Monday, April 7, 2014

naa modati jnaapakaalu-3

Posted by Mantha Bhanumathi on Monday, April 07, 2014 with No comments
6.  భాస్కరలక్ష్మి సోంభొట్ల- మీ  కోసం నేను రాసిన నా జ్ఞాపకం:
    నాకు బాగా గుర్తు ఉన్న సంఘటన: అప్పుడు నాకు 3-4 ఏళ్ళు అనుకుంటా : అబ్బాయే పుడతాడు అని అంతా అనుకుంటుండగా లక్ష్మి అనే నేను భూమి మీదకి వచ్చేశాను, కాబట్టి నాకు చాలా ఏళ్లు వచ్చేదాకా లాగూ చొక్కాలు, డిప్పజుత్తు. అంటే బోయ్ కట్.
   మేమందరం, మా  తాతగారితో  ట్రేన్ లో గుంటూర్ వెళ్తున్నాము, ఎందుకో నాకూ తెలీదు. నా దగ్గర మా అమ్మమ్మ చీర తో కుట్టించిన బొంత ఒకటి ఉండేది. దానికి నేను పెట్టుకున్నపేరు బొద్దింకల బొంత. ఎందుకు అంటే దానిమీద వంకాయ రంగు లో బొద్దింక ఆకారం లో ఉండే పువ్వులు ఉండేవి. దాన్ని కూడా నాతో పాటు ట్రేన్ లో తీసుకుని వెళ్ళాను.
   నేను ఎందుకో అల్లరి చేశాను కాబోలు మా తాతగారు నన్ను ట్రేన్ లో వదిలేసి వెళ్లి పోతాము అని చాలా భయపెట్టేశారు. దెబ్బకి నేను కిక్కురు మనకుండా కూర్చునాను. ఈలోపు రాత్రయిపోయింది. అంటే పడుక్కోవాలి కదా!  నన్ను కింద అంటే పక్క పక్క ఉండే లోవర్ బెర్తుల  మధ్య కింద ఖాళీ ఉంటుంది కదా.. అక్కడ నాకు ఒక జంపఖానా వేసి పడుకోమన్నారు. నేను నా బొంత అడిగాను కానీ.. తాతగారి కోపం తగ్గలేదేమో.. నాకు ఇవ్వలేదు. నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో ఏమో అని నేను గప్ చిప్ గా పడుకున్నాను. అయినా ఎక్కడో భయం. అందుకే  నా కాలు ఒకటి కింద నుంచి పైన ఉన్న మా అమ్మ మీద వేసిమా అమ్మ చెయ్యిని నేను కింద నుండి గట్టిగా పట్టుకుని పడుకున్నాను. ఈలోపు తెల్లారింది,  
   హమ్మయ! మా అమ్మ నాతోనే ఉంది చాలా ఆనందం వేసింది. కానీ ఎందుకనో మా అమ్మ ,తాతగారు తర్జన భర్జన పడుతున్నారు, గుంటూరు వచ్చెసింది, సామాన్లు అన్ని పక్కన పెటుకున్నారు..
    కానీ..  అయ్యో! నా బొంత.. దాన్ని వదిలేశారు. నాకు ఏడుపు వచ్చేసింది, కోపం కూడా వచ్చెసింది. మా అమ్మకి దాన్ని చూపిస్తూ .. ఆది కావాలని సైగ చేస్తూ అడుగుతున్నాను..  మరి మాటలు అంతగా రావు కదా!. అప్పుడు మా అమ్మ చెప్పింది ఏంటి అంటే, మా అమ్మ పడుకున్న బెర్త్ పయిన నాకన్నా అల్లరి పిల్ల , పెద్ద పిల్ల ఉంది..  పాపం తనకి రాత్రి పూట బాత్రూమ్ అర్జెంట్ కాబోలు నిద్ర లోనే పని కాన్నిచేసింది.
   ఇంకే ముంది..  కింద పడుకున్న మా అమ్మ నా బొద్దింకల బొంతే కదా కప్పుకుంది, అంతే! నా బొంత అలా బలి అయిపోయిందన్నమాట. ఇంక చూడాలి..  మా తాతగారు తెగ విసుకున్ని దాన్ని ఒక మూలన విసిరేశారు . నేను పెద్ద కళ్లేసుకుని చూస్తూ నిల్చున్నా. అప్పుడు నన్ను తెగ మెచ్చుకున్నారు.. మరి నేను పిల్ల కన్నా కుదురు గా ఉన్నాను కదా!
   . చాలా రోజులు బొంత నాకు గుర్తుకువచ్చేది, కానీ అంతకన్నా మంచి మంచి బొంతలు, బ్యాగులు మా అమ్మమ్మ కుట్టించి ఇచ్చాక నాకు మళ్లీ ఎప్పుడు బొంత గుర్తుకు రాలేదు. ఇదిగో మళ్లీ ఇవాళ గుర్తుకు వచ్చింది.. తలుచుకుంటుంటే ఎంత బాగుందో! మా భానత్తయ్యకి ధన్యబవాదాలు చెప్పద్దూమరీ!

7. ఊషారాణి నూతులపాటి-
భానక్కయ్య గారు (భానుమతి మంథా ,ప్రముఖ రచయిత్రి ) ,మాకు ఉగాది సందర్భంగా ఒక చిన్న పోటీ పెట్టారు. అదేమిటంటే..మేం అందరం ,మా చిన్ననాటి జ్ఞాపకాలలో తొలి జ్ఞాపకాన్ని అందరితో పంచుకోవాలాని.అంటే బుద్ధి తెలిసాక తొలి జ్ఞాపకమన్నమాట .నాకు బుద్ధితెలిసాక (నీకు ఇప్పటికీ బుద్ధి తెలిసినట్లు లేదు అంటారు మా శ్రీ వారు..మీరు పట్టించుకోకండి..)ఇదే మొదటి జ్ఞాపకం..నాకు గుర్తు ఉన్నదంటే కారణం,మానాయనమ్మ చూడమ్మ గారు.ఎప్పుడూ నీ వంటి మీద బంగారం దానం చేసాడు..మీ నాన్న అని దెప్పుతూ వుండేది .ఆవిడకి నాన్న మీద గుర్రుగా వుండేది..(పెంచుకున్న తల్లి..ఆవిడ ఆస్థి మొత్తం అమ్మేస్తున్నారని కోపం )..అందుకే నాకు బాగా గుర్తుండి పోయింది..
@@@@@@@ @
యుద్ధ నిధి @@@@@@@@@

నాకు మూడేళ్ళ ప్పుడు భారతపాక్ యుద్ధం వచ్చింది.అది కాశ్మీర్ కోసం. 1965 లో.. మా నాన్న గారు రాజకీయాలలో బాగా తలమునకలై వుండేవారు. పైగా మావూరికి ఏకగ్రీవ సర్పంచి. కోదాడ పరగణా లో మంచి పేరు వుండేది. మా ఇంటికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మినిస్టర్లు వచ్చేవారు..
స్వయానా మా పెదనాన్న (నాన్నగారి కి కజిన్ ) అక్కిరాజు వాసుదేవరావ్ గారూ మినిస్టర్ గా వుండేవారు.

వారి మకాం మా ఇంట్లోనే..అప్పుడు పెదనాన్న, నాన్న కాంగ్రెస్ పార్టీలోనే వుండేవారు. సరే..యుద్ధం మొదలవగానే అప్పటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు ,.యుద్ధనిధి కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించడం
మొదలు పెట్టారు. మా వూరికి కూడా చాలామంది పెద్దలు వచ్చారు. వూరి మధ్య మండపం వద్ద వేదిక. చాలా హడావుడి.నాకు లీలగా గుర్తు. నాన్న ,ఇంకా పెద్దలూ వేదికమీద వున్నారు. అక్కడ దేశపరిస్థితి గురించి..అందరూ పొదుపుగా ఉండవలసిన ఆవశ్యకత గురించి మాట్లాడారట.
 తరవాత ప్రజలందరినీ ..పెద్ద మనసుతో ,మన సైనికులకి కనీసావసరాలను కల్పించడం కోసం విరాళాలు
ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేసారట. ఎవ్వరూ ముందుకు రాలేదట. నాన్నకి చాలా చిన్నతనం గా అనిపించిందట. నన్ను ఎత్తుకొని నిలబడ్డ పనివాడిని దగ్గరికి పిలిచి., బల్లమీద నన్ను నిలబెట్టి , నా మెడలో వున్న గొలుసు, చేతికి వున్న
వంకీగాజులు(మురుగులకి బదులు చేయించిన ,గట్టిగాజులు వంకీ డిజైన్ తో వున్నవి..) రెండూ..తీసి వేసి నా విరాళం ఇవి అన్నారట..అప్పుడు...అందరూమంగళసూత్రాలూ,ఉంగరాలూ,కడియాలూ...పట్టాగొలుసులూ, ధాన్యం ..ఇలా వాళ్ళకి తోచినట్టు ఇచ్చారట. అలా బాగా వసూలయ్యాయట మా వూరిలో.. తరవాత మా నాయనమ్మ గారు(నాన్నను
పెంచుకొన్న తల్లి..) నిష్ఠూరాలాడిందట..పసిదాని వంటిమీద బంగారం దానం చేసారని. అమ్మ ఎప్పుడూ నాన్నని పల్లెత్తు మాట అనేది కాదు. ఇందులో నా ఘనకార్యం ఏమీ లేకపోయినా ..నా వల్ల సత్కార్యం జరిగిందనే తృప్తి.

                         ***************************************0 వ్యాఖ్యలు: