Pages

Sunday, October 24, 2010

నిజమే.. మీరు చెప్పినట్లు..

పాతిక ముఫ్ఫై ఏళ్ళ క్రితం.. ఆకాశవాణి మేలుకొలుపుతో రోజు మొదలయ్యేటప్పుడు..
మధ్యలో ఒక టింగ్..టింగ్.. తరువాత ఒక ప్రకటన. అందులో వచ్చేది..
"నిజమే.. మీరు చెప్పినట్లు యాస్‍బెస్టాస్ రేకులనే వాడతాము.. మా తాతగారు వేయించిన రేకులు.. ఇప్పటికీ.."
ఆ ప్రకటనలన్నీ అందరి నోళ్ళలోనూ నానుతూ ఉండేవి.
ఆ తరువాత కొన్నేళ్ళకి యాస్బెస్టాస్ రేకులు వాడితే కాన్సర్ వస్తుందని కనుక్కుని.. వాటిని నిషేధించారు..(నిజంగానా! ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి మరి, భారతదేశంలో..)
ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ గ్రనైట్ రాళ్ళు.. రంగురంగుల డిజైన్లతో, కళ్ళు మిరిమిట్లు గొలిపే రంగులతో.. ఆధునిక భవంతులన్నిటిలోనూ కన్నులు విందులు చేస్తున్నాయి. నున్నగా.. ఆదమరిచి అడుగేస్తే జారి నడుము విరిగేట్లు.. ఎయిర్‍పోర్టుల్లోనూ.. పెద్ద పెద్ద మాల్స్ లోనూ, హోటల్స్‍లోనూ.. "ఇందుగలడందులేడనే" స్థంభాల్లోనూ.. అన్ని చోట్లా!
మరి ఈ రాళ్ళ తవ్వకాల్లో జరిగే అవకతవకలు అనేకానేక స్కాముల్లో కొన్ని.
ఇంతకీ మనం పట్టించుకోవలసిందేవిటీ అంటే..
ఈ అందాల రాళ్ళు అత్యధిక రేడియో ధార్మిక శక్తి కలిగి ఉన్నాయని. హైద్రాబాదులోని అధిక సంపన్నులుండే జుబిలీహిల్స్‍లో అత్యధికంగా రేడియో ధార్మిక శక్తి విడుదల అవుతోందిట.
మధ్యతరగతి ప్రజలు కూడా కనీసం వంటింట్లోనైనా.. వేయించుకుంటే అని కలలు కంటుంటారు.
ఇంతకీ మా వంటింట్లో వేయించిన రాళ్ళమీద పోర్టబుల్ గీగెర్-ముల్లర్ కౌంటర్ (రేడియో ధార్మిక కణాలని.. బీటా, గామా మొదలగు వాటిని కొలిచేది) పెడితే అది కుయ్.. కుయ్ అని ఆపకుండా మొత్తుకుంది.
వీటి వాడకం ఎంతవరకూ.. మానవజాతి, జంతుజాలాలు భరించగలిగే పరిధిలోనే ఉందా!
జియాలజిస్టులు దీనిమీద దృష్టి పెట్టి నిజానిజాలు వెల్లడిస్తే బాగుండును.
ఈ రేడియోధార్మిక కణాలు కాన్సర్ రావడానికి కారణాలు అని ఎప్పుడో నిరూపించారు.

తొలి పలుకు

అందరికీ వందనములు.
బ్లాగర్ల ప్రపంచంలోకి తొలి అడుగు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రోత్సహించిన డెట్రాయిట్ నారాయణస్వామి గారికి ధన్యవాదాలు.
ఇండియానాపోలిస్ లో జరిగిన వంగూరి-గీతా వారి సాహిత్య సభల్లో నారాయణస్వామి ఇచ్చిన ప్రసంగం స్ఫూర్తితో మొదలు పెట్టాను. ఇంక నా మనసులో మాటలు బ్లాగర్లు అందరితో పంచుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఇందులో వివిధ రంగాలలోని ప్రతిభాశాలురతో పరిచయం ఏర్పడుతుందనీ, విజ్ఞానం పెరుగుతుందనీ ఆశిస్తున్నాను.