Monday, April 7, 2014

naa modati jnaapakaM-4

Posted by Mantha Bhanumathi on Monday, April 07, 2014 with No comments
8.. Vijay kumae ponnada-
భానుమతిగారు, మీరు ఉదహరించినట్టు, నాదో జ్ఞాపకం ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
తీపి గుర్తు - చేదు జ్ఞాపకం.
సోల్డున్నర పట్టే ఇత్తడి గ్లాసులోంచి, సోల్డున్నరకన్న కొంచెం ఎక్కువ పట్టే ఇంకో ఇత్తడి గ్లాసులోకి తిరగబోస్తోంది. తిరగబోస్తున్నది మా అమ్మమ్మ. తిరగబోసేది కాఫీ. అలా పద్నాలుగు సార్లో, తొమ్మిది సార్లో తిరగబోసి, తిరక్కుండా బోసిముఖం వేసుకుని చూస్తూ అక్కడేచతికిలబడ్డ, నా ముఖమ్ముందేట్టింది. నా ముఖం విప్పారలేదు. అప్పుడు ఇత్తడి గ్లాసులో సగానికి పంచదార వొంపింది. దాంతో నా ముఖము విప్పారి, బొర్రా గుహలా నా నోరూ తెరుచుకుంది. అంతే గభాల్న రెండు చేతుల్తో గ్లాసందేసుకుని, గడగడా కాఫీ తాగేసి, కళ్ళు పెద్దవి చేస్తూ, నోరు తెరుచుకుని చూస్తూ, కాకి నీళ్ళు తాగేసి వదిలేసిన గులక రాళ్ళలా మిగిలిపోయిన పంచదారను, నా కుడి చేతి చూపుడు వేలు మధ్యవేలుతో దాన్ని నా నోట్లోకి తోడేసాను. నాకు కాఫీకన్నా, అది తాగేయగా మిగిలిన పంచదారంటే ఎక్కువ మక్కువ. గ్లాసు కింద పెట్టి, చొక్క చేతికి పెదాలనంటిన కాఫీని తుడిచేసుకుని లేచి నిలబడ్డాను. అప్పుడే మా తాతగారి గొంతు వినిపించింది. '
'ఏమేవ్! నేనలా పొలం వెల్తున్నాను. కిష్టమూర్తొస్తే వీరాసామి కాఫీ హొటలు దగ్గరకొచెయ్యమను. అక్కడుంటాను ' అన్నారు. అలా అని నాలుగడుగులేసారో లెదో, ఆయన చెయ్యి పట్టుకుని ఆయనతో పరిగెడుతున్నాను. 'పెద్దాడు నాతో వస్తున్నాడు. ఎవరినైనా ఇచ్చి పంపేస్తానులే ' అన్నారు నా చెయ్యి పట్టుకుని నడుస్తూ. నేను ఆయనతో వెల్తున్నది పొలంలో పని చెయ్యటానికనుకునేరు. వీరాసామి హొటల్లో కాఫీ తాగ టానికి. సరె, కాఫీ కాదు అందులో మిగిలే పంచదార జుర్రేయటానికి.
నేను మా తాతగారూ వీరాసామి అప్పుడే మమ్మల్ని చూసి తుండుతో తుడిచిన బెంచి మీద కూర్చున్నాము. 'కాఫీ చెప్పమంటారా, కరణంగారూ ' అనడిగాడు వీరాసామి. నేను గట్టిగా తలూపాను. 'రెండుతే. దాంట్లో పచదార ఎక్కువయ్యి ' అన్నారు, నన్ను చూసి. నాకు పట్టలేని ఆనందం. వాడు గాజు గ్లాసులో తెచ్చి పెట్టాడు. తాతగారు ఇట్టే తాగేసారు. నేను వూదుకుంటూ, గ్లాసులో వున్న పంచదారను చూస్తూ తాగుతున్నాను. ఈలోగా కిష్టమూర్తి వచ్చాడు. మా తాతగారు వెల్తూ 'ఒరేయ్ సుబ్బు. కాఫీ తాగాకా మా మనవడ్ని సైకిలుమీద ఇంటి దగ్గర దింపెయ్ ' అని వెళ్ళి పోయారు. వీరాసామి ఆరు సార్లు వచ్చి చుసేంత వరకు నా కాఫీ వేడి చల్లారలేదు. వాడు ఎనిమిదో సారి వచ్చేసరికి నా రెండు వేళ్ళు చాలా బుజీగా వున్నాయి. పదో సారి వచ్చేసరికి, వీరాసామి ముఖంలో విసుగో, కోపమో ఏదో కొట్టొచ్చినట్టు కనిపించింది. గ్లాసులో మాత్రం ఇంకా పచదార సగం వుంది. ఇంకో నాలుగు సార్లు ముఖం చిట్లించి, తొమ్మిది సార్లు విసుక్కుని, ఆరు సార్లు పక్కనున్న టేబుల్ని బాది, మూడు సార్లు 'చీ ' అనుకున్నాడు. పంచదార, వంశధారలా ఎండిపోలేదు.
ఇక ఆఖరికి, అంటే పజ్జెనిమిదో సారో, పదకొండో సారొ వచ్చి, తన చెయ్యి నా టేబుల్ మీద నేను తాగే కాఫీ గ్లాసు దగ్గర పెట్టి, గొంతు సవిరించుకుని నాకేసీ తినేసేలా చూస్తూ, పైకి మాత్రం నవ్వుతూ 'పర్లేదు బాబు. కంగారేమీలేదు. గ్లాసుని ఇంటికి పట్టికెళ్ళి, అందులో పంచదార పూర్తిగా తినెసి, రేపట్టుకొచ్చియ్యి ' అన్నాడు. అంతే నాకు కోపం వచ్చి, మిగతా రెండు వేళ్ళు కూడా గ్లాసులోకి పోనిచ్చి, మిగిలిన పంచదార లాగించేసి, పక్కనున్న సొట్ట సత్తు గ్లాసులో వున్న నీళ్ళలో చెయ్యి ముంచి, పరిగెత్తుకెళ్ళి సుబ్బు సైకిలుమీద ఎక్కి కూర్చున్నాను. కోపంతో ఇక కాఫీ తాగటం మానేసాను. యాభయేళ్ళ తరువాత. పైగా వీరాసామి కూడా ఇక లేడు. 

9.. కోసూరి ఉమాభారతి- భానుమతి గారి 'చిన్ననాటి జ్ఞాపకాలలో తొలి జ్ఞాపకాన్ని అందరితో పంచుకొనే పోటీకి' - నా జ్ఞాపకం....
మరువలేని సంగతే మరి...
అమ్మ వెంటే ఉండి, తమ్ముణ్ణి జోకొట్టి నిద్ర పుచ్చడం, తినిపించడం, నోరు తుడిచి నీళ్ళు తాగించడం సహా, అమ్మలాగానే అన్నీ చేసేదాన్ని. .......
నాకన్నా యేడాదిన్నర చిన్నవాడైన తమ్ముడంటే, ఇష్టమే.. కాని అమ్మలా పనులు చేయడమే నా ధ్యేయం.. 
అమ్మ మాత్రంఅబ్బో మా ఉమి ఎంత మంచిదో. తమ్ముణ్ణి ప్రేమగా చూసుకుంటుంది. పాలు పట్టి నిద్ర పుచ్చుతుంది కూడా,” అని అందరికీ నా గురించి గొప్పగా చెప్పేది.
**
మూడేళ్ళప్పుడు, నాకు చెవులు కుట్టించింది అమ్మ. బాగా ఏడ్చాను. నొప్పి తెలియకుండా ఏదో ఆయింట్మెంట్ కూడా రాసింది. కాసేపటికి కాస్త తగ్గినట్టు అనిపించినా, నొప్పికి ఏడ్చి నిద్రపోయాను.
నేనైతే నిద్రపోయాను కానీ, నా పక్కనే అప్పటివరకు పడుకుని నిద్రలేచిన తమ్ముడుకి నా చెవి కున్న కొత్త వస్తువేదో కనబడుంటుంది. దాని సంగతేమిటో చూద్దామన్న ఉద్దేశంతో, దగ్గర చేరి, తన చిటికిన వేలు రింగులోకి వేసి ముందు మెల్లగా, తరువాత కాస్త బలంగా లాగడం మోదలెట్టాడు. ఏడ్చి అలిసిపోయి పడున్న నాకు, కాసేపటికి గాని వాడు చేస్తున్న పనికి నొప్పి తెలియలేదు...లేచి ఏడుపు లంకించుకుని గగ్గోలు పెట్టాను కూడా.
వాడి వేలు రాదు... నాకేమో నొప్పి. అమ్మ పరుగున వచ్చింది. కాస్త కష్టపడి రింగు నుండి వాడి వేలు వేరు చేయగలిగింది. 
**
మా పడక గది నుంచి, సిటింగ్ లోకి నాలుగు మెట్లు దిగాలి. మధ్యాహ్నం తమ్ముడు లేచి మెట్లవైపు నడిచాడు. ఎప్పటిలా నేను తడవ సాయం చేసి మెట్లు దింపలేదు...పై మెట్టు మీద నిలబడి, ఎలా దిగాలా అని చూస్తున్న వాడికి చేయందించలేదు. వాడు అటు, ఇటూ తచ్చాడి, మరో మెట్టు దిగి, పాపం పడిపోయాడు. కాస్త దెబ్బలు తగిలాయి మరి.....వాడికి సాయం నిరాకరించాలనే తప్ప, మరేమీ ఆలోచించలేదు నేను....
అప్పుడు వాడికి రెండేళ్ళ వయసు.. నాకు మూడున్నర...
నా చెవి గాయపడి తగ్గడానికి చాలా రోజులు పట్టిందని, తమ్ముడు మీద నాకు పీకల వరకు కోపం ఉందన్న సంగతి నాకే తెలియలేదు.....‘పాపంఅంటూ చీమల్ని కూడా తొక్కకుండా నడవాలని ట్రై చేసేదాన్నని గుర్తు మరి.....అలా అంత కోపం పెట్టుకోవడం ఏమిటో!
**
అదలా ఉంటే, నా ఎడమ చెవికి కాస్త బరువైన నగ పెట్టినా ముందుకు పడిపోతుండేది. మళ్ళీ చెవి తమ్మిని, సర్జన్ చేత రిపైర్ చెయ్యించాల్సిందే నన్నారు.
నాకేమో జుంకాలు, లోలాకులు పెట్టుకోడం ఇష్టం... వెనక సపోర్ట్ కి వాషర్స్ పెట్టి, చిన్న జుంకాల నుండి, పెద్ద బరువైన నగల వరకు అన్నీ పెట్టాను... సగం జీవితం అలాగే మానేజ్ చేసాను. 
మధ్యనే సర్జన్ చేత చెవి తమ్మి రిపైర్ చేయించాను...కానీ, ఇక ఇప్పుడేమో, పెద్ద పెద్ద జుమ్కాలు, లోలాకులు పెట్టాలన్న షోకు తగ్గింది.
ఏదెలా ఉన్నా, నా తమ్ముణ్ణి నేను ప్రేమగానే చూసానండోయ్!... అప్పటినుండి ఇప్పటి వరకు కూడా వాడికి అండగానే ఉన్నాను....మా అమ్మ అన్నది నిజమే... నాకు వాడంటే ప్రేమే....
                                             *******************************
10. సుజల గంటి-
భానక్కయ్య పెట్టిన పోటీకి నా మొదటి జ్ఞాపక౦ రాయాలి కదా! అన్నీ కలగాపులగ౦గా గుర్తున్నాయి. అలా గుర్తు చేసుకోగా, ఒకటి గుర్తువచ్చి౦ది. మాది రాజమ౦డ్రి.  ఇన్నీస్ పేట లో ఉ౦డేవాళ్ళ౦. పెద్ద ఇల్లు అద్దెదే అనుకో౦డి ఓరుగ౦టి పోస్ పాట్ రావు గారి౦ట్లో ఉ౦డేవార౦. ఆయన పేరలా ఉ౦దేమిటని అడగక౦డి.
అప్పుడు నాకు మూడేళ్ళనుకు౦టాను. నాలుగు కూడా ఉ౦డవచ్చు. స్కూల్ కి వెళ్ళట౦ లేదు.ఇ౦టిని౦డా జన౦ ఎప్పుడూ సత్రవులా ఉ౦డేది మా ఇల్లు. కోనసీమ వెళ్ళాల౦టే రైల్ దిగి లా౦చీ మీద వెళ్ళాలి. అ౦దుకని చుట్టాలు వస్తూ ఉ౦డేవారు. మా అమ్మ ఒక హిట్లర్. తల౦టు పోసి౦ద౦టే రె౦డు రోజులు అలిసి నిద్రపోవాలి. అ౦దుకే ఆవిడ నీళ్ళు పోస్తాన౦టే అ౦దకు౦డా పెరడ౦తా పరుగుపెట్టేదాన్నిట. బొమ్మలతో ఆడుకోవాలని ఉన్నా బొమ్మలు కొనే స్థోమత లేదు. తన పిల్లలతో బాటు పేద విధ్యార్థికి పట్టెడన్న౦ పెట్టడమే గొప్ప అనుకునేవారు నాన్న. మా ఇ౦టికొచ్చిన చుట్ట౦ ఒకాయన ఒక బొమ్మ తెచ్చి ఇచ్చారు. అది దూది బొమ్మ.
అమ్మ రోజూ అక్క పిల్లలకు కాళ్ళ మీద పడుకోబెట్టి నీళ్లు పోసేది. "మలి నా బొమ్మ కు నేను కూలా నీళ్ళు పొయ్యాలిగా. అచ్చు అమ్మ లా నేను కూలా చిన్న కాళ్ళ మీద పడుకోబెట్టి, నీళ్ళు పోసేదాన్ని. అదే౦టో బొమ్మ ఎ౦త తుడిచినా నీల్లు కారేది". అలా రోజూ నీళ్ళు పోసేసరికి బొమ్మ కొన్నాళ్ళకు క౦పు కొట్టి౦ది. రోజూ గదిలోకి వచ్చిన అన్నయ్య ఏదో వాసన వస్తో౦ది అనేవాడు. వాసన ఎక్కువయ్యి ఒక రోజు గది అ౦తా వెతికి నా బొమ్మ వాసన వేస్తో౦దని చెత్త కు౦డీలో పడేసాడు బొమ్మ కోస౦ ఏడిస్తే నీ బొమ్మ చచ్చిపోయి౦ది అన్నాడు. బొమ్మ చచ్చిపోవడమేమిటి? కాళ్ళు కొట్టుకుని ఏడ్చాను. పనిలో ఉన్న అమ్మ నా ఏడుపుకు విసిగి వీపు విమాన౦ మోత మోగి౦చి౦ది. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను.

 నాన్నగారు వచ్చి "సన్ గాడ్" ఏది అన్నారు. అమ్మ చెప్పి౦ది. నేను లేచాక నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, "వెధవ బొమ్మ అది మ౦చిది కాదు రా కొత్త బొమ్మ షాప్ లోకి వచ్చాక కొ౦టాను" నాన్న అలా అనేసరికి ఆన౦ద౦ వేసి౦ది. అది నిజమని ఎన్నాళ్ళో నమ్మాను. కానీ నాన్న దగ్గర బొమ్మ కొనడానికి డబ్బులు లేవని అప్పుడు నాకు తెలియదు. పన్నె౦డు మ౦ది పిల్లల్ని సాకడమ౦టే మాటలా అ౦దులో నేనే ఆఖరు. ఆయన౦టే సి౦హస్వప్న౦గా భయ౦ ఉన్నా ఆయన ఒళ్ళో కూర్చున్న స౦ధర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా౦టి చాలా జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నాయి కొన్ని క౦ట తడి పెట్టిస్తే కొన్ని నవ్వు తెప్పి౦చాయి.నాకు గుర్తున్న౦తవరకు ఇదే మొదటి జ్ఞాపక౦.  

0 వ్యాఖ్యలు: