Pages

Saturday, November 27, 2010

అమ్మో! చలి..అమ్మో! చలి..

తప్పించు కోవాలంటే ఒకటే మార్గం. హైదరాబాద్ వెళ్ళడమే!

అందుకనే ప్రయాణం పది రోజులు ముందుకి జరిపేసి ఎల్లుండి విమానం ఎక్కేస్తున్నాం.

వసంత కాలం, వేసంకాలం లండన్ ఎంతో చక్కగా ఉంటుంది. కన్నుల విందు చేసే చెట్లు.. రంగు రంగుల పూలూ అడుగడుగునా కనిపించే పార్కుల్లో స్వాగతం పలుకుతుంటాయి. అమెరికాలో కూడా అంతే.. కానీ ఇక్కడయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికయినా హాయిగా మనం ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవచ్చు.

రెండు నెలలు ఆహ్లాదంగా గడిచి పోయాయి.

మళ్లీ వచ్చే ఏడు వస్తామని వీడ్కోలు తీసుకుంటున్నాము అందరి దగ్గరా..

Thursday, November 18, 2010

అనుబంధం అంటే ఇదేనా..

అనుబంధం అంటే ఇదేనా..
ఈ కాలంలో లండన్లో ఎముకలు కోరికే చలి.. బయటికి వెళ్ళాలంటే.. తలుచుకుంటేనే వణుకు. అయినా ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం?
ఎలాగో మూడో నాలుగో తొడుగులు తగిలించి మొన్న పొద్దున్నే బయట పడ్డాం నేను, మావారు.
అలా సౌత్ హాలు కేసి వెళ్తే మన బీరకాయలు, వంకాయలు లాంటివి తెచ్చు కోవచ్చని, అక్కడే వేడి వేడిగా సోమోసాలు, పానిపురి లాంటివి తినేస్తే మధ్యాన్నం ఇంటికొచ్చి పడుక్కోవచ్చని ప్లాన్.
బస్ ఎక్కి మంచి సీటు దొరికితే.. కిటికీ లోంచి షాపులన్నీ చూసుకుంటూ తీరుబడిగా వెనక్కి వాలి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. గంట పైన ప్రయాణం. కంగారేం లేదు.
తరువాతి స్టాప్ లో బస్ కదల బోతుండగా చెయ్యి చెయ్యి పట్టుకుని ఇద్దరు దంపతులు మెల్లిగా ఎక్కారు. 85 సంవత్సరాలు పైనే ఉంటుంది వయసు. ఒకరి కొకరు ఆసరా ఇచ్చుకుంటూ లోపలి వచ్చారు, కార్డ్లు రెండు మెషిన్ కి చూపించి వస్తుంటే ముందు సిట్లో కూర్చున్న కుర్రాడు లేచి పెద్దావిడ్ని కూర్చో పెట్టాడు. పక్కన అంతే వయసున్న ఇంకో ఆవిడుంది మరి.. తాతగారికి వెనుక సీటు చూపించి సహాయం చెయ్యబోయాడు లేచిన కుర్రాడు.
అబ్బే! అదేం కుదరదు.. తాతగారు తన స్వీట్ హార్ట్ పక్కనే కడ్డీ పుచ్చుకుని నిలబడ్డారు. ఆవిడ చెయ్యి ఇంకో చేతిలో ఉంచుకుని. అటుపక్క సీటులో ఉన్న మేము లేచి వాళ్ళిద్దర్నీ మా సీట్లలో కూర్చోపెట్టి మేము వేరే సర్దుకున్నాం. ఇద్దరి బుగ్గలు ఎర్రగా ఆపిల్ పళ్ళలా ఉన్నాయి. మొహాల్లో పసిపిల్లల అమాయకత్వం. కిటికిలోంచి చూసే ప్రతీది వివరించుకుంటూ వాళ్ళు చేసే ప్రయాణం ఎంతో ముచ్చటగా అనిపించింది మాకు.
జీవితాంతం తోడుగా నిడగా ఉండడం అంటే ఇదేనా అనిపించింది. ఇదో మరపురాని అనుభూతి.