుష్మకి పిన్ని కూతురు. సుష్మ కూడా చేరుతుండడం ఒక కారణం సరస్వతికి, ఉజ్వలని హాస్టల్ కి పంపడానికి. ఫస్టియర్ పరీక్షలయ్యాక సెలవలిచ్చారు కాలేజ్ కి. ఆరోజే తెరిచారు.
  గౌరి పుస్తకాలన్నీ సర్దుకుని, కూర్చుని చదువుకుంటోంది.
  “ఆదిత్య ఎవరు?” క్రికెట్ ఆడుతూ కాలు విరక్కొట్టుకున్నాడే అతనా?” అడిగింది గౌరి.
  ఒక్క సారి నిలుచున్న చోటే కూలబడిపోయింది ఉజ్వల.
  “హీరో ఆదిత్య తెలియదా? అతడ్ని ఆదిగాడితో కంపేర్ చేస్తావా? నువ్వసలు మనిషివేనా?”
  “నేను సినిమాలు చూడను. నాకు తెలియదు. సారీ.”
  “దాన్నొదిలెయ్యవే. నీ సినీలెవెల్ కి అది చేరడానికి కొన్నేళ్లు పడుతుంది. ఏమనుకోకు గౌరీ!” అంది సుష్మ.
  సుష్మ గౌరీలు బైపిసి కనుక కంబైన్డ్ గా చదువుతుంటారు. ఉజ్వల యమ్. పిసి బాచ్. వాళ్ల క్లాసులు వేరే ఉంటాయి. డైనింగ్ హాల్ కి వెళ్లేప్పుడు వచ్చి సుష్మ దగ్గర హడావుడి చేస్తుంటుంది ఉజ్వల.
  గౌరి, సుష్మతో తప్ప ఇంకెరితో కలవదు. అక్కడందరూ ధనవంతులవడం ఒక కారణమైతే, తన చదువు తనకి ముఖ్యం అనీ.. మిగిలిన వాళ్లకంటే రెట్టిపు కష్ట పడితే కానీ తన ఆశయం నెరవారదనీ అనుకోవడం ఇంకో కారణం.
  సుష్మ తమ ఇద్దరికీ ఉన్న అడ్డుగోడలు చెరిపేసింది. అయినా గౌరి తన పరిధిలో తనుంటుంది. సుష్మ ఎన్నిసార్లు పిలిచినా వాళ్లింటికి వెళ్లలేదు.
  గౌరి హాస్టల్ కి వచ్చిన ఏడాదిలో భాషలో చాలా మార్పు వచ్చింది. సుమారుగా పెద్దింటి పిల్లల్లాగే మాట్లాడుతోంది. కాకపోతే తెలుగు పదాలు తక్కువ, ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడదు మిగిలిన వాళ్లలాగ. సాధ్యమైనంత వరకూ స్వచ్ఛమైన తెలుగే మాట్లాడుతుంది.
  సుష్మ బాత్రూం కి వెళ్లి పళ్లు బ్రష్ చేసుకుని వచ్చింది.
  “నాలుగు నెలల నుంచీ అదే టూత్ పేస్ట్ గౌరీ.. నేను నాలుగు మార్చాను.” సుష్మ మొహం తుడుచుకుంటూ అంది.
  “నీలాగ సగం సింక్ కి పట్టించను కద నేను.” ఇప్పుడిప్పుడే సుష్మని ఆట పట్టించే ధైర్యం వచ్చింది గౌరికి.
  “హియర్. హియర్. పెద్దమ్మకి చెప్తాను. సుష్మకి మోరల్ లెసన్స్ బోధించడానికి ఇంకొకరు వచ్చారని.”
  “ఆ పని మాత్రం చెయ్యకు ఉజ్వలా. అమ్మగారికి కోపం వస్తుంది.”
  “గౌరీ!” అరిచింది సుష్మ.
  “సారీ! ఆంటీకి.”గౌరి నవ్వుతూ అని పుస్తకంలో తల దూర్చింది.
  “ఇంతకీ ఏమంటాడే మీ ఆదిత్య?” సుష్మ అడిగింది.
  “ఓహ్! ఎంత స్మార్ట్ గా ఉన్నాడో తెలుసా? అతని నవ్వే మెస్మరైజ్ చేస్తున్నట్లుంటుంది. నా కేసి తిరిగి, ‘హౌ ఆర్యూ’ అన్నాడు.” సగం కళ్లు మూసి అంది ఉజ్వల. అతని నవ్వు గుర్తుకొచ్చి బుగ్గలు ఎర్రగా ఐపోయాయి.

  “నాకంటే ఫైవ్ ఇంచెస్ పొడుగ్గా ఉన్నాడు. ఆ నడకలో గ్రేస్, చేతులు తిప్పడంలో స్టైల్, కళ్లలో మెరుపు.. అతను మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది.” ఉజ్వల ఉత్సాహానికి అడ్డుకట్ట వేసింది సుష్మ.
  “ఎంత సేపు మాట్లాడాడేం”
  “ఎంతసేపా.. హౌఆర్యూ అనగానే థియేటర్ మానేజర్ వచ్చి లాక్కుపోయాడు.” బుంగమూతి పెట్టింది.
  గౌరి ఒకసారి తలెత్త ఆశ్చర్యంగా చూసింది.
  అంతలా మాయ చెయ్యగలరా మగాళ్లు.. ఉజ్వల వచ్చినప్పట్నుంచీ, చదువు గురించి కానీ, అమ్మానాన్నల గురించి కానీ మాట్లాడుతే ఒట్టు.   సుష్మ కూడా అడగలేదు. తనే వచ్చాక ఒక గంట పైగా తల్లి దండ్రుల గురించి, చెల్లెలు గురించి సుత్తి కొట్టింది. అప్పుడు సుష్మ తన అమ్మా నాన్న, అన్నల గురించి చెప్పింది.
  ఈ గొప్ప వాళ్లు ఫామిలీ గురించి మాట్లాడుకోరా? గౌరి చదివిన స్కూల్లో అందరూ తనవంటి వాళ్లే. ఇక్కడికొచ్చాకే, డబ్బున్న వాళ్ల పద్ధతులు, మనస్తత్వాలు తెలుస్తున్నాయి. క్లాసులోనూ, హాస్టల్లోనూ తమలో కలుపు కోవడానికి ఆర్నెల్లు పైగా పట్టింది. వేషంలో భాషలో మార్పు వచ్చాక అందరూ మాట్లాడ సాగారు.
  అంత వరకూ గౌరిని చూసి వెనకాల నవ్వుకోవడమే. గౌరి తెలివి తేటలు, ఫొటోగ్రాఫిక్ మెమొరీ, అందరి కంటే ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.
  గర్ల్స్ కాలేజ్ లో, బాయిస్ కాలేజ్ లో కలిపి అన్ని టెస్టుల్లోనూ గౌరి ఎప్పుడూ ఫస్ట్ రావలసిందే.
  “సర్లే, ఇంతకీ సెకండ్ ఇయర్ బుక్స్ తీసుకున్నావా?”
  “ఎక్కడా.. వచ్చినప్పట్నుంచీ ఫ్రెండ్స్ ని కలవడంతో సరిపోయింది. ఇదిగో.. టేకాఫ్ టు ఆఫీస్.” ఉజ్వల మెరుపులా మాయమయింది.
  “ఎన్ కౌంటర్ విత్ ఆదిత్య. హాస్టలంతా ఏకం చేసి ఉంటుంది.”సుష్మ మాటలకి గౌరి ఏం జవాబు చెప్పలేదు. అనవసర విషయాలకి దూరంగా ఉంటుంది.*

   అప్పలాచారిగారు క్లాసులోకి వస్తున్నారు. అక్కడా అక్కడా నిలుచున్న పిల్లలు కూడా గబగబా వాళ్ల బెంచీల దగ్గరకెళ్లి కూర్చున్నారు. రెండు చేతుల మధ్య పుస్తకం పెట్టి మామూలుగా నమస్కారం చెప్తూ వచ్చారు. ఎవరూ లేవలేదు. మొదటిరోజు ఆయన లేవద్దని చెప్పినప్పట్నుంచీ ఒక్కరు కూడా లేవట్లేదు.
  “ఇంటర్ రెండో సంవత్సరం లోకి వచ్చారు. ఇప్పుడన్నా కాస్త గౌరవ మర్యాదలు నేర్చుకోవచ్చు కదా!” ముందు బెంచీ ఎక్కి కూర్చుని పిల్లలకేసి తిరిగి అన్నారు.
  “ఫస్ట్ ఇయర్ లో మీరే కదా సార్, ‘మీరు లేవద్దు నాకిష్టం ఉండదు’ అన్నారు. మీ కిష్టం లేని పనులు ఏవీ కూడా మేం చెయ్యం సార్.” ఆణు అన్నాడు.
  “మాటవరసకేదో అంటే అదే పట్టుకుంటారా?”
  “మాకు మాట వరసల్లేవు సార్. మీరేం చెప్తే అది వింటాం, ఏం చేస్తే అది చేస్తాం.” ఆణు మాట వినగానే క్లాసంతా అప్పలాచారిగారి లాగే బెంచీలెక్కి కూర్చున్నారు.
  మొహం ఎర్రగా చేసుకుని, పాఠం ఎలాగో చెప్పాననిపించి అప్పలాచారి బైటికెళ్లిపోయారు.
  తర్వాతి క్లాసు ఆల్జీబ్రా. మామూలుగానే, హరిశ్చంద్ర ప్రసాద్ క్లాస్ కి రాలేదు. “ప్రిన్సిపాల్ వస్తున్నారు” తలుపు దగ్గర కాపలా ఉన్న కుర్రాడు చటుక్కున లోపలికి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
 వెంకట్ లోపలికి వస్తూనే క్లాసంతా ఒకసారి పరికించాడు.అందరూ బుద్ధి మంతుల్లా, “గుడ్ మార్నింగ్సార్” చెప్పారు. తల పంకించి మౌనంగా కుర్చీలో మఠం వేసుకుని కూర్చున్నాడు.
  అందరి గుండెలూ దడదడలాడుతున్నాయి. ఫాదర్ లో చేరే ముందే చెప్పారు, ‘డిసిప్లిన్ లేకపోతే తక్షణం పంపేస్తా’ మని.
  “ప్రిన్సిపాల్ ఏమంటారో!”
  అయినాసంస్కృతం సార్ ని టూమచ్ చేశామేమో! అందరూ తలలు దించుకునికూర్చున్నారు.
  “తలలు దించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది?” అడిగాడు వెంకట్. ఎవరూ మాట్లాడలేదు.
  “అప్పలాచారిగారు రేపట్నుంచీ మీ క్లాస్ కి రారుట.”తలలు మరింత భూమిలోకి వెళ్లిపోయాయి.
  “ఒక్క సారి తలలెత్తండి..” బుద్ధిమంతుల తలలన్నీ పైకి లేచాయి. “ఏంచేశార్రా? ఆయన్నెలా బెదరగొట్టారు?”
  నిశ్శబ్దం.
  “ఎందుకు ఆయన క్లాసుకి రానంటున్నారో చెప్పండి. నేను ఎలాంటి కొత్త లెక్చరర్ని వెతకాలో తెలియాలి కదా!”
  “సారీ సర్. ఇంకెప్పుడూ తప్పుగా ప్రవర్తించం. సంస్కృతం సార్ బాగా చెప్తారు. ఆయనే కావాలి మాకు. అందరం వెళ్లి క్షమాపణ చెప్తాం.”
  “గుడ్. ఇప్పుడు క్రిటికల్ టైమ్ తెలుసు కదా! ఫన్ కూడా ఉండాలి కాదనను. కానీ ఎవర్నీ హర్ట్ చెయ్య కూడదు. మీ కాన్సంట్రేషన్ అంతా చదువు మీదనే ఉండాలి. ఇంగ్లీషు, సంస్కృతం మార్కులు కూడా ఎగ్రగేట్ కి కలుపుతారు. ఆప్షనల్స్ కాదు కదాని నెగ్లెక్ట్ చెయ్యడం, ఆ పాఠాలు చెప్పే వాళ్లని ఆట పట్టించడం చేస్తే మీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. మీరే చదువుకుంటాం అంటారా చెప్పండి. ఆ రెండు క్లాసులూ మాత్స్ కి మార్చేస్తాను.” భాస్కర్రావుని ఇరకాటంలో పెట్టడం గురించి కూడా సున్నితంగా హెచ్చరించాడు వెంకట్.
  “అవును. ఇంగ్లీష్ సార్ అప్పట్నుంచీ నార్మల్ గా ఉండటం లేదు.” ఆణూ, ఆది ఓరచూపులు చూసుకున్నారు.
  “సారీ సర్. ప్లీజ్ ఎక్స్ క్యూజ్ అజ్.” కోరస్.
  “ఓకే. ఇంక నుంచీ జాగ్రత్తగా ఉండండి. మీరు క్లాసులో ఎంత అల్లరి చేస్తారో.. అంత మంచి రిజల్ట్ కూడా తెస్తారని తెలుసు మాకు. ఆల్జీబ్రా ఎంత వరకూ వచ్చిందో చూద్దాం. ప్రసాద్ సార్ రేపట్నుంచీ వస్తారు. ఇవేళ మీకు కొన్ని ప్రాబ్లంస్ ఇస్తాను. సాల్వ్ చెయ్యండి.”


  బంటీ అసలు పేరు భుజంగరావు. తాతగారి పేరు. వాడికి ఊహ తెలిసినప్పట్నుంచీ ఇంట్లో పిలిచే ముద్దు పేరుతోనే అందరూ పిలవడం అలవాటైపోయింది. ఇప్పుడెవరికీ అసలు పేరు గుర్తు లేదు.
  బంటీకి ఒక తమ్ముడు చంటి. ఇద్దరికీ రెండేళ్లు తేడా. చిన్నప్పట్నుంచీ చంటి దుందుడుకు స్వభావంతో ఇంట్లో బయటా కూడా అందరినీ ఏడిపిస్తుంటాడు. చంటిగాడ్నుంచి తప్పించుకోడానికి బంటీ ఎక్కువగా స్నేహితుల దగ్గర గడుపుతుంటాడు.
  వాళ్ల నాన్న నారాయణ మూర్తి ఏదో ప్రైవేట్ కంపనీలో పని చేస్తాడు. అమ్మ శారద కూడా ఇంటి దగ్గరే ఏదో ప్రైవేట్ స్కూల్లో పని చేస్తుంది.
  “అంత ఖరీదైన స్కూల్లో చేర్పిస్తే కష్టమేమో!” ఉజ్వల చదివే స్కూల్లో బంటీని చేర్పించే ముందు ఒక సారి సాలోచనగా అన్నాడు మూర్తి.
  “వేరే ఖర్చులు తగ్గిద్దాం. చిన్న ఇంటికి మారుదాం.” శారద చాలా పట్టుదలగా అంది.
  “ఇప్పట్నుంచీ సరైన చదువులు చెప్పిస్తేనే కదా వాడు ఇంజనీర్ అయ్యేది.” శారదకి ఎలాగైనా పిల్లలిద్దరినీ ఇంజనీర్లని చెయ్యాలని కోరిక.
  “సరే నీ ఇష్టం. ఇల్లు నడిపేది నువ్వు.”
  మూడు వరుస గదుల ఇంట్లోంచి రెండు గదుల ఇంట్లోకి మారిపోయారు. ఎడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, ఏడాది ఫీజు, పుస్తకాలు, డ్రెస్సులు కలిపి వాళ్లు దాచుకున్న డబ్బంతా ఐస్ లా కరిగి పోయింది.
  శారద స్కూల్ అయ్యాక ట్యూషన్లు ఒప్పుకుంది. నారాయణ మూర్తి ఇంకో రెండు ప్రైవేట్ కంపనీల్లో అకౌంట్స్ రాయడానికి వెళ్లి రాత్రి పదింటికి వస్తాడు.మరి చంటిని ఏం చెయ్యాలి? వాడ్ని కూడా అందులోనే. చిన్న స్కూలంటే మరి ఫీలవడూ?? శారద మాటలకి మూర్తి సై. పిల్లల అదృష్టం కొద్దీ,మూర్తికి ప్రమోషన్ వచ్చి జీతాలు పెరిగాయి. ఇప్పుడు అంత ఇబ్బంది లేదు..
  “నాకీ పిచ్చి బట్టలు వద్దు. మా ఫ్రెండ్సందరూ ఎటువంటి జీన్వ్, టీ షర్ట్స్ వేసుకుంటారో తెలుసా?” టెంత్ లో ఉండగా బంటీ లేవదీశాడు. అప్పుడే హోల్ సేల్లో అందరికీ బట్ట తెచ్చి కుట్టించడానికి ఇద్దామని వెళ్తున్న శారద వెనక్కి తిరిగింది.

  “వాళ్లంతా డబ్బున్న వాళ్లు. మనం పొదుపుగా ఉండాలి.” ఎంత పొదుపుగా ఉన్నా, పెరుగుతున్న ధరలతో కష్టమైపోతోంది.
  “మరెందుకు మమ్మీ అలాంటి స్కూల్ కి పంపావు? నాకెంత ఇన్సల్ట్ గా ఉంటోందో తెలుసా? ఎందుకిలాంటి లైఫ్?” బంటీ మాటలకి మూర్తి ఏం చెయ్యాలో తోచనట్లు నిలబడిపోయాడు.
  “అలాంటి పెద్ద మాటలు మాట్లాడకు. చదువు బాగా చెప్తారని అక్కడ చేర్పించాం. వేషాలు వేస్తావని కాదు.” శారద కోపంగా అంది.
  “చదువుతో పాటు సోషల్ లైఫ్ కూడా ఉండాలి కదా? ఒకణ్ణి ముడిచి పెట్టుక్కూర్చోవాలా?” అంటున్న పధ్నాలుగేళ్ల బంటీకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధం అవలేదు శారద మూర్తిలకి.
  “టెంత్ లో మంచి మార్కులు తెచ్చుకో. జీన్స్ కొనిస్తా కదా!” మూర్తి వాగ్దానం.
  “టెంత్ లో బాగా వస్తే నాకు సెల్ ఫోన్ కొనియ్యాలి. రవికి ఊర్మిళకి ఇప్పుడే ఉన్నాయి.”
  “ఇంట్లోనే ఇన్ కమింగ్ మాత్రమే ఉన్న పోన్ పెట్టిస్తే వీడికి సెల్ ఫోనా! తర్వాత లైన్లో చంటిగాడున్నాడు.
  ఒకరోజు సడెన్ గా బంటీ లేవదీశాడు.
  “నాకు పాకెట్ మనీ సరిపోవట్లేదు. కనీసం రెండొందలేనా కావాలి.” మొండిగా అన్నాడు.
  “రెండొందలా.. యాభై రూపాయలివ్వడానికే నానా అస్థా పడుతుంటే..” శారదకి బంటీని ఎలా డీల్ చెయ్యాలో అర్ధం అవడంలేదు.
  “యాభై రూపాయలకి కప్పు కాఫీ కూడా రాదు. ఏం చేసుకోవాలి? రవికి నెలకి ఫైవ్ హండ్రెడ్ తెలుసా?” బంటీకి బాధగా ఉంది. ఎప్పుడూ వాళ్లే ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. అక్కడికీ వారానికోసారి పాత పేపర్లు తీసుకెళ్లి అమ్మేస్తూంటాడు. అయిదార్రూపాయలకంటే ఎక్కువ రావట్లేదు.
  అప్పుడప్పడు అమ్మ బాగ్ లోంచి కొట్టేసే చిల్లర ఒక పది వరకూ ఉంటుంది నెలకి. మళ్లీ నోట్లు తీస్తే కనిపెడుతుంది కదా! ఎలాగో నెలకి వంద వరకూ పోగు చేస్తుంటాడు. అయినా ఏ మూలకి?
  “సెల్ ఫోనూ పాకెట్ మనీ సంగతి పక్కన పెట్టు. మార్కులెలా వస్తున్నాయి?” మూర్తికి ఎప్పుడో కానీ పిల్లలతో మాట్లాడే అవకాశం రాదు.
  “నాకు అన్నీ ఫస్ట్ మార్కులే నాన్నా! చూస్తారా?”తయారుగా ఉన్న ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకొచ్చాడు చంటి. వాడు ఎయిత్ క్లాస్. డబ్బులకి కూడా సతాయించడు. కడుపు నింటా ఇంట్లో తిని ఆడుకునొస్తాడు.
  “వెరీ గుడ్. నీకు కాడ్ బరీ కొనిస్తా. నీసంగతేంటి బంటీ?”
  “సెవెంటీ పర్సంట్ పైనే వచ్చింది డాడీ.” చిన్నగా అన్నాడు. “మాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ లో అంత బాగా రాలేదు. ఇంగ్లీష్. సివిక్స్, హిస్టరీ.. నేనే క్లాస్ ఫస్ట్. ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తూ అన్నాడు బంటీ.
  “అదేంటి..వాటిల్లోనే మంచి మార్కులు రావాలి. ఇంగ్లీషెందుకు పనికొస్తుంది?” శారద విసురుగా అంది.
  “నాకు ఇంగ్లీష్ ఇష్టం మమ్మీ. ఎక్కువ చదవకపోయినా గుర్తుండి పోతుంది. ప్లీజ్.. నేనింటర్లో ఆర్ట్స్ తీసుకుంటా.”
  “ఇంత కష్టపడి నీకు అంత మంచి స్కూల్లో చదువు చెప్పిస్తుంటే ఆర్ట్స్ తీసుకుంటావా? ఏం చేద్దామని? ఎమ్సెట్ రాసి ఇంజనీరింగ్ లో సీట్ తెచ్చుకోవాలి. అందుకే కదా నేను పగలూ రాత్రీ ఇంత చాకిరీ చేస్తున్నాను.” శారదకి ఏడుపుతో కంఠం పూడుకు పోయింది.
  బంటీకి తెలుసు. ఇలాగే జరుగుతుందని. అందుకే ఏం మాట్లాడకుండా సైన్స్ తీసుకుంటాననే అన్నాడు. కానీ ఎంత చదివినా ఆ ఫిజిక్స్ బుర్రకెక్కదే! చివరిగా ఓ సారి ఓమాట అని చూద్దాం వింటారేమోనని అనుకున్నాడు. మమ్మీ ఏడుపు మూడ్ లోకి వెళ్లిందంటే, వారం రోజుల పాటు ఇంట్లో వార్ సీన్లే.
  “ఓకే మమ్మీ. కూల్డౌన్. అలాగే యమ్. పిసి తీసుకుంటా.కానీ ‘ఫాదర్’ కాలేజీలో చేర్పించాలి.” బంటీ మాటలకి అయోమయంగా చూసింది శారద.  
  “అదొక రెసిడెన్షియల్ కాలేజ్. సంవత్సరానికి యాభై వేలవుతుంది.రెండేళ్లకీ లక్ష పైగా పెట్టుకోవాలి.” మూర్తి నీరసంగా అన్నాడు. ఎక్కడికెళ్తోంది బడ్జెట్..
  “చూద్దాంలే. ముందు మంచి మార్కులు తెచ్చుకో.” శారద బాగ్ తీసుకుని బైటికి నడిచింది.
  బంటీ ఉత్సాహంగా పుస్తకాలు తీసుకునిచదువుకోడానికి వెళ్లాడు. ఉజ్వల ‘ఫాదర్' ఇన్స్టి ట్యూట్ లో చేరుతానని చెప్పినప్పట్నుంచీ, తను కూడా ఎలాగైనా ఆ కాలేజ్ లోనే చేరాలని అనుకున్నాడు.
  ఉజ్వల స్నేహితులందరికీ ఫస్ట్ క్లాసులొచ్చాయి. వేణు, ఊర్మిళ హైద్రాబాద్ లోనే జూనియర్ కాలేజ్ లో చేరారు. ఉజ్వల ‘ఫాదర్' లో చేరగానే బంటీ కూడా అక్కడే చేర్తానని కూర్చున్నాడు.
  “నువ్వెందు కర్ధం చేసుకోవు? అంత ఫీజు కట్టలేం.” శారద నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది.
  “నేనేం ఫోర్స్ చెయ్యట్లేదు కదా అలాగే ఇక్కడే చేర్తాను, నాకిష్టమైన గ్రూపులో ఐతే.”
  “అబ్బా.. ఏంటా మొండితనం? నువ్వు ఇంజనీర్ అవాలని ఎప్పట్నుంచో నేను కలలు కంటుంటే అలా మాట్లాడ్తావు..” శారద, బంటీల మధ్య సంభాషణ వింటూ కూర్చుండి పోయాడు మూర్తి.
  “నేను చెప్ప వలసింది చెప్పాను. ఆ పైన మీ ఇష్టం. ఇవిగో రెండు అప్లికేషన్లు. దేనికి పెట్టాలో చూసుకోండి.” బంటీ విసురుగా బైటికి వెళ్లిపోయాడు.
  శారద తల పట్టుక్కూర్చుంది.
  “పి.యఫ్ లోన్ పెడ్తాను. వాడికిష్టమైన కాలేజ్ లోనే చేర్పిద్దాం. యమ్. పి.సి లోనే.” మూర్తి శారద దగ్గరగా వెళ్లి అన్నాడు.
  “అదొక్కటే కదా మన సేవింగ్స్. అందులోంచి కూడా తీసేస్తే ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే..”
  “ఇక్కడి కాలేజ్ కీ దానికీ పాతిక వేలే తేడా. అక్కడ చేర్పిస్తే ఇంక వేరే ట్యూషన్లు అక్కర్లేదు. ఇంజనీరింగ్ లో చేర్పించేప్పుడు బాంక్ లోన్ తీసుకుందాం.”

  “ఉజ్జీ! నేను కూడా ఫాదర్ ఇన్స్టిట్యూట్ లో చేరుతున్నాను.” బంటీ పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు.
  “రియల్లీ! మనం హాప్పీగా రోజూ కలుసుకోవచ్చు. మన గ్యాంగ్ అంతా కూడా వస్తే బాగుండేది.” ఉజ్వల ఉత్సాహంగా అంది. రిజల్ట్ వచ్చిన ఆనందంలో అందరూ పిజ్జా హట్ లో కలుసుకున్నారు.
    మధ్యలో సర్వర్ బాయిస్ డాన్స్ చేస్తుంటే వీళ్లు కూడా చేరారు. ఆరోజు పిజ్జా హట్ లో పదహారేళ్ల వసంతం నర్తించింది.
  అందరూ ఒకటే చప్పట్లు కేకలు.
  ఉజ్వల డాన్స్ చేస్తుంటే బంటీ తప్పించుకుని, దూరంగా కూర్చుని ఉజ్వల కేసి చూస్తుండి పోయాడు.
     టెంత్ లోకి వచ్చినప్పట్నుంచీ బంటీకి ఉజ్వల మీద దృష్టి మారిపోయింది. చిన్నప్పటి అమాకమైన స్నేహం స్థానంలో ఒక కొత్త ఊహ వచ్చి చేరింది. ఎప్పుడూ ఉజ్వల ఒక్కతే తన దగ్గర ఉండాలని అనిపించ సాగింది.           
  
   ఏ రోజైనా ఉజ్వల కనిపించకపోతే తెలియని కలవరం. కనిపించగానే అంతులేని ఉత్సాహం.
  అందుకే పేచీ పెట్టి, తల్లిదండ్రులు ఉజ్వల చగివే కాలేజ్ లోనే చేర్పించేలాగ చేశాడు.
  “బంటీ! రారా..” ఉజ్వల ఏరా అనడం మానేస్తే బాగుండుననిపించింది మొదటి సారిగా బంటీకి.
  “ఫర్లేదులే. నేనిక్కడే కూర్చుని మిమ్మల్ని చూస్తుంటాను.”
  ఫాదర్ లో చేరిన మొదటి రోజు అత్యంత ఉత్సాహంగా సామాను తీసుకొచ్చిన బంటీని బోయిస్ హాస్టల్ కేసి, ఉజ్వలని గర్ల్స్ హాస్టల్ కి పంపించారు, గేటు దగ్గర. ఆ వెళ్లడం మళ్లీ సెలవులకి చ్చినప్పుడే కలుసు కున్నారు, పక్క పక్కనే ఉన్నా కూడా.*
  
  బ్రహ్మదేవుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు, శ్రద్ధగా సృష్టించాడేమో ఉజ్వలని అనిపిస్తుంది చూడగానే.
  చిన్నప్పటినుంచీ పదిమందిలో ప్రత్యేకంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉండేది. మరీ చిన్న క్లాసులప్పుడు అంత తెలియలేదు. కానీ సెవెంత్ అయి ఎయిత్ లోకి వచ్చినప్పటి నుంచీ అబ్బాయిలందరూ ఎందుకోతెలియకుండానే ఉజ్వల వెంట పడుతుండే వారు. అందులో ఉజ్వల చురుగ్గా అందరితో కలుపుగోలుగా కవ్విస్తూ నవ్విస్తూ ఉంటుంది ఎప్పుడూ.
  ఏ రోజైనా ఉజ్వల స్కూల్ కి రాకపోతే అంతా స్తబ్దుగా ఉంటుంది. ముఖ్యంగా బంటీ, వేణు, రవిలతో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. వేణు, రవిలు ఒక ఏడాది పెద్ద. ఆలోచనలూ పెద్దగానే ఉండేవి. బంటీకి స్నేహం తప్ప ఇంకే దృష్టీ ఉండేది కాదు అప్పటికి. అందుకే ఉజ్వల బంటీతో ఇంకొంచెం సన్నిహితంగా ఉండేది.
  ఎయిత్ లో ఉండగా మొదటి సారి ఉజ్వలకి మగపిల్లలు వేరే దృష్టితో చూడటం అనేది అనుభవం అయింది.
 “ఏంట్రా! ఇవేళ వేణూ, రవిగాళ్లు ఒన్ మినిట్ కూడా వదలకుండా వెనకాలే ఉంటున్నారు. సమ్ టైమ్స్ ఐ గెట్ ఇరిటేటెడ్ యు నో!” అప్పుడే పన్నెండేళ్లు నిండిన ఉజ్వల బంటీకి చెప్పుకుంది.
  బంటీ పీలగా ఉజ్వల అంతే ఉంటాడు. వేణు వాళ్ల కంటే ఆరంగుళాలు పొడవు. లావు. ఇంకొంచెం సాగదీసి నిల్చుని పెద్ద హీరోలా ఫీలైపోతుంటాడు. రవి రౌండ్ గా దిట్టంగా ఉంటాడు.
  “అలాగా! వాళ్లు అంత బాదర్ చేస్తున్నారా.. నేను చూస్తా ఉండు.” ఆరిందాలా అన్నాడు బంటీ.
  
  ఆ రోజు సాయంత్రం బంటీని ప్లే గ్రౌండ్ లోకి లాక్కు పోయారు వేణు, రవి.
  “ఏంట్రా ఇలా లాక్కొచ్చారు?” బంటీకి భయం వేసింది. మధ్యాహ్నం ఉజ్జీతో తనన్న మాటలు విన్నారా? వాళ్లని తనేం చూస్తాడు? వేణు గాడు చెయ్యి విసురుతే అంత దూరంలో పడతాడు.
  “ఏం లేదురా, నువ్వు మాకో హెల్ప్ చెయ్యాలి.”
  “నేనా! ఏం హెల్ప్?”
  “ఉజ్జీని మేం లౌ చేస్తున్నాంరా! నువ్వు కొంచెం తనకి చెప్పి ఒప్పించాలి. మమ్మల్ని చూస్తే విసుక్కుంటోంది. నువ్వు క్లోజ్ గా ఉంటావు కదా!”
  బంటీ మొహం పైకెత్తి వేణుని చూశాడు.
  “అంటే ‘నువ్వూ నేనూ’ లో ఉదయ్ కిరణ్ లాగానా?” రవి కేసి, వేణు కేసి మార్చి మార్చి చూస్తూ అడిగాడు బంటీ.
  “సరిగ్గా అలాగే. ఉజ్జీ కూడా మమ్మల్ని లౌ చెసేలాగ చెయ్యాలిరా” రవిగాడు రిక్వెస్టింగ్ గా అడిగాడు.
  “ముందర ఉజ్జీకి మీరు లౌ చేస్తున్నట్లు చెప్పాలి కదా!” బండ మీదికెక్కి కూర్చుని పెద్దరికంగా అన్నాడు బంటీ.
  “అవును. అదే ఎలాగ?”
  “వెళ్లి చెప్పెయ్యండి. లేకపోతే నేనెళ్లి తీసుకు రానా?” బండ మీంచి లేచి నించుని అడిగాడు.
  “అమ్మో.. వద్దురా. క్లాస్ టీచర్ కి చెప్తుందేమో” అంత పొడుగు వేణు భయపడుతూ అన్నాడు.
  “పోనీ ఒక లెటర్ రాయండి. నిన్ననే కదా ఇంగ్లీష్ టీచర్ లెటర్ ఎలా రాయాలో నేర్పించారు.”
  “ఐడియా నువ్వే చెప్పరా ఎలా రాయాలో. ఎప్పుడూ నువ్వే కదా ఫస్ట్ ఇంగ్లీష్ లో.” ఇద్దరూ బంటీ చేతులు పట్టుకుని మళ్లీ బండమీదికెక్కించి కూర్చో పెట్టారు.
  “ఐతే ఇద్దరూ నాకు చెరొక కాడ్ బరీ ఇస్తారా?”
  “అలాగే. మా ఇంట్లో వారానికొక కాడ్ బరీ ఇస్తారు నాకు. అది నీకిచ్చేస్తా.” రవి ప్రామిస్ చేశాడు.
  వేణు కూడా తలూపాడు.
  “ఓకే. పేపర్, పెన్ను తెచ్చుకోండి.” ఇద్దరూ పరుగెత్తుకుంటూ వెళ్లి స్కూల్ బాగ్ లోంచి నోట్ బుక్స్ తీసి రెండు కాగితాలు చింపారు.
  “రెండెందుకురా? ఒకట్టి చాలదూ. ఇద్దరూ ఉజ్జీకే కదా రాసేది.” అన్నాడు బంటీ.
  వెంటనే తన కాగితం ఉండ చుట్టి విసిరేశాడు రవి.
  “పైన లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ రాసి మీ పేర్లు అడ్రస్ లు రాయండి.” వేణు శ్రద్ధగా ఇద్దరి పేర్లూ అడ్రస్ లూ రాశాడు.

  “డియర్ ఉజ్వలా! వియ్ ఆర్ ఇన్ డీప్ లౌ విత్ యు.” బంటీ మొదలు పెట్టాడు.
  “‘ఐ లౌ యు’ అంటే చాలదా?” రవి సందేహం.
  “అది మామూలుగా అనే మాటరా. డీప్ అంటే చాలా ఎక్కువగా అన్నమాట. మాట్లాడకుండా నే చెప్పినట్లు రాస్తారా లేదా?” బంటీ లేచాడు.
  “సర్లేరా. ప్లీజ్.. ఇంక ఆపం.”
  “వి లైక్ యు వెరీ మచ్.” లైక్ అయితేనే కదా లౌ వచ్చేది. రిపీట్ చేసినట్లవదూ? వేణుకి సందేహం వచ్చింది. కానీ.. బంటీగాడు మళ్లీ లేచి పోతాడేమో అని ఊరుకున్నాడు. అంతగా ఐతే ఇచ్చే ముందు కొట్టెయ్యచ్చులే.
  “వి వాన్ట్ యు ఆల్సో ఇన్ లౌ వితజ్.” మరి డీప్ అనద్దా? రవిగాడు పైకనబోయి చటుక్కున చేత్తో నోరు మూసుకున్నాడు.
  “కింద కుడి పక్క ‘యువర్స్ సిన్సియర్లీ’ అని రాసి ఇద్దరూ సంతకాలు పెట్టండి.” అన్నాడు బంటీ.
  బుద్ధిగా ఇద్దరూ ఒకళ్ల తర్వాత ఒకళ్లు సంతకాలు పెట్టారు.
  “ఎప్పుడిద్దాం రా?” బంటీ అడిగాడు. వాడికి చాలా హుషారుగా ఉంది. వేణు, రవిలకి మాత్రం వణుకుగా ఉంది.
  “ఈ రోజు సాయంత్రం వాళ్లింకి వెళ్లి ఇచ్చేద్దాం.” బంటీ ఓ సజెషన్ ఇచ్చేశాడు చులాగ్గా.
  “చీకటి పడే లోపు ఇంటికెళ్లక పోతే మా ఇంట్లో ఉతికేస్తారు.” అన్నాడు రవి బాధగా.
  “త్వరగా ఇచ్చి వచ్చేద్దాం. ఫరవాలేదు.” బంటీ భరోసా ఇచ్చాడు. ముగ్గురూ ఫైవ్ కల్లా ఉజ్జీ వాళ్లింటి ముందర కలవడానికి నిర్ణయించుకుని స్కూలు బస్సెక్కారు.
  అదే బస్సులో ఉజ్వల, ఊర్మిళ కూడా ఎక్కారు. వాళ్లందరి ఇళ్లూ ఒక కిలోమీటరు దూరంలో ఒక పేటలోనే ఉంటాయి. వేణు, రవి ఉజ్వల కేసి చూడకుండా కిటికీలోంచి బైటికి చూడ సాగారు.
  ఉజ్వల బంటీని చూసి కళ్లెగరేసింది. బంటీ కళ్లు పెద్దవి చేసి ఉజ్వలని సంభ్రమంగా చూస్తున్నాడు. ఉజ్జీని లౌ చేస్తున్నారు వీళ్లు అనుకుంటూ, వేణు రవిలని చూస్తూ సైగ చేశాడు. ఉజ్వలకేం అర్ధం కాలేదు. అయోమయంగా చూసింది.చేతిని పైకెత్తి ఐదు వేళ్లు చూపించి, మీ ఇంటికి ఐదింటికి వస్తున్నాం అన్నట్లు సైగ చేశాడు.
  “రండి” అంటూ చెయ్యూపింది ఉజ్వల.
  వేణు, రవి కలిసి బంటీ దగ్గరకి వచ్చారు. బంటీ వాళ్లిల్లు చివర ఉంది. ముగ్గురూ కలిసి మళ్లీ వెనక్కి వచ్చి ఉజ్వల వాళ్లింటి కొచ్చారు. వాళ్లిల్లు మధ్యలో ఉంది. బంటీ ఒకసారి వెళ్లాడు కానీ వేణు, రవి ఎప్పుడూ వెళ్లలేదు.

  ఒక పెద్ద ఇంట్లో సైడ్ పోర్షన్ లో అద్దె కుంటున్నారు అప్పుడు ఉజ్వల వాళ్లు. ఆ తరువాత టూ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ కొన్నాడు సంతోష్.
  సాయంత్రం ఐదున్నరైంది. సంతోష్ అప్పుడే గేటు తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. అతను ఆఫీస్ వదలగానే తిన్నగా ఇంటికొచ్చేస్తాడు.
  ఉజ్వల పరుగెత్తుకుంటూ ఎదురొచ్చింది.
  “డాడీ! ఐస్ క్రీమ్ తెచ్చారా?”
  “యా.. కమాన్ అంటూ కూతుర్ని మురిపెంగా చూస్తూ లోపలికెళ్లాడు.
  “రేయ్! ఉజ్జీ యూనిఫామ్ తీసేసి, స్కర్ట్, బ్లౌజు వేసుకుందిరా” రవిగాడి కామెంట్.
  “అవునురా. ఎంత బాగుందో.” వేణు మాటలకి బంటీ కుతూహలంగా చూశాడు గేటు సందులోంచి. తనకేం తెలియలేదు. ఎగిరి గేటు తియ్యబోయాడు బంటీ. అందలేదు.
  “ఒరేయ్! అలా చూస్తూండకపోతే గేటు తియ్యచ్చుకద!” మిటకరించి చూస్తున్న వేణుతో అన్నాడు.
  “నాకు భయంగా ఉందిరా.”
  “ఫర్లేదు. నే ఉన్నా కదా, తియ్యి.” రోజూ వచ్చే పొయే వాడిలాగా బంటీ భరోసా ఇచ్చేశాడు. చెయ్యి వణుతుండగా గేటు తీశాడు వేణు. రవి, బంటీ పిల్లుల్లా లోపలికి దూరారు. వేణు వెనకాలే వెళ్లి గేటు వేశాడు.
  అంతలో.. ఎక్కడ్నుంచి వచ్చిందో, గుర్రంలాంటి ఆల్సేషియన్ ఉరకలేస్తూ వచ్చింది, భయంకరంగా మొరుగుతూ.
  “కుక్క ఉందని చెప్పలేదేరా?” వేణు అసంకల్పితంగా బైటికెళ్లి గేటు వేసేశాడు.
  “నాక్కూడా తెలీదురా. గేటు తియ్యి.” బంటీ వేగంగా వెనక్కి పరుగెత్తాడు. వేణు భయపడిపోయి గేటు వదిలేసి రోడ్డు మీదికెళ్లి చూస్తున్నాడు. రవి, బంటీ పరుగెత్తుకుంటూ గేటు దగ్గరకి వచ్చారు. వాళ్ల వెనుకే కుక్క. భయపడే వాళ్లని మరింత భయపెట్టడం దాని హాబీ.
  సన్నగా, తేలిగ్గా రివటలా ఉండే బంటీ ఒక్క ఉదుట్న గేటు చువ్వలు పట్టుకుని ఎక్కేసి బైటికి దూకేశాడు, గీరుకుపోయిన చేతిని ఊదుకుంటూ.
  రౌండ్ రౌండ్ గా ఉండే రవి గేటు ఎక్కి కాలు బైటికి పెట్ట బోతుండగా, కుక్క వాడి పిక్క పట్టుకుంది గట్టిగా. ఏడుస్తూ రవి అలాగే ఉండిపోయాడు కదలకుండా. ఆ హడావుడికి ఉజ్వల బైటికొచ్చింది.
  “టైగర్!” అని ఒక్కరుపు అరిచి కుక్కని తీసుకుని ఇంటివాళ్ల ఇంట్లో కట్టేసి వచ్చింది.
  “సారీరా. ఇంటివాళ్ల కుక్క. మీరు వచ్చాక, పిలుస్తారేమో అప్పుడు కట్టేద్దామనుకున్నాను. దెబ్బ తగిలిందా?” గేటు మీద నుంచి లోపలికి పడిపోయిన రవి దగ్గరికి వచ్చింది.
  “కుక్కని కట్టేశారు కదా” అంటూ వేణు, బంటీ లోపలికి వచ్చారు. ముగ్గురూ కలిసి రవిని పైకి లేవదీశారు.
  “ఏంటి గోల? అయ్యో.. ఎవరు వీళ్లు?” సరస్వతి ఇంట్లోంచి బైటికొచ్చింది.
  వంగుని కాలు చూసుకుంటూ కుంటుకుంటూ వస్తున్న రవి, డోక్కుపోయిన చేతిని ఊదుకుంటూ ఉజ్జీతో పాటు వస్తున్న బంటీ, వెనుకే భయం భయంగా అడుగులో అడుగు వేస్తూ వస్తున్న వేణు.. వాళ్లని చూస్తూనే గాభరాగా ఎదురెళ్లింది.
  “మా క్లాస్ మేట్స్ మమ్మీ. టైగర్ పట్టుకుంది. కట్టెయ్యడం మర్చి పోయా.” చెప్పింది ఉజ్వల.
  “అయ్యో.. లోపలికి పదండి.” అంటూ రవినీ, బంటీని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి దెబ్బల్ని డెటాల్ నీళ్లతో కడిగి, యాంటీ సెప్టిక్ ఆయింట్ మెంట్ రాసింది.
  రవి పిక్కమీద, కొద్దిగా పళ్ల గుర్తులు తప్ప పెద్దగా పీకలేదు. వాడు కదలకుండా ఆగిపోవడం మంచిదయింది.
  “ఎందుకైనా మంచిది. ఇద్దరూ టి.టి ఇంజక్షన్లు తీసుకోండి.” మంచినీళ్లిస్తూ అంది సరస్వతి.
  “అలాగే ఆంటీ. మండిపోతున్న చేతిని చూసుకుంటూ అన్నాడు బంటీ.
  “ఈ యంగ్ మెన్ ఎవరు?” లోపల్నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు సంతోష్.
  “మా క్లాస్ మేట్స్ డాడీ.” పరిచయం చేసింది ఉజ్వల.
  “మా ఫ్రెండ్స్ కి ఐస్ క్రీమ్ ఇవ్వనా డాడీ?”
  “తప్పకుండా. దా. కప్పుల్లో పెట్టిస్తాను.” సంతోష్ వెనకాలే వంటింట్లోకి వెళ్లింది ఉజ్వల.
  “బాగా చదువుతున్నారా? మీలో ఎవరికి ఎక్కువ మార్కులొస్తాయి?”
  “వీడికే ఆంటీ.” వేణుని చూపిస్తూ అన్నాడు బంటీ. “ఇంగ్లీష్లో మాత్రం ఎప్పుడూ నేనే ఫస్ట్.”
  “ఈ పేరెంట్స్ కి ఎప్పుడూ మార్కులడగడం తప్ప వేరే టాపిక్కే ఉండదా? వేణుగాడికి చచ్చే నెర్వస్ గా ఉంది. రవి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సోఫాలో మూలగా వణుకుతూ కూర్చున్నాడు.
  సంతోష్, ఉజ్వల కప్పుల్లో ఐస్ క్రీమ్ పెట్టుకుని వచ్చారు. రవికి ఎంతో ఇష్టమైన బటర్ స్కాచ్. దెబ్బల మాట మర్చిపోయి అంతా ఐస్ క్రీముల మీద పడ్డారు.
  ఉజ్వలకి చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. తన ఫ్రెండ్స్ కి ఐస్ క్రీమ్ ఇస్తోంది. రేపు చాక్లెట్స్ తెమ్మనాలి. ఫ్రీగా తినేద్దామనుకుంటున్నారేమో.
  ఐస్ క్రీమ్ కప్పు పక్కన పెట్టి బంటీ సైగ చేశాడు. “ఇవ్వండి.”
  వేణు, రవి వినిపించుకోలేదు. ఉజ్వల ఒక్కతే ఉన్నప్పుడు ఇద్దామనుకున్నారు. పేరెంట్సుంటే ఎలాగ?
  సరస్వతి కప్పులు లోపల పెట్టి వచ్చింది. సంతోష్ వాళ్ల ఫేమిలీల గురించి అడుగుతున్నాడు. మధ్య మధ్యలో బంటీ ‘ఇవ్వండి’ అని అంటూనే ఉన్నాడు.
  సరస్వతి కనిపెట్టింది. “ఏం ఇవ్వాలి? ఏదన్నా నోట్సా?”
  వేణుగాడు బంటీని మింగేసేలా చూశాడు.
  “ఏం లేదాంటీ. వీళ్లు లెటర్ తీసుకొచ్చారు.”
  “ఏంటా లెటర్" సంతోష్ దగ్గరగా వచ్చి వేణు జేబులోంచి లెటర్ బయటికి తీశాడు.
  సరస్వతి దగ్గరగా వచ్చి, సంతోష్ తో పాటు ఉత్తరం చదివింది. ఉజ్వల అయోమయంగా చూస్తోంది.
  సంతోష్, సరస్వతీ ఉత్తరం చదివి ఏంచెయ్యాలో అర్ధం కాక ఒకళ్లకేసొకళ్లు చూస్తుండిపోయారు. ముందుగా సరస్వతే తేరుకుంది.
  “నిండా పన్నెండేళ్లు లేవు ఇప్పట్నుంచీ లౌలా. ఉండండి. మీ ఇళ్లకి ఫోన్లు చేస్తాను. నంబర్లెంత?”
  వేణు, రవి సరస్వతి కాళ్ల మీద పడిపోయారు. “ఎక్స్ క్యూజ్ అజ్ ఆంటీ. ఇంకెప్పుడూ ఇలా రాయం. మా ఇంటికి ఫోన్ చెయ్యద్దు ప్లీజ్.. ఆంటీ.” రవిగాడు గట్టిగా ఏడుపు లంకించుకున్నాడు.
  వేణు, సంతోష్ దగ్గరకి వెళ్లి బ్రతిమాల సాగాడు.
  “మా ఇంట్లో తెలిస్తే పనిష్మెంటిస్తారు. ప్లీజ్.. ఫోన్ చెయ్యద్దంకుల్.”
  “సరే. సరే. ఊరుకోండి. మీ చదువులయ్యేవరకూ అమ్మాయిల జోలికి వెళ్లరు కదా? వెళ్లారంటే పోలీస్ రిపోర్టిస్తాను.” బెదిరించాడు.
  “గాడ్ ప్రామిస్. వెళ్లం అంకుల్.” అమ్మో పోలీసులే.. జైల్లో పెట్టి బెల్ట్ తో కొడ్తారు. వేణులో వణుకు మొదలయింది.
  “బాగా చదువు కుంటారా మరి?”
  “ఓ.. బాగా చదువుతాం. ప్లీజ్ ఎవరికీ చెప్పకండంకుల్.” ఇద్దరూ కోరస్..
  ఎర్రగా ఐపోయిన సర్స్వతి మొహం చూసి బంటీ సోఫా వెనక్కాల దాక్కున్నాడు.

  ఉజ్వలకి ఏం అర్ధం కాలేదు. లౌ లెటరా తనకా! నమ్మ బుద్ధి కావట్లేదు.
  “ఏంట్రా?” సోఫా వెనక్కి వెళ్లి బంటీని అడిగింది.
  “వాళ్లు నిన్ను లౌ చేస్తున్నారు. లెటర్ రాయడంలో నేనే హెల్ప్ చేశాను.” గొప్పగా చెప్పాడు బంటీ.
 “నువ్వా నాయనా లెటర్ రాయించింది..వేలెడంత లేవు. ఉండు, రేపొచ్చి మీ ప్రిన్సిపాల్ కి చెప్తాను.” అంది సరస్వతి.
  అమ్మో.. ప్రిన్సిపాలా! కేన్ తో కొడ్తారు. “ప్లీజ్ ఆంటీ. ఇంకెవ్వుడూ ఇలా చెయ్యం.” బంటీ లేచి సరస్వతి చెయ్యి పట్టుకున్నాడు. బక్కగా, వేలెడంత లేడు. వీడు మధ్యవర్తా. ముగ్గుర్నీ కలిపి ఉతకాలనుంది సరస్వతికి. కానీ.. బాగుండదు కదా!
  ముగ్గుర్నీ కూర్చో పెట్టి ఊరుకోబెట్టాడు సంతోష్. ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేశాడు.
  “ఈ లెటర్ నా దగ్గరే దాస్తా. మళ్లీ వేషాలేశారో.. తెలుసు కదా!”
  “వేషాలెయ్యం అంకుల్. వెల్ గా బిహేవ్ చేస్తాం. ప్రామిస్.” ముగ్గురూ లేచి వెనక్కి తిరిగి చూసుకుంటూ బయటికి వెళ్లి పోయారు.
  వేణుకీ రవికీ బంటీ మీద చాలా కోపంగా ఉంది.
  “నేనసలియ్య దల్చుకోలేదు. నువ్వెందుకురా అలా ఫోర్స్ చేశావు?”బంటీని నిలదీశాడు వేణు.
  “మరి లెటర్ ఇద్దామనే కదురా వెళ్లాం. ఎందుకొచ్చారంటే ఏం చెప్తాం? అమాయకంగా అన్నాడు బంటీ.
  “అసలక్కడ ఎవకైనా ఎందుకొచ్చారని అడిగార్రా?” కోపంగా అరిచాడు వేణు.
  “నేను పోతున్నారా. చీకటి పడిపోతోంది.” రవి పరుగెత్తుకుంటూ వాళ్లింటి కేసి వెళ్లిపోయాడు.
  “ఉండరా. నేనూ వస్తాను.” వేణు అరుస్తున్నా వినిపించుకోలేదు.
  “ప్లీజ్. నన్ను మా ఇంటిదగ్గర దింపి వెళ్లరా. చీకటవుతోంది. నాకు భయం.” బంటీ ఏడుపు గొంతుతో అన్నాడు.
  “నేన్రాను పో. అసలు నువ్వు చేసిందానికి నిన్నేం చేసినా పాపం లేదు.” బంటీని వదిలేసి వేణు కూడా వెళ్లిపోయాడు. బిక్కు బిక్కు మంటూ నించున్నాడు బంటీ. స్ట్రీట్ లైట్లు కూడా వెయ్యలేదు. ఇంట్లో కంగారు పడుతుంటారు.
  అందరూ వెళ్లారా లేదా అని చూడ్డానికి సంతోష్ గేటు తీసుకుని వచ్చాడు బయటికి.
  “నువ్వెళ్ల లేదేం బంటీ?”
  “నాకు చీక్ట్లో వెళ్లడం భయం అంకుల్. మా ఇంట్లో దింపుతాం అని ప్రామిస్ చేసి వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.” బంటీ ఏడుస్తూ అన్నాడు.
  “పద నేను దింపుతాను.” సంతోష్ లేపలికి వెళ్లి చెప్పులేసుకుని వచ్చాడు.
                                                 5
  బంటీని దింపి లోపలికొచ్చాడు సంతోష్. “ఉజ్జీ ఏది?”
  “లోపల హోమ్ వర్క్ చేసుకుంటోంది.” సరస్వతి ఇంకా కోపంగానే ఉంది.
  “అదెలా తీసుకుందీ గోలంతా?”
  “అప్పుడే మర్చి పోయింది. ఇంకో కప్పు ఐస్ క్రీమ్ లాగించి పుస్తకాలు తీసింది.” సరస్వతి వంట చెయ్యడానికని లేచింది.
  “అదే పసి వాళ్ల తీరు. ఎంత ఇన్నొసెంట్ గా ఉంటారో! ఆ బంటీకి చీకట్లో వెల్లడానికి భయం. దింపడానికెళ్లినప్పుడు నేను ఇంట్లోకి వస్తానంటానేమోనని భయపడిపోయాడు. గేటు దగ్గరే దింపి వచ్చాను.” ఆలు తొక్కు తీస్తూ అన్నాడు సంతోష్.
  సరస్వతి కుకర్ పెట్టి, చారుకి చింతపండు నాన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది.
  “పసి వాళ్లకి ఆ ప్రేమలేవిటి? ఆ ఉత్తరాలేంటి”
  కళ్లల్లో నీళ్లు వచ్చే వరకూ నవ్వాడు సంతోష్.
  మంచినీళ్లందించి అంది సరస్వతి. “అంత నవ్వెందుకు?”
  “ఆ లెటర్ గుర్తుకొచ్చింది.” తలుచుకుంటుంటే సరస్వతిక్కూడా నవ్వాగలేదు.
  “దాచుకోవాల్సిన ప్రేమలేఖ. ఇద్దరూ కంబైన్డ్ గా సంతకాలు కూడా పెట్టి..” సంతోష్ నవ్వుతూ వెళ్లి ఉజ్వల ఏంచేస్తోందా అని చూసొచ్చాడు.
  సీరియస్ గా రాసేస్తోంది. మళ్లీ ఎనిమిదింటికి క్విజ్ వస్తుంది. ఆలోగా హోమ్ వర్క్ ఐపోవాలి.
  “ఇప్పడు సినిమాలు చూసి చూసి పిల్లలకిలాంటి ఆలోచనలొస్తున్నాయి. మరీ టీనేజి ప్రేమ సినిమాలెక్కవైపోయాయి. ఆడపిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. అవునూ.. ఉజ్జీ ఎవరి పోలికంటావ్?”
  “మీ పోలికా, నారంగూ. ఎందుకూ?”
  “ఏం లేదు. ఇప్పటి నుంచే క్రౌడ్ పుల్లర్ ఐతే ముందు ముందెలాగా అని..” సంతోష్ కొంచె గర్వంగా, కొంచె ఆవేదనగా అన్నాడు.
  “ఫరవాలేదు లెండి. నా భయంతో అది బానే ఉంటుంది.” సరస్వతి లేచింది, కుకర్ శబ్దం హోరు పెడుతుంటే.*
                                    ………………….
  ఉజ్వల పదో సారి టైమ్ చూసుకుంది అరగంటలో.  ఆదివారం అందరూ టెస్ట్ లు రాసి హాస్టల్ కొచ్చారు. లంచ్ అయ్యాక మరునాటి పాఠాలకి చదువుకోవాలి. అప్పటికే అన్ని పోర్షన్లూ ఐపోయాయి. రివిజన్ చేస్తున్నారు. చిన్న చిన్న క్విజ్ లు పెడ్తారు. దానికి రుబ్బాలి. సిలబస్ లో ఏదీ వదలడానికి లేదు. అంతా నాలుక చిర ఉండాలిసిందే.
  చదువుకునేటప్పుడు సెల్ ఫోన్లు వాడడానికి వీలు లేదని ఖచ్చితంగా చెప్పారు. ఆదివారం మధ్యాన్నం కామన్ హాల్లో చదువుకోవాలి అందరూ. ట్యూటర్లు తిరుగుతూ ఉంటారు. ఏమైనా డౌట్స్ ఉంచే తీర్చడానికి.
  ఉజ్వల బాధంతా ఏమిటంటే, ఆ రోజు యస్సెమ్మెస్ చెయ్యడానికి వీలు పడలేదు. కాళ్లు చేతులూ నిలవడం లేదు. మనసు సరేసరి. పుస్తకం తీస్తే ఆదిత్య నవ్వు మొహం కనిపిస్తోంది. తన కళ్లల్లోకి చూసి నవ్వాడంటే, తనంటే డెఫినిట్ గా ఇష్టం ఉండే ఉంటుంది.
  పది రోజుల క్రితం ఊర్మిళ, తన సెల్ కి ఫోన్ చేసి చెప్పింది. ‘ఉజ్జీ! వాలంటీన్స్ డేకి ఆదిత్య సెలెక్టెడ్ అమ్మాయిలతో మాట్లాడతాట్టే.”
  “వావ్.. నిజంగానే! మాట్లాడాలంటే ఏం చెయ్యాలి?”
  “ఈ నంబర్ కి యస్సెమ్మెస్ చెయ్యాలి. అందులో లాటరీ తీస్తార్ట.”  నంబరిచ్చింది.
  “కొన్ని వేల మంది చేస్తారు.అందులో నాకెక్కడ ఛాన్స్?” నిరాశగా అంది ఉజ్వల.
  “మరీ అంత డీలా పడిపోకు. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు కొట్టు. అప్పుడు బెటర్ ఛాన్స్ ఉంటుంది.”
  “గుడ్ ఐడియా. ప్రతీ ఫైవ్ మినిట్స్ కీ ఒక యస్సెమ్మెస్ కొడ్తా.” ఉజ్వల ఆనందంగా అంది.
  “ఆల్ ద బెస్ట్.”
  “ఒన్ సెకండ్ ఉమ్మీ! ఫిబ్రవరిలో నేను హైద్రాబాద్ ఎలా రావాలే? వీళ్లు ఒప్పుకోవద్దూ?”
  “ముందర నీకు ఛాన్స్ రానీ. అప్పుడాలోచిద్దాం.”
  ఇంక ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఉజ్వలకి. ఒక వేళ సెలెక్టయితే ఏం మాట్లాడాలి?
  అంతా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఏ మాత్రం తడబడకూడదు. అసలు ఇక్కడికొచ్చినప్పట్నుంచీ ఒక్క సినిమా కూడా చూడలేదు. టివి స్టూడియోకి వెళ్లేలోపుగా ఆదిత్య సినిమాలన్నీ చూడాలి.
  మర్నాటి నుంచీ వీలైనప్పుడల్లా, రోజుకి పదైనా యస్సెమ్మెస్ లు కొడ్తూనే ఉంది. మధ్యలో కార్డ్ ఐ పోయింది. ఏదో ఉపాయం ఆలోచించాలనుకుంది.
  ఒక రోజు రూమ్మేట్ మంజుల అడగనే అడిగింది, “ ఏమిటి ఈ మధ్న అదోలా ఉంటున్నావ్? సరిగ్గా చదవడం లేదు. ఎప్పుడూ ఆ సెల్ పోన్ తో ఏం చేస్తున్నావ్?”
  మంజుల చాలా సిన్సియర్. పైగా తనకేం అనుకోదు.
  ఈవిడగారు మోరల్ లెసన్స్ పీకుతుంది కాబోలు అనుకుంటూ, “ఏం లేదు మంజూ! మమ్మీకి ఈ మధ్యన ఒంట్లో బాగుండటం లేదు. అందుకే మెస్సేజెస్ ఇచ్చి కనుక్కుటున్నా.”
  “అలాగా! ఓ సారి ఫోన్ లో మాట్లాడచ్చు కదా!”
  “అన్నీ దీనికే కావాలి. నోరు మూసుకుని దాని పని అది చూసుకోవచ్చు కదా..” అని తిట్టుకుంటూ అంది ఉజ్వల. “ఫోన్ లో మాట్లాడాననుకో, అందరికీ డిస్టర్బెన్స్. అందుకే మెస్సేజ్ లు కొడుతున్నా.
  “ఇంత దూరం పంపించి మీ మమ్మీ చదివిస్తున్నారు కదా! నువ్వు బాగా చదువుతే ఆవిడ హెల్త్ బాగుంటుంది. మొన్న టెస్టుల్లో మార్కులు బాగా పడిపోయాయి. చూసుకున్నావా?” మంజుల వర్రీడ్ గా అంది.
  “యమ్మెల్ మంజులా (మోరల్ లెసన్స్) నా గురించి నేను చూసుకో గలను. టూ మచ్ గా వర్రీ అయిపోకు.” ఉజ్వల స్నబ్ చేసే సరికి, కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అక్కడి నుంచి వెళ్లి పోయింది మంజుల.
  మంజులని వదిలించుకున్నాక, కార్డు తీసుకోవడం ఎలాగా అన్న దిగులు మల్లీ పట్టుకుంది ఉజ్వలకి. ఏటియమ్ కార్డ్ వాడచ్చు కానీ, ప్రతీ పైసా లెక్క చెప్పాలి మమ్మీకి. మెళ్లో గొలుసుని చేతితో తిప్పుతూ ఆలోచిస్తుంటే తట్టింది ఐడియా.

  బంటీ కూడా అచ్చు ఉజ్వల లాగానే ఏం తోచకుండా తిరుగుతున్నాడు. వాలంటైన్స్ డే వస్తోంది. ఈ సారి ఉజ్వలకి పెద్ద పొకే.. ఫుల్ ఆఫ్ రోజెస్ పంపాలి. ఎలాగైనా తన మనసులో మాట చెప్పాలి. ఒప్పుకుందనుకో.. ఎంచక్కా కలిసి ఇంజనీరింగ్ చదవచ్చు. నిజంగా ఒప్పుకుంటుందా? కాళ్లలోంచి వణుకు వచ్చింది ఒక్క సారి.
  “నాకసలు అలాంటి ఐడియానే లేదంటే.. ఏం చెయ్యాలి? అమ్మో! తన ఉజ్జీ లేకుండా బతకలేడు. ఒకసారి కుడిచెయ్యి వెనక్కి తిప్పి చూసుకున్నాడు. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో టికెట్లు తెచ్చిస్తే ఇక్కడే కదా ముద్దు పెట్టుకుంది! చేతిని అపురూపంగా నోటి దగ్గరకు తీసుకెళ్లి, సున్నితంగా పెదవులకానించుకున్నాడు.
  ఇప్పుడే ఫ్రెష్ గా ముద్దు పెట్టుకున్నట్లుంది.
  కళ్లు మూసుకుని కాసేపు తన ఉజ్జీని ఊహాలోకంలో చూశాడు. టెంత్ క్లాస్లో మొదటి సారి ఉజ్జీని శారీలో చూసి ఆశ్చర్య పోయాడు. ఆ రోజు ఫేర్ వెల్ పార్టీకి అమ్మాయిలంతా చీరలు కట్టుకునొచ్చారు. పార్ట్ీ ఎలా జరుగుతోందో.. ఏదీ పట్టించుకోలేదు. దూరంగా కూర్చుని ఉజ్జీనే గమనిస్తూండి పోయాడు.
   “బంటీ! ఏంట్రా అలా కూర్చున్నావు? డాన్స్ చేద్దాం రా!” చెయ్యి పట్టుకుని లాక్కెళ్లింది. ఒంట్లో శక్తి అంతా ఎవరో లాగేసినట్లై పోయింది. తను ఫాస్ట్ గా స్టెప్స్ వేస్తుంటే అందుకోలేక పోయాడు.
  “నువ్వొట్టి యూజ్లెస్ రా” అంటూ వేణుగాణ్ణి పట్టుకునెళ్తుంటే వాణ్ణి చంపెయ్యాలనిపించింది.
  “బంటీ! ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు.” ప్రవీణ్ వచ్చాడు రూమ్ లోకి. వాడి పర్సనాలిటీ చూశో ఏమో.. వాణ్ణి లీడర్ చేశారు. ఇంక హాస్టల్లో అందరి బాగోగులూ తనవే అన్నట్లు, బిగ్ బ్రదర్ లా యాక్ట్ చేస్తుంటాడు.
  “ఈ మధ్య నీ గ్రేడ్స్ పడిపోయినట్లున్నాయి. ఎప్పుడూ ఏంటాలోచిస్తుంటావు?” అడిగాడు ప్రవీణ్.
  “నథింగ్ సీరియస్.. జస్ట్..” అంటూ బంటీ ప్రిన్సిపాల్ గదిలోకి నడిచాడు, గుండె దడదడలాడుతుండగా.
  “హలో బంటీ! హౌ ఆర్యూ?” నవ్వుతూ అడిగాడు వెంకట్. బల్ల మీద ఏవో పరీక్ష పేపర్లున్నాయి.
  “ఫైన్ సర్" బల్ల మీది పేపర్లు చూస్తూ అన్నాడు.
  “మొదట్లో సెవెంటీ పర్సెంట్ వచ్చిన ఫిజిక్స్ లో ఇప్పుడు ఫిఫ్టీస్ వస్తున్నాయి. అలాగే మిగిలిన సబ్జెక్ట్స్. అంత కాకపోయినా కొంత తగ్గాయి. ఎనీ ప్రాబ్లం?”
  “నో సర్.”
  “క్లాస్ లో లెసన్స్ అర్ధం అవటం లేదా?”
  “అవుతున్నాయి సర్. కొన్ని ప్రాబ్లంస్ వల్ల కాన్సంట్రేట్ చెయ్యలేకపోతున్నా.” గొతు వణుకుతోంది.
  “అదే చెప్పు. ఏం ప్రాబ్లంస్? కెనై హెల్ప్?
  “టీనేజ్ ప్రాబ్లం సర్. నాటేబుల్ టు కాన్సన్ట్రేట్.”
  “ఐ సీ.. లౌ ఫెయిల్యూరా?”
  తల అడ్డంగా తిప్పాడు బంటీ.
  “ఇవేళ మెడికల్ చెకప్ కి వెళ్దాం. సాయంత్రం నాలుగింటికి నా రూమ్ కి వచ్చెయ్యి.” అన్నాడు వెంకట్.
  అప్పటికి తప్పిందిరా బాబూ అనుకుంటూ క్లాస్ రూమ్ కి వెళ్లాడు. క్లాసులో ఫిజిక్స్ రివిజన్ అవుతోంది.
  మళ్లీ ఫిజిక్స్ బోర్. తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. బంటీ సీటు కిటికీ పక్కనే ఉంది. కిటికీ లోంచి కిందికి చూస్తే అమ్మాయిల బిల్డింగ్ కనిపిస్తుంది.
  సరిగ్గా ఫిజిక్స్ క్లాసప్పుడే అమ్మాయిలకి బ్రేక్ ఫాస్ట్ బ్రేక్. అందరూ మెస్ కి వెళ్తూ కనిపిస్తారు. రోజూ ఆ టైమ్ కి కిటికీలోంచి చూస్తుంటాడు బంటీ.
  బంటీ తన సీటు పెర్మనెంట్ గా ఫిక్స్ చేసుకున్నాడు.
  మిగిలిన పిల్లలు మాత్రం మార్చుకుంటుంటారు.
  “ఏంటి.. ఇవాళ ఎవరూ కనిపించట్లేదే! వాళ్లకి నో బ్రేక్ ఫాస్టా?” అనుకుంటూ పక్క నుంచి కిందికి చూస్తున్నాడు బంటీ. ఎప్పటికైనా ఉజ్జీ కనిపిస్తుందేమోనని ఆశ.
  “బంటీ!” సార్ గట్టిగా పిలుస్తున్నారు.
  “సర్..” ఒక్క సారి ఉలిక్కిపడి తల తిప్పాడు.
  “ఏంటి.. ముమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఎక్కువగా ఉన్నట్లుంది? రెండు సార్లడిగాను క్వశ్చన్. నిద్రావస్థలో ఉన్నావా?”
  “సారీ సర్. ప్రశ్న వినిపించలేదు.”
  “ఆరోగ్యం బాగాలేదా?”
  ఈ ఫిజిక్స్ సార్ వదిలే లాగ లేరే అనుకుంటూ.. “ఏం లేదు సార్. అయినా సాయంత్రం మెడికల్ చెకప్ కి వెళ్దామన్నీరు ప్రిన్సిపాల్ సార్.” కిటికీలోంచి చూస్తూ అన్నాడు బంటీ.
  “ఓకే. నోట్ డౌన్ దీజ్ క్వశ్చన్స్. రేపటికి ఆన్సర్స్ రాసుకుని రండి. నేనేం అడిగితే అది చెప్ప గలగాలి.”
  బంటీ నోట్ బుక్ తీశాడు. సార్ ఏదో చెప్తున్నారు. తనేదో రాస్తున్నాడు. ఇవేళ ఏంటీ.. అమ్మాయిలు ఏం తినరా? ‘ఇన్ని రోజుల్నుంచీ చూస్తుంటే ఉజ్జీ నాలుగు సార్లు కనిపించింది. మెస్ కి వేరే దారి ఉందేమో! హమ్మయ్య.. అమ్మాయిలు వస్తున్నారు. అదిగో.. ఆ పక్కగా ఒక్కతే వెళ్తోంది. ఉజ్జీ చేతిలో సెల్ ఫోన్. తీక్షణంగా చూస్తూ ఏవో నంబర్లు కొడ్తోంది. ఛా.. డాడీ సెల్ కొనిమ్మంటే ఇవ్వలేదు’ డాడీని విసుక్కున్నాడు.

  వెంకట్ డాక్టర్ రావుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. హాస్టల్స్ రెండింటికీ ఇద్దరు డాక్టర్లుంటారు. ఎవరికి ఏ కాస్త నొప్పి వచ్చినా వెంటనే తీసుకెళ్తుంటారు. సాధారణంగా ఇన్ఛార్జ్ సూపర్వైజర్లే చూసుకుంటారు.కానీ.. బంటీది మామూలుగా ఉండే అనారోగ్యంలాగ అనిపించలేదు వెంకట్ కి.
  ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎయిటీ ఫైవ్ పెర్సెంట్ వచ్చింది. ఫస్టియర్లో వారం రోజులు ఇంటికెళ్లొచ్చాక చదువు మీద బాగా శ్రద్ధ తగ్గింది. వీక్లీ, మంత్లీ రిపోర్టులు చూస్తే కొద్ది కొద్దిగా మార్కులు తగ్గి పోవడం కనిపించింది.
  అలాగే బరువు కూడా తగ్గుతున్నాడు. ఆర్నెల్లలో ఐదు కిలోలు తగ్గాడు. పిల్లలందరూ, పెరిగే వయసు కనుక ఇంటర్లో చేరినప్పట్నుంచీ బరువు పెరుగుతారు.
 బంటీ గురించి వెంకట్ కి దిగులు పట్టుకుంది. అవసరమైతే పేరెంట్స్ కి రిపోర్ట్ చెయ్యాలి. ఫిజిక్స్ ఐతే పాసవుతాడా అన్నది కూడా అనుమానమే. ఎవరి తోటీ సరిగ్గా కలవడు. ప్రవీణ్ ని అప్పుడప్పుడు వాచ్ చెయ్యమని చెప్పాడక్కడికీ. ఆ అబ్బాయికి మాత్రం టైమ్ ఉండద్దూ..సూపర్ వైజర్ కి చెప్పాలి, ప్రత్యేక శ్రద్ధ తీసుకొమ్మని.
  గడియారం నాలుగు సార్లు కొట్టింది. “ఏంటీ ఇంకా రాడు..” తనే హస్టల్ కి వెళ్దామనుకుంటుండగా వచ్చాడు బంటీ కాళ్లీడ్చుకుంటూ.
  ఒకసారి పరిశీలనగా బంటీ కేసి చూశాడు వెంకట్.
  మొహం అంతా పీక్కుపోయి, బుగ్గలు లోపలికి వెళ్లపోయున్నాయి. కళ్లు ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నాయి. ఇంకా ,షేవ్ చేసుకోవడం మొదలు పెట్టినట్లులేదు. అక్కడా అక్కడా అడ్డదిడ్డంగా గడ్డం కనిపిస్తోంది. బాల్యం పూర్తిగా వదల్లేదు. ఏంటో ఈ పిల్లాడి బాధలు.. నిట్టూరుస్తూ లేచాడు వెంకట్.
  “కమాన్" అంటూ కాలేజ్ వాన్ దగ్గరకి నడిచాడు. ఎమర్జెన్సీకి మారుతీ వాన్ ఉంటుందెప్పుడూ. అవరమైతే, వెనుక సీట్ తీసేస్తే అంబులెన్స్ లాగ పని చేస్తుంది.
  బంటీని పక్కన కూర్చో పెట్టుకుని డ్రైవ్ చేస్తూ అడిగాడు..”లంచ్ తిన్నావా? ఏం చేశారు ఐటమ్స్?”
  ఉలిక్కి పడి తిరిగాడు బంటీ. ఏంటి అడిగాడు సార్.. ఎందుకైనా మంచిదని అవునన్నట్లు తల ఊపాడు.
  “లంచ్ లో ఏం పెట్టారు? టేస్టీగా ఉన్నాయా?”
  అవును.. ఏం పెట్టారు? ఏదో ఒకటి చెప్తే పాలా.. “సాంబారు. ఆలు కర్రీ సార్. బాగున్నాయి.”
  జాలిగా బంటీకేసి చూశాడు వెంకట్.
  ఏదో సీరియస్ ప్రాబ్లమే. లంచ్ లో దోసకాయ పప్పు, బీన్స్ కూర చేశారు. వెంకట్ లంచ్ హాస్టల్లోనే. పిల్లలకి పెట్టేదే తింటాడు రోజూ.
  “మాథ్స్ లెసన్స్ ఫాలో అవుతున్నావా?” టాపిక్ మారుస్తే ఏమైనా రెస్పాన్స్ ఇస్తాడేమో!
  అమ్మో.. ఇప్పుడు మాథ్స్ లో క్వశ్చన్స్ అడుగుతారేమో. ఏం రివిజన్ చేస్తున్నారో! బుర్ర బద్దలుకొట్టుకున్నా గుర్తుకు రావట్లేదు.
  “ఫాలో అవుతున్నా సార్" దేవుడా ఏం అడక్కుండా చూడు. దేవుడు బంటీ మొర ఆలకించినట్లున్నాడు. డాక్టర్ గారి క్లినిక్ వచ్చింది.
  వెంకట్ వాన్ ప్రాక్ చేసి, ఫ్రెండ్ లాగా బంటీ భుజం మీద చెయ్యేసి క్లినిక్ లోకి తీసుకెళ్లాడు.
  క్లినిక్ లోకి అడుగు పెడ్తూనే డెటాల్ వాసన, స్పిరిట్ వాసన కలగాపులగంగా వస్తోంది. కడుపులో తిప్పినట్లయి, బంటీ తల పట్టుకుని తలుపు దగ్గరే పడిపోయాడు.

  ఉజ్వల వార్డెన్ మేడమ్ తలుపు దగ్గర తచ్చాడుతోంది. సాయంత్రం నాలుగయింది. ఎలాగైనా పెద్ద బజారుకి వెళ్లాలి. ఏం స్టోరీ చెప్దామా అని ఆలోచిస్తోంది.
  “హూ ఈజిట్? ప్లీజ్ కమ్.” వార్డెన్ పిలిచింది.
  ఉజ్వల మెల్లిగా తలుపు తీసుకుని లోపలికి వెళ్లింది. లక్ష్మీ మేమ్.. కల్లజోడు లోంచి చూస్తూ “యస్!” అన్నారు.
  “మేమ్, ఒకసారి షాపింగ్ కి వెళ్లొస్తా అర్జంట్.”
  “ఎగ్జామ్స్ దగ్గరకొస్తుంటే ఇప్పుడు షాపింగేంటి?” లక్ష్మి ఉజ్వలని చూడగానే గుర్తుపట్టింది.
  ఒక నెల నుంచీ ఈ అమ్మాయి ప్రోగ్రెస్ తగ్గింది. తనే పిలిచి మాట్లాడు దామనుకుంటోంది.
  “ప్రైవేట్ ఐటమ్స్ కొనుక్కోవాలి మేడమ్.” ఈవిడ ఎంతసేపు సుత్తి కొడుతుందో! ఎయిర్ టెల్ ఆఫీసు మూసేస్తారు.. మనసులో విసుక్కుంది.
  “అన్నీ మన హాస్ల్ మెస్ లో దొరుకుతాయి కదా!”
  “నా సైజ్ లేవు మేమ్. ఒక గంటలో వచ్చేస్తా.”
  ఉజ్వలని ఎగాదిగా చూసింది లక్ష్మి. ఈ సిటీ అమ్మాయిలతో వద్దంటే పెద్ద చిక్కు.
  “సరే. మీ రూమ్మేట్ ని తోడుగా తీసుకెళ్లు.””థాంక్యూ మేమ్.” ఒక్కంగలో బైట పడింది. ఆ జిడ్డు మంజులని తోడు తీసుకెల్లడమా! ఫినిష్. మళ్లీ లెసన్స్ పీకుతుంది. లక్కీగా, వార్డెన్ గది వెనుకే ఉంది గేటు. పరుగెత్తుకుంటూ బయల్దేరబోతున్న బస్ లో పడింది. ఈ బస్ మిస్సైతే ఇంకో గంటక్కానీ లేదు. ఎలాగైనా ఎయిర్ టెల్ ఆఫీసు మూసే లోపు చేరుకోవాలి. ఈ లోగా పెద్దబజార్లో చిన్న పనుంది.
  ఉజ్వల పెద్ద బజార్లో బస్ దిగి రోల్డ్ గోల్డ్ నగల దుకాణంలోకి వెళ్లింది. అచ్చు తన మెళ్లో ఉన్న గొలుసు లాంటిదే ఐదొందలు పెట్టి కొంది. మమ్మీకి తెలియకుండా డాడీ, లక్కీగా ఒక థౌజండ్ ఇచ్చారు, ఎమర్జెన్సీకి ఉంచుకోమని. అక్కడి నుంచి మార్వాడీ షాపుకి వెళ్లింది. తన మెళ్లో గొలుసు తీసి ఎంత ఇస్తాడో చెప్పమంది.
  మార్వాడీ గొలుసు పరీక్షించి, “ఇరవై గ్రాములుంది బేటీ. ఐదు గ్రాములు తరుగు పోగా, పాత బంగారం రేటుకి తొమ్మిది వేలొస్తుంది.” అన్నాడు.
  “హాయ్.. నైన్ థౌజండే! జాక్ పాట్ కొట్టేశా” అనుకుంటూవెంటనే రోల్డ్ గోల్డ్ గొలుసు మెళ్లో వేసుకుని, పధ్నాలుగు వేలు ఖరీదు చేసే గొలుసుని తొమ్మిది వేలకి అమ్మేసి బయటికొచ్చింది. ఐదింటికి ఎయిర్ టెల్ ఆఫీస్ మూసేస్తారు. ఇంక పది నిముషాలే ఉంది. పరుగు పరుగున ఫర్లాంగు దూరంలో ఉన్న ఆఫీస్ కి చేరుకుంది.
  సెల్ఫోన్, అక్కడున్న సేల్స్ అమ్మాయికిచ్చింది.
  “లాంగ్ టెర్మ్ కార్డివ్వండి. ఎంతైనా ఫరవాలేదు.”
  “ప్లీజ్ సిడ్డౌన్. ఎన్ని రకాల ప్లాన్లున్నాయో చెప్తాను.” సేల్స్ గర్ల్ గొంతు సవరించుకుంది.
  “అవన్నీ నాకు తెలుసు. వన్ ఇయర్ అన్ లిమిటెడ్ కార్డివ్వండి.” సందు దొరికితే చాలు, సుత్తి వెయ్యడానికి తయారందరూ. అసలే మధ్యాన్నం నించీ ఒక్క మెస్సేజ్ కూడా ఇవ్వలేదు. ఉజ్వలకి చాలా అసహనంగా ఉంది. త్వరగా కార్డ్ వేసేస్తే ఫాస్ట్ ఫాస్ట్ గా నాలుగు మెస్సేజ్ లిచ్చేయాలి.
  బస్టాప్ లో నిల్చుని దీక్షగా మేస్సేజ్ ఇస్తోంది ఉజ్వల.
  ఎవరో తనకేసి చూస్తున్నట్లనిపించింది. తల పైకెత్తి చూసింది.
  ఎదురుగా డా. రావ్ క్లినిక్ దగ్గర నిల్చుని ఉజ్వలకేసి చూస్తున్నారు, ప్రిన్సిపాల్ వెంకట్.*

 ‘ఎదురుగా ఉన్న ఎయిర్ టెల్ ఆఫీస్ లోంచి వస్తున్న అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే! తన స్టూడెంట్ అయుంటుంది. డే స్కాలరేమో. అందుకే గుర్తుపట్టలేక పోతున్నాను’ డాక్టర్ రావ్ క్లినిక్ దగ్గర బయట నించున్న వెంకట్ ఆలోచిస్తున్నాడు.
  “సర్! డాక్టర్ పిలుస్తున్నారు” రిసెప్షనిస్ట్ పిలుపు విని మరోసారి ఉజ్వల కేసి చూస్తూ లోపలికెళ్లాడు.
  బంటీ డాక్టర్ గారి పక్కనున్న స్టూల్ మీద తల దించుకుని కూర్చున్నాడు. వెంకట్ ని చూసి కూర్చోమని రిపోర్ట్ కింద పెట్టారు డాక్టర్ రావ్.
  “హిమోగ్లోబిన్ కొంచెం తక్కువగా ఉంది. అంతే కానీ ఇంకేం కనిపించడం లేదు. అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రేపు వస్తుంది. ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్లుగా నాకేం కన్పించడం లేదు. చాలా మంది పిల్లలాగా పరీక్షలంటే భయమేమో!”
  “హెల్త్ ప్రాబ్లమ్ లేకపోతే ఫరవాలేదు. నేను వాళ్ల పాదర్ తో మాట్లాడ్తాను. దేనికో బాధ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా తినడం లేదనుకుంటాను.”
  “సైకలాజికల్ గా ఏదో అప్సెట్ అయినట్లున్నాడు. ఏదైనా ప్రేమ వ్యవహారమేమో ఏం అడిగినా చెప్పడం లేదు. ఒకసారి క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుధకి చూపించండి.అప్పటి వరకూ ఎవరిగురించో మాట్లాడుకుంటున్నట్లుగా ఏదో లోకంలో ఉన్న బంటీ ప్రేమ అనగానే ఉలిక్కి పడి తలెత్తాడు. బంటీని పరిశీలనగా చూస్తూ డాక్టర్ తో మాట్లాడుతున్న వెంకట్ దృష్టిలో అది పడింది.
  “సరే! మీరొకసారి చెప్పండి పోన్లో. నేను తీసుకెళ్తాను.” డాక్టర్ రావ్ ఫోన్ తీసుకోగానే, బంటీని తీసుకుని క్లినిక్ బైటికొచ్చాడు వెంకట్.
  వ్యాన్ తలుపు తీసి బంటీని ఎక్క మందామని తిరుగుతుండగానే, “ఉజ్జీ! అంటూ, బంటీ బస్టాప్ దగ్గరకి పరుగెత్తాడు. వెంకట్ తలుపు మూసి ఆశ్చర్యంగా పక్కకి చూశాడు. ఇందాక ఎయిర్టెల్ ఆఫీసులోంచి బైటికొచ్చినమ్మాయి. బస్చాప్ లో నించునుంది.
  అప్పటి వరకూ నీరసంగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న బంటీకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో! రెండు చేతులూ కట్టుకుని వాన్ దగ్గర సాలోచనగా చూస్తూ నిలుచున్నాడు వెంకట్.
  ఉజ్వల పక్కకి తిరిగింది. “అసలే ప్రిన్సిపాల్ చూశారు. గుర్తు పట్టారో ఏంటో అని కంగారుగా ఉంటే, ఈ బస్ ఎప్పటికీ రాదు.. దేవుడా! మళ్లీ ప్రిన్సిపాల్ వచ్చేలోగా బస్ పంపించు” కళ్లు మూసుకుని దేవుడ్ని వేడుకుంటున్న ఉజ్వలకి ఎవరో పిలిచినట్లయింది. పక్కకి తిరిగిన ఉజ్వల, రొప్పుతూ వస్తున్న బంటీని చూసింది.
  “నువ్వేంటిక్కడ.. ఎక్కడ్నుంచొస్తున్నావురా?” ఆశ్చర్యంగా అడుగుతున్న ఉజ్వల, వాన్ దగ్గర నిలబడి తమనే చూస్తున్న వెంకట్ ని చూసింది.
   ఒక్క సారిగా ఇద్దరూ అలా ఎదురు పడేప్పటికి ఏం చెయ్యాలో తోచలేదు. ఏదైతే అదయిందిలే అని ప్రిన్సిపాల్ దగ్గరకే నడిచింది. వెనకాలే బంటీ..
  “గుడ్ ఈవెనింగ్ సార్!” వెంకట్ ని విష్ చేసింది.అమ్మాయిల హాస్టల్ ని లక్ష్మి సూపర్ వైజ్ చేస్తుంది. ఏదైనా ప్రత్యేకమైన సమస్య వస్తే తప్ప వెంకట్ పట్టించుకోడు. అందుకే గుర్తు పట్టలేకపోయాడు.
  “ఉజ్వల సార్! మేం ఇద్దరం కెజీ నుంచీ క్లాస్ మేట్సుం” బంటీ పరిచయం చేశడు.
  వెంకట్ తల పంకించి ఇద్దర్నీ మార్చి మార్చి చూడ సాగాడు. ప్రిన్సిపాల్ ఏదైనా అడుగుతే బాగుండును. అలా స్టేర్ చేస్తుంటే ఏం మాట్లాడాలి? ఉజ్వలకి తను కార్నర్ ఐపోయినట్లుగా అనిపించ సాగింది.
  “నాకు హెల్త్ బాగా లేదని డాక్టర్ దగ్గరకి తీసుకొచ్చారు సార్" బంటీకి ఉజ్వలని చూడగానే వేయి ఎనుగుల బలం వచ్చినట్లయింది. మాట, చూపు అన్నీ మారి పోయాయి. శూన్య దృక్కులు, నిరాసక్తత అన్నీ పోయాయి.
  “అరే ఏమైంది? జ్వరమా? అంకుల్ కి చెప్పావా?” చెయ్యి బంటీ నుదుటికి ఆనించింది.
  “ఏం లేదు, కాస్త నీరసంగా ఉంటే సార్ కంగారుపడి తీసుకొచ్చారు. ఐ యామ్ ఆల్ రైట్.” వెంకట్ అక్కడున్న సంగతే మర్చిపోయి, ఉజ్వల కేసి  తిరిగి మాట్లాడుతున్నాడు బంటీ.

  ఉజ్వల చెయ్యి లాక్కుని కాస్త దూరంగా వెళ్లింది. వెంకట్ సమక్షంలో చాలా ఇబ్బందిగా ఉంది. తన గురించి ఏం అడగరే.. ఏం చెప్పాలి?
  “ఉజ్జీ! నువ్విక్కడేం చేస్తున్నావు?” బంటీ అడగనే అడిగాడు.
  ఏం చెప్పాలి? ఎయిర్టెల్ నుంచి వస్తుంటే సార్ చూడనే చూశారు. ఒకే స్టోరీ మీద నిలబడాలి.
  “మమ్మీకి ఒంట్లో బాగోలేదు. సెల్ కార్డ్ ఐపోయింది. కార్డ్ వేయించుకునొస్తున్నాను సార్!”
 “సరే పద్. మేం హాస్టల్ కే కదా వెళ్తున్నాం.” ఉజ్జీనికూడా వేన్ లోకి ఎక్కమన్నాడు వెంకట్.
  “బంటీ! కెన్ యు డు మి ఎ ఫేవర్?” వెంకట్ పక్కన కూర్చున్న బంటీ భయం భయంగా చూశాడు.
  “ఇదిగో సెల్. ఇందులో డాక్టర్ రావ్ నంబర్ ఉంటుంది. కాల్ చేసి, డాక్టర్ సుధ దగ్గరకి ఇప్పుడు వెళ్లటం లేదు. ప్లీజ్ కాన్సిల్ ద అపాయింట్ మెంట్ అని చెప్పు.”
  సెల్ తీసుకుని పోన్ చేసి అలాగే చెప్పాడు బంటీ.
  “సార్! మనం సైకాలజిస్ట్ దగ్గరకి వెళ్లట్లేదా?”
  “అంతవసరం ఉందంటావా? నాకైతే అక్కర్లేదనిపిస్తోంది.” అద్దంలోంచి, వెనకాల కూర్చున్న ఉజ్వలని చూస్తూ అన్నాడు వెంకట్.
  “నాకు ఫస్ట్ నుంచీ ఇష్టంలేదు సార్. మీరు తీసుకెళ్తారేమోనని భయపడ్డాను.” ఉత్సాహంగా అన్నాడు.
  అయోమయంగా చూస్తున్న ఉజ్వలతో అన్నాడు వెంకట్, “ఏం లేదమ్మా. మీ ఫ్రెండ్ తినడం, చదవడం అన్నీ తగ్గించేశాడు. నేను వర్రీ అయిపోయి ఫిజీషియన్ దగ్గరకి తీసుకొస్తే, ఆయన సైకాలజిస్ట్ కి రిఫర్ చేశారు. వాటీజ్ యువర్ ఒపీనియన్?”
  “ఏంలేదు సార్.వాడికి యమ్. పిసిలో చేరడం ఇష్టం లేదు. వాళ్ల మమ్మీ కోసమని చేరాడు. అందులో ఫిజిక్స్ అంటే చచ్చే ఫియర్.” ఉజ్వల ఉత్సాహంగా తమ చిన్నప్పటి సంగతులన్నీ చెప్పుకొచ్చింది.
  “ఐతే, నువ్వు ఫాదర్ లో చేరుతున్నావని బంటీ కూడా ఇక్కడ చేరాడన్నమాట.”
  “అంతే సార్.” అంటున్న ఉజ్వలని మింగేసేలా చూశాడు బంటీ.

  ఉజ్వలని వాళ్ల బిల్డింగ్ దగ్గర దింపి, బంటీని తీసుకుని బాయిస్ బిల్డింగ్ కి వచ్చాడు వెంకట్. ఉజ్వల వార్డెన్ మేమ్ పర్మిషన్ తీసుకుని వచ్చానని చెప్పగానే పట్టించు కోకుండా వదిలేశాడు. లక్ష్మి చూసుకుంటుంది, అంతగా అలార్మింగ్ గా ఉంటే అప్పుడు చూసుకోవచ్చనుకున్నాడు. అప్పుడే ఉజ్వలతో వెళ్లి కనుక్కుంటే వేరుగా ఉండేదేమో!
  “బంటీ, రేపట్నుంచీ ఫిజిక్స్ క్లాసెస్ నీకు సెపరేట్ గా చెప్పమని చెప్తాను. సాయంత్రం ఒక గంట ఫిజిక్స్ సార్ దగ్గరకెళ్లు. అదయ్యాక నా రూమ్ కి రా. మాథ్స్ లో ఎలా ఉన్నావో చూస్తాను. లంచ్ కి నాటేబుల్ దగ్గర కూర్చో. ఇద్దరం కలిసి తిందాం. ఓకే!” తన గదిలోకి వెళ్తూ బంటీకి ఆదేశాలిచ్చి పంపించేశాడు వెంకట్.
  బంటీది, ఉజ్వలదీ ఫైల్స్ తీశాడు. ఉజ్వల చెప్పినట్లుగానే ఇద్దరూ ఒకే స్కూల్ లో చదివారు. బంటీకి, ఇంగ్లీష్ లోనూ, హిస్టరీలోనూ స్కూల్ ఫస్ట్ వచ్చింది. సైన్స్, మాథ్స్ ఫరవాలేదు. అంత కంటే తక్కువ మార్సులు వచ్చిన వాళ్లు కూడా ఫాదర్ లో చేరాక బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఆ పాటి తెలివితేటలుంటే, తమ ఇన్స్టిట్యూట్ లో చేరాక ఢోకా ఉండదు.
  బంటీ లాంటి వాళ్లని ఆర్ట్స్ లో చేర్పిస్తే అభివృద్ధిలోకి వస్తారు. ఏమిటో ఈ పేరెంట్స్ వెర్రి. రోజుకొకసారైనా అలా అనుకుంటాడు వెంకట్. సైన్స్ గ్రూప్ తీసుకుని తమ కాలేజ్ కి వస్తే తమకే లాభం. కానీ పిల్లల అభిరుచి కూడా చూడాలి కదా! ఇదొకటే బంటీ స్తబ్ధతకి కారణమైతే ఎలాగో మానేజ్ చెయ్యగలుగుతాడు.
  ఉజ్వల ఫైల్ మామూలుగా అందరి పిల్లల్లాగానే ఉంది. అన్నింటిలోనూ అబౌవ్ యావరేజ్. ఫరవాలేదు. ఏదో కాలేజ్ లో మామూలు సీట్ వస్తుంది.
  “అరె..” అనుకోకుండా అతని దృష్టిని ఆకర్షించింది ఆ నెల రిపోర్ట్. అన్ని సబ్జెక్ట్స్ లో మార్కులు తగ్గి పోయాయి. లక్ష్మి తన నోటీస్ కి ఎందుకు తీసుకు రాలేదో! మరీ అంత తేడా లేదుగానీ, దృష్టిలో పెట్టుకోవలసిన విషయమే.
  “ఇంకొక వారం చూసి బంటీ పేరెంట్స్ ని పిలవాలి” అనుకుంటూ కంప్యూటర్ దగ్గరికి వెళ్లి అందరి రిపోర్ట్సూ తిరగేశాడు.
  గౌరి రిపోర్ట్ చూడగానే అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది వెంకట్ కి. ఆ అమ్మాయి చేరినప్పట్నుంచీ ఏ సబ్జెక్ట్ లోనూ నైన్టీ నైన్ కి తగ్గలేదు. అధిక భాగం నూరు శాతం. ఇంటర్ ఫస్టియర్ లో కూడా కాలేజ్ ఫస్ట్. ఆలిండియా ఎంట్రెన్స్ లో కూడా సీట్ రావచ్చు. ఎక్కువ సమయం లైబ్రరీలో ఎప్పుడూ రాసుకుంటూ కనిపిస్తుంది. మామూలు ట్యుటోరియల్స్ కి రాకపోయినా ఎవరూ కంప్లైంట్ చెయ్యరు. అందరికీ తెలుసు, గౌరి సిలబస్ కి మించి చదువుతుంటుందని. వాళ్లింటి వెళ్లి ఆ అమ్మాయిని ఒప్పించడం మరపురాని అనుభవం వెంకట్ కి.
  ఆదిత్య దెబ్బ తగిలినా కూడా బాగా ఇంప్రూవ్ అయాడు. ఫస్టియర్లో తక్కువ మార్కులు వచ్చినా బెటర్ మెంట్ లో లాగించాడు. బాయ్స్ లో అతనే టాప్.
  అప్పుడప్పుడు ఆదిత్యనీ, గౌరినీ లైబ్రరీలో చూస్తుంటాడు. వాళ్లిద్దరూ ఒకే బల్ల దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటే, వెనుక నించి వెళ్లి చూశాడు. ఇద్దరూ సబ్జెక్ట్ గురించి సీరియస్ గా డిస్కజ్ చేసుకుంటున్నారు.
  తను వెనకాల ఉన్నట్లు కూడా తెలియదు వాళ్లకి. నిశ్శబ్దంగా బైటికి వచ్చేశాడు.
  ఆదిత్యతో మాట్లాడుతూ ఉండడంతో గౌరి ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అయింది.

  “ఉజ్వలా! ఆగు నేనూ వస్తాను.” మంజుల పిలుపు విని, ‘ఇదెందుకు, న్యూసెన్స్.. ప్రతీదీ ఆరాలు తీసుకుంటూ’ .. సాధ్యమైనంత వరకూ మొహం మామూలుగా పెట్టటానికి ప్రయత్నిస్తూ, అసహనంగా ఆగింది.
  “వన్ సెక్ండ్..” చేతులు కడుక్కునొచ్చి, “పద” అంది.
  “ఎందుకీ మధ్య రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ అయ్యాక, హాస్టల్ రూమ్ కి వెళ్లి వస్తున్నావు క్లాస్ కి? ఒంట్లో బాగుండటం లేదా?” అడిగింది మంజుల.
  “ఒంట్లోకేం.. బానే ఉంది. మమ్మీకి బాలేదని చెప్పా కదా! ఏమైనా మెస్సేజ్ లుంటాయేమోనని వెళ్తుంటాను.” అతికినట్లుగా అబద్ధం చేప్తూ గది తలుపులు తీసింది ఉజ్వల.
  ‘ఫాదర్’ లో సెల్ ఫోన్లు క్లాస్ రూమ్ కి తీసుకురాకూడదని స్ట్రిట్ రూల్. వారం క్రితం వరకూ బానే ఉండేది. సరిగ్గా ఇప్పుడే.. క్రిటికల్ టైమ్ లో.. మంజుల లాంటి వాళ్లు మోసేసుంటారు, సీక్రెట్ గా సెల్ వాడుతున్నాం అని. పళ్ల బిగువున తిట్టుకుంటూ, అల్మారాలో సెల్ ఫోన్ తీసి చూసి నిరాశగా పెట్టేయ బోయింది.
  “కుయ్.. కుయ్..” సన్నగా కూసింది సెల్ ఫోన్.
  “ఏం ఉంటుందిలే.. సుత్తి అడ్వర్టైజ్ మెంట్లు.” నిరాసక్తంగా మెస్సేజ్ చూసిన ఉజ్వల, ఒక్క సారి ‘హుర్రే..’ అంటూ ఎగిరి గంతేసింది.
  పుస్తకాలు సర్దుకుంటున్న మంజుల వెనక్కి తిరిగింది.
  “ఏమైంది? హాపీ న్యూసా?”
  కళ్లు చిట్లిస్తూ నెత్తి మీద కొట్టుకుంది ఉజ్వల, దీని సంగతి మర్చిపోయా అనుకుంటూ. ఏదో ఒకటి చెప్పాలి కదా!
  “మమ్మీకి ఇప్పుడు బాగుందిట. ఎలాగైనా నన్ను చూడాలని బెంగగా ఉందిట. మూడ్రోజులైనా ఉండేలాగ రమ్మని డాడీ మెస్సేజ్. ఏం టెయ్యాలో..” సెల్లో మెస్సేజ్ చదువుతూ అంది ఉజ్వల. శుక్ర, శనివారాలు హైద్రాబాద్ లో ఉండాలని రాసుందందులో.
  “మీ డాడీని ప్రిన్సిపాల్ తో మాట్లాడమను. పంపుతారేమో..” మంజుల ఉపాయం చెప్పింది.
  “ఇంపాజిబుల్. ఇక్కడ చేరే ముందే చెప్పారు, అలా పంపమని. పైగా ఇప్పుడు ఎగ్జామ్స్. ఒకటే దారి. నేను బస్సెక్కి వెళ్లిపోయి, అక్కడ్నుంచి ఫోన్ చేస్తాను, ఎమర్జెన్సీ అని. నువ్వు మేమ్ కి చెప్పి ఎలాగో కన్విన్స్ చెయ్యి.” మంజులని బ్రతిమిలాడింది.
  ఉజ్వల ఎప్పుడో నిర్ణయించుకుంది. ఆదిత్యతో ముఖాముఖీకి సెలెక్టయితే ఎలాగో వెల్లిపోవాలని, తరువాత సంగతి తర్వాత. అంత పెద్ద హీరోతో, ఎదురుగా నించుని మాట్లాడటమంటే మాటలా? లైఫ్ లో ఒకే సారి వచ్చే ఛాన్స్. వదలదు గాక వదలదు.
  “క్లాస్ కి వెళ్దాం వస్తావా?” మంజుల మాటలకి ఈ లోకంలోకి వచ్చింది ఉజ్వల.
  “నువ్వెళ్లు. నేను ఫైవ్ మినిట్స్ లో వస్తా.”
  అదోలా చూస్తూ మంజుల వెళ్లిపోయింది.
  హమ్మయ్య. గుడ్ రిడెన్స్. తలుపు మూసేసి, సంతోషం పట్టలేక, కాసేపు పిచ్చిపిచ్చిగా గెంతింది. మంచం మీద పడుక్కుంది. స్ప్రింగ్ లా లేచి డాన్స్ చేసింది. ఛా! తన సంతోషాన్ని పంచుకోడానికి ఎవ్వరూ లేరు. బంటీగాడికి చెప్తే! వాళ్ల హాస్టల్ కి దారి లేదు.. ఐడియా! ఊర్మిళకి మెస్సేజ్ పెట్టింది, రాత్రికి ఫోన్ చెయ్యమని.
  ఫిబ్రవరి ఆరో తారీఖు. సోమవారం.
  వెంకట్ ఆందోళనగా పచార్లు చేస్తున్నాడు తన గదిలో. అసలు పొద్దుట్నించీ చికాకుగా ఉంది. సూర్యోదయం సమయానికి పొగమంచు కమ్మేసి, మామూలుగా ఆ రోజుకి స్వాగతం పలికే కిరణాలు గదిలోకి రాలేదు.
  పది రోజుల్నుంచీ బంటీ ప్రోగ్రెస్ స్టడీ చేస్తున్నాడు. ప్రస్తుతం అతనిదే క్రిటికల్ కేసు. ఏదైనా సులభంగా అర్ధం చేసుకుంటున్నాడు కానీ, పరీక్షల్లో కాగితం మీద పెట్టలేకపోతున్నాడు. పగలైతే దగ్గరుండి తినిపిస్తున్నాడు కానీ, రాత్రి ఏం తింటున్నాడో మరి.. బరువు కొంచెంకూడా పెరగలేదు. పరధ్యానం తగ్గలేదని లెక్చరర్స్ అంటున్నారు. లాభం లేదు.. ఏదో యాక్షన్ తీసుకోవాలి.
  పేరెంట్స్ ని కాంటాక్ట్ చేద్దామంటే వాళ్లిచ్చిన నంబర్ ఎవరూ ఆన్సర్ చెయ్యడం లేదు. ఆఫీస్ అసిస్టెంట్ ని పిలిచి, లెటర్ డిక్టేట్ చేసి, వెంటనే పంపించమన్నాడు. అది అందుతే శనివారం లోపు బంటీ పేరెంట్స్ రావాలి. ఈ సారినుంచీ అందర్నీ కనీసం రెండు కాంటాక్ట్ నంబర్లిమ్మనాలి.
  సాధారణంగా ఫిబ్రవరి నెలంతా ప్రతీ రెసిడెన్షియల్ కాలేజ్ కీ కీలకమైన రోజులు. ఫాదర్ లో ఐతే ప్రతీరోజూ ప్రోగ్రెస్ గమనిస్తారు.
  ఎందుకైనా మంచిదని ఉజ్వల రిపోర్ట్ చూశాడు. ఫరవాలేదే.. క్రిందటి వారం కాస్త పుంచుకుంది. అప్వర్డ్ ట్రెండ్ ఉంటే ఎంత తక్కువ తేడా ఉన్నా మంచి ఫలితం ఉన్నట్లే. ఇంక వర్రీ అవక్కర్లేదనుకుంటూ, స్క్రోల్ చేశాడు. అమ్మాయిల్లో గౌరి తర్వాత సుష్మ బాగా చదువుతుంది. ఇంజనీరింగ్ బాచ్ లో మంజుల. మంజుల రూమ్మేట్ ఉజ్వల. మంజులని పిలిచి, ఉజ్వల గురించి మాట్లాడాలి. వెంకట్ గుర్తు పెట్టుకున్నాడు.
  “గుడ్ మార్నింగ్ సర్!” వైస్ ప్రిన్సిపాల్ శంకర్.
  “సెకండ్ ఇయర్ యమ్.పిసి లో ఫిజిక్స్ లెక్చరర్ రాలేదు. ఏం చెయ్యమంటారు సర్?”
  “సెకండ్ ఇయర్ ఫిజిక్సా? ఏ పీరియడ్?”
  “సెకండ్ పీరియడ్.” వెంకట్ కి అనుకోని అవకాశం వచ్చినట్లయింది.
  “నేనే వెళ్తాను. మీరు ఇక్కడ చూసుకోండి. ఒక సారి ప్రోగ్రెస్ లు ఎనలైజ్ చెయ్యండి.” అంటూ వెంకట్ కంప్యూటర్ ముందు నుంచి లేచాడు.
  పట్టేసిన కాళ్లు, చేతులు సాగదీసుకుంటూ లోపలికి వెళ్లి ముఖం కడుక్కుని వచ్చాడు. ఆ రోజు పొద్దున్న ఐదింటికల్లా కాలేజ్ లో ఉన్నాడు. ఫిబ్రవరీ, మార్చ్ నెలలు అలాగే ఉంటాయి. ఎమ్సెట్ అయ్యాక, సెకండ్ ఇయర్ క్లాసులు మొదలయ్యేలోపు పదిహేను రోజులు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. క్లాస్ కి వెళ్ల బోతుండగా ఫోన్ మోగింది. నంబర్ చూశాడు.. చంద్రశేఖరం గారు.
  “వెంకట్! అంతా నార్మల్ గా ఉందా?”
  వెంకట్ ఆలోచించాడు. బంటీ విషయం అతన్ని బగ్ చేస్తూనే ఉంది. “ఫర్లేదు సర్, నార్మలే..” ఫోన్ పెట్టెయ్య బోతూ అంతలోనే మనసు మార్చుకున్నాడు.
  “మీరు వచ్చే వారం ఒకసారి ఇక్కడకు రాగలరా?”
  “ఏం” అర్జంటా?” చంద్రశేఖరం అడిగాడు.
  “అర్జంటేం కాదు.. ఒక సారి వస్తే మంచిదని.”   “ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్ రిజైన్ చేశాడు. కొత్త వాళ్లని పెట్టాలి. దానికి ఇంటర్వ్యూలవుతున్నాయి. బుధవారం వస్తా.”
  “సరే సర్.” వెంకట్ ఫోన్ పెట్టేసి నిట్టూర్చాడు. ఒక కాలేజ్ కే తనకి వాచిపోతోంది. అన్ని కాలేజ్ లు చూసుకోవాలంటే..*

  “గుడ్ మార్నింగ్ సర్.” సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సంభ్రమంగా అన్నారు నించుని.
  ఆ రోజు సంస్కృతం సార్ గొడవయ్యాక, వెంకట్ మళ్లీ వాళ్ల క్లాస్ కి వెళ్లలేదు. అంతా సవ్యంగా జరిగి పోతుంటే కల్పించుకోడతను.
  క్లాసంతా కలియ జూస్తూ అడిగాడు, “అంతా బాగా ఉందా? ఏ ప్రాబ్లంస్ లేవు కదా?”
  “లేవు సార్.” ఆదిత్య లేచి నించుని అన్నాడు. ఆదిత్య, ప్రెండ్స్ ఐదుగురూ ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నారు.
  బంటీ కిటికీ పక్కన కూర్చున్నాడు, తల దించుకుని. ‘కిందికి చూట్టానికి లేకుండా ఈ సార్ వచ్చారేంటి? ఉజ్జీని చూసి వారం అయింది. ఈ రోజైనా కనిపిస్తుందనుకుంటే.. చూట్టానికే లేదు.’ బంటీ మనసులో తిట్టుకున్నాడు.
  “బంటీ! ఏంటంటున్నావు?” వెంకట్ బంటీని లేపాడు.
  “ఏం అనలేదు సార్” పక్కచూపులు చూస్తూ అన్నాడు. బంటీ కిటికీలోంచి కిందికి చూడ్డానికి ప్రయత్నించడం వెంకట్ గమనిస్తూనే ఉన్నాడు.
  “నువ్వు రేపట్నుంచీ ఆదిత్య వాళ్ల బెంచ్ లో కూర్చో.”
  “అలాగే సార్.” బంటీ నిస్త్రాణగా తన సీట్లో కూలబడ్డాడు.
  “సార్!” ఆణూ లేచాడు, “మాకు ఫిబ్వరి ఫోర్టీన్త్ హాలిడే కావాలి సర్.”
  “ఎందుకు, ఏం పండగ?”
  “మాపండగ సార్.”
  “వాట్?”
  “వాలంటైన్స్ డే.”

  చివాలున తలెత్తాడు బంటీ. “వాలెంటైన్స్ డే” వచ్చేస్తోంది. ఆ లోపునే ఎలాగైనా ఉజ్జీకి తన ప్రేమ సంగతి చెప్పెయ్యాలి. లేదా.. ఆ రోజు పెద్ద బొకే తీసుకుని వెళ్లి, చేతికిచ్చి చెప్పాలి. ఈ సమయంలో చెప్పలేకపోయాడా.. ఇంక జీవితంలో ఎప్పటికీ చెప్పలేడు.
  “బంటీ, బంటీ!” ఎవరో, ఎక్కడో పిలుస్తున్నారు.
  ప్రవీణ్ ఒక్క సారి బంటీని కుదిపాడు. కామన్ హాల్లో అందరూ కూర్చుని చదువుకుంటున్నారు. కాలెండర్ కేసి చూస్తున్న బంటీ ఒక్క సారి ఉలిక్కిపడి, ప్రవీణ్ ని చూశాడు.
  “ఏంట్రా? ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యి. రేపు సార్ అడుగుతారు.”
  ప్రవీణ్ ఇచ్చిన కాగితం చూశాడు.
  అంతా గజిబిజిగా ఉంది. ‘ఇది ఏ సబ్జెక్ట్.. అడిగితే ప్రవీణ్ వెళ్లి ప్రిన్సిపాల్ కి చెప్తాడు. వీడో ఏజంట్.’ బంటీకి ప్రవీణ్ ని షూట్ చెయ్యాలనిపించింది.
  “అలాగే చేస్తాను.” కాసేపు ఉజ్వలని పక్కన పెట్టి ప్రాబ్లంపై దృష్టి పెట్టాడు. ఆ లెక్క ఏటాపిక్కో తెలియడానికి కాసేపు పట్టింది. తర్వాత దానికి సంబంధించిన పుస్తకం తీసి, సాల్వ్ చెయ్యడానికి ఓ గంట తీసుకున్నాడు.
  ‘పోన్లే, ఎలాగైనా చేశాడు కదా’ అనుకున్నాడు ప్రవీణ్. అందరూ అదే ప్రాబ్లమ్ ఐదు నిముషాల్లో చేస్తున్నారు.
  బంటీ మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు.
  బొకేలు ఎక్కడ దొరుకుతాయో! హైద్రాబాద్ లో ఐతే ఫైవ్ మినిట్స్ జాబ్. బస్టాప్, కాలేజ్ తప్ప ఈ ఊళ్లో ఏం తెలీదు. ఎక్కడని వెతకాలి?
  ఆదిత్య ఈ ఊరివాడే కదా! అడిగి చూద్దాం అనుకున్నాడు. రెండ్రోజుల్నుంచీ ఒకే బెంచ్ మీద కూర్చుంటుండడంతో కాస్త పరిచయం ఏర్పడింది. కానీ ఎలా అడగాలి? ఏడిపిస్తాడేమో.. హూ కేర్స్?
  “ఆదీ! నాకో హెల్ప్ చేస్తావా?”
  సీరియస్ గా ఆల్జీబ్రా ప్రాబ్లంస్ చేస్తున్న ఆది ఆశ్చర్యంగా చూశాడు బంటీ వంక.
  ఆ సమయంలో ఎక్స్ లూ, వైలూ, ఏలు బీలు తప్ప ఇంకేం కనిపించవు. అయోమయంగా బంటీని చూసి ఏంటన్నట్లు కళ్లెగరేశాడు.
  “వాలంటైన్స్ డే నాడు నాకో ఫ్లవర్ బొకే తెచ్చివ్వగలవా? ప్రిఫరబ్లీ ఫుల్ ఆఫ్ రోజెస్.”
  “ఫ్లవర్ బొకే.. ఎక్కడ దొరుకుతుందబ్బా? పూల మార్కెట్ లో ఉంటుందేమో! అయినా నాకు టైమెక్కడుందీ వెతకడానికి?”
  “ప్లీజ్ ఆదీ! ఎవరితోనైనా తెప్పించు. ఈ ఊళ్లో నాకేం తెలియదు కదా! ఎంతైనా ఫరవాలేదు.” జేబులోంచి అయిదొందల నోటు తీసిస్తూ అన్నాడు బంటీ. ఎప్పట్నుంచో తన పాకెట్ మనీ లోంచి దాచుకున్న డబ్బు. ఇంతకంటే బెస్ట్ యూజ్ ఏముంటుంది?
  “వాట్ యార్? లౌనా?” నవ్వుతూ అడిగాడు ఆది.
  ఔనన్నట్లు కొద్దిగా సిగ్గుగా తలూపాడు బంటీ.
  “ఎవరూ? మన పక్క హాస్టలా?”
  “అమ్మో! ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు. జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు.
  “అది సీక్రెట్. సక్సెస్ ఐతే చెప్తా.” సౌమ్యంగా అన్నాడు. అవసరం కదా!
  “ఓ.. వన్ సైడా? ఆల్ ద బెస్ట్. ప్రామిస్ చెయ్యలేను కానీ ట్రై చేస్తా.”
  ఆదిత్య సంగతి బాగా అర్ధమయింది. ఎవరికీ చెప్పడు. పక్కా జెంటిల్ మేన్.
  గాల్లో తేలిపోతూ తన సీటు దగ్గరికి వెళ్లాడు బంటీ. ఆ ఊపులో నాలుగు ఫిజిక్స్ ప్రాబ్లంస్ కూడా సునాయాసంగా చేసేశాడు.

“గౌరీ! నిన్ను ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు” అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుని తయారై క్లాస్ కి బయల్దేరిన గౌరి వెనక్కి తిరిగింది. మంజుల స్నేహ పూర్వకంగా నవ్వి తన గదిలోకి వెళ్లింది.
  ప్రిన్సిపాల్ ఎందుకు పిలుస్తున్నారబ్బా? వచ్చినప్పట్నుంచీ డబ్బు ఇవ్వడానికి తప్ప ఎందుకూ పిలవలేదు. కాలేజ్, హాస్టల్ ఫీజులు కట్టడమే కాకుండా నెలకి వందరూపాయలు పాకెట్ మనీ కూడా ఇస్తున్నారు మానేజ్ మెంట్. అది ఇవ్వడానికి పిలిచి, “అంతా సదుపాయంగా ఉందా” అని అడగటం తప్ప ఇంకేం మాట్లాడరు ప్రిన్సిపాల్.
  ఆ అవసరం రానియ్యలేదు గౌరి.
  బాయిస్ బిల్డింగ్ దగ్గరకి వెళ్లి, వెంకట్ గది ముందు నిల్చుని, “మే ఐ కమ్ ఇన్ సర్" అని అడిగింది గౌరి.
  కళ్లు మూసుకుని ఒక చేత్తో నుదురు రాసుకంటున్న వెంకట్, కళ్లు తెరచి “కమిన్" అన్నాడు. ఏం మాట్లాడకుండా మళ్లీ కళ్లు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు.
  “సర్, పిలిచారట” అడిగింది గౌరి.
  “ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా! మీ మదర్ కి సీరియస్ గా ఉందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మూడ్రోజుల క్రితం హాస్పిటల్ లో చేర్చారట. మీ ఫాదర్, తను పన్చేసే  బిల్డింగ్ సూపర్ వైజర్ తో ఫోన్ చేయించారు.”
  ఏదో జరగరానిదే జరిగుంటుంది. లేకుంటే తనకి చెప్పమని పోన్ చేయించడు నాయన. కాసేపు ఏం మాట్లాడ లేక పోయింది. “సర్.. ఒక మాటడుగుతాను, నిజం చెప్తారా?” అడిగింది.
  తలూపాడు వెంకట్.
  “ఈజ్ షి ఎలైవ్?”


  హైద్రాబాద్ వెళ్లే బస్ లో కూర్చుని ఆలోచిస్తోంది గౌరి. పక్కనే లక్ష్మి మేమ్ ఉన్నారు. సాయంత్రం కాలేజ్ అయ్యాక స్కూల్ వేన్ లో వెంకట్ వస్తానని చెప్పాడు.
  చిన్నప్పటి నుంచీ ఎన్నో సంఘటనలు చూసింది. చుట్టు పక్కలుండే గుడిసెల్లో.. ఒక్కో గుడిసెలో ఒక్కో కథ. తాగి ఇంటికి వచ్చి పెళ్లాన్ని కొట్టడం మటుకు గంజి తాగినంత సహజం ప్రతీ ఇంట్లోనూ.
  అలా కొట్టి పొయ్యిలో పడిపోయి ఎల్లమ్మని తనే హాస్పిటల్ కి తీసుకెళ్లిన యాదగిరికి ఎంత మొత్తుకుంటే మాత్రం ఎల్లమ్మ తిరిగి వస్తుందా?
  ఇంకో గుడిసెలో మొగుడుకు పెళ్లామ్మీద అనుమానం. ఇంకో ఇంట్లో ముసలి తల్లిని వెళ్లగొడితే, ఆవిడ బన్ను, చాయ్ లతో కడుపు నింపుకుని మిగిలిన డబ్బులు కోడలికే ఇస్తుంది.
  చివరికి అన్ని గుడిసెల్నీ గవర్న్మెంట్ తీసేసుకుంటే సామాన్లన్నీ మోసుకుని, కుకట్ పల్లిలో ఇళ్లిస్తామంటే, కొన్నాళ్లు ఫుట్ పాత్ మీద మకాం. తరువాత ఇచ్చిన ఇళ్ల కోసం కొట్లాటలు. ఒకటి కాదు, ప్రతీదీ సమస్యే. ఎదిరించి సాధించుకోవలసిందే.. “స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్”.
  బస్సు ఏదో గోతిలో పడి తల కిటికీకి కొట్టుకుంది.
  “గౌరీ! ఆర్ యు ఆల్రైట్?” లక్ష్మీ మేమ్ ఆదుర్దాగా అడిగారు.
  గౌరి అయోమయంగా చూసింది. తకు తెలియకుండానే కళ్లలోంచి నీళ్లు కారిపోతున్నాయి. లక్ష్మి నాప్కిన్ ఇచ్చింది. తుడుచుకుని మళ్లీ కళ్లు మూసుకుంది.
  అటువంటి పరిస్థితులలో గౌరి కుటుంబం ప్రత్యేకంగా ఉంటుంది. రోజూ చుక్కేసుకుని వచ్చినా, మస్తాన్ ఎప్పుడూ యాదమ్మని కొట్టలేదు. యాదమ్మ, ఎలాగైనా తన పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలని శక్తికి మించి కష్టపడేది.
  చీటీలు కట్టి, పెద్ద కాలేజ్ లో గౌరిని చేర్పించాలని, చీకటి పడేవరకూ పని చేసేది.
  “పదో తరగతి అయినంక అంటే ఆ మగానుభావులు చదివిస్తున్రు. మరి డాక్టర్ కావాలంటే ఎన్ని పైసలు గానాలె..” అని యాదమ్మ, ఒక రాత్రి గౌరి పడుకుందనుకుని మస్తాన్ తో అన్న మాటలు గుర్తుకొచ్చాయి.
  “ఎందుకే.. ఎలుగుండంగనే ఇంటికి రావచ్చు గందనే” అన్న మస్తాన్ మాటలకి యాదమ్మ అలా జవాబు చెప్పింది.
  గౌరికి ఒక్క సారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ముందు సీటు మీదికి వాలిపోయి వెక్కెక్కి ఏడవ సాగింది.
  “ఊరుకో గౌరీ. కంట్రోల్ యువర్ సెల్ఫ్.” గౌరి భుజం మీద చెయ్యేసి లక్ష్మి అంది.
  కాస్త తేరుకున్న గౌరి, పొద్దున్న ప్రిన్సిపాల్ గారి గదిలో జరిగిన సంభాషణని జ్ఞాపకం చేసుకుంది. అదంతా నిజమేనా? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు.
  “ఈజ్ షి ఎలైవ్?”
  గౌరి ప్రశ్నకి వెంకట్ ఏం చెప్పాలో తెలియనట్లుగా ఉండిపోయాడు.
  “చెప్పండి సార్.” గౌరి ఆత్రంగా అడిగింది.
  “ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి..” వెంకట్ ఆగాడు.
  “ఏం జరిగింది సార్?” గౌరి గొంతులో వణుకు..
  “మీ మదర్, మూడు రోజుల క్రితం సాయంత్రం బేగంపేట నుంచి కుకట్ పల్లి వెళ్లే బస్ ఎక్కారట. టైమ్ ఏడే అయింది కానీ బాగా చీకటి పడిందిట. బస్టాప్కి కొంచె దూరంలో రోడ్ మీదే బస్ ఆపాడట కుకట్ పల్లిలో. బస్ దిగి, మీ ఇంటికెళ్లే రోడ్ మీదికెళ్దామని క్రాస్ చెయ్యబోతే, లారీ వాడు ఎడం పక్కనుంచి వచ్చేసి చూసుకోకుండా.. పోనిచ్చాట్ట. అప్పుడే పవర్ పోయి స్ట్రీట్ లైట్లు కూడా ఆఫ్.. మీ అమ్మ లారీకి, బస్ కీ మధ్య ఇరుక్కు పోయార్ట. చాలా బ్లడ్ పోయింది. మీ ఏరియానే కదా.. ఎవరో గుర్తు పట్టి హాస్పిటల్ కి తీసుకెళ్లి, మీ నాన్నగారికి ఇన్ఫామ్ చేశారుట.”
  నిలబడలేనట్లుగా, కుర్చీ పట్టుకుని, కింద కూలబడింది గౌరి. ఒక్క సారిగా మెదడు మొద్దుబారినట్లయి పోయింది.
  వెంకట్, లక్ష్మిని పిలిపించి గౌరిని చూసుకోమన్నాడు. లక్ష్మి గౌరిని తన గదికి తీసుకెళ్లింది. లక్ష్మి తనుకూడా వెళ్తానని వాలంటీర్ చేస్తే, వెంకట్, తిరుపతిని పంపి బస్ లో రెండు టికెట్లు తెప్పించాడు హైద్రాబాద్ కి.
  అయిదు నిముషాల్లో అమ్మాయిలందరికీ వార్త తెలిసిపోయింది. అందరూ క్లాసుల్నించి వచ్చేశారు. సుష్మ గౌరి బాగ్ సర్దింది. మంజుల గౌరి పక్కనే ఉంది. అందరూ విచారంగా గేటు వరకూ వచ్చి, గౌరి, లక్ష్మి వాన్ లో కనుమరుగైపోయే వరకూ చూశారు.
  స్టూడెంట్స్ లో కానీ, స్టాఫ్ లో కానీ గౌరిని ఇష్టపడని వారు లేరు. మొదట్లో గౌరి పేద తనాన్ని చులకనగా చూసిన వాళ్లే, తరువాత, తమకంటే విజ్ఞానంలో ఎంతో ఎత్తుగా ఉన్న గారిని ఆరాధనా భావంతో చూడ సాగారు.
  గౌరి నిరాడంబరత, అణకువతనం అందరినీ ఆకర్షించాయి. అవసరమైనపుడు కలుపుగోలుగా, మామూలుగా రిజర్వ్డ్ గా.. తన పని తాను చేసుకుంటూ, ఎవరికైనా ఏదయినా తెలియకపోతే మనసుకు హత్తుకునేలా వివరిస్తూ, తాను అందరి మనిషినీ అనిపించుకుంది.


  గౌరి, లక్ష్మి బస్ దిగి ఆటోలో ఇంటికెళ్లేసరికి, అనుకోని షాక్ ఇంకొకటి ఎదురైంది. యాదమ్మ బాడీని, పోస్ట్ మార్టమ్ అయి ఇంటికి తీసుకురాగానే మస్తాన్ ఎక్కడికో వెళ్లిపోయాడుట.
  “యాదమ్మలేని ఇంటినీ, సంసారాన్నీ నే చూసుకోలేను, ఇట్టా ఎల్లి పోతున్నందుకు నన్ను చమించవే గౌరీ” అని గుణించుకుని తన కొచ్చిన అక్షరాలతో ఉత్తరం రాసి పెట్టాడు. అతను చిన్నప్పుడు మూడు వరకూ స్కూలుకెళ్లి చదివాడట. ఆ వచ్చీరాని అక్షరాలతో ఉన్న ఉత్తరాన్ని చదివి గౌరి కూలబడిపోయింది. పొగిలి పొగిలి ఏడ్చింది.
  అమాయకంగా బిత్తర చూపులు చూస్తున్న కవిత అక్క దగ్గరకి వచ్చింది. కవితని దగ్గరగా తీసుకుని, కళ్లనిండా నీళ్లతో ఆకాశం కేసి చూస్తున్న గౌరిని చూస్తుంటే అందరికీ చాలా బాధకలిగింది.
  గౌరి కాసేపటికి తేరుకుంది. ఏడుస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదని తెలుసు. ముందు జరగవలసిన పని చూడాలి కదా! లేని పెద్దరికం తెచ్చుకుంది.
  లక్ష్మీ మేమ్ గౌరిని ఆనుకునే ఉంది.
  “పెదనాయనా!” పక్కింటి లింగయ్యని పిలిచింది గౌరి.
  “ఏంది బిడ్డా?” లింగయ్య వెంటనే పలికాడు.
  ఏం మాట్లాడకుండా యాదమ్మ శరీరాన్ని పడుక్కోబెట్టిన స్థలం కేసి చూసింది గౌరి.
  “ఔ బిడ్డా! అన్ని ఏర్పాట్లు చేసినం. రాత్రికుంచుతే అందరం ఈడనే ఉండాల కదా?”
  అప్పుడు తట్టింది గౌరికి. ఇంక ఉంచుతే రాత్రికి అక్కడెవరికీ తిండి తిప్పలుండవు. చిన్న పిల్లలు, ముసలి వాళ్లు చాలా మందే ఉన్నారు.
  “అప్పుడు మీరందరూ ఇచ్చిన పైసలున్నయ్ నా తాన. తీస్కుని నువ్వే కానియ్యి పెదనాయనా” తన బాగ్ లోంచి రెండు వేలు తీసిచ్చింది.
  ప్రిన్సిపాల్ అవసరానికిమ్మన్నారంటూ లక్ష్మీ మేమ్ మరో రెండు వేలిచ్చింది. అవన్నీ కలిపి కార్యక్రమం జరిపించారు అందరూ.
  “రేప్పొద్దున్న వస్తాను” అంటూ దగ్గర్లో ఉన్న తన బంధువులింటికి వెళ్లింది లక్ష్మి. గౌరిని చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు కదా అక్కడ.


  మరునాడు పొద్దున్నే వెంకట్, చంద్రశేఖరంగారు వచ్చారు. లక్ష్మీ మేమ్ కూడా వచ్చేశారు. అందరూ గౌరిని చూసి సానుభూతితో కదిలి పోయారు. ఇంక వాళ్ల భవిష్యత్తేమిటి? తల్లినీ, తండ్రినీ రెండు విధాలుగా పోగొట్టుకున్న పిల్లలు.
  “గౌరీ! వియార్ వెరీ సారీ అమ్మా!” చంద్రశేఖరంగారెలాగో అన్నారు, ఒక్క సారిగా అనాధలైపోయిన పిల్లల్ని చూసి.
  “మీకు ఏ రకమైన సహాయం చెయ్యడానికైనా మేమున్నాం. దిగులు పడొద్దు. నున్నిక్కడుండి చేసేదేముంది? చదువులో పడితే ఈ బాధ కాస్త వెనక్కి వెల్లపోయే అవకాశముందేమో! ఆలోచించు. అన్నీ తంలిసిన దానివి, తెలివైనదానివి.” వంకట్ అన్నాడు.
  “తెలివి ఇచ్చాననేనాసార్, భగవంతుడు ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పాడు?” కవితని చూస్తూ అంది గౌరి.
  “ఇది కూడా అన్నింట్లోనూ ఫస్టే సార్. ఎంత ఫస్ట్ వచ్చినా పెద్ద దిక్కు లేదు కదా!” దుఃఖంతో మొహం రెండు చేతుల్లోనూ దాచుకుంది గౌరి.
  “మీ అమ్మానాన్నలకి ఎప్పటికీ సమానం కాలేం కానీ, నీ బాధ్యతల్ని పంచుకోవడా   నికి మేమున్నాం. కవితని మా రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చుకుంటాం. నీకు మెడిసిన్                       లో సీటు వచ్చాక కూడా సహాయం చేస్తాం. మిమ్మల్నిద్దరినీ మా సంస్థ ఎడాప్ట్ చేసుకుంటుందనుకో! నీకేది కావలసినా వెంకట్ సార్ కి ఒక మాట చెప్తే చాలు.”                       
  చంద్రశేఖరంగారి విశాల హృదయానికి గౌరి చలించి పోయింది. నాకు ఇంత చేస్తున్నారు కదా! వీరి ఆశల్ని నేను తుంచెయ్యకూడదనుకుంది.    
  
     “మరిప్పుడెలాగ సార్? నేను హాస్టల్ కి వచ్చేస్తే కవితనేం చెయ్యాలి?”
     అప్పటి వరకూ తండ్రిని సానుభూతితో అర్ధం చేసుకున్న గౌరి అప్పుడు మాత్రం క్షమించ లేకపోయింది. “నువ్వేం చెయ్యకపోయినా, తోడుంటే అన్నీ చూసుకునే దాన్ని కదా! చదువు మానేసైనా మిమ్మల్నిద్దరినీ చూసే దాన్ని.” తండ్రిని తలచుకుని మనసులోనే బాధపడింది.
  “కవితని ఇప్పుడే స్కూల్ కి తీసుకెళ్లి టిసి తీసుకుందాం. తనని స్కూల్లో చేర్పించి నిన్ను హాస్టల్లో దింపుతాం. మా స్కూల్లో తెలుగు మీడియమ్ సెక్షన్ కూడా ఉంది. సెలవుల్లో ఇంగ్లీష్ నేర్పించి తను పికప్ ఐతే వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ మీడియమ్ లో చేర్పిద్దాం. రోజూ నీతో మాట్లాడించే బాధ్య నాది. నువ్వు సామాన్లు సర్దెయ్.” చంద్రశేఖరం గారు లేచి నిలబడి అన్నారు.
  మధ్యాహ్నం కూర్చుని పక్కింటి లింగయ్య, లక్ష్మమ్మల సహాయంతో సామానంతా సర్దింది గౌరి. స్టౌ, వంటింటి సామాన్లు అటక మీదికెక్కించింది. పెద్దగా ఏం సామాన్లున్నాయి కనుక.. ఒక కుర్చీ, రెండు చాపలు, ఒక ట్రంకు పెట్టె. కవిత బట్టలన్నీపెట్టెలో సర్దింది.
  యాదమ్మ చీరలు చూస్తుంటే మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది. మస్తాన్ ది ఒక జత పంచె లాల్చీ పెట్టెలో ఉన్నాయి. అవన్నీ లింగయ్యకిచ్చేసింది.
  పెట్టెలో అడుగున బాంక్ పాస్ బుక్ కన్పించింది. తీసి చూసిన గౌరి కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. చీటీలన్నీ ఐపోయినట్లున్నాయి. యాదమ్మ పోవడానికి ముందు రోజే అందులో రెండు లక్షలు వేసినట్లుంది. హాస్టల్లో చేరే ముందు, గౌరి యాదమ్మని తీసుకెళ్లి బాంకులో అకౌంట్ తెరిపించింది.
  “ఇద్దరి పేర్నా వెయ్యటానికి వీలవుతుందా బిడ్డా” తనకేదో జోస్యం తెలిసిన దానిలా, గౌరిని కూడా కలిపి జాయింట్ అకౌంట్ చేయించింది యాదమ్మ.
  చంద్రశేఖరంగారు, వెంకట్ రాగానే పాస్ బుక్ చూపించింది గౌరి. అందరూ కలిసి బాంక్ కెళ్లి, రెండు లక్షలూ, గౌరి, కవితల పేర్ల మీద ఫిక్సెడ్ డిపాజిట్ చేశారు. చంద్రశేఖరం గారు గార్డియన్ కింద సంతకం పెట్టారు.
  కవితని రెసిడెన్షియల్ స్కూల్లో దింపేసి, అక్కడి వార్డెన్ ప్రభ మేడమ్ కి అప్పజెప్పి అందరూ ‘ఫాదర్' కి బయలు దేరారు. కవితకి ఆ రోజు పొద్దుట్నుంచే అంతా వివరించి జాగ్రత్తలు చెప్పింది గౌరి. అన్నీ తెలిసున్నదాన్లా తలూపి తయారైపోయింది కవిత.
  కారు దగ్గరకి పరుగెత్తుకొచ్చింది కవిత. వెంకట్ కారు ఆపాడు. కిటికీలోంచి చూస్తూ అంది. “మంచిగా చదువుకో అక్కా! డాక్టర్ వు కావాలె..”
  
  స్కూల్ వాన్ ‘ఫాదర్' గర్స్ హాస్టల్ దగ్గరకు రాగానే, ఒకరొకరుగా అందరమ్మాయిలూ బైటికొచ్చేశారు, ఉజ్వల తప్ప. చంద్ర శేఖరంగారు, హైద్రాబాద్ లోనే ఉండిపోయారు, కవిత అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యడానికి.
  వెంకట్, లక్ష్మీ దిగాక, నెమ్మదిగా దిగింది గౌరి. సుష్మ గబగబా గౌరి దగ్గరగా వెళ్లి చెయ్యి పట్టుకుంది. అమ్మాయిలందరూ దూరంగా నిల్చుని చూస్తున్నారు. రాత్రి పదకొండవుతోంది. గౌరి కళ్లు అప్రయత్నంగా తడిగా అయ్యాయి. తను ఒంటరి కాదు.. కల్మషంలేని మనసులతో వీరందరూ తనకి తోడుగా ఉన్నారు.
  పదహారేళ్ల వయసులోనే దేముడు తనకి ఎంతో అన్యాయం చేశాడనుకుంది. తనకి సేవ చెయ్యడానికి కావాలనుకున్నాడేమో.. అమ్మని తీసుకుపోయాడు. కానీ ఇంతమందిలో ఉండి తనకి నీడగా ఉన్నాడు.
  చేతులు జోడించి అందరికీ నమస్కరించింది.
  పక్కనే, సుష్మ, వెంకట్, లక్ష్మి కారు దగ్గరే నించుని ఉన్నారు.
  “ఇంత రాత్రి సమయంలో కూడా నాకోసం మీరందరూ రావడం నాకెంతో ధైర్యాన్నిచ్చింది. మీ అందరికీ నా మీద ఉన్న ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు.” స్థిరమైన కంఠంతో అంది గౌరి. వెంకట్, లక్ష్మి తడికళ్లతో గౌరిని తీసుకుని తన గది దగ్గర దింపి వెళ్లిపోయారు.
  గౌరి లోపలికి రాగానే తలుపు వేసేసింది సుష్మ. అప్పటి వరకూ అతి కష్టం మీద ఆపుకున్న గౌరి సుష్మని పట్టుకుని బావురు మంది. గౌరి వీపు రాస్తూ మౌనంగానే ఓదార్చ సాగింది సుష్మ. నెమ్మదిగా తేరుకుని అన్ని సంగతులూ చెప్పింది గౌరి. మస్తాన్ వెళ్లిపోయిన సంగతి తెలిసి సుష్మ చెయ్యి బిగుసుకుంది.
  “గౌరీ! నువ్వు నాకు దేవుడిచ్చిన సిస్టర్ వి. మా అమ్మా నాన్నా కూడా ఒప్పుకున్నారు. ఇకనుంచీ మనిద్దరం కలిసి చదువుతాం. నీకే లోటూ ఉండదు ఆర్ధికంగా.”*
  
  గదిలోకి వచ్చిన మంజుల చాలా సేపు అలాగే కూర్చుంది. పన్నెండు దాటింది. ఉజ్వల ఎక్కడా జాడ లేదు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ రాత్రి. ఎగ్జామ్స్ కి ఇంకా నెల కూడా లేదు. బాత్రూమ్ ల దగ్గరుందేమోనని వెదికింది.
  “గేటు దగ్గర గౌరిని చూట్టానికి కూడా రాలేదు. ఏమయిందబ్బా?” ఎక్కడైనా కూర్చుని చదువుకుంటోందేమో, ఇంకాసేపు చూద్దామని, తలుపు తీసి కుర్చీలో కూర్చుంది.
  లైట్ వేసే ఉంది. లైట్ వేసుంటే చదువుకుంటున్నారని, నైట్ సూపర్ వైజర్లు డిస్టర్బ్ చెయ్యరు. కుర్చీలో కూర్చున్న మంజులకి ఆపుకోలేని నిద్ర వచ్చింది. అలాగే బల్ల మీద తలపెట్టుకుని నిద్ర పోయింది. అలారం మోత విని ఉలిక్కి పడి లేచింది.
  ఐదింటికి హస్టల్లో అందరి అలారాలూ మోగుతాయి. నొప్పిగా ఉన్న మెడని ఒక సారి అటూ ఇటూ తిప్పి పక్కకి చూసింది. ఉజ్వల మంచం ఖాళీ. దుప్పటి వేసింది వేసినట్లే ఉంది.
  మేనర్స్ కాదని ఉజ్వల మంచం దగ్గరకీ, బల్ల దగ్గరకీ ఎప్పుడూ వెళ్లదు మంజుల. అప్పుడు మాత్రం వెళ్లింది. బల్ల మీదున్న కెమిస్ట్రీ పుస్తకంలోంచి తొంగి చూస్తూ కనిపించిందొక కాగితం.
  పెద్ద అక్షరాలతో, మంజులకి అని రాసుంది. ఆ లెటర్ తీసి చదివింది.
  “డియర్ మంజూ, మా మదర్ రమ్మన్నారు. చూడాలని ఉందని మరీ మరీ రమ్మన్నారు. నీకు తెలుసు కదా.. తనకి చాలా జబ్బు చేసిందని. వార్డెన్ మేమ్ కి, ప్రిన్సిపాల్ సర్ కి చెప్పి ఎలాగో మానేజ్ చెయ్యి. నేను ట్వెల్త్ పొద్దున్నే వస్తా. ప్లీజ్.. ఉజ్జీ.”
  గుండె దడదడ కొట్టుకుంటుండగా లక్ష్మీ మేమ్ గదికి పరుగెత్తింది మంజుల.
  రెండ్రోజుల ప్రయాణంతో అలిసి పోయుందేమో, లక్ష్మి ఇంకా లేవలేదు. మెల్లిగా భయంగా తలుపు తట్టింది మంజుల. మండుతున్న కళ్లని నులుముకుంటూ తలుపు తీసింది లక్ష్మి. చేతిలో కాగితాన్ని లక్ష్మికిచ్చింది.
  ఇంత పొద్దున్నే తలుపు కొట్టిందంటే ఏదో పెద్ద ఇశ్యూనే అయుంటుంది అనుకుంటూ, “ఏమయింది మంజులా?” ఆతృతగా అడిగింది.
  చదవండి అన్నట్లుగా కాగితం కేసి చూపించింది మంజుల.
  లక్ష్మి ఒక సారి నిటారుగా అయింది అది చదివి.
  “ఎప్పటి నుంచీ కనిపించడం లేదు?”
  మంజుల అంతా చెప్పింది.. కొద్ది రోజుల్నించీ, ఉజ్వల ఎలా అన్యమనస్కంగా ఉంటోందో.. వాళ్ల అమ్మకి బాగా లేదని చెప్పడం, ఒక వేళ వెళ్తే తన తరఫున చెప్పమనడం.. అన్నీ.
  మంజులని వెళ్లమని చెప్పి, తను పది నిముషాల్లో తయారయి, వెంకట్ రూమ్ కి వెళ్లింది లక్ష్మి.
 
  ఉజ్వల రాసిన ఉత్తరం చదివి తనని తాను తిట్టుకున్నాడు వెంకట్. ఈ అమ్మాయి వ్యవహారం మొదటి నుంచీ తనకి అనుమానంగానే అనిపించింది. బాగానే చదువుతోంది కదాని వదిలెయ్యడం తప్పే అయింది. బజార్లో కనిపించినప్పుడైనా కాస్త శ్రద్ధ పెట్ట వలసింది.
  ఇంట్లో పరిస్థితులు బాలేకపోతే తమకి చెప్పాలి కానీ ఇలా చెయ్యడమేమిటి? సమ్థింగ్ ఫిషీ. లక్ష్మిని కూర్చోపెట్టి, ఉజ్వల ఫోన్ నంబర్ తీశాడు ఫైల్లోంచి.
  సెల్ ఫోన్ లో నంబరు నొక్కి, పచార్లు చేస్తూ చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఎవరూ ఎత్తడం లేదు. అసహనంగా ఫోన్ పెట్టేసి, చంద్రశేఖరంగారికి చేశాడు.
  “నేను దార్లో ఉన్నా. ఒక గంటలో వస్తా” అన్నారు. ఆయన లెక్చరర్ ఇంట్రవ్యూలు ఎవరికో అప్పజెప్పినట్లున్నారు. అదీ మంచిదే అయింది.
  మళ్లీ ఉజ్వల ఇంటికి చేశాడు. ఉహూ.. లాభం లేదు. లోకల్ గార్డియన్ ఎవరైనా ఉన్నారా? కంప్యూటర్ దగ్గరికి వెళ్లి ఫైల్ చూశాడు. ఎవరూ లేరు.
  పది నిముషాలకొక సారి సంతోష్ కోసం ఫోన్ చేస్తూనే ఉన్నాడు. సంతోష్ ఆఫీస్ ఎక్కడో చూశాడు. పదిన్నరకి కానీ ఎవరూ రారు. అంత వరకూ ఏం చెయ్యాలి? ఏం తోచడం లేదు.
  లక్ష్మి తనని ఏమైనా అంటారేమోనని హడలిపోతూ కూర్చుంది. తను వార్డెన్ గా చేరాక ఇప్పటి వరకూ ఇటువంటి కేస్ తగల్లేదు.
  “సర్! నేను రెండ్రోజులు ఊళ్లో లేను కదా! నిన్న రాత్రే వచ్చాం మనం. అందుకే చూళ్లేదు.”
  “యస్. యస్. ఐ నో. మనం వాళ్ల మనసుల్లోకి దూరి మానిటర్ చెయ్యలేం కదా! ఈ పేరెంట్స్ దొరకడం లేదు. అయామ్ రియల్లీ వర్రీడ్. ఈ టీనేజ్ పిల్లలతోటి చాలా డేంజర్.” పచార్లు చేస్తూనే అన్నాడు వెంకట్.
  “మిస్. లక్ష్మీ! మీరు వెళ్లండి. ఏదైనా కావాలంటే పిలుస్తాను.” మళ్లీ ఫోన్ తీసి ఉజ్వల నంబర్ డయల్ చేస్తూ అన్నాడు వెంకట్.
  ఫోన్ మోగుతూనే ఉంది. ఒకవేళ ఉజ్వల మదర్ నిజంగానే హాస్పిటల్ లో ఉన్నారేమో! అందుకే ఎవరూ ఫోన్ తియ్యట్లేదేమో! అలాగైతే వాళ్ల ఫాదరైనా ఫోన్ చేసిచెప్పాలికదా. వెంకట్ మనసులో రకరకా ల ఆలోచనలు. ప్రతీ పది నిముషాలకీ గడియారం కేసి వెళ్తోంది దృష్టి. పదిన్నరైంది. సంతోష్ ఆఫీస్ కి ఫోన్ చేశాడు.
  “సంతోష్ గారు డివిజన్ మారారు. ఈ నంబరుకి చెయ్యండి.” ఎవరో ఇంకో నంబరిచ్చారు.
  “సంతోష్ ఊర్లో లేరండీ. ఫామిలీతో షిరిడీ వెళ్లారు.”
  “వారి అమ్మాయి కూడా వెళ్లిందా? మీకేమైనాతెలుసా?”
  “లేదండీ. నేను బస్ దగ్గరికి వెళ్లి బాబాకి ముడుపు ఇచ్చి వచ్చాను. వాళ్లిద్దరే వెళ్లారు”
  “ఎప్పుడొస్తారో తెలుసా.. కాంటాక్ట్ నంబరుందా?”
  “పన్నెండో తారీఖున వస్తామని చెప్పారు. నాసిక్, త్ర్యంబకం, శని శింగణాపూర్ , అన్నీ వెళ్తారుట.” సంతోష్ కొలీగ్ ఎవరో సౌమ్యంగా మాట్లాడుతున్నారు.
  “మెనీ థాంక్సండీ. వచ్చాక ఒత సారి మాకు ఫోన్ చెయ్యమనండి. అన్నట్లు.. వన్ సెకండ్. వాళ్లమ్మాయి సెల్ నంబరేమైనా తెలుసా మీకు.”
  “ఉండండి. సంతోష్ బల్లమీద కాలెండర్లో ఉండాలి. చూస్తాను.” అయిదు నిముషాల తర్వాత నంబరిచ్చాడు.
  “చాలా చాలా థాంక్సండీ. సంతోష్ గారు రాగానే నన్ను కాంటాక్ట్ చెయ్యమనండి. తన గురించి చెప్పి, నంబరిచ్చి ఫోన్ పెట్టేశాడు వెంకట్.
  వెంటనే ఉజ్వల నంబర్ కి ఫోన్ చేశాడు. స్విచ్చాఫ్. అంత తేలిగ్గా దొరుకుతారా పిల్లలు.
  మళ్లీ డెడ్ ఎండ్. ఇంక చేసేదేం లేక తన రొటీన్ లో పడిపోయాడు. అమ్మాయిల బిల్డింగ్ దగ్గరకు వెళ్లి మంజులతో కాసేపు మాట్లాడాడు.
 ఎప్పుడూ ఆ సెల్ ఫోన్ లో యస్సెమ్మెస్ లు చేస్తుంటుంది సార్. నేనడిగితే వాళ్ల అమ్మగారికి బాలేదని చెప్పింది.” అప్పటివరకూ ఉజ్వల గురించి, తాను గమనించిందంతా చెప్పింది మంజుల.
  “ఇదేదో ప్రేమ వ్యవహారమే అనుకున్నాడు వెంకట్. గౌరిని పలుకరించి తన గదికి వెళ్లి కూర్చున్నాడు, అలసటగా  తల పట్టుకుని. ఎవరో వచ్చినట్లనిపించి కళ్లతెరిచాడు. చంద్రశేఖరం గారు లోపలికి వచ్చి కూర్చున్నారు.


  బంటీకి చాలా చిరాగ్గా ఉంది. ఈ ప్రిన్సిపాల్ సార్ కిటికీకి దూరంగా కూర్చోపెట్టారు. ట్రిగ్నామెట్రీ సార్ వచ్చారు. ఆయన ఎక్కువగా మాట్లాడరు. రెండు చేతుల్తో సైగలు చేస్తూ అంతా పిల్లలచేతనే చేయిస్తారు. ఆది, ఆణు వాళ్ల బాచ్ అంతా తూటాల్లాగా ఆన్సర్లు వదుల్తుంటారు. వాల్ల బెంచ్ మీదనే కూర్చున్న బంటీ, ఏం మాటేలాడకుండా తల వంచుకుని నోట్ చేసుకుంటున్నాడు.
  అబ్బ! ఎప్పటికీ అవదేంటీ క్లాసు. అమ్మాయిల టిఫిన్ టైమైపోయిందంటే, ఇవేళ్టికింక ఇంతే సంగతులు. క్లాసవగానే ఒక్క ఉరుకులో కిటికీ దగ్గరకి చేరుకున్నాడు. అందరూ ట్రిగ్నామెట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు.
  హమ్మయ్య. వస్తున్నారు. ఏదీ ఉజ్జీ? కనపడదేం.. వాళ్ల రూమ్మేట్ మంజుల చేతులు తిప్పుతూ ఉజ్జీ కజిన్ సుష్మకేదో చెప్తోంది. ఒకవేళ ఉజ్జీకి బాగాలేదా? దాని సెల్ నంబర్ కూడా లేదు. ఎలాగా ఫోన్ చెయ్యడానికి లేదని రాసుకోలేదు. నీరసంగా బెంచ్ దగ్గరకి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
  “ఏంటీ నా లౌ కనిపించలేదా?” అడిగాడు ఆది.
  “అబ్బే.. అదేం లేదు.” ఈ ఆదిగాడికి అనవసరంగా దొరికి పోయాను. తిట్టుకుంటూ కెమిస్ట్రీ నోట్స్ తీశాడు.  మేడమ్‌ ఏవో మోడల్స్ తెచ్చి ఏదో చెప్తోంది. రివిజన్ క్లాసేమో.. అంతా గోలగోలగా ఆవిడ నోట్లోంచి మాట రాకుండానే అందిస్తున్నారు, ఒక్క బంటీ తప్ప.
  “ఫిబ్రవరి నైన్త్ ఇవేళ. ఇంక సరిగ్గా ట్వెంటీ డేస్ ఉన్నాయి పరీక్షలకి. ఏ డౌట్స్ వచ్చినా కాగితం మీద రాసుకుని రండి. నేను క్లియర్ చేస్తాను.” మేమ్ చెప్తున్నారు.
  “ఇంక సరిగ్గా ఫైవ్ డేస్ ఉంది.” అనుకున్నాడు బంటీ.


  “అయితే పన్నెండో తారీఖు వరకూ ఏం చెయ్యడానికి లేదన్నమాట. ఈ పిల్ల ఎక్కడికి వెళ్లిపోయుంటుంది? ఏదేమైనా తెలియగానే తప్పకుండా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలి. మళ్లీ ఆ అమ్మాయిని హస్టల్ కి రానియ్యకూడదు. లేకపోతే అదే అలవాడైపోతుంది అందరికీ.” చంద్ర శేఖరంగారు అంటున్నారు, వెంకట్ చెప్పిందంతా విని.
  “ముందు ఆ అమ్మాయి కనిపిసంతే అది తరువాతి సంగతి. పేరెంట్స్ కి మనం ఆన్సరబుల్ కదా!” వెంకట్ దిగులుగా అన్నాడు.
  “మోరల్ గా మన బాధ్యత ఒప్పుకుంటాను. లీగల్ గా ఏం ఫరవాలేదు. మనం అన్ని కండిషన్స్ తో డిక్లరేషన్ తీసుకున్నాం. అయినా హస్టల్స్ లో పిల్లల్ని పెట్టేటప్పుడే పేరెంట్స్ అన్ని జాగ్రత్తలూ చెప్పుకోవాలి. 24 గంటలూ ఓవరు కాపలా ఉంటారు.. ఇళ్లల్లో మాత్రం ఉండగలరా? పిల్లలకి వాళ్ల రెస్పాన్సిబిలిటీ తెలియాలి.”
  “పేరెంట్స్ అందరూ చెప్తారు సార్. కాకపోతే అందరు పిల్లలూ వినరు. విన్నా పాటించరు. అందుకే మేం ప్రతీ స్టూడెంట్ నీ ఫాలో అవుతుంటాం. లాస్ట్ టూ డేస్ గౌరికోసం వెళ్లాం కనుక చూసుకో లేక పోయామేమో. అసిస్టెంట్స్ చూస్తూనే ఉంటారు. డే స్కాలర్స్ కి వచ్చి బస్ లో జారుకుని ఉంటుంది. లేకపోతే ఎవరైనా భయపెట్టి కిడ్నాప్ చేశారా? తల్చుకుంటే భయమేస్తోంది.” వెంకట్ గాభరాగా అన్నాడు.
  “ఏం కాదనే అనుకుందాం. ఏదైనా పన్నెండో తేదీ వరకూ ఆగాల్సిందే. ఇంకా మూడ్రోజులుంది.” తిరుపతి తెచ్చిన కాఫీ కప్పు తీసుకుని అన్నారు చంద్రశేఖరం గారు.
  “ఇంకో అలార్మింగ్ కేసుంది సార్. అబ్బాయి పేరు బంటీ.” అని బంటీ గురించి అంతా వివరంగా చెప్పాడు. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లడం, బంటీ ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటుండడం, గ్రేడ్స్ తగ్గిపోవడం.. అంతా.
  “అంతే కాదండీ. సరిగ్గా తినడం లేదనుకుంటాను. బాగా చిక్కి పోయాడు. అసలందుకే మిమ్మల్నోసారి రమ్మని కిందటి వారం ఫోన్ చేశాను.”
  “ఏదైనా లౌ ఫెయిల్యూరేమో..” చంద్రశేఖరం గారు ఎలర్ట్ అయారు.
  “ఆ అబ్బాయి దగ్గర సెల్ ఫోన్ లేదు. లెటర్స్ ఏం రాయట్లేదు. నాకు తెలిసి ఎవరి తోనూ కమ్యూనికేషన్ లేదు. ఎలా తెలుస్తుంది?”
  “అతనిది హైద్రాబాద్ అన్నారు కదూ? వాళ్ల ఫోన్ నంబర్ ఇవ్వండి. నేను వెళ్లగానే మాట్లాడతాను.”
  తల మీది నుంచి పెద్ద భారం తీసేసినట్లుగా అనిపించింది వెంకట్ కి.
  “ఇంకో విషయంసార్. ఈ కనిపించకుండా పోయిన ఉజ్వల, బంటీ చిన్నప్పటి నుంచీ క్లాస్ మేట్స్.
  “మరా విషయం చెప్పరేం? బంటీ ఉన్నాడో లేదో చూశారా?” అడిగారు కాస్త క్లూ దొరికినట్లుగా.
  “ఉన్నాడు. వాళ్లకి కెమిస్ట్రీ క్లాస్ అవుతోంది.”
  “క్లాసయ్యాక ఓ సారి పిలిపించండి.”


  కెమిస్ట్రీ మేమ్ వెళ్లి పోగానే అలవాటు చొప్పున కిటికీ దగ్గరికి వెళ్లి పోయాడు బంటీ. ఈ సమయంలో అమ్మాయిలు బైటికి వచ్చే ఛాన్సే లేదు. కానీ అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి కదా!
  “బంటీ! ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు.” ఇంగ్లీష్ లెక్చరర్ భాస్కర్రావుగారు క్లాసులోకి వస్తూ అన్నారు. నెమ్మదిగా స్టెడీగా డాక్టర్ శివరామ్ పర్యవేక్షణలో 20 కిలోల వరకూ తగ్గారు పద్మ, భాస్కర్రావులు.
  “అయ్యో.. సార్ వస్తున్నట్లు చూసుకోలేదే! అసలు ఏమీ శబ్దం లేకుండా ఎలా వచ్చేశారో! ఇదివరకు ఇంగ్లీష్ క్లాస్ అంటే నానా గోలా చేసే పిల్లలు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు.” బంటీ కాస్త గిల్టీగా తన బెంచ్ దగ్గరకు వచ్చాడు.
  “త్వరగా వెళ్లిరా.” భాస్కర్ సార్ హెచ్చరించడంతో కదిలాడు బంటీ. “మళ్లీ ఎందకబ్బా? మొన్న టెస్ట్ లో కొంచె పెరిగాయే మార్కులు.” మరి ఎందుకు పిలిస్తున్నారో అర్ధం అవలేదు బంటీకి.
  ప్రిన్సిపాల్ రూమ్ లో ఎవరో కొత్తవాళ్లున్నారే.. చంద్రశేఖరంగారిని ఎప్పుడూ చూడలేదు బంటీ. ఏదైనా సమస్య వస్తే తప్ప ఆయన పిల్లల్ని ఎక్కవగా పట్టించుకోరు.
  “ఎలా ఉన్నావు బంటీ? ఈయన మన కాలేజ్ కరెస్పాండెంట్. మానేజ్ మెంట్ లో ఉంటారు.”
  చంద్రశేఖరంగారి కేసి తిరిగి దణ్ణం పెట్టాడు.
  “బాగా చదువుతున్నావా బాబూ?”
  చదువుతున్నానన్నట్లుగా తల నిలువుగా ఊపాడు.
  “హాస్టల్లో సదుపాయంగా ఉందా?”
  “ఉందండీ.” మళ్లీ తలూపాడు.
  “టెస్ట్ లలో ఎందుకు అంత ఇంప్రూవ్ మెంట్ కనిపించడం లేదు? పాఠాలు అర్ధమవుతున్నాయా?
  మళ్లీ ఈయన మొదలు పెట్టాడే.. “అసలు ఇంట్లో దెబ్బలాడి హైద్రాబాద్ లోనే చేరాల్సింది ఆర్ట్స్ లో. ఇక్కడి కొస్తే రోజూ ఉజ్జీని కలవచ్చనుకున్నాను.. ఇరుక్కు పోయాను”అనుకున్నాడు.
  “ఏం బాబూ! మాట్లాడవేం?”
  చూశారా అన్నట్లు వెంకట్ తలెగరేశాడు.
  ఆలోచనల్లోంచి బైటికొచ్చిన బంటీ ఆయనకేసి చూశాడు. ఏదో అడిగారు. తల అడ్డంగా ఊపేస్తే పోలా..
  “ఏ లెసన్స్ అర్ధం అవడం లేదు?”
  “ఫిజిక్సండీ”
  “ఫిజిక్స్ లో నీకున్న డౌట్స్ అన్నీ ప్తీ ఛాప్టర్ కీ కాగితం మీద రాసి తీసుకురా. ఇక్కడే కూర్చో పెట్టి క్లియర్ చేయిస్తారు ప్రిన్సిపాల్ సార్.” అన్నారు చంద్రశేఖరం గారు.
  బంటీ ప్రోగ్రెస్ షీట్ చంద్రశేఖరంగారి ముందు పెట్టాడు వెంకట్. ఫిజిక్స్ ఒక్కటే కాదు. అన్ని సబ్జంక్ట్స్ లోనూ తగ్గిపోతున్నాయి మార్కులు. ఫస్టియర్లో ఎయిటీ పెర్సెంట్ వస్తే సెకండ్ ఇయర్లో అరవై శాతానికి మించలేదు ఎందులోనూ.. ఇంగ్రీష్ తప్ప.
  “నీకు ఉజ్వల తెలుసా?”
  ఒక్క సారి గుండె ఆగి పోయినట్లయింది. వీళ్లకి తెలిసిపోయిందా! అమ్మో.. బి కేర్ ఫుల్.
  “మేం ఒకే స్కూల్లో చదివామండీ.” అనవసరమైన సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బంటీ గొతు సవరించుకున్నాడు.
  “ఆమె ఎలాంటి అమ్మాయి?”
  “చాలా మంచిదండీ. వెరీ లైవ్లీ” చెప్తుంటే బంటూ కళ్లు మెరవడం వంకట్ దృష్టిలో పడింది.
  “తనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?”
  “నో సర్. ఎవరూ లేరు.” వెంటనే రియాక్టయాడు.
  “అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?”
  దొరికి పోయాన్రా అనుకున్నాడు.
  “తను అలాంటిది కాదు సార్. చాలా మంచి అమ్మాయి.” బంటీకి, తన మూలంగా ఉద్దాని వీళ్లు అనుమానిస్తున్నారేమోననిపించింది.
  “నీకు బాగా తెలుసా?”
  “తెలుసు సార్” ఎయిత్ క్లాస్ లో తన ఫ్రెండ్స్ లౌ లెటర్ ఇవ్వడం, దాన్ని ఉజ్వల పట్టించుకోకుండా వదిలెయ్యడం.. అన్నీ చెప్పాడు బండీ.
  “వాట్? ఎయిత్ క్లాస్ లో లౌలెటరా?” నమ్మలేనట్లుగా అడిగాడు వంకట్.
  “యస్ సార్. నేనే హెల్ప్ చేశాను, వాళ్లకి ఇంగ్లీష్ ,రిగ్గా రాదని. రవి, వేణు భయపడి పోయారు ముందు.
  “మరి.. తరువాతేమయింది చెప్పు.” చంద్రశేఖరంగారు కుతూహలంగా అడిగారు.
  “వాళ్ల డాడీ కొడతారేమోనని భయపడ్డారు సార్. కానీ ఆయన మంచాయన. వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.”
  “రవి, వేణు ఇప్పుడెక్కడున్నారు?” చంద్రశేఖరంగారు కోపంగా అడుగుతున్నట్లనిపించింది బంటీకి.
  ఇప్పుడు వాళ్ల సంగతెందుకు? ఇన్నేళ్ల తర్వాత పనిష్ చేస్తారా?
  “అదంతా అప్పుడే మర్చిపోయారు సార్. వట్టి క్రష్. అంతే. హైద్రాబాద్ లో ఇంటర్ చదువుతున్నారు. వాల్లతో అస్సలు టచ్ లేదు. ఇందులో ఉజ్వలకి అసలు ఏం పార్ట్ లేదు. తనకి ఏం తెలీదు. అసలా లెటర్ తను చదవనే లేదు. వాళ్ల డాడీ తీసేసుకున్నారు.” గడగడా మాట్లాడుతున్న బంటీని పరిశీలనగా చూశారు వెంకట్, చంద్రశేఖరంగారు.
  ఇంటర్ చదువుతున్న పదహారేళ్ల కుర్రాడు, ఎయిత్ క్లాస్ లో జరిగింది టీనేజ్ క్రష్ అంటున్నాడు. ఊహలకి అందనంత ఎదిగి పోయారా ఈ పిల్లలు? లేక అమాయకత్వమా? ఒకటి రెండు మాటల్లో తప్ప జవాబివ్వని బంటీ ఆపకుండా ఎలా మాట్లాడుతున్నాడో.. స్నేహితుల్ని రక్షించుకోవాలనే ప్రయత్నమా?
  “ఉజ్వలనేం అనకండి సార్.” బంటీని చూస్తుంటే కాళ్ల మీద పడిపోయేలా ఉన్నాడు.
  “అలాగే.. అలాగే. ఏం అనం. నువ్వేం వర్రీ అవకు.” వెంకట్, ఇంక వెళ్లు అన్నట్లు సైగ చేశాడు.
  “ఇదంతా ఎందుకడుగుతున్నారు సార్?”
  “నిన్న రాత్రి నుంచీ ఉజ్వల కనిపించడం లేదు.” నెమ్మదిగా అన్నాడు వెంకట్.*
                                     ………………
  “ఏం కోరుకున్నావోయ్?” సాయిబాబా గుళ్లోంచి బైటికి వస్తూ అడిగాడు సంతోష్.
  “నాకు పెద్ద కోరికలేం లేవు. నాకూతుర్ని, మామూలుగా అందర్లాగ పిల్లా పాపల్తో కాపురం చేసుకుంటుంటే చూడాలని తప్ప. సరైన సమయంలో పెళ్లయ్యేలాగా, మంచి భర్త లభించే లాగా.. అదిసంతోషంగా ఉండేలా చూడమని బాబాగారిని వేడుకున్నాను” ఊదీ పొట్లాలు బాగ్లో సర్దుకుంటూ అంది సరస్వతి.
  “నెరవేరడం సంగతెలా ఉన్నా, కోరుకునేటప్పుడు కాస్త మంచివి కోరుకోవచ్చు కదా! నేను చూడు.. ఉజ్జీని మంచి ఇంజనీర్ ని చెయ్యమనీ, అమెరికా వెళ్లేలాగ చూడమనీ, యెమ్మెస్ అయ్యాక మరొక పెద్ద ఇంజనీర్ని జోడీగా చూడమనీ..”
  “అమెరికా లో ఉండే కూతుర్ని చూడాలంటే కళ్ల కాయల్లా చేసుకునిఎదురు చూసే శక్తి ఇమ్మనీ,” సంతోష్ మాటల్ని మధ్యలో ఆపేసింది సరస్వతి.
  “ఇక్కడే నీకూ నాకూ పడంది. అందరూ ఎంత సంతోషంగా పంపుతారో చూడు. చక్కగా చదువుకుంటోంది కదా, ఇంకా పెద్ద చదువులు చదవాలని కోరుతావా, పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ పడుంమంటావా?”
  “అదే నేనూ, మానాన్న అనుకునుంటే మీకీ సంసారం ఉండేది కాదు. మీ కూతురూ ఉండేది కాదు. అది ఏం పెద్ద చదువులు చదువుతోందో ఓ సారి ఫోన్ చేసి కనుక్కోండి.”
  పక్కనే ఉన్న యస్ టిడి బూత్ లోకి వెళ్లారు సంతోష్, సరస్వతి.
  “ది ఎయిర్ టెల్ కస్టమర్ యు డయల్డ్....” పది రింగులయ్యాక వచ్చిన భావ రహితమైన గొంతు విని ఫోన్ పెట్టేశారు.
  “క్లాసులోనో ట్యుటోరియల్ లోనో బిజీగా ఉందేమో” అన్నాడు సంతోష్.


  “ఉజ్జీ!” తలుపు తీసిన ఊర్మిళ ఆపుకోలేని ఉత్సాహంతో ఉజ్వల రెండు చేతులూ పట్టుకుని గిరగిరా తిప్పేసింది.
  “ఉండవే, కళ్లు తిరుగుతున్నాయి. ముందు కడుపులో ఏమైనా పడెయ్యి.”
  “దా! నా రూమ్ లోకి వెళ్దాం. అక్కడ నువ్వు స్నానం అదీ కానిచ్చి రిలాక్స్ అవుతూండు. నేను పది నిముషాల్లో వేడి వేడి ఇడ్లీ, సాంబార్ రెడీ చేస్తాను”
  “ఐతే వంట నేర్చేసుకున్నావా?”
  “అంత సీన్ లేదులే. మమ్మీ చేసి పెట్టింది. మైక్రోవేవ్ లో వేడి చెయ్య్టటమే. అదే గ్రేట్ జాబ్.”
  “ఎలా మానేజ్ చేసి వచ్చావో చెప్పు ముందు.” ఆవురావురుమంటూ ఇడ్లీలు లాగిస్తున్న ఉజ్వలని అడిగింది.
  “ఏవుందీ.. వెరీ ఈజీ. మంజులకి లెటర్ రాసి, డే స్కాలర్స్ బస్ లో ఎక్కుతే ఎంక్వయిరీ చేస్తారని, ఒక కిలో మీటరు నడిచి, ఆర్ టిసీ బస్సెక్కి, బస్టాండ్ కి వచ్చాను. అక్కడి నుంచి, బస్సెక్కి, హైద్రాబాద్ చలో. సరే కానీ, మీ మమ్మీ బాంక్ కి వెళ్లే వరకూ బస్టాండ్ లో వెయిట్ చెయ్యమన్నావు కదా.. పిచ్చ బోర్ కొట్టేసిందనుకో. ఎవరైనా తెలిసిన వాళ్లు కనిపిస్తారేమోనని గాట్ స్కేర్డ్. నువ్వెలా ఉండిపోయావూ కాలేజ్ కెళ్లకుండా?”
  “మార్చ్ వస్తోంది కదా! ఈ నెలంతామమ్మీ, డాడీ చాలా బిజీ. వాళ్లున్నప్పుడు కాలేజ్ కని బయల్దేరి వెళ్లి, వాళ్లెళ్లగానే తిరిగి వచ్చేశాను. నాకు ఇంటికి రాగానే ఆకలేస్తోంది, కాసిని ఇడ్లీలు ఎక్కువ పెట్టమని చెప్పాను. మమ్మీలసంగతి తెలుసు కదా.. ఎనిమిదిడ్లీలు ఎక్స్ట్రా పెట్టింది.నిన్న నీ యస్సెమ్మెస్ చూసి భలే హాపీ ఫీలయ్యాలే.”
  ఊర్మిళ పేరెంట్స్ ఇద్దరూ బాంక్ ఎంప్లాయీస్. ఒక అక్క.. ఇంజనీరింగ్ చేస్తోంది. చిలుకూరు దగ్గర కాలేజీ. తను ఉదయం ఆరింటికల్లా వెళ్లిపోతుంది.
  “నేనైతే, స్టూడియో వాళ్ల యస్సెమ్మెస్ చూడగానే హార్టాగిపోతుందేమో అనుకున్నాను. అంత ఎగ్జైటెడ్. వెంటనే నీకు యస్సెమ్మెస్ పంపా. ఇంక అప్పట్నుంచీ ఎలా రావాలా అని ప్లాన్. గాడ్ నాకు ఎలా హెల్ప్ చేశాడో చూశావా?”
  ఏంటన్నట్లుగా ఊర్మిళ కళ్లెగరేసింది.
  “మా మమ్మీ, డాడీ, త్రీ డేస్ షిర్డీ వెళ్లారు. వాళ్లు తిరిగొచ్చే లోపు నేను హాస్టల్లో ఉండచ్చు.” హాపీగా చెప్పింది.
  “మరి హాస్టల్లో..”
  “మంజులకి చెప్పాగా! వాళ్లు కాంటాక్ట్ చేసినా డాడీ దొరకరు. నేను వెళ్లి, సెంట్ దెబ్బ కొట్టి, ‘మా మమ్మీతో నేను కూడా వెళ్లాల్సి వచ్చింది.. మీకు చెప్దామంటే మీరు లేరు’ అంటా. ఇంకో లక్కేంటంటే, మా హస్టల్ మేట్ మదర్ పోతే మా వార్డెన్ మేమ్ కూడా వెళ్లారు. గాడ్ ఈజ్ గ్రేట్. అందుకే ఈ టైమ్ లోనే గౌరీ వాళ్ల మదర్ పోయారు.”
  “అరే.. హౌ సాడ్. పాపం కదూ!”
  “పాపమే.. వాళ్లు చాలా పూర్ కూడా. అదసలే బుక్ వార్మ్. ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది. దేని మీదా ఇంట్రెస్ట్ లేదు.”
  “నీ ప్రోగ్రామ్ కి ప్లాన్ చేసుకున్నావా?” ఊర్మిళకి భయం వేసింది. అంతా మోరోజ్ గా అయిపోతోందని. అందుకే టాపిక్ మార్చేసింది.
  “ఓ.. రేపు ఎల్లుండి షూటింగ్. మనం ఇవేళ షాపింగ్ చెయ్యాలే! మంచి డ్రెస్ కొనుక్కుంటా. నాదగ్గరన్నీ అమ్మమ్మ డ్రెస్ లే. ఈ టూ డేస్ నేనిక్కడుండచ్చా?”
  “నో ప్రాబ్లమ్. పగలంతా ఎలాగా ఎవరూ ఉండరు. మమ్మీకి చెప్పా నువ్వేదో పని మీద వస్తున్నావని. నాకు తెలీకుండానే, మీ పేరెంట్స్ లేరనీ, ఊరికెళ్లారనీ గాస్ కొట్టా. అదే నిజమయింది.” అంది ఊర్మిళ.
  “యా.. యాజ్ ఐ టోల్డ్ యు, గాడ్ ఈజ్ విత్ మి. నేను బాగా చెయ్యాలే.. చేసి ఆదిత్యతో కాంటాక్ట్ బాగా పెంచుకోవాలి. హో.. ఐ కాంట్ వెయిట్ టు సీ హిమ్.” బాగ్ లో ఉన్నవన్నీ ఊర్మిళ మంచం మీద చిందరవందరగా పడేసింది. వంద రూపాయల నోట్లన్నీ ఏరి ఒక దగ్గరగా పెట్టింది.
  “ఊర్మీ! హాండ్ బాగ్ ఒకటిస్తావా?”
  “ష్యూర్.” ఊర్మిళ, వాళ్ల అక్క హాండ్ బాగ్ లోని సామాన్లన్నీ అక్క మంచం మీద కుమ్మరించి, అక్క బాగ్ ఇచ్చింది.
  “అంత మనీ ఎక్కడిదే?”
  “ఎలాగో మానేజ్ చేశాగా..” రంగు మారుతున్న గొలుసు కేసి చూస్తూ అంది ఉజ్వల. అన్నట్లు ఓ ఫాన్సీ చైన్ కూడా కొనుక్కోవాలనుకుంటూ.
  విడిచిన బట్టల్ని అలాగే బాగ్ పాక్ లో కుక్కి, మిగిలిన వస్తువుల్ని ఇంకో అరలో పడేసి, చలో అంది.


  ఇంటి తలుపు తాళంవేసి స్కూటీ ఎక్కిన ఊర్మిళ వెనకాల ఎగిరి కూర్చుంది.
  ఊర్మిళ స్కూటీ స్టార్ట్ చేసి తయారుగా ఉంది.
  “అబ్బ.. స్కూటీ డ్రైవ్ చేసి ఎన్నాళ్లో అయినట్లుందే. ఎంత సేపూ క్లాసులు, ట్యుయోరియల్స్, టెస్టులూ.. పరమ బోర్.”
  “ఒక్క పిక్చర్ కూడా చూడలేదా?” ఊర్మిళ గట్టిగా అరిచింది. హెల్మెట్ లోంచి వినిపించదుగా మరి.
  “నో మూవీస్, నో అవుటింగ్స్. డ్రెస్ కొనుక్కున్నాక మనం పిజ్జా కార్నర్ కెళ్దాం. కరువు తీరా తినాలి.”
  ఇద్దరూ, షాపర్స్ స్టాప్ దగ్గర పార్క్ చేసి లోపలికెళ్లారు.
  “ఏమైనా న్యూ వెరైటీస్, న్యూ డిజైన్స్ వచ్చాయేమో చూద్దాం.” ఆఫ్ అని రాసున్న రాక్స్ వదిలేసి, ఫ్రెష్ స్టాక్ దగ్గరకెళ్లారిద్దరూ.
  “ఇదైతే కామెరాలో బాగా కనిపిస్తుందే” ఊర్మిళ ఒక డ్రెస్ తీసింది. నలుపు, ఎరుపు చారలున్న మిడీ. దాని మీద నల్లని పొట్టి జుబ్బా.. కొంచెం లో కట్ తో.
  “ఓ! వండ్రఫుల్. కానీ మా మమ్మీ చంపేస్తుందే! నో ఛాన్స్.” ఉజ్వల వెనక్కి తిరిగింది.
   “కమాన్ యార్! మీ మమ్మీ ఎక్కడ చూస్తుంది? యు లుక్ స్మాషింగ్ ఇన్ దిస్ డ్రెస్. అసలు పెద్ద వాళ్లు హీరోలతో ఇంటర్వ్యూలనగానే ఛానల్ మార్చేస్తారు కదా!”
  నవ్వుకుంటూ డ్రెస్ తీసుకుని జ్యువలరీ వింగ్ కి వెళ్లారు.సన్నటి సిల్వర్ చైన్ కి ఎర్రరాళ్ల పెండెంట్, అదే డిజైన్ హాంగింగ్స్ తీసుకున్నారు. బిల్ నాలుగు వేలయింది. బిల్ కట్టేసి, ఫుడ్ కోర్ట్ కెళ్లి బర్గర్స్ ఆర్డరిచ్చారు.
  “ఇంక నా దగ్గర టూ థౌజండ్ ఉందే. మిగిలింది కేర్ఫుల్ గా వాడుకోవాలి. నిన్ను మీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేను స్టూడియోకి వెళ్తాను.”ఉజ్వల కోక్ తాగుతూ అంది.
  “ఏయ్! ఇట్స్ నాట్ ఫెయిర్. నేను కూడా ఆడియన్స్ లోఉండచ్చు కదా!”
  “ఓహ్.. “ చేతిలో తల వెనుక కొట్టుకుని, “వాట్ ఎ డంబ్ అయామ్? ఇద్దరం వెళ్దాం. మరి మీ ఇంట్లో, కాలేజ్ లో..” ఏం చెప్తావన్నట్లు కళ్లెగరేసింది.
  “నువ్వు ఇంత మానేజ్ చెయ్యగాలేంది నేనామాత్రం చెయ్యలేనా? నాది కామర్స్ గ్రూపే కదా! అంత ఫీవరిష్ గా ఉండదు వ్యవహారం.” అంది ఊర్మిళ.
  అమ్మా, నాన్నా ఇద్దరూ బాంక్ ఆఫీసర్లవడంతో ఊర్మిళకి యమ్సెట్ బాధ తప్పింది.
  “ఎంత లక్కీనే.. నేను కూడా హాయిగా నీతోపాటు ఇక్కడే చేరితే లైఫ్ ఎంజాయ్ చేసేదాన్ని. గట్టిగా అడిగితే డాడీ కాదనరు. మమ్మీ ఇంకా హాపీ. మమ్మీ యమ్మెల్స్ తప్పించుకుందామని హాస్టలుకెళ్లి అక్కడ ఇరుక్కుపోయాను. పాన్ టు ఫైర్ అయింది నా పని.” దీనంగా అంటున్న ఉజ్వలని ఓదార్చింది ఊర్మిళ.
  “డోంట్ వర్రీ యార్. ఇంక త్రీ మంత్స్ లో యు ఆర్ అవుట్. మనిద్దరం జాలీగా బి.కామ్ లో చేరుదాం. అయినా నీ అంత లక్కీ కాదు నేను. ఎన్ని యస్సెమ్మెస్ లు కొట్టినా నాకొచ్చిందా ఆదిత్యతో మాట్లాడే ఛాన్స్? మన ఫ్రెండ్స్ అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా నీ గురించి?”
  “యా! దటీజ్ ట్రూ.” ఎర్రబడిన బుగ్గలతో మెరుస్తున్న కళ్లతో అంది ఉజ్వల.


   మధ్యాన్నం జరిగిన క్లాసులన్నీ బలవంతంగా విన్నాడు బంటీ.. లేదు విన్నట్లు నటించాడు. వెంకట్ సర్ ఎంత కూల్ గా పిడుగులాంటి మాటన్నారు? ఉజ్జీ కనిపించడం లేదా? మరి అందరూ ఇక్కడేం చేస్తున్నారు? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? అంకుల్ వాళ్లకీ తెలుసా?
   ఎక్కడికెళ్లిపోయింది ఉజ్జీ? తలంతా దిమ్ముగా ఉంది. టీ టైములో రెండు మగ్గుల టీ తాగాడు. సాయంత్రం స్లిప్ టెస్ట్ ఉంది. అందరూ ఎక్కడ పడితే అక్కడ కూర్చునీ, నిల్చునీ, పడుక్కునీ చదివేస్తున్నారు. టు హెల్ విత్ ద టెస్ట్..
   ఉజ్వల ఎక్కడ తప్పిపోయిందో! లేదా.. తన ఉజ్జీని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో! ఆది తెచ్చిపెట్టే బొకేని ఎవరికివ్వాలి? నో.. ఉజ్జీ తప్పక తిరిగొస్తుంది. చుట్టాలింటికెళ్లుంటుంది. ఎందుకూ.. రేప్పొద్దున్న కిటికీలోంచి చూస్తే ఉజ్జీ కనిపిస్తుంది.
  వేణుగాడికి ఫోన్ చేస్తే! ఇలాంటి ఎమర్జెన్సీ వస్తుందనే డాడీని సెల్ ఫోన్ కొనివ్వమన్నాడు.
  ఈ పెద్దవాళ్లు పిల్లల్ని ఎప్పడర్ధం చేసుకుంటారో! కామన్ హాల్ కి వెళ్లి మాట్లాడితేఅందరికీ తెలిసిపోతుంది. ఛా.. ఎవరికీ చెప్పటానికి లేదు.
  “గాడ్! ప్లీజ్ హెల్ప్ మి. సేవ్ మై ఉజ్జీ!”
  “రేయ్ బంటీ! ఏమైందిరా? ఏంటంటున్నావు?” ప్రవీణ్ ఆదుర్దాగా వచ్చి అడిగాడు.
  “నేనేం అన్లేదే..” తడబడుతూ అన్నాడు బంటీ.
  “మరేంటలా ఉన్నావు? ఆ చెమట్లేంటి? ఓ మై గాడ్.. పోరింగ్ స్వెట్. ఆర్ యు ఓకే?”
  బంటీ నుదుటిమీద చెయ్యేసి చూశాడు. మంచులా తగిలింది. చెమట్లు కారుతున్నాయి కదా!
  “పడుకో. నేనిప్పుడే వస్తా” ప్రిన్సిపాల్ రూమ్ కి పరుగెట్టుకుంటూ వెళ్లాడు ప్రవీణ్.
  “సర్..ఐ థింక్ బంటీ ఈజ్ వెరీ సిక్.”
  వెంకట్, చంద్రశేఖరంగారు వెంటనే వచ్చారు.
  “వాట్ హేపెన్డ్?” బంటీ చెయ్యి పట్టుకుని పల్స్ చూస్తూ అడిగాడు వెంకట్.
  “నథింగ్ సర్. అయామ్ ఆల్రైట్.” బంటీ లేవబోయాడు.
  “నో..నో. ఏమయింది? లంచ్ తిన్లేదా?” హైపో గ్లసీమియా లాగుంది అనుకుంటూ అడిగాడు వెంకట్.
  ఫాదర్ లో స్టాఫ్ అంతా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అవాలి తప్పని సరిగా.
  “ప్రవీణ్! నా రూమ్లో కార్నర్ లో గ్లూగోజ్ పాకెట్ ఉంటుంది. తిరుపతిని తీసుకుని రమ్మను త్వరగా.”
  ప్రవీణ్ పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్లాడు.
  “ఏంటమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకిలా ఐపోతున్నావు? విషయం చెప్పు” చంద్రశేఖరం గారు సున్నితంగా బంటీ చెయ్యి పట్టుకుని అడిగారు.
  “ఏం లేదు సార్. అయామ్ పెర్ఫెక్ట్ లీ ఆల్రైట్. జస్ట్ వీక్ నెస్. అంతే.” బంటీ అన్నాడు ఖంగారుగా.
  “ఇదిగో సార్.” పెద్ద గ్లాసునిండా గ్లూకోజ్ నీళ్లు పట్టుకొచ్చాడు తిరుపతి.
  “తాగు బంటీ!సర్దుకుంటుంది.” వెంకట్ అన్నాడు.
  బంటీ లేచి కూర్చుని నెమ్మదిగా తాగాడు.
  “ఇంకో గంటలో నేను హైద్రాబాద్ బయలుదేరుతున్నాను. నువ్వుకూడా నాతో వస్తున్నావు. బట్టలు, బుక్స్ సర్దుకో” అన్నారు చంద్రశేఖరంగారు. ఆయన మాటలకి గుండెల్లో రాయి పడింది బంటీకి. ఇంకేమైనా ఉందా? మమ్మీ పెద్ద ఇష్యూ చేస్తుంది. ఏదో చెప్పబోయాడు..
  “ఏం మాట్లాడకు. మీ పేరెంట్స్ నిన్నేం అనకుండా నేను చూస్తాను. వెంకట్! బంటీ పేరెంట్స్ తో మాట్లాడుదాం పదండి..” అంటూ అక్కడ్నుంచి కదిలాడు.
  “ఈ అబ్బాయిది ఏదో సైకిక్ ప్రాబ్లం. మనం డీల్ చెయ్యలేం. ఏమన్నా అయిందంటే మన పీకకి చుట్టుకుంటుంది. ముందర మాటలు పడ్డా ఫరవాలేదు.” వరండాలో నడుస్తూ అన్నారు చంద్రశేఖరం.
  
  ఫోన్ రింగవుతుంటే ఎత్తింది శారద.
  “హలో! ఎవరండీ?”
  “ఫాదర్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ నండీ. బంటీ మదర్ కానీ ఫాదర్ కానీ ఉన్నారా?”
  “బంటీ మదర్ ని. చెప్పండి”
  “కంగారు పడకండి. బంటీకి హెల్త్ కొంచె బాగాలేదు. అక్కడికి తీసుకొస్తున్నాం. మేం వచ్చేసరికి అరౌండ్ లెవెన్ అవుతుంది.” చెప్పాడు వెంకట్.
  “హలో..హలో” ఫోన్ కట్ అయిపోయింది. శారదకి కాళ్లూ చేతులూ ఆట్టం లేదు. ఏం చెయ్యాలి? ఈ మధ్యన చాల్రోజులు పోన్ పన్చెయ్యలేదు. అందుకే తమకి తెలియలేదా?
  తను చేద్దామంటే, ఔట్ గోయింగ్ లేదు. బైటికెళ్లి చేద్దామన్నా నంబరు మూర్తి దగ్గరుంది. మూర్తి ఆఫీస్ కి చేద్దామంటే అతను దార్లో ఉంటాడు. కాళ్లలోంచీ నీరసం వచ్చి కుర్చీలో కూలబడింది శారద. గుండె దడదడలాడుతుండగా.
  ఏమయుంటుదబ్బా? పరీక్షలింకా మూడు వారాల్లోకొచ్చాయి. ఇప్పుడు తీసుకొస్తున్నారంటే.. మనస్సు పరిపరి విధాలపోయింది. చిన్నప్పటి నుంచీ బంటీ సన్నగా ఉన్నా, ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. జలుబూ, చిన్న చిన్న దెబ్బలూ తప్ప ఏం ఎరగడు.
  “దేవుడా! నా బాబుకేం అవకుండా చూడు తండ్రీ!” కళ్లలోంచి అప్రయత్నంగా నీళ్లు కారిపోతున్నాయి శారదకి.
  “అమ్మా! ఎందుకేడుస్తున్నావూ?” ట్యూషన్నుంచొచ్చిన చంటి అడిగాడు గాభరాగా.
  “అన్నకి బాగా లేదుట. తీసుకొస్తున్నామని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారు.” శారదకి ఏడుపాగట్లేదు.
  అప్పుడే తలుపు తెరుచుకుని వస్తున్న మూర్తి ఆందోళనగా శారద దగ్గరకొచ్చాడు. మూర్తిని చూడగానే భోరుమంది శారద.
  “ఏమయింది శారదా? ఏడుపు ఆపి ఏం జరిగిందో చెప్పు. అలా ఏడుస్తుంటే నాకెలా ఉంటుందీ?”
  వెక్కిళ్ల మధ్య అంతా చెప్పింది. మూర్తి వెంటనే బైటికెళ్లి ఫోన్ చేశాడు. ప్రిన్సిపాల్ ఆఫీసులో ఎవరో ఎత్తారు.
  “బైటికెళ్లారండీ.”
  “సెల్ నంబర్ ఇస్తారా?” నోట్ చేసుకుని వెంటనే సెల్ కి చేశాడు. నో రెస్పాన్స్. సిగ్నల్లేదేమో.. కాళ్లీడ్చుకుంటూ ఇంటికొచ్చాడు.
  “దొరకట్లేదు శారదా! ఎదురు చూడ్డం తప్ప ఏం చెయ్యలేము.”
  టెంత్ క్లాస్ చదువుతున్న చంటి పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. వంటింట్లోకెళ్లి టీ చేసి తీసుకొచ్చాడు. మూర్తి తను తాగి బలవంతంగా శారద చేత తాగించాడు.
  వంటయిపోయినట్లు గమనించాడు చంటి. శారద ఐదులోపే వంట చేసేస్తుంది రోజూ.
  “అన్నకిష్టం లేని సబ్జెక్ట్ లో చేర్పించారు. అందుకే పరీక్షలముందు జ్వరం తెచ్చుకున్నాడు. అంతకంటే పెద్ద డేంజరేం ఉండదు.” అనుకున్నాడు చంటి.
  అదే పైకి అంటే ఇంకా గొడవ చేస్తుంది అమ్మ. మాట్లాడకుండా తన పుస్తకాలు తీసుకుని లోపలికి వెళ్లి పోయాడు.
  మూర్తి బట్టలు మార్చుకుని వచ్చాడు. శారద అలాగే ఎదురు చూస్తూ కూర్చుంది. అలా కుర్చీలోనే కునికిపాట్లు పడుతూ.. లేచి టైము చూస్తే తొమ్మిదయింది.
  మూర్తి లేచి వంటింట్లోకెళ్లి సాంబారు అన్నం కలుపుకొచ్చాడు.
  “దా శారదా! ఇద్దరం కాస్త తిందాం. నాకు ఆకలికి కడుపులో పోట్లు వస్తున్నాయి. నీరసంగా ఉంది.”
  “నాకాకలిగా లేదు. మీరు తినండి.”
  “సరే ఐతే. నేను కూడా తినను.”
  తప్పదన్నట్లుగా శారద లేచింది.
  “తిను. వాడు బాగానే ఉంటాడులే. ఏ జ్వరమో వచ్చుంటుంది. వాళ్లు భయపడి పోయి, మనకెందుకు బాధ్యతని తీసుకొస్తుంటారు.” శారద నోట్లో ముద్ద పెట్ట బోయాడు.
  చెయ్యి అడ్డుపెట్టి, నేను తెచ్చుకుంటా, మీరు తినండి” అంటూ లోపలికెళ్లింది శారద.
  చంటి ఎనిమిదింటికే అన్నం తినేసి పడుకున్నాడు. వాడు పొద్దున్నే నాలుగింటికే లేచి ట్యూషన్ కి వెళ్తాడు. తొమ్మిదయ్యే సరికి కళ్లు మూసుకు పోతాయి. నిద్ర ఆపుకోలేడు.*
  
  ఎందుకైనా మంచిదని ఉజ్వల సెల్ ఆఫ్ చేసి పెట్టింది. ఫాదర్ లో అంతా తనకోసం వెతుకుతుంటారు. సెల్ నంబర్ దొరికే ఉంటుంది. బర్గర్ తింటూ సెల్ ఫోన్ తీసింది. పది మిస్డ్ కాల్స్.. అందులో తొమ్మిది ఒకే నంబరు నుంచి. ప్రిన్సిపాల్ దయ్యుంటుంది. ఇంకొకటి ఏదో లాండ్ నంబర్. డాడీ ట్రై చేసుంటారు.
  అన్నింటికంచే ఇంట్రెస్టింగ్.. కొత్త మెస్సేజ్, రేపు నైన్ కల్లా స్టూడియోకి రమ్మని.
  “యాహూ..” ఉజ్వల అరుపు విని చుట్టు పక్కల అందరూ వింతగా చూడ్డంతో, సిగ్గుతో తల దించుకుంది ఉజ్వల.
  “వాట్ యార్?”
  “రేపు నైన్ కి మనం స్టూడియోలోఉండాలి. అబ్బ.. అయామ్సో ఎగ్జైటెడ్.” గుసగుసగా ఊర్మిళతో అంది ఉజ్వల.
  “నేను కూడా.. అయామ్ సో హాపీ ఫర్ యూ.. నీకు తెలుసా! యాభైవేల యస్సెమ్మెస్ లు వస్తే ముగ్గురిని సెలెక్ట్ చేశారుట. అందులో నువ్వున్నావు. నిన్న టివీలో చెప్తుంటే విన్నా.”
  “రియల్లీ! నేను హాస్టల్ జైల్లో ఉన్నా కదా! ఏ న్యూస్ తెలీదు. మన ఫ్రెండ్సందరికీ తెలుసా?”
  “ఎవరికీ చెప్పలేదు. వాలంటీన్స్ డే నాడు వాళ్లందరూ మన ప్రోగ్రాం టివీలో చూసి సర్ప్రైజ్ అవాలని. అందరికీ ఫోన్ చేసి, ‘డోంట్ మిస్ ద ప్రోగ్రాం’ అని చెప్పా. ఐనా మనవాళ్లు ఆదిత్య ప్రోగ్రాం మిస్సవడమే..” కళ్లు చక్రాల్లా తిప్పుతూ అంది ఊర్మిళ.
  బర్గర్ తినేసి ఇద్దరూ హైద్రాబాద్ సెంట్రల్ కి వెళ్లారు. అక్కడ కొత్తగా వచ్చిన ఆదిత్స సి.డి ఉందేమో అడిగారు. బాడ్ లక్. అతని పిక్చర్స్ ఏవీ సిడిల కింద విడుదల చెయ్యరుట డిమాండ్ పోతుందని. తిట్టుకుంటూ సెంట్రల్ అంతా ఒక రౌండ్ వేశారు.
  “నీకు తెలుసా? ముగ్గురిలో ఆదిత్య తనకి నచ్చినవాళ్లని సెలెక్ట్ చేస్తే సెంట్రల్ వాళ్లు గిఫ్ట్ కూపన్ ఇస్తారు” ఊర్మిళ అంది ఉన్నట్లుండి.
  “ఎంత?”
  “టెన్ థౌజండ్.”
  “త్వరగా పద. ఇంటికెళ్లి కాస్త ప్రిపేరవుతాను.”


  వీధిలో హారన్ మోత విని టైము చూశాడు మూర్తి. పదిన్నర. శారద అప్పటికే గుమ్మం దగ్గరుంది. ఆగిన వాన్ లోంచి చంద్రశేఖరంగారు, వెంకట్ దిగారు. వెనకాలే బంటీ, నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ.
  “ఇలా అయిపోయాడేంటీ? మొహం అంతా పీక్కు పోయిందలాగ..” శారద గాభరాగా బంటీ దగ్గరకెళ్లింది.
  బంటీ, అమ్మని చూసి జీవంలేని నవ్వు నవ్వాడు.
  చంద్రశేఖరంగారు, ఇంట్లోకి వెళ్లి మూర్తిని కలిశారు.
  వెంకట్ బంటీతో పాటే ఇంట్లోకి వెళ్లాడు. ఒకసారి ఇంటిని కలియజూసి అనుకున్నారు చంద్రశేఖరంగారు.. “వీళ్లు ఎన్ని కష్టాలు పడి ఫాదర్ లో చదివిస్తున్నారో.. బూడిదలో పోసిన పన్నీరు.” అని.
  బంటీని వెనుక గదిలోకి తీసుకెళ్లింది శారద. అది వంటగది కమ్ పిల్లల గది.
  దగ్గరగా కూర్చో పెట్టుకుని, కళ్లనిండా నీళ్లతో అడిగింది, “ఏమయింది నాన్నా?”
  “నిద్దరొస్తోందమ్మా” అంటూ అక్కడే నేల మీద పడుక్కుని నిద్రపోయాడు బంటీ.
  చేసేదేం లేక శారద ముందు గదిలోకి వెళ్లంది.
  వెంకట్ అంతా వివరించాడు.
  “మీకు మంత్లీ రిపోర్ట్స్ పంపుతున్నాం కదా! ఒక్కసారైనా రాలేదేం? అఫకోర్స్, మేం రమ్మని మెస్సేజ్ పంపలేదనుకోండి. దాదాపు రెండు నెలల నుంచీ బంటీదే పెద్ద వర్రీ అయింది. డాక్టర్ కి చూపించాం. ఏం లేదంటారు. ఫిజికల్ గా హి ఈజ్ ఆల్ రైట్. క్రితం నెల మార్కులు బాగా తగ్గినప్పుడు వస్తారనుకున్నాం..”
  మూర్తి మెల్లగా అన్నాడు, “గుడ్ హాండ్స్ లో పెట్టాం కదా అనుకున్నాం. నాకు రావాలనే ఉంది. వస్తే నాలుగొందలవుతాయి. మాకు పదిహేనురోజుల గ్రాసం.”


  మూర్తి, శారద ఆ రాత్రంతా నిద్ర పోలేదు.
  “ఏం చేద్దామండీ? సరిగ్గా పరీక్షల ముందు ఇలా వచ్చిందేమిటీ?” శారదని జాలిగా చూశాడు మూర్తి.
  వెంకట్ చెప్పిందాన్ని బట్టి చూస్తే ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నాడు బంటీ. తగ్గే అవకాశం ఉంటే వాళ్లే ట్రీట్ మెంట్ ఇంప్పించే వాళ్లు. పరీక్షల సంగతి అలా ఉంచి అసలు మామూలుగా చదువుకునే పిల్లాడిలా అవడానికి ఎన్నాళ్లు పడుతుందో!
  అంతా డబ్బుతో వ్యవహారం. ఎక్కడి నుంచి తేవాలీ? ముందు తామిద్దరూ డిప్రెషన్ బారి పడకుండా చూసుకోవాలి. శారదని కూర్చోపెట్టి అంతా వివరంగా చెప్పాడు.
  “ఈ సంవత్సరం బంటీ పరీక్షల గురించి మనం ఆలోచించద్దు. నీకూ, నాకూ కూడా చాలా ఒరిమి కావాలి.నువ్వు సహనం కోల్పోయి ఏడుపు గొంతుతో మాట్లాడకూడదు. బంటీ ఇంటికి రావడం మనకెంతో సంతోషం కలిగిస్తుందని చెప్పాలి. ఒక ఏడాది ఆలస్యంగా స్కూల్లో చేరాడనుకో..” సర్ది చెప్పబోయాడు మూర్తి.
  “మరి ఇంజనీరింగ్..”
  “అదొకటి చెప్పాలి నీకు. ప్రపంచంలో అందరూ ఇంజనీరింగ్ చదివే వృద్ధిలోకి రాలేదు. వేరే చాలా ప్రొఫెషన్లున్నాయి. వాడికి ఏది ఇష్టమైతే అందులో చేర్పిస్తాం. ప్రస్తుతం ‘ఇంటర్ పాసయితే చాలు’ అని చెప్పాలి వాడికి. ప్రతీ మనిషికీ కొన్ని పరిధులుంటాయి. అది బలవంతంగా దాటిస్తే నీళ్లలోంచి ఒడ్డున పడ్డ చేపల్లా కొట్టుకుంటారు.” తన ఉద్యోగరీత్యా రకరకాల మనుషుల్తో వ్యవహరించిన అనుభవం బాగా ఉపయోగ పడిందిప్పుడు మూర్తికి.
  “అలాగే! వాడు మామూలుగా అవుతే చాలు.కడుపునిండా తిని ఎన్నాళ్లయిందో? ఎలా ఐపోయాడో చూడండి.” ఏడుపు ఆపుకుంటూ బంటీ పుస్తకాలన్నీ అల్మారాలో సర్దింది శారద.
  కింద చాప పరుపులు వేసి, “ఒక గంటైనా పడుకుందాం రా. పొద్దున్న చాలా పనులున్నాయి” అన్నాడు మూర్తి.
                                      ………………
  పొద్దున్న ఐదింటికే లేచేసింది ఉజ్వల. హాస్టల్లో అలవాటు కదా! ఊర్మిళ మంచం పక్కనే పపుపు వేసుకుని పడుక్కుంది.
  ఊర్మిళ వాళ్లక్క అప్పుడే స్నానం చేసేసి తయారైపోతోంది. వంటింట్లో వాళ్లమ్మ వంట చేసేస్తోంది. పరుపు చుట్టి ఊర్మిళ మంచం కిందికి నెట్టి, బాత్రూంలో తన పనులన్నీ ముగించుకుని తయారయి ఊర్మిళని లేపింది.
  తను తెచ్చుకున్న డ్రెస్ వేసుకుని, కొన్న డ్రెస్ పాక్ చేసుకుంది.
  లేబుల్స్ అన్నీ తీసేసి, మళ్లీ ఒకసారి ఐరన్ చేసుకుని, స్టూడియోకెళ్లాక షూటింగ్ ముందు వేసుకోవాలని ప్లాన్. ఇప్పట్నుంచీ దాంతో వేళ్లాడుతే నలిగి పోదూ? పైగా ఊర్మిళ వాళ్ల మమ్మీకి నచ్చుతుందో లేదో. యమ్మెల్స్ మొదలెట్టారంటే మూడంతా ఆఫ్.
  ఊర్మిళ తయారయ్యేలోపు, ముందురోజు తను తయారయినవన్నీ ఒకసారి చూసుకుంది. కప్యూటర్ దగ్గర కూర్చుని, చాలా విషయాలు నేర్చుకుని, పాయింట్సన్నీ రాసుకుంది. నయం.. తొందరగా ఇంటికి రాబట్టి, ఊర్మిళ, యాంకర్ లా కాసేపు, ఆదిత్యలా కాసేపు యాక్ట్ చేసి, ఇంటర్వ్యూలాగా రిహార్సల్స్ చేయించింది.
  “ఊర్మీ! మమ్మీ పిలుపు విని ఉజ్జీని తీసుకుని వంటింట్లోకి వెళ్లింది.
  “గుడ్ మార్నింగ్ ఆంటీ|” ఉజ్వల విష్ చేసింది.
  నవ్వి, “ఏం తీసుకుంటావమ్మా?” అడిగింది ఊర్మిళ తల్లి.
  “మిల్క్ ఆంటీ.”
  “దా! ఊర్మీ, ఇదిగో ఈ రెండు గ్లాసులూ తీసుకో. టిఫిన్, లంచ్ రెండూ చేసేసి, హాట్ ప్యాక్ లో సర్దాను. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి.” అని  “మీ పేరెంట్స్ ఎప్పడొస్తున్నారమ్మా?” అడిగింది.
  “సన్‍డే ఆంటీ. నేను సాటర్ డే రాత్రే వెళ్లి పోవాలి.”
  “అయితే వాళ్లని కలవకుండానే వెళ్తావన్నమాట”
  “అవునాంటీ. సన్ డే టెస్ట్ లుంటాయి కద!” ఇక్కడేం పని అని అడుగుతారేమోనని భయపడుతూ అంది ఉజ్వల.
  ఊర్మిళ వాళ్ల మమ్మీకి అంత టైమ్ లేదు. బాంక్ తాళాలు ఆవిడ దగ్గరే ఉంటాయి. అందుకే త్వరగా వెళ్లాలి. “సరే నమ్మా! నేను వెళ్లాలి. ఏం అనుకోకు. ఊర్మీ, మీ ఫ్రెండ్ ని జాగ్రత్తగా చూసుకో.”
  “అలాగే మమ్మీ.” అసలు వాళ్లకి కావలసిందే అది కదా. అందరూ అరగంటలో వెళ్లి పోయారు.
  పూరీలు తింటూ మళ్లీ ఒక సారి రివైజ్ చేసుకున్నారు.
  “ఇంత ఇంట్రెస్ట్ మనం స్టడీస్ లో చూపిస్తే ఎలా ఉండేదో!” ఊర్మిళ నవ్వుతూ అంది.
  “అసలే టెన్షన్ తో చస్తుంటే, ఇప్పుడు స్టడీస్ గురించి రిమైండ్ చేస్తావేంటే?” ఉజ్వల లేచి షూస్ వేసుకుంటూ అంది.
  “ఎందుకైనా మంచిది కొంత మేకప్ సామాను కూడా తెచ్చుకో. అక్కడ వేస్తారో వెయ్యరో.”
  “నేనేం తెచ్చుకోలేదే..” నిస్సహాయంగా ఉజ్వల.
  “నేనున్నా కదా!” అభయం ఇచ్చింది ఊర్మిళ.
  
  బంటీ లేచేసరికి ఎనిమిదయింది. వట్టి నేలమీద పడుక్కున్నాడేమో, ఒళ్లంతా పట్టేసినట్లయింది. లే్స్తూనే ముడిచి పెట్టుకున్న కాళ్లని సాగదీస్తూ చుట్టూ చూశాడు. ఎక్కడున్నాడో ఒక్క క్షణం అర్ధం కాలేదు. మెల్లిగా ముందురోజు జరిగిందంతా జ్ఞాపకం చేసుకున్నాడు.
  “మమ్మీ!” బంటీ గొంతు వినిముందు గది సర్దుతున్న శారద “ఇవేళ లీవ్ లెటర్ ఇవ్వాలి. పరీక్షల ముందు లీవ్ పెడితే ప్రిన్సిపాల్ గారు ఏమంటారో” అనుకుంటూ వంటింట్లోకి వచ్చింది.
  “ఎలా ఉంది నాన్నా?” నుదుటి మీద చెయ్యేసింది.
  “అయామ్ ఆల్ రైట్ మమ్మీ.”
  “త్వరగా తయారవు. డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నారు డాడీ.”
  “అలాగే”. ఓహ్.. ఈ డాక్టర్లెందుకు? తన హెల్త్ పెర్ఫెక్ట్ గా ఉంది. ఏమన్నా అంటే మళ్లీ అదో గొడవ. చెప్పినట్లు వింటే పోలా అనుకున్నాడు బంటీ.
  మూర్తి తన కొలీగ్ కి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చాడు.
  సరిగ్గా ఉప్మా నోట్లో పెట్టుకునే ముందు గుర్తుకొచ్చింది బంటీకి.
  “మై గాడ్! ఉజ్జీ! ఏమయిందో. ఉజ్జీ కనిపించిందో లేదో. ఎక్కడుందో, ఎలా ఉందో, ఏవన్నా తిందో లేదో. తనేమో చక్కగా తినేస్తున్నాడు.” గొణుక్కుంటూ ఉప్మా ప్లేట్ నెట్టేసి లేచి పోయాడు.
  “ఏమయింది నాన్నా? కాస్త తిను. చూడెలా ఐపోయావో.” అంది శారద బాధగా.
  “తిన బుద్ధి కావట్లేదు మమ్మీ.”
  అసలు ఏం పట్టనట్లు తననిక్కడ దింపేసి ఎలా వెళ్లిపోయారో. ఎవరికీ చెప్పడానికి లేదు. ఫోన్ కూడా లేదు. బైటికి వెళ్లి చేద్దామంటే ఇంట్లో ఆరాలు. బంటీకి మమ్మీని చూస్తే చిరాకేసింది. పైగా ఇద్దరూ లీవ్ పెట్టి తనతో ఉంటార్ట. గట్టిగా ఆలోచించుకోడానికి కూడా లేదు.
  శారద బలవంతంగా చెంచాతో తినిపించింది.
  ఎవరూ తనని అర్ధం చేసుకోరు. లాభం లేదు. సాయంత్రం వరకూ చూసి ఏదో చేస్తాడు. ఉజ్జీ వాళ్ల ఇంటికేనా వెళ్లి కనుక్కోవాలి. రవిగాణ్ణీ, వేణుగాణ్ణీ కలుసుకోవాలి. అవసరమైతే పోలీస్ రిపోర్టిచ్చి వెతికించాలి. వాళ్లంటే వదిలేశారు.కానీ తనెలా ఊరుకుంటాడు? పాపం ఎన్ని కష్టాలు పడుతోందో తన ఉజ్జీ.


  ఉజ్జీ నిజంగానే అష్ట కష్టాలూ పడుతోంది.
  పొద్దున్నే తొమ్మిదింటికి రమ్మన్నస్టూడియో వాళ్లు పదకొండింటి వరకూ రాలేదు.  ఊర్మిళ హడావుడ్గా ఎనిమిది దాటగానే బయలుదేరదీసింది. అప్పట్నుంచీ బయట రోడ్డు మీదనే పడి గాపులు. పది సార్లు గేటు తీసుకుని లోపలికీ బయటికీ తిరిగారు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా, ఎంత ఉత్సాహంగా ఉండాలని ప్రయత్నించినా ఇద్దరికీ కోపం విసుగూ వచ్చేస్తున్నాయి.
  యూజ్ లెస్ ఫెలోస్. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి టైమింగ్స్ సరిగ్గా మైన్టైన్ చెయ్యద్దూ!
  తిట్టుకుంటుంటే వచ్చారు ఇద్దరు. వాళ్లని చూడగానే వాచ్ మన్ స్టూడియో తలుపు తీసి కుర్చీలు, బల్లలు.. అన్నీ దులిపాడు.
  “యస్.. ఏం కావాలండీ?”
  పింకు లాల్చీ వేసుకున్న జిడ్డు మొహం తాపీగా అడుగుతుంటే, ఒళ్లు మండిపోయింది ఉజ్వలకి.
 “హీరో ఆదిత్యతో ఇంటర్వ్యూకి సెలెక్టయాను నేను. ఇవాళ రమ్మని అపాయింట్ మెంటిచ్చారు.”
  “ఓ.. మీ పేరు?” నిరాసక్తంగా అడిగాడు. అతనికివన్నీ మామూలే.
  చెప్పింది. “కొంచెం సేపు వెయిట్ చెయ్యండి. కామెరామెన్, మేనేజర్, అసిస్టెంట్స్ రావాలి.”
  “మీరు?” అడిగింది ఉజ్వల.
  “నా పేరు చైతన్య. ప్రొడక్షన్ అసిస్టెంట్ ని. ఇతను విష్ణు. యాడ్స్ చూస్తాడు.” కొంచెంకూడా చైతన్యం లేకుండా స్తబ్దుగా అన్నాడు.
  “హాయే.. మేమ్స్. మీకు తెలిసున్న కంపెనీల వాళ్లెవరైనా ఉంటే యాడ్స్ కి నన్ను కాంటాక్ట్ చెయ్యమనండి.” విష్ణు ఉత్సాహంగా అంటూ తన విజిటింగ్ కార్డిచ్చాడు.
  ఎవరి గోల వాళ్లది, అనుకుంటూ కార్డ్ తీసి బాగ్ లో పెట్టింది ఉజ్వల.
  “మేం కూర్చోవచ్చా?”
  “ఓ.. అయామ్ సారీ. కూర్చోండి. విష్ణూ! చాయ్ తెప్పించు.” చైతన్యలో కాస్త చలనం వచ్చింది.
  పన్నెండు వరకూ కూర్చున్నారు. ఏ.సి గది. ఎక్కడా ఫాన్లు లేవు. ఏసీ ఆఫ్. ఉజ్వల,  ర్మిళ ఉస్సని ఊదుకుంటూ బైటికెళ్లారు. వాళ్లకి అలవాటే లాగుంది.. చైతన్య, విష్ణు గోదారొడ్డున కొబ్బరి తోటలో ఉన్నంత ఆనందంగా కూర్చుని పనులు చేసుకుంటున్నారు.
  నెమ్మదిగా ఒక్కొక్కళ్లే రాసాగారు. “లంచ్ అయాక మొదలెడతాం. మీరెక్కడికైనా వెళ్లి రండి.” అన్నాడు విష్ణు.
  ఉజ్వలకి కాళ్లు పీకుతున్నాయి. రెండ్రోజుల్నుంచీ ఎంత టెన్షన్ గా ఉంది? ఊర్మిళ మొహంలో నీరసం కనిపిస్తోంది. “ఏదన్నా తినొద్దాం పద.”
  మళ్లీ పిలుస్తారేమో.. ఎలాగా..
  పక్కనే ఉన్న టిఫిన్ రూమ్స్ లో ఇష్టం లేని ఇడ్లీ తిని వచ్చారు. అమ్మ ఇచ్చిన లంచ్ పాక్ మర్చి పోయినందుకు తిట్టుకుంది ఊర్మిళ.


  ఎలాగైతేనేం.. మూడు గంటలకి అందరినీ రమ్మన్నారు. ఉజ్వలతో సెలెక్టయిన వాళ్లు లంచ్ అయాక నిదానంగా వచ్చారు. అందులో వాణి అనే అమ్మాయికి టివి స్టూడియోల సంగతి బాగా తెలుసట. వాళ్ల నాన్నగారు ‘మా’ టివీలో పని చేస్తారు. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెలుసుకుంటూ సరిగ్గా సమయానికి వచ్చారు.
  “సారీ, అవుట్డోర్ షూటింగ్ లో చిక్కుకు పోయాను.” హడావుడిగా వస్తూ కెమేరా మన్ లోపలికి దూరాడు. అతను రాగానే కలకలం మొదలయింది.
  ఇంకో అరగంట అయింది. “మిస్ వాణీ!” చైతన్య పిలవగానే టక్కున లోపలికి దూరింది వాణి.
  ఉజ్వల అక్కడున్న విష్ణుతో దెబ్బలాడింది. “మేం ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడొచ్చిన అమ్మాయిని ముందు పిలిస్తారా! అన్యాయం.”
  “నాకు తెలీదు మేడమ్. అది నా ఫీల్ట్ కాదు.” నిర్వికారంగా పని చేసుకుంటూ జవాబిచ్చాడు విష్ణు.
  అక్కడే కూర్చుని, లోపల ఏం జరుగుతోందో అనే ఆదుర్దాతో.. ముందుగా పిలవలేదన్న కోపంతో నిముషాలు లెక్క పెట్టారు స్నేహితురాళ్లిద్దరూ.
  ఎలాగైతేనేం.. ఉజ్వలకి పిలుపొచ్చింది. అప్పటికి సాయంత్రం ఆరయింది. పొద్దుట్నించీ ఎండలో వేళ్లాడ్డం వల్ల జుట్టంతా రేగిపోయి, మొహం అంతా చెమట పట్టి జిడ్డుగా, ఉక్రోషంతో కళ్లు ఎర్రగా అయి, షూటింగ్ అయే స్టూడియోలోకి అడుగు పెట్టింది ఉజ్వల. వెనకాల, రావచ్చో లేదో అనే సందేహంతో ఊర్మిళ ఆగి పోయింది.
  “మీరూ రండి మేడమ్.” చైతన్య పిలిచాడు.
  లోపలికి వెళ్లగానే చల్లగా ఏసి గాలి తగిలింది. పైనుంచీ పక్కనుంచీ రకరకాల లైట్లు. ఇద్దరు కెమారామెన్ లు. వెనుక గ్లాస్ డోర్ లోపల్నుంచి రికార్డింగ్ రూమ్. మైకులు. ఎర్రని కార్పెట్.. చూడగానే ఉజ్వల కోపం అంతా మటు మాయం అయి పోయింది.
  “రేప్పొద్దున్న హీరో ఆదిత్య వస్తారు. అప్పుడు షూటింగ్ ఉంటుంది. ఇప్పుడు, మీ ఫేస్ ఏ యాంగిల్ లో బాగుంటుందో, మీ మువ్ మెంట్స్ ఎలా ఉన్నాయో చూస్తాం.” వివరించాడు కేమెరా మన్.