Wednesday, September 10, 2014

కథా వీక్షణం

Posted by Mantha Bhanumathi on Wednesday, September 10, 2014 with No comments
            

                  ఫేస్ బుక్ లో నా సందడి. అందులోని కథ గుంపులో నేనీ మధ్యన చేసిన విశ్లేషణలు కథ బృందం సభ్యులు కాని వారి సౌలభ్యం కొసం.. ఇక్కడ ఉంచుతున్నాను.                                             


                                                                “ కథా వీక్షణం"
                         
   “కథ” బృందం నిర్వాహకుడు వేంపల్లె షరీఫ్, ఈ సంవత్సరం “ఆగష్ట్ ఉత్తరార్ధంలో ‘కథ’ లో టపా చేసిన కథల మీద మీ వీక్షణం కావాలి, చేస్తారా?” అని అడగ్గానే కొత్త ప్రయోగాల మీద నాకున్న సహజ కుతూహలం కొద్దీ సరే అనేశాను. అయితే ఈ బృందంలో కథల మీద విశ్లేషణ అంత ఆషా మాషీ కాదు.
   ఇక్కడ అనేక బహుమతులను, పురస్కారాలను అందుకున్న అనుభవజ్ఞులైన రచయితలుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని మంచి రచనలనందిస్తూ, పెద్దలవద్ద నేర్చుకుని ఇంకా మంచి సాహిత్యాన్నందించాలనుకునే తపనగల ఔత్సాహికులుంటారు. ఇప్పుడిప్పుడే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించిన లేత రచయితలుంటారు. “ఇది మా మొదటి కథ. మీ విలువైన సూచనలు, అభిప్రాయాల మీదే మా భవిష్యత్తు.. మీరు ఔనంటే ముందుకు.. కాదంటే ఇక్కడితో సరి..” అన్నట్లుగా పసిపాపల్లాంటి అమాయకత్వంతో అడుగుతూ ఆత్రంగా ఎదురుచూసే పసి రచయితలుంటారు. ఇంత వైవిధ్యమున్న కథలని ఏ రకంగా వర్గీకరించాలి? ఏ విధంగా.. నొప్పించకుండా సూచనలివ్వాలి?
   అసలు సూచనలిచ్చేటంతటి అర్హత నాకుందా? “విమర్శ” అనను.. విశ్లేషించేటంతటి విజ్ఞానం నాకుందా? “ఫలానా విషయం నాకు నచ్చలేదు..  ఇక్కడ ఈ విధంగా కాకుండా ఇంకోలా రాస్తే బాగుంటుందేమో! ఈ పాత్రకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వనక్కర్లేదు.. ఆ పాత్రకి అంతే చోటిచ్చారే.. దాని వలన కథ కొంచెం బలహీన పడింది..” ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం సరైనదేనా? లేదా.. ఏ విషయం చెప్పకుండా ఊరుకుని, మీ సత్తా ఇంతే అని కనిపించని చురక వెయ్యడమా?
  క్రిందటి వారమంతా.. తూరుపు దేశాల్లో తిరుగుతూ, కలలో ఇలలో ఆలోచిస్తూనే ఉన్నాను. అవకాశం దొరికినప్పుడు కథలని నా కంప్యూటర్ లోనికి బదలాయిస్తూ.. చదువుతూ.. కథకీ కథకీ మధ్య తేడాలని గమనిస్తూ.. మెదడుకి మేత పెట్టాను.
  నా సందేహాలకి నేనే జవాబు చెప్పుకోవాలి.
 1. అర్హత- ప్రతీ పాఠకుడికీ తను చదివిన విషయం మీద అభిప్రాయం ఏర్పరచుకునే హక్కు వుంటుంది. ఒక్క సారి కథ బయటికి వెళ్తే అది పాఠకులదే అని ప్రఖ్యాత విమర్శకులొకరు చెప్పారు. అంచేత.. నేను రచయితని అయినా కాకపోయినా ప్రధమంగా పాఠకురాలిని. నన్ను వీక్షించమని నిర్వాహకులు అడిగారనగానే నాకా అర్హత ఉండే ఉంటుందేమో అనే ఆలోచతో ఆరంభిద్దామని నిర్ణయించుకున్నా. (ఇక్కడ స్త్రీ, పురుషులిరువురూ అనే ఉద్దేశ్యంతో ఆవిధంగానే సంబోధిస్తున్నా.. రచయిత్రులు అన్యధా భావించరని తలుస్తా..).
   2. ఇంక ఏ విధంగా వర్గీకరించాలి? ఏ కథని ఏ దృష్టితో చూడాలి? చెయ్యితిరిగిన కథలను, ఇప్పుడిప్పుడే చెయ్యిపట్టిన కథలను ఒక దృష్టి తోనే చూడాలా? లేదా విడివిడిగా కథలు వీక్షించాలా? ఇంతకుముందు ఇక్కడ విశ్లేషించిన విశ్లేషకులు, మూడు విధాలుగా ఉంటాయి కథలు అని విభజించారు. ఆ విధంగా వర్గీకరించి ఏ కథ ఏ వర్గానికొస్తుందో చెప్పాలా? నేను కథలని వేరు పర్చ దల్చుకోలేదు. కథంటే కథే.. చిన్నదైనా పెద్దదైనా, ఎవరు రాసినా చెప్పినా కథే. అది చదవగలిగామాలేదా? పాఠకుడి మనసులోకి వెళ్తుందా లేదా? ఇది కూడా సందేహాస్పదమే.. నాకు నచ్చింది, ఇంకొకరికి నచ్చక పోవచ్చు. “ఈ సంగతి తరువాత చూద్దాంలే.. రాసేటప్పుడు అదే మార్గం చూపిస్తుంది అనుకున్నా”.
   4. “కథా వీక్షణం” అన్నారు కనుక పైపైన చూసేస్తే సరిపోతుందిలే.. అటూ ఇటూ కాకుండా చెప్పేస్తే పోలా..” అనేసుకున్నా ఆ సందిగ్ధంలో. కానీ అది పలాయన వాదం అనిపించింది. అంత కుండ బద్దలుకొట్టేయనక్కర్లేదు.. మరీ చెట్టెక్కించెయ్యక్కర్లేదు.. క్షుణ్ణంగా చదివి, రచయిత చెప్పదల్చుకున్నదేమిటో అవగాహన చేసుకుని, నిజాయితీగా మూడు కళ్ళతో వీక్షించి నా అభిప్రాయం చెప్పాలని నిర్ణయానికొచ్చా.
 నేను వీక్షింబోయే కథలు—
1. ఇరిగిన నవ్వు- బిడివి ప్రసాదరావు
2. గీతల్ని చెరుపుకోవచ్చు- వాడ్రేవు వీరలక్ష్మి
3. మంచివాడు-ప్రతాపకుమార్ రెడ్డి- 
4. పబ్ లో పడతి హత్య.. కస్తూరి మురళీ కృష్ణ.
5.అచ్చంగా మేము- ఆకునూరి మురళీ కృష్ణ
6. నేను స్వప్న, ప్రసాద్- దొడ్డిగల్లు నారాయణ రావు
7..జిందగి-డా. వంశీధర్ రెడ్డి.
8. పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు
9. సుపుత్రి- నండూరి సుందరీ నాగమణి
10. మనసుకు తొడుగేది- రాధ మండువ
11. నీలికొండలు- డా. చిత్తర్వు మధు.
12. పునర్వివాహం- ఇలపావులూరి శేష తల్పశాయి.

13. జగమంత కుటుంబం- దాట్ల దేవదానం రాజు

14. శ్యామా గోపాలం- వారణాసి నాగలక్ష్మి
ఇవీ ఈ పక్షంలో “కథ”లో టపా చెయ్యబడిన కథలు. 

   1. “ఇగిరిన నవ్వు”- బిడివి ప్రసాదరావు.
   ఈ కథ చదివాక కాసేపు స్తబ్దుగా అయిపోయింది నా మనసు. కథ చదవడానికి ముందు కథ పేరు అర్ధం కాలేదు. మానవీయతకి మారు పేరైన ఒక దంపతుల కథ ఇది. ప్రేమ పెళ్ళి చేసుకున్న వారికి పెద్దల ఆదరణ కరవయింది. ఇద్దరూ అద్యాపకులే.. జీవితం పట్ల అవగాహన ఉన్నవారు. తమకేం కావాలో, దానికొరకై ఏమి చెయ్యాలో బాగా తెలిసిన వారు. వారి ఏకైక కుమార్తె వీణ. ఆ పాపని సముద్రపొడ్డున మునిగిపోకుండా కాపాడిన ఒక చిన్న కుర్రవాడు ఆపదలో ఉన్నాడని పేపర్లో వార్త చదివి, వెతుక్కుంటూ వాళ్ల ఊరు వెళ్ళి, వాడి గుండె ఆపరేషన్ కి కావలసిన సహాయం చేస్తారు. ఆపరేషన్ అయ్యాక వారి హృదయాలనుంచి వెలువడిన గాఢమైన నిట్టూర్పులు పాఠకుల హృదయాలని కదిలిస్తాయి. ఆపరేషన్ విజయవంతమయింది. కుర్రవాడు గట్టెక్కాడని డాక్టర్లు చెప్తారు. మరి రాజు, వాగ్దేవి దంపతుల నవ్వులో ఏదో లోపం.. ఏమిటది? ఎందుకు? వారి నవ్వు ఇగిరిపోయింది. దానికి కారణం చివరి అనూహ్య మలుపులో కానీ చదువరికి తెలియదు.
   కథ చిన్నదయినా మనసుకి హత్తుకునేలా ఉంది. భాష సరళం. శైలి సులభం. కథా వస్తువు కరుణ రస పూరితం. దుర్గా ప్రసాదరావుగారు క్లుప్తతకి మారుపేరు. సూక్ష్మ కథలకి చిరునామా. వారి “ఆరుకథలు” పుస్తకం వెబ్ లో లభ్యం. అందరూ చదివి ఆలోచింపదగ్గ కథలు అవి.
   2. “గీతల్ని చెరుపుకోవచ్చు”- వాడ్రేవు వీరలక్ష్మీ దేవి
   అడవిమార్గంలో కారులో తప్పని సరి ప్రయాణం.. చీకటి పడకుండా అడవి దాటాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలుపడదు. చురుకుగా, అలసట తెలియకుండా కబుర్లు చెప్పే చంద్రం, అతని అక్క, బావ, డ్రైవర్ సురేష్. చంద్రం అక్క కథ చెప్తుంటుంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన సంతోషంలో అన్ని చోట్లా సంబరాలు బానే ఉంటాయి కానీ, ఆ వంక పెట్టుకుని డ్రైవర్ ని బెదిరించి అతన్ని భయపెట్టడం ఏమానందం అని ఆశ్చర్యపోతుంది కథకురాలు. తిరుగు ప్రయాణంలో బలవంతంగా, ఇంచుమించు బెదిరించి ఒక సిఆర్ పి పోలీసుని కారులో ఎక్కిస్తారు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు. అతడికి తెలుగు రాదు. ఇబ్బందిగా వెనుక, స్వేచ్చ లేకుండా కూర్చుని ప్రయాణం చేస్తూ అలాగే కబుర్లు చెప్పుకుంటారు. ఒక చోట ఆ పోలీసు, కారు ఎందుకు ఎక్కవలసి వచ్చిందో తెలుసుకుని, సరైన అవగాహన ఇవ్వకుండా, విషయం చెప్పకుండా కారెక్కిస్తే ఇరువురికీ ఎంత అసౌకర్యంగా ఉంటుందో.. సరైన సమయంలో తెలియజేస్తే ఎంత సదుపాయమో చెప్తుంది కథకురాలు. ఆ గీతల్ని చెరుపుకుంటే భాషా, ప్రాంతీయ భేదాలుండవనీ, మానవులంతా ఒకటే అనే నీతిని బోధిస్తుందీ కథ.
   వాడ్రేవు వీరలక్ష్మీ దేవిగారు అనుభవజ్ఞురాలైన రచయిత్రి. ప్రయాణంలో కలిగిన కష్టాల గురించే రాసినా చదివింప చెయ్యగలగడం వీరి ప్రత్యేకత. పాఠకులు కూడా కథలో కథకురాలితో అన్ని అనుభవాలు పంచుకుంటారు. మార్గ మధ్యంలో కలిగే వివిధ అడ్డంకులకీ మనం కూడా చికాకు పడతాం.. భయపడతాం, ప్రకృతి అందాలనాస్వాదిస్తాం. ఇటువంటి కథలే ఔత్సాహిక రచయితలకి పాఠాలు.
   3. “మంచివాడు”- ప్రతాప్ కుమార్ రెడ్డి
   ఈ కథ పేరుకి ఒక ప్రశ్న కూడా వేళ్ళాడుతోంది.. “నిజంగానేనా?”
   నిజంగానే ఇది మంచి కథేనా? పైగా.. “ఇది ఎప్పుడో నేను చదివిన కథలో పాయింట్ తీసుకుని రాశాను.. కాపీ కథ కాకపోయినా అలాంటిదే అనుకోండి.. ఆ కథని పెంచి దానికి హంగులు సమకూర్చాను.. ఇది నా మొదటి కథ..” అంటూ స్వయంగా రచయితే కామెంట్స్ లో చెప్పేశారు. నాకేవేవో సందేహాలుంటే అవన్నీ కూడా అందులోనే తీర్చేశారు.. అంటే అవే అతనికి కూడా కలిగాయన్నమాట.
   అందరి దృష్టిలో మంచివాడుగా ముద్ర వేసుకున్న ఒక సామాన్య యువకుడి ఆలోచనా స్రవంతి ఈ కథ. చక్కని ఇల్లాలు, మొదటి కలల పంటని తమ స్వర్గసీమకి తెచ్చుకోవాలని పుట్టింటికి వెళ్ళి వారం కూడా కాలేదు. భార్యంటే అమితమైన ప్రేమున్న ఆ యువకుడు విరహం భరించలేక విలవిల్లాడి పోతాడు. అన్యోన్యమైన కాపురం. కానీ అతగాడు మంచివాడ్నైనందుకు, దాన్ని నిలుపుకుందుకు చిన్న చిన్న ఆకర్షణలని కోల్పోవలసి వచ్చినందుకు చింతపడుతూ ఉంటాడు. అనివార్య పరిస్తితుల వల్ల, బస్సుకోసం వేచి ఉన్నప్పుడు ఒక యువతి ఆకర్షిస్తుంది.. అది కూడా తన భార్యని గుర్తుకు తెస్తూ! మొత్తానికి ఆ కోరికని అధిగమిస్తాడు.. ఎలా అధిగమించాడో.. తన మంచితనాన్ని ఏ విధంగా నిలుపు కున్నాడో ఈ కథ చెప్తుంది.
   ఈ కథని వీక్షిస్తుంటే నాకు వివిధ భావాలు కలిగాయి.
   పిల్ల తెమ్మెరలా మనసుకి హాయిని కొలిపే శృంగారం, భార్యని తొలి కానుపుకు పుట్టింటికి ఇష్టం లేకుండా, తప్పని సరిగా పంపి తోచకుండా తిరిగే కాబోయే తండ్రి కలలు.. ఆ తోచని తనంలో మనసు వేసే వెర్రి మొర్రి వేషాలు నవ్వుని తెప్పిస్తూ పాఠకులకి (మగవారికి) తమ గతం గుర్తుకొస్తుంది.  లేదా భవిష్యత్తు ఊహిస్తూ ఉంటారు. స్త్రీ పాఠకులు “ఓహో.. ఇదా మీ సంగతీ..” అని తమ వారిని నిలదీస్తారు. ఇంక బస్టాపులో ఆ యువతి మీద కలిగిన ఆలోచనల్లో కూడా భార్యే కనిపించడం.. ఇంటికి, కానీ లాడ్జికి కానీ తీసుకెళ్తే పోయే పరువు గురించిన భయం.. చివరికి ఆ యువతి అడిగిన అత్యవసర సహాయానికి చెమ్మగిల్లిన ఆ మంచివాడి కళ్ళు.. ప్రతీ చదువరి గుండెనీ స్పృశిస్తాయి.
   ఒకటి మాత్రం చెప్పగలను.. ఆ యువకుడు నిజంగా “మంచివాడే”. అతనికి కలిగిన చిలిపి కోరికలు ప్రతీ మగవానికీ కలిగే అత్యంత సహజమైన స్పందనలే. మంచివాడిననిపించుకోడానికి ఇన్ని అవస్థలు పడాలా అని విచారించనక్కర్లేదు. దుర్మార్గులు ఏ విధంగా మంచివాళ్ళు కావడం కష్టమో.. మంచివాళ్ళు చెడ్డగా మారగలగడం కూడా అంతే కష్టం. అతని మంచితనం కళ్ళల్లోనూ, నిలిచిన విధానంలోనూ తెలిసింది కనుకనే ఆయువతి దగ్గరగా రాగలిగింది. మగవాడి కేమైనా వికృత ఆలోచనలుంటే ఆడవాళ్లకి తక్షణం తెలిసిపోతుంది.
   ఏతావాతా చెప్పేదేంటంటే.. ఈ కథ నిజంగా మంచి కథే. రచయిత మొదటి ప్రయత్నంలోనే సఫలీ కృతుడయ్యాడు. మున్ముందు ఇంకా మంచి కథలు రాయగలడు. కొన్ని సూచనలు ఇవ్వాలనిపిస్తోంది..
    డౌటనుమానం వంటి పడికట్టు మాటలొదిలేస్తే.. ఆంగ్లపదాల వాడకం తగ్గించచ్చు. బెడ్ మీదికి చేరడం, కామన్ ఇంటరెస్ట్ వంటి మాటల బదులు తెలుగు వాడుతే బాగుంటుంది. మనం రోజూ వాడుతుండచ్చు.. కానీ కథల్లో నైనా మారుస్తే మనం కూడా మార వచ్చని నా అభిప్రాయం.
    అంతా ఒక అతిపెద్ద పేరా లా కాకుండా విడగొడ్తే బాగుంటుంది. సాధారణంగా ఐదు లైన్లకి మించుతే చదువరికి విసుగొస్తుంది. కొన్ని సంభాషణల రూపంలో చెప్తే ఆసక్తి పెరుగుతుంది.
   ఇంక.. ఇది వేరే వాళ్ళ కథలో పాయింట్ అని చెప్పడం రచయిత సంస్కారాన్ని సూచిస్తుంది. అందుకు నా అభినందనలు. అందరం ఎప్పుడో ఒకప్పుడు ఎవరిదో ఒక పాయింట్ రాసే ఉంటాం. అన్నీ మన మెదళ్ళల్లో నిక్షిప్తమయ్యున్నవే అనుకోకుండా బయటికి వస్తాయి. నేనెప్పుడూ సరదాగా అంటుంటాను.. “మనం అందరం కాపీ రచయితలమే.. అసలైన వాళ్ళు ఇద్దరే ఉన్నారు అని..”. రామాయణంలో, మహాభారతంలో స్పృశించని విషయ మేదైనా ఉందా?
   చాలా ఎక్కువ వీక్షించేసినట్లున్నా కదూ? మరి ‘పసి రచయిత’ కదా! తప్పదు.
   చివరగా ఒక చిన్న చెమక్కు.. మా నాలుగేళ్ళ అనిక ఎప్పుడూ అంటుంటుంది.. “ఐ డోంట్ వాంట్ టు బి ఎ గుడ్ గర్ల్..” మరి ఇష్టమొచ్చిన అల్లరి చెయ్యడానికి వీలు కదా!
4. “పబ్ లో పడతి హత్య”- కస్తూరి మురళీ కృష్ణ.
   విచ్చల విడిగా తిరుగుతూ, చీరల్ని.. సారీ, స్ట్రాప్లెస్ టాప్ లని మార్చినట్లు మగవాళ్లని మారుస్తూ, పబ్ లో మత్తులో, అర్ధరాత్రి వరకూ రాసుకుంటూ డాన్సులు చేసే యువతి, హత్య.. ముప్ఫై మంది వరకూ అనుమానితులు. మామూలు డిటెక్టివ్ కథల్లో లానే సస్పెన్స్.. చివరికి పాఠకులు ఊహించని హంతకుడు. డిటెక్టివ్ శరత్, ఇన్స్పెక్టర్ విజయ్ ఏ విధంగా ఈ కేసుని, ఆధునిక సర్వైలెన్స్ కామెరాల సహాయంతో, తమ విశ్లేషణలతో పరిష్కరిస్తారో చదివి తెలుసుకోవలసిందే!
   కస్తూరి మురళీ కృష్ణ సాహిత్యంలో స్పృశించని విభాగాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు లేవేమో కూడా! కథకుడుగా, విమర్శకుడుగా, తరంగా లో జాకీగా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో..
   క్రైం కథలలో ముఖ్యం సస్పెన్స్. పాఠకులలో ఉత్కంఠత కలిగించడం.. డిటెక్టివ్ ముందు ముందు ఎటువంటి అడుగు వేస్తాడో.. హంతకుడు లేదా హంతకురాలు ఎవరో అని ఉత్సుకతతో చూడడం.. ఇటువంటి వన్నీ తన కథల్లో ఉండేట్లు ప్రయత్నిస్తారు కస్తూరి మురళీ కృష్ణ. అందులో కృతకృత్యులయ్యారనే చెప్పచ్చు.
   అంతర్లీనంగా ఒక నీతిని కూడాచెప్పడానికి ప్రయత్నిస్తారు రచయిత.. ఆడపిల్లకి అంత విచ్చల విడితనం పనికి రాదనే సందేశం ఈ కథ చెప్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ కథలయ్యాక, నవ్యలో ఇతర ప్రక్రియ ఏదైనా ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.. నా అభిప్రాయం మాత్రమే!
   5. “సుపుత్రి”- నండూరి సుందరీ నాగమణి.
   ఆర్ధికావసరాలు, ఆడంబరాలనిపించే చిన్న చిన్న సరదాలు భార్యా భర్తల మధ్య గొడవల్ని సృష్టించడం మధ్య తరగతి సంసారాల్లో సహజమే. పెళ్ళిళ్ళకే బోలెడంత ఖర్చుపెట్టి, ఆపైన సీమంతం, ఆ తరువాత బారసాల అంటూ ఆడపిల్ల తండ్రిని వేధిస్తే అతగాడు తన నిస్సహాయతని భార్యమీదే కద చూపిస్తాడు! ఆ విధంగా వ్యాకులత చెందిన తల్లిదండ్రులని, తండ్రి ఐడితో తల్లికి మెయిల్ ఇవ్వడం ద్వారా వారిరువురికీ సాంత్వన కలిగిస్తుంది కావ్య, సుకన్యా రాజేంద్రల చిన్న కూతురు. పెద్దకూతురు సీమంతానికి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు సర్ది, భర్తకి సహాయ పడుతుంది తల్లి. నష్టాలొస్తున్న వ్యాపారాన్ని మూసేసి, ఉద్యోగంలో చేరిపోవడానికి ఒప్పుకుంటాడు తండ్రి. ఒకరికొకరికి తెలియకుండా తల్లిదండ్రులకి మధ్యవర్తిత్వం వహించిన
కావ్య సుపుత్రి అయింది.
   సాధారణ జన జీవనంలోని సంఘటనలు, విషయాలు తీసుకుని కథలు చెప్పగల నేర్పున్న రచయిత్రి శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. తెలుగు మాటలలో క్విజ్ పెడుతూ భాషాభిమానుల అభిమానాన్ని చూరగొనడంలో, కవితలల్లడంలో నేర్పున్న విదుషీమణి. ఈ కథలో కూతురు సమయస్ఫూర్తితో వ్యవహరించడం బాగుంది. స్తోమత లేనప్పుడు ఖర్చు తగ్గించుకోవాలనే రాజేంద్ర అభిప్రాయంతో ఏకీభవిస్తాను నేను. పిల్లల సుఖం కోసం త్యాగం చేసే తల్లిదండ్రులకు నెనర్లు.
   6. “పునర్వివాహం”-ఇలపావులూరి శేషతల్పశాయి.
  వివాహ ఆహ్వాన పత్రిక అందుకున్న పరంధామయ్య, పార్వతిలు ఆందోళన చెందుతారు. తమకు ఎంతో కావలసిన చంద్రుడికి మళ్ళీ పెళ్ళా? పిల్లల్లేనంత మాత్రాన.. అంతపని చేస్తాడా? బంధువులకి, చివరికి చంద్రుడి భార్య సీతకి కూడా చేస్తారు. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి జరుగుతోందని సీత అంటే నివ్వెర పోతారు. ఇదేదో తేల్చుకుని చీవాట్లు పెడాదామన్నట్లుగా చెన్నై బయలుదేరి వెళ్తారు. అక్కడ సీత స్వయంగా పెళ్ళి పనుల్లో హడావుడిగా తిరుగుతూ కనిపిస్తుంది. “పిల్లల్లేకపోతే ఇంత పని చేస్తారా?” అని నిలదీస్తే పిల్లలకోసమే అని జవాబిస్తుంది. నివ్వెరపోతారా దంపతులు.
   చివరికి జరుగుతున్న కార్యక్రమానికి పరంధామయ్య దంపతులు కూడా హాయిగా ఆనందిస్తారు.
   స్వచమైన తెలుగు కథ ఇది. ఆ దంపతులతో పాటుగా మనం కూడా ఆందోళన పడుతూ ఉంటాం. చివరికి నవ్వుకుంటామనుకోండి. కానీ పాపం ఆ వయసులో అంత తికమక పడుతుంటే జాలి కూడా వేస్తుంది వారి మీద. ఆంగ్ల పదం ఒక్కటి కూడా లేని కథ. అలా అని ఇదివరకటి తరంలోని కథలా కూడా లేదు. ఇలపావులూరి వారికి అభినందనలు.

7. “అచ్చంగా మేము”- ఆకునూరి మురళీకృష్ణ.
    లోకంలో నాకంటే గొప్పవాళ్ళు నీకు కనిపించవచ్చు, నా కంటే తక్కువ వాళ్ళూ  కనిపించవచ్చు. కానీ అచ్చంగా నాలాంటి వాళ్ళు నీకు ఒక్కరు కూడా కనిపించరు. ఇతరులతో  నన్ను  పోల్చడం మానేసి నన్ను నన్నుగా చూడడమే ప్రేమంటే”. ఆ రచయిత (కథలో నాయకుడు..) ఈ వాక్యం రాసుకుంటున్నప్పుడే వినిపిస్తుందో శబ్దం.. అది ఆ రచయిత నేస్తం పిలుస్తున్న పిలుపు. పచ్చని ప్రకృతిలో లీనమై మాములుకంటే భిన్నమైన నవల రాయాలని తరతరాలుగా తమ పూర్వీకులు నివసించిన తన ఊరికి వెళ్తాడు ఆ రచయిత. అక్కడ చెట్ల కొమ్మల్లో.. ఆకుల మాటున తన చిన్నప్పటి నేస్తాలు ఉన్నాయేమో నని వెతుకుతాడు. పట్నాల్లో కనిపించని ఆ నేస్తాలు పల్లెల్లో కూడా అంతరించి పోతున్నాయని విచారిస్తాడు. తన వంతుగా పల్లెలు, వాటితో కాకులు, పిచుకలు అంతరించ కూడదని, ఉన్న కొద్ది పొలాన్ని కౌలు చేస్తున్న రాములు తాతకే ఇచ్చేస్తాడు.
   మనం చిన్నప్పుడు కాకి మీద ఎన్నో కథల్ని విన్నాం. ఇది ఆధునిక కాకి కథ. భిన్నమైన కాకి కథా వ్యధ.
   ఈ కథ రాసింది ఆకునూరి మురళీ కృష్ణ. చెయ్యితిరిగిన రచయిత. వంద పైగా కథలు రాసి అనేక బహుమతులు అందుకున్నారు. బాలల కథల నుంచీ, సరసమైన కథ వరకూ వైవిధ్యమున్న కథలు వీరి స్వంతం. కథ ఆరంభ వాక్యమే రచయిత పరిణతిని తెలుపుతుంది. ఇది సమస్త జీవులకీ, మానవాళితో కూడా వర్తిస్తుంది. ఎవరైనా.. నన్ను నన్నుగా చూడమనే, ప్రేమించమనే కోరుతారు. (ఘంటసాల పాట గుర్తుకొస్తోందా?). వాక్య నిర్మాణానికి కానీ, సన్నివేశాల కూర్పుకి కానీ, సంఘటనల క్రమానికి కానీ, సరళమైన భాషకి కానీ.. వీరి కథలని ఉదాహరణగా తీసుకోవచ్చు. చాలా మంది “కథ ఎలా రాయాలి?” అని అడుగుతూ ఉంటారు. ఇటువంటి కథలను బాగా చదవండి. చదివి అవగాహన చేసుకోండి. సమకాలీన రచయితల్లో ఎన్నదగిన వారు ఆకునూరి వారు.
8. “నీలికొండలు”- డాక్టర్ చిత్తర్వు మధు.
   ఈ కథ చదివాక చాలా సేపు హృదయం భారంగానే ఉంది. ‘అతను’ నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. ఎవరా అతను? అతని పేరు పాణిగ్రాహి. తల్లిదండులు ఉండీ అనాధలా పెరుగుతాడు. డబ్బుకి లోటు లేదు. అయితే అతనికే అర్ధంకాని అతీత శక్తులు అతనిలో ఉన్నాయి. తనలోనే ఏదో రహస్యం ఉంది. తన తల్లిదండ్రులలో ఏదో రహస్యం ఉంది. తన మంచి చెడ్డలు చూసినతన్ని అడుగుతే “నీ తల్లిదండ్రుల గురించి మర్చిపో..” అంటాడు. ఆ రహస్యం ‘నీలికొండ’ లో ఉందని తెలుస్తుంది. తరచుగా తల్లిదండ్రులు కలలోకి వస్తూనే ఉంటారు. తన అతీత గ్రహణ శక్తితో తెలుసుకుని, రైల్లో ఒక యువతి మీద అత్యాచారం చెయ్యబోతున్న ఇద్దర్ని రెండే రెండు దెబ్బలు కొడ్తే వాళ్ళు మరణిస్తారు. వెంటనే మామూలుగా అయి, తన బర్త్ దగ్గరికి వెళ్ళి పడుక్కుంటాడు. నీలికొండ ఒక చిన్న పల్లెటూరు. తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిన అతనికి తెలిసిన విషయమేమిటి? అతడు ఏమయిపోతాడు? రైల్లో హత్యలు చేశావంటూ అతన్ని వెంటాడిన పోలీసులేమయ్యారు? తల్లిదండ్రుల సంగతేమిటి? వీటన్నింటి గురించీ.. మనం కూడా ‘నీలికొండలు’కి వెళ్తేనే తెలుస్తుంది.
   డాక్టర్ చిత్తర్వు మధుగారి విలక్షణ కథ ఇది. మధుగారు వృత్తి రీత్యా వైద్యులు. తెలుగు సాహిత్యం మీద వారికున్న అభిమానం అంతులేనిది. నీలికొండలు కథ మొదలుపెట్టగానే అతీంద్రియ శక్తుల ప్రస్తావన ఉందేమో అనుకున్నాను. చదువుతుంటే సైన్స్ ఫిక్షన్ అని అర్ధమయింది. అణుశక్తిని కనుగొనడం విజ్ఞానశాస్త్రంలో పెద్ద మైలురాయి. అయితే.. అది సరైన నియంత్రణ లేకపోతే ప్రపంచాన్ని నాశనం చెయ్యగల వినాశనకారి అని మనకి రెండవ ప్రపంచయుద్ధంలోనే తెలిసింది. ఇప్పటికీ జపాన్ లో ఆ బాధితులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ కథలో అణు శక్తి రియాక్టర్ ప్రమాదం, ఒక పల్లెని నిర్వీర్యం చేసి, అందులో పనిచేసే వేలాది మందిని వివిధ విధాలుగా బాధించి, ఎందరినో బలిగొన్నా కూడా కించిత్తయినా చలించని పారిశ్రామిక వేత్తల దౌర్జన్యం, ఆ బాధితుల దీన గాధ చదువరుల మనస్సుని కలచి వేస్తాయి. కళ్ళకు కట్టినట్లుగా ఆ స్థితిని వర్ణించారు రచయిత.
   సాంకేతిక విజ్ఞాన పరమైన, వైద్య సంబంధితమైన కథలు రాయడంలో మధుగారు సిద్ధ హస్తులు. క్లిష్టమైన విషయాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల సమర్ధులు. సమకాలీన రచయితల్లో వారిదంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నారు. “చిత్తర్వు మధు కథలు” చదువుతే మధుగారి గురించి మరింత తెలుస్తుంది.
   9. “మనసుకు తొడుగేది”- రాధ మండువ.
   ఆధునిక యువతి శ్రీజ..ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతూ, స్వేఛ్ఛగా తిరగాలనే మనస్తత్వం. సహాధ్యాయీ, స్నేహితురాలూ ఐన శ్రుతిది ఇంకొంచెం శ్రుతి మీరిన తత్వం. విద్యార్ధులంతా కలిసి విహారయాత్రకి బయలుదేరతారు. అప్పుడు అమ్మ చెప్తున్న జాగ్రత్తలు సహజంగానే నచ్చవు శ్రీజకి. తేలిగ్గా మాట్లాడబోయిన శ్రుతిని కూడా మందలిస్తుందావిడ. హార్స్లీ హిల్స్ కి బస్ లో బయలుదేరిన విద్యార్ధి బృందం.. బస్ లో శ్రీజ బాయ్ ఫ్రెండ్ రాహుల్ చేసే చిలిపి చేష్టలు, విద్యార్ధులని నియంత్రించబోయిన అధ్యాపకుల పాట్లు.. వారిని ఏ విధంగా తప్పించుకోవాలా అని చూసే యువతీ యువకులు.. రాత్రికి మీ గదికి వచ్చి కలుస్తామని చెప్పిన మగపిల్లల్ని ఎలా ఎదుర్కోవాలా అని బెంగపడే ఆడపిల్లలు.. చివరికి ఏ విధంగా మలుపు తిరుగుతుందో కథ ఊహించలేం. అంతా చదివాక ‘అమ్మయ్యా..” అనుకుంటాం.
   జీవితాన్ని ఆటగా తీసుకునే నేటి తరం యువతీ యువకుల మనస్తత్వాలను ఈ కథలో నేర్పుగా చెప్పారు రాధా మండువ. కథలో కథలు ఈ మధ్య కాలంలో చూడ లేదు. చిన్నప్పుడు చదివిన పేదరాశి పెద్దమ్మ కథలు గుర్తుకొచ్చాయి. ప్రకృతి సహజంగా ఏర్పడ్డ మూడు కొండలకీ, ఖర్మ వశానో, అహంభావంతోనో, మాయతోనో మగవాళ్ల చేతుల్లో మోసపోయి గుడి దగ్గరకొచ్చి పడి కొండలైపోయిన అక్కచెల్లెళ్లగా ఊహించి చెప్పిన రచయిత్రి కల్పనా శక్తిని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ కథ మీద కథ గ్రూప్ లో మంచి విశ్లేషణలొచ్చాయి.
   ఇందులో రాసినట్లు కథలు విని అమ్మాయిలు మనసు మార్చుకుంటే అమ్మలు ఎంత సంతోషిస్తారో.. అది రచయిత్రి ఆశావహ దృక్పధాన్ని సూచిస్తోంది. అలాగే అవాలని మనం కుడా ఆశిద్దాం. రాధా మండువ రిషి వాలీ స్కూల్లో తెలుగు అధ్యాపకురాలు. అందుకే నేమో కథని, చెపుతున్నట్లుగా రాస్తుంటారు.  ఇరవై సంవత్సరాలుగా కథలు రాస్తున్నారు. ఫేస్ బుక్.. అందులో ‘కథ’ గ్రూప్ వలన రచయితలు చాలా మంది ఒకరికొకరు తెలుస్తున్నారు.. ఎంతో ఆనందించ దగిన విషయం.. విశేషం.
   10. “జగమంత కుటుంబం”- దాట్ల దేవదానం రాజు.
    అది పేకాట అవనీ, కోడి పందాలు అవనీ, రొయ్యల చెరువులవనీ.. పట్టిందల్లా బంగారమే రాజారావుకి. అయితే వైకుంఠపాళీ ఆటలాంటి జీవితంలో నిచ్చెనలూ ఉంటాయి, పాములూ ఉంటాయి. వరుసగా నిచ్చెనలెక్కిన రాజారావు పెద్దపాము నోట్లో పడిపోతాడు (ఇది కథలోని పోలికే..). జూదాల్లో దురదృష్టం, వ్యాపారంలో మోసం.. రాజారావుని బికారిని చేశాయి. కొన్ని రోజులు కనిపించకుండా పోయిన భర్త గురించి అనేక పుకార్లు వింటుంది అతని భార్య రమ. తిరిగి వచ్చి, భార్యకి పరిస్థితులు తెలిపిన రాజారావు, ఇల్లు అమ్మి ఆపదలోంచి బైటపడదామంటాడు. మళ్ళీ ఇంతకంటే పెద్ద ఇల్లు కట్టిస్తానంటాడు.
   'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ఇద్దరం కలిసి కష్ట సుఖాలను పంచుకుందామంటూ ప్రతిజ్ఞ చేసిన రమ.. ‘ఇకనుంచీ తను నిజాయితీగా కష్టపడతాననీ, సుఖపెడతాననీ’ ఎంత చెప్పినా వినకుండా భర్తని ఇంట్లోనుంచి వెళ్ళగొడుతుంది. ఒక్క అవకాశం అయినా ఇవ్వకుండా! కారణం ఇల్లు తన పేరు మీద ఉండడం. యానాంలో ఉన్న సదుపాయం ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్ ఖర్చులు కలిసొస్తాయని భార్య పేరుమీద పెట్టినందుకు వాపోతాడు రాజారావు. నిస్పృహతో కృంగి పోకుండా కాకినాడ వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ఆరంభిస్తాడు. అవకాశం దొరికితే అల్లుకుపోగల నేర్పున్న రాజారావు, అచిర కాలంలోనే కోటీశ్వరుడవుతాడు. మన్నించమని వేడుకున్న రమని ఆమడ దూరంలో ఉంచి అవసరమైన సహాయాన్ని మాత్రం అందిస్తాడు భార్యా బిడ్డలకి. సంసారం, ‘తన’ అనే స్వార్ధం వదిలించుకుని.. తన పరిధిని పెంచుకుని జగమంతా తన కుటుంబం అనుకుంటాడు.
   దాట్ల దేవదానం రాజుగారు సాహిత్య లోకానికి చిర పరిచితులు. కవిగా కథకునిగా అనేకమంది మంది అభిమానాన్ని చూరగొన్నారు. వారి “యానాం కథలు” కథకునిగా గొప్ప పేరును సంపాదించి పెట్టాయి. గుంటూరు జిల్లా రచయితల సంఘం వారి ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి పురస్కార గ్రహీతలు. మొదట కవిగా దుందుభిలు మ్రోగించినా యానాం కథలతో అందరు పాఠకులకీ దగ్గరయ్యారు. చాలా రోజులు, తెలుగు నేల నడిబొడ్డున ఉన్నా.. అదేదో విదేశంలాగే ఉండెది యానాం. వీరి కథలతోనే యానాం చరిత్ర తెలుగు వారికి తెలిసిందని చెప్పచ్చు. రాజుగారిది ప్రత్యేకమైన శైలి. వీరి కథల్ని మనం చదవం.. చూస్తాం. ఆ కాలానికి, ప్రాంతానికి వెళ్ళిపోతాం.. ఈ కథలో రాజారావుతో పాటే మనం కూడా కష్టాలని, కసిని, ‘ఏది మనదీ’ అనే వేదాంతాన్నీ అనుభవించినట్లుగా!
   రాజుగారి యానాం కథల పుస్తకావిష్కరణ సమయానికి వారి పరిచయం అవలేదే అని నాకు చాలా విచారంగా ఉంది. గోదావరిలో పడవ ప్రయాణం చేస్తూ.. కథల గురించీ, సాహిత్యం గురించీ చర్చించుకుంటూ.. ఆప్యాయతానుబంధాల మధ్య.. ఓహ్.. తలుచుకుంటేనే హృదయం ఉప్పొంగటం లేదూ?
   ఆరు కవితా సంకలనాలు పైగా ముద్రించిన రాజుగారికి చివరగా ఒక అర్జీ.. “మీ కవితల్ని అప్పుడప్పుడు మీ టైమ్- లైన్ లోనో, సాహిత్యం గ్రూప్ లోనో, అనుమతి ఉంటే కథ బృందంలోనో పెట్ట కూడదూ?”
11. “జిందగీ”- డాక్టర్ వంశీధర్ రెడ్డి.
   రాముల్డాక్టర్ కి జిగ్రీ దోస్త్ రాజిరెడ్డి. తన ఆరోగ్యం మీద నిర్లక్ష్యం.. కాలు పోతున్నా కూడా బోలెడు బాధ పడ్తాడే కానీ డాక్టర్ చెప్పిన మాటలు విననే వినడు. పిల్లలకి, మాస్టర్లకి మార్గదర్శకుడుగా ఉండవలసిన వాడు సరిగ్గా స్కూలుకి పోడు. తన కొడుకులు చెడిపోతున్నారంటే పట్టించుకోకుండా సమర్ధించుకుంటాడు. మందు కొట్టడం మానడు. మోసం చేద్దామని చూసే బామ్మరిదిని తిట్టుకుంటూ ఉంటాడు. ఆత్మాభిమానానికి తక్కువ లేదు. ఏందో.. ఈ రాజన్న.. కథ.. చదివి తెలుసుకోవసిందే. ఒక రకంగా లక్కీనే.. రాముల్డాక్టర్ వంటి మంచి దోస్త్, యస్సై వంటి మంచి స్టూడెంట్.. తన సమస్యలన్నీ తీర్చేస్తారు.
   డాక్టర్ వంశీధర్ రెడ్డి తెలంగాణా మాండలీకంలో రాసిన మధ్యతరగతి హెడ్ మాస్టర్ కథ ఇది. డాక్టర్ చిత్తర్వు మధుగారి ప్రశంసలను పొందింది. డయాబిటీస్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే వచ్చే నష్టాలను హృదయం కదిలేలా చెప్పారు డాక్టర్ వంశీధర్ రెడ్డి. చూసుకోకుండా చిట్టీలకి ష్యూరిటీలు ఇవ్వకూడదనీ, రాబందుల్లాంటి బంధువులతో జాగ్రత్తగా ఉండాలనీ చెప్తుందీ కథ. చివరికి సుఖాంతం అవబోతోందని ఆనందిస్తాం పాఠకులం.
   డాక్టర్ వంశీధర్ రెడ్డిగారి సాహిత్యంతో అంత పరిచయం లేదు నాకు. అందుకే విపులంగా విశ్లేషించలేకపోతున్నందుకు క్షమించాలి. దాదాపు పాతికేళ్ళు, ప్రభుత్వ సిటీ కాలేజ్ లో రసాయన శాస్త్రం తెలుగులో బోధించిన నాకు తెలంగాణా మాండలీకమంటే చాలా ఇష్టం. మా విద్యార్ధులు, ఎక్కువగా తెలంగాణా జిల్లాల లోని పల్లెల నుంచి వచ్చే వారే. ఒక గదిలో నలుగురు ఐదుగురు ఉండి వండుకొని తిని కాలేజ్ కి వచ్చే వారు. మాతో తమ సంగతులన్నీ ముచ్చటించే వారు. అందుకే ఈ కథ చదువుతుంటే అమాయకులైన ఆ విద్యార్ధులే రాజిరెడ్డి కొడుకుల రూపంలో కనిపించి కళ్ళు చెమర్చాయి నాకు. రచయితకి అభినందనలు.
   12. “పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు”-యస్. రామకృష్ణన్.
   పదుహేనేళ్ళ ప్రాయంలో అబ్బాయిల అవస్థలు.. ఎవర్నైనా ఏదైనా అడగాలంటే భయం, అంతులేని కుతూహలం, హార్మోన్ల ప్రభావం.. ఐదురూపాయలకోసం పడ్డ పాట్లు.. ‘ఆ’ పుస్తకం అందుకున్నాక మరీ పెరిగిన ఇక్కట్లు.. పాపం ఆనందరావు! ఆ వయసులో అందరబ్బాయిలూ అంతే నంటారు రచయిత. గత పాతికేళ్ళుగా తమిళంలో చిన్నపిల్లల కోసం ముప్ఫై “స్టోరీ టెలింగ్ కాంప్స్” నిర్వర్తించారు. వీరి కథల అనువాదాలను కినిగె పత్రిక వెలికి తెస్తోంది.
   అనువాద కథలను విశ్లేషించాలంటే మూల సాహిత్యంతో కొంత పరిచయం ఉండాలనుకుంటాను. అనువాదకులు అవినేని భాస్కర్ కూడా నాకు కొత్తవారే. ఈ కథను ఇంకెవరైనా విశ్లేషిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా అశక్తతకని మన్నించాలిసిందిగా కోరుతున్నాను.
   13. ““నేను స్వప్న, ప్రసాద్”- దొడ్డిగల్లు నారాయణరావు.
     యువకుడైన బాలు మీద మరోచరిత్రవంటి బాలచందర్ సినిమాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఉచితంగా పిల్లలకి ట్యూషన్లు చెప్పడం.. దానికి ధనవంతుడైన ప్రసాద్ సహకారం.. వితంతువైన స్వప్నని పెళ్ళిచేసుకొమ్మని ప్రసాద్ ని అడిగి భంగ పడ్తాడు బాలు. తాము ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని చెప్పడానికి వచ్చిన స్వప్న, బాలుకి అతనంటే ఇష్టమన్న సందేశాన్నిస్తుంది. కానీ బాధ్యతల వలలో చిక్కుకున్న బాలు ఏమీ చెయ్యలేకపోతాడు. మేనకోడల్ని పెళ్ళి చేసుకున్న ప్రసాద్ పిల్లలు కూడా వద్దనుకుని అనాధలకి సేవ చేస్తుంటాడు.. భార్య సహకారంతో. చివరికి ఆ ముగ్గురి కథా ఏ విధంగా మలుపు తిరుగుతుంది? చదివి తెలుసుకోవలసిందే.
   ఈ కథకు ‘కథ’ గ్రూప్ లో పలువురి ప్రశంసలొచ్చాయి. బాలు ఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోవడం, ప్రసాద్ ఆదర్శాలు.. స్వప్న నిర్ణయాలు.. ఆచరణకీ ఆదర్శానికీ గల తేడా నూతన విధానంలో చెప్పారు. బాలు భార్య అతన్ని వదిలి వెళ్ళిపోవడానికి తగిన కారణాలు చూపించినట్లు అనిపించలేదు. నా కంప్యూటర్ లో ఈ కథ ఇమేజ్ చాలా అలుక్కుపోయినట్లుగా ఉంది. అందుకని అర్ధం సరిగ్గా అందుకోలేకపోయానేమో అనిపించింది. ఈ కథని ఇంకెవరైనా విస్తృతంగా విశ్లేషిస్తే చదవాలని ఉంది నాకు.
  14. “శ్యామా గోపాళం”- వారణాసి నాగలక్ష్మి.
     బాపు బొమ్మలాంటి శ్యామ, లాయరు గోపాళం, వాళ్ళ ఏకైక పుత్ర రత్నం బుజ్జిగాడు.. ఈ ముగ్గురి సరదా కథ ఇది. బాపు-రమణల పాత్రలు మరొక్కసారి అచ్చులోకి వచ్చి మనల్ని అలరిస్తాయి. బుజ్జిగాడి బస్సులో అల్లరి, శ్యామ వాల్జడ విసుర్లూ, మూతి విరుపులూ, గోపాళం ఆశ్చర్యాలు.. అన్నీ ఆనందాలే. పాఠకులకు కన్నుల విందులే.
      కథల మాష్టారు స్వయంగా ఇంటికి వచ్చి అభినందించిన రచయిత్రి వారణాసి నాగలక్ష్మి. చిత్రకారిణి, కవయిత్రి.. బహుముఖ ప్రజ్ఞావంతురాలు. సమకాలీన సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పలువురు ప్రముఖుల ప్రశంసలు, ఆంధ్రభూమి, కౌముది వంటి పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు అందుకున్నారు.
     ఎంతో ఆహ్లాదకరమైన ఈ చిన్ని కథ బాపుగారికి నివాళిగా నాగలక్ష్మిగారు ‘కథ’లో పొస్ట్ పెట్టారు..  ఆగస్ట్ ముప్ఫై ఒకటి రాత్రి.. ఈ కథతో నా వీక్షణం ముగించడం నాకు ఆనందంగా ఉంది.. బాపుగారు ఇంక లేరే అనే విషాదం మధ్య.

   సరిగ్గా కిందటి ఆదివారం నుండీ, ఈ పధ్నాలుగు కథల్ని పదే పదే చదివి, వీక్షించి, విశ్లేషించి ‘కథ’ వీక్షకులకు అందించాను. కొన్ని కథలకి సరి అయిన న్యాయం చెయ్యలేక పోయుండవచ్చు. నాకు కొన్ని పరిధులు, అవధులు ఉన్నాయి. మానవ ప్రయత్నాలెప్పుడూ లోప రహితంగా ఉండవు. అర్ధం చేసుకునే సహృదయత ‘కథ’ బృంద సభ్యులకి ఉందని నాకు తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకుడు షరీఫ్ కి ధన్యవాదాలు. 

Monday, August 18, 2014

Posted by Mantha Bhanumathi on Monday, August 18, 2014 with No comments
17th Aug-2014.

                    “అమ్మా! కృష్ణాష్టమి అంటే..”
  అప్పుడు రెండో క్లాసు చదువుతున్నా.. ఆరేళ్ళుంటాయి.  మా చిన్నప్పుడు కృష్ణాష్టమికి బడికి సెలవుండేది కాదు. నాలుగింటికి వచ్చేసి, పాలు తాగి ఆటలాడుకుని వచ్చే సరికి పట్టుచీర కట్టుకున్న అమ్మ కనిపించింది.
   “ఇందుగలడందులేడను
   సందేహము వలదు చక్రి సర్వోపగతుండు..”
   రాగయుక్తంగా భాగవతంలో పద్యాలు పాడుతూ, సాయంత్రం అమ్మ తులసి కోట చుట్టూ కడిగి ముగ్గులేసి తులసమ్మకి అలంకారం చేస్తుంటే అనుమానం వచ్చింది. తెల్లారకట్ల మామూలుగా అయిపోయింది కదా! ఇప్పుడెందుకూ అని. ఎందుకైనా మంచిదని నేను కూడా మొహం, కాళ్ళు చేతులూ కడిగేసుకుని పట్టుపరికిణీ కట్టేసుకున్నా. అసలు ఏం వంక దొరుకుతుందా అని చూస్తుంటా. బుద్ధిగా తులసమ్మ దగ్గర పీట వేసుక్కూర్చుని, కళ్ళు ముసుకుని నాకొచ్చిన పద్యం పాడేశా..
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొల త్రాడు పట్టు దట్టి
సంజె తాయతులను సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు”
   అమ్మ పిండివంటలేమైనా చేసిందేమో అని ఒక కన్ను తెరిచి చూస్తున్నా..
   ఊహూ.. చలిమిడి, వడపప్పు, పానకం, పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి దంచిన ఉండలు, అరటిపళ్ళు.. అంతే.. నాకు చాలా నిరుత్సాహం.. బొండాలు, బజ్జీలు, మైసూర్ పాక్, లడ్డూలు.. పోనీ బొబ్బట్లు.. ఊహూ! ఆలోగా అమ్మ, వీధి గుమ్మం నుంచి చిన్న చిన్న పాదాలు ముగ్గేసింది. అమ్మ భలే తొందరగా ఒక్క నిముషంలో వేసేసింది.
   “ఏంటమ్మా ఇవేళ?” కృషుడి విగ్రహాన్ని కూడా తులసమ్మ పక్కన పెట్టి, దీపం వెలిగిస్తున్న అమ్మని అడిగాను.
   “కృష్ణాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజు. అందుకే మనింటికి పిలుస్తున్నామన్నమాట. ఆ పాదాల మీద అడుగులేసి వచ్చేస్తాడు.”
   “పుట్టిన వెంటనే ఎలా నడుస్తాడు?”
   “దేముడు కదా.. అందుకని నడవగలుగుతాడు..”
   “మరి.. రోటిక్కట్టేస్తే పాకుతూ చెట్ల మధ్యనించి వెళ్ళాడని చెప్పావు కదా అప్పుడు..”
   “అది వేరు యశోదమ్మ ఇంట్లో అది.. అయినా నీ ప్రశ్నలన్నింటికీ మీ నాన్నగారు జవాబు చెప్తారు. నువ్వు మాట్లాడకుండా అక్కడ కూర్చుని పూజ చూడు.”
   ఓహో.. అర్ధమయింది. పుట్టగానే అందరిళ్ళకీ నడుచుకుంటూ వెళ్ళి, నేనొచ్చానోచ్ అని చెప్పి, ఆ తరువాత యశోదమ్మ ఇంట్లో పాకుతూ, అల్లరి చేస్తూ.... అయినా అమ్మకి చెప్పడం చాతకాపోతే.. మీ నాన్నగారంటుంది.
   సరే.. పూజంతా అయ్యాక, నాకు మా ఆఖరన్నకీ (మిగిలిన అన్నలు వేరే ఊళ్లలొ చదువుతున్నారు)..  చలిమిడి, వడపప్పు వగైరాల ప్రసాదం.. బంగాళ దుంపల వేపుడు,  చారన్నం, పెరుగన్నం పెట్టేసి, తను ప్రసాదం మాత్రం తింటోంది. మా నాన్నగారు కాంపుకెళ్ళారు.
   “ఇదేం పండగ.. చలిమిడి..” మా అన్న చిందులు తొక్కాడు. నేను కొబ్బరి ఉండలు తింటుండగా..
   “అది అంతే.. నేనైతే ఉపోషం.. ఉడికించినవేం తినకూడదు. కడుపు చలవ. నూనెలో వేయించినవి అస్సలు నైవేద్యం పెట్టకూడదు.”
   “కడుపు మాడ్చుకుని చలవంటావేంటమ్మా! చాదస్తం..” యస్సస్సెల్సీ చదువుతున్న అన్నయ్య అడిగాడు. నిజమే.. అన్నయ్యంటుంటే నాకూ అనుమానం వచ్చింది.
   “అంటే.. ఆకలేసే కడుపు కాదు.. కడుపున పుట్టిన పిల్లలంతా సుఖంగా ఉండేలా చూడమని కృష్ణుణ్ణి వేడుకుంటాం.. పొద్దుట్నుంచీ కన్నయ్యనే తలుచుకుంటూ, పాటలు, పద్యాలు పాడుకుంటూ ఆయన ధ్యానం లోనే గడుపుతామన్నమాట.” అమ్మ మాటలకి అన్నయ్య అయోమయంగా చూస్తూ వెళ్ళిపోయాడు.
   “నేనైతే.. కడుపు నిండాతిని, బోలెడు పిండివంటలు చేసి.. కనయ్యకి నైవేద్యం పెట్టి, కడుపు చలవ చూడమంటా..” ప్రకటించేశాను.
   అమ్మ పకపకా నవ్వి, నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
                                            *------------------------*
ఇవేళ కృష్ణాష్టమి కదా! చిన్న జ్ఞాపకం.
  

   

Wednesday, August 13, 2014

Posted by Mantha Bhanumathi on Wednesday, August 13, 2014 with No comments
August-13- 2014

పొద్దున్నే మా మేనకోడలు సుభద్ర అనుపిండి ఫోన్..
ఫేస్ బుక్ లో అంతలా రాస్తున్నావు కదా, బ్లాగ్ తెరవ కూడదా అంటూ..
ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి!
ఎప్పుడో తెరిచా.. కానీ అప్పుడప్పుడే దుమ్ముదులుపుతా అని ఎలాగో చెప్పేశా.
అందులో మా జ్యోతమ్మ కోంపడుతూనే ఉంట్ందు..
సరే.. యఫ్.బిలో పెట్టినవే కాస్త అటూ ఇటూ మార్చి..(కాపీ రైటు నాదే కదా..) ఇక్కడ కూడా పెట్టేద్దామని డిసైడయిపోయా.
అంచాత ఇక నుండీ నా మాటలు విన్న వాళ్లకి వింటున్న వాళ్లకీ.. ఆసక్తి కలిగే అంశమే కదా..
వేచి చూడండి.

Posted by Mantha Bhanumathi on Wednesday, August 13, 2014 with No comments
ఆగస్ట్ పదకొండు, ౨౦౧౪- 
నిలువు ఊచల కటకటాల వరండా లో చాప మీద కూర్చుని, వ్యాసపీఠం మీద కాగితాల బొత్తి పెట్టుకుని.. (అది కూడా అక్కర్లేదని పడేసిన, ఒక వైపు మా ప్లీడరు బాబాయి టైపు కాగితాలు) పరపరా రాసేస్తున్నాను. ఇంతకీ ఈ వరండా ఉన్న ఇంట్లో మేమెప్పుడూ లేము. అది పేరూరులో మా బావగారి ఇంట్లో ఉన్న ఆకుపచ్చని పైంట్ వేసిన కటకటాల వరండా.
వీధిలోంచి మా ప్రొఫెసర్ గారు వాకింగ్ కి వెళ్తున్నారు. గుమ్మంలో ఆగి, "ఏం రాస్తున్నారు?" అని అడిగారు.
“రెండు రాస్తున్నా సార్! ఒకటి సైన్స్ మాగజీన్ కి ‘డియన్ యే’ మీద అర్టికిల్, ఇంకొకటి పత్రికల వాళ్లు కథల మీద రాయమన్న సమీక్ష..” తడబడుతూ లేచి అన్నాను.
“మొదటిది ఓ.కే. రెండోది ఎందుకు చెప్పండి.. సైన్స్ మీద.. కెమిస్ట్రీ మీద ఆర్టికిల్స్ రాయండి.” బైటే నిలబడి ఆర్డరేశారు.
అప్పుడు నా మట్టి బుర్రకి తట్టింది, బైటే నిలబెట్టేశానని.
“లోపలికి రండి సార్. టీ తాగి వెళ్దురు..”
“టీ వద్దు. ఏవీ కాగితాలు? ఇదేంటి ఇక్కడ ఫార్ములా తప్పేశారు. ఇక్కడేమో.. యస్. యన్. జి (సెంటెన్స్ నాట్ గుడ్..)..” అలా అలవోకగా పదో పన్నెండో కరెక్షన్స్ చేసి, “మీరే ఇంటికి రండి కాఫీ తాగి ఈ ఆర్టికిల్ డిస్కుజ్ చేద్దాం..” అంటూ గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
మళ్ళీ నా యమ్.బి కి తట్టలే ప్రొఫెసర్ గారికి కాఫీ ఇష్టమని. వెళ్ళిపోయాక ఎంత చింతిస్తే ఏం లాభం?
ఇంతకీ కథలు.. విమర్శ సరే.. ఇప్పుడు ఆ డియన్ యే ఎందుకుట? నుదుటి మీద కొట్టుకుని ఆలోచించా.. 'మెలుకువ వచ్చాక..'
మా క్లాస్ మేట్, దోస్త్.. విజయ్ కి (ప్రొఫెసర్ చల్లా విజయకుమార్, యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్..) మొన్ననే ప్రతిష్ఠాత్మకమైన NSF (National science foundation) avaarD vachchiMdi. (అదివరకు బోలెడు అవార్డ్ లు వచ్చయనుకోండి..) అందులో డియన్ యే చాప (ఫ్లోర్) మీద ప్రోటీన్లని అతికించి, వాటిని సౌరశక్తి పీల్చి దాచిపెట్టే పరికరంగా తయారు చెయ్యడానికి ప్రయోగాలు చేస్తున్నాడని. అవి తయారైతే.. ప్రకృతిలో కలిసిపోయే బేటరీలు రెడీ.
చూశావా విజయ్.. నీ అవార్డ్ న్యూస్ చదివాక ఎలా కలలు కంటున్నానో! నీ ప్రయోగాలు తప్పక మంచి ఫలితాల్నిస్తాయి.. ఎందుకంటే నాకీ కల తెల్లవాఝామున వచ్చింది. నువ్వు అదేదో త్వరగా చేసేస్తే.. నేను దాని మీద తెలుగులో ఆర్టికిల్ రాసేసి, ప్రొఫెసర్ చేత దిద్దించేస్తా.

Tuesday, May 20, 2014

నా కల, నా ఆశ..

Posted by Mantha Bhanumathi on Tuesday, May 20, 2014 with 1 comment
నా కల.. నా ఆశ.

వాస్తవం..
బకింగ్ హామ్ కాలువ నా చిన్నతనంలో ఎంతో అందంగా, హుందాగా సాగుతూ.. ఎన్నో పంట పొలాలకి నీరు అందిచేది.
మా అమ్మా వాళ్ల చిన్నతనంలో, రాజమండ్రీ నుంచి చెన్నపట్నం వరకూ
ఆ కాలువలో గూటిపడవలో(అవును.. ముత్యాలముగ్గులో మీరు చూసిందే..) ప్రయాణం చేసేవారు. వారం రోజులు పట్టేదిట. అయితేనేం.. ఎంతో సరదాగా ఆనందంగా.. మధ్యలో వచ్చే ఊళ్లల్లో భోజనాలు చేస్తూ.. పాచలు పద్యాలు పాడుగుంటూ వెళ్లే వాళ్లం అని చెప్పేది అమ్మ.
ఏలూరులో, బెజవాడలో.. ఇంకా అన్ని ఊళ్లలో..కాలువ చుట్టూ ఇళ్లు, రోడ్లు.. నయనానందకరమే..
కాలక్రమేణా ఆ కాలువ కనుమరుగైపోయి.. శిధిలాలుగా మిగిలింది. అన్ని ఊర్లలో.. పెంటలు వేసుకోడానికి, డెక్కలు పెరగడానికి, వ్యర్ధరసాయనాలు, విద్యుత్ కర్మాగారంలోంచి వచ్చే బూడిద, ఇంకా వివిధ చముర్లు కలపడానికి ఉపయోగపడుతోంది.
మొన్నామధ్య ఏలూర్లో చూశా.. పాలిథీన్ కవర్లు, రకరకాల పెంటలు.. అడక్కండి. ఏడుపొచ్చింది.
కల..
ఆ కాలువ పునరుద్ధరింపబడింది. గలగలా పారే నీరు.. పంటపొలాలని తడుపుతోంది.
ఆ నీటిమీద సూరీడు గర్వంగా చూస్తున్నాడు.
రోడ్లమీద లారీల వత్తిడి తగ్గడానికి, కాలువ ద్వారా సరుకుల రవాణా జరుగురోంది. రేవుల దగ్గర ఆగినప్పుడు సరంగులు మారుతూ పరాచికాలు ఆడుతున్నారు.
అంతేనా..
ఆశ..
ఆ కాలువ మీద సౌరశక్తి  గ్రహించే ఫలకాలు.. మెరుపులు చిందిస్తూ..
ఆ ఫలకాలు కాలువలో నీటిని ఆవిరి ద్వారా ఇగిరిపోకుండా కాపాడుతాయి..
సౌరశక్తిని విద్యుత్ శక్తి కింద మారుస్తాయి.. ( మన దేశంలోనే  ఒక రాష్‌ట్రంలో విజయంతంగా మారుస్తున్నాయి..).. వాతావరణ కాలుష్యం తగ్గింది.. కాలువ ఒడ్డున పర్యాటక కేంద్రాలు వెలిశాయి.
ప్రజలలో శుభ్రత పై అవగాహన వచ్చింది.
నా కల నిజమయ్యేనా..
నా ఆశ తీరేనా..
బకింగ్ హామ్ కాలువ..
నాడు, నేడు..


Sunday, April 6, 2014

Posted by Mantha Bhanumathi on Sunday, April 06, 2014 with No comments
నూతన సంవత్సరంలో ఇప్పుడే పలుకరిస్తున్నా.. బ్లాగ్ మిత్రులని.
ఈ మధ్యన ఫేస్ బుక్ లో పలకరింపులు ఎక్కువయ్యాయి. వాటితోనే సరిపోతోంది.
ఉగాది సందర్భంగా  మిత్ర్లని వారి చిన్ననాటి మొదటి జ్ఞాపకాన్ని రాయమని అడిగాను. పది హేను మంది స్పందించారు. అందులో పోటీ అని కూడా చెప్పాను. చాలా ఉత్సాహంగా రాశారు.
ఆ స్పందనలన్నీ ఇక్కడ అందరికీ చూపిస్తాను.. కొద్ది రోజులయ్యాక..
ఎందుకంటే..
న్యాయమూర్తికి ఇప్పుడే పంపాను. మరి ఫలితాలు రావాలి కదా!
నా మొదటి జ్ఞాపకం మాత్రం పెడుతున్నా.. అది పోటీలో ఉండదు.
.                                                           “ నా మొదటి జ్ఞాపకం”
   లేస్తూనే కళ్లు మూసుకునే చేత్తో తడుముకున్నా. చేతికి ఏమీ తగల్లే.. అమ్మేదీ? నన్నొదిలెళ్లిపోయిందా? కళ్లు తెరిచి చుట్టూ చూశాను. గదంతా ఖాళీ. ఏరీ అంతా.. భయం వేసింది. నెమ్మదిగా మంచం చివరికి వెళ్లి దుప్పటి అంచు పట్టుకుని కిందికి జారా. అమ్మయ్య.. నేల తగిలింది.
   గబగబా వెళ్లి గదిలోంచి బైటికెళ్ల బోయా.. గడప అడ్డొచ్చి, పరికిణీ కాళ్లల్లో పడింది. హాయ్.. మొదటి పట్టు పరికిణీ. రాత్రి అమ్మ విప్పబోతుంటే అరిచి, గోల చేసి దాంతోటే పడుక్కున్నా కదా! నా పంతవే నెగ్గించుకున్నా.
   అమ్మ “పెంకి పిల్లా!” అని తిడితే మాత్రవేం.. కింద కూర్చుని పరికిణీ వెనక్కి తోసుకుంటూ గడప దాటి, లేచి మేడ మెట్లు దిగబోయాను. ఊహూ.. నన్నొదిలి అమ్మెందుకెళ్లాలి.. మూడు మెట్లు దిగి కింద కూలబడ్డా.. కిటికీలోంచి అమ్మ వంటింట్లో అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తోంది. (మాఊళ్లో ఉన్న మేడ, పక్క గంతలతో కలిపి పద్ధెనిమిదడుగులు వెడల్పు, ఒక ఫర్లాంగు పొడుగు ఉండేది. మెట్ల మధ్య లోంచి కటకటాల కిటికీ.. అందులోంచి నట్టిల్లు, వంటిల్లు కనిపిస్తాయి.)
   గట్టిగా రాగం ఎత్తుకున్నా.. పక్క గదిలోంచి తాతగారు బైటికొచ్చి గంతలోకెళ్తూ కళ్ల జోళ్లోంచి నన్ను చూసి నవ్వారు. చేతిలో పిప్పరమెంటు.. చూపిస్తూ కిందికి రమ్మని పిలిచారు. ఏడుపాపి ఒక్క నిముషం వెళ్దామా అని ఆలోచించా. ఊహూ.. వెళ్లకూడదు.. “అమ్మా..” గొంతు పెంచా. జుట్టంతా రేగిపోయి, కళ్లల్లోకి పడుతోంది. జుట్టు మధ్యకి తీసి, తల మీద గుండ్రటి పాపిడి తీసి, కృష్ణుడిలాగ పైకి కట్టిందమ్మ నిన్న సాయంత్రం. లేస్తూనే నే చేసిన మొదటి పని రిబ్బను లాగేసి గిరాటెట్టడం.
   అమ్మ పరుగెట్టుకుని వచ్చింది. “భాంతల్లీ.. దా! ఆకలేస్తోందా?” అవును కదూ.. కడుపులో ఏదోగా ఉంది. ఆకలే. అమ్మని చూసి ఇంకొంచెం స్థాయి పెంచా.  “ఎందుకా పిల్లనలా ఏడిపిస్తారూ?” తాతగారు గంతలోంచి అరిచారు.
   “కిందికి దిగి రావే.. మా అమ్మవి కదూ.. మడి కట్టుకున్నా..” అమ్మ బతిమాల్తోంది. తల అడ్డంగా తిప్పుతూ.. కాళ్లు నేల కేసి బాత్తూ.. ఇంకొంచెం కంఠం..

   అమ్మ అలాగే మెట్లన్నీ ఎక్కి పైకొచ్చి నన్నెత్తుకుని కిందికి తీసుకెళ్లి.. ఆ తరువాత ఇంక గుర్తు లేదు…(నేను కటకటాల కిటికీ లోంచి అమ్మని చూడ్డం బాగా గుర్తుంది.. అప్పుడు నాకు మూడో ఏడనుకుంటా.)